అద్భుతం జరగడానికి అరనిమిషం చాలు
- Nallabati Raghavendra Rao

- 4 minutes ago
- 7 min read

Adbhutham Jaragadaniki Aranimisham Chalu | Telugu Comedy Story | Nallabati Raghavendra Rao
అద్భుతం జరగడానికి అరనిమిషం చాలు | తెలుగు హాస్య కథ | నల్లబాటి రాఘవేంద్ర రావు
Published in manatelugukathalu.com on 05/05/2026
ఒక ప్రమాదం కోటీశ్వరుడిని మార్చింది.
ఆసక్తికరమైన ఈ కథను నల్లబాటి రాఘవేంద్రరావు గారి అద్భుతం జరగడానికి అరనిమిషం చాలు కథలో తెలుసుకోండి.
అఖండేశ్వరరావు తన రాజభవనం లాంటి ఇంటి నుండి నడుచుకుంటూ ఊరు బయట ఉన్న పెద్ద పార్కులో వాకింగ్ చేయడానికి సెంటర్‌లో ఉన్న మట్టిదిమ్మ అరుగు దాటి వెళుతున్నాడు. ప్రతిరోజు అది అతని అలవాటు. తన ఇంటి నుండి ఊరవతల ఉన్న ఆ పార్కుకి వెళ్ళే దారి పొడుగునా అటూఇటూ ఇళ్ళు, షాపులు చాలా ఉంటాయి. అఖండేశ్వరరావు చిరకాలం నుండి అక్కడే ఉంటున్నాడేమో. ఊరందరూ అతనికి తెలుసు. వాళ్లందరికీ అఖండేశ్వరరావు బాగా తెలుసు.
అయితే అఖండేశ్వరరావు ఒక స్టేజిలో ఉన్న వ్యక్తి. అతడి చేతుల పది వేళ్లకు 10 బంగారు ఉంగరాలు ఉంటాయి.
మెడలో మోయలేని బరువైన బంగారపు గొలుసు.
అతనికి ఎప్పుడూ ఏదీ అవసరం రాదు. మనుషులతో అసలు పనే లేని మహారాజయోగ అదృష్టజాతకుడు. ఒకవేళ అవసరం వచ్చినా ఏ షాపు దగ్గర ఆగడు. ఏ వ్యక్తితో మాట్లాడడు. కనీసం వాళ్ళ ముఖం వైపు కూడా చూడడు. చూస్తే వాళ్ళు నవ్వితే, మళ్ళీ తను నవ్వవలసి వస్తుంది అన్న ఒక ఈగో ఉన్న వ్యక్తి అఖండేశ్వరరావు.
అలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు, గత 20 సంవత్సరాల నుండి అఖండేశ్వరరావు దినచర్య అదే. ఎవరితో కూడా చిన్న అవసరం పడకుండా మహారాజులా బ్రతికేస్తున్నాడు.
ఆ రోజు అదే రాజదర్పంతో నడుచుకుంటూ వెళ్తున్న అఖండేశ్వరరావుని చూసి ఆ మట్టిదిమ్మ అరుగు మీద
కూర్చున్న జనం ఇలా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.
''ఈ దొరగారు ఏ రోజు మనతో మాట్లాడరేటి సుబ్బరాయుడు.''
''ఆయన చాలా గొప్పోడు రా. మనందరం అలగా జనం. ఏ రోజు డబ్బులు ఆ రోజు సంపాదించుకొని పొట్టను పోషించు కుంటున్నాం. నీ పిచ్చి కానీ, మనలాంటి వాళ్ళ తోటి ఆయనకు ఏం పని ఉంటుంది. ఒకవేళ ఆయన మనల్ని పలకరించినా మనం ఆయనతో మాట్లాడే హోదా వ్యక్తులం కాదు కదా.'' మనకెందుకులే అన్నట్టు అన్నాడు చిట్టి నాయుడు.
''అట్టా కాదు కానీ చిట్టి నాయుడు. ఒక రోజా రెండు రోజులా? ఏకంగా 20 ఏళ్ల నుండి ఆయన మనం ఒకరి ముఖాలు ఒకరం చూసుకుంటున్నాం కదా. పోనీ మనతో కాకపోయినా ఈ దారి పొడుగునా ఎవరితోనూ అతను మాట్లాడడం లేదు కదా.'' ముందుకొచ్చి అన్నాడు మీసాల చిన్నగంటయ్య.
"కనీసం సైగ కూడా చేయడు. అతి కష్టం మీద చిన్న చిరునవ్వు కూడా నవ్వడు." అన్నాడు దూరంగా కూర్చున్న రాయుడు.
