కృష్ణ లీలలు మరియు కృష్ణ తత్వం
- Rayapureddy Sathyanarayana
- 16 hours ago
- 5 min read
Krishna Leelalu Mariyu Krishna Tatvam - Telugu Devotional Article | R C Kumar
కృష్ణ లీలలు మరియు కృష్ణ తత్వం - తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | ఆర్ సి కుమార్
Published In manatelugukathalu.com On 03/09/2026
వెన్న దొంగతనం, కాళీయ మర్దనం, గోవర్ధనగిరిని ఎత్తడం... శ్రీకృష్ణుని ఈ లీలలను కేవలం కథలుగానే చూడాలా?వాటి వెనుక భక్తి సంప్రదాయంలో చెప్పబడే అంతరార్థాన్ని తెలుసుకుంటే ‘కృష్ణ తత్వం’ మరో కోణంలో దర్శనమిస్తుంది.
కృష్ణ లీలలు, కృష్ణ తత్వం అనేవి రెండూ శ్రీకృష్ణుని జీవితం, ఆయన అవతార సందేశానికి సంబంధించినవే అయినప్పటికీ, వాటి మధ్య స్పష్టమైన తేడా ఉంది. సరళంగా చెప్పాలంటే కృష్ణ లీలలు అనేది కృష్ణుడి బాహ్య రూపం మరియు ఆయన చేసిన పనులు , కాగా కృష్ణ తత్వం అనేది ఆ పనుల వెనుక ఉన్న అంతరార్థం మరియు పరమాత్మ జ్ఞానం. కృష్ణ లీలలు, కృష్ణ తత్వం అర్థమైన వాళ్లు ఆయనను ఒక జగన్నాటక సూత్రధారిగా తెలుసుకుంటారు. కృష్ణ తత్వం సరిగ్గా అర్థం చేసుకోలేని అజ్ఞానులకు ఆయన ఒక మాయావిలా, కపట నాటక సూత్రధారిలా అనిపిస్తాడు. విలక్షణమైన వైరుధ్యాలతో మంచి కోసమే మాయలు చేసే గమ్మత్తయిన వ్యక్తిత్వం కాబట్టే కృష్ణుడంటే అందరికీ అంత ఆకర్షణ. శ్రీకృష్ణుడు కర్మయోగి, ధర్మయోగి, జ్ఞానయోగి. ఆయన లీలన్నింటిలో కృష్ణతత్వం ఇమిడి ఉంటుంది.
శ్రీకృష్ణుడు అంటేనే ఆనంద తత్వం, ప్రేమ తత్వం, స్నేహ తత్వం, ప్రకృతి తత్వం, నాయకత్వం. కృష్ణ తత్వాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేసిన విషయం బోధపడుతుంది. చేసిన అన్ని పనులలోను అర్ధం, పరమార్ధం అంతర్లీనంగా గోచరిస్తుంది. గోపబాలురతో ఆడిపాడడం, గోవర్ధనగిరిని కొనగోటితో ఎత్తడం, భారతాన్ని బాధ్యతగా నడిపించడంలో ఆయన వేసిన ప్రతి అడుగూ మానవజీవితానికి దిశా నిర్దేశం చేసేదే. యశోదమ్మతో ముద్దు ముద్దు మాటలు చెప్పడం, గోపికల ఇళ్లలో వెన్న దొంగిలించడం వంటివి భక్తులకు అమితమైన ఆనందాన్ని ఇస్తాయి. ఒక హిందీ సినిమా పాటలో 'యశోవతి మయ్యా సే బోలే నందలాల, రాధా క్యూ గోరీ, మై క్యూ కాలా' అని ప్రశ్నించడంలో చిన్నపిల్లల్లో సహజంగా ఉండే సందేహం, అమాయకత్వంతో కూడిన మాటలు మనల్ని మైమరిపిస్తాయి.
