top of page
Original.png

అసామాన్యుడు

7 days ago
5 min read

అసామాన్యుడు తెలుగు కథలో అనాథ పిల్లల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన సుందరంగారికి కృతజ్ఞతలు తెలుపుతున్న దివాకర్, పక్కన వార్తాపత్రికతో నిలుచున్న జర్నలిస్ట్ వర్ష.

Asaamanyudu - Telugu Inspirational Story | Madhupatra Sailaja Uppaluri

అసామాన్యుడుతెలుగు స్ఫూర్తిదాయక కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి  

Published in manatelugukathalu.com on 13/09/2026


నిస్వార్థ సేవ, మానవతా విలువలు, త్యాగం వంటి గొప్ప సందేశాలను అందించే స్ఫూర్తిదాయక తెలుగు కథ “అసామాన్యుడు”. అనాథ పిల్లల చదువు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సుందరంగారి సేవా ప్రయాణం ఈ కథకు ప్రధాన ఇతివృత్తం. నిజమైన గొప్పతనం సంపదలోనో, పదవిలోనో కాకుండా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడంలో ఉందని ఈ కథ చాటి చెబుతుంది. మనలో ప్రతి ఒక్కరూ మానవత్వంతో జీవించాలని ప్రేరేపించే ఈ కథను చదివి స్ఫూర్తి పొందండి.


“అబ్బా! ఎండలు చూస్తే ఇలా మండిపోతున్నాయి. ఇంకా చుట్టుపక్కల రెండుమూడు పల్లెల్లో ఈ మనిషి కోసం వెతకాలి. ఎక్కడున్నారో? ఏంచేస్తున్నారో? ఆ పెద్దమనిషిని కలసుకోవాలని నాకు ఎంతో ఆతృతగా ఉంది. ఆ మహానుభావుడికి కేంద్రప్రభుత్వం గొప్ప పురస్కారం అందించబోతోందన్న వార్త పేపర్‌లో వచ్చి అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి. కానీ ఆ వ్యక్తి ఎక్కడున్నారో? ఏమిటో? తెలియటంలేదు. ఆ వ్యక్తిని వెతికి పట్టుకునే దాకా నాకు నిద్రపట్టదు” అనుకుంటూ ఎదురుగా ఉన్న ఓ చిన్న హోటల్‌లోకి వెళ్ళాడు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వర్ష.


ఒకవారం క్రితం వర్ష దినపత్రికను చదువుతూంటే ఓ వార్త అతని దృష్టిని ఆకర్షించింది. ‘సుందరం’ అనే వ్యక్తి ఈ సమాజం గురించి చేసిన, చేస్తున్న సేవలకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వంవారు అత్యున్నత పురస్కారాన్ని అందిస్తున్నారని, సుందరంగారు చేసిన సహాయాన్ని అందుకుని అభివృద్ధిలోకి వచ్చిన ఇద్దరు యువకుల సమాచారాన్ని గురించి వివరంగా వ్రాసారు. ఆ సమాచారాన్ని చదివిన వర్షకి చాలా ఆనందం, స్ఫూర్తి కలిగాయి.


అజ్ఞాతంలో ఉన్న 'జాతిరత్నాలను' గుర్తించి వారికి అవార్డ్స్ ఇచ్చి సత్కరించటం ద్వారా వారి గొప్పతనాన్ని లోకానికి చాటిచెప్పాలన్న భారత ప్రభుత్వ ఆలోచనలకి రూపకల్పనే సుందరంగారికి బిరుదు ప్రదానం. వివిధ దినపత్రికలలో ఈ విషయం ప్రచురిస్తే ఆ దినపత్రికలను చదివే ఏ వ్యక్తికో తప్పక సుందరంగారు కనిపిస్తారని ఆ విధంగా ప్రకటన చేసారు.


“నా చిన్నతనంలో నేను మహాత్ముణ్ణి చూశాను” అని తాతగారు గొప్పగా చెప్పుకునేవారు. నేనిప్పుడు ‘మరో మహాత్ముణ్ణి’ చూడబోతున్నాను. ఈ విషయం తలచుకుంటేనే మనస్సు ఎంతో ఉత్కంఠభరితంగా అయిపోతోంది వర్షకి. “సుందరంగారిని ఈ రోజు తప్పక కలుస్తాను” అని నా మనస్సు మరీమరీ చెపుతోంది. నేను వారిని చూసినా “ఈ అవార్డ్ తీసుకోవటానికి వారిని ఒప్పించగలనా? ఇది నాకో విధమైన ఛాలెంజ్” అనుకున్న వర్ష చాలా ఆశగాను, అలజడితోనూ ఉన్నాడు.