''పోనీ ఆయన పలకరించడం లేదు. నువ్వెందుకు పల కరించడం లేదు.''
''నేను మాట్లాడడానికి, పలకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ పెద్దమనిషి తల పైకెత్తి మన కళ్ళల్లోకి చూస్తే కదా.''
''ఒక్కో మనిషి విధానం ఒక్కోలా ఉంటుంది. మనకెందుకు అతని గొడవ. ఈ టీ తాగు'' అందిస్తూ అన్నాడు పక్కనే ఉన్న బుల్లి సత్యం.
''నువ్వు అలా అనమాకు. నేను మొన్న.. 'నమస్కారం సార్' ..అన్నాను. ఆయన తల పైకి ఎత్తకుండానే 'వెళ్ళు వెళ్ళు..' అన్నట్టు మూడు వేళ్లతో ఊపి చూపించాడు. బిక్క చచ్చిపోయినట్టు అయిపోయాను అంటే నమ్ము.''
''మన ఊరందరి ఆస్తి కలిపినా ఆయన ఆస్తిలో సగం ఉండదు. ఆ విషయం తెలుసా నీకు.''
దు ఆ విషయం తెలుసా నీకు.''
''ఆస్తి పాస్తులు గొడవెందుకు ఇప్పుడు. ఇదిగో ఈ మట్టిదిమ్మ అరుగు మీద కూర్చుని మనం ఇలా కబుర్లు చెప్పు కున్నన్నాళ్ళు మనతో ఆయన మాట్లాడయ్యా బాబు.
మనందరం కలిసి ఒకసారి రేపు ఆయన ఇంటికి వెళ్ళి పోదాం. అమ్మోరు గుడిలో హారతి పూజకు చందా ఇమ్మని అడుగుదాం. దానితో ఆయనతో మనం మాట్లాడినట్టు అవుతుంది, ఆయన మనతో మాట్లాడినట్టు అవుతుంది.'' చిట్టచివరి ముగింపు పలికినట్టు అన్నాడు చిన్నగంటయ్య.''
*
మర్నాడు అందరూ కలిసి ఓ 20 మంది ఆయన ఇంటికి వెళ్లి గేటు బయట నిలబడ్డారు.
''ఇదిగో.. అఖండం దొర మనల్ని అందరినీ లోపలికి రమ్మని అక్కడ కుర్చీలు ఉన్నాయి చూడు అందులో కూర్చోబెట్టిస్తాడు. వాచ్మెన్ చేత టీలు తెప్పించి ఇస్తాడు. 20 ఏళ్ల నుండి ముఖాలు ముఖాలు చూసుకుంటున్నప్పటికీ మనం అందరం కనీసం మాట్లాడుకోలేకపోతున్నందుకు బాధపడి ఈ వంకనైనా మనం వచ్చినందుకు చాలా సంతోషిస్తాడు.
మనం అనుకున్నట్టు అయిదు వేలు కాదు, 50 వేలు డొనేషన్ ఇస్తాడు చూడండి.'' కాలర్ ఎగరేస్తూ చెప్పాడు సుబ్బరాయుడు.
విషయం తెలుసుకున్న వాచ్మెన్ లోపలికి వెళ్ళి తన యజమాని అఖండేశ్వరరావుకి విషయం చెప్పినా, గంట వరకు బయటకు రాలేదు ఆయన.
ఆ తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా దర్జాగా బయటకు వచ్చి.. వచ్చిన తర్వాత వాళ్ళ ఒక్కరి వైపు కూడా చూడ కుండా వాళ్ళు చెప్పేది వినకుండా ..'వెళ్ళండయ్యా'.. అన్నట్టు మూడు చేతి వేళ్ళు చూపించి లోపలికి వెళ్ళిపోయాడు చిరాకుగా.
వచ్చిన వాళ్ళందరూ సిగ్గు పడిపోయి, నీరసపడిపోయి తిరిగి వెళ్ళిపోయారు.
**
ఆరు నెలలు గడిచాయి. ఒక రోజు నడుచుకుంటూ వాకింగ్ కోసం తన పని మీద వెళుతున్న అఖండేశ్వరరావుని అందరూ కూర్చునే ఆ మట్టిదిమ్మ అరుగు సెంటర్ దగ్గర ఆటో గుద్దేసింది. స్పృహ కోల్పోయాడు అఖండేశ్వరరావు.
ఇది చూసిన ఆ చుట్టూ ఉండే, అతనిని తెలిసిన వాళ్ళు అందరూ ఓ 50 మంది అక్కడ పోగయిపోయి..
