కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Ventade Nida Episode 6' written by Mallavarapu Seetharam Kumar
రచన : మల్లవరపు సీతారాం కుమార్
ఐదవ భాగంలో ...
ఇంజక్షన్ తేవడానికి మెడికల్ షాప్ కి వెళ్తాడు వికాస్. ఆ సమయంలోనే అతని భార్య శ్రేయ ఉన్న గదిలోకి ఒక వ్యక్తి వెళతాడు. తన పేరు డాక్టర్ గోవర్ధన్ అనీ, ఇంజక్షన్ చెయ్యడానికి వచ్చాననీ చెబుతాడు.
ఇక్కడ మామిడి తోట దగ్గర చనిపోయింది షణ్ముగమా లేక గోవర్ధనమా తెలుసుకోవడానికి తన అల్లుడు వికాస్ కు ఫోన్ చేస్తుంది సావిత్రి.
అటు వైపు ఫోన్ తీసిన వ్యక్తి తన పేరు గోవర్ధన్ అని చెబుతాడు.
ఇక చదవండి....
భోజనం పూర్తి చేసి పెరట్లోకి వెళ్లి, చెయ్యి కడుక్కొని వచ్చాడు శంకరశాస్త్రి. పెరటి గుమ్మం వద్ద నిలబడి, అతను లోపలికి రాగానే చేయి తుడుచుకోవడానికి టవల్ అందించింది అతని భార్య పార్వతమ్మ. చేయి తుడుచుకొని ఆ టవల్ తిరిగి ఆమెకు అందించాడు శంకరశాస్త్రి. తరువాత హాల్ లోకి వచ్చి ఈజీ చైర్ లో కూర్చున్నాడు. కాసేపటికి పార్వతమ్మ వచ్చి అతని కుర్చీ పక్కనే చేతులు నలుపుకుంటూ నిలుచుంది. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడే ఆమె అలా వచ్చి నిలుచుంటుంది అని అతనికి తెలుసు.
"ఏమిటోయ్! కొత్త పెళ్ళికూతురులా అలా సిగ్గు పడుతున్నావు?" అని అడిగాడు ఆమెను.
" ఏమీ లేదండీ!" అంది పార్వతమ్మ.
"30 ఏళ్ళు నీతో కాపురం చేసిన వాడిని, నీ గురించి ఆ మాత్రం తెలీదా! నేను కోప్పడే విషయం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇలా చేస్తావు. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? మనసులో ఉన్నది ధైర్యంగా చెప్పు" అన్నాడు శంకరశాస్త్రి.
"మరేం లేదండీ. నిన్న మా అన్నయ్య, వాళ్ళ అబ్బాయి సుమంత్ ని తీసుకొని మన ఇంటికి వచ్చాడు కదా! ఆ అబ్బాయి చాలా చక్కగా ఉంటాడు. మన అమ్మాయి దీక్షను చేసుకోవడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు. ముందుగా మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను" నీళ్ళు నములుతూ చెప్పింది పార్వతమ్మ.
" వాళ్ళు వచ్చింది పెళ్లి చూపులకు కాదు గదా! అబ్బాయి జాతకం నా చేత చూపించుకోవడానికి వచ్చామని మీ అన్నయ్య చలపతిరావు నాతో చెప్పాడు" అన్నాడు శంకరశాస్త్రి.
"అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని మనకు తెలియజెప్పడానికి జాతకాల నెపంతో మన ఇంటికి వచ్చారు" అంది పార్వతమ్మ.
" ఆ అబ్బాయికి ఇంకా చదువే పూర్తి కాలేదు కదా! అప్పుడే పెళ్లి సంబంధాలు చూస్తున్నారా?" అన్నాడు శంకరశాస్త్రి ఆశ్చర్యంగా.
" అబ్బాయి బీటెక్ ఆఖరి సంవత్సరం లో ఉన్నాడు. క్యాంపస్ రిక్రూట్మెంట్ లో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందట. వాళ్లకు సుమంత్ కు వెనుక మరో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా! అందుకని ఉద్యోగం వచ్చిన వెంటనే సుమంత్ పెళ్లి చేసేస్తారు. మన అభిప్రాయం చెబితే ఇక వేరే సంబంధాలు చూసుకోకుండా ఉంటామని మా అన్నయ్య నాతో చెప్పాడు. మీ అభిప్రాయం, అమ్మాయి అభిప్రాయం తెలిస్తే తరువాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు" అంది పార్వతమ్మ.
