అమ్మకోసం
'

Ammakosam - Telugu Moral Story | M R V Sathyanarayana Murthy
అమ్మకోసం - తెలుగు నీతి కథ | M R V సత్యనారాయణ మూర్తి | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com on 23/09/2026
అమ్మకోసం – మానవత్వం విలువను చాటిన హృదయస్పర్శి తెలుగు నీతి కథ
డబ్బు, కీర్తి, బహుమతుల కంటే ఒక మనిషి ప్రాణం విలువైనదని చాటిచెప్పే కథే “అమ్మకోసం”. ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి రచించిన ఈ హృదయస్పర్శి తెలుగు నీతి కథలో కార్తీక్ అనే బాలుడు తన విశాల హృదయంతో చేసిన త్యాగం మనసును కదిలిస్తుంది.
ఈ కథను పిల్లలు, తల్లిదండ్రులు తప్పక చదవాలి. మనసును హత్తుకునే ముగింపుతో, జీవితంలో మానవత్వం ఎంత ముఖ్యమో గుర్తుచేసే మంచి తెలుగు నీతి కథ ఇది.
ఏడాది క్రితం ప్రారంభమైన ఆ టీవీ ఛానల్ వారు, బాగా ప్రాచుర్యంలోకి రావడం కోసం, హైస్కూల్ పిల్లలకు ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రథమ బహుమతి పది లక్షల రూపాయలు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఏభై మందిని ఎంపిక చేశారు. ఈరోజు మూడో రోజు.
టీవీ ఛానల్ క్యాంటీన్‌లో, పాల్గొనే పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పిల్లలు తమకిష్టమైన అల్పాహారం తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. 'ఆహా' ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వచ్చిన కార్తీక్, రెండు బిస్కట్లు తిని పాలు తాగుతున్నాడు. అతన్ని చూసి మిగతావారు కంగారుపడుతున్నారు. ఎందుకంటే, ఎక్కడ ఏవిధమైన పోటీలు జరిగినా ఆ స్కూల్ వాళ్ళు ఖచ్చితంగా ప్రైజ్ పట్టుకెళ్తారు.
సూట్ వేసుకున్న కార్తీక్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు కూడా అతని కోటు మీద ఉన్న స్కూల్ బ్యాడ్జి చూసి డీలాపడిపోయారు. తేజస్విని అల్పాహారం తింటూ కూడా అన్యమనస్కంగా ఉంది. పక్కనే ఉన్న ఇంకో స్కూల్ అమ్మాయి నందిని, "టెన్షన్ పడకు, ధైర్యంగా ఆడు" అని చెప్పింది. తేజస్విని తన ఇబ్బంది ఆమెకి చెప్పింది.
పోటీ ప్రారంభం కానుంది అన్న బెల్ మోగింది. పిల్లలందరూ హడావుడిగా లోపలకు వెళ్ళారు. పోటీలో మొదటి దశలో అడిగే పది ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పినవారు, రెండో దశకు చేరుకుంటారు. అప్పటికి వారు లక్ష రూపాయలు గెలుచుకున్నట్టు లెక్క. రెండవ దశలో అడిగే పది ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు చెప్పినవారు రెండు లక్షలు గెలిచి మూడవ దశకు వస్తారు.
అయితే ఇక్కడ ఒక 'మెలిక' ఉంది. ఏ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయినా వారు గెలుచుకున్న లక్ష రూపాయలు కూడా పోతాయి. మూడవ దశ నుండి 'హెల్ప్ లైన్లు' ఉంటాయి. వాటి ద్వారా తమకు తెలియని ప్రశ్నలకు సమాధానం పొందవచ్చు. పది దశలలో మొత్తం వంద ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన విజేతకు పది లక్షల రూపాయలు, ఒక స్కూటీ కూడా ఇస్తారు.
ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పోటీలో పాల్గొంటున్న పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత ఎదురుగా కూర్చున్న ఉషకి శుభోదయం చెప్పి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి ఆరవ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయింది. సమయం కూడా మించిపోయింది. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించారు ఆయన.
తర్వాత సీట్లోకి వచ్చిన ధరణి ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, తొమ్మిదో ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయింది. ఆమె కూడా సీటు దిగి వెళ్లిపోయింది బాధగా.
