top of page
Original.png

అమ్మకే అమ్మలా..

15 hours ago
6 min read

సవతితల్లి కోమలిని ప్రేమగా చూసుకుంటున్న చిన్నారి సుమన, పక్కన తమ్ముడు సుమంత్ మరియు తండ్రి శ్రీకర్ ఉన్న భావోద్వేగ కుటుంబ దృశ్యం

Ammake Ammala.. - Telugu Emotional Family Story | Madhupatra Sailaja Uppaluri

అమ్మకే అమ్మలా.. - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి  

Published in manatelugukathalu.com on 21/11/2026


“అమ్మకే అమ్మలా..” ఓ చిన్నారి ప్రేమ, ఓర్పు, బాధ్యత, మాతృత్వం చుట్టూ అల్లుకున్న హృదయస్పర్శి కుటుంబ కథ. పిల్లలపై ప్రేమ ఉంటే వయసుతో సంబంధం లేకుండా మనిషిలో మాతృత్వం ఎలా మేల్కొంటుందో ఈ కథ చెబుతుంది.


స్కూలుబస్సు దిగి ఇంటికొచ్చారు సుమంత్, సుమనలు. ఎప్పటిలాగే ఇంటికి తాళం వేసి ఉంది. “ఇవాళ అసలే చాలా హోంవర్కులున్నాయి. 


అమ్మ ఎప్పటికి వస్తుందో? ఏమో?” అనుకుంటూ పక్కఫ్లాట్ కాలింగ్‌బెల్ నొక్కింది సుమన. 


"యా దేవీ సర్వభూతేషు క్షాంతి రూపేణ సంస్థితా" అంటూ మాతా దుర్గాదేవిని స్తుతి చేస్తూ శ్లోకాలను పఠిస్తున్న యశోదమ్మగారి గొంతు విన్న సుమన నెమ్మదిగా తలుపు తోసుకుని లోపలికి వెళ్ళింది తమ్ముడితో కలసి.


పిల్లలను చూసి కూర్చోమని యశోదమ్మ చేసిన సైగతో సోఫాలో కూర్చున్నారు ఇద్దరూ. 


అయిదు నిమిషాలలో మిగిలిన శ్లోకాలను చదవటం పూర్తిచేసి పుస్తకాలను అల్మరాలో సర్దేసి వచ్చారు యశోదమ్మగారు. 


వెంటనే “‘క్షాంతి రూపేణ సంస్థితా’ అంటే అర్థమేమిటండీ బామ్మగారూ?” అంటూ అడిగింది, చనిపోయిన తన తల్లి భావాలను పూర్తిగా పుణికిపుచ్చుకున్న సుమన.


“నువ్వు ఎప్పుడొచ్చావు? నేను చదువుతున్న శ్లోకం ఎప్పుడు విన్నావు?” అని ఆశ్చర్యపోతూనే సుమన అడిగిన ప్రశ్నకి సమాధానంగా “అమ్మవారి శక్తి మాయ, తెలివి, బుద్ధి, నిద్ర, క్షుధ, ఛాయ, శక్తి, తృష్ణ, క్షాంతి, జాతి, లజ్జా, శాంతి, శ్రద్ధ, కాంతి, లక్ష్మి, వృత్తి, స్మృతి, దయ, తుష్టి, మాతృ మరియు భ్రాంతి వంటి 21 రూపాలలో నిక్షిప్తమై ఉంటుంది. 


‘క్షాంతి’ అంటే ‘ఓర్పు’” అని అర్థం చెప్పారు యశోదమ్మగారు. సుమనకి చిన్నవయసులోనే చాలా మాటలకు అర్థాలను అవగతం చేసుకునే పరిణతిని ఇచ్చారు ఆ అమ్మవారు. అందుకే సవతితల్లి తమను పట్టించుకోకపోయినా ఓర్పు కలిగి మెలుగుతోంది.


దూరాన ఉన్న తండ్రి “ఎలా ఉన్నారమ్మా?” అని అడిగితే “బాగానే ఉన్నాం” అంటూ లేని ఉత్సాహాన్ని మాటల్లో వెలిబుచ్చగలుగుతోంది.


