తోకలేని పిట్ట
- Madhupatra sailaja Uppaluri

- Jun 30
- 5 min read
తెలుగు కథలు, ప్రేరణాత్మక కథలు, మానవత్వం, సేవాభావం, పోస్ట్‌మాన్, ఊటీ, నీలగిరి కొండలు, గిరిజన గ్రామాలు, నిజాయితీ, తపాలా శాఖ, గ్రామీణ జీవితం, భావోద్వేగ కథ, కుటుంబ పఠనం, సమాజ సేవ, మన తెలుగు కథలు

Thokaleni Pitta - Telugu Inspirational Story | Madhupatra Sailaja Uppaluri
తోకలేని పిట్ట - తెలుగు ప్రేరణాత్మక కథ| మధుపత్ర శైలజ ఉప్పలూరి
Published in manatelugukathalu.com on 30/06/2026
లేలేత సూర్యకిరణాలు, చిగురుటాకులపై ముత్యాల్లా కురుస్తున్న మంచు బిందువులను మృదువుగా స్పృశిస్తున్నాయి. నీలగిరి పర్వతలోయల్లోని ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించటానికి ఒక్క ఎండాకాలమనే కాకుండా అన్ని సీజన్స్‌లో కూడా పర్యాటకులు ఊటీకి వస్తూ ఉంటారు.
పిల్లలకు దసరా సెలవలనివ్వటంతో, భార్య, పిల్లలతో కలసి కళ్యాణ్ ఊటీ యాత్రకు బయలుదేరాడు. క్యాబ్ డ్రైవర్ రామన్‌కి తెలుగు, తమిళ భాషలు రెండూ బాగా రావడంతో అతనే కళ్యాణ్ వాళ్ళకి ఓ గైడ్‌లాగా మారాడు.
పిల్లలు దారిలో కనిపిస్తున్న సరస్సులను, స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షులను, అడవుల్లో నిర్భయంగా తిరుగుతున్న ఏనుగుల గుంపులను చూస్తూ ఆనందిస్తున్నారు.
“అపార్ట్‌మెంట్ సంస్కృతితో ఇల్లు, స్కూలు, పరీక్షలు, మార్కులు అంటూ యాంత్రికంగా నడిచే పిల్లల జీవితాలకు ఈ నాలుగు రోజుల యాత్ర, వనాలు, సరస్సులు, జలపాతాలు, కొండలను చూస్తూ, ప్రకృతిలో ఆనందంగా తిరిగే జంతువుల సాంగత్యంలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది” అనుకున్నారు కళ్యాణ్ దంపతులు.
“నాన్నా అటు చూడు” అంటూ తాను బైనాక్యులర్‌లో చూసిన, దూరంగా ఒకదానివెంట ఒకటిగా వెడుతున్న ఏనుగుల గుంపును చూపించింది హంసిని.
“అక్కా! నాక్కూడా ఓసారి ఇవ్వవా?” అంటూ అక్క దగ్గర తీసుకున్న బైనాక్యులర్‌లో ఏనుగులను చూస్తూ ఆనందంగా “నాన్నా! ఇక్కడ దిగుదామా?” అంటూ హడావిడి చేశాడు హవిష్.
అక్కాతమ్ముల సంభాషణ వింటున్న రామన్ “బాబూ! ఇక్కడ అడవి దున్నలు, ఏనుగులు బాగా తిరుగుతాయి. మనం ఇక్కడ ఆగితే అవి మనలను ముందుకు పోనీయక ఇబ్బందులకు గురిచేస్తాయి. ముందుకెళ్ళాక ఓ ఊరొస్తుంది. అక్కడ కాసేపు ఆగి, అటుఇటు చూసి వెళ్దాంలే” అన్నాడు.
“సరే అంకుల్” అంటూ పిల్లలు అడవులను పరిశీలనగా చూస్తూ కబుర్లాడుకుంటున్నారు. ఓ అరగంట ప్రయాణం సాగినాక కీచుమంటూ కారు ఆగింది. ముందు చాలా కార్లు ఆగి ఉన్నాయి.