మీ అన్నయ్య చలపతిరావు మంచి వ్యక్తి . మనమంటే చాలా అభిమానంగా ఉంటాడు. ఆ అబ్బాయి కూడా చూడడానికి చక్కగా ఉన్నాడు. నాకైతే ఏవిధమైన అభ్యంతరమూ లేదు.
కానీ మన దీక్ష చదువు పూర్తి కావడానికి ఇంకా రెండు సంవత్సరాలు పడుతుంది కదా. అర్ధాంతరంగా చదువు మానేసి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ఒప్పుకుంటుందా?" అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చాడు శంకరశాస్త్రి.
“పెళ్లయ్యాక కూడా మన అమ్మాయి చదువుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని మా అన్నయ్య చెప్పాడు. ముందు మీరు ఒప్పుకున్నారు. అదే చాలు! కళ్యాణ ఘడియ వస్తే మిగతా సమస్యలన్నీ వాటంతట అవే తీరిపోతాయి. అమ్మాయితో నేను తరువాత నింపాదిగా మాట్లాడుతాను" అంది పార్వతమ్మ, ఆనందంగా.
"అన్నట్లు నిన్న మీ అన్నయ్య, సుమంత్ పుట్టిన తేదీ, సమయం, ఇతర వివరాలు.. ఇచ్చి వెళ్ళాడు కదా! ఆ కాగితం ఇలా పట్రా. అబ్బాయి జాతకం ఎలా ఉందో, మన అమ్మాయి జాతకంతో కలుస్తుందో లేదో ఇప్పుడే చూసి చెప్తాను" అన్నాడు శంకరశాస్త్రి.
" ఇదిగో... ఇక్కడే టేబుల్ మీద పెట్టాను" అంటూ తన అన్నయ్య రాసిచ్చిన కాగితం భర్త చేతికిచ్చింది పార్వతమ్మ.
" మీరు నింపాదిగా జాతకం చూడండి. నేను ఈ లోగా వంటింట్లో గిన్నెలు సర్దుకొని వస్తాను" అంటూ లోపలికి వెళ్ళింది .
ఒక పావు గంట గడిచిందో లేదో "పార్వతీ! ఇలా రా" అంటూ గట్టిగా అరిచాడు శంకరశాస్త్రి. వంటిట్లో గిన్నెలు కడుగుతూన్న పార్వతమ్మ చేతులు తుడుచుకొని, హడావిడిగా పరుగులాంటి నడకతో హాల్లోకి వచ్చింది, "ఏమైందండీ?" అంటూ.
"అబ్బాయికి ... అదే... ఆ సుమంత్ కి ప్రాణగండం వుంది. అది కూడా ఈ సంవత్సరమే!" అంటూ మరి కొంత సేపు అతని జాతకం వంక పరిశీలనగా చూశాడు.
"నా అంచనా నిజమైతే అతి త్వరలోనే అతనికి ఆ ప్రాణగండం ఉంది. వెంటనే మృతుంజయ హోమం చేయించాలి. అలాగే అబ్బాయికి శాంతి హోమం చేయించి, ఆంజనేయస్వామి తాయత్తు కట్టించాలి. మీ అన్నయ్యకు ఫోన్ చేసి, విషయం చెప్పు" అన్నాడు శంకర శాస్త్రి ఆందోళనగా.
క్షణం కూడా ఆలస్యం చేయకుండా చలపతిరావుకు ఫోన్ చేసింది పార్వతమ్మ.
అటువైపు తన అన్నయ్య ఫోన్ తీయగానే భర్త తనతో చెప్పిన విషయాలన్నీ పొల్లు పోకుండా చెప్పింది పార్వతమ్మ. ఫోన్ లో లో చలపతి రావు చెప్పిన మాటలు విన్న ఆమె మొహంలో రంగులు మారాయి. ఫోన్ పెట్టేసి భర్త దగ్గరకు వచ్చి "సుమంత్ ఏదో పని మీద కంచికచర్ల వెళ్ళాడట. రేపు ఉదయాన్నే అన్నయ్య ఆ అబ్బాయిని తీసుకొని మన దగ్గరికి వస్తారట. ఆ హోమం ఏదో మీరే దగ్గరుండి చేయించమన్నాడు" అని చెప్పింది.
" నా మనసుకెందుకో కీడును శంకిస్తోంది. రేపటి వరకు ఆగడం ఎందుకు? అబ్బాయి కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పమను" అన్నాడు శంకరశాస్త్రి.
" అలాగేనండీ! ఇంతకీ అబ్బాయికి ఏరకంగా గండం ఉందో మీరు ఏమైనా చెప్పగలరా?" అని అడిగింది పార్వతమ్మ.
