కాల గణన, సహస్రపూర్ణ చంద్రదర్శన భాగ్యం
- Rayala Sreeramachandra Kumar

- 24 hours ago
- 5 min read
Kala Ganana, Sahasrapurna Chandradarsana Bhagyam - Telugu Devotional Article | R C Kumar
కాల గణన, సహస్రపూర్ణ చంద్రదర్శన భాగ్యం - తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | ఆర్ సి కుమార్
Published In manatelugukathalu.com On 03/09/2026
కాల గణన, సహస్రపూర్ణ చంద్రదర్శన భాగ్యం
వేదాలలో ఖగోళ శాస్త్రం ఒక ముఖ్యమైన భాగం. ఆధునిక సైన్స్ కనుగొంటున్న ఎన్నో విశ్వ రహస్యాలను వేల సంవత్సరాల క్రితమే వేదాలు శ్లోకాల రూపంలో వివరించాయి. వేదాలలో చెప్పబడిన జ్యేష్టా నక్షత్రం అంటే పెద్ద నక్షత్రం అనే విషయాన్ని టెలిస్కోప్ ద్వారా 2017లో నాసా గుర్తించింది. వేదాలలో ప్రస్తావించబడిన మరికొన్ని ముఖ్యమైన ఖగోళ రహస్యాలు ఏమిటంటే 27 నక్షత్రాలు , 12 రాశులు ఉండే విషయాన్ని, చాంద్రమానం, సూర్యమానం ప్రకారం కాల గణన పద్ధతులను వేదాల ఆధారంగానే రూపొందించారు. నక్షత్రాలన్నీ 12 రాశులలోనే భాగమై ఉంటాయి.
ఆధునిక సైన్స్ ప్రకారం భూమి గుండ్రంగా ఉంటుందని క్రీ.పూ. 500 లో పైథాగరస్ ప్రతిపాదించే వరకు ఆ విషయం ఈనాటి ప్రపంచానికి తెలియదు. కానీ వేల సంవత్సరాల క్రితమే భూమి గోళాకారంలో ఉందనే విషయాన్ని ఋగ్వేదం స్పష్టం చేసింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ (ఆత్మ భ్రమణం), సూర్యుని చుట్టూ తిరుగుతోందని (పరిభ్రమణం) వేద కాలంలోనే గుర్తించారు.
సూర్యుడు ప్రకాశవంతంగా ఉండి, తన గురుత్వాకర్షణ శక్తితో భూమితో సహా ఇతర గ్రహాలను తన చుట్టూ పడిపోకుండా తిప్పుకుంటున్నాడని ఋగ్వేదం పేర్కొంది. విశ్వంలో ఏ వస్తువు కూడా ఒకే చోట స్థిరంగా ఉండదు. సూర్యుడు కూడా తన అక్షం మీద తన చుట్టూ తాను తిరుగుతాడు. అయితే, సూర్యుడు భూమిలా ఘనపదార్థం కాదు, అది వాయువులతో కూడిన ప్లాస్మా గోళం. చంద్రుడికి స్వయం ప్రకాశకత్వం లేదు. చంద్రుడిపై పడే సూర్యకాంతి తిరిగి భూమిపైకి పరావర్తనం (Reflection) చెందడం వల్లే చంద్రుడు వెలుగుతున్నట్లు కనిపిస్తాడు. ఒక విధంగా అద్దం లాంటి పనితీరు కనబడుతుంది. మనసుకు అధిపతి అయిన చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి, భూమి చుట్టూ తిరగడానికి ఒకే సమయం పడుతుంది (27.3 రోజులు)
ఈ నేపథ్యంలో సహస్ర పూర్ణ చంద్ర దర్శనం అంటే వెయ్యి సార్లు చంద్రుడిని వీక్షించడం ఎప్పుడు పూర్తి అవుతుంది అనే విషయాన్ని శాస్త్ర ప్రమాణంగా పరిశీలించుకుందాం. నెలకు ఒకటి లెక్కన ప్రతి సంవత్సరం 12 పున్నములు ఉంటాయి. కాబట్టి 80 సంవత్సరాలలో (80×12) = 960 పున్నములు వస్తాయి.
చాంద్రమానం ప్రకారం ప్రతి ఐదేళ్లకు రెండు అధిక మాసాలు వస్తాయి. కాబట్టి దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే సహస్ర పూర్ణ చంద్ర దర్శనం ఎప్పుడు పూర్తవుతుందనేది ఆసక్తికరమైన విషయం. సాధారణంగానే కరువు కాలంలో ప్రజలు తిండికి, నీళ్లకు నానా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి కష్టకాలంలో మరో నెల అదనంగా వస్తే, ఖర్చులకు సొమ్ము సర్దుబాటు చేయడం మరింత కష్టమవుతుంది. కనుకనే 'కరువు కాలంలో అధిక మాసం' అనే సామెత పుట్టుకొచ్చింది.