డప్పులు, బాజాభజంత్రీలతో ఎవరినో పెద్దగా ఊరేగిస్తున్నారు. రోడ్డంతా జనాలు మూసేశారు, అందుకే ఎక్కడి వాహనాలు అక్కడనే ఆగిపోయాయి. “రామన్! ఇక్కడేమైనా ఎన్నికలు జరుగుతున్నాయా? ఏమిటా హడావిడి?” అంటూ అడిగాడు కళ్యాణ్.
“ఉండండి సార్! ముందుకెళ్ళి కనుక్కు వస్తాను” అంటూ జనం మధ్యలోకి చొచ్చుకుంటూ వెళ్ళాడు రామన్.
తాను కూడా కారుదిగి తన ప్రక్కనున్న వ్యక్తిని కదిపి “ఏమిటండీ ఈ హడావిడి? ఎవరిదైనా పెళ్ళి ఊరేగింపా? ట్రాఫిక్ అంతా జామ్ అయింది. మేము ఊటికి వెళ్ళాలి. ఆలస్యం అయితే కొత్త ప్రదేశంలో ఇబ్బంది అవుతుందేమో? మాకోసం కాస్త రోడ్డు ఖాళీ చేయించగలరా?” అంటూ తమిళంలో అడిగాడు కళ్యాణ్.
అందుకతడు, “మా శివన్ బాబాయి ఈరోజు రిటైర్ అవుతున్నాడు. అందుకే అతనిపై మాకున్న ప్రేమను, మా ఆనందాన్ని తెలియజేయటానికి అతన్ని సన్మానించి ఊరేగిస్తున్నాం. చుట్టుప్రక్కల గల పది ఊళ్ళ జనాలందరికీ మా శివన్ బాబాయి ఆత్మీయుడే. అందుకే అన్ని గ్రామాల ప్రజలు పండ్లు, దుంపలు, బహుమతులు పట్టుకొచ్చారు. ఎంత గొప్ప మనిషో మా శివన్ బాబాయి తెలుసునా” అని చెపుతూ ఆ వ్యక్తి సంతోషంతో పొంగిపోతున్నాడు.
“మీ శివన్ బాబాయి చేసేది ఏమైనా పెద్ద ఉద్యోగామా?” అమాయకంగా అడిగాడు కళ్యాణ్.
పకపకమంటూ నవ్వుతూ “పోండి సార్! మీ వేళాకోళాలు” అంటూ పక్కనే నిలబడ్డ మరో వ్యక్తి “మా శివన్ బాబాయి ఓ పోస్ట్‌మాన్. అతను పేరుకి ఉత్తరాలు బట్వాడా చేసే తపాలా బంట్రోతు కావచ్చును, కానీ అతను ఈ చుట్టుప్రక్కల గల పది గిరిజన గ్రామాలకు ఆత్మబంధువు అయ్యాడు. అతని గురించి, అతని గొప్పతనం, నీతి నిజాయితి గురించి, 40 సంవత్సరాలపాటు రోజుకి 15-20 మైళ్ళు నడుస్తూ అందించిన అతని సేవల గురించి ఎంత చెప్పినా అది చాలా తక్కువే అవుతుంది.
అలా ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ ఇప్పుడు రిటైర్ అవుతున్నాడు. ‘నూటికో, కోటికో ఇలాంటి వ్యక్తులు భూమ్మీద పుడతారంట’ మాతాత చెప్పేవాడు. ‘అలాంటి వారికోవకు చెందిన వ్యక్తి మా శివన్ బాబాయి’ అంటూ ఊపిరి తీసుకోవటానికి కాసేపు ఆగాడు ఆ వ్యక్తి.
