top of page
Original.png

అరిటాకు


అరిటాకు తెలుగు కథలో భువనేశ్వరి బాధతో ఒంటరిగా నిలబడిన భావోద్వేగ దృశ్యం

Aritaku - Telugu Emotional Story | Penumaka Vasantha

అరిటాకు - తెలుగు భావోద్వేగ కథ | పెనుమాక వసంత

Published In manatelugukathalu.com On 08/08/2026


“అరిటాకు” ఒక మహిళ జీవితంలోని విషాదాన్ని, మోసంతో కోల్పోయిన కుటుంబాన్ని, చివరి దశలో కూడా తన కొడుకును చూడాలనే తల్లి ఆరాటాన్ని ఆవిష్కరించే హృదయవిదారక తెలుగు కథ. ఒక రాజకీయ నాయకుడి కటౌట్‌పై పేడ ముద్దలు వేస్తున్న భువనేశ్వరిని చూసిన కథకుడు, ఆమెను వృద్ధాశ్రమంలో చేర్చడంతో అసలు కథ మొదలవుతుంది. గతంలో జరిగిన మోసం, భర్తా కొడుకులకు దూరమైన జీవితం, చివరికి మానవత్వం ద్వారా ఆమెకు లభించిన చివరి ఆశ—ఈ కథ మనిషి జీవితంలో మోసం ఎంతటి విషాదాన్ని మిగుల్చుతుందో, మానవత్వం ఎంతటి బంధాన్ని సృష్టించగలదో ఆలోచింపజేస్తుంది.


కారులో వెళ్తుంటే... ఒక పెద్ద రాజకీయ నాయకుడి కటౌట్ మీద పేడ ముద్దలు కొడుతున్న ఒకావిడ కనపడింది. 


ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెను లాక్కుని రోడ్డు మీదకు తెచ్చారు. నేను ఆశ్చర్యపోతూ కారు ఆపాను. 

ఆమెను తిడుతున్నారు అందరూ. 


"మా ప్రియతమ నాయకుడిపై ఎందుకు ఇట్లా చేస్తున్నావని?" అడిగితే ఆమె నుండి ఏమి జవాబు లేదు. "ఇట్లా ఎందుకు చేస్తుంది దీన్ని!" అంటూ తన్నబోతున్న వారిని నేను వారించి, 

"స్త్రీల పట్ల అలా బిహేవ్ చేయకండి. మీకు ఆమె వయసున్న తల్లి ఉండి ఉంటుంది, ప్లీజ్!"


"ఇది తల్లా, తూ! నాకే ఉంటే... చంపి పడదొబ్బేవాడిని. మా నాయకుడి మీద ఎక్కడ పోస్టర్ కనపడినా ఇట్లాగే చేస్తుంది సార్. ఇది మూడోసారి చేయటం" అంటూ ఆమెను చెంప మీద కొట్టబోతే... 

"స్త్రీలను కొట్టటం పాపమని" అతన్ని వారించాను. 


ఆమె చెంప నిమురుకుంటూ నా వైపు కృతజ్ఞతగా చూసింది. వాళ్లందరూ వెళ్లారు. ఆమె అక్కడే ఉన్న ఒక అరుగుపై కూచుంది. ఆమెను అప్పుడు పరిశీలనగా చూస్తే... 


పాత కాటన్ చీర వెలిసిపోయింది. ఒక అరవైలోపే ఉంటుంది వయసు. తెల్లని మొహంపై ఎర్రటి కుంకుమతో కళగా ఉంది మొహం. తెల్లటి జుట్టు రేగిపోయి మొహంపై పడుతుంది. నుదుటి మీద ముడతలు ఆమె పడిన బాధలకు గుర్తుగా కనిపించాయి. 


భుజానికి ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది. సన్నగా ఎండిపోయిన శరీరంతో ఉన్న ఆమెని చూస్తే జాలి కలిగింది. ఇప్పుడే ఇలా ఉందంటే... ఒకప్పుడు అందంగా ఉండేదనిపించింది.


"అమ్మా! నాతో వస్తారా? మీ ఇంటి అడ్రస్ చెప్పండి. అక్కడ దింపుతాను."


"నాకు ఇల్లు లేదు. అడ్రస్ లేని దాన్ని. ఎక్కడో గుడి దగ్గర అడుక్కుంటాను."


"నాకు తెలిసిన వృద్ధ శరణాలయం ఉంది. దానిలో చేర్చుతాను, వస్తారా?"