ఆలోచనలనుండి బయిటకొచ్చి తినటానికి టిఫెన్ ఆర్డర్ ఇచ్చాడు. వేడివేడిగా ఇడ్లీ తెచ్చిన సర్వర్ “ఇంకేమైనా కావాలా సార్?” అంటూ అడిగాడు.


“కాఫీ తీసుకువద్దువుగాని, ముందు ఈ పేపర్లోని వ్యక్తినేమైనా చూసావా?” అని అడగబోతూండగా ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర ఏవో కేకలు మొదలయ్యాయి.


అక్కడ కూర్చున్న వ్యక్తి తనకి మంచినీళ్ళు తెచ్చిన ముదుసలి అయిన సర్వర్‌ని కేకలేస్తున్నాడు. “ఏమయ్యా మంచి నీళ్ళడిగి ఎంత సేపయ్యింది? త్వరత్వరగా కష్టమర్లకి సేవలందించలేని ఇట్లాంటి వయసుడిగిన వాళ్ళను ఈ హోటల్ వాళ్ళు పనుల్లో ఎందుకు పెట్టుకుంటారో? ఏమయ్యా! ఈ వయస్సులో కృష్ణా..రామా.. అనుకుంటూ ఇంట్లో కూర్చోక నీకు ఈ పనులెందుకు?” అని గట్టిగా అరుస్తున్నాడు. హోటల్‌లోని జనాలంతా వాళ్ళనే చూస్తున్నారు.


సిగ్గుతో తలవంచుకుని “బాబూ కోపం తెచ్చుకోకండి. మీకేం కావాలో చెప్పండి, ఈసారి ఆలస్యం చేయకుండా తెస్తాను” అంటూ శాంతంగా అడుగుతూ తలకి కట్టుకున్న తువ్వాలుని తీసి ముఖానికి పట్టిన చెమటను తుుడుచుకుంటున్నాడు ఆ సర్వర్.


తనముందున్న దోశను నోట్లో పెట్టుకుంటూ ఆ సర్వర్ ముఖంలోకి తదేకంగా చూస్తూ “సార్! మీరిక్కడుండటమేమిటి? అదీ ఇలా సర్వర్‌గా పనిచేయడమేమిటి?” అని బిగ్గరగా అంటూ ఒక్క ఉదుటున లేచి ఆ సర్వర్ కాళ్ళు పట్టుకున్నాడా వ్యక్తి.


అంత గట్టిగా, అరిచినట్లుగా అంటున్న ఆ వ్యక్తి మాటలకి హోటల్ మేనేజర్‌తో సహా మిగిలిన వాళ్ళంతా వీళ్ళవైపే దృష్టి సారించారు. “ఏమిటో ఆ వ్యక్తి వింతగా ప్రవర్తిస్తున్నాడు? ఇప్పుడేగా ఆ సర్వర్‌ని పట్టుకుని ఛడామడా కేకలేసి అంతలోనే అతని కాళ్ళమీద పడ్డాడు” అనుకుంటూ నివ్వెరపోయారు.


“సార్! నన్ను క్షమించండి. మీరని అనుకోలేదు. మాములుగా హోటళ్ళలో అశ్రద్ధగా పనిచేసే మామూలు సర్వర్లలాంటి వారేనని ఏదో కేకలేసాను. తమంతటివారు ఇక్కడ పనిచేస్తూంటారని అసలు ఊహించలేదు. నాకు ఉద్యోగం వచ్చి మొదటి జీతం అందుకున్న తరువాత మీ పాదాల దగ్గర ఆ జీతం డబ్బులు పెట్టి గురుదక్షిణగా సమర్పించుకుందామని మీ కోసం నేను చాలా ఊళ్ళలో వెతికాను. కానీ మీరు ఎక్కడ ఉన్నారో ఎవ్వరూ చెప్పలేక పోయారు. మీకు బాగా తెలిసివాళ్ళు కూడా మీరు అజ్ఞాతంలో ఉన్నారని మాత్రమే చెప్పారు. నా భాగ్యం పండి ఈ రోజు ఇలా మీరు..” అంటూ సంతోషంగా కన్నులనిండిన నీరు తుుడుచుకుని సుందరంగారి చేతులు పట్టుకుని ఆ కన్నులకద్దుకుంటూ “మీరిలా కూర్చోండి సార్” అంటూ కుర్చీలో కూర్చోబెట్టాడు.


“వద్దు దివాకర్. నేనిక్కడ సర్వర్‌గా పనిచేస్తున్నాను. యజమాని ముందు మర్యాద పాటించాలి. నిన్ను ఈ రోజు ఇంత గొప్ప స్థాయిలో చూస్తూంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనాడు నేను నాటిన ఓ చిన్నవిత్తు నేడు పదిమందికి నీడనిచ్చే మహావృక్షమై నా ముందు నిలబడితే కలిగే సంతోషంతో మాటలు రావటం లేదు” అన్నారు సుందరంగారు.