ఇంతలో రామన్ వచ్చి “సార్! శివన్ అనే పోస్ట్‌మాన్ రిటైర్ అయ్యాడట. అతనికోసం ఈ ఊరేగింపు, హడావిడి చేస్తున్నారు. అందుకే ట్రాఫిక్ ఆగిపోయింది” అని చెప్పాడు రామన్.
“అవును నాకు కొద్దికొద్దిగా తెలిసింది. మీ పోస్ట్‌మాన్ అంటే మీకు గొప్ప కావచ్చును. ఇలా మా ప్రయాణీకులనందరిని ఆపితే ఎలా చెప్పండి? ట్రాఫిక్ జాంతో పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో గమనించారా?” అంటూ విసుగ్గా అన్నాడు కళ్యాణ్.
దానికి ఆ ప్రక్కనే నిలబడిన వ్యక్తి స్పందిస్తూ, “వివిధ జిల్లాలు, రాష్ట్రాలనుండి వచ్చే యాత్రికులు ఊటీలోని అందమైన ప్రకృతి దృశ్యాలను చూసి ఆనంద పడుతూ ఉంటారు.
కానీ మా శివన్‌లోని అంతఃసౌందర్యం గురించి తెలుసుకుని దేశమంతటా వ్యాప్తి చేస్తే, అతని కీర్తి, మంచితనం మన యువతకు ఓ స్ఫూర్తిగా మారుతుందన్న ఆశతో ఇలా మీలాంటి ప్రయాణీకులకు ఇబ్బంది అయినా ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం” అంటూ చెప్పసాగాడు.
కళ్యాణ్ కుటుంబ సభ్యులతోపాటు మిగిలిన ప్రయాణీకులందరూ శివన్ గురించి మరిన్ని వివరాలను చెప్పమని కోరటంతో, మనసులో ఉన్న అసహనాన్ని తగ్గించుకుని తానుకూడా శివన్ గురించి వినసాగాడు కళ్యాణ్.
శివన్ ‘పూనురు’ అనే పోస్టాఫీసులో చిన్న బంట్రోతుగా పనిచేసేవాడు. వచ్చే జీతంతో భార్యాపిల్లలతో హాయిగా ఉండేవాడు. అతనికి ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చి ‘హిల్‌గ్రూ’ పోస్టాఫీసుకి బదిలీ చేశారు. జీతం పెరగటమే కాక అప్పటివరకు తాత్కాలికమనుకున్న ఉద్యోగం పర్మనెంట్ కావటంతోనూ, పిల్లల చదువులకు ఇబ్బంది ఉండదన్న నమ్మకంతోనూ, తానున్న స్థలం నుండి కొత్త ప్రదేశంలో వచ్చి చేరాడు.
ఇది అతనికి ఓ రకంగా సవాలుని విసిరిన ఉద్యోగమే. ఈ పోస్టాఫీసు పరిధిలో అడవుల్లోను, కొండ చరియల్లోను ఉన్న 10 గ్రామాలకు ఉత్తరాలను, MOలను బట్వాడా చేయటానికి రోజుకు దాదాపుగా 15-20 మైళ్ళు కాలినడకన తిరగాల్సి ఉంటుంది. కొండలు, గుట్టలు, వాగులు, అడవుల గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
మా శివన్‌కు ముందున్న ఉద్యోగులు ఒక్క ఉత్తరం కోసం అంత దూరం ఏమి వెడతామని నిర్లక్ష్యంతో బట్వాడాను ఆలస్యం చేసేవారు. కానీ మా శివన్ మాత్రం మనుష్యులలో దేవుడు. అందుకే ఒక్క ఉత్తరం వచ్చినా అన్ని కష్టాలను తాను భరించి, ఆ ఊరికి చేరి ఇంటివారికి ఆ ఉత్తరం అందించి, అవసరమైతే చదివి వినిపించి సాయంత్రానికి ఇల్లు చేరేవాడు.