ధర్మ పరిరక్షణలో, ధర్మ సంస్థాపనలో కృష్ణ పరమాత్మ ఎటువంటి పక్షపాతం చూపలేదు, రాగద్వేషాలు అంతకన్నా కానరావు. మానవ కళ్యాణం కోసం బంధువులని కూడా విడిచి పెట్టలేదని కంసుడు మరియు శిశుపాలుడి వధ ద్వారా తెలుస్తుంది. కృష్ణ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే ఆయన పోషించిన వివిధ పాత్రల్లోని పరమార్ధాన్ని గ్రహించగలిగాలి. చిలిపి బాలుడిగా, పశువుల కాపరిగా, రాధా మనోహరుడిగా, గోపికల మనసు దోచుకున్న వాడిగా, అష్ట మహిషుల ప్రభువుగా, యాదవ రాజుగా, పాండవ ధర్మపక్షపాతిగా, పార్థసారథిగా, భగవద్గీత ప్రభోధకుడిగా, రాజనీతిజ్ఞుడిగా, దేవదేవుడిగా ఆయన వ్యక్తిత్వం, దైవత్వం కళ్ళకు కట్టినట్టుగా గోచరిస్తుంది. కృష్ణుడి లీలలను కేవలం కథలుగా చూస్తే అది వినోదం, కాలక్షేపం మాత్రమే అవుతుంది. కానీ, ఆ లీలల వెనుక ఉన్న కృష్ణ తత్వాన్ని గ్రహించినప్పుడే భగవంతుని పూర్ణ స్వరూపం మనకు అర్థమవుతుంది. ఆ లీలల వెనుక దాగి ఉన్న అసలు సత్యం, జ్ఞానాన్ని బుద్ధితో, హృదయంతో అర్థం చేసుకుంటేనే అందులోని ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో తెలుస్తుంది.
శ్రీకృష్ణుడు చేసే ప్రతి కార్యం వెనుక బలమైన కారణం ఉంటుంది. దాన్ని తెలుసుకుంటే కృష్ణ తత్వం వంటబట్టినట్టే. అనంతమైన కృష్ణ లీలల్లో కొన్నింటిని పరిశీలిద్దాం.
1. చీరలను దోచుకొని గోపికల దేహచింతలను తీర్చాడు, చీరలు ఇచ్చి నిండు సభలో ద్రౌపతి మానాన్ని కాపాడాడు. గోపికల వస్త్రాల అపహరణలో అంతరార్థం ఏమిటంటే భగవంతుడిని చేరుకోవాలంటే అహంకారం, మోహం, లజ్జ అనే బంధాలను (వస్త్రాలను) వదిలేసి, ఆత్మ సమర్పణ చేయాలి.
2. గోపాలుడు అంటే గోవులను పాలించిన వాడు, గోసంరక్షకుడు. ఇక్కడ గోవులు అంటే జీవులు. జీవుల సంరక్షకుడే శ్రీకృష్ణుడు.
3. గోపికలు ఎవరు? కృతయుగంలో ఋషులు. ఆ కాలంలో వారికి భగవంతుడి దర్శన భాగ్యమే కలిగింది. రాముడితో సన్నిహితంగా గడపాలన్న వారి కోరిక ఆ యుగంలో తీరలేదు. ద్వాపర యుగంలో దర్శన, స్పర్శన, సంభాషణా భాగ్యాలను పొందిన ధన్యజీవులు గోపికలు.
4. శ్రీకృష్ణుడు దొంగిలించినది వెన్నకాదు. గోపికల హృదయాలలోని పవిత్రమైన ప్రేమ. గోపికలు చిలికింది పెరుగుకాదు. వాళ్ళ మనసుల్ని కృష్ణుడి నామస్మరణతో చిలికి, భగవదనుగ్రహం అనే వెన్న పొందారు.
5. పెరుగుతో తడుపుకున్న పాదముద్రల ఆధారంగానే కృష్ణుణ్ణి గోపికలు పట్టుకోగలిగారు. అంటే భగవంతుని పాదాలు పట్టుకుంటే, భగవదనుగ్రహం తప్పక దొరుకుతుందని దాని అంతరార్థం. శరణాగతి చేయడం అంటే అదే.
