top of page

అణువణువున జ్వలించిన ఓ హృదయాన- ఎపిసోడ్ 9


'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 9' New Telugu Web Series Written By Pandranki Subramani

'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 9' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



జరిగిన కథ…


అశ్వథ్, మంగళ భార్యాభర్తలు. అతను డిప్యూటీ జైలు సూపరింటెండెంట్. హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా జైలు లో జరిగే ఫంక్షన్ కి భార్యను తనతో రమ్మంటాడు అశ్వథ్.


అక్కడ మంగళ అనుకోకుండా తన పాతస్నేహితుడు పవన్ ని చూసి ఆశ్చర్యపోతుంది.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో తను అరెస్ట్ అయినట్లు చెబుతాడు పవన్.


భర్త దగ్గర పవన్ ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తుంది మంగళ. ముఖాన్ని చూసి ఖైదీల మనస్తత్వాన్ని అంచనా వేయలేమని భార్యతో అంటాడు అశ్వథ్.


మూడు రోజులాగి మళ్ళీ పవన్ ప్రస్తావన తెస్తుంది మంగళ.

తల్లిని చూడాలంటూ పుట్టింటికి బయలుదేరుతుంది.

తాను లాయర్ గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నట్లు, అందుకోసం కొద్దిరోజులు తన గురువుగారి వద్ద జూనియర్ గా చేరబోతున్నట్లు చెబుతుంది. భర్తతో తాను రాసి పెట్టి వచ్చిన ఉత్తరం చదవమంటుంది మంగళ.


ఇక అణువణువున జ్వలించిన ఓ హృదయాన- 9 చదవండి.


ఫ్యాను గాలికి ఎగిరే కాగితంలాగే అతడి మనసు కొట్టుకుంటూంది. భోగిగా జీవించి యోగిగా మారిన ఒక మహాను భావుడు అన్నమాటలు మెదడు గూట్లో ఫెళ్ళుమన్నాయి-


“నా సుదీర్ఘమైన జీవితానుభవం వల్ల నేనొక రహస్యాన్ని కనుక్కున్నాను. అదేమిటో తెలుసా? పైపైకి చూస్తుండాలే గాని- ఎవరినీ దేనినీ అంతా తానైనట్టు ప్రేమించకూడదని. ముఖ్యంగా మనిషని ప్రేమించనే కూడదు. “


మరి తామరాకు పైన నీటి బొట్టులా అంటీ అంటనట్లు ఉండటం దూరంగా తొలగి నిల్చోవడం అందరికీ సాధ్యం కాదుగా! అలా ఉండటం ఋషి పుంగవులకు సహితం అగ్ని పరీక్షేగా—


గది తలుపు ఓరగా మూసి బీరువా తెరచి నగషీ పెట్టెనుండి ఉత్తరం అందుకున్నాడు. అందుకున్న వెంటనే మనసున ప్రాత సినీగీతపు చరణం చట్టున మెదలింది- “ఎరగని వారమటే—ముఖ మెరుగని వారమటే—సముఖమున రాయబారమెందులకే-- “


ఎప్పుడూ వ్రాయని ఈ ఉత్తరం తన జీవిత చక్రానికి- మంగళాదేవి జీవన గమనానికి దిశా నిర్దేశం సూచిస్తుందేమో! రాబోయే కాల వ్యవధికి తిరుగులేని సంకేతం ఇస్తుందేమో! రవంత ఊపిరి బిగబట్టి మడతను విప్పాడు. కళ్ళ ముందు ప్రపంచమే తెరుచుకున్నట్లనిపించింది.

“నా ప్రియమైన స్నేహితుడు, జీవన సహచరుడు అశ్వథ్ కి భార్య మంగళాదేవి వ్రాయునది-


ఉత్తరం మరీ చిన్నదిగా క్లుప్తంగా ఉందని భావించకండి. హృదయం మూగబోతున్న వేళ నోరు విప్పలేం. ఎక్కువ చెప్పనూ లేం. అంతేకదా! అందుకే ఇప్పటికి ఇంత మాత్రమే వ్రాయగలుగుతున్నాను. నిజం చెప్పాలంటే- నాకు కూడా తెలియటం లేదు; ఎలా చెప్పాలో ఎక్కణ్ణించి మొదలు పెట్టాలో! ఇప్పటికి నేనేది చెప్పినా, ఎలా చెప్పినా మీకు సంకటపాటు కలిగించవచ్చు.


