top of page
Original.png

వీరోచిత తర్కం!


కంకంటి పాపరాజు శ్రీమదుత్తర రామాయణంలోని సుమాలి, మాలి, మాల్యవంతుల వీరోచిత తర్కాన్ని ప్రతిబింబించే దృశ్యం

Veerochitha Tarkam - Telugu Inspirational Article | Bhattu Venkata Rao

వీరోచిత తర్కం! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం| భట్టు వెంకటరావు

Published in manatelugukathalu.com on 03/09/2026


శ్రీమహావిష్ణువుతో యుద్ధం చేస్తే ఓటమి తప్పదని తెలిసినా సుమాలి–మాలి ఎందుకు వెనక్కి తగ్గలేదు? కంకంటి పాపరాజు ‘శ్రీమదుత్తర రామాయణం’లో వారి వాదన వెనుక కనిపించే వీరోచిత తర్కం ఆశ్చర్యపరుస్తుంది.


సృష్టి ఆరంభంలో బ్రహ్మచే సృష్టింపబడిన రాక్షసరాజు హేతి. ఈ హేతికి మనుమడైన మాల్యవంతుడు రాక్షసుల వంశమునకు మూలపురుషుడైనాడు. మాల్యవంతుడి తమ్ముళ్ళు సుమాలి, మాలి అనేవారు. వాళ్ళు పెట్టే బాధలు, చేసే హింసాకృత్యాలు భరించలేక, దేవతలు వెళ్ళి శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. శ్రీమహావిష్ణువు వారికి అభయమిచ్చి 'వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీమీ స్థానాలకు మీరు వెళ్ళిపోయి, నిశ్చింతగా ఉండండి!' అని వారిని పంపించేశాడు.


ఆ సంగతిని తెలుసుకున్న మాల్యవంతుడు, తన తమ్ముళ్ళను దగ్గరకు పిలుచుకుని 'దేవతలకు ఎప్పుడూ శ్రీమహావిష్ణువు అండగా ఉండి కాపాడుతూ ఉంటాడు. అతడు మహాబలవంతుడు. మనల్ని ఎలా గెలవాలో ఆయనకు తెలుసును.


క. హీనునితోఁ దగు రణము, స

    మానునితోఁ జేయఁదగు సమాధానము సం

    ధాన రణంబులు దగ వస

    మానునితోఁ దొలఁగి కొలిచి మనుటయె యొప్పున్. 

     (కంకంటి పాపరాజు, శ్రీమదుత్తర రామాయణము, ద్వితీయాశ్వాసం, 8)


తక్కవ బలవంతుడితో యుద్ధానికి దిగవచ్చు. సమానమైన బలం కలవాడితో సంధి చేసుకోవడం మంచిది. ఎక్కువ బలవంతుడితో ఈ రెండూ పనికి రావు. గౌరవంగా తలవంచి పక్కకు తప్పుకోవడం ఉత్తమం!' అని చెప్పి, శ్రీమహావిష్ణువుతో యుద్దం పెట్టుకుంటే నష్టపోతాం అని తమ్ముళ్ళను వారించే ప్రయత్నం చేశాడు. అప్పుడు, మాల్యవంతుడి తమ్ముళ్ళైన సుమాలి, మాలి, అన్నతో ఇలా విభేదించారు. 


మ. బలవంతుల్ భవదీయపుత్రకులు నీ భ్రాతల్ త్రిలోకైక వీ

    రులు నిన్ మృత్యువు దేఱి జూడ వెఱచున్ రుద్రాచ్యుతాంభోజ గ

     ర్భులు నీపే రనినన్ దలంకుదురు భీరుత్వంబు నీకేల నిన్

     దెలియన్ జాలక యానతిచ్చెదవు దైత్యేయాన్వయ గ్రామణీ. (ద్వితీయాశ్వాసం,18)


'అన్నా, నీ పుత్రులు బలవంతులు. నీ తమ్ముళ్ళు మహా వీరులు. ముల్లోకాలలో వాళ్ళకు తిరుగు లేదు, వాళ్ళను గెలవగలిగినవారు లేరు. మృత్యుదేవత కూడా నీ వంక తేరిపార చూడడానికి భయపడుతుంది. బ్రహ్మరుద్రాదులు, అచ్యుతుడు నీ పేరు వింటేనే భయపడతారు. అటువంటి నీకు ఇప్పుడు ఈ భీరుత్వం ఎలా పట్టుకుంది? నిన్ను నువ్వు సరిగా గుర్తించక, ఇలా మాకు కూడా భయాన్ని చెబుతున్నావు. 