శ్రీకర్, కోమలి దంపతులకు వివాహమయి రెండేళ్ళు దాటుతోంది. శ్రీకర్ మొదటి భార్య ‘జ్యోతి’, అమ్మాయి, అబ్బాయిలతో కలసి సంతోషంగా కాపురం చేస్తూంటే చూసి ఓర్వలేని విధి ‘కరోనా’ రూపంలో కాటువేసి జ్యోతిని తనలో కలిపేసుకుంది.


అమ్మ దూరమైన పిల్లలు ఓ ఆరునెలలు అమ్మమ్మ తాతయ్యల దగ్గరే ఉన్నారు. శ్రీకర్ పిల్లలను తన దగ్గరే ఉంచుకోవాలి అనుకుని “ఓ వంటమనిషిని పెట్టుకుని పిల్లల్ని పెంచుకుంటాను. మీ సలహా ఏమిటి?” అని అడిగాడు. 


అటు అత్తమామలు, ఇటు తల్లిదండ్రులు కూడా “వద్దు, ఇది ఒక్కరోజు సమస్య కాదు. రాబోయే కాలంలో ఆడపిల్ల సుమనకి తల్లి అవసరం చాలా ఉంటుంది. 


అందుకే నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకుంటే పిల్లలకి తల్లిలేని కొరత తీర్చవచ్చు” అని చెప్పి శ్రీకర్ వాళ్ళ అమ్మానాన్నలే తమ దూరపు బంధువులమ్మాయి అయిన కోమలితో వివాహం చేశారు.


పేదింటి అమ్మాయి అయిన కోమలి ఎప్పుడూ తాను పుట్టిన పల్లెటూరిని వదిలి బయట ప్రపంచం చూసింది లేదు. తన భర్త పెద్ద ఉద్యోగస్తుడై ఉండాలి, పెద్దపెద్ద నగరాలలో నివాసముండాలని కలలు కనేది. 


ఆ కలలను సాకారం చేసుకునే అవకాశం ఇప్పుడామెకు వచ్చింది. అందుకే రెండో పెళ్ళివాడు, అందునా పిల్లల తండ్రి అయిన శ్రీకర్‌తో వివాహానికి ముందువెనుకలు ఆలోచించకుండా సిద్ధమయ్యింది. 


కాపురానికొచ్చిన కోమలి కొరకు విశాలమైన ఫ్లాట్ తీసుకున్నాడు. అందరికీ వేరువేరు గదులు ఉన్నాయి. 


ఎంజాయ్ చేయటానికి కలర్ TV, చేతిలో స్మార్ట్‌ఫోను, కావలసినంత డబ్బు. కోమలి ఏ విధమైన జీవితం కోరుకుందో అవన్నీ సమకూరటంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆమె ఉత్సాహాన్ని చూసిన శ్రీకర్ తన పిల్లలకి ఇక ఏ లోటూ రాదనుకున్నాడు.


ఇంతలో ఓ ప్రాజెక్ట్ పని మీద ఢిల్లీ వెళ్ళాల్సివచ్చింది శ్రీకర్. 


కొద్దినెలల కోసం పిల్లల చదువులు మాన్పించటం ఇష్టంలేక పోవటంచేతనూ, తిరిగివచ్చాక మళ్ళీ అదే స్కూలులో ప్రవేశానికి ఎక్కువమొత్తంలో డబ్బు కట్టాల్సివస్తుంది కదా అన్న ఆలోచనతోనూ, ముఖ్యంగా కోమలిపై కలిగిన భరోసాతోనూ తప్పని పరిస్థితులలో కుటుంబాన్ని హైదరాబాద్‌లోనే వదిలి తానొక్కడు ఢిల్లీకి వెళ్ళిపోయాడు.


దానితో కోమలికి అడ్డు అదుపు లేకుండా పోయింది. పిల్లల తిండి, చదువు, ఇల్లు ఏవీ పట్టించుకోవటం మానేసింది. సినిమాలకనీ, షాపింగ్‌లకనీ ఎప్పుడు చూసినా బయటతిరుగుళ్ళు ఎక్కువయ్యాయి. 