మరైతే- ఏదీ చెప్పకుండా ఉండిపోతే ఈ ప్రస్థానం దేనికన్న ఎందుకన్న ప్రశ్నలు యెడారి గాలుల్లా లేచి మీలో అసహనం చెలరేగవచ్చు. అందుకే చెప్పడానికి ప్రయత్నిస్తాను, నాలో పొడసూపే అంతర్గత అహం వల్లనో మరే కారణం వల్లనో తెలియదు గాని- నేను పెద్దమనిషినయి మూలన కూర్చున్న రోజు నుంచీ నా భావావేశంలో ఇంటెన్సిటీ ఎక్కువ గానే ఉంటుంది. ఈ ఇంటెన్సిటీ వల్లనేమో- నేనిష్ట పడే వ్యక్తుల్ని, మిత్రుల్ని గాఢంగా ప్రేమిస్తాను. విశ్వసనీయంగా ఉంటాను. ఉదాహరణకు మా నాన్నా- ఆ తరవాత మీరూనూ!


ప్రేమలో- వలపులో- అలుకలో- వివాహ జీవితంలో నాలోని ఇంటెన్సిటీ ఎటువంటిదో మీకు తెలియంది కాదు కదా! అదే ఇంటెన్సివ్ ఫీలింగ్ ఖైదీ నెంబర్ టు- జీరో- త్రీ పట్ల- అంటే పవన్ కుమార్ పట్ల ఉంది. ఏమో- అంతకంటే ఎక్కువగానే ఉందేమో! ”

అప్పుడు అశ్వ థ్ అప్రయత్నంగా ఆగిపోయాడు. చదవడం ఆపాడు. రవంతసేపు కనురెప్పలు మూసుకున్నాడు. అతడి హృదయాన్ని ఎవరో గిల్లినట్లయింది. సర్వ లక్షణ లక్షతి అయిన తన భార్య మనసులో పవన్ కుమార్ కి అంతటి ఉన్నత భావోద్వేగపూపూరితమైన స్థానమా! అసమానమైన అనురాగమా!


అశ్వథ్ తనకు తెలియకుండానే తలవిదిలించాడు. జారవిడిచిన ఉత్తరాన్ని మళ్ళీ అందుకున్నాడు.


“నాకు తెలుసు నేనిది వ్రాస్తున్నప్పుడు మీకు ఇంటెన్సివ్ స్థాయిన విస్మయం- విపరీతమైన భావోద్వేగం కలుగు తుందని. మరైతే ఎన్నాళ్ళని ముసుగులో గుద్దులాటకు పాల్పడతాం? ఏదో ఒకరోజు జరిగింది జరిగినట్టు చెప్పడం నా కర్తవ్యం కదా! నా జీవిన సహచరుడిగా అది మీకు తెలవడం ముఖ్యం కదా! ఇక విషయానికి వస్తున్నాను. నేను మా గురువుగారి సహాయ సహకారాలతో పవన్ కుమార్ కేసుని టేకప్ చేయబోతున్నాను. అందుకే భార్యను నల్లగౌనులో చూడాలన్న తమ చిరకాల అభిలాషను అడ్డం పెట్టుకుని గోడ దాటి వచ్చేసాను. సారీ ప్రియ సఖా!


చివరి మాట. కొన్ని పొరపాట్లకు సరిదిద్దుకునే వెసులు బాటుంది. ఇంకా కొన్ని పొరపాట్లకు పరిహారమన్నదే ఉండదు. శిక్షను అనుభవించే తీరాలి. నేనిందులోనుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే- నాకు తెలుసు- నా మనసుకి తెలుసు- పవన్ కుమార్ అటువంటి నేరం చేసుండడని. ఇప్పటికిది చాలు అశ్వథ్! కాని చాలించే ముందు ఒకటి చెప్పాలి.


ఒక మారు ఎయిర్ ఓపెన్ జైలు తిరిగొచ్చాను. అక్కడ తోట పనులు చేస్తూ కనిపించాడు పవన్ కుమార్. వీలున్నంత మేర అతడితో చర్చలు జరిపి మరికొంత కూపీ లాగాను.