మ. అరులన్ జంపు మటంచుఁ బందలయి యయ్యాదిత్యు లార్తిన్ గణిం

     చిరి పో సర్వసమానుఁడైన హరి ద్వేషిత్వంబుఁ దాఁ బూని యే

     కరణిన్ గయ్యము సేయవచ్చు మనతోఁ గ్రౌర్యంబుఁ గౌటిల్య మా

     హరికిన్ గల్గిన మాదృశుండతఁడు గాకాధిక్య మేమారయన్. (ద్వితీయాశ్వాసం, 20)


మా శత్రువులను సంహరించి మమ్మల్ని కాపాడమని, చేతగాని వాళ్ళ వలె, భీరువులై, దేవతలు వెళ్ళి మొరపెట్టుకున్నారు సరే, దానికి ఇరువురకూ సమానుడైన శ్రీహరి మనపై ద్వేషభావాన్ని పూని ఎలా యుద్ధానికి బయలుదేరతాడు? దేవతలు కోరినట్లుగా పక్షపాత బుద్ధితో వారి క్షేమాన్ని ఆశించి మనతో యుద్ధానికి వస్తే, ఇక మనకు శ్రీహరికి ఏమిటి తేడా? మన కంటే ఆయన అధికుడెట్లా అవుతాడు?


తే. సహజమాత్సర్యమున దేవసమితి తోడ

    మనము దొడరిన హరియేల మచ్చరించు

    నతఁడె నిష్కారణద్వేషి యయ్యెనేని

    సంధికార్యంబు వొసఁగునే సరసగతిని. (ద్వితీయాశ్వాసం, 21)


దేవతలకు మనకు ఎప్పటినుంచో వైరం ఉంది. ఆ వైరంతో మనం వాళ్ళను ఇబ్బందులు పెడితే, దానికి శ్రీహరి ఎందుకు కోపం తెచ్చుకోవాలి? ఆ సంగతిని మరిచిపోయి, తనంత తానుగా శ్రీహరి మనతో అకారణ ద్వేషం పెంచుకుంటే, సంధికార్యం ఎలా పొసుగుతుంది? 


తే. వెన్నునకు నస్మదాదుల మెన్నఁడైన 

    నపకృతి యొనర్ప మతఁడెన్నఁడైన మనకు

    జేయఁ డపకృతి వేల్పులు సేసిరింత

    వేలుపుల మీఁద నిఁక దండు వెడలవలయు. (ద్వితీయాశ్వాసం, 23)


'శ్రీహరికి మనమెప్పుడూ నేరుగా అపకారం తలపెట్టలేదు. అలాగే, శ్రీహరి కూడా మనకు తానుగా ఏ అపకృతీ చేయలేదు. దేవతలు చేశారు ఇదంతా. కాబట్టి వారి మీదికి యుద్ధానికి వెళ్ళాల్సిందే!' అన్నారు మాల్యవంతుడి తమ్ముళ్ళు.


చ. త్రిదశులతోడఁ గయ్య మొనరించి రమాపతి యస్మదాదులన్

    గదిసి రణం బొనర్చినను గాదన వచ్చునె? యంత భాగ్యము 

    న్నదె? యెటులైన మంచిది రణం బొనరింతము వేదశాస్త్రముల్ 

    సదివితి మీవు లిచ్చితిమి జన్నము లూనితి మైహికంబునన్. (ద్వితీయాశ్వాసం, 24)


‘దేవతలతో ఎప్పటిలానే ఇప్పుడూ యుద్ధానికి వెళదాం. అది చూసి కోపం తెచ్చుకున్న శ్రీహరి మనతో యుద్ధానికి దిగితే కాదనేది ఏముంది? శ్రీహరి మనతో స్వయంగా యుద్ధానికి రావడాన్ని మించిన భాగ్యం మనకు వేరే ఏముంటుంది? ఎలాగైనా మనకే మంచిది కదా. వేదశాస్త్రాలు చదివాం, ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేసి, ఎనలేని దానాలను ఎన్నింటినో ఇచ్చాం, యజ్ఞాలు చేశాం, ఇహంలో చేయాల్సినవైన అన్ని మంచిపనులూ మనం చేశాం.


