తాళిబొట్టు

Talibottu- Telugu Family Story | Anisa Tabassum Sk
తాళిబొట్టు - తెలుగు కుటుంబ కథ | అనిసా తబస్సుమ్ SK
Published in manatelugukathalu.com on 03/11/2026
తాళిబొట్టు ఒక హృదయాన్ని హత్తుకునే తెలుగు కుటుంబ కథ. భార్య ప్రేమ, భర్త బాధ్యత, కుటుంబ విలువలు, పశ్చాత్తాపం ద్వారా జీవితంలో మార్పు ఎంత ముఖ్యమో ఈ కథ తెలియజేస్తుంది.
తెల్లారుఝామున... ఆకాశం నెమ్మదిగా లేత ఎరుపు రంగులోకి మారుతుంది. తూర్పు దిక్కున ఉదయిస్తున్న సూర్యుడు తన బంగారు కిరణాలను పచ్చని పొలాల మీద చల్లుతున్నాడు.
సరిగ్గా అప్పుడే ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టింది మల్లేశ్వరి.
చంద్రబింబం లాంటి ముఖంలో కాంతి తగ్గింది. లేత గులాబీ రంగు నూలు చీర కట్టింది మల్లి.
ఆమె ముఖంలో కళ తగ్గినా, నుదుటి మీద కుంకుడుకాయంత కుంకుమబొట్టు ముచ్చట గొలుపుతుంది.
ఒక చేతిలో సద్ది బుట్ట, ఇంకో చేతిలో పసిబిడ్డను ఎత్తుకొని ఉంది.
మల్లేశ్వరి తలెత్తి ఆకాశంకేసి చూసింది. సూర్యుడు తాటి చెట్లతో పోటీపడుతూ ఇంకా పైకి వెళుతున్నాడు.
ఒక క్షణం మల్లేశ్వరి చూపు నిటారుగా గర్వంతో అంతెత్తు ఉన్న ఆ తాటి చెట్లపై పడింది. ఆపై వెంటనే ఏదో విరక్తి భావం కనిపించింది మల్లేశ్వరి ముఖంలో.
నెమ్మదిగా నిట్టూరుస్తూ అక్కడ్నుంచి అడుగులు సాగించింది మల్లేశ్వరి.
వీధి చివరిదాకా వెళ్లి రోజువారీ కూలీపనులకి వెళ్లే ఆటోలో ఎక్కి కూర్చుంది.
చంటోడు మల్లి ఒడిలో పడుకున్నాడు.
ఆటో ముందుకు వెళ్తుంటే, చుట్టుపక్కల చెట్లన్నీ వెనక్కి వెళ్తున్నాయి. వాటితోపాటు మల్లి కూడా తన గతంలోకి వెళ్ళింది.
మల్లికి పద్దెనిమిదేళ్లు ఉన్నప్పట్నుంచి తన బావ మురళి అంటే ఇష్టపడటం మొదలుపెట్టింది.
మురళి పెద్దగా ఏమీ చదువుకోలేదు. కుల వృత్తి కావడంతో తాటి చెట్లను ఎంతో సులువుగా ఎక్కగలిగేవాడు.
మురళి తన స్నేహితులతో పోటీ వేసుకొని మరీ తాటి చెట్లను ఎక్కేవాడు.
మురళినే గెలిచేవాడు కూడా.
తాటి చెట్లు ఎక్కడమంటే భలే సరదాగా ఉండేది మురళికి. నడుముకు తాడు కట్టుకొని తాటి చెట్టుని పట్టుకొని ఎక్కుతుంటే, ఉంగరాల జుట్టు ఉన్న మురళి, మల్లి కళ్లకు ఇంకా అందంగా కనిపించేవాడు. అంతే ఆసక్తిగా చూస్తూ ఉండిపోయేది మల్లి.
మురళికి కూడా తన మరదలు మల్లేశ్వరి అంటే ఇష్టమే... కాకపోతే బయటకి చూపించేవాడు కాదు. అలా... తాటిచెట్టు పైకి ఎక్కగానే కాస్త గర్వంతోనూ, ప్రేమతోనూ అందరికన్నా మొదట అతని చూపు మల్లి మీదే పడేది.