అయితే- ఇందులో ఒకటి గమనించి దిగ్భ్రాంతి చెందాను. జైలు నుండి బైట పడటంలో అతడికి ఆసక్తి లేనట్లనిపించింది. జీవితం పట్ల ఒక విధమైన విముఖత పెంచుకుంటున్నట్లున్నాడు. అటువంటి వైముఖ్యత పనికిరాదని అతడికి నచ్చచెప్పి కోర్టువారితో కొత్త అంశాలున్నాయన్న కారణాన్ని వివరించి తీర్పు రాకముందే జైలు డిపార్టుమెంటు ద్వారా అడ్మినిస్ట్రేటివ్- కమ్- జుడీషయల్ రివ్యూ జరిపించాలని నిర్ణయించాను.


కాని అలా రివ్యూ చేయించడం అంత ఆషా మాషీ వ్యవహారం కాదన్నది నాకు తెలుసు. తగు ఆధారాలు- బలమైన సాక్ష్యాలు- కాదనలేని నిరూపణతో కోర్టువారిని తగురీతిన కన్ విన్స్ చేయగలనన్న విశ్వాసం మెల్ల మెల్లగా పుట్టుకొస్తుంది. ధర్మం గొడుగై కాస్తుందంటారు. మరి ఆ ధర్మం కర్ణుడిని మాత్రమేనా కాపాడుతుంది? ధర్మ చింతనకు ప్రతిరూపాలైన యుధిష్టిరుణ్ణీ- వికర్ణుణ్ణీ కాపాడుతుంది.


ఎక్కడో ఎవరి గురించో యిప్పటికిప్పుడు తేల్చి చెప్పలేను గాని; పవన్ కుమార్ ని తప్పకుండా కాపాడుతుంది. దీనిని నేను భావావేశంలో పడి రాస్తున్నాననుకోండి. ఇది నాకొక జీవనపోరాటం. ఇందులో నేను దేనికైనా సిధ్ధం. ఎంతవరకైనా వెళ్ళడానికి సిధ్ధం. నాకు తెలుసు- నా మాటలకు నా హృదయేశ్వరుడు నిర్ఘాంతపోతాడని. కాని నాకు వేరే మార్గం కనిపించలేదు నా ప్రియసఖా!


మరి అలనాటి నుండీ నాకున్న అలవాటు ప్రకారం ఏకాంత వాసంలోని ఒక పద్యాన్ని పఠించి ముగించనా!


’ఎఱిగియో యెఱుగకో జేసినట్టి- తప్పులుండిన మది దలపగాబోక- మన్నించి మనసుంచి మఱియొక సారి- కన్నుల బడుమయ్య కరుణాంతరంగం! నిను వీడి క్షణమైన నిలువంగజాల- దరిశనంబీవచ్చు తత్త్వ స్వరూప! ”


నేనిక సెలవు తీసుకునేదా మైడియర్ రక్షక భటా!


ఆ ఉత్తరాన్ని అతడు సాంతమూ చదివి కళ్ళ కెమారాలో సేవ్ చేసుకుని అరమోడ్పు కళ్ళతో దిండుపైన వాలాడు.


సర్వశుభ లక్షణ అయిన భార్య అంతటి తీవ్రమైన స్థాయిన ఉద్వేగానికి లోనవుతుందంటే, ఆషామాషీగా ప్రక్కన పెట్ట గల సాధారణమైన విషయం కాదు. ఏమో- తన పనిలో తను పడి, తన ఆలోచనా ధోరణిలో తను పడి మంగళ ఉద్రిక్త మానసిక పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించ లేదేమో!


సరైన సమయాన సరైన రీతిన విషయాన్ని టేకల్ చేయలేదేమో!

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------

కొన్ని జీవరాశులున్నాయి. వాటిలో కొన్ని నీటిలోనే మనుగడ చేస్తాయి- నీటిలోనే జలకాలాడతాయి- అవి జలచరాలు. మరి కొన్ని నేలపైన మాత్రమే సంచరిస్తాయి- భూచరాలు. అయితే- మరి కొన్ని ఉన్నాయి- నీటిలోకి వెళ్లి నీటి అడుగున ఈదగలవు. అదే సమయంలో అవసరం తోచినప్పుడు భూమిపైకి వచ్చి సంచరించగలవు. ఎరకోసం ఎగురుతూ పరుగుతీస్తూ వేటాడగలవు.. అవసరానికి తగ్గట్టు తమకు తాముగా రూపాంతరం చెందగలవు. ఇది ప్రకృతిలోని వైవిధ్యం.


