top of page
Original.png

తొలి పండుగ 

Aug 1
5 min read

ఉగాది పండుగ సందర్భంగా కొత్త దంపతులు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకుంటున్న అందమైన తెలుగు గ్రామీణ కుటుంబ దృశ్యం.

Tholi Panduga - Telugu Family Story | Neeraja Hari Prabhala

తొలి పండుగ  - తెలుగు కుటుంబ కథ | నీరజ హరి ప్రభల - ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com On 01/08/2026


వివాహం అనంతరం వచ్చే తొలి పండుగ ప్రతి దంపతుల జీవితంలో ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం. ముఖ్యంగా తెలుగు సంప్రదాయంలో తొలి ఉగాది అనేది కేవలం పండుగ మాత్రమే కాదు—తల్లిదండ్రుల ప్రేమ, అత్తింటి ఆతిథ్యం, కుటుంబ బంధాలు, గ్రామీణ ఆప్యాయతలు కలిసిన ఒక అందమైన అనుభూతి. గ్రామీణ సంస్కృతి, ప్రకృతి అందాలు, కుటుంబ అనుబంధాలు, తల్లిదండ్రుల మమకారం, కొత్త జీవితపు మధుర క్షణాలను హృద్యంగా ఆవిష్కరించిన భావోద్వేగ కథే "తొలి పండుగ."


" ఏమండీ ! సాయంత్రం పొలం నుంచి త్వరగా రండి. ఉగాది పండుగ ఇంక రెండు రోజులే ఉంది. అమ్మాయి, అల్లుడు వస్తున్నారు కదా! పెళ్ళయినాక వాళ్ళకు ఇదే మొదటి పండుగ. క్రొత్త బట్టలు పెట్టాలి. పట్నం వెళ్లి షాపింగ్ చేసొద్దాం." అంది సరోజ భర్త రంగయ్యతో.


" సరే ! అలాగే ! సాయంత్రం బస్సుకు వెళ్ళొద్దాం." అని తలపాగా ధరించి, ముల్లు కర్ర చేతపుచ్చుకుని, 

కిర్రు చెప్పులేసుకుని పొలానికి బయలుదేరాడు రంగయ్య. రంగయ్య రామాపురంలో పేరు మోసిన రైతు. తన ఏకైక కూతురు సుధను పట్నంలో చక్కగా చదివించి సాఫ్ట్ వేరు ఇంజనీర్ అయిన వేణుతో ఇటీవలే ఘనంగా వివాహం జరిపించి అత్తారింటికి పంపాడు. వేణు, సుధలు క్రొత్త కాపురం మొదలు పెట్టి అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు.


సరోజ ఇంటిపని, వంటపని ముగించి భర్తకు మధ్యాహ్న భోజనం పాలేరు చేత పంపించింది. ఇల్లంతా చక్కగా సర్ది కూతురి గదిని అందంగా అలంకరించింది. నిలవ ఉండేట్టుగా చక్కిరాలు, అరిశెలు, చెక్కలు వంటి పిండివంటలను చేసింది. అవంటే సుధకు చాలా ఇష్టం. సాయంత్రం భర్త రాగానే ఇద్దరూ కలిసి బస్సులో పట్నం బయలుదేరి వెళ్ళారు. సుధకు ఇష్టమైన గులాబి రంగు పట్టుచీరె, దానికి మాచింగ్ జాకెట్టు, గాజులు వగైరా, వేణుకు పట్టుధోవతి, ఉత్తరీయం తీసుకుని ఆఖరి బస్సులో ఇంటికి వచ్చేశారు.


ఆ మరురోజు ఉదయాన్నే సరోజ ఇంటిని ఆవు పేడతో అలికి అందమైన రంగవల్లులు తీర్చిదిద్దింది. గుమ్మాలకు చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్ట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టి, పూల మాలలతో అందంగా ద్వారాలను అలంకరించింది. సరోజ, రంగయ్యా కూతురు, అల్లుడి రాక కోసం ఎదురు చూస్తున్నారు 


ఇదిలావుండగా సుధ తన భర్త వేణుతో కలిసి తన ఊరుకు బస్సులో బయలుదేరింది. తను పుట్టి పెరిగిన ఆ ఇల్లన్నా‌, ఆడుతూ పాడుతూ పెరిగిన ఆఊరన్నా, అక్కడ ఉన్న తన చిన్ననాటి స్నేహితులన్నా సుధకు చాలా ఇష్టం. బస్సులో నుంచి తన ఊరి అందాన్ని చూస్తూ మధ్యమధ్యలో భర్తకు తన చిన్ననాటి చిలిపి చేష్టలను వివరిస్తూ ఆనందిస్తోంది. 'ఎప్పుడెప్పుడు అమ్మా- నాన్నలను చూస్తానా' అన్న ఆరాటం ఆమె ముఖంలో స్పష్టంగా కనపడుతోంది. మరో రెండు గంటలకు బస్సు రామాపురం చేరింది. బస్సు దిగగానే ఎదురుగా ఎడ్లబండిలో రంగయ్య. సంతోషంగా పలకరింపులు అయ్యాక బండి ఎక్కారు వేణు, సుధలు. గణ గణ మనే ఎద్దుల గంటల ధ్వని సుధ మనస్సును ఏవో లోకాలకు తీసుకుపోయింది. 


