top of page
Original.png

ఆస్తులు - అనుబంధాలు

13 hours ago
5 min read

ఆస్తి కంటే కుటుంబ అనుబంధాలే గొప్పవని తెలుసుకున్న అక్షర, నితిన్ దంపతులు

Aasthulu - Anubandhalu - Telugu Family Story | Dr. C. S. G. Krishnamacharyulu

ఆస్తులు - అనుబంధాలు - తెలుగు కుటుంబ కథ | Dr. C..S.G . కృష్ణమాచార్యులు

Published in manatelugukathalu.com on 20/11/2026


ఆస్తులు జీవితానికి భద్రత ఇవ్వొచ్చు కానీ, నిజమైన సంతోషాన్ని ఇచ్చేది కుటుంబంలోని ప్రేమానుబంధాలే. ఆస్తి కోసం బంధాలను దూరం చేసుకోకూడదనే గొప్ప సందేశాన్ని అందించే కథ “ఆస్తులు – అనుబంధాలు”.


"మీరు నా దగ్గర ఒక విషయం దాచారు," అక్షర కంఠంలో నిష్ఠూరం ధ్వనించింది.

ల్యాప్‌టాప్ ముందేసుకుని పనిచేసుకుంటున్న నితిన్, ఆమె మాటలకు ఉలిక్కిపడ్డాడు.


"మీరు దగ్గరుండి మరీ మీ నాన్న చేత విల్లు రాయించారని, అందులో ఆస్తి మొత్తం మీ చిన్నమ్మకే రాశారన్న విషయం నాకు తెలిసింది."


తాను గోప్యంగా ఉంచిన విషయం అక్షరకు తెలియడం అతనికి నచ్చలేదు. ఇది తమ లాయరు దగ్గర అసిస్టెంటుగా ఉన్న తన స్నేహితుడు విక్రం చేసిన పని అని గ్రహించాడు. 


ఈసారి కలిసినప్పుడు వాడిని ఉతికి ఆరేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక క్షణం ఆగి మెల్లగా, "చిన్నమ్మ తదనంతరం నాకూ, తమ్ముడికే వస్తుంది. ఇందులో తప్పు పట్టాల్సిందేముంది?" అన్నాడు.


"నేను నమ్మను. ఆస్తి విషయాలలో ఎప్పుడూ కచ్చితంగా ఉండాలి. మీ మెతక స్వభావం తెలిసి కూడా మీ తండ్రి మీకు న్యాయం చేయలేదు. 


మీకో వాటా ఇచ్చిన తర్వాత కదా, ఆస్తిని తన రెండో భార్యకు రాయాలి. ఇప్పుడు ఆయన లేడు. మీ చిన్నమ్మ తన తర్వాత ఆస్తిని తన కొడుక్కి ఇస్తుందే కానీ, ఇద్దరికీ సమంగా పంచదు. ఈ మాత్రం అవగాహన లేని మిమ్మల్ని ఏమనాలి?" అక్షర కోపంతో అరుస్తున్నంత పని చేస్తోంది.


"అలా జరగదు. పేరుకు సవతి తల్లే కానీ, నన్ను ఏనాడూ వేరు చేసి చూడలేదు. ఒకవేళ ఆమె ఆస్తి మొత్తం తన కొడుకుకే ఇవ్వాలనుకున్నా తప్పేముంది? భర్త ఆస్తి భార్యకు, తల్లి ఆస్తి కొడుక్కి చెందడం న్యాయమే కదా?"


"మీకెలా చెప్తే అర్థమవుతుంది? ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు. పిల్లల చదువులు, ఆస్పత్రి ఖర్చులు, ఏవీ చవకగా అయ్యేవి కావు. మీ నాన్న ఆస్తి వస్తే, కాస్త ఆసరాగా ఉంటుందనుకుంటే, మీరు అదీ వదులుకున్నారు."


"ఇద్దరం లక్షల్లో సంపాదిస్తున్నాం. మనకి భయమెందుకు? నీ జీతం మొత్తం పొదుపు చెయ్యి. నా జీతం కూడా నీకే ఇస్తాను."


