ఆ రాత్రి
- Veereswara Rao Moola

- 1 day ago
- 5 min read
ఆ రాత్రి, వీరేశ్వరరావు మూల, లంబసింగి కథ, తెలుగు క్రైమ్ కథ, తెలుగు సస్పెన్స్ కథ, థ్రిల్లర్ కథలు, ర్యాగింగ్ కథ, ప్రతీకారం, ఝాన్సీ, రాకేష్, Lambasingi Telugu Story, Telugu Crime Thriller, Telugu Suspense Stories

Aa Rathri - Telugu Suspense Crime Story | Veereswara Rao Moola
ఆ రాత్రి - తెలుగు సస్పెన్స్ క్రైం కథ | వీరేశ్వర రావు మూల
Published In manatelugukathalu.com On 18/07/2026
స్నేహితులతో కలిసి లంబసింగి చలి రాత్రిని ఆస్వాదించడానికి వెళ్లిన ఒక బృందానికి ఆ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవంగా మారుతుంది. క్యాంప్‌ఫైర్ చుట్టూ పాటలు, జోకులు, సరదాలతో మొదలైన రాత్రి అకస్మాత్తుగా ఉత్కంఠభరిత పరిస్థితిలోకి వెళుతుంది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఝాన్సీ సమయస్ఫూర్తి ఈ కథకు కీలక మలుపు.
స్థలం: లంబసింగి, ఆంధ్రప్రదేశ్
అక్కడికి అమ్మాయిలు, అబ్బాయి రాకేష్ లంబసింగిలో చలి రాత్రిని ఆస్వాదించడానికి సాయంత్రం 3 గంటలకి హోటల్ చేరుకున్నారు. అక్కడ హోటల్ చెక్-ఇన్ చేసేటప్పుడు, సామాన్లు వాళ్ళ రూమ్ లో పెట్టేటప్పుడు అమ్మాయిలను అనుమానంగా చూశాడు హోటల్ లో పనిచేసే అతను. ఆ అమ్మాయిలలో ఒక అమ్మాయి పేరు ఝాన్సీ.
"వీడి వాలకం అనుమానంగా ఉంది" అంది ఝాన్సీ.
"ముఖం చూసి అంచనాకి రాకూడదు" అంది పక్కన ఉన్న అమ్మాయి.
ఆ అమ్మాయి పేరు నళిని. వాళ్లిద్దరూ ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు. రవళి, పద్మ, శాంతి, వనజ, విమల కూడా అదే కాలేజీలో చదివారు, కానీ అందరూ ఝాన్సీ, నళినిలకు జూనియర్లు.
"మీరు త్వరగా తేలితే, బయటికి వెళ్ళి బాంబో చికెన్ తిందాం" అంది పద్మ. మిగిలిన వాళ్ళు తల ఊపారు.
********
"ఏంటి నళిని బాయ్ ఫ్రెండ్ తో వచ్చింది? పెళ్ళికి ముందే టెంట్ లో శోభనమా?" అంది వనజ టవల్ చుట్టుకుంటూ.
"నీకెందుకే వాగుడు కాయ! వాళ్ల గొడవ. త్వరగా తేలు. " తొందర పెట్టింది విమల.
"మెహఫిల్ మే కైసే కేహదో కిసిసే దిల్ బంద్ రహా హై కిస్ అజ్నబీ సే"
పాట హమ్ చేస్తూ బట్టలు మార్చుకుంది వనజ.
***********
"అందరూ వచ్చారా? టెంట్ల గురించి మాట్లాడాలి" అంది ఝాన్సీ రిసెప్షన్ దగ్గర ఉండి.
రిసెప్షన్ దగ్గరికి అందరూ వచ్చారు.
"రాకేష్ రాలేదు." అంది నళిని.
"కాబోయే శ్రీ వారి గురించి బెంగ పెట్టుకుంది" అంది వనజ చిన్న గొంతుతో.
"ష్" అంది విమల.