ఒకరోజు కోమలితో “చక్కగా పిల్లలకి వండి పెట్టి, స్కూలుకి పంపి వారు తిరిగి వచ్చే సమయానికి ఇంటిదగ్గర ఉండేవిధంగా నీ కార్యక్రమాలని సర్దుబాటు చేసుకుంటే పిల్లలకి ఇబ్బంది ఉండదు కదా!” అని చడామడా కేకలేశారు యశోదమ్మగారు.


“నాకేం అవసరం? ఆర్డర్ పెట్టుకుంటే వచ్చే భోజనానికి అంత శ్రమ నేనెందుకు పడాలి? అయినా నా వ్యవహారాలలో మీ జోక్యం అవసరమా?” అని పెద్దావిడ అని కూడా చూడకుండా తలబిరుసుగా సమాధానం ఇచ్చింది.


సుమనకి యశోదమ్మగారు బాగా అలవాటయ్యారు. ‘బామ్మగారు’ అని పిలుస్తున్నందుకు తన కష్టం, సుఖం తల్లిలా విని చక్కని సలహాలనిస్తున్నారు. రోజూ హోటల్ భోజనం తినేసరికి పెద్దపిల్ల కాబట్టి సుమన బానే తట్టుకుంది. 


కానీ సుమంత్‌కి ఆ కారాలు, మసాలాలు సరిపడక కడుపునొప్పితో విరేచనాలు వచ్చి చాలా బాధపడ్డాడు. వాడికి యశోదమ్మగారే దిక్కయ్యారు.


వాడి బాధని చూసిన సుమన ఓ రోజు “బామ్మగారు నాకు వంట నేర్పండి” అంటూ యశోదమ్మగారి దగ్గర వంట నేర్చుకుంది. అది మొదలు తానే ఉదయమే నిద్ర లేచి వచ్చీరాని వంటతో తమ్ముడికి పెట్టి తాను ఇంత తిని, ఇద్దరికీ లంచ్‌బాక్స్ సర్దుకుని స్కూలుకెళ్ళేది.


ఆరవ తరగతి చదివే సుమన ఎంతో ఓర్పుగా పనులన్నింటినీ చక్కబెట్టుకుంటూ, తమ్ముడితో కలసి చదువుకుంటూ చాలా ఉత్సాహంగా కోమలితో కూడా “అమ్మా ఇవాళ ఎక్కడికెళ్ళావు? ఈ హైదరాబాద్ నీకు నచ్చిందా? నీ ఫ్రెండ్స్ ఎక్కడుంటారు?” అంటూ మాట్లాడేది. 


యశోదమ్మగారు సుమనని చూస్తూ “పై నుండి ఆ కన్నతల్లే ఏదో శక్తి రూపంలో ఈ అమ్మాయిని నడిపిస్తోంది” అనుకునేవారు.


తన కొడుకు నరేంద్రతో ఓసారి శ్రీకర్‌కి ఫోను చేయించి ఇక్కడి పరిస్థితులను వివరించి చెప్పి “ఎప్పుడైనా ముందు చెప్పకుండా ఇక్కడికి వస్తే పిల్లలెంతగా కష్టపడుతున్నారో చూడవచ్చు” అని చెప్పించింది యశోదమ్మ. 


అలా ఓ సెలవు రోజు శ్రీకర్ వచ్చేసరికి సుమంత్, సుమనలు హాలులో కూర్చుని పాలు తాగుతున్నారు. అనుకోని విధంగా తండ్రి రావటం ఆ పిల్లలకి ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ అనిపించింది. 


సుమనకి కన్నీళ్ళు ఆగటం లేదు. సుమంత్ అయితే తండ్రిని బల్లిలా అతుక్కుపోయాడు. “ఎలా ఉన్నారమ్మా?” అంటూ పిల్లలిద్దరినీ దగ్గరకి తీసుకున్నాడు శ్రీకర్.