" సుధా ! బండి దిగు. ఇల్లొచ్చేసింది " అన్న వేణు పిలుపుతో త్రృళ్ళిపడింది సుధ. వేణు చేయి అందివ్వగా ఛంగున బండి దిగింది సుధ. ఎదురుగా నవ్వుతూ అమ్మ. కూతురికి, అల్లుడికీ ఎర్రనీళ్ళతో దిష్టి తీసి కాళ్ళు కడిగి హారతిచ్చి లోపలికి తీసుకొచ్చింది సరోజ.


"అల్లుడుగారూ !బాగున్నారా!" అన్న అత్తా-మామల పలకరింపుకు నవ్వుతూ సంతోషంగా బదులిచ్చాడు వేణు. 


" ఏమ్మా! సుధా! ఎలా ఉన్నావు?" అని కూతురిని పలకరించి దగ్గరకు తీసుకున్నారు తల్లి తండ్రులు. కాఫీ, ఫలహారాల మర్యాదలు అయ్యాక వాళ్ళని తమ పొలానికి తీసుకెళ్ళారు రంగయ్య. సరోజ వంట పనిలో నిమగ్నమైంది.


సుధ తమ ఊరిని వేణుకు చూపిస్తూ అక్కడ ఉన్న కాలువ, మామిడి తోటలు,తన స్నేహితురాళ్లతో ఆడుకున్న ఆటపాటలు, గిల్లి కజ్జాలను గురించి సంతోషంగా చెబుతుంటే వేయి ఓల్టుల బల్బులా వెలిగిపోతున్న తన భార్య ముఖారవిందాన్ని చూసి మరింత ముచ్చట పడిపోతున్నాడు వేణు. 


అసలే అందమైన సుధ ఇప్పుడు మరింత అందంగా మెరిసిపోతోంది. రమణీయమైన అక్కడి ప్రక్రృతి సౌందర్యాన్ని చూసి మరింత ముగ్థుడయ్యాడు వేణు. 

కమ్మని కబుర్లు చెప్పుకుంటూ పొలం అంతా తిరిగి వస్తూ దారిలో చెరుకు తోటలో కొన్ని చెరుకు గడలను విరుచుకుని తండ్రితో ఇంటికి తిరుగు ముఖం పట్టారు సుధ, వేణులు. 


అందమైన ఆ జంటను చూసి ముచ్చట పడుతున్నారు ఆఊరి వాళ్ళు. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఆప్యాయంగా పలకరించే సుధ అంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం. పల్లెటూరంటేనే ఆప్యాయత - ఆదరాభిమానాలకు నెలవు. 

పట్నంలో లాగా అక్కడ యాంత్రిక జీవనం ఉండదు. సుధ ఆ ఊరిలో పుట్టి పెరిగిన బిడ్డ కదా మరి ! అందుకే సుధ అంటే వాళ్ళందరికీ ప్రీతి.


ఆకలితో ఇంటికి వచ్చిన సుధావాళ్ళకు వేడివేడిగా భోజనాలు వడ్డించింది సరోజ. కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయారు వేణు, సుధలు.సుధ వచ్చిందని తెలిసి ఆ సాయంత్రం చిన్ననాటి స్నేహితురాళ్ళు వచ్చి పలకరించారు.


చిన్నప్పటి ఆరోజులను గుర్తు చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో చేగోడీలు తింటూ ట్ త్రాగి కాసేపు కబుర్లతో అందరూ హాయిగా గడిపారు. 'మధురమైన ఆ బాల్యం మరలా రాదు కదా!' అని అనుకున్నారు. 


స్నేహితురాళ్ళను పంపి సుధ అమ్మానాన్నలతో, వేణుతో రాత్రి విందారగించింది. అందరూ హాయిగా నిద్ర పోయారు. తెల్లవారితే ఉగాది పండుగ.

 

 వేకువనే తొలి కోడి కూత తో మెలకువ వచ్చిన సుధ కళ్ళు నులుపుకుంటూ బద్దకంగా కళ్ళు తెరిచి ఇంటి ముందు ఉన్న తోటలోకి వచ్చింది. చల్లని గాలి మేనును సోకగా చెట్లు అన్నీ నవ్వుతూ స్వాగతం చెబుతున్నాయా అన్నట్టు తలలూపుతున్నాయి. విరిసిన పూతోటలో ప్రక్రృతి చాలా రమణీయంగా ఉంది. అప్పుడే తన వెలుగు కిరణాలతో చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ ఉషోదయ భానుడు వస్తున్నాడు. 'ఉదయ భానుడు ఎంత బాగున్నాడో !' అనుకుంది సుధ. 