అలా చూస్తాడన్న విషయం మల్లికి కూడా తెలుసు. మురళి ఎంత ఎత్తున్న చెట్టునైనా అతి సులువుగా ఎక్కేసేవాడు. చెట్లు ఎక్కడం, అతని స్నేహితులతో కలిసి ఊరంతా తిరగడం... ఇదే అతని పని.
మురళి ఎంత చురుగ్గా ఉంటూ చెట్లు ఎక్కుతున్నప్పటికీ అతనికి తన కుల వృత్తి చేయడమంటే అసలు ఇష్టం లేదు.
"పట్నంలో ఏ కూలీ పని చేసుకొనైనా బ్రతుకుతా గానీ... ఇలాంటి పనులు చేసుకుంటా నేను బ్రతకలేను నాయనా" అంటూ నిక్కచ్చిగా వాళ్ల నాన్నతో అనేవాడు.
"ఇట్టంటి పనులా?? ఇన్ని సంవత్సరాలు మీకు కడుపునిండా అన్నం పెట్టిందని ఇట్టంటి పనులు అంటావా!! కుల వృత్తి మనకి తల్లితో సమానం రా.
అది కేవలం ఒక తాటి చెట్టు మాత్రమే కాదు రా... ఈ మనిషి జాతికి ఎంతో మేలు చేసే తల్లి.
దాని విలువ నీకేం తెలుసు రా! తాటాకులు ఇండ్ల కప్పులుగా, మన సంప్రదాయంలో ఆడబిడ్డ పుష్పవతి అయినప్పుడు చాపలుగా, పందిరి, హస్తకళలకు, బుట్టలకు, విసనకర్రలుగా, గొడుగులు వంటి వాటికి ఉపయోగపడేదే కాకుండా ఈ కాగితాలు కనిపెట్టకముందు తాటాకులపై రాసి తాళపత్ర గ్రంథాలుగా భద్రపరిచారు.
ఇంకా ఎండాకాలం వస్తే తాటి ముంజల రూపంలో ఎండతాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి.
ఇక తాటి పండ్లు... తాటి పండ్ల గుజ్జుతో తాటి తండ్రులు (రేగులు), దిబ్బరొట్టె, తాటి గారెలు లాంటి రుచికరమైన వంటలు చేసుకుంటారు. వాటిలో ఎన్నో గుణాలు ఉంటాయి రా మురళి.
ఇక తాటికల్లు... పగలంతా అలుపెరగకుండా శ్రమించి ఈ శరీరానికి తాటికల్లు చుక్క పడందే నిద్రపడుతుందా! పైగా తాటికల్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
తాటిబెల్లం రక్తహీనతను తగ్గిస్తుంది. తాటిచెట్టు కాండం మన ఇళ్ల దూలాలుగా వాడతారు. తాటి పీచుతో తాళ్ళు తయారు చేస్తారు.
ఇలా తాటిచెట్టు విత్తనం నుంచి చెట్టు ఆకుల దాకా మనుషులకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది రా.
దీని విలువలు తెలియక ఈ రోజుల్లో కనుమరుగైపోతున్నాయి తాటిచెట్లు. ఇవి ఉన్నంత కాలమైనా వీటి ఋణం తీర్చుకోవాలి రా!!" అంటూ మురళి తండ్రి సూరయ్య, మురళికి అర్థమయ్యేలా చెప్పినా వినిపించుకునేవాడు కాదు మురళి.
అతని ప్రవర్తనతో విసుగొచ్చిన సూరయ్య... అతన్ని పట్టించుకోవడం మానేశాడు.
మురళి ఇంటి బాధ్యతలు పట్టించుకునే వాడు కాదు. కష్టం చేసి బ్రతికే ఆలోచనే లేదు అతనికి. మల్లికి కూడా మురళిలో నచ్చని గుణం ఇదే.