“అంతా మీదయేనండి. అనాధాశ్రమంలో ఉన్న నన్ను బాగా చదివించారు. మీరు అందించిన సహాయసహకారాలతో చదువు పూర్తిచేసిన నాకు ప్రభుత్వోద్యోగం వచ్చింది” అన్నాడు దివాకర్.


“నీ వ్యక్తిత్వంలోని కొద్దిపాటి లోపాన్ని సరిచేసుకోవాలి. నీ క్రిందిస్థాయి ఉద్యోగులపైనే కాదు ఇతరులెవరిపైనైనా కోపం తగదు. వారిలో లోపాలుంటే నెమ్మదిగా సర్దిచెప్పాలి. ఈ విషయాన్ని మార్చుకుంటే నీ పట్ల అందరూ గౌరవాన్ని పెంచుకుంటారు దివాకర్” అన్నారు సుందరంగారు. ఓ తండ్రిగా సుందరంగారు చెప్పే అనునయ వాక్యాలను దివాకర్‌తో పాటు అక్కడున్నవారంతా మంత్రముగ్ధులై వింటున్నారు.


ఇదంతా దగ్గరనుండి గమనిస్తున్న వర్ష గబగబా దివాకర్ దగ్గరకి వెళ్ళి తన దగ్గరనున్న దినపత్రికను చూపించి “నేను ఈ వార్తలోని వ్యక్తిని గురించి గతవారం రోజుల నుండి నాకు తెలిసిన ప్రాంతాలన్నీ వెతుకుతున్నాను. వారేనా వీరు?” అంటూ సుందరంగారివైపు చూపిస్తూ అడిగాడు.


“అవును ఆ మహానుభావుడు వీరే” అంటూ సుందరంగారి గురించి తనకు తెలిసిన విషయాలను వర్షతో పంచుకోవటం మొదలుపెట్టాడు దివాకర్.


“సుందరంగారు తన పదవ ఏటనే తండ్రిని కోల్పోయారు. తల్లి పెంపకంలో కష్టపడి పెరిగిన వారు, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ చదువుకొని, రాష్ట్ర ప్రభుత్వ గ్రంధాలయ శాఖలో గ్రంధపాలకునిగా ఉద్యోగం సంపాదించుకున్నారు. ఉద్యోగంలోచేరే రోజున తల్లి ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు, ఆమె “బాబూ నువ్వు నీ చిన్న వయస్సులోనే తండ్రిని పోగొట్టుకుని ఎన్నో బాధలు పడుతూ, శ్రమకోర్చి చదువుకుని ఎలా ఈ స్థితికి వచ్చావో ఆ విషయాన్ని ఏనాడూ మరిచిపోవద్దు.


అలాగే ఈ సమాజంలో అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా, అభాగ్యులుగా బ్రతుకుతున్న పిల్లలు ఎందరో ఉన్నారు. అలాంటి పిల్లలకి నువ్వు చేయూతనందించాలి. వారి చదువులకోసం నువ్వు చేయగలిగినంత ఆర్ధిక సాయం చేయాలి. వారికి ఉపాధి దొరికే అవకాశాలను తెలిపి, వారు సంఘంలో నిలదొక్కుకునేలా వారికి అండగా నిలబడాలి. ఇది నా కోరిక” అని చెప్పింది.


తల్లి మాటలు సుందరంగారి మనసులో బలంగా నాటుకుపోయాయి. తన తల్లికి ఇచ్చిన మాట కోసమేకాక, తనలా మరెవరూ బాధపడకూడదని తలపోసిన ఆయన, తన అవసరాలను తగ్గించుకుంటూ, వచ్చిన జీతంలో ఎక్కువ భాగం పేదపిల్లల స్కూలు ఫీజులు కడుతూ, రాత్రివేళలలో వారికి చదువు చెపుతూ, ఆ పిల్లల సంక్షేమం కోసమే వివాహబంధాన్ని కూడా వద్దనుకున్నారు.


వారు పదవీవిరమణ చేసిన తరువాత వచ్చిన డబ్బును కూడా కొంచమైనా దాచుకోకుండా అనాధ పిల్లల గురించే ఖర్చు చేశారు. తల్లి చనిపోయిన తరువాత ఓ చిన్న గదికి మారి, ప్రతిరోజూ ఏదో ఒక పని చేసి తన దినసరి ఖర్చులకోసం సంపాదించుకుంటూ జీవనం చేస్తున్నారు. వారి ప్రోత్సాహంతో పెరిగిన పిల్లలు ప్రయోజకులై ఈ రోజున మంచి కొలువుల్లో ఉన్నారు. సుందరంగారికి ఆడంబరాలుగానీ, కీర్తికండూతిగానీ లేనేలేవు. ఎక్కడో మారుమూల గ్రామంలో అజ్ఞాతంగా జీవిస్తున్నారు.