'అయ్యయ్యో..' అంటూ కంగారు పడిపోయి పైకి లేవదీసి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కు మరో ఆటోలో తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ వైద్యం చేయించాక 'కంగారు పడకండి.. పర్వాలేదు.. సమయానికి తీసుకొచ్చారు... లేకుంటే.. ప్రాణానికే ప్రమాదం.. ' అని డాక్టర్ చెప్పాక.. వైద్యం జరిగాక అదే ఆటోలో తిరిగి అతని ఇంటికి తీసుకువెళ్ళిపోయారు ఆ జనం అందరూ. బాధతో మూలుగుతున్నట్టున్న అత నిని ఇంట్లో దిగవిడిచి, వాచ్మెన్ పాపారావుకు జరిగింది చెప్పి, ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు.
మరో 15 రోజులు గడిచింది.
నీరసం తగ్గాక ఆరోజు ఎప్పటిలాగే నడుచుకుంటూ
వెళుతున్న అఖండేశ్వరరావు ఆ మట్టిదిమ్మ అరుగు ప్రాంతానికి వచ్చేసరికి సడన్‌గా ఆగిపోయాడు.
మనిషిలో మనిషితనం మొట్టమొదటగా పెల్లుబికినట్టు అయిపోయాడు అఖండేశ్వరరావు.
వారం క్రితం జరిగిన సంఘటన కళ్ళల్లో కదలాడింది.
ఆ ప్రాంతం శ్రీకృష్ణుడు గీతాబోధ చేసిన ప్రాంతంగా అనిపించింది అతని మనసుకు, కళ్ళకు.
తన కోట్లాది రూపాయలు, రత్నాలు, ముత్యాలు, బంగారాలు, వజ్రాలకన్నా అక్కడి మట్టిదిబ్బ అరుగు ఉన్నతంగా కనిపించింది, అనిపించింది.
ఆ రోజు అక్కడివాళ్ళు తనను రక్షించకపోతే... ఏమో
ఏమైయ్యుండేదో.. తలచుకొని పశ్చాత్తాప పడిపోయి
సిగ్గుపడిపోయాడు.
అక్కడ కూర్చున్న అందరూ కిందకి దిగి అతని దగ్గరకు వెళ్ళబోయారు.
'మీరు రావద్దు, నేనే మీ దగ్గరికి వస్తున్నాను' అన్నట్టు సైగ చేసి, నెమ్మదిగా మట్టిదిమ్మ అరుగును సమీపించి అతి నెమ్మదిగా వాళ్లందరి మధ్య కూర్చుండిపోయాడు నవ్వుతూ.
ఇప్పుడతని హోదా, అహం, అజ్ఞానం, దుర్మార్గత్వం,
ఇప్పుడతని హోదా.. అహం.. అజ్ఞానం..దుర్మార్గత్వం..
రాక్షసత్వం అన్నీ పటాపంచలయి పోయాయి.
ఆరోజు మొదలు ప్రతిరోజు వాళ్లందరి మధ్య కూర్చుని
తన్మయత్వంతో తనివితీరా కబుర్లు చెప్పుకోవడం దినచర్యగా అలవాటు చేసుకున్నాడు అఖండేశ్వరరావు.
ఇప్పుడు అతని గత రుగ్మతలన్నీ మాయమైపోయాయి. ఆ ప్రదేశం మామూలు మట్టిదిబ్బ అరుగు కాదిప్పుడు.
అఖండేశ్వరరావు మనిషిగా మారిన తర్వాత ప్రేమతత్వం
నిండి ఉన్న, మానవత్వం పెరిగిన మంచి మనుషుల
మధ్య మాములు సాదా మనిషిగా కూర్చున్న దేశవాళీ మట్టిదిబ్బ అరుగు ప్రాంతం అది.
మనిషి పశువుగా మారటం సహజమే. దేశకాల మాన ఆర్థిక పరిస్థితులను బట్టి చాలాచోట్ల అలాగే జరుగుతుంది.
కానీ పశువు మనిషిగా మారటం అద్భుతమే.
అటువంటి అద్భుతం జరగడానికి కూడా ప్రస్తుత పరిస్థితులలో ఒక చిన్న సంఘటన చాలు. ఒక క్షణంలో మనిషి
'మనీషి' గా మారడానికి. అదే జరిగింది ఆఖండేశ్వర రావు విషయంలో.
సమాప్తం
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి కొన్ని ఇతర రచనలు:
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు









Comments