మురళి స్నేహితులతో కలిసి రోజు రోజుకూ చెడిపోతున్నాడు. ఈమధ్య మందు తాగడం కూడా అలవాటు చేసుకున్నాడు.
చెట్టంత కొడుకు ఇలా చేయిజారిపోవడం చూడలేకపోతున్న మురళి తల్లి అంజమ్మ, భర్త సూరయ్య దగ్గర రోజు పోరుపెట్టడంతో... పెద్దలు మాట్లాడుకుని, మామ కూతురైన మల్లితో ఇద్దరి ఇష్టాలను తెలుసుకుని ఇద్దరికీ పెళ్లి చేశారు.
పెళ్లి చేస్తే మారే బాధ్యతగా ఉంటాడు అనుకున్న కొడుకు, లేని పెద్దరికం తెచ్చుకుని ఇంకా బలాదూర్ లా మారాడు. స్నేహితులతో తిరగడం, తాగడం, పేకాట ఆడటం, సినిమాలకు వెళ్లడం... అప్పుడప్పుడు ఇంటికి ఏ అర్ధరాత్రో వచ్చేవాడు.
ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడుగా, ఆ ఇష్టంతోనైనా భార్య మాట విని మారతాడేమో అని మల్లి ఎన్నోసార్లు చెప్పి చూసింది.
తెల్లారి మత్తు దిగాక మల్లితో ఎంతో ప్రేమగా ఉండేవాడు, అది ఆ కొంచెంసేపే... ఇల్లు దాటి అడుగు బయటపెడితే మనిషి కంటికి కనిపించేవాడు కాదు.
మళ్లీ ఏ అర్ధరాత్రో మద్యం మత్తులో ఇంటికి వచ్చేవాడు. అదే మత్తులో తాను ఎంతో ప్రేమించే తన భార్య మల్లి పై కూడా చేయి చేసుకునేవాడు.
మురళి ప్రవర్తన అసలేం నచ్చట్లేదు మల్లికి.
తాను ప్రేమించి, పెళ్లాడింది ఇలాంటి ఒక పనికిరాని, అసమర్థుడిని అన్న విషయం ఆమె జ్ఞాపకానికి వచ్చిన ప్రతిసారీ ఆమె మీద ఆమెకే విరక్తి వచ్చేది.
ఆ ఇంట్లో మురళితో కలిసి కాపురం చేయాలంటేనే తనకు ఒళ్లంతా ముళ్లు గుచ్చుకున్నట్లు అయ్యేది. మల్లికి మగపిల్లాడు పుట్టాడు. కొడుకును ఆడించడం, లాలించడం ఇలాంటివి కూడా చేసేవాడు కాదు మురళి.
ఇదిలా ఉండగా, ఇంట్లో సంపాదించే మగదిక్కు లేక ఆర్థికంగా ఇంట్లో ఇబ్బందులు మొదలయ్యాయి.
"నవాబు సంపాదన బూబమ్మ కుట్టుకే సరిపోయింది" అన్నట్లు మురళి సంపాదించే అరకొర సంపాదనంతా అతగాడి పేకాటలకు, తాగడానికే సరిపోయేది.
ఇంట్లో అత్త, మామ ముసలివాళ్లు అయ్యారు. ఇక ఇంట్లో సంపాదించేది ఎవరు? ఒక్క మల్లి తప్ప. ఎప్పుడూ కష్టం చేసి ఎరుగదు మల్లి.
మల్లి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే అయినా, వారికి ఉన్నంతలోనే మల్లిని ఒక మల్లెపువ్వులా అపురూపంగా పెంచారు ఆమె తల్లిదండ్రులు.
అలాంటి మల్లి ఇప్పుడు ఒక భార్యగా తాను పడుతున్న కష్టాలకు వాడిపోయిన మల్లె అయింది. ఇంట్లో ఏర్పడిన ఆర్థిక పరిస్థితికి ఒక్కో పూట కూరకు కూడా ఇబ్బంది అయ్యేది. ఆ చంటిపిల్లాడు కూడా ఇబ్బంది పడేవాడు.