"అసలు విషయాన్ని పక్కకి పట్టించకండి. ఆస్తి ఎందుకు వదులుకున్నారు?"


"వదులుకోలేదు. చిన్నమ్మ తర్వాత పంచుకుంటాం."


"అదంతా అయ్యేది కాదు. రేపే మీ చిన్నమ్మతో మాట్లాడి ఆస్తులు మూడు వాటాలు వేయండి. కావాలంటే ఆవిడ వాటాని తన తదనంతరం ఆమె కొడుకుకే ఇమ్మనండి."


"నేను అలా చేయను," అన్నాడు నితిన్ గంభీరంగా.


"నా మాటకి గౌరవం లేని చోట నేను ఉండను," అని అక్షర విసురుగా లోపలికి వెళ్లిపోయింది. ఒక అరగంట తర్వాత ఆమె ఒక సూట్‌కేసుతో ఇల్లు విడిచి వెళ్లిపోయింది.


ఊహించని ఈ పరిణామానికి నితిన్ నిశ్చేష్టుడయ్యాడు. తన తండ్రి చేసిన పనిలో తప్పేమిటో, తనకి కలిగించిన నష్టమేమిటో కూడా అతనికి అర్థం కాలేదు. 


నిజానికి, ఆయన తన నిర్ణయాన్ని తనతో చర్చించే తీసుకున్నారు. ఆ రోజు ఆస్పత్రిలో జరిగిన సంభాషణ అతని మదిలో మెదిలింది.


ఆస్పత్రిలో మంచంపై నిస్తేజంగా పడుకుని ఉన్న తండ్రి నితిన్ చేయి పట్టుకుని అడిగాడు.


"నాన్నా! ఈ క్యాన్సర్ నన్ను పూర్తిగా కబళిస్తోంది. ఇక ఇంటి బాధ్యత నీదే. ఆస్తి మొత్తాన్ని మీ చిన్నమ్మ పేరున వీలునామా రాస్తాను. నువ్వుగానీ, నీ తమ్ముడుగానీ భవిష్యత్తులో ఆవిడను చూసుకోలేని పరిస్థితి వచ్చినా, ఆ ఆస్తితో ఆమె గౌరవంగా జీవించగలుగుతుంది. ఏమంటావు?"


తండ్రి మనసులోని ఆందోళనను, ఆయన ఆలోచన వెనుక ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న నితిన్, "అలాగే చెయ్యి నాన్నా!" అంటూ తన సమ్మతిని తెలియజేశాడు.


తండ్రి గాఢంగా నిట్టూర్చి, "ఆస్తులు సుఖసౌకర్యాలను ఇవ్వగలవే కానీ, నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు. నువ్వు ఆమెను కాస్త కనిపెట్టుకుని ఉండు," అన్నాడు.


"అలాగే నాన్నా! చిన్నమ్మను, తమ్ముడిని నేను చూసుకుంటాను."


"నాకా నమ్మకం ఉంది," అంటూ ఆయన నిశ్చింతగా కళ్లు మూసుకున్నాడు.


ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ఆయన మరణించాడు. ఆయన కర్మకాండలు ముగిశాక, ఒక రోజు నితిన్ తన చిన్నమ్మ సరస్వతిని, తమ్ముడు శేఖరాన్ని రహస్యంగా సమావేశపరిచి, తండ్రి విల్లు రాసిన సంగతి చెప్పాడు.


"చిన్నమ్మా! నాన్న ఆస్తి మొత్తం నీ పేర రాశారు. స్థిరాస్తులమ్మి, ఆ నగదు నీ పేర డిపాజిట్ చేయమన్నారు. ఆస్తులమ్మేద్దామా?" అని అడిగాడు.


అతని మాట విని సరస్వతి కన్నీళ్లు పెట్టుకుని, "నాకు ఆస్తి కన్నా నువ్వూ, శేఖరూ ముఖ్యం. ఇంటికి పెద్దవాడివి. నీకు ఏది మంచిదో అది చెయ్యి," అని వెళ్లిపోయింది.


