top of page

అనంతమైన నవ్వులు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Ananthamaina Navvulu' New Telugu Story Written By Pendekanti Lavanya Kumari


రచన: పెండేకంటి లావణ్య కుమారి


ఒక అనాథను దత్తత తీస్కోవాలని నిర్ణయించుకున్న అతను, తర్వాత ఒక చిన్న అబ్బాయి చేసిన పనిని చూసి తన నిర్ణయం మార్చుకోవటం వల్ల ఎందరి జీవితాలలోనో వెల్లి విరిసిన ఆనందాల నవ్వులే ఈ అనంతమైన నవ్వులు. మరి ఆ అబ్బాయి చేసిన పనేంటో తెలుసుకోవాలనుందా?.. అయితే కథ చదవండి/వినండి. * * * అనంత్ ఓ బాగా డబ్బున్న వర్తకుడు. లక్ష్మి, అనంత్ యొక్క భార్య. మంచి గుణవతి, చాలా అందమైనది కూడా. కోరి, కోరి పెళ్ళి చేస్కున్నాడు. వారిద్దరూ ఏ కొరతా లేని అన్యోన్యమైన దంపతులు. అంతా బాగుంటే నన్నెందుకు తలుచుకుంటారీ మానవులనుకుంటాడో ఏమో, ప్రతి ఒక్కరికీ ఏవో ఇబ్బందులు పెడ్తూనే వుంటాడు దేవుడు. అలాగే వీరికి కూడా అన్నీ వున్నా సంతానం లేని లోటు వుంది. లక్ష్మి ప్రతిరోజూ దేవుడిని కోరే కోరిక ఒక్కటే, అది తమకు సంతానం ప్రసాదించమని మాత్రమే. ఇప్పుడు లక్ష్మికి నలబై రెండేళ్ళు వచ్చాయి. ఇన్ని రోజులూ పిల్లలు కలుగుతారు అనే ఆశ వుండేది, ఇప్పుడు ఇద్దరికీ ఆ ఆశ అడుగంటి పోయింది. అందరూ సిటీకి వెళ్ళి చూపిస్తే డాక్టర్లు ఏదైనా చెప్తారు, ఇప్పుడు ఎన్నో రకాల వైద్యాలు వచ్చాయి అంటుంటే నాలుగేళ్ళ క్రితం వెళ్ళి చూపించుకున్నారు. డాక్టర్లు లోపము అనంత్ దే అన్నారు. పుట్టే అవకాశమే లేదన్నారు. దానితో తిరిగి వచ్చేసారు. అనంత్ ఎవ్వరితోనూ ఏమీ చెప్పలేదు, కానీ భార్యకు పిల్లల మీద వున్న ఇష్టాన్ని చూసి మనసులోనే బాధ పడేవాడు. ఇన్ని రోజులూ వ్యాపార నిమిత్తం వూర్లకు తిరుగుతూ పనుల హడావిడిలో వుంటూ అతనికి అంతగా పిల్లలు లేని లోటు కనపడలేదు. కానీ ఇప్పుడు ఆయన వ్యాపారం బాగా అభివృద్ధి చెంది, ఆయన క్రిందనే నలుగురు పని చేస్తున్నారు. వాళ్ళే ఇప్పుడు అన్ని ఊర్లకు వెళ్ళొస్తున్నారు కాబట్టి అనంత్ కు ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపే వెసులుబాటు కలిగింది. అందుకే పిల్లలు లేని లోటు బాగా తెలియనారంభించింది. భార్యాభర్తలు ఇద్దరూ సంతానం గురించి చర్చించుకుని, చివరకు తమ బంధువులలో ఎవరినైనా దత్తత తీస్కుందామని మొదట అనుకున్నా, అందరికీ ఒకరిద్దరు పిల్లలే. ఎవరూ ఇవ్వరనిపించి, ఒక అనాథాశ్రమం నుండి బాబును తెచ్చుకుని పెంచుకోవాలనుకున్నారు. అప్పటికి గానీ ఇద్దరి మనసులు తృప్తి చెందలేదు. ఒక మంచి రోజున అనంత్ తమ ఊరిలోనే వున్న ఒక అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడున్న ఆశ్రమ అధికారి రఘురామయ్యతో తను ఇలా దత్తత తీస్కోవాలనుకుంటున్నాననీ, ఎవరైనా పసిపాప వుంటే చెప్పమన్నాడు. దానికతను 'ప్రస్తుతానికైతే పసిపిల్లలెవరూ లేరు, అందరూ ఐదేళ్ళు పైబడినవారే.. ఎవరైనా పసిపిల్లలు వచ్చినప్పుడు కబురు పంపుతా'నన్నారు. తర్వాత అనంత్ గురించిన వివరాలు కనుక్కుని, అతని చిరునామా వ్రాయించుకున్నాడు. ఎందుకో అనంత్ కు రఘురామయ్య గురించి, ఆశ్రమం గురించి తెలుసు కోవాలనిపించి, అదే అతనిని అడిగాడు. దానికి రఘురామయ్య ఆశ్రమం తనే స్థాపించానని చెప్పారు. దానికి మరి ఇంత మందికి జరుగు బాటు ఎలా అంటే, మీ బోటి దాతలు ఇచ్చినదే అన్నారు. మరి మీ భార్యా, పిల్లలు అనడిగితే, రఘురామయ్య తను పెళ్ళి చేస్కోలేదని చెప్పాడు. అనంత్ రఘురామయ్యతో మీ కథేదో స్పూర్తిదాయకంగా వుంది, ఎందుకు స్థాపించారో చెప్తే వినాలనుందని అంటే రఘురామయ్య ఇలా చెప్పసాగాడు. రఘురామయ్య వాళ్ళ తండ్రికి వున్న ఐదుగురు సంతానంలో మూడవ మగపిల్లవాడు. తండ్రి బాగా డబ్బున్న వ్యాపారవేత్త. ఇప్పుడు ఆ వ్యాపారాన్ని తన అన్నయ్యలే చూస్కుంటున్నారని, ఫలానా పేరని చెపితే తెలుసునని అనంత్ తలవూపి ఆశ్ఛర్యపోయాడు. అంటే, అంత మంచి జీవితాన్ని వదులుకొని ఇలా సేవ చేస్తున్నారన్న మాట. చాలా గొప్ప విషయం అని మెచ్చుకుంటూ, మీరు అటు వైపుకు మొగ్గటానికేదైనా బలమైన కారణముందా అనడిగాడు అనంత్ రఘురామయ్యను. దానికి రఘురామయ్య, తాను డిగ్రీ చదువుతుండగా ఒకనాడు కుప్పతొట్టి దగ్గర అప్పుడే పుట్టిన పసిబిడ్డను కుక్కలు చంపేసిన దృశ్యం చూసాననీ, అప్పుడే తను ఒక అనాథాశ్రమం స్థాపించాలనీ, దానివల్ల సాకలేక కుప్ప తొట్లకు చేరే పిల్లలకు ఆలంబనగా వుంటుందని నిర్దారించుకున్నానని చెప్పాడు. దాన్నే ధ్యేయంగా మార్చుకుని మా తల్లిదండ్రులకు విషయం చెప్తే, వారు వినకుండా, పెళ్ళి సంబంధాలు తెస్తుంటే నేను పెళ్ళి చేస్కోనని ఖండితంగా చెప్పేసాను. దానితో వారు నీ ఇష్టం ఏమన్నా చేస్కో, నీకు చెందాల్సిన ఆస్తి ఇచ్చేస్తామని ఇచ్చి పంపారన్నాడు.