"నీకు ముందు పెళ్లి చెయ్యాలే" చిన్నగా మొట్టింది శాంతి.
అరగంట తర్వాత రాకేష్ వచ్చాడు. టెంట్ల గురించి హోటల్ యజమానితో మాట్లాడుకుని కేంప్ ఫైర్ స్పాట్ కి వెళ్ళారు.
********
రాత్రి కేంప్ ఫైర్ కోసం నాలుగు టెంట్లు తీసుకున్నారు. మూడు టెంట్లు అమ్మాయిలకు, ఒకటి రాకేష్ కోసం.
"రాకేష్ కోసం సెపరేట్ టెంట్ ఎందుకు? మన పక్కనే సర్దుకుంటాడు." అంది వనజ.
"నీ పక్కన చోటు ఇయ్యి" అంది విమల.
"ష్" అంది శాంతి.
********
నళిని ప్రకటించింది, కేంప్ ఫైర్ దగ్గర ఎవరికి వచ్చిన కళను వాళ్ళు ప్రదర్శించవచ్చు అని.
నళిని ఇంటికి ఫోన్ చేద్దామనుకుంది. ఎయిర్ టెల్ సిగ్నల్ లేదు.
"ఇక్కడ సిగ్నల్స్ ఉండవు" అన్నాడు రాకేష్ పవర్ బ్యాంక్ తో సెల్ కి చార్జి చేసుకుంటూ.
********
తెచ్చుకున్న తిండి తినేసి, కూల్ డ్రింక్ లు తాగుతూ అందరూ కేంప్ ఫైర్ దగ్గరికి చేరారు. అడవి నెగళ్ళు ఎర్రగా మండుతున్నాయి. సమయం పది దాటింది. ఉష్ణోగ్రత తగ్గడం ప్రారంభించింది.
శాంతి వేసుకున్న జాకెట్ పల్చగా ఉండడంతో చలికి వణుకుతోంది. కేంప్ ఫైర్ కి దగ్గరగా వచ్చింది. కేంప్ ఫైర్ లో రవళి పాడింది.
"అగర్ తుమ్ మిల్ జాయో, జమానా చోడ్ దే హమ్"
"తెలుగు కావాలి" అరిచారు అందరూ.
"మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు" అని అందుకుంది రవళి.
అందరూ ఆ పాటకు చిందులు వేశారు. రాకేష్ కూడా వారితో కలిసి చిందులేశాడు. తరువాత శాంతి మిమిక్రీ చేసింది.
********
అర్ధరాత్రి తరువాత చాలామంది టెంట్ లోకి వెళ్ళిపోయారు. అక్కడక్కడ అడవి జ్యోతుల్లా కేంప్ ఫైర్లు కనిపిస్తున్నాయి.
రాకేష్ గురించి తన స్నేహితురాండ్రకు పరిచయం చేసింది నళిని, రాకేష్ స్టాండప్ కామెడీ చేస్తాడని.
"స్టాండప్ కామెడీ అంటే ఏమిటి?" అడిగింది వనజ.
"మామూలు జోకునే నిలబడి చెప్పడం" అన్నాడు రాకేష్.
"అదే కామెడీ అంటే" అంది వనజ.
"నీ ముఖం" అంది ఝాన్సీ.
రాకేష్ తన జోక్ వినిపించడం మొదలుపెట్టాడు.
"భార్య భర్తతో అంది, రాత్రి నాకు మీరు డైమండ్ నెక్లెస్ కొన్నట్టు కల వచ్చింది. దీని అర్థం ఏమిటంటారు?"
"సాయంత్రం దాని అర్థం నీకు తెలుస్తుంది" అన్నాడు భర్త ఆఫీసుకు వెళుతూ.
సాయంత్రం భర్త రాగానే, భర్త సూట్ కేస్ తెరిచి చూసింది భార్య. చూసి ఆశ్చర్యపోయింది. అందులో అడుగున ఒక పుస్తకం ఉంది. దాని అట్ట మీద ఇలా ఉంది: "కలలు - అంతరార్థం" అని.