మూడవ పోటీదారుగా కార్తీక్ సీటులో కూర్చున్నాడు. ప్రకాశవంతంగా, ప్రశాంతంగా ఉన్న అతని మొహం చూసి ప్రొఫెసర్ గారు ముచ్చటపడ్డారు. తను చదువుతున్న స్కూల్, తరగతి చెప్పి ఆయనకు నమస్కరించాడు కార్తీక్. "విష్ యూ ఆల్ ది బెస్ట్" అన్నారు ఆయన.
పోటీ ప్రారంభమైంది. ఆయన అడిగిన పది ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పాడు కార్తీక్. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. తర్వాత రెండు, మూడు దశలు కూడా దాటి నాల్గవ దశలోకి వచ్చాడు కార్తీక్.
"రెండు నిమిషాలు విశ్రాంతి కావాలా?" అడిగారు ప్రొఫెసర్.
"అవసరం లేదు సార్.. మీరు అడగండి" అన్నాడు కార్తీక్ ప్రశాంతంగా. తర్వాత నాలుగు, ఐదు దశలు కూడా దాటి ఆరవ దశలోకి వచ్చాడు కార్తీక్.
"డియర్ కార్తీక్.. ఇంతవరకూ పోటీదారులు నాలుగు దశలకే వచ్చి వెనుతిరిగారు. ఆరవ దశకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. ఇప్పటివరకూ ఐదు లక్షలు నువ్వు గెలుచుకున్నావు. ఆరవ దశలోకి వెళ్దామా?" అన్నారు ఆయన.
"లేదు సార్.. నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను" అన్నాడు కార్తీక్. అతని మాటలకు ప్రొఫెసర్ గారు ఆశ్చర్యపోయారు.
"వాట్.. వెళ్ళిపోతావా? నీకు ఇంకా మూడు హెల్ప్ లైన్లు ఉన్నాయి. వచ్చే ప్రశ్నలు కఠినంగా ఉంటాయి అని భయపడుతున్నావా? నీకు సమాధానాలు హెల్ప్ లైన్ల ద్వారా పొందవచ్చు. కంగారుపడకు" అన్నారు ఆయన.
"లేదు సార్.. ఈ ఐదు లక్షలు నాకు చాలు. నేను పోటీ నుంచి తప్పుకుంటాను" అన్నాడు కార్తీక్.
అతనికి తోడుగా వచ్చిన అతని స్కూల్ మాష్టారు ఖంగుతిన్నారు ఆ మాటలకు. 'వద్దు.. వద్దు' అన్నట్టు చెయ్యి అడ్డంగా ఊపి సైగ చేశాడు ప్రేక్షకుల గ్యాలరీ నుండి. అదేం పట్టించుకోలేదు కార్తీక్.
ఇంటి దగ్గర టీవీ చూస్తున్న కార్తీక్ తల్లిదండ్రులు కూడా నిర్ఘాంతపోయారు కార్తీక్ నిర్ణయానికి. చివరికి ఐదు లక్షలకు చెక్కు తీసుకుని సీటు దిగి వచ్చేసాడు కార్తీక్.
తర్వాత తేజస్విని సీటులోకి వచ్చింది. ఆమెకి చాలా టెన్షన్‌గా ఉంది. అది గమనించిన ప్రొఫెసర్, "కంగారుపడకమ్మా, నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నెమ్మదిగా అడుగుతాను. సరేనా?" అని ధైర్యం చెప్పారు. మౌనంగా తలూపింది తేజస్విని. ఆయన అడిగిన పది ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పింది. ఆయన "వెరీ గుడ్" అని అభినందించారు. "రెండో దశకు వెళ్దామా?" అడిగారు ఆయన.
"లేదు సార్.. నేను పోటీ నుంచి తప్పుకుంటాను" అంది తేజస్విని. ఆయన కొద్దిగా కన్విన్స్ చేసినా, తేజస్విని "వద్దు సార్.. నేను వెళ్ళిపోతాను" అని చెప్పింది. తేజస్వినికి లక్ష రూపాయలకు చెక్కు ఇచ్చి పంపించారు ప్రొఫెసర్. తర్వాత మరో ముగ్గురు పిల్లలు కూడా మూడవ దశకు చేరుకుని, పోటీ నుంచి తప్పుకుని వెళ్ళిపోయారు.