"అంటే మీరు పెళ్ళి చేస్కోనే లేదా? అయినా పెళ్ళి చేసుకుని కూడా ఈ పనులు చేయొచ్చు కదా" అన్న అనంత్ తో, "చేయొచ్చు కాకపోతే నేనీ మంచి పనులు నిస్వార్థంగా చేయటం కోసమే దేవుడు నాకలాంటి కోరికలు లేకుండా చేసాడని అనుకుంటున్నా" అన్నాడు.


"అటు పిమ్మట మా నాన్న ఇచ్చిన ఆస్తితో ఈ బంగ్లా కొని అనాథాశ్రమంగా మార్చి, ఆ డబ్బుతోనే మొదటి పది సంవత్సరాలూ దీన్ని నడిపాను. ఆ తర్వాత పిల్లల సంఖ్య పెరగటంతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి, వాటిని దాతల సహాయంతో తీరుస్తూ వచ్చాను. ఇప్పుడీ బంగ్లా పాడు బడుతోంది, అలాగే నాకు ముసలితనం వస్తూ వుంది. మరి భగవంతుడు ఏం నిర్ణయించాడో, ఈ అనాథాశ్రమాన్ని నా తర్వాత ఎవరి చేతుల్లో పెడతాడో" అని నిట్టూర్చాడు రఘురామయ్య.


అన్నీ విని అనంత్, "మంచి పనికి దేవుడెప్పుడూ సహకరిస్తాడు లెండి, ఏదో ఒకటి ఆయనే నిర్ణయిస్తాడు, బెంగపడకండ"ని చెప్పి సెలవు తీస్కుని వచ్చేసాడు. అనంత్ ఇంటికొచ్చి పడుకున్నాడే కానీ ఏవేవో ఆలోచనలు... అలానే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు. ఒకరోజు సాయంకాలం అనంత్ ఏమీ తోచక ఆ వూర్లోనే వున్న చిన్న పార్కుకు వెళ్ళి కూర్చున్నాడు. వేరుశనగల కాయలు అమ్మే వ్యక్తి వస్తే, కొంటుంటే, పక్కన ఒక బంతి వచ్చి పడింది, దాని వెంటే ఒక పిల్లవాడు కూడా వచ్చాడు. అనంత్ వేరుశనగలు కొంటుంటే ఆ పిల్లవాడు అలాగే చూడసాగాడు. అది చూసిన అనంత్, ఆ పిల్లవాడ్ని కావాలా అని అడిగితే, కావాలన్నట్టు తల వూపితే, ఒక పొట్లం వాడికి కూడా కొనిచ్చాడు.