ఇప్పుడు మంగళాదేవి తన సీనియర్ వేంకట్రావుగారి ఆధ్వర్యంలో అదే పనికి పూనుకుంది. మానసికంగా కొత్త వ్యవ హారశైలికి అలవాటు పడేలా, చేపల్లో చేపగా తన దేహభాషను సహితం చలాకీగా ఫంకీగా తనను తను తీర్చిదిద్దు కోవడానికి సిధ్ధపడింది. హంగులూ కొత్త రంగులూ రూపానికి జోడించు కోవడానికి సిధ్ధపడింది. తను ఒక గృహిణి అన్న విషయాన్ని తాత్కాలికంగా ప్రక్కన పెట్టింది. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగే కదా ఉండాలి! బర్డ్స్ ఆఫ్ ధి సేమ్ ఫీదర్స్ లా ఉండాలంటే డేషింగ్ గా, ఫ్యాషన్ ఐకన్ లానే కనిపించాలి మరి--


ఆ రీతిన మంగళాదేవి పకడ్బందీగా పథక రచన చేసుకుంది. పరిసరాల వాతావరణానికి అలీన్ గా కనిపించనీయకుండా తాకీ తాకని విధంగా వెస్ట్రన్ మేకోవర్ టచ్ తో- జుత్తుని కేర్ ఫ్రీగా వదిలేస్తూ డ్రెస్ కలర్ కి మ్యాచ్ అయే హ్యాండు బ్యాగుని భుజాని కి తగిలించుకొని డిజైనర్ బ్యాక్ లెస్ బ్లవుజు వేసుకుని లేత నీలం రంగు ఫ్యాన్సీ గొడుగుని ఊపుకుంటూ విమన్ కాలేజీ క్యాంపస్ లోకి నడిచింది మంగళ.


ఆమె నడుస్తూ నలుదిక్కులా చూపులు సారిస్తూ అవలోకగా చిందించే హొయలకు మెరిసే పెదవుల కదలికలకు వస్తూ పోయే కాలేజీ అమ్మాయిలు మేల్ టీచింగ్ సిబ్బందీ అటు చూస్తూ ఆగిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తున్నారు. మంగళకు కావలసిందదే! మంగళ వాళ్ళిచ్చే చూపుల కాంప్లిమెంట్లు గమనించనట్టు అవేమీ తనకు కొత్త కాదన్నట్టు అలక్ష్యంగా కదులుతూ అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులోని రిసెప్షన్ కౌంటర్ వద్దకు వెళ్లి- “మిస్ శ్రీనిత్యా కోసం వచ్చాను. ఆమెది ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్. ఒకసారి పిలుస్తారా ప్లీజ్! “అని గోముగా అంది;


తనకు తెలుగు అంతగా రాదు సుమా అన్నరీతిలో ఆగి ఆగి మాట్లాడుతూ-- రిసెప్షనిస్టు వెంటనే బదులిచ్చింది- “విత్ ప్లజర్ మేడమ్. కాని మీరు శ్రీనిత్యకు ఏమవుతారో చెప్పనే లేదు. పూర్తి వివరాలింకా యివ్వనే లేదు. ”


“సారీ! చెప్పనే లేదు కదూ! పేరు చందన. నేనామెకు ఫ్రెండుని, వెల్ విషర్ ని కూడాను. ఫ్యాషన్ షోలో కలుసుకుంటుంటాం“


“ఓకే మేడమ్. ఈ స్లిప్ నోట్లో వివరాలు వ్రాసివ్వండి- మీ ఫోన్ నెంబర్ తో సహా“పెడీ క్యూర్ చేసుకున్న మంగళ పాదాలను పరీక్ష గా చూస్తూ అడిగింది కౌంటర్ రిసెప్షనిస్ట్.

”ఓ యస్! ”అంటూ మంగళ అలియాస్ చందన వివరాలను పూర్తి చేసి ఇచ్చి అక్కడికి కొంచెం దూరాన ఉన్న పేముకుర్చీ వద్దకు వెళ్ళి కూర్చుంది; గుప్పుమన్న సెంటెడ్ రుమాలుతీసి ముఖం తుడుచుకుంటూ.


