top of page
Original.png

అందుకేనా ఇలా


తెలుగు మాట్లాడే పోటీ కోసం ఇంగ్లీష్ పదాలు వదిలేసిన రావు, భార్య కనకం మరియు తమ్ముడు రఘు ముందు అయోమయంగా నిలబడిన హాస్య దృశ్యం.

Andhukena Ila - Telugu Comedy Story | Malla Karunya Kumar

అందుకేనా ఇలా - తెలుగు హాస్య వ్యంగ్య కథ | మళ్ళ కారుణ్య కుమార్

Published In? manatelugukathalu.com On 08/09/2026


మాతృభాషపై మనకు ఉన్న ప్రేమ నిజమైనదా? లేక ఏదైనా ప్రయోజనం కోసం మాత్రమేనా? ఈ ప్రశ్నకు చమత్కారమైన సమాధానం ఇచ్చే కథ “తెలుగు మాట్లాడే పోటీ”. మాతృభాషకు విలువ ఇవ్వడం అంటే కేవలం మాటల్లో చెప్పడం కాదు, మనస్ఫూర్తిగా ఆచరించడం కూడా అని గుర్తుచేసే సందేశాత్మక కథ ఇది.


అందుకేనా ఇలా


"ఏమోయ్ సుందరం! కాస్త మంచి నీళ్ల సీసా అందుకో," అడిగాడు రావు.

వేగంగా నీళ్ల సీసా తీసి ఇవ్వబోయాడు సుందరం, ధగధగా మెరిసిపోతున్న కిల్లి మరకలు పడిన తన దంతాలను బయటపెడుతూ.


పరధ్యానం నుండి తేరుకుంటూ ఆ సీసా వైపు చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి, "ఏంటయ్యా ఈ ఘాతుకం! కొత్త మంచి నీళ్ల సీసా ఇవ్వవయ్యా," గట్టిగా అరిచాడు రావు.

కిల్లి కొట్టు సుందరం తనకంటూ ప్రత్యేకంగా ఒక రంగు నీళ్ల సీసా పక్కనే పెట్టుకొని ఉంటాడు. దాన్నే శుభ్రం చేయకుండా ఉపయోగిస్తూ ఉంటాడు. కిల్లి బాగా నమిలి ఆ నీళ్ల సీసాలోని నీళ్లు నోట్లో పోసుకొని పుక్కిలించి అటువైపు ఊస్తాడు. ఇది చాలా రోజుల నుండి రావు గమనిస్తూనే ఉన్నాడు. ఆ నీళ్ల సీసా చరిత్ర గుర్తుకు వచ్చి రావు శరీరం జలదరించింది.


అప్పటికి కూడా నీళ్ల సీసా ఇవ్వకుండా తల గోక్కుంటూ వెర్రిచూపులు చూస్తున్న సుందరంను చూసి, "ఎంత సమయం వేచి చూడాలి రా? ఆ చల్లని నీళ్ల సీసా నా ముఖాన కొట్టు, గొంతు ఎండిపోతుంది," అసహనంతో ఫ్రిజ్‌లో ఉన్న నీళ్ల సీసాలు చూపిస్తూ అన్నాడు రావు.


అప్పుడు జ్ఞాన జ్యోతి వెలగడంతో, "ఓహో, మినరల్ వాటర్ కావాలా? ఆ మాట ముందే చెప్పొచ్చు కదా సర్! ఎప్పుడూ ఇంగ్లీషులో గలగల మాట్లాడే మీరు ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు?" పళ్ళు ఇకిలిస్తూ, రావు అడిగినట్టుగా చల్లని నీళ్ల సీసా తీసి ఇచ్చాడు.


వేగంగా తీసుకొని, గటగటా రెండు గుక్కలు తాగి, "నీకు అర్థమయి చావకపోతే నాదా తప్పు? ఇదుగో, ఈ ఇరవై తీసుకో," డబ్బులు అక్కడ పెట్టి విసురుగా తన ఇంటి వైపుకు ప్రయాణమయ్యాడు.


మధ్యదారిలో స్నేహితుడు ధర్మం కనిపిస్తూ, "హాయ్ రావు... ఏంటి టూడే ప్రోగ్రామ్స్?" నవ్వుతూ అడిగాడు.


"ఈ దినం ఎటువంటి కార్యక్రమాలు లేవు. నీ దినముకు ఎలా పథకం వేసావు!" అన్నాడు రావు.