దానికి సరేనన్నట్లు తలూపింది. ఆవిడను కారులో ఎక్కించుకుని బిస్కట్ పాకెట్ ఇచ్చాను. 


డ్రైవ్ చేస్తూ... మిర్రర్ లో నుండి చూస్తే... ఆవిడ ఆవురావురుమంటూ తినటం కనిపించింది. "థాంక్స్ బాబు!" అంది. 


ఇదివరకు బాగా బతికిన ఆవిడగా ఉంది. 


"అమ్మా! ఏమనుకోకుంటే... మీ విషయాలు చెప్తారా?"


"నాది చెప్పుకునేంత గొప్ప చరిత్ర కాదు. మీకు టైం వేస్ట్!" అంటూ నిర్లిప్తంగా నవ్వింది. 


మాటల బట్టి ఆవిడ చదువుకున్న ఆవిడ అనిపించింది. మాటల్లో శరణాలయం వచ్చింది. ఆవిడను లోపలికి తీసుకెళ్లి నిర్వాహకులకు అప్పగించాను. ఆవిడ పేరు చెప్పమంటే... భువనేశ్వరి అని చెప్పింది. నేను ఆవిడకు ధైర్యం చెప్పాను. అప్పుడప్పుడు వస్తానని చెప్పి బయటకు వచ్చాను. 


ఒకరోజు ఆశ్రమం వాళ్ళు కాల్ చేస్తే వెళ్ళాను. వాళ్ళు భువనేశ్వరమ్మ గురించి చెప్పారు. "ఇవాళ పొద్దున ఇక్కడ వార్షికోత్సవానికి ఈ జిల్లా ఎంఎల్ఏ వస్తే... ఆయన్ను చంపటానికి, మీరు చేర్చిన ఈ భువనేశ్వరమ్మ ప్రయత్నిస్తే... పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇంకోసారి ఇలాంటి వాళ్ళను తేకండి సార్! మా ఆశ్రమం పరువు పోతుంది." ఆ మాటలు కొంచెం కోపంగానే అన్నారు.

అలాగేనని తలూపి, "ఎందుకు ఈవిడకు ఆ ఎంఎల్ఏ మీద అంత కోపం? ఏదో బలమైన కారణం ఉంటుందనుకుంటూ" ఇంటికి వచ్చాను. 


నేను మరుసటి రోజు జైలుకు ఆమెను చూడటానికి వెళ్ళాను. ఆమె నన్ను చూసి ఏడ్చింది. 


"అమ్మా! ఏమనుకోకుంటే... ఇప్పటికైనా నిజం చెప్పండి. నేను బెయిల్ ఇప్పించడానికి ట్రై చేస్తాను."


"వద్దు బాబు. ఇక్కడే ఉంటాను. బయటికి వస్తే... మళ్ళీ ఆ నీచుడిని చంపాలనిపిస్తుంది" అంటూ రెండు చేతుల్లో తలను పెట్టుకుని ఏడుస్తూ చెప్పసాగింది. 


"నేను మొదట్లో అందంగా ఉండేదాన్ని. అదే నాకు తిప్పలు తెచ్చింది. చిన్నప్పటి నుండి ఆశలు ఎక్కువ. మధ్యతరగతి జీవితం. భర్త ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. నేను ఒక ఆఫీసులో పనిచేసేదాన్ని. ఒక బాబుతో హాయిగా రోజులు గడుస్తున్నాయి. 


మా ఆయన ఫ్రెండ్ రాజేష్ అమెరికా నుండి వచ్చి పెద్ద బిజినెస్ స్టార్ట్ చేశాడు. మా ఇంటికి వచ్చేవాడు. తను కొత్త బంగళా, కొత్త కారు కొన్నట్లు, త్వరలో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓపెన్ చేస్తున్నాను. మీరు మా ఆఫీసులో పని చేయండి అంటూ మా ఆయన్ని, నన్ను తన ఆఫీసులో చేర్చుకున్నాడు. 

నన్ను ఒక రకమైన చూపులతో చూసేవాడు. నాకు లోపల అతనంటే ఇష్టం ఏర్పడింది. భర్త, పిల్లాడు ఉన్నారని అంతరాత్మ తప్పని చెప్తున్నా, నేను అతని మాయలో పడ్డాను. ఒకరోజు నన్ను తన రూంలోకి పిలిచి "ఎన్నాళ్ళు ఇలా చూసుకోవటం? నీకు అభ్యంతరం లేకుంటే... నిన్ను పెళ్లి చేసుకుంటాను." 