వసంతకాలమాయె. తన చిన్న ప్పుడు బడిలో నేర్చుకుని చాలా పోటీలలో పాడి బహుమతులను గెలుచుకున్న " ఓహో! ఓహో ! వసంతమా ! నవ మోహన జీవన వికాసమా ! " అనే దేవులపల్లి వారి లలిత గీతం గుర్తొచ్చి పాడింది. మామిడి చెట్టు మీద నుంచి కోయిల కుహూకుహూ లు బహు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. 


సుమనోహరమైన ఆ గానానికి ముగ్ధురాలై తను కూడా శ్రుతి కలిపి దానిని అనుకరిస్తే అది రెట్టించిన ఉత్సాహంతో మరింత శ్రావ్యంగా కూసింది. కాసేపు తను కూడా గొంతు కలిపి " సరిలేరు! సరి రారు నీకెవ్వరు! నీకు నీవే సాటి కోయిలమ్మా! " అని మెచ్చుకుని తోటంతా తిరుగుతూ కాసేపు గడిపి ఇంట్లోకి వచ్చింది.


తల్లి అప్పుటికే వాకిలి ముందు ఆవు పేడతో కళ్ళాపు చల్లగా తను రంగవల్లులు తీర్చి దిద్దింది. కాలక్రృత్యాలు తీర్చుకుని వేణును లేపింది. 


"అబ్బ! అప్పుడే తెల్లారిందా ! " అంటూ సుధను మరింత దగ్గరకు తీసుకున్నాడు వేణు. 


కాసేపటికి వేణు లేచి కాలక్రృత్యాలను తీర్చుకుని అత్తగారి చేతి కాఫీ త్రాగాడు. తర్వాత సరోజ వాళ్లిద్దరినీ పీటలమీద కూర్చోబెట్టి నుదుటిన బొట్టు పెట్టి నూనెతో తలంటి, హారతివ్వగా సరోజ, రంగయ్యలు అక్షింతలు వేసి ఆ దంపతులను దీవించారు. 


తలంటి స్నానాలయ్యాక ఆ క్రొత్త దంపతులకు పట్టుచీరె‌, ధోవతి, ఉత్తరీయం పెట్టగా అవి కట్టుకొని వచ్చి పెద్ద వాళ్ళ ఆశీర్వాదం పొందారు వేణు, సుధలు. సరోజ అందరికీ ఉగాది పచ్చడి పెట్టింది. అన్ని రకాల రుచులతో ఉన్న ఆ పచ్చడిని మళ్ళీ అడిగి మరీ తిన్నారు సుధావాళ్ళు. 


వేణు, సుధలు కాసేపు ఆ తోటలో ఆనందంగా విహరిస్తూ కబుర్లతో గడిపారు. ఈలోగా సరోజ పిండివంటలతో సహా వంట పూర్తి చేయగా అందరూ కలిసి దేవునికి పూజ చేసి హారతులిచ్చారు. రంగగయ్య పంచాంగం చదవగా అందరూ విన్నారు. 


ఎవరి రాశిఫలాలను వాళ్లు మరలా పరిశీలించి ఆదాయవ్యయాలను, రాజభోగాలను, అవమానాలను చూసుకున్నారు. అందరూ పిండివంటలతో భోజనాలను ముగించారు. అత్తగారి కొసరి కొసరి వడ్డనలతో వేణు చాలా సంతృప్తిగా భుజించాడు. అందరూ భుక్తాయాసంతో కాసేపు హాయిగా విశ్రమించారు. 


వేణు, సుధలు ఆ సాయంత్రం ఆ ఊరి శివాలయానికి వెళ్లి అర్చన చేసి ఆ స్వామి ఆశీస్సులను పొందారు. "సుధమ్మా ! ముందీ రోజులకు పండంటి మగబిడ్డను కనాలమ్మా! " అన్న పూజారి దీవెన విన్న సుధ సిగ్గుల మొగ్గ అయింది. ఆ తర్వాత కాసేపు అక్కడి కోనేరు వద్ద గడిపి అందులో ఎర్రటి కలువపూవులను కోసుకుని ఇంటికి వచ్చారు సుధావాళ్ళు.


ఆ రాత్రి అందరూ విందారగించి కాసేపు కబుర్లతో గడిపి నిద్రపోయారు. ఆ మరుసటి రోజు ఉదయం స్నానపానాదులయ్యాక ఫలహారాలను చేసి అత్తామామలకు నమస్కరించి మధురమైన జ్ఞాపకాలను మనసునిండా పదిలపర్చుకుని సంతోషంగా వేణు, సుధలు తమ ఊరికి పయనమయ్యారు. 