వీరి వ్యక్తిత్వం, సేవలను గురించి తెలుసుకున్న అమెరికాలోని ఓ సేవాసంస్థవారు “మ్యాన్ ఆఫ్ ది మిలీనియం” అనే బిరుదు ప్రదానం చేసి, కోటి రూపాయలను అందజేస్తే, ఆ డబ్బు గురించి ఒక ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి దానిపై వచ్చే ఆదాయాన్ని కూడా అనాధ పిల్లల సంక్షేమానికే ఉపయోగించమన్నారు.


సుందరంగారి వయస్సుని దృష్టిలో పెట్టుకుని, వీరి ద్వారా సహాయంపొంది, చక్కగా చదువుకుని మంచిమంచి ఉద్యోగాలలోకి, వ్యాపారాలలోకి వచ్చిన కొందరు యువకులు “మీరు ఇక కష్టపడకండి. మిమ్మల్ని మా తండ్రిగా దత్తత తీసుకుని, మీ బాగోగులు మేం చూసుకుంటాం” అన్నారు.


“కాళ్ళూచేతులు ఆడుతున్నంతవరకు కష్టం చేసుకుంటూ బ్రతకటమే నాకు ఇష్టం. పని చేయటంలో నేను ఆ దేవుణ్ణి చూస్తాను. అంతేకాని మరొకరి సాయం తీసుకుని జీవించటం నాకు ససేమిరా ఇష్టం లేదు. మీరు నాకోసం ఖర్చు చేయాలనుకున్న డబ్బును ఓ పేద విద్యార్ధి చదువు కోసం ఉపయోగించండి” అన్నారు సుందరంగారు.


ఇకపై అదే గ్రామంలో ఉంటే ఈవిధంగానే తన వల్ల సహాయం పొందిన వారువచ్చి తనను ఇబ్బంది పెట్టవచ్చుననుకున్న సుందరంగారు మరో గ్రామానికి వెళ్ళిపోయారు. వారి చేయూతతో పెరిగిన ఓ అనాథను నేను” అంటూ వర్ష ఇచ్చిన దినపత్రికలోని సమాచారాన్ని చదవటం పూర్తిచేసిన దివాకర్ ఎంతో సంభ్రమాశ్చర్యాలకి లోనయి తననుతాను నిలువరించుకోలేక ప్రక్కనే ఉన్న టేబుల్‌పైకెక్కి దినపత్రికలోని ఆ వార్తను బిగ్గరగా చదివి “తన జీవితంలో తనకంటూ ఏదీ మిగుల్చుకోకుండా, ఈ రోజుకీ తన తిండిని తన స్వశక్తితో సంపాదించుకుంటూ, అజ్ఞాతంగా బ్రతుకుతున్న ఆ ‘మరో మహాత్ముడు’ మనందరికీ సేవలనందిస్తున్న ఈ సుందరంగారే” అంటూ ఎలుగెత్తి చెప్పాడు.


అంతే అక్కడనున్న జనమంతా ఓ అద్భుతవ్యక్తిని చూస్తున్నట్లుగా మైమరచిపోయి సుందరంగారికి మర్యాదలు చేయటం మొదలుపెట్టారు.


వర్ష కూడా తన చెయ్యి తానే గిల్లుకుని “నేను నిజంగా ఆ ‘మరో మహాత్ముణ్ణి‘ చూసానా? అని ఎంతో ఉద్విగ్నతతో సుందరంగారికి వందనం చేసాడు. తనని తాను పరిచయంచేసుకుని కేంద్ర ప్రభుత్వ అవార్డ్ గురించి చెప్పాడు.


“బాబూ మీకు నా గురించి తెలిసింది కాబట్టి ఇలా మర్యాదలు చేస్తున్నారు. కానీ నాకు ఇవేమీ సంతోషాన్ని ఇవ్వలేవు. మీలో ఏ ఒకరిద్దరైనా నా బాటలో నడిస్తే నాకదే గొప్ప బహుమతి అవుతుంది” అన్నారు సుందరంగారు.


ఆయన కోరిన విధంగా జీవించటానికి మనసావాచా కట్టుబడిన వర్ష మరియు దివాకర్‌లు సుందరంగారికి వాగ్దానం చేసి, ఆయనని ఢిల్లీకి వెళ్ళి ప్రభుత్వం నుండి అవార్డ్ తీసుకునేందుకు ఒప్పించారు.

***

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి కొన్ని ఇతర రచనలు: 


మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి


మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు.  గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు  నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page