నేను ఆశ్చర్యపోయి "నా భర్త, బాబు మరి...?" అన్నాను. 


"అవన్నీ నేను చూసుకుంటా, నాకు వదిలేయి" అంటూ నా భర్తతో "బెంగుళూరులో ఆఫీసు పెట్టాను. కొన్నాళ్ళు భువన గారు అక్కడ వర్క్ చేస్తారు. తర్వాత నువ్వు, బాబు వెళ్దురు గానీ!" అంటూ ఒప్పించాడు. 


సాలరీ బాగా ఇస్తుండటంతో సరేనన్నాడు మా ఆయన. 

బెంగళూరులో గెస్ట్ హౌసులో నన్ను ఉంచి, నన్ను ఒక రాణిగా చూసుకోవటం మొదలుపెట్టాడు. మా ఆయనకు ఆఫీసులో అందరూ మా గురించి మాట్లాడుకోవటం విని, ఆఫీసులో రిజైన్ చేసి బాబును తీసుకుని ఎటో వెళ్ళిపోయాడు. 


బాబు గుర్తు వచ్చినా రాజేష్ మాయలో అన్ని మర్చిపోయాను. అలా కొన్నేళ్ళు గడిచాయి. 

పెళ్లి మటుకు వాయిదా వేస్తూ వచ్చాడు. ఒకరోజు ఒక మంత్రి కూతురుతో పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాడు. 


నేను “అదేంటి? నన్ను పెళ్లి చేసుకోవా?” అంటే...

"నేను ఇంకా ఎదగాలి భువనా! ఎంత పెళ్లయినా నువ్వు నా హృదయంలో పెద్ద భార్యవు!" అంటూ మళ్ళీ మాయగా మాట్లాడాడు. 


నాపై ఇది వరకటి ప్రేమ తగ్గింది రాజేష్ కు. అప్పుడప్పుడు వచ్చి కనపడి వెళ్ళేవాడు. 

తిండికి, బట్టకు లోటు లేకుండా చేసేవాడు. ఎందుకో పంజరంలో చిలక జీవితం నచ్చలేదు. మా ఆయన్ని, మా కొడుకుని చూడాలనిపించి ఆయన అడ్రస్ కనుక్కుని వెళ్తే... ఇంట్లో ఒకామె ఉండి తలుపు తీసింది. 


"ఎవరండీ? మీరు!" అనేలోపు "ఎవరు? శాంతా!" అంటూ వచ్చి నన్ను చూసి "ఎవరు పడితే వాళ్ళు వచ్చి తలుపు కొడితే తీయటమేనా? మీరు వచ్చిన అడ్రస్ ఇది కాదు!" అంటూ నన్ను అసహ్యంగా చూస్తూ తిప్పి పంపాడు. 


తర్వాత మళ్ళీ నేను బెంగళూరు వెళితే... ఆ ఇంటి ఓనర్ "ఇల్లు అద్దెకిచ్చాను. మీ సామాను తీసుకోండి!" అంటే... తీసుకుని బయట పడ్డాను. 


రాజేష్ కు ఫోన్ చేస్తే "ఎవరితోనో పోయావనుకున్నా. మళ్ళీ వచ్చావా?" వెటకారంగా అన్నాడు. 


"ఇప్పుడు నేను ఎలా బతకాలి?" ఏడుస్తూ అన్నా జాలి పడలేదు. 


"ఇంకొకరిని వల వేయి. నాలాంటి వాడు దొరుకుతాడు" అంటూ ఫోన్ పెట్టేశాడు. 


అప్పుడు నాకు అర్థమైంది. ఆడదాని జీవితం అరిటాకు వంటిదని. ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా చెడేది ఆడదాని జీవితమని తెలుసుకునే లోపే నా జీవితం నాశనమైంది. అప్పటి నుండి ఇదిగో ఇళ్ళు, వాకిలి లేక ఇలా తిరుగుతున్నా. 


నా జీవితం ఎటూ నాశనమైంది. ఎలాగైనా ఆ రాజేష్ ను చంపాలని ప్రయత్నిస్తున్నా. ఆరోజు ఆ కటౌట్ మీద పేడ ముద్ద కొడుతుంటే... మీరు చూసి నన్ను ఆశ్రమంలో చేర్చారు. 