ఆ పిల్లాడు తీస్కోని తినకుండా వెళ్తుంటే, "కావాలన్నావు. తినేసి వెళ్ళొచ్చుగా.." అన్నాడు వాడితో.

"లేదు, అక్కడ నా స్నేహితులు ముగ్గురున్నారు, వాళ్ళకు కూడా ఇచ్చి తింటా" అన్నాడు.


దానికి అనంత్ "నేను కొనిచ్చినది ఒక్క పొట్లమే కదా, వున్నవి నీకైతే సరిపోతాయి. అంతమందికి ఏమి సరిపోతాయి.. తినేసి వెళ్ళొచ్చు కదా?" అన్నాడు.


దానికి వాడు, "లేదు, కొంచెం తిన్నా నా స్నేహితులకు కూడా పెట్టి తింటే నాకు చాలా ఆనందంగా వుంటుంది" అన్నాడు.

అప్పుడు అనంత్ ఆలోచనలకు కావలసిన సమాధానం దొరికినట్లనిపించింది. వెంటనే వాడికి ఇంకో మూడు వేరుశనగ పొట్లాలు కొనిచ్చి తను ఇంటికి బయలుదేరాడు. అనంత్ ఇంటికొచ్చాక తనకు వచ్చిన ఆలోచన భార్యకు చెప్పి మరుసటి రోజు ఇద్దరూ అనాథాశ్రమానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ రఘురామయ్యతో తమ నిర్ణయం ఇలా చెప్పారు. "మేము మీ తర్వాత ఈ ఆశ్రమాన్ని చూస్కోవాలనుకుంటున్నాము. ఇప్పుడే ఈ ఆశ్రమాన్ని బాగు చేయించి నా యావదాస్తిని ఒక ట్రస్టు క్రిందికి మార్చి ఈ అనాథాశ్రమానికిచ్చి, మేము కూడా ఇంక ఇక్కడికే వచ్చి వుంటా"మన్నాడు.


దానికి రఘురామయ్య ఎంతగానో సంతోషించి "పసి పిల్లవాడ్ని దత్తత తీస్కోటం కోసం వచ్చిన మీరు మొత్తం ఆశ్రమాన్నే దత్తత తీస్కుంటున్నారు, అంతా ఆ దైవలీల" అని, "అయినా ఏమిటీ హఠాత్ నిర్ణయమ"ని అడిగాడు.


దానికి అనంత్, ఇలా నిర్ణయించుకోటానికి ఒక పిల్లవాడు కారణమని, పార్కులో జరిగిన సంఘటన చెప్పాడు. వాడి లాగే నేను కూడా ఒక్కడికే అంత ఆస్తి ఇచ్చే బదులు ఆశ్రమానికి ఇస్తే ఎంతో మంది ఆనందంగా బ్రతుకుతారని ఈ నిర్ణయం తీస్కున్నానన్నాడు.


దానికి రఘురామయ్య "మీరు చెప్పినట్టుగానే ఈ మంచి పని ఆగిపోకుండా దేవుడు మిమ్మల్నే పంపబోతున్నాడని ఆ రోజు తెలుసుకోలేక పోయా"మన్నాడు.


"అవును, అలాగే ప్రతి మనిషి జీవితంలో జరిగే సంఘటనలకు ఏదో ఒక పరమార్థముంటుందని ఇప్పుడనిపిస్తుంద"ని చిరునవ్వుతో అన్నాడు అనంత్. తర్వాత ఆరు నెలలలో అనాథాశ్రమ బంగ్లా అంతా మరమ్మత్తులు చేయించి అక్కడొక చిన్న సమావేశము ఏర్పాటు చేసాడు అనంత్. ఊర్లో తనకు తెలిసిన వారిని కూడా ఆ సమావేశానికి ఆహ్వానించాడు. ఆశ్రమంలోని పిల్లలూ, తను ఆహ్వానించిన వారందరూ సమావేశానికి వచ్చి కూర్చున్నాక, అనంత్ తన యావదాస్తిని అనాథాశ్రమం ట్రస్టుకు వ్రాసి, తానూ, తన భార్య ఆ ఆశ్రమంలోని పిల్లలను చూస్కుంటూ అక్కడే వుండ బోతున్నట్టుగా, రఘురామయ్య తర్వాత తానే ఆ అనాథాశ్రమం బాధ్యతలు తీస్కోబోతున్నట్టుగా ప్రకటించగానే ఆ చుట్టూ అనంతమైన నవ్వులు వెల్లి విరిసాయి.

--- సమాప్తం ---

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.


33 views0 comments
bottom of page