" అబ్బాయికి వాహన గండం ఉంది. కాబట్టి ప్రయాణాల్లో, ముఖ్యంగా బండి నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వాహన గండం కూడా కొన్ని దుష్ట శక్తుల ప్రభావం వల్ల కలుగుతుంది. అందుకే శాంతి హోమం చేసి ఆంజనేయస్వామి తాయత్తు కడితే కాస్త ఫలితం ఉంటుంది" అన్నాడు శంకరశాస్త్రి.
అతనితో ఏదో చెప్పబోయి ఆగింది పార్వతమ్మ. చేతులు నులుముకుంటూ అతని పక్కనే నిలుచుంది.
"ఏదైనా విషయం దాచి ఉంటే చెప్పు" అని గట్టిగా అడిగాడు శంకరశాస్త్రి.
" విషయం చెబుతాను. కానీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ అబ్బాయికి క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఉద్యోగం వచ్చింది అని చెప్పాను కదా. అందుకని స్నేహితులంతా పార్టీ ఇవ్వమని బలవంతం చేస్తే, కంచికచర్ల దగ్గరుండే మామిడి తోటలోకి స్నేహితులతో కలిసి వెళ్ళాడట. ఫోన్ చేస్తే తీయడం లేదట" అని చెప్పింది పార్వతమ్మ ఆందోళన పడుతూ.
కుర్చీలోంచి ఆవేశంగా పైకి లేచాడు శంకరశాస్త్రి." నేను అనుకున్నంతా జరుగుతోంది. నా ఊహ నిజమైతే దుష్ట శక్తుల ప్రభావం ఇప్పటికే మొదలైంది.ఆ మామిడి తోటలో దయ్యాలు తిరుగుతున్నాయని అందరూ చెబుతూ ఉంటారు కదా! అబ్బాయి ఖచ్చితంగా ఆపదలో ఉన్నాడు. వాళ్ళు వచ్చే వరకు ఆగ కూడదు. నేనే హోమం చేసి తాయత్తు రెడీ చేసి ఉంచుతాను. రాగానే అబ్బాయికి కట్టించు" అని చెప్పి హోమం జరిపించడానికి ఏర్పాట్లు ప్రారంభించాడు శంకరశాస్త్రి.
భర్త మాటలు విన్న పార్వతమ్మకు ఆందోళన మరింత పెరిగింది. మరోసారి తన అన్నయ్య కు ఫోన్ చేసి భర్త చెప్పిన విషయాలు తెలియజేసింది.
అటువైపునుంచి చలపతి రావు మాట్లాడుతూ "సుమంత్ కి ఫోన్ చేస్తే 'స్విచ్ ఆఫ్' అని వస్తోంది. మా దగ్గర సుమంత్ ఫ్రెండ్ విశాల్ అనే అబ్బాయి ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కు చేసినా 'స్విచ్ ఆఫ్' అని వస్తోంది. మాకు చాలా ఆందోళనగా ఉంది. నేను తెలిసినవాళ్ళు కొందర్ని తీసుకొని ఆ తోట దగ్గరికి బయలుదేరుతున్నాను. నాకేదైనా వివరాలు తెలిస్తే వెంటనే మీకు చెబుతాను. బావగారు మా కోసం హోమం జరిపిస్తామని చెప్పారు కాబట్టి మాకు కాస్తయినా ధైర్యంగా ఉంది” అని చెప్పాడు.
***
తలంతా దిమ్ముగా సుత్తులతో కొడుతున్నట్టుగా ఉంది సుమంత్ కి. కళ్ళు తెరవాలని ప్రయత్నించాడు కానీ తలంతా బ్యాండేజ్ చుట్టి ఉన్నారని తెలుసుకున్నాడు. కాళ్ళు చేతులు కదిలించడానికి ప్రయత్నించాడు కానీ వీలు కాలేదు. తన ప్రాణం ఇంకా పోలేదు. ఎవరో హాస్పిటల్లో చేర్చారని గ్రహించాడు. అసలు ఏం జరిగిందో తను ఇక్కడికి ఎలా వచ్చాడో అతని ఊహకు అందడం లేదు. ఏదో ఒక వికృతమైన ఆకారం తాలూకు నీడ తనని వెంటబడి తరుముతున్నట్టు అనిపిస్తోంది అతనికి. తను ఎంత వేగంగా పరుగెత్తితే ఆ ఆకారం అంతే వేగంగా వస్తోంది. తను ఒక భయంకరమైన లోయలో పడిపోతున్నట్లు అనిపించింది. ఆ సమయంలోనే తన మామయ్య శంకరశాస్త్రి తనకు చెయ్యి అందిచ్చినట్లుగా అనిపించింది. ఆలోచనల తాలూకు ఉద్రేకం వల్ల, అతని ముఖంలో స్వల్పంగా కదలిక కనిపించింది.