తే. అన్న నీమాట జవదాఁటి యాడితిమని 

    యలుక సేయక ప్రతివాదములు క్షమించి 

    యనుమతియొసంగు మిపుడె మదాందుల దుసు

    ధాంధుల జయించి వచ్చెదమనుచు బలికె. (ద్వితీయాశ్వాసం, 25)


అన్నా, నీమాటను కాదన్నామని కోపం తెచ్చుకోవద్దు. నీ మాటకు విరుద్ధంగా మేము చేసిన వాదనను మన్నించు. దేవతలతో యుద్ధానికి సమ్మతించు. మదాంధులైన ఆ దుష్టులను ఎప్పటిలానే యుద్ధంలో జయించి, విజయులమై తిరిగివస్తాం!' అని చెప్పి, మాల్యవంతుడిని ఒప్పించి దేవతలతో యుద్ధానికి భూనభోంతరాలు దద్దరిల్లే భేరీనాదాలతో దండువెడలారు దానవులు.


బ్రహ్మ కూడా వాళ్ళను వారించలేకపోయాడని ఇలా చెప్పాడు కంకంటి పాపరాజు:


తే. చెవులలో వ్రేళులునిచి రాజీవగర్భుఁ

    డిచ్చ నేమియు ననలేక ఱిచ్చపడఁగ

    మించి ప్రస్థాన భేరి వేయించి దండు

    వెడలి రసురులు జేజేలవీటిమీఁద. (ద్వితీయాశ్వాసం, 28)


ఆ భేరీవాయిద్యాల శబ్దానికి తట్టుకోలేక బ్రహ్మదేవుడు చెవులలో గట్టిగా వేళ్ళు పెట్టుకుని, వాళ్ళను ఏమీ అనలేక చూస్తూ వ్యాకులపడి ఉండిపోయాడట!

*** 


తెలుగు సంప్రదాయ సాహిత్యంలో ప్రసిద్ధ కవులలో ఒకడైన కంకంటి పాపరాజు రచించిన ‘శ్రీమదుత్తర రామాయణం’ కావ్యంలోని ద్వితీయాశ్వాసంలో కనిపించే పై విశ్లేషణ అసమంజసమైనదిగా తోచదు.


‘దేవతలు, దానవులు అన్నదమ్ములు. బలాబలాల నిరూపణకై వాళ్ళ మధ్య తగాదాలు, యుద్ధాలు పరిపాటిగా జరుగుతుండేవి. అయితే అందులో దెబ్బలు తిని భంగపడడం ఎక్కవసార్లు దేవతల వంతు అవుతూ ఉండేది. అలా యుద్ధంలో తగిలిన దెబ్బలను చూపించి, మొరపెట్టుకోగానే, ఇరుపక్షాలవారికి సమానుడుగా ఉండవలసిన శ్రీహరి, ఈ జగడాలలో తలదూర్చి దేవతల పక్షం వహించడం ఏం న్యాయం?’ అన్న మాల్యవంతుడి తమ్ముళ్ళిద్దరి విశ్లేషణలో న్యాయం లేదని అనడానికి వీలులేదని అనిపిస్తుంది. ‘అలా మనపై అకారణ వైరం పెట్టుకుని, యుద్ధానికి వస్తే రానీ! శ్రీమహావిష్ణువు చేతిలో మరణించడం కంటె మనకు కావలసినది మాత్రం ఏముంది!’ అన్న సుమాలి, మాలి మాటలలోని తర్కం వీరోచితమైనదిగా కనపడుతుంది.


(సమాప్తం)


గమనిక: ఈ వ్యాసం కంకంటి పాపరాజు రచించిన శ్రీమదుత్తర రామాయణంలోని కొన్ని పద్యాలు, పాత్రల సంభాషణలు మరియు వాటిలో వ్యక్తమయ్యే తర్కాన్ని సాహిత్య కోణంలో విశ్లేషిస్తుంది. ఇందులో పేర్కొన్న అభిప్రాయాలు పాత్రల వాదనలు మరియు రచయిత సాహిత్య విశ్లేషణకు సంబంధించినవి మాత్రమే; ఏ మత విశ్వాసాన్నీ లేదా ఆరాధ్య దైవాన్నీ కించపరచడం ఉద్దేశం కాదు.


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



భట్టు వెంకటరావు గారి కొన్ని ఇతర రచనలు:



భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: భట్టు వెంకటరావు


భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 


నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.


ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!

నమస్కారములతో,


భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page