పాండవుల 12 ఏళ్ల అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం ముగింపు సమయంలో తలెత్తిన ఇలాంటి వివాదం ఆ సమయాన్ని లెక్కించే విధానం చుట్టూ తిరిగింది. విరాట రాజు గోవులను కౌరవులు అపహరించినప్పుడు, ఆ రాజు కొలువులో బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు గాండీవాన్ని చేతబట్టి యుద్ధరంగానికి వస్తాడు. ఆ ఉత్తర గోగ్రహణ యుద్ధంలో అర్జునుడిని చూడగానే దుర్యోధనుడు సంతోషపడిపోయి, అజ్ఞాతవాసం ముగియకముందే పాండవుల ఉనికి బయటపడింది కాబట్టి, నిబంధనల ప్రకారం వారు మరో 13 ఏళ్లు వనవాసం చేయాలని వాదిస్తాడు.
దుర్యోధనుడు మరియు అతని అనుచరులు సౌర మానం ప్రకారం కాలగణన చేశారు. ఆ లెక్కల ప్రకారం, పాండవుల 13 ఏళ్ల గడువు పూర్తి కావడానికి ఇంకా కొన్ని రోజులు (దాదాపు 13 రోజులు) సమయం మిగిలి ఉంది. ఆ గడువు తీరకముందే అర్జునుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి పాండవులు షరతును ఉల్లంఘించారని దుర్యోధనుడు పేచీ పెడతాడు.
ఈ సమస్యకి కురువృద్ధుడైన భీష్మాచార్యుడు శాస్త్రబద్ధమైన సమాధానమిచ్చి వివాదాన్ని పరిష్కరించాడు. ఇందాక చెప్పుకున్నట్టు చాంద్రమానం ప్రకారం ప్రతి ఐదేళ్లకు రెండు అధిక మాసాలు వస్తాయి. ఆ లెక్కన 13 ఏళ్ల కాలంలో 5 నెలల 12 రోజులు అదనంగా వచ్చాయి. చాంద్రమానాన్ని పరిగణనలోకి తీసుకుంటే, పాండవుల 13 ఏళ్ల వనవాస నియమం అప్పటికే పూర్తయ్యింది.
ఒక చాంద్ర మాసం సగటున 29.5 రోజులు ఉండటం వల్ల, ఒక చాంద్రమాన సంవత్సరం మొత్తం 354 రోజులు మాత్రమే ఉంటుంది. ఇది సౌర సంవత్సరం (365 రోజులు) కంటే సుమారు 11 రోజులు తక్కువ. కాబట్టి అర్జునుడు గడువు ముగిసిన తర్వాతే ధర్మబద్ధంగా గాండీవాన్ని ధరించాడని భీష్ముడు స్పష్టం చేశాడు. భీష్మ పితామహుడు అధికమాసంపై ఇచ్చిన వివరణతో సద్దు మణిగింది.
1000 పున్నముల లెక్క తీస్తే ప్రతి సంవత్సరం నెలకు ఒకటి లెక్కన 12 పున్నములు ఉంటాయి. కాబట్టి 80 సంవత్సరాలలో 80×12= 960 పున్నములు వస్తాయి. ఇక్కడే తేడాను గమనించాలి, ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు 2 అదనపు పున్నములు ఉంటాయి. వీటిని బ్లూమూన్స్ అని పిలుస్తారు. బ్లూమూన్ అంటే.. అదేదో బ్లూ కలర్ లో ఉండే పున్నమి కాదు. మామూలు పౌర్ణమి రోజున కనిపించే ఫుల్ మూన్ మాత్రమే. కాకపోతే ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తే, రెండో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. ఆ విధంగా ఒకే నెలలో రెండు పౌర్ణమిలు రావడానికి కారణం చాంద్రమానం మరియు సౌరమానం మధ్య ఉన్న వ్యత్యాసమే.
భూమి తన అక్షం చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. దీనివల్లే కదా భూమిపై పగలు మరియు రాత్రులు ఏర్పడేది. మరి చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం సుమారు 27.32 రోజులు. దాన్ని నక్షత్ర మాసం (పౌర్ణమి నుంచి పౌర్ణమి) అంటారు. కానీ గ్రెగేరియన్ అనబడే ఒక క్యాలెండర్ నెలలో 30 లేదా 31 రోజులు ఉంటుంది. ఈ వ్యత్యాసం వల్ల కొన్నిసార్లు ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తాయి, రెండో పౌర్ణమిని "బ్లూ మూన్" అంటారు. ఆ విధంగా ఈ సంవత్సరం మే నెలలో బ్లూ మూన్ వచ్చింది. మొదటి పౌర్ణమి మే 1న, రెండో పౌర్ణమి మే 31న వచ్చింది.
ఇప్పుడు 80 సంవత్సరాల వయసు వచ్చే సరికి ఎన్ని పున్నమిలు వస్తాయో లెక్క పెడదాం. ప్రతి 5 సంవత్సరాలకు 2 అదనపు పున్నములు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా ! అంటే 80 సంవత్సరాలకు ఎన్ని అదనపు పున్నమిలు వస్తాయి ? (80÷5=16×2=32 + 960= 992) ఈ విధంగా 80 సంవత్సరాల వయస్సులో ఒక వ్యక్తి మొత్తం 992 పున్నములను చూస్తాడు. మరి 1000 ఎప్పుడు అవుతుంది ? మరొక 8 నెలల్లో 8 పౌర్ణములను కూడా చూసేస్తే 80 సంవత్సరాల 8 నెలల్లో 1000 పున్నమిలు పూర్తి అవుతాయి. ఆ రకంగా సహస్ర పూర్ణ చంద్ర దర్శన భాగ్యం కలగడానికి 80 సంవత్సరాల 8 నెలలు పూర్తి కావాలి.
చాంద్రమాన సంవత్సరంలో 354 రోజులు ఉంటాయి, అయితే సౌరమాన సంవత్సరంలో 365.25 రోజులు ఉంటాయి. రెంటికి 11 నుంచి 15 రోజుల తేడా వస్తుంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికే అధికమాసాలు వస్తాయి. ఈ తేడాను సరిచేయడానికి, చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అదనంగా జోడించడాన్ని అధికమాసం అంటారు. ఒక చాంద్రమాసంలో సూర్యుడు ఏ రాశిలోనూ ప్రవేశించకుండా ఉన్నప్పుడు, ఆ నెలకు అధికమాసం వస్తుంది.
చాంద్రమానంలో ఒక నెలకు సుమారు 29.53 రోజులు ఉంటాయి. అధికమాసం సుమారుగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది (32 లేదా 33 నెలలకు ఒకసారి). ఋతువుల సమతుల్యతను దెబ్బతినకుండా ఉంచడానికి, ఈ కాల వ్యత్యాసాన్ని సరిచేయడానికి రెండున్నర ఏళ్లకు ఒకసారి క్యాలెండర్‌లో ఒక నెలను అదనంగా కలపడాన్నే అధిక మాసం అంటారు.
సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే గమనాన్ని ఆధారంగా చేసుకుని లెక్కించే పద్ధతిని సౌరమానం అంటారు. తమిళనాడు, కేరళ, ఒడిస్సా, అస్సాం, బెంగాల్, పంజాబ్, హర్యానా, త్రిపుర, మణిపూర్ వంటి రాష్ట్రాలు సూర్యుని కదలికల ఆధారంగా పనిచేసే సౌరమాన క్యాలెండర్‌ను పాటిస్తాయి. ఆ లెక్కల ప్రకారం ఏడాదికి 365 రోజులు ఉంటాయి కాబట్టి వారికి అధికమాసం ఉండదు. రోజులను సర్దుబాటు చేయాల్సిన అవసరమూ ఉండదు.
చంద్రుని తిథుల ఆధారంగా కాలాన్ని లెక్కించే పద్ధతిని చాంద్రమానం అంటారు. ఈ విధానాన్ని అనుసరించే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ & రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ఒక విషయం గమనించాలి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు పండగలను, తిథులను చాంద్రమానం ప్రకారం లెక్కించినప్పటికీ, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే గమనాన్ని బట్టి ప్రత్యేకించి సంక్రాంతి పండగను మాత్రం సౌరమానం ప్రకారమే జరుపుకుంటారు.
***
గమనిక / Disclaimer
ఈ వ్యాసంలో పొందుపరిచిన వేదాలు, పురాణాలు, మహాభారతం, చాంద్రమానం, సౌరమానం, అధికమాసం, సహస్రపూర్ణ చంద్రదర్శనం తదితర అంశాలకు సంబంధించిన వివరాలు రచయిత అధ్యయనం, సంప్రదాయ విశ్వాసాలు మరియు అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి ఇవ్వబడ్డాయి. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కొన్ని కాలగణనలు, చారిత్రక లేదా వేద సంబంధమైన వ్యాఖ్యానాల విషయంలో భిన్న అభిప్రాయాలు, పద్ధతులు ఉండవచ్చు. ఈ వ్యాసం సమాచార మరియు అవగాహన ప్రయోజనాల కోసం మాత్రమే. ఇందులోని అంశాలను శాస్త్రీయ లేదా చారిత్రక పరిశోధనలకు తుది ప్రమాణంగా పరిగణించరాదు.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
ఆర్ సి కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త










Comments