కోమలి బెడ్‌రూంలో AC వేసుకుని హాయిగా నిద్రపోతోంది. హాలులో ఇంత హడావుడి జరుగుతున్నా లేవనేలేదు. “నాన్నా! బ్రష్ చేసుకున్నావా? కాఫీ కలుపుకొస్తాను” అంటూ కిచెన్‌లోకి వెళ్ళింది సుమన.


“కన్నా! పద మనం అమ్మని నిద్ర లేపుదాం” అన్నాడు శ్రీకర్. సుమంత్ భయపడుతూ “వద్దు నాన్నా! అమ్మ కేకలేస్తుంది” అంటూ శ్రీకర్‌కి దూరంగా జరిగి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు సుమంత్. శ్రీకర్ వెళ్ళి కోమలిని నిద్ర లేపాడు.


“సుమనా! ఈ రోజు ఆదివారమే కదా! మీకు స్కూలు కూడా ఉండదు. మీరు పడుకోరు, నన్ను పడుకోనివ్వరు” అంటూ దుప్పటిలోనుండే అరిచింది కోమలి. శ్రీకర్‌కి చెప్పలేనంతగా కోపం వచ్చింది. దుప్పటి లాగి “కోమలి నిద్రలే” అని గట్టిగా అన్నాడు.


అతని గొంతు విని తటాలున నిద్రలేచి “మీరా? ఎప్పుడొచ్చారు? వస్తున్నట్లుగా కనీసం ఫోనులో అయినా చెప్పలేదు? ఉండండి, బ్రష్ చేసుకుని వస్తాను” అని వేగంగా బాత్‌రూంలోకి వెళ్ళింది కోమలి. ఈలోపుగా అమ్మానాన్నలకి కాఫీ కలుపుకొచ్చింది సుమన.


“సుమనా, ఈ రోజు మనం బ్రేక్‌ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు అన్నీ హోటల్‌లోనే చేద్దాం. 


ఏమైనా హోంవర్క్స్ ఉంటే పూర్తి చేసుకుని తొందరగా తయారవ్వండి” అన్నాడు శ్రీకర్. పిల్లలు “అలాగే నాన్నా” అని చెప్పి తమ రూమ్‌కి వెళ్ళిపోయారు.


“ఏమిటిది కోమలి? నిన్ను పెళ్ళి చేసుకున్నది ఎందుకోసం చెప్పు? చిన్నపిల్ల సుమన మనకి కాఫీ పెట్టివ్వటం ఏమిటి? పిల్లలకి తల్లివై అన్ని పనులను చేసిపెడతావనే నమ్మకంతో కదా పిల్లల్ని నీ దగ్గర వదిలి నేను ఢిల్లీకి వెళ్ళాను. 


ఎందుకిలా చేస్తున్నావు?” అంటూ అసహనంగా అడిగాడు శ్రీకర్. “ఏం, మీరు రాగానే మీ కూతురు నా మీద పితూరీలు చెప్పిందా?” అంటూ ఎదురుదాడికి తయారయ్యింది కోమలి. “ఊరికే దాన్ని ఆడిపోసుకోకు. 


నేను ఎప్పుడు ఫోను చేసి అడిగినా ‘మేమందరం బాగానే ఉన్నాం’ అనే మాట మించి ఇంకో మాట చెప్పింది లేదు” అన్నాడు శ్రీకర్. “మొన్నటికి మొన్న బయటకి వెళ్ళిన నువ్వు రాత్రంతా మీ స్నేహితుల ఇంటిలోనే ఉండిపోయి, మరునాడుదయం పిల్లలు స్కూలుకి వెళ్ళిన తరువాత వచ్చావని నాకు యశోదమ్మగారు చెప్పారు. 


అందుకే ఇలా అర్ధాంతరంగా రావాల్సి వచ్చింది. నీకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పించాను. పిల్లల అవసరాలను తీర్చటం తప్ప మరే ఇతర పనులు నీకు వద్దని చెప్పాను. 