పది నిమిషాలు గడచిన తరవాత ఎట్టకేలకు వాళ్ళ లెక్ఛరర్ వద్ద పర్మిషన్ తీసుకుని వచ్చింది శ్రీనిత్య. వచ్చీ రావడంతోనే తన కోసం వచ్చిన విజిటర్ కోసం నలుదిక్కులా చూస్తూ రిసెప్షనిస్టుని అడిగింది- “ఎవరో లేడీ మోడల్ నాకోసం వచ్చా రని ఎవరో చెప్పారు. ఏదీ? కనిపించదేం? ’


అప్పుడు ఉషారుగా నవ్వుతూ లేచి యెదురు వెళ్లింది మంగళ. ”మోడల్ని కాను నిత్యా! బౌటిక్యూ ఓనర్ ని. గ్లాడ్ టు మీట్ యు. నా పేరు చందన. కాస్మొటిక్స్ ఫీల్డులో యు. యెస్ లో డిగ్రీ చేసి వచ్చాను. అంతే కాదు. నాకు హాలీవుడ్ తో కూడా కొంత పరిచయం ఉంది. “అంటూ చేయి అందిచ్చింది.


చేతిని అందుకుంటూ స్నేహపూర్వకంగా తను కూడా నవ్వుతూ అంది శ్రీనిత్య- “అలాగా మేడమ్! మిమ్మల్ని చూసిన వాళ్లందరూ ముంబాయ్ సూపర్ మోడల్ గా ఉందన్నారు. కాని మిమ్మల్ని ముందెప్పుడూ చూసినట్టు గుర్తులేదు. సారీ ఫర్ సేయింగ్ సో-- “


ఈ సారి మంగళ వెంటనే స్పందించలేదు. చిరునవ్వు చిందిస్తూనే శ్రీనిత్యను పరీక్షగా చూసింది. మంచి ఎత్తరి. మంచి ఎరు పు కూడానూ. ఇప్పటికి మెజారిటీ తీరినా అప్పట్లో సహితం శ్రీ నిత్యను చూసిన వారెవరూ మైనర్ గార్లని అనుకుని ఉండరు; తానుగా వచ్చి చెప్తేగాని.. ఆమె ఒంటి నుండి ఖరీదైన ఫ్రెంచ్ సెంట్స్ మాత్రమే కాదు, పొంగి పొర్లే యవ్వనంతో ఒంపు సొంపులు జతకడ్తూ ఉవ్వెత్తున వెదజల్లుతున్నాయి. ఇలా సరసమయ సొగసులతో ఎట్టెదుట నిల్చుంటే పవన్ కూమారే కాదు, మగతనం ఉన్న వాడెవడైనా శ్రీనిత్య ముందు మోకరిల్లక మానడు- ఊర్వశి ముందు తలొగ్గిన విశ్వామిత్రుడిలా.


“అదేంవిటి అలా కన్నార్ప కుండా చూస్తున్నారు? ఇక్కడి అమ్మాయిలందరూ మిమ్మల్ని ముంబాయ్ సెలబ్రిటీ అనుకున్నారట! “- శ్రీనిత్య.


“కొత్త కదా! అలానే అనిపిస్తుంది. మరి మీరు మాత్రం ఎలాగున్నారని? ఆ కాలపు యువకులపైన మైకపు మందు చల్లిన మధు బాలాలా లేరూ! మార్లిని మండ్రోలా లేరూ! అసలు మిమ్మల్ని చూసేన వారెవరూ స్టూడెంట్ అంటే నమ్మనే నమ్మరు. నీటుగా వెల్ షేప్డ్ స్ట్రక్చర్ తో అప్పటి జూలియా రాబర్ట్సని తలపిస్తున్నారు”


ఆ మాటతో శ్రీనిత్య ముఖం వింతైన కాంతులతో మెరిసింది. రవంత సేపు ఆ సంతోషాన్ని అనుభవించి అడిగిందామె-


“ఇంతకూ నాతో మీకేం పని చందనగారూ! అసలు నాగురించి మీకెలా తెలుసు? ”


దానికి చందన కళ్ళు వింతగా చికిలించింది--


“అదా! చెప్తాను. అలా బైటకెళ్ళి మాట్లాడుకుందామా? ఎందుకంటే- అన్ని విషయాలూ అందరి ముందూ మాట్లాడుకోలేంగా! ”


“ఓ యస్! ”అంటూ శ్రీనిత్య మంగళ చేతుల్ని అందుకుంటూ బైటకు నడిచింది.