పోటీ నుంచి తప్పుకున్నందుకు కార్తీక్‌ని వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ గట్టిగా చివాట్లు పెట్టారు. "మనకు డబ్బు కన్నా అవార్డు ముఖ్యం. నీ మీద ఎంతో నమ్మకం ఉంచి నిన్ను పోటీకి పంపాము. మా ఆశలు నీరు కార్చావు. అసలు నువ్వు ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నావు?" అడిగారు ఆయన.
"ఎందుకో కళ్ళు తిరిగాయి సర్.. తర్వాత ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేనని భయం వేసింది. అలా మధ్యలో అవమానం పడటం కన్నా ఇలా వచ్చేయడం మంచిదనిపించింది" అన్నాడు నెమ్మదిగా కార్తీక్.
ఆయన ఇంకేమీ మాట్లాడలేక, "సరే వెళ్ళు" అన్నారు.
ఇంటికి వచ్చిన కార్తీక్‌కి తండ్రి గట్టిగా క్లాస్ తీసుకున్నారు.
"నువ్వు పోటీలో గెలిచి అవార్డు తీసుకుంటావని మా ఆఫీసులో అందరికీ చెప్పాను. మీ స్కూల్ పరువే కాదు, నా పరువు కూడా పోయింది నీ వలన" అన్నాడు శ్రీధర్.
"ఒంట్లో బాగాలేదని అలా చేసాను" నెమ్మదిగా అన్నాడు కార్తీక్. కొడుకుని నాలుగు తిట్లు తిట్టి బయటకు వెళ్ళాడు శ్రీధర్.
"ఇప్పుడు ఎలా ఉంది నాన్నా?" అడిగింది ప్రేమగా వీణాధరి, కొడుకు నుదుటన చెయ్యి వేసి.
"ఇప్పుడు బాగానే ఉంది అమ్మ. నేను నీకో విషయం చెప్పనా?" అడిగాడు కార్తీక్.
తల్లి చిన్నగా నవ్వి, "చెప్పునాన్నా" అంది.
"అమ్మా, నేను క్యాంటీన్లో అల్పాహారం తింటూ పోటీకి వచ్చిన తేజస్విని అనే అమ్మాయి మాటలు విన్నాను. ఈరోజు సాయంత్రం వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేస్తారట. డబ్బులు లేవట. కనీసం మొదటి దశ దాటితే లక్ష రూపాయలు వస్తాయి. చాలా ఆశ పెట్టుకుని పోటీకి వచ్చానని చెప్పింది. నేను పది దశలు దాటి ప్రధాన విజేతగా వస్తానన్న నమ్మకం ఉంది.
అయితే అప్పటికి పోటీ సమయం ముగిసి, తేజస్వినిని రేపు పిలుస్తారు. ఆమెకి ఈరోజే డబ్బు కావాలి, తల్లి ఆపరేషన్ కోసం. అమ్మ ఎవరికైనా అమ్మే కదా! అందుకే నేను మధ్యలో తప్పుకుని ఆమెకు అవకాశం ఇచ్చాను. నేను ఊహించినట్లే ఆమె మొదటి పది ప్రశ్నలకు సమాధానాలు చెప్పి లక్ష రూపాయలు తీసుకుంది. అమ్మా, అప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపించిన ఆనందం నాకు చాలా సంతోషం కలిగించింది. నేను తప్పు చేశానా అమ్మా?" తల్లి మొహంలోకి చూస్తూ అడిగాడు కార్తీక్.
అతని విశాల హృదయానికి వీణాధరి పులకించిపోయింది. కొడుకు నుదుటన ముద్దు పెట్టి, "నువ్వు చాలా మంచి పని చేశావు కార్తీక్. డబ్బు, కీర్తి కన్నా ఒక నిండు ప్రాణం విలువైనది. అది నువ్వు గ్రహించావు. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను" అంది.
తల్లి తనను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషించాడు కార్తీక్.
*******
M R V సత్యనారాయణ మూర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


telugu emotional story, wife husband story telugu, old age home story |













Comments