కానీ నువ్వు చేస్తున్నదేమిటి? పిల్లల్ని గాలికి వదిలేశావు” కాస్త కోపంగా అన్నాడు శ్రీకర్. ఇంతలో స్నానం చేసి వచ్చిన సుమన “అమ్మా! నిమ్మరసంగానీ, ఆరెంజ్ జ్యూస్‌గానీ తాగుతావా?” అని అడిగింది. 


“అమ్మకి జ్యూసులెందుకు?” ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకర్. “నాన్నా! అమ్మ నీకు చెప్పలేదా? మనింటికి ఓ బుజ్జి బేబీ రాబోతోంది. 


అందుకే అమ్మకి కంగ్రాట్స్ చెప్పు” అంది సుమన. “ఏమిటి కోమలి, ఇది నిజమా? మరి చెప్పవేం?” అంటూ విష్ చేశాడు శ్రీకర్. “నాన్నా! మరింక అమ్మని ఏమనకు. 


మనం అమ్మని బాగా చూసుకోవాలి. అమ్మకి తినాలనిపించిన వాటి కోసం ఆర్డర్ పెట్టుకుంటూంటే, వాటి వల్ల అమ్మ కడుపులోని పాపాయికి తేడా వస్తుందని, నేనే పక్కింటి బామ్మగారి దగ్గర వంటలు నేర్చుకుని అమ్మకి ఇంటిలోనే చేసిపెడుతున్నాను. 


అమ్మకి నేను చేసిన వంటలు నచ్చుతున్నాయని కూడా చెప్పింది తెలుసా!” అంటూ గలగలా కబుర్లు చెబుతోంది సుమన.


ఇంతలో సుమంత్ వచ్చి “నాన్నా, నాతో ఆడుకోవటానికి ఇంకో బుల్లి బేబీ అమ్మ బొజ్జలో పెరుగుతున్నాడట. అక్క చెప్పింది. 


మరి మేము ఆడుకోవటానికి చాలా బొమ్మలు కొనాలి మాకు” అంటూ తన ముద్దు మాటలతో వాతావరణాన్ని ఇంకా చల్లబరిచాడు. ఇవన్నీ వింటున్న కోమలి హృదయం కరిగి నీరయ్యింది. 


సుమంత్, సుమనలను అమాంతం దగ్గరకి తీసుకుంది. ఆమె పేరులో ఉన్న మృదుల స్వభావం పిల్లల ప్రవర్తన, మాటలతో బయటకొచ్చింది. 


“నాకింత ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? నేను ఓ సామాన్యమైన కుటుంబం నుండి వచ్చాను. శ్రీకరే కాదు పిల్లలు కూడా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు. ప్రతిగా నేను వారికేం చేస్తున్నాను?” మనసులో ఆలోచనలు పరిపరి విధాలుగా పరుగులు తీశాయి.


“అమ్మా!” అంటూ సుమన కౌగిలించుకోవటంతో “ఏమిటి?” అంటూ ఇన్నాళ్ళకి నవ్వుతూ పలకరించింది కూతురిని. 


“అమ్మా! తాతగారు వాళ్ళు ఉండేది పల్లెటూరని, అక్కడ ప్రసవం జరగటానికి సరైన సదుపాయాలు లేవని యశోదమ్మగారి దగ్గర అన్నావట కదా నువ్వు. అందుకే నేనో మాట చెబుతాను వింటావా?” అంది సుమన. “ఏమిటా మాట తల్లీ?” అంది కోమలి.


“అమ్మమ్మ నీ డెలివరీ సమయంలో ఇక్కడికి రావటం వీలుకాదంటే, నేనే నీకు అమ్మగా మారి, యశోదమ్మగారి సాయంతో నీకు కావలసిన అన్ని పనులూ చేసిపెడతాను. నాన్న ఇక్కడికొచ్చేదాకా నిన్ను చాలా బాగా చూసుకుంటాను” అంది. 


అంతే సుమన బుగ్గలకు అమ్మానాన్నలు చెరోవైపు ముద్దులు కురిపిస్తూంటే ‘మరి నాకో?’ అంటూ సుమంత్ మధ్యలో దూరాడు.


***



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y







మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి కొన్ని ఇతర రచనలు: 


మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి


మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు.  గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు  నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page