అనుమానం - ఆందోళన
- Munipalle Vasundhara Rani

- Apr 17
- 3 min read

Anumanam Andolana - Telugu Moral Story | Vasundhara Rani Munipalle
అనుమానం - ఆందోళన - తెలుగు నీతి కథ | వసుంధర రాణి మునిపల్లె
Published in manatelugukathalu.com on 17/04/2026
సోషల్ మీడియా… 👉 సమాచారం ఇస్తుంది 👉 కానీ భయం కూడా పెంచుతుంది.
శారద గారు యూట్యూబ్‌లో వంటల ప్రోగ్రామ్స్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యారు. రకరకాల కొత్త వంటకాలను అప్‌లోడ్ చేస్తూ ఉండేవారు. ఆవిడ భర్త శంకరం గారు ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రంలో ఉండటం వల్ల, కేవలం వీకెండ్స్‌లో మాత్రమే ఇంటికి వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలో శారద గారికి యూట్యూబ్ వీడియోలు చేయడం ఒక మంచి కాలక్షేపంగా మారింది.
ఒకరోజు, ఒక కొత్త రకం స్వీట్ వంటకాన్ని వీడియో తీస్తూ, శారద గారు బంటి అనే పాతికేళ్ల యువకుడిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అతను బీహార్ నుండి వచ్చాడని చెప్పారు. శారద గారి అమ్మ నాన్నలు తమ సొంత ఊరు వెళ్లారని, అక్కడ వారికి వయసు పైబడటం వల్ల అన్ని పనుల్లోనూ తోడుగా ఉండటానికి బంటిని పంపించామని ఆ వీడియోలో వివరించారు. బంటి వంటలు చాలా బాగా చేస్తాడని, తన తల్లిదండ్రులను సొంత మనుషుల్లా చూసుకుంటున్నాడని ఆమె ఎంతో మెచ్చుకున్నారు.
వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత, రోజూ లాగే రాత్రి భోజనం ముగించుకుని పడుకునే ముందు శారద గారు కామెంట్స్ సెక్షన్ ఓపెన్ చేశారు. అందరికీ రిప్లై ఇస్తూ వెళ్తున్న క్రమంలో, రెండు కామెంట్స్ ఆమెను ఒక్కసారిగా కలవరపరిచాయి.
"బీహార్ నుండి మనిషిని తెచ్చుకుని చాలా తప్పు చేశారని, వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారని" ఒకరంటే; "తమకు తెలిసిన వారు ఇలాగే బీహార్ వ్యక్తిని పనికి పెట్టుకుంటే, ఇంట్లో పెద్దాయన లేని సమయంలో ఆవిడను చంపేసి, నగలు, డబ్బు దొంగిలించి, చివరికి శవం కూడా దొరక్కుండా మాయం చేశాడని" మరొకరు భయంకరంగా రాశారు.
అది చూసిన శారద గారికి మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. ఒకవేళ బంటి తన తల్లిదండ్రులకు కూడా అలాగే హాని చేస్తాడేమో అని ఆమె కంగారు పడ్డారు.
ఆ రాత్రి వంటగది ప్లాట్‌ఫాం అంతా క్లీన్ చేసి, మరుసటి రోజు వంట కోసం కూరలు కోయడానికి బంటి చాకుని క్లీన్ చేస్తున్నాడు. తలుపు చాటు నుంచి అది గమనిస్తున్న శారద గారికి, ఆ చాకు తనను బెదిరించడానికో, లేదా చంపడానికో రెడీ చేస్తున్నాడేమో అనిపించింది. వెంటనే గదిలోకి వెళ్లి కంగారుగా గడియ పెట్టుకున్నారు.