అందరూ నవ్వారు. ఇంకో జోక్ అడిగారు.
"ఒక అమ్మాయి అడిగింది తన లవర్ ని. నీ రూమ్ కి వస్తే ఏం చేస్తావు అని?" ఏదో ఊహించుకుంటూ.
"నేనా హనుమాన్ చాలీసా చదువుకుంటాను. చిన్నప్పుడు మా బామ్మ దయ్యాల వల్ల భయం పుడితే అదే చదవమనేది."
అలా జోకులతో ఆహ్లాదంగా గడిచింది. కేంప్ ఫైర్ లో కట్టెల మంట తగ్గుతోంది. అందరూ టెంట్లలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు.
అప్పుడే ఒక గొంతు వినిపించింది.
"ఇప్పటి దాకా కామెడీ చూశారు. ఇప్పుడు క్రైమ్ చూస్తారు."
అంటూ వనజ చెయ్యి పట్టుకుని, పిస్తోలు గురిపెట్టాడు రాకేష్.
ఒక్కసారిగా హఠాత్ పరిణామానికి నిర్ఘాంతపోయారు.
"రాకేష్..... నువ్వేనా?"
"ఆ రాకేష్ నే. ఈ రాత్రి నా మాట వింటే, మానం మాత్రమే పోతుంది. లేదనుకుంటే మానం, ప్రాణం రెండూ పోతాయి." అన్నాడు రాకేష్ కర్కశంగా.
"సరదాగా నవ్వించే నీలో క్రిమినల్ ఉన్నాడా?" అంది బాధగా నళిని.
"సరే, నా అందాన్ని అనుభవించి మిగిలిన వాళ్ళని వదిలెయ్యి" అంటూ ఝాన్సీ ముందుకు అడుగు వేసింది.
"సరే బోణి నీతోనే చేస్తా. రా సప్త అందాల రాశీ. రాకేష్ నీ పంట పండింది రా" అంటూ నవ్వుతూ అన్నాడు.
"ఝాన్సీ వెళ్ళొద్దు" గట్టిగా అరిచారు మిగిలిన వాళ్లు.
అక్కడే జరుగుతున్న దానికి అగ్ని నిర్వికార సాక్షిగా ఉంది.
ఝాన్సీ గడ్డం కింద పిస్తోలు పెట్టి, "బట్టలు విప్పు, క్విక్" అని గద్దించాడు రాకేష్.
"నాకు కొంచెం సిగ్గు. కళ్లు మూసుకో" అంది ఝాన్సీ, జాకెట్ తీస్తున్నట్టుగా నటిస్తూ.
"నా చేతిలో పిస్తోలు ఉందని మరిచిపోకు," అన్నాడు ట్రిగ్గర్ మీద వేలు ఉంచుకుని, పిస్తోలు అంచుని ఆమె ఎద మీద రాస్తూ!
కళ్ళు మూసుకున్నాడు రాకేష్.
సమయం వృధా చేయలేదు. బలంగా కాళ్ళ మీద తన్నింది ఝాన్సీ. బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు.
వెంటనే అతని ఛాతి మీద కూర్చుని, "గర్ల్స్, త్వరగా అడవి తీగలు తీసుకురండి."
వెంటనే వాళ్ళు ఆడ సివంగుల్లా లంఘించారు. తాళ్ళతో బంధించారు.
రాకేష్ పిస్తోలు ట్రిగ్గర్ నొక్కాడు. పేలలేదు. మళ్ళీ ప్రయత్నించి విఫలమయ్యాడు.
ఝాన్సీ రాకేష్ చెంప మీద వాయించింది. రాకేష్ వాళ్ల ఆధీనంలోకి వచ్చాడు.
"వీడితో ఎంగేజ్ మెంట్ అనుకున్నా. ఛీ సైకోలా తేలాడు." అంది నళిని బాధగా.