తను చేసిన చక్కిరాలు, అరిశెలు, చెక్కలు మొ.. పిండి వంటలను, కొన్ని చెరుకు గడల ముక్కలను, అరటి పండ్లను, తోటలోని కూరగాయలను అన్నింటినీ చక్కగా సర్ది వాళ్లకు అందించింది సరోజ. తమ వివాహమైనాక తొలి పండుగ అయిన ఈ ఉగాది ఇంత మధురానుభూతిని మిగిల్చిందని సంతోషిస్తూ తమ ఊరి బస్సు ఎక్కారు వేణు, సుధలు.

 

 కూతురి, అల్లుడి అన్యోన్యతను చూసి సంతోషిస్తూ వాళ్ళు ఇంకా నాలుగు రోజులు తమ వద్ద ఉంటే బాగుండేదని పదే పదే అనుకుంటూ, అల్లుడి ఉద్యోగరీత్యా అది కుదరదు కదా! అని మనసుకు సర్ది చెప్పుకుంటున్నారు సరోజ దంపతులు. సుధా వాళ్ళ రాకతో ఇంటికి వచ్చిన పండగ సందడి వాళ్లు వెళ్ళిపోవడంతో సందడినంతా సుధ తీసుకెళ్లినట్లు భావిస్తున్నారు. 


తమకు ఇంతటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చిన ఈ ఉగాది పండుగను గుర్తుచేసుకుంటూ " అప్పుడే అయిపోయిందా ఉగాది. వచ్చే సం...ఉగాది పండుగకు పండంటి మనవడిని ఎత్తుకోవాలి, వాడి ముద్దు ముచ్చటలను వేడుకగా జరపాలి " ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్ధించారు సరోజ దంపతులు. వేణు, సరోజలు క్షేమంగా వాళ్ళింటికి చేరి అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు.


ఆ దేవదేవుడు వాళ్ళ ప్రార్ధనని ఆలకించినట్లుగా ఆ తర్వాత కొన్ని రోజులకు సుధ నెలతప్పింది. సరోజ దంపతుల ఆనందానికి అవధులు లేవు. రెక్కలు కట్టుకున్న ట్టుగా వెంటనే కూతురి వద్దకు వెళ్లి తనకు కావల్సినవన్నీ చేసి పెట్టి రెండు నెలలు అక్కడే గడిపి ఇంటికి వచ్చింది సరోజ. ఆతర్వాత కూతురిని ఏడవ నెలలో ఇంటికి తీసుకుని వచ్చి వియ్యాలవారినీ‌, బంధువులను, ఊరిలో అందరినీ పిలిచి వేడుకగా సీమంతం చేసింది సరోజ.


ప్రక్క ఊరినుంచి డాక్టర్ ను ఇంటికి పిలిపించి సుధ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూస్తున్నారు రామయ్యా వాళ్ళు. తరచూ వేణు వచ్చి చూసిపోతున్నాడు. నెలలు నిండాక ఒక శుభముహూర్తమున పండంటి కొడుకును కన్నది సుధ. వేణు‌, సరోజా వాళ్ళు చాలా సంతోషించి వేడుకగా బారసాల చేసుకుని బాబుకు 'వసంత్' అని పేరు పెట్టుకున్నారు. సంతోషంగా భార్యా బిడ్డలను తీసుకుని వాళ్ళ ఊరికెళ్ళిపోయాడు వేణు. 


అల్లారుముద్దుగా పెరుగుతూ ముద్దులు మూటకట్టే మనవడంటే సరోజ దంపతులకు చాలా ప్రేమ. 'అసలు కంటే వడ్డీ ముద్దు' అని ఊరికే అనలేదు పెద్దలు. 


మరుసటి సం. … తాము కలలు కంటున్న అందమైన ఉగాది రానే వచ్చింది. సుధ భర్త తో,కొడుకుతో తమ ఊరికి వచ్చింది. క్రితం సం.. లాగానే వేడుకగా ఉగాది పండుగను తల్లిదండ్రులతో,భర్తతో, కొడుకుతో ఆనందంగా, సంతోషంగా జరుపుకుంది సుధ. అమ్మమ్మ చేసిన ఉగాది పచ్చడిని‌ వసంత్ నోటికి నాకించగా బోసి నవ్వులు నవ్వాడు ఊయలలోని వసంత్. 


తమకు ఇంతటి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చిన ఉగాది పండుగను తలచుకుంటూ ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు రామయ్య దంపతులు.


నీరజ హరి ప్రభల గారి కొన్ని ఇతర రచనలు:


.. సమాప్తం .. 


నీరజ హరి ప్రభల

-నీరజ హరి ప్రభల

Profile Link


YouTube Playlist Link

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page