ఇదంతా చూస్తూ తట్టుకోలేకపోయిన మల్లికి, ఇక తాను పనికి వెళ్లకపోతే వచ్చే కష్టాలు అర్థమై, పనికి వెళ్లడానికి నిర్ణయించుకుంది.
పసిపిల్లాడ్ని తీసుకుని కూలీ పనికి వెళ్లడం మొదలు పెట్టింది మల్లి.
అంజమ్మ... కోడలు ఒక్కతే ఆ పసిపిల్లాడితో కష్టపడడం చూడలేకపోయింది. మల్లిని ఇంట్లో ఉంటూ ఇంటిని చూసుకోమని చెప్పి అంజమ్మ పనులకు వెళ్లేది.
కానీ కుటుంబం కోసం అంజమ్మ సహాయం కొన్ని రోజులతోనే ఆగిపోయింది. వయస్సు పెరగడంతో పనులు చేయలేక నీరసించి ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది.
సూరయ్య చేతనైనంత పని చేసి కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. మల్లి పొలం పనులకు వెళ్లడం మొదలు పెట్టింది.
ఇలా కాలం సాగుతుండగా... మల్లి పొలంలో పని చేస్తుంటే, సూరయ్య కంగారు కంగారుగా "మల్లి... ఓ మల్లి... పెద్ద ఘోరం జరిగిపోయిందే" అంటూ బెంబేలెత్తిపోతూ వచ్చాడు.
కంగారు, బాధతో కూడిన ఆ అరుపులు విని, ఎలాంటి కబురు వినాల్సి వచ్చిందోనని గాబరాపడిపోయింది. "ఏంటి మావయ్య, ఏమైంది?" అంటూ అడిగింది.
"పెద్ద ఘోరం జరిగిపోయింది! మన మురళిగాడు తాగిన మైకంలో... పోటీ పెట్టుకుని చెట్టు ఎక్కాడంట.
ఆ మత్తులో నడుము తాడు పట్టును చూసుకోలేదంట. పట్టు వదిలి అంత ఎత్తునుంచి కింద పడ్డాడంట. చెట్టు కింద బండరాయి ఉండడంతో పడడం పడడం నడుముకి బాగా గట్టిగా తగిలిందంట. నా తల్లి, నీ రాత బాగుండి వాడి తలకేమీ కాలేదు" అంటూ కళ్లనీరు కారుస్తూ చెప్పాడు సూరయ్య.
వెంటనే సూరయ్య, మల్లి కలిసి హాస్పిటల్ కి పరుగు లంకించుకున్నారు.
నడుముకి బాగా గట్టిగా తగలడంతో కనీసం రెండు నెలలపాటు బెడ్‌రెస్ట్ తీసుకోవాలని అన్నారు డాక్టర్.
ఇంకేముంది... మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు, అసలే ఇంట్లో చాలీ చాలని ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు మురళి ఖర్చులు తోడయ్యాయి.
ఇదివరకులా మల్లి మురళితో ప్రేమతో ఉండలేకపోతుంది. మల్లెపువ్వులాంటి మల్లి ముఖంలో నవ్వు కనుమరుగైంది.
కోడి కూయకముందే లేచి, ఇంట్లో పని చేసి, వండిపెట్టి తనకు సద్ది కట్టుకుని సరిగ్గా ఆరింటికి ఆ పసిపిల్లాడితో కూలీ ఆటో ఎక్కుతుంది.
సాయంత్రం దాకా పొలం పనులు చేసుకుని, నీరసంగా ఇంటికి చేరుతుంది. వచ్చాక... మామ సూరయ్యకు ఆ పూట వండుకోవడానికి కూరలకు డబ్బులిచ్చి పంపి, కాస్త నీళ్లు వేడి చేసి... ఆ వెంటనే పిల్లాడికి స్నానం చేయించి, తాను స్నానం చేశాక, సూరయ్య తెచ్చిన కూరలు తరిగి వంట మొదలు పెడుతుంది.