శారద గారికి రాత్రి పాలు తాగే అలవాటు ఉండటంతో, ఈలోపు బంటి పాలు తీసుకువచ్చి, ఎప్పుడూ లేనిది గడియ పెట్టి ఉండటంతో ఆశ్చర్యపోయి తలుపు తట్టాడు. భయంతో వణికిపోతున్న ఆవిడ "ఎవరు?" అని కీచు గొంతుతో అరిచారు. బంటి తాను పాలు తీసుకువచ్చానని చెప్పినా, ఆ పాలలో మత్తుమందో, విషమో కలిపాడేమో అన్న భయంతో, "నాకు కడుపులో బాలేదు, ఇప్పుడు ఏమీ వద్దు" అని లోపలి నుంచే చెప్పారు. బంటి ఎంత అడిగినా తలుపు తీయకుండా, వెళ్లి పడుకోమని గట్టిగా చెప్పారు.
బయట శబ్దం ఆగిపోయినా శారద గారికి భయం తగ్గలేదు. అర్ధరాత్రి తన భర్త శంకరం గారికి ఫోన్ చేసి, అర్జెంట్‌గా రమ్మని ఏడుస్తూ చెప్పారు. ఆయన కంగారుగా బయలుదేరారు. తెల్లవారిన తర్వాత ధైర్యం చేసి తలుపు తీసిన శారద గారికి బంటి ఎదురుచూస్తూ కనిపించాడు. వెళ్లడానికి సిద్ధంగా సంచి పట్టుకుని ఉన్న బంటిని చూసి ఆమె "హమ్మయ్య!" అనుకున్నారు.
బంటి కళ్ళలో నీళ్లతో, తన తల్లికి ఒంట్లో బాలేదని, అందుకే వెంటనే ఊరికి వెళ్లాల్సి వస్తోందని చెప్పాడు. "మిమ్మల్ని, అమ్మ నాన్నగారిని వదిలి వెళ్లాలని లేకపోయినా తప్పడం లేదు, నన్ను సొంత కొడుకులా చూసుకున్నందుకు రుణం తీర్చుకోలేను" అని ఆమె కాళ్లకు నమస్కరించి వెళ్ళిపోయాడు.
బంటి వెళ్లగానే శారద గారు ఇల్లంతా వెతికారు. వస్తువులన్నీ భద్రంగా ఉన్నాయి. వంటగదిలోకి వెళ్లి చూస్తే ఆమె ఆశ్చర్యపోయారు. బంటి ఆమెకు ఇష్టమైన వంటలన్నీ చేసి, ఇల్లంతా శుభ్రం చేసి పెట్టాడు. స్టవ్ దగ్గర ఒక నోట్ రాసి ఉంది: "అమ్మగారు, ఆరోగ్యం జాగ్రత్త, వేళకు భోజనం చేసి మందులు వేసుకోండి" అని అందులో ఉంది.
అది చూసిన శారద గారు ఎవరో అన్న మాటలు విని, అంత మంచివాడిని అనుమానించినందుకు చాలా బాధపడ్డారు. తెలియని వారు పెట్టిన కామెంట్స్ చూసి, రెండేళ్లుగా తమతోనే ఉంటున్న నమ్మకస్థుడైన బంటిని అనుమానించినందుకు సిగ్గుపడ్డారు.
శంకరం గారు రాగానే జరిగినదంతా విని, "మనతో ఉండేవారిని నమ్మాలి కానీ, ఎవరో చెప్పే మాటలు కాదు" అని మందలించారు.
తన తప్పు సరిదిద్దుకుంటూ బంటికి జిపే ద్వారా శారద గారు డబ్బులు పంపారు. ఆ తర్వాత ఫోన్ చేసి, అమ్మను జాగ్రత్తగా చూసుకోమని, మళ్ళీ వచ్చాక ఇద్దరం కలిసి వీడియోలు చేద్దామని చెప్పారు. ఆ వెంటనే తన ఫోన్ తీసి ఆ వీడియో కామెంట్స్ సెక్షన్‌ను లాక్ చేసేశారు.
సమాప్తం.
ఈ కథ మీకు నచ్చితే SHARE చేయండి 🙏
వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.







Comments