శేఖర్, "అన్నయ్యా! తండ్రి తర్వాత నువ్వే నాకు తండ్రివి. నీ మాటే మా మాట," అన్నాడు.


చిన్నమ్మ, శేఖర్‌ల స్వభావాలు తనకు బాగా తెలుసు. 


తన పట్ల వారికున్న ప్రేమాభిమానాలను శంకించడానికి ఎలాంటి కారణమూ కనిపించడం లేదు. 


ఒకవేళ రేపు ఏదైనా పరిస్థితుల్లో వారు తమ వైఖరి మార్చుకున్నా, తాను కోల్పోయేదేముంది? తన చిన్నమ్మ, తమ్ముడు సంతోషంగా ఉండటమే కదా తనకు కావలసింది! ఆస్తి లేకపోతే వచ్చే నష్టమేమీ లేదు. 


తన వైఖరి పట్ల నాన్న ఆత్మ కూడా సంతోషించి, తనను ఆశీర్వదిస్తుంది. 


అయితే, ప్రేమాభిమానాలకన్నా ఆస్తులు గొప్పవి కావని అక్షరకు ఎలా తెలుస్తుంది?

ఆమె ఆలోచనా విధానమే వేరు. 


తన దృష్టిలో ఆస్తిలో వాటా పొందడం హక్కు; దాన్ని వదులుకోవడం బలహీనత. ఇందులో విషాదకరమైన విషయమేమిటంటే, ఆమె ఒక స్త్రీ అయి ఉండి కూడా, ఒక వృద్ధ వితంతువు భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. 


తన భార్యకు ఆస్తిని రాసివ్వడం ద్వారా నాన్న ఆమెకు జీవితకాల భద్రత కల్పించాడు. తద్వారా భర్తగా తన బాధ్యతను, ధర్మాన్ని నిర్వర్తించాడు. 


ఆయన నిర్ణయాన్ని సమర్థించి, దానికి తన సమ్మతిని తెలియజేయడం ద్వారా తానూ కొడుకుగా తన ధర్మాన్ని పాటించాడు. 


ఇందులో తప్పేముంది?

"ధర్మాన్ని ఆచరించినవారిని ధర్మమే కాపాడుతుంది అన్నారు పెద్దలు.  ధర్మబద్ధంగా నడుచుకోవడమే ముఖ్యం కాదా? ఈ సత్యాన్ని అక్షరకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి?" అన్న ఆలోచనలో పడ్డాడు నితిన్.


@@@


అక్షరను తీసుకువెళ్లడానికి నితిన్ రావడం ఆమె తల్లిదండ్రులకు ఎంతో సంతోషం కలిగించింది. అల్లుడిని సాదరంగా ఆహ్వానించి, తగిన మర్యాదలు చేశారు. 


కుశల ప్రశ్నలు పూర్తయ్యాక నితిన్ తన మామగారైన ధర్మారావుని అడిగాడు.


"నేను ఒక ఇల్లు కొనబోతున్నాను. దాన్ని అక్షర పేరున పెట్టాలా, లేక నా పేరునే ఉంచాలా అని ఆలోచిస్తున్నాను. మీ సలహా ఏమిటి?"


"అమ్మాయి పేరునే పెట్టండి. నేను కూడా కొన్ని ఇళ్లు, ఇంటి స్థలాలు నా భార్య పేరున ఉంచాను. మరికొన్ని నా పేరునే ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు కూడా అలాగే ఇద్దరి పేర్లలో ఉంచాను," అని ధర్మారావు బదులిచ్చాడు.


"మీ అమ్మాయి పేరున ఆస్తులు గానీ, బ్యాంకు డిపాజిట్లు గానీ ఏమీ లేవా?" అని నితిన్ అడిగాడు.


"చదువు చెప్పించాం. పెళ్లి చేశాం. ఉద్యోగం చేసుకుని సంపాదించుకోగలిగే ఆత్మస్థైర్యాన్ని కలిగించాం. మా తదనంతరం మా ఆస్తిలో తనకు వాటా ఇస్తాం," అని ఆయన సమాధానమిచ్చాడు.


