కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Athidi Cheppina katha' written by N. Dhanalakshmi
రచన : N. ధనలక్ష్మి
చిన్నపిల్లల మనసు తెల్లకాగితం లాంటిది. అందులో మనం అందమైన కావ్యాలను ఎన్నో రాయవచ్చు, వారిని భావితరాలకు ఆదర్శంగా గొప్పగా తీర్చిదిద్దవచ్చు. వారిలో దాగివున్న చీకటి అనే అజ్ఞానాన్ని ఎన్నో విలువైన మాటలతో చిన్నప్పటినుంచి తొలగించవచ్చు, వారికి మంచిచెడు నేర్పవచ్చు...
అతిథి గా వచ్చిన అతను పిల్లలకి ఏ పాఠాలు నేర్పారు అనేది ఈ కథ.
ఈ కథను ఈ తరం రచయిత్రి ధనలక్ష్మి గారు రచించారు.
***
“ఈ రోజు మన అందరి ఫేవరేట్ యాక్టర్ రామ్ గారు వస్తున్నారు పిల్లలూ. మీరంతా అల్లరి చేయకూడదు. ఫోటోలు , ఆటోగ్రాఫ్ లు కూడా క్యూ లో నిలబడి తీసుకోవాలి. మీరు క్రమశిక్షణలో ఉంటేనే మన స్కూల్ కి మంచి పేరు వస్తుంది” అని విద్యార్థులందరినీ హెచ్చరించారు ప్రిన్సిపాల్ సరోజ గారు..
యాక్టర్ రామ్ గారు అంటే అందరికీ చాలా అభిమానం. తన నటనతో, వ్యక్తిత్వంతో అతి తక్కువ కాలంలోనే అందరి మన్ననలను అందుకున్నారు.
రామ్ గారు రాగానే పిల్లలందరూ పువ్వులతో ఆహ్వానం పలికారు. ఇద్దరు పిల్లలు అయితే రామ్ యాక్ట్ చేసిన పాటకు తగ్గట్టు డాన్స్ మూమెంట్స్ చేస్తూ స్టేజ్ వరకు తీసుకొని వెళ్ళారు..
రామ్ స్టేజ్ ఎక్కేటప్పుడు తన జేబు నుండి పెన్సిల్ ఉన్న చిన్న బాక్స్ కింద పడిపోయింది. అది చూసిన ఒక విక్కి అనే అబ్బాయి ఇంత పెద్ద హీరోకి పెన్సిల్ తో ఏమి పని అబ్బా అని మనసులో అనుకొని ఆ బాక్స్ ను రామ్ కి ఇచ్చాడు..
పిల్లలతో ఎన్నో సరదా విషయాలను చెప్తూ ‘మీలో ఎవరైనా ఏమైనా అడగాలి అంటే అడగవచ్చు’ అని రామ్ అనగానే విక్కి లేచి
" సర్ ఇందాక మీ పెన్సిల్ పడిపోతే నేనే మీకు అందిచాను” అంటూ తనని తాను పరిచయం చేసుకొని
“సర్! మీరు పెన్సిల్ ఎందుకు అంత భద్రంగా దాచుకున్నారు?” అని అడిగాడు విక్కి.
రామ్ నవ్వుతూ పెన్సిల్ తీసి చూపిస్తూ “ఇది కేవలం పెన్సిల్ మాత్రమే కాదు. నాపై నాకు నమ్మకాన్ని కలిగించిన మేజిక్ ఇది” అనగానే పిల్లలంతా ఆశ్చర్యపోతూ “ఆ మేజిక్ ఏంటో మాకూ చెప్పండి సర్” అన్నారు ఏక కంఠంతో...
చిన్నతనంలో నాన్న ఒక రోజు నా దగ్గరికి వచ్చి “కన్నా! ఈ సారి జరిగే పరీక్షలో మంచి మార్క్స్ వస్తే నీకు గిఫ్ట్ ఇస్తాను” అన్నారు.
గిఫ్ట్ అనగానే నేను ఎంతో ఎక్సయిట్ అవుతూ అన్నీ సబ్జెక్ట్స్ బాగా చదివి ఎగ్జామ్స్ అన్నీ రాసేసి వచ్చాను.
రిజల్ట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా..”
“మీరు క్లాస్ ఫస్ట్ వచ్చారు కదా” అని అడిగాడు ఒక స్టూడెంట్ లేచి...
“హా హా కాదు. నాకు మంచి మార్క్స్ అయితే వచ్చాయి కానీ, నాన్నకి ఇష్టమైన మాథెమాటిక్స్ లో తక్కువ మార్క్స్ వచ్చాయి.. దాని వల్ల ర్యాంక్ కూడా తగ్గింది..” అన్నారు రామ్.
“అయితే మీ నాన్నగారు గిఫ్ట్ ఇవ్వలేదు ఏమో కదా!” అని అడిగారు పిల్లలందరూ ఒకింత బాధగా.
రామ్ నవ్వుతూ “ఇచ్చారు. అదే ఈ పెన్సిల్. నేను ఏడుస్తూ “నాన్నా! ఈ గిఫ్ట్ కి నేను తగిన వాడిని కాదు” అంటూ గట్టిగా ఏడ్చాను.
నాన్న నన్ను హత్తుకొని "రేయ్ కన్నా! పెన్సిల్ కూడా నీలాగే ! అప్పుడప్పుడూ మొద్దుబారి పోతుంది. షార్ప్ నర్ తో చెక్కినప్పుడు పదునుదేరి, బాగా రాస్తుంది.
నువ్వు కూడా ఈ పరీక్షలో చేసిన మిస్టేక్స్ తెలుసుకొని, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకో, నీ శక్తి ఏంటో తెలుసుకో! అప్పుడు బెస్ట్ ఇవ్వగలవు. పెన్సిల్ ని ఎటువంటి స్పేస్ లో అయినా రాయచ్చు. నువ్వు కూడా ఎక్కడన్నా సరే, నీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకో” అంటూ ఈ పెన్సిల్ నాకిచ్చి వెళ్ళిపోయారు నాన్న..
మాకు జరిగిన తదుపరి ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవడమే కాకుండా క్లాస్ ఫస్ట్ వచ్చాను. ఆనాటి నుండి నేటి వరకు నేను ