top of page
Original.png

వెలుగు - పార్ట్ 2


వెలుగు పార్ట్ 1 తెలుగు కుటుంబ కథలో శాంతి, సత్య దంపతుల మధ్య తీవ్ర మనస్పర్ధలు, మధ్యలో బాధగా ఉన్న ఐదేళ్ల ఆర్య

Velugu - Part 2 - Telugu Family Story | Bhaskara Rao B. R. K. V.

వెలుగు - పార్ట్ 2 తెలుగు కుటుంబ కథ | బి ఆర్ కె వి భాస్కర రావు

Published in manatelugukathalu.com on 01/09/2026


భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాలు వారిద్దరితోనే ముగిసిపోవు. వాటి ప్రభావం వారి పిల్లల మనసులపై కూడా లోతైన ముద్ర వేయవచ్చు. ‘వెలుగు – పార్ట్ 2’ కథలో శాంతి, సత్యల మధ్య పెరిగిన దూరం వారి కుమారుడు ఆర్య జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో రచయిత బి.ఆర్.కె.వి. భాస్కర రావు భావోద్వేగంగా ఆవిష్కరించారు. వివాహ బంధంలోని బాధ్యత, తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ ఐక్యత విలువను గుర్తుచేసే సందేశాత్మక తెలుగు కుటుంబ కథ ఇది.



"ముమ్మాటికీ తప్పే! పెళ్ళి అయిన ఆడదానికి భర్తే సర్వస్వం. అతని తోటే స్వర్గం, నరకం."


"నా పుట్టుకకు కారణమైన తండ్రికి నేను చేసే సేవ, కృతజ్ఞతలు తెలపడమే తప్ప మిమ్మల్ని అవమానించడం కాదు, దయచేసి అర్థం చేసుకోండి." గద్గద స్వరంతో శాంతి అన్న మాటలు లెక్కచేయని సత్య, విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు.


శాంతి నిస్త్రాణంగా సోఫాలో కూర్చుండిపోయింది. ఇదంతా ఆర్య వేరే గదిలోంచి తొంగి చూస్తూ గమనిస్తున్నాడు.


తెల్లారి లేచినా భార్యాభర్తల మధ్య మాటలు లేవు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆర్యను రోజువారీగానే స్కూలుకు పంపింది, ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు లేకుండానే.


ఇదిజరిగిన నెల రోజుల తర్వాత ఒక అనూహ్య సంఘటన జరిగింది.


ఓ రోజు రాత్రి పది గంటల సమయానికి హాల్లో చప్పుడు అయ్యేసరికి, తన గదిలోంచి లేచి బయటకు వచ్చిన శాంతి ఒక్కసారిగా నివ్వెరపోయింది.

సత్య తాగేసి ఒళ్ళు తెలియని స్థితిలో ఒక అమ్మాయిని తీసుకుని తన గదిలోకి వెళ్తున్నాడు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఒక్క ఉదుటన వెళ్ళి శాంతి ఆ అమ్మాయిని పక్కకు గెంటేసింది.


"నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే దానికి సారీ చెప్పు, లేదా నువ్వే బయటకు పో" అన్నాడు సత్య తూలుతూ.


"నేను ఎందుకు సారీ చెప్పాలి? ఇటువంటి తప్పుడు పని చేసినందుకు నువ్వే సారీ చెప్పాలి" అంది కోపంగా శాంతి.


వెంటనే మహోగ్రంగా వెళ్లి శాంతి చెంపపై కొట్టాడు. శాంతి కూడా చెయ్యిత్తి ఆగిపోయింది.


ఆ రాత్రంతా ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఆర్య బయటకు వచ్చి విషయం అర్థం కాక ఏడుస్తూ చూస్తూ ఉండిపోయాడు.


మరునాటి ఉదయం మారుతీరావును కబురు పంపి, జరిగిందానిలో తన కొడుకు తప్పు లేనట్టుగా చెప్పి, జమీందారుల ఇళ్లల్లో ఇవి సర్వసాధారణమని, చూసి తలవంచుకుపోవాలే తప్ప ఎదురు ప్రశ్న వేయడం మానాలని, ఒకవేళ అలా ఉండటం ఇష్టం లేకపోతే మీ అమ్మాయిని తీసుకుపోవచ్చునని తెగేసి చెప్పేసరికి మారుతీరావు మాట రాక స్థాణువై కూతురు వైపు చూశాడు.

"అంత కుక్కిన పేనులా పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు. అయినా, ఒకరి ఎంగిలి అన్నం నాకు అవసరం లేదు. నేను విడాకులు ఇచ్చేస్తాను. నాన్నా! మీరు వెళ్ళిపోండి. నేను ఇక్కడే ఉండి పోరాడుతాను." ఆత్మవిశ్వాసంతో కూతురు చెప్పిన మాటలు విన్న మారుతీరావు, శాంతిని మరోసారి ఆలోచించమన్నా ఆమె వినలేదు.


రెండు నెలల తర్వాత తిరిగి కోర్టులో హాజరయ్యారు దంపతులిద్దరు.


"ఏమి ఆలోచించుకున్నారు?" అని జడ్జి ప్రశ్నించేసరికి ఇద్దరూ తలలు వంచుకున్నారు, తమ నిర్ణయంలో మార్పు లేనట్టుగా.


జడ్జి గట్టిగా నిట్టూర్చి, "కలసి ఉంటే కలదు సుఖమని మన పూర్వీకులు అన్నదమ్ముల గురించే కాదు, భార్యాభర్తల గురించి కూడా చెప్పారు. మీలో మార్పు రానందుకు బాధపడుతూ, మీ అబ్బాయికి పద్దెనిమిదో సంవత్సరం వచ్చేవరకు మీరు విడాకులు తీసుకోకూడదు. ఎందుకంటే, ఎవరి దగ్గర ఇతను ఉండాలో కోర్టు చెప్పదు. 


ఇంకా ఊహ తెలియని ఈ బాబు, ఓటు హక్కు వచ్చేసరికి తనను పాలించే వారు ఎవరైతే తన భవిష్యత్తు బాగుంటుందోనని ఆలోచించి ఓటు వేస్తాడు. మరి అలాంటప్పుడు తాను ఎవరి దగ్గర ఉండాలో కూడా నిర్ణయించుకోగల తెలివితేటలు కూడా వస్తాయని నా ఉద్దేశ్యం. కనుక మీ బాబుకు ఓటు హక్కు వచ్చేవరకు కలసి ఉండి, తిరిగి అప్పుడు రండి" అని చెప్పేసరికి ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు.


కాలాప్రవాహంలో పదమూడేళ్లు గడచిపోయాయి.

శాంతి, సత్యలు తిరిగి కోర్టుకు వచ్చారు. అప్పటికి పాత జడ్జి మారి కొత్త జడ్జి వచ్చాడు. వీరి కేసు అంతా స్టడీ చేసి, ముందుగా తాను విచారించాల్సింది ఆర్యను అని చెప్పి అతన్ని పిలిపించి ఈ కేసుపై తన ఉద్దేశ్యాన్ని తెలపమన్నాడు.


"నన్ను వెంటనే ఉరి తీయండి సార్."


కోర్టు హాలంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయ్యింది.

కొన్ని నిమిషాల తర్వాత, "సార్, నేను బ్రతికి ఉండటం వల్లనే మా అమ్మానాన్నలు స్వేచ్ఛాజీవులు కాలేకపోతున్నారు. వాళ్లకు అడ్డంగా ఉండి జీవచ్ఛవంగా బ్రతికే కంటే చావే మేలు. 


నాకు ఊహ తెలిసింది మొదలు వాళ్లిద్దరూ తమ తమ స్వార్థాలకే బ్రతికారే తప్ప, నన్ను కానీ నా బాధల్ని కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. తప్పు చేసింది వాళ్లు కాని నేను కాదు. వాళ్ళ కడుపున పుట్టడమే నేను చేసిన తప్పు. మనశ్శాంతి లేకుండా బ్రతకడం కంటే చావడమే మేలు" అంటూ బోనులో కుప్పకూలిపోయాడు పద్దెనిమిదేళ్ల ఆర్య.

అప్పటికే బెంచీలపై కూర్చున్న శాంతి, సత్యలు వెంటనే బోనులోకి వచ్చి ఆర్యను ఒళ్ళోకి తీసుకున్నారు. ఇదంతా గమనిస్తున్న జడ్జి ఆర్యకు వైద్యం చేయించమని చెప్పి, తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేశాడు.


"స్త్రీ పురుషులు ఇద్దరూ ఇష్టపడితేనే పెళ్ళవుతుంది. పెళ్ళి తర్వాత వచ్చే ఏ పరిణామమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలా వారికి తగిన వయసు వచ్చేవరకు పెళ్ళి చేయరు. వయసుకు తగ్గట్టుగా మనిషి ప్రవర్తన లేకపోతే వాణ్ణి సంఘంలో చిన్నచూపు చూస్తారు. 


మీరిద్దరూ మీ వయసుకు తగిన విధంగా ప్రవర్తిస్తున్నారా? మీ మీ ఇగోల కోసం, చెడు అలవాట్ల కోసం కన్న బిడ్డను గాలికి వదిలేసి, పెళ్ళినాటి ప్రమాణాలకు తిలోదకాలిచ్చి విడాకులు తీసుకోవడానికి అర్హులా? 


మీ కారణంగా మీ బిడ్డ నన్ను ఉరి విధించమంటున్నాడు. మీ దృష్టిలో పెళ్ళి అనేది ఓ తంతు మాత్రమే. వచ్చే అతిధుల్ని, బంధుల్ని పలకరించడంలో చూపించిన శ్రద్ధ, ఆసక్తి పెళ్ళి మండపంలో జరిగే సాంప్రదాయాల్ని గమనిస్తే పెళ్ళి అనేది ఎంత పవిత్రమైందో తెలుస్తుంది. 


అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే తెలుస్తుందన్నట్టు, పెళ్ళి జరిగే ప్రతి కార్యక్రమం కొత్త జంటను కలపడానికే అనడానికి ఉదాహరణకు ఒక్కటి చెప్తాను.


పెళ్ళిలో సుముహూర్తం అయిన తర్వాత పెళ్ళి కూతుర్ని దీపం వెలిగించమంటారు. ఎందుకో తెలుసా? కుంది లాంటి తన కుటుంబంలోకి వత్తిగా ఉన్న తనతో నెయ్యిలా వచ్చి కలసిపోయి, దీపంలా వెలిగే బిడ్డను ఇవ్వమని భర్త కోరుకున్నాడని అర్థం. వారిద్దరూ కలసి కన్న ఆ బిడ్డ లోకానికి వెలుగై కీర్తి గడించాలని తల్లిదండ్రులు కోరుకోవాలి. అటువంటి మీరిద్దరూ మీ బాబు..."


"ఆపై మీరు మాట్లాడవద్దు సార్. మేమిద్దరం కలసి ఉంటాం. మీరు మా కళ్ళు తెరిపించినందుకు కృతజ్ఞతలు" అంటూ జడ్జికి శాంతి, సత్యలు నీళ్లు నిండిన కళ్ళతో నమస్కరించారు.


సమాప్తం

*** 

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు


ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.

భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.

రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.

పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు

నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు

ఊరు పాలి

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Excellent story 🙌🙌🙌🙌🙌

Like
bottom of page