ఉలిక్కిపడి తల గోక్కుంటూ, ఎప్పుడూ లేని విధంగా రావు మాట్లాడడంతో, "ఏంటి ఇంగ్లీష్ ప్రియుడా! ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమిటి? ఏం ప్లాన్ చేశావు?" మళ్ళీ అడిగాడు ధర్మం.


"చూడండి ధర్మం మహాశయా! తమరు నాతో మాట్లాడాలంటే తెలుగులో మాట్లాడండి. ఇక పెసలు, మినుములు ప్రత్యేకించి ఈరోజు ఏమీ లేవు," విసురుగా సమాధానం ఇచ్చి, వేగంగా ముందుకు దూకాడు.


వేగంగా వస్తున్న రావును చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, "హాయ్ గ్రాండ్‌పా! గుడ్ మార్నింగ్, టుడే ఏమిటి ఇంత ఎర్లీగా బయలుదేరారు? ఎలా ఉంది నా ఇంగ్లీష్?" అపార్ట్‌మెంట్‌లో పనిచేసే పనిచేలుపు పిల్ల ట్వింకిల్ అడిగింది.


కోపాన్ని అణచుకుంటూ, "ఏడ్చినట్టుంది! అయినా ఈ సంభాషణలో అన్ని ఆంగ్ల పదాలు అవసరమా? మాతృభాషలో మాట్లాడలేవా?" అగ్గిమీద గుగ్గిలంలా మారిపోయాడు.


"ఓ షిట్! వాట్ హ్యాపెండ్ గ్రాండ్‌పా? మీరే కదా ఇంగ్లీషులో మాట్లాడమని నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇలా అంటున్నారు?" అయోమయంగా ముఖం పెడుతూ అడిగింది ట్వింకిల్.


"నా కర్మ కాలి, బుద్ధి తక్కువయ్యి అప్పుడు మాట్లాడమని చెప్పాను. ఇంకోసారి నా ముందు ఆంగ్ల పద ఉచ్ఛారణ గావించావో నేను మనిషిని కాదు," ఊగిపోతూ కళ్ళు పెద్దవి చేస్తూ అరిచాడు.


చెవులు మూసుకుంటూ అక్కడ నుండి పరుగుతీసింది ట్వింకిల్. కోపోద్రిక్తుడై ఇంటికి చేరుకున్నాడు. రావును చూసి, "కాస్త టీ తాగుతారా?" అడిగింది కనకం.

కోపంతో ఊగిపోతూ కాసేపు మౌనం వహించాడు.


'ఇంతకీ టీని తెలుగులో ఏమంటారు?' తనలో ప్రశ్న వేసుకొని, 'ఏదో ఒకటి మనమే పేరు పెడితే పోలే, ఏం పేరు పెడదాం? హా... రంగు నీరని పెడదాం, మనకు అనుకూలంగా ఉంటుంది' అని నిర్ణయానికి వచ్చి, "ఆ, సరే రంగు నీరు పట్టుకొని రా," అని అన్నాడు.


ఒక్కసారిగా కంగుతిని, "ఏ నీరు?" మళ్ళీ అడిగింది.


"చెవులు బాగానే ఉన్నాయి కదా... మళ్ళీ అడుగుతావేమిటి? పోయి రంగు నీళ్లు తీసుకొని రా," గట్టిగా అరుస్తూ అన్నాడు రావు.


బిత్తరపోయి వేగంగా వంటగదిలోకి పరుగుతీసి కొంత సమయంలో టీతో వచ్చి రావుకి టీ అందించింది.


రెండు రోజులనుండి రావు ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. పైగా చుట్టుపక్కల వాళ్ళ నుండి కంప్లైంట్లు వస్తున్నాయి. ఇరుగుపొరుగు వారు అప్పుడే ముద్ర కూడా వేసేశారు రావుకి పిచ్చి పట్టిందని. ఇవన్నీ విని చూసి కనకముకు భయం పట్టుకుంది. వెంటనే తన తమ్ముడు రఘును పిలిచి వివరాలు చెప్పింది.


అన్ని బాగా విన్నతర్వాత, "అక్క ఇవన్నీ చూస్తుంటే బావకు పిచ్చి పరాకాష్టకు చేరుకుందనిపిస్తుంది. వెంటనే మానసిక వైద్యునికి చూపించాలి."


"నిజమే, కానీ ఇతన్ని అక్కడికి తీసుకువెళ్లడం ఎలా రా?"