"నర్స్! పేషెంట్ కదులుతున్నట్టు ఉన్నాడు. వెంటనే డాక్టర్ను పిలవండి" అంటూ ఒక మొగ గొంతు వినిపించింది. వెంటనే ఎవరో ... బహుశా నర్స్ కావచ్చు. బయటకు పరుగెత్తుకొని వెళ్లిన శబ్దం తెలుస్తోంది..
తనకు వినిపించిన మగ గొంతు ఎవరిదో తెలుసుకోవాలనిపించింది సుమంత్ కి. తనను కాపాడి హాస్పిటల్లో చేర్చింది ఇతనే అయి ఉంటాడేమో అడగాలని ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. ఇంతలో ఆ వ్యక్తి సుమంత్ తల పైన చేయి వేశాడు
“టెన్షన్ పడకండి.రిలాక్స్డ్ గా ఉండండి. నేనెవరో తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదూ.
నేనే వెంటాడే నీడను!” నవ్వుతూ అన్నాడు ఆ వ్యక్తి..
***
ఇక్కడ మామిడి తోట దగ్గర కళ్ళు తిరిగి కింద పడబోయిన సావిత్రిని, డ్రైవర్ వెంకటేష్ పడకుండా పట్టుకున్నాడు.
షణ్ముగం కింద పడివున్న శ్యామలరావును కదిలించి చూసాడు. అతను కదల్లేదు.
"అమ్మగారూ! నన్ను నమ్మండి. నేను మనిషినే. ఆ గోవర్ధన్ గాడే దయ్యం. అయ్యగారు రోడ్డుమీద పడివున్నారు. మా గుడిసెలోకి తీసుకొని వెడదాం. కాస్త కుదుటపడ్డాక మీరు బయలుదేరవచ్చు. మీరు కూడా డాక్టరమ్మ కదా. మీకు తెలీనిదేముంది?" అని సావిత్రితో అన్నాడు షణ్ముగం.
సావిత్రికి కూడా అదే సబబు అనిపించింది. ముందు తన భర్తకు ఫస్ట్ ఎయిడ్ చెయ్యాలి
అనుకుంది. వెంకటేష్ తో "నువ్వు, షణ్ముగం కలిసి సార్ ను తోటలోకి తీసుకొని రండి" అని చెప్పి తనూ తోటలోకి నడిచింది.
శ్యామలరావును గుడిసెలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టారు.
బయట నుంచి ఈదురు గాలులు వీస్తుండటంతో గుడిసె తలుపు బిగించాడు షణ్ముగం.
గుడిసె తలుపు ఎవరో బలంగా నెడుతున్నట్లుగా కదిలిపోతోంది.
ఇంతలో బయటినుంచి "హార్ట్ ఎటాక్ వస్తే గుడిసెలో ఎందుకు ఉంచారు మేడం? గాలి బాగా ఉండే చోట ఉంచాలి కదా !" అన్న మాటలు వినిపించాయి.
'ఆ గోవర్ధన్ గాడి దయ్యం వచ్చినట్లుంది" అంటూ కోపంగా బయటకు వెళ్ళబోయాడు షణ్ముగం.
"చీకటి పడింది. రాత్రుళ్ళు దయ్యాలకు బలం ఎక్కువంటారు. ఇంట్లో ఆంజనేయస్వామి బొమ్మ ఉంది. ఆ దయ్యం లోపలి రాలేదు. నువ్వు బయటకు వెళ్లొద్దు" అంది చంద్రిక.
ఇంతలో ఒక్క సారిగా ఉరుములు, మెరుపులతో హోరు వాన మొదలైంది.
మరి కొద్దీ సేపటికే కరెంట్ పోయింది.
"మేడం! సార్ గుండె ఆగిపోయినట్లుంది.'సి పి ఆర్' చెయ్యాలి. నన్ను లోపలి రానియ్యండి. గుండెల మీద కూర్చొని గట్టిగా గుద్దుతాను. నాకు బాగా అనుభవం" అంటూ మళ్ళీ బయటనుండి ఒక గొంతు వినిపించింది.
వెంటనే తన భర్త గుండెల మీద చెయ్యి వేసి చూసింది సావిత్రి.
ఆమె కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి.
వెంటాడే నీడ ఏడవ భాగం అతి త్వరలో...
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 20 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము.
( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
.