ఈలోగా అంజమ్మ ఒక గుడ్డను వేడినీళ్లలో ముంచి మురళి ఒళ్లంతా శుభ్రం చేసేది. వంట పూర్తయ్యాక అందరికీ వడ్డించి, తాను తిని పిల్లాడ్ని పడుకోబెట్టేది. ఇది గత కొద్దినెలలుగా జరుగుతున్న రోజువారీ ప్రక్రియ.
ఎటు కదలకుండా మంచానికే పరిమితమైన మురళి, రోజు ఇంట్లో జరిగేది చూస్తూ, తనలో తాను మధన పడటం మొదలుపెట్టాడు.
తాను ఇన్ని రోజులు ఎన్ని తప్పులు చేశాడో ఇప్పుడు అంతా మెల్ల మెల్లగా అర్థమవుతుంది. ఇంటిని, ఇల్లాల్ని, పిల్లాడ్ని, తల్లిదండ్రులని పట్టించుకోకుండా తాను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది అతనికి.
భార్య ప్రేమను కోల్పోయాడు, పిల్లాడి చిలిపి అల్లరిని, చిలకపలుకులను కోల్పోయాడు. ఎంత ఆలోచించినా అతనికి చివరికి మిగిలిందేమిటి??
పిల్లవాడు మల్లి ఒడిలో చేరి మల్లి తాళిబొట్టుతో ఆడుకుంటున్నాడు. మురళి చూపు మెల్లగా బాబు ముఖం నుంచి చేతిలో పట్టి ఆడుతున్న తాళిబొట్టు పై పడింది.
తాళి... మురళి ఎంతో ఇష్టపడి మల్లి మెడలో కట్టిన తాళి. మురళి ఒక్క క్షణం మల్లి ముఖం చూశాడు... మల్లి ముఖంలో కళ లేదు, ఆ మల్లెపువ్వులాంటి నవ్వులేదు, ఆమె కళ్లలో మురళిపై ప్రేమలేదు... ఒక్క క్షణం "అందుకు కారణం ఎవరు??" అని ప్రశ్నించింది మురళి అంతరాత్మ.
తనని ఇష్టపడి నమ్మి వచ్చిన అమ్మాయిని తాను ఇన్ని కష్టాలు పెడుతున్నాడా?? రకరకాల ఆలోచనలతో సతమతమైపోతున్నాడు మురళి.
మనసు పశ్చాత్తాపంతో నిండిపోయి, ఎనలేని దుఃఖంగా మారి కన్నీళ్ల రూపంలో బయటకి వస్తుంది. ఆ రాత్రి నిద్రపట్టలేదు మురళికి.
కొద్దిరోజులకు ఇదివరకులా నడవడం మొదలుపెట్టాడు మురళి.
పిల్లాడితో ఆడుకుంటూ, కుటుంబంతో సమయం గడపడం మొదలు పెట్టాడు. మల్లితో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాడు మురళి.
మల్లికి కూడా మురళిలో వస్తున్న మార్పు కొద్దికొద్దిగా నచ్చుతుంది. ఇద్దరూ మళ్లీ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఇష్టపడటం మొదలు పెట్టారు. బాధ్యతగా ఉండడం నేర్చుకున్నాడు మురళి.
ఇప్పుడు ఇదివరకులా తాగట్లేదు, స్నేహితులతో బలాదూర్ తిరగట్లేదు. మురళి తన ఊర్లోనే ఆటో నడపడం మొదలు పెట్టాడు. ఇంటిని తానే చూసుకుంటున్నాడు, మల్లి పనులకు వెళ్లడం మానేసి ఇంట్లో ఉంటూ పిల్లాడ్ని చూసుకుంటుంది.
-*అనిసా తబస్సుమ్ Sk(Anisa Tabassum SK)
అనిసా తబస్సుమ్ SK గారి కొన్ని ఇతర రచనలు:
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
అనిసా తబస్సుమ్ SK గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
కథ సమాప్తం

అనిసా తబస్సుమ్ SK













Comments