"నువ్వేం కంగారుపడకు, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది," అని కనకంతో చెప్పి రావు దగ్గరకు చేరుకొని, "బావ! నీ గురించి కొందరి దగ్గర గొప్పగా చెప్పాను బావ, తెలుగులో నీలా ఎవరూ వాదించలేరని. వాళ్లేమో సవాలు విసిరారు. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. నువ్వేమో బిజీ."


"ఎవర్రా వాళ్ళు? నా పని పక్కన పెట్టేసి వాళ్ళ అంతు చూస్తా. వాళ్లను ఓడిపోయేలా చేస్తా," ప్రగల్భాలు పలికాడు.


"సరే, నేను వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తాను, అదికూడా రేపే సిద్ధంగా ఉండు," అని చెప్పి తన పథకం ఫలించినందుకు ఊపిరి పీల్చుకున్నాడు.


తర్వాత రోజు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. రావుకి డాక్టర్కి పెద్ద యుద్ధమే జరిగింది. రావు దాడి తట్టుకోలేక డాక్టర్ రావుతో సహా వీళ్ళను తరిమేయడానికి సిద్ధమయ్యాడు.


"సర్, సర్! మా బావకు ఏమైందో కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి," అడిగాడు రఘు.


"పిచ్చి పట్టింది, పుస్తకాలెక్కువై పిచ్చి పట్టింది," అరుస్తూ వీళ్ళను గెంటేశాడు డాక్టర్.

డాక్టర్ మాటల్లో ఉన్న అంతరార్థాన్ని పసిగట్టి రావు సమస్యకు పరిష్కారం వెతకడానికి సిద్ధమయ్యాడు రఘు.


రెండు రోజులు రావు గదిలో జల్లెడ పడితే రావు పిచ్చి వదిలే పరిహారం దొరికింది. "బావా, ఇదా సంగతి? చెప్తా నీ పని," అంటూ లోపలికి వెళ్ళాడు రఘు.


ఆరోజుటి పేపర్ తీసుకొని చదివినట్టు నటిస్తూ, "అనివార్య కారణాల వలన తెలుగులోనే మాట్లాడే పోటీలు రద్దు అయ్యాయి. లక్ష రూపాయలు బహుమతి కూడా రద్దయింది," గట్టిగా బయటకు చదివాడు రఘు.


ఒక్కసారిగా కుర్చీలో నుండి లేస్తూ, "షిట్... ఇలా జరిగిందా? ఎంత లాస్ నాకు! ఇన్నాళ్ళ ప్రాక్టీసు వృథా అయింది," డీలా పడ్డాడు రావు.


అంతకు ముందు వరకు తెలుగులోనే మాట్లాడిన రావు ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడడంతో నివ్వెరపోతూ చూసింది కనకం. ఏమిటి అన్నట్టుగా తమ్ముడి వైపు చూసింది. "పోటీ ఉందని, ఆ లక్ష రూపాయలకు మోజుపడి బావ పడిన తిప్పలు అక్క... బావ తెలుగులో అర్థం కాని మాటలు మాట్లాడి, తిప్పలు పడింది ఇందుకే," తేటతెల్లం చేశాడు రఘు. ఉరుముతూ భర్త వైపు చూసింది కనకం.


"అయినా ఏంటి బావ ఈ వరస? బహుమతి కోసమైతే తెలుగులో మాట్లాడుతావా? మామూలుగా అయితే తెలుగు వినడానికే ఇష్టపడవు కదా! ఇదేనా మీరు మాతృభాషకు ఇచ్చే విలువ?" నిట్టూర్చుతూ అక్కడ నుండి లేచాడు రఘు.


"అందుకేనా ఇలా తంటాలు పడి, మా తుక్కు రెగ్గొట్టారు..." రావు నిరాశను చూసి ఒక్కసారిగా నవ్వింది కనకం.


ఏం మాట్లాడాలో తెలియక అయోమయంగా తలగోక్కుంటూ, "నాన్‌సెన్స్!" అని విసవిస అక్కడి నుండి వెళ్ళిపోయాడు.


సమాప్తం


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


మళ్ళ కారుణ్య కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:


మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Malla Karunya Kumar

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్ అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Nagasuneetha Pokala
Nagasuneetha Pokala
13 minutes ago
Rated 5 out of 5 stars.

Baga chepparu

Like
bottom of page