అప్పుడు శ్రీనిత్య గొంతు విని ఆలోచనలనుండి తేరుకుంది మంగళ- ”మీకు ప్రకృతి అంటే చాలా ఇష్టమా మేడమ్? ”


“సారీ! నా ప్రాత కాలేజీ రోజులు గుప్పున తాకితేనూ. అయినా మనమందరమూ ప్రకృతి ఒడిలోని పిల్లలమేగా! ఇక ముందుకు సాగే ముందు ఒకటి చెప్పాలి. మనం ఫ్రెండ్స్. మేడమ్ వంటి ఫార్మలిటీస్ వద్దు. సరేనా? “


శ్రీనిత్య నవ్వుతూ తలూపింది. క్షణకాల విరామం తరవాత మంగళ మళ్ళీ చెప్పసాగింది- “దటీజ్- శ్రీమాన్ జోగయ్యగారన్నమాట మీ పితృదేవుడు. ఆయన పేరు చెప్తేనే ఎ మ్మెల్యే లు ఎమ్ ఎల్ సీలు- సిటీ కార్పొరేటర్లూ యెలార్టుగా ఉలిక్కి పడతారటగా! ఎలెక్షన్ వస్తుందన్న వార్త వస్తే చాలు ప్రజా ప్రతినిధులు చాలా మంది మీ నాన్నగారింటి ముందు క్యూ కడతారటగా! అవునా? ”


”ఇవన్నీ మీకు- సారీ- నీకు తెలుసన్నమాట! ”ఆశ్చర్యంతో కళ్లు తిప్పి చూస్తూ అంది శ్రీనిత్య.


దానికి మంగళ కూడా నవ్వుతూనే స్పందించింది- “భలే దానివే! నగర ప్రముఖుల గురించి తెలుసుకోవడం పురజనుల బాధ్యత కాదా! కాకపోతే- అంతటి పవర్ ఫుల్ కాబట్టే మీ నాన్నగారు బొరిగలో దాక్కుని- ఈడుకి రానికన్యల్ని సహితం విడిచిపెట్టకుండా దౌష్ట్యంతో పట్టుకుని వాళ్ళ శీలాన్ని నిర్దాక్షిణ్యంగా దోచుకుతిరుగుతూన్న కామపిశాచిని ఎలుకు తోక పట్టుకుని గిరగిరా తిప్పి పడేసినట్టు జైలు గోడల మధ్యకు విసిరేసారూ? ”


ఆ మాటకు శ్రీనిత్య కళ్ళు ఉత్సాహంతో కసితో మెరుస్తాయనుకుని ఎదురు చూసిన మంగళ- విస్మయంతో కనురెప్పలు విప్పార్చి చూసింది. మరింత విస్మయానికి లోనయింది. ఎందుకంటే- శ్రీనిత్య ఎటువంటి స్పందనా లేకుండా నేల వేపు దృక్కులు చూస్తూ మౌన ముద్రతో నడవసాగింది.


అది గమనించిన మంగళ అదే సమయమనుకుని పురి కొసను మెలి తిప్పింది- “అదేంవిటి నిత్యా అలా ఉండి పోయావూ! కామ రాక్షసుడి చేతిలో దెబ్బతిన్న నీకు వత్తాసు పలకడానికి వచ్చిన నా పలుకు విని ఉత్యాహంతో చేతులు బిగించి నాతో మాటలు కలప వద్దూ? ”


“ఇప్పుడదంతా జ్ఞప్తికి తెచ్చుకుని మనసుని పాడు చేసుకోవడం ఎందుకు లెండి చందనా! నా వరకు అదొక పీడకలే! “


“అదేంవిటి అంత తేలిగ్గా కొట్టిపారేసావు? కసితో కక్షతో అటువంటి వాణ్ణి కుమ్మేయ వద్దా! అజ్జి బుజ్జి మాటలతో నీ కన్నెతనాన్ని దోచుకున్నవాణ్ణి అంత త్వరగా మరచి పోవచ్చా! మై ఎనిమీస్ ఎనిమీ ఈజ్ మై ఫ్రెండ్ అన్న లోకోక్తి మరచిపోయావా యేంవిటి? “ అంటే- అన్నట్టు కనురెప్పలు అల్లార్చి చూసింది శ్రీనిత్య.