"మీ అమ్మాయికి ఎంత ఆస్తి ఇవ్వాలనుకుంటున్నారో వీలునామా రాశారా?" అని నితిన్ ప్రశ్నించాడు.


"అలాంటిదేమీ లేదు. అయినా, మీరు ఇలా ఎందుకు అడుగుతున్నారు?" అని ధర్మారావు కొంత ఆశ్చర్యంగా అడిగాడు.


"మరేమీ లేదండీ! అపార్థం చేసుకోవద్దు. మీ అబ్బాయికే మొత్తం ఆస్తి ఇచ్చేస్తారేమోనన్న భయంతోనే ఈ ప్రస్తావన తెచ్చాను," అన్నాడు నితిన్.


ధర్మారావు ముఖంలో అసహనం కనిపించింది.


"క్షమించాలి. మా ఆస్తి ఎవరికి ఎంత ఇవ్వాలన్నది ఇప్పుడే నిర్ణయించలేం. మాలో ఎవరు చివరి వరకు జీవించి ఉంటారో, వారు తమ ఇష్టప్రకారం నిర్ణయించుకుంటారు. 

ఆస్తులు పిల్లలకే చెందాలని ఏముంది, ఆశ్రమాలకైనా చెందవచ్చు. ఇక ఈ ప్రస్తావన ఇక్కడితో ఆపేయండి," అని కాస్త కటువుగానే చెప్పి, అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు.


అక్షర ఆ సంభాషణనంతా విన్నది. నితిన్ తనకు అర్థమయ్యేలా చెప్పడానికే తన తండ్రితో ఆస్తి ప్రస్తావన తెచ్చాడని ఆమెకు బోధపడింది. పెద్దలు జీవించి ఉండగానే వారి ఆస్తుల గురించి ప్రశ్నించడం సరైన పద్ధతి కాదని గ్రహించింది.


ఆ రాత్రి ఏకాంతంలో అక్షర నితిన్‌ను ప్రేమతో కౌగలించుకుని, అతని గుండెలపై తల ఆనించింది.


"సారీ డార్లింగ్! నన్ను క్షమించు. నా కోసం నీకు ఇష్టం లేని విషయాన్ని మా నాన్న దగ్గర ప్రస్తావించాల్సి వచ్చింది. కుటుంబాల్లో ప్రేమానురాగాలు వెల్లివిరియాల్సిన చోట ఆస్తుల కోసం ఆశపడటం, స్వార్థాన్ని ప్రదర్శించడమేనని నేను గ్రహించాను," అంది పశ్చాత్తాపంతో.


నితిన్ చిరునవ్వుతో, "మనలాంటి యువతరం పెద్దల ఆస్తుల మీద ఆశలు పెట్టుకోవడం, వాటి కోసం వారితో వాదనలకు దిగడం సమంజసం కాదు. 


పెద్దలు తమ జీవితకాలంలో సంపాదించుకున్న ఆస్తిని ఎలా వినియోగించుకోవాలో, ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికుంది. 


మనం కోరుకోవాల్సింది వారి ఆస్తిలో వాటా కాదు, వారి ఆశీస్సులు. అయినా, ప్రపంచంలో అందరికంటే నేనే సంపన్నుడిని. నాకు నీ ప్రేమ అనే పెన్నిధి లభించింది. అంతకంటే నేను కోరుకునే సంపద మరేముంటుంది?" అన్నాడు.


నితిన్ ప్రేమపూర్వకమైన మాటలకు అక్షర సిగ్గుతో తల వంచుకుంది. భర్తను మరింత ఆప్యాయంగా హత్తుకుంది.


@@@

***









📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


C..S.G . కృష్ణమాచార్యులు  గారి కొన్ని ఇతర రచనలు:


C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


Dr. C..S.G . కృష్ణమాచార్యులు

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

 

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి  లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో.  నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు  ప్రచురించాయి.

 ఈ మధ్యనే నాకిష్టమైన  తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను.  ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది,  చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ-  వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page