ఆశ్రమంలో ఫంక్షన్లకు వచ్చాడు. నేను చూసి పేపర్ వెయిట్ తీసుకుని అతని మీదకు విసిరాను. హత్యా ప్రయత్నం చేశానని, ఇదిగో ఇలా జైల్లో ఉన్నాను."


సమయం అవ్వటంతో "సరే అమ్మా! మీరు జాగ్రత్త!" అని వెళ్లబోతున్న నాతో "ఒక్క సాయం చేస్తారా? మా బాబుని చూడాలని ఉంది. మీకు వీలైతే వాడినీ ఇక్కడికి తెచ్చి చూపిస్తారా?" అంటూ ఆశగా అడిగింది. 


ఆ కళ్ళలోని ఆశకు నేను కదిలిపోయాను. ఆమె దగ్గర వాళ్ళ ఆయన ఫోటో, అడ్రస్ తీసుకుని కదిలాను. ఆమె చెప్పిన ఇంట్లోనే ఉన్నాడు ఆమె భర్త సాయి కృష్ణ. 


ఆయనకు భువనేశ్వరి గురించి చెప్పాను. 

"మీ ఆవిడ ఒక్కసారి మీ అబ్బాయిని చూడాలనుకుంటుంది. మీ బాబును పిలుస్తారా?"


మొదట వాళ్ళ అబ్బాయి అడ్రస్ ఇవ్వటానికి ఆయన ఒప్పుకోలేదు. చివరికి ఇచ్చాడు. ఆ అబ్బాయి ఆఫీసు కెళ్లి పరిచయం చేసుకుని వాళ్లమ్మ గురించి చెప్పాను. అతను మొదట చూడటానికి ఒప్పుకోలేదు. "ఆవిడను మీరేమీ తెచ్చి చూసుకోనక్కరలేదు. ఎవరో అనాధ ఆఖరి కోరికనుకుని వెళ్ళి చూడవచ్చుగా?" అని బతిమాలితే... ఒప్పుకున్నాడు. 


ఒకరోజు నేను జైలు వాళ్లతో మాట్లాడి అపాయింట్ మెంట్ తీసుకున్నాను. ఆ రోజు వాళ్ళ అబ్బాయిని అక్కడికి తీసుకెళ్లాలని. ఇంతలో జైలు అధికారి భువనేశ్వరి డెంగ్యూ ఫీవర్ బారిన పడి మరణించిందనీ ఫోన్ చేశాడు. ఆవిడ డెంగ్యూ జ్వరంతో పోయిందంటే... నమ్మేంత అమాయకుడిని కాదు ఎందుకంటే... ఆమెను బతకనివ్వరనీ తెలుసు. మా అక్క జీవితం కూడా ఇలాగే ముగిసింది కాబట్టి. 


వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి విషయం చెప్పాను. అతను, నేను ఇద్దరం కార్లో ఆమెను చూడటానికి వెళ్తుంటే... ఆమె కొడుకు అర్జున్ అన్నాడు. 


"సార్ మా అమ్మ మీకెలా తెలుసు?" అంటే... భువనేశ్వరమ్మ చెప్పిన కథ అతనికి చెప్పాను. 


"మీరు ఎందుకు ఇలా సాయం చేస్తున్నారు మా అమ్మకు? మీరు మాకేమన్నా చుట్టామా?" అన్నాడు. 


"ఆ చుట్టమే! మానవజాతి మనది. మానవత్వ కోణంలో చుట్టం మీ అమ్మ నాకు."


"మీరు ఏమి చేస్తుంటారు?" ఆసక్తిగా అడిగాడు అర్జున్.


"వృత్తి ఉద్యోగం చేస్తూ, ప్రవృత్తిగా ఖాళీ సమయంలో చనిపోతున్న మానవత్వాన్ని బతికించాలనే ప్రయత్నం చేస్తుంటాను అర్జున్." 


ఇక అర్జున్ ఏమి మాట్లాడకుండా కూర్చున్నాడు. 


భువనేశ్వరమ్మ భౌతికకాయానికి అర్జున్ అంత్యక్రియలు చేశాడు. ఇప్పుడు నా మనసుకు ఒక మంచి పని చేశాననే తృప్తి కలిగింది.


సమాప్తం


పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం


  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Penumaka Vasantha

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page