6. ప్రకృతిని (గోవులను, కొండలను) పూజించాలని, ఇంద్రుడి వంటి దేవతల అహంకారాన్ని అణచాలని చెప్పడానికి గోవర్ధనగిరిని పైకెత్తడం. అలాగే భగవంతుడు తన భక్తులను చిటికెన వేలితోనైనా రక్షిస్తాడనే నమ్మకాన్ని కలిగించడం.
7. ఇక కాళీయ మర్దనంలో ఉన్న మడుగు సంసారానికి ప్రతీక. కాళీయుడు అనే భయంకరమైన పాము లౌకిక వాంఛలతో ఉన్న మనిషికి గుర్తు. శిరస్సుపై కాళీయ మర్ధన చేయగానే విషమంతా బయటకువచ్చింది. కాబట్టి సంసారమనే మడుగులో లౌకిక వాంఛలతో కూరుకు పోయే మానవులను ప్రక్షాళన చేసి ఉద్ధరించడమే కాళీయ మర్దనం.
8. శ్రీకృష్ణుడు స్త్రీలోలుడు కాదు, స్త్రీ సంరక్షకుడు. ఆయనకు ఒకరా ఇద్దరా, 16000 మంది భార్యలు అని కొందరు తేలిగ్గా మాట్లాడవచ్చు. కానీ నరకాసురుడి బారి నుంచి కాపాడి సంరక్షణ కలిగించడానికి మాత్రమే వారిని భార్యలుగా స్వీకరించాడు తప్ప వాళ్లతో వైవాహిక, శారీరక సంబంధం కోసం కాదు.
9. నిజమైన స్నేహితానికి చిరునామా కృష్ణ పరమాత్మ. స్నేహానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన గౌరవం అపారం. ఆయన జీవితంలో అర్జునుడు, ఉద్ధువుడు, సుధాముడు అనే ముగ్గురు మిత్రుల స్నేహం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.
10. గీతా బోధకుడై మానవ జీవితానికి దిశా నిర్దేశం చేసిన జగద్గురువు కృష్ణ పరమాత్మ. ఆనాటికి, ఈనాటికి, ఏనాటికి భగవద్గీతను మించిన వ్యక్తిత్వ వికాస పాఠం (personality development lesson) మరొకటి లేదని పాశ్చాత్తులు కూడా అంగీకరించారు. అందుకే భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, అనుష్టాన గ్రంథం.
కృష్ణుడు అవతరించిన సమయానికి లోకంలో పరిస్థితులు విషమంగా ఉన్నాయి. కంస, జరాసంధ, కాలయవన, నరకాసుర, శిశుపాల దుర్యోధనాది దుష్టశక్తుల చేతుల్లో అధికారం, సంపద కేంద్రీకృతమై ఉన్నాయి. ధర్మం, నీతి, భద్రత, ప్రశాంతత, లేక ప్రజలు నానా అగచాట్లకు లోనవుతున్న సమయం అది. రాజ్యం చిన్నచిన్న ముక్కలుగా చీలిపోయి, సమాజం దారి తప్పి అధర్మం పెచ్చు పెరిగిపోయింది.
ఆ దశలో కృష్ణ పరమాత్మ దశలవారీగా శిష్టరక్షణ దుష్ట శిక్షణ చేసి సుపరిపాలనా వ్యవస్థను సుస్థిర పరిచి చివరగా ధర్మరాజుకి నాయకత్వం అప్పగించాడు. అందుకే .. "యధా యధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత" అన్నారు కృష్ణ పరమాత్మ. ధర్మం నశించి, అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను అంటూ తన అవతార నేపథ్యాన్ని వెల్లడించారు.
కాబట్టి కృష్ణ లీలలు అనేవి ఒక అందమైన పూలమాల అయితే, కృష్ణ తత్వం అనేది ఆ పూలమాలలో దాగి ఉన్న దారం. లీలల ద్వారా కృష్ణుడిని ప్రేమించవచ్చు, తత్వం ద్వారా కృష్ణుడిలోనే ఐక్యం కావచ్చు
“లోకాసమస్తా సుఖినోభవంతు”
జై శ్రీకృష్ణ, జైజై శ్రీకృష్ణ
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
ఆర్ సి కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త










Comments