దేశమంతటా సెల్‌ఫోనులు మ్రోగుతున్నా ఇంకా కొన్ని గిరిజన ప్రాంతాలలో నేటికీ ఉత్తరాలే సమాచార వారధులుగా ఉన్నాయి. ఇక్కడ జేరిన మొదటి మూడు వారాలు ఏ ఉత్తరమూ రాలేదు. ఆరోజు ఉదయం నుండి ఒకటే జోరున వాన పడుతోంది. పోస్టాఫీసుకి వెళ్ళి పని ప్రారంభిస్తే, గిరిజన గూడెంలో గల చిరునామాకి ఒక ఉత్తరం వచ్చింది.
ఆ ఉత్తరం పట్టుకుని భారీగా పడుతున్న వానజల్లులో గొడుగు వేసుకుని అడవుల వెంబడి నడుస్తూ, అడవి జంతువులను తప్పించుకుంటూ మిట్ట మధ్యాహ్నం వేళకి ఆ ఊరు చేరి ఆ ఇంటి అరుగుమీద కూర్చుని మంచినీళ్ళడిగాడు శివన్. ఇంటామె నీళ్ళనిచ్చి, “బిడ్డా, మాకేమైనా ఉత్తరం వచ్చిందా?” అని ఆత్రంగా అడిగింది.
“ఔనమ్మా అందుకే అక్కడ వాన పడుతున్నా లెక్కచేయక ఇట్లా వచ్చాను” అన్నాడు శివన్.
“ఏమయ్యోయ్ ఇట్లారా! మన బిడ్డ ఉత్తరం రాసిందయ్యా. బాబు తీసుకు వచ్చాడు” అంటూ పెనిమిటిని పిలిచింది.
ఇంటాయన లోపలినుండి పరుగు పరుగున వచ్చి శివన్ పక్కనే చతికిలబడి, “కాస్త ఆ ఉత్తరం చదివి పెట్టు బాబూ! బిడ్డకు లగ్గం చేసి పంపించి మూడు నెలలౌతోంది. ఇంతదాకా అక్కడినుండి కబురులేదు. రేయింబవళ్ళు కలలోకి వస్తోందయ్యా బిడ్డ” కన్నీళ్ళను దిగమింగుకుంటూ అడిగాడు.
“మీకు వచ్చే ఉత్తరాలలో ఏఏ విశేషాలుంటాయోననే ఉత్తరం రాగానే మీకు అందించటానికి నేనూ కష్టపడతాను” అంటూ ఉత్తరం చదవటం మొదలుపెట్టాడు శివన్.
“అమ్మా! నేను, మీ అల్లుడు ఇక్కడ బాగానే ఉన్నాం. నేను కూడా ఇక్కడ తేయాకు తోటలో పనిచేస్తున్నాను. మీరెలా ఉన్నారోనన్న దిగులేస్తోంది. చాలా దూరముంది కదా. ఒక్కదానినే రాలేను, పండుగకు మీ అల్లుడిగారితో కలసి వస్తాను. మీరు నామీద బెంగపడకుండా చక్కగా తిని, హాయిగా ఉండండి.” ఇదీ మీ బిడ్డ రాసిన విషయం అని ముగించాడు. శివన్‌కి కూడా చదువుతున్నంతసేపూ కన్నీళ్ళు ఆగలేదు.
“మా ఆయువు కూడా పోసుకుని నిండు నూరేళ్ళు చల్లాగా ఉండు నాయనా! ఇదిగో ఈ మజ్జిగ కాస్త త్రాగు” అంటూ ప్రేమతో ఇచ్చింది ఇంటామె.