"కంగారు పడకు. అసలెందుకు ఇలా చేశాడో కనుక్కుందాం" అంది శాంతి.
"చెప్పరా!"
********
రాకేష్ చెప్పడం ప్రారంభించాడు.
“2013లో మీరు ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒక కుర్రాడు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో చేరాడు. అతను కోటి ఆశలతో చేరాడు. అతని ఆశలన్నీ భగ్నం చేస్తూ అతన్ని దారుణంగా 'ర్యాగింగ్' చేశారు. అతను ప్రైవేట్ పార్ట్స్ తన చేతులతో కప్పుకుని కాలేజి క్యాంపస్ అంతా తిరిగాడు. ఆ తర్వాత అతను కాలేజీకి రాలేదు. ఆ కుర్రాడు నేనే!”
చెప్పడం ఆపాడు రాకేష్. అందరూ ఆశ్చర్యంగా చూశారు.
"రైలు గుద్ది చనిపోయావని అందరూ అనుకున్నారు." అంది ఝాన్సీ.
"చనిపోయింది నేను కాదు. నా పర్సును దొంగిలించిన దొంగ."
"మేమే కాదు. మగవాళ్ళు కూడా నిన్ను ర్యాగింగ్ చేశారు." అంది రవళి.
"అవును, వాళ్ళు కొడైకెనాల్ సూసైడ్ పాయింట్ దగ్గర పరలోకానికి ప్రయాణం చేశారు."
ఆ మాటలు విన్న వాళ్ళకి ఒళ్ళు జలదరించింది.
"మీ వివరాలను తీసుకుని, లంబసింగి ప్లాన్ తెలుసుకుని మిమ్మల్ని వెంబడించాను. మంచివాడిలా నటించాను. మీ అందరి అందాలను అనుభవించి, ఆ తరువాత మట్టుపెడదాం అనుకున్నా." రాకేష్ చెప్పడం ఆపాడు.
********
ఉదయం. హోటల్ చెక్ అవుట్ చేసి టాక్సీలో బయలుదేరారు.
"రాకేష్ ని ఏం చేద్దాం" అంది వనజ.
"పోలీసులకు అప్పగిస్తే వాళ్ళే చూసుకుంటారు." అంది స్థిరంగా ఝాన్సీ.
టాక్సీ విశాఖపట్నం వైపు వెడుతోంది.
********
కేంప్ ఫైర్ ప్రారంభానికి రెండు గంటల ముందు.
ఝాన్సీ తన మొబైల్ రీచార్జ్ కోసం రాకేష్ టెంట్ వైపు వెళ్ళింది. నెమ్మదిగా గుడ్డ తొలగించింది. లోపల రాకేష్ పిస్తోలులో గుళ్ళు నింపుతున్నాడు. ఐదు నిమిషాలు ఆగి రాకేష్ ని పిలిచింది.
"ఎవరూ?"
"ఝాన్సీ."
"రా లోపలికి."
"నాకు పవర్ బ్యాంక్ కావాలి."
"తీసుకో ఆ లాప్ టాప్ బ్యాగ్ లో ఉంది."
అని రాకేష్ ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయాడు. పది నిమిషాల తర్వాత వచ్చాడు.
ఆ సమయంలోనే పిస్తోలులో గుళ్ళు తొలగించింది. పవర్ బ్యాంక్ తీసుకుని మామూలుగానే వచ్చింది.
ఆ విషయం గుర్తుకు వచ్చింది. పెదవుల పై నవ్వు వెలిసింది.
"ఎందుకు ఝాన్సీ నవ్వుతున్నావు?" అడిగింది నళిని.
"ఏం లేదు. ఎక్కడో చదివిన జోక్ గుర్తుకు వచ్చింది."
టాక్సీ విశాఖపట్నం వైపు దూసుకుపోతోంది!
END
***
వీరేశ్వర రావు మూల గారి కొన్ని ఇతర రచనలు:
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.
#TeluguComedyStory, #తెలుగుహాస్యకథ







Comments