”అంటే- నేను సహితం ఆ కామాంధుడు పవన్ చేతిలో చిక్కిన విక్టిమ్ నే! నేనొక క్యావియెట్ ఇచ్చి కోర్టు ప్రొసీడింగ్సులో నన్ను పాల్గొన నివ్వమని కోర్టువారిని అర్థించి నీ కేసుని మరింత బలపర్చడానికే గా నేనిప్పుడిక్కడకు ముంబాయి నుండి రెక్కలు కట్టుకుని వచ్చింది! మరెందుకంట? లేకపోతే నాకిక్కడేమి పని? విష పాముని ఒక దెబ్బతో కొడితే చావదు. నలుగురూ చేరి దెబ్బపైన దెబ్బగా బాదితేనే అది హరీమంటుంది. అది తెలుసా నీకు!”


”శ్రీనిత్య బదులివ్వలేదు. ”ఎక్స్యూ జ్ మీ! ”అంటూ చేతి గుడ్డను ముక్కువద్ద ఉంచుకుని చెట్టువెనక్కి వెళ్లింది. అలా వెళ్ళినామె రెండు నిమిషాల వరకూ రాకపోయే సరికి మంగళ విస్తుపోతూ వెళ్లి ఖంగుతిన్నట్లు చూస్తూండిపోయింది. శ్రీనిత్య వెక్కిళ్ళను అదుపు చేసుకునేందుకు శ్రమ పడుతూ గుక్కతిప్పుకోకుండా యేడుస్తూంది.


”వాటీజ్ ది మేటర్ నిత్యా? ”అని అడిగింది.


ఆమె ముఖం తుడుచుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని అంది- “నేనొకటి చెప్తాను. వింటారా మేడమ్! ”

ఊఁ అందామె.


“మీకు పవన్ వల్ల యేం జరిగిందో నాకు తెలియదు. అసలు మీకతని వల్ల యేమైనా జరిగందో లేదో కూడా తెలియదు. ఒకవేళ యేదైనా అపకారం జరిగిందని మీరు నొక్కి వక్కాణించినా నేను నమ్మే స్థితిలో లేను. ఎందుకంటే పవన్ కుమార్ గురించి నాకు తెలుసు. ఇక చివరి మాట- అప్పుడు నేను మైనర్ నని అతడికే తెలియదు. నేను చెప్పనూ లేదు. అలాంటప్పుడు అతను దోషి యెలా అవుతాడు? ఇక మీరు వెళ్ల వచ్చు” అంటూ అక్క ణ్ణించి విసురుగా కదలబోయింది శ్రీనిత్య.


మంగళ విడిచి పెట్టలేదు. ఆమెను ఆపుతూ అడిగింది- “మరి అతను అటువంటివాడు కానప్పుడు అతణ్ణి జైలుకి పంపడం దేనికి? దానికి నువ్వు వత్తాసుగా నిలవడం దేనికి? ”


దానికి శ్రీనిత్య కోపంగా చూస్తూ బదులిచ్చింది- “అతణ్ణి జైలుకి పంపించింది నేను కాదు. నా చేత తప్పుడు స్టేట్మెంట్ తీసుకుని తప్పుడు సాక్షుల్ని సృష్టించి మా డాడ్ చేసాడా పని. నేను గాని ఆయన చెప్పినట్టు చేయకపోతే పవన్ కి నూకలు తీరేటట్టు చేస్తానని బెదిరించాడు”


అది విని మంగళ నవ్పింది. మొదట మృదువుగా ఆతరవాత గలగల నవ్వింది “ఇది నువ్వు నాకు చెప్పనవసరం లేదు. ఇదంతా నాకు ముందే తెలుసు. వివిధ కోణాలలో విషయాన్నిరాబట్టుకునే ఇక్కడకు వచ్చాను. తెలిసే నిన్ను ట్రాపే చేయాలని వచ్చాను. కాని నువ్వు పడలేదు. వపన్ కుమార్ పట్ల నీకున్న నిజమైన ప్రేమ వల్ల ట్రాప్ లో పడకుండా దాటిపోయావు” అని తనెవరూ తను వచ్చిన పనేమిటో విశదీకరించింది.


శ్రీనిత్య నమ్మలేనట్టు కళ్లు విప్పార్చి చూసింది. ”మీరు నిజంగానే పవన్ కి సహాయం చేయడానికే వచ్చారా మేడమ్!”


”మంగళ బదులివ్వలేదు. మౌనంగా శ్రీనిత్య కుడి చేతిని అందుకుని తన చేతిలో ఉంచి అంది- “అతడు నా కాలేజీ మేట్. ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్. ”

=======================================================================

ఇంకా వుంది...

=======================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





45 views0 comments

Comments


bottom of page