మరో నెలలో ఓ గ్రామంలోని తండ్రికి మనీఆర్డర్ చేశాడొక కొడుకు. డబ్బు విలువ తెలిసిన మనిషి కాట్టి మా శివన్ బాబాయి, ఆ MO పట్టుకుని ఆ ఊరికి బయలుదేరాడు. అడవి మధ్యకు వచ్చేసరికి పెద్ద ఏనుగుల గుంపు ఎదురొచ్చింది. ఆగిపోయి చట్టుక్కున దాక్కున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే అడవి దున్న రంకెలేస్తూ అటుగా వస్తోంది. చెట్టుపైకెక్కి మృగాలన్నీ వెళ్ళిపోయాక, చెట్టు దిగి ఆ ఊరు చేరి ఆ ఇంటి పెద్దకు ఆ డబ్బులు చేర్చాడు.
“బిడ్డా! సమయానికొచ్చావు నాయనా! ఇంట్లో వెచ్చాలు లేవు. సంతకెళ్ళాలంటే చేతిలో రూకలు కూడా లేవు. దేవుడు పంపినట్లుగా నువ్వొచ్చి డబ్బు ఇచ్చినావు” అంది.
“నేను కాదమ్మా ఇచ్చింది! ఈ డబ్బులు మీ అబ్బాయి కష్టార్జితం. మీకు చేర్చాల్సిన బాధ్యత నాది. చేర్చాను” అంటూ కదిలాడు శివన్.
మరో సంఘటనలో ఓ గ్రామంలో వచ్చిన ఉత్తరం బట్వాడా చేసి, దానిని చదివి వినిపిస్తూ “మీ అమ్మాయికి ఏడవ నెల కూడా వచ్చింది. కడుపుతోనున్న పిల్లకు సీమంతం చేసి పురిటికి తీసుకెళ్ళేదేమన్నా ఉన్నదా? లేదా?” అంటూ వియ్యపురాలు రాసిన ఆక్షేపణలకు కృంగిపోతున్న తల్లిదండ్రులకు ధైర్యం చెపుతూ, “మీరు నాతోపాటు బయలుదేరి పిల్లకి సీమంతం చేసి రండి” అంటూ ఒక వెయ్యి రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి వారిని కూతురింటికి పంపించాడు శివన్.
ఆ తరువాత ఆ అమ్మాయికి అబ్బాయి పుడితే, ఆ తల్లిదండ్రులు ఆ బాబుకి ‘శివన్’ అని పేరు పెట్టుకున్నారు.
ఇలా ఒకటా? రెండా? ఇక్కడున్న 10గ్రామాలలోని ప్రతి గడపకు శివన్‌తో అనురాగబంధముంది. ఇక్కడి ప్రజలతో మమేకమై వారి కన్నీళ్ళకు, సంతోషాలకు సాక్షీభూతంగా నిలిచి వాళ్ళందరికీ ఆత్మబంధువయ్యాడు.
పెద్ద సార్లు కూడా శివన్‌ని ‘పోస్ట్‌మాన్’ అని చిన్న చూపు చూడకుండా, ఇక్కడి ప్రజల దేవుడిగా గుర్తించి సన్మానించారు. ప్రయాణీకుల్లోని ఒక జర్నలిస్ట్ ఇదంతా రికార్డ్ చేశాడు. అతనికి తానెక్కడొ చదివిన..
"పచ్చని అడవుల మధ్యన తిరుగాడే ఎర్ర సూరీడు, అడవంతా తనదే, అవనంతా తనదే, అడవి పుత్రుల ముద్దుల బిడ్డడు, కష్టసుఖాలను పంచుకునే చెలికాడు, కొండ, కొనలు, వాగులు, వంకలు, అడవి జంతువులన్నీ అతనికి ఆప్తబంధువులే" అన్న కవిత మదిలో మెదిలింది.
యాత్రికులందరూ శివన్‌తో కలసి ఫోటోలు తీయించుకున్నారు. ఊటీ చేరిన ప్రయాణీకులకు నీలగిరుల శిఖరాల అంచున వినీలాకాశంలో శివన్ రూపం ఎంతో సుందరంగా కనిపిస్తోంది.
*****
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి కొన్ని ఇతర రచనలు:
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు. గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.









Comments