అహం - అవమానం

Aham Avamanam - Telugu Emotional Story | Vasundhara Rani Munipalle
అహం - అవమానం - తెలుగు భావోద్వేగ కథ | వసుంధర రాణి మునిపల్లె
Published in manatelugukathalu.com on 09/04/2026
అహంకారం ఒక చిన్న చిచ్చుగా మొదలై…పెద్ద అవమానంగా మారిపోవచ్చు.
అహం - అవమానం అనే ఈ కథలో, ఒక అత్త తన అహాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన పని ఎలా ఒక నిర్దోషి కోడలిని బాధలోకి నెట్టిందో మనం చూస్తాం.
ఈ కథ మనకి ఒక గొప్ప నిజం చెబుతుంది —అహం గెలిస్తే… సంబంధాలు ఓడిపోతాయి.
ఒక మధ్యతరగతి ఇంట్లో అత్తగారికి, కోడలికి మధ్య మాట పట్టింపు వచ్చింది. అత్తగారు తన అహాన్ని ప్రదర్శించడానికి, కోడలిని భయపెట్టాలని నిశ్చయించుకున్నారు. ఎవరికీ చెప్పకుండా ఒక వృద్ధాశ్రమంలో చేరిపోవాలని నిర్ణయించుకున్నారు. వెళ్తూ వెళ్తూ తన మనవరాలిని పిలిచి ఇలా అన్నారు:
"నేను అక్కడ ఎన్ని రోజులు ఉండగలనో నాకే తెలియదు. అయినా నా వయసు వాళ్ళతో ఉంటే నాకు బాగుంటుంది. నువ్వు చదువు కోసం హాస్టల్లో ఉండటం లేదూ? అలాగే ఇది కూడా! నీకు నీ వయసు పిల్లలతో అక్కడ ఎలా సరదాగా ఉంటుందో, నాకు కూడా నా వయసు వాళ్ళతో ఆశ్రమంలో అలాగే బాగుంటుంది. అందుకే ప్రస్తుతానికి నేను ఆశ్రమానికి వెళ్తున్నానని ఎవరికీ చెప్పకు" అని ఒట్టు వేయించుకున్నారు.
తీరా అక్కడికి వెళ్ళాక ఆ వాతావరణం, తోటి వయసు మళ్లిన వాళ్ళ ముచ్చట్లు నచ్చడంతో తొమ్మిది నెలల నుండి ఆవిడ అక్కడే ఉండిపోయారు. అయితే అక్కడ కూడా ఆవిడ ప్రశాంతంగా ఉండలేదు. తన రూమ్మేట్తో ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉండేవారు. ఆ రూమ్మేట్ మగవాళ్ళతో కలిసి కబుర్లు చెబుతూ ఉండటం ఈవిడకు అస్సలు నచ్చేది కాదు. ఒకసారి మేనేజర్‌కి ఫిర్యాదు కూడా చేశారు. ఆయన ఆమెను మందలించినా, రెండు రోజులు జ్వరం అని పడుకుని మళ్ళీ మామూలే. దీనికి తోడు ఆ రూమ్మేట్ ఫ్యాన్లు, గీజర్లు ఆపకపోవడం, పైగా ఈవిడ వస్తువులన్నీ వాడేసుకోవడం లాంటి పనులతో బామ్మగారికి అక్కడ ఉండటం నరకంలా అనిపించేది. అందరికీ ఈవిడ మీద చాడీలు కూడా చెప్పేది.
కానీ తిరిగి ఇంటికి వెళ్దామంటే తన అహం అడ్డువచ్చింది. మనవరాలికి ఫోన్ చేసినప్పుడు మాత్రం "నేను ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాను" అని గొప్పలు చెప్పేవారు. మనసులో మాత్రం 'ఈ కోడలు నా గురించి అందరికీ ఏం చెప్పిందో? ఆశ్రమంలో ఉన్నానని చెబితే తనకే కదా అవమానం. అయినా నా లాంటి వంగిపోయి నడిచే ముసలివాళ్ళ మీద అందరికీ జాలి ఉంటుంది కానీ, కోడలు మీద ఉండదు కదా' అని లెక్కలు వేసుకునేవారు. అందుకే కోడలు ఎవరికీ ఏమీ చెప్పలేదు.
సరిగ్గా అప్పుడే చుట్టాలందరూ కలిసే ఒక కార్యక్రమం వచ్చింది. బామ్మగారు ఇదే మంచి సమయం అనుకున్నారు. కోడలి పుట్టింటి వారందరూ వస్తారు కాబట్టి, అక్కడ తన కష్టాలు చెప్పి కోడలిని అందరి ముందు దోషిని చేయాలని ప్లాన్ వేశారు.
ఆ కార్యక్రమంలో ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి మెల్లగా కూర్చుని, "మా ఆశ్రమంలో పాములు వస్తాయి తెలుసా! చాలా భయంగా ఉంటుంది" అని మొదలుపెట్టారు. ఆ తర్వాత మాట మార్చి, "అక్కడ ఆవులు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, శక్తిపీఠాలు ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది" అని రంగులు మార్చి చెప్పారు. అది విన్న బంధువులంతా నోళ్లు వెళ్లబెట్టారు. ఇంత పెద్ద వయసులో ఆవిడ ఆశ్రమంలో ఉండటం ఏంటని అందరూ కోడలిని తప్పుబట్టడం మొదలుపెట్టారు. "అంత పెద్ద ఆవిడను అలా ఎలా ఆశ్రమంలో పెట్టారు?" అని కోడలి మీద ఒత్తిడి తెస్తే, తను వచ్చి కాళ్ళావేళ్ళా పడి రమ్మని బతిమాలుతుందని బామ్మగారు ఆశపడ్డారు.
అందరూ వెళ్ళిపోతుంటే, మనవరాలు వచ్చి బాధగా "బామ్మా, అక్కడ ఇబ్బందిగా ఉంది కదా! మాతో ఇంటికి వచ్చేయొచ్చుగా? మళ్ళీ ఆ ఆశ్రమానికి ఎందుకు?" అని అడిగింది.
బామ్మగారు కోడలి వైపు ఒక వ్యంగ్యపు చూపు చూసి, అందరికీ వినిపించేలా ఇలా అన్నారు: "అదేంటమ్మా అలా అడుగుతావు? నేను ముందే చెప్పాను కదా. నువ్వు చదువు కోసం హాస్టల్లో ఎలా ఉంటావో, ఇది కూడా అంతే! ఇక్కడ మీ అమ్మతో ఉండి రోజూ మాటలు పడటం కంటే, అక్కడ నా లాంటి వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం నాకు నచ్చింది. అందుకే మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను."
ఆ మాటలతో కోడలు ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. తను ఏ తప్పూ చేయకపోయినా, అందరి ముందు తనను ఒక రాక్షసిలా చిత్రీకరించిన బామ్మగారి చాకచక్యానికి ఆశ్చర్యపోయింది. బంధువులందరూ కోడలిని అసహ్యించుకుంటూ చూస్తుండగా, బామ్మగారు మాత్రం తన పంతం నెగ్గిందన్న గర్వంతో, ఆ వంగిన నడుముతోనే హుందాగా ఆశ్రమం కారు వైపు నడిచారు. కోడలిని అందరి ముందు విలన్ని చేసి, తను మాత్రం త్యాగమూర్తిలా మళ్ళీ ఆశ్రమానికే ప్రయాణమయ్యారు.
***
సమాప్తం.
వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.





Comments