వీపు ఊయలలో బిడ్డ భవిష్యత్తు..?
- Kukatlapalli Polayya

- 4 hours ago
- 2 min read

Veepu Uyalalo Bidda Bhavishyatthu..? - Telugu Inspirational Story | Polayya Kavi
వీపు ఊయలలో బిడ్డ భవిష్యత్తు..? - తెలుగు ప్రేరణాత్మక కథ | పోలయ్య కవి
Published In manatelugukathalu.com On 08/09/2026
పేదరికం పిల్లల కలలకు అడ్డుగోడ కావాలా? పొలంలో నాట్లు వేస్తూ, తన బిడ్డను వీపుపై మోస్తూ జీవన పోరాటం సాగిస్తున్న ఓ తల్లి కష్టం ఈ ప్రశ్నకు హృదయాన్ని తాకే సమాధానం చెబుతుంది. వీపు ఊయలలో బిడ్డ భవిష్యత్తు..? కథలో తల్లి వీపుపై ఊగుతున్న చిన్నారి, ఆమె వంగిన నడుము వెనుక దాగిన శ్రమను అర్థం చేసుకుంటుంది. తాను పెద్దయ్యాక కలెక్టర్‌గా మారి రైతులకు ట్రాక్టర్లు అందించి వారి కష్టాన్ని తగ్గించాలని కలగంటుంది. తల్లి చెమట చుక్కల్లోనే బిడ్డ బంగారు భవిష్యత్తుకు విత్తనాలు మొలుస్తాయనే గొప్ప సందేశాన్ని పోలయ్య కూకట్లపల్లి ఈ మినీ కథలో భావోద్వేగంగా ఆవిష్కరించారు.
"చిట్టీ…చిట్టీ…ఏమి చూస్తున్నావే..?"
"నీవు చూడలేని
నీ వీపును చూస్తున్నా మమ్మీ...
మమ్మీ…మమ్మీ…
నన్ను నీ పొట్టకు కట్టుకోవే..!"
"ఎందుకే…?"
"పాలు త్రాగేందుకే...
నీ గుండె చప్పుడు వినేందుకే...
అదే నేవిన్న మొదటి జోలపాట కదమ్మా..!"
"ఇంత తెలివి నీకెక్కడిదే..?"
"అదిగో…ఆ చెట్టు కొమ్మల్లో
తల్లిపొట్టను కరుచుకుని
ఊగుతున్న పిల్లకోతి చెప్పిందమ్మా
తల్లి పొట్టే బిడ్డకు మొదటి భద్రతని..!"
"మమ్మీ…మమ్మీ
నేను పెద్దైతే నాట్లు వేస్తానే..!"
"ఎందుకే…?"
"ఏళ్లకు ఏళ్లు వంగిన నీ నడుము
కాలం కొడవలికి కుంగిపోతుంది కదమ్మా…"
"ఇంత తెలివి నీకెక్కడిదే?"
"నేనున్నది నీ వీపుపైనే కదమ్మా…
ఒంగిన నీ వీపే చెబుతోంది నా చెవిలో
రేపటి నీ కన్నీటి గాథను..."
"చిట్టీ…చిట్టీ...ఆకలేస్తుందా?"
"లేదు మమ్మీ…నా ఆకలి చచ్చిపోయింది!”
"ఎందుకే…?"
"నీవు నాటేయడానికొచ్చే ముందు
పంపునీళ్లతో కమ్మగా కడుపు
నింపుకుని ఆకలి తీరిందన్నావుగా మమ్మీ
అది చూసి నా చిన్ని కడుపు
ఆకలనడం మానేసింది మమ్మీ"
"చిట్టీ…ఆడుకోవాలని ఉందా?"
"లేదు మమ్మీ నీ వీపు ఊయలలో
హాయిగా ఊగాలని ఉంది…
ఒక జోల పాట పాడు మమ్మీ…
విని హాయిగా నిద్ర పోతా..."
ఆ తల్లి తన జాకెట్‌లో
దాచుకున్న సెల్‌ఫోన్ తీసి
బిడ్డకు ఈ జోలపాట వినిపించింది.
సినారె కలం నుండి జాలువారిన
ధర్మదాత చిత్రంలోని
జో లాలి...జో లాలి...పాట
'జో...లాలి...జో...లాలి...
లాలీ నా చిట్టి తల్లి...లాలీ ననుగన్న తల్లి
లాలీ బంగారు తల్లి..లాలీ నా కల్పవల్లి
చిరునవ్వు కిరణాలు చిందించు మోము
కన్నీరు మున్నీరుగా నే చూడలేను
నినుగన్న నీ తండ్రి కనుమూసె గాని
నిను వీడి క్షణమైన నేనుండలేను...
జో లాలి...జో..లాలి...
రతనాల భవనాల నిన్నుంచలేను
ముత్యాల ఉయ్యాలలూగించలేను
కనుపాపలా నిన్ను కాపాడుకోనా
ఈ నిరుపేద తల్లి
ఒడిలోన నిను దాచుకోనా...'
పాటవింటూ పాప నిదురపోయి లేచింది.
"చిట్టి...చిట్టి...
నీకు చదువుకోవాలని ఉందా...?
చదువుకొని డాక్టర్ కావాలని ఉందా...?"
"లేదు కలెక్టర్ నై రైతులకు ట్రాక్టర్లు
పంచాలని ఉంది మమ్మీ..."
"ఎందుకే...?"
"ట్రాక్టర్లతో పోలంలో
నాట్లు వేయించ వచ్చు మమ్మీ..."
"ఇంత తెలివి నీకెక్కడిదే..?"
"నీ కమ్మని పాట వింటూ నిదుర పోయా
ఒక కమ్మని కల వచ్చి ఆ కలలో నేను
కలెక్టర్ నై అందరికీ ట్రాక్టర్లు పంచి
పొలాల్లో నాట్లు వేయించానట మమ్మీ..."
"ఔనా! ఎంత మంచి కలగన్నావే నా తల్లి
నీ కలనిజం కావాలని ఆ కనకదుర్గమ్మను కోరుకుందాం..."
ఔను
ఆ పాటలోని ఆ లాలన
ఈ తల్లి వీపుపైన ఈ వేదన
రెండూ కలసి ఒక నిజాన్ని పలికాయి.
ఒక పేదతల్లి ఒడి
బంగారు ఊయల కాకపోవచ్చు.
కానీ పొలంలో మొక్కలు నాటే
ఆ తల్లి తన చెమట చుక్కలతో ఒక
బిడ్డ బంగారు భవిష్యత్తును నాటుతోంది..!
రచన:
కవి రత్న
సాహిత్య ధీర
సహస్ర కవి భూషణ్
పోలయ్య కూకట్లపల్లి
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.

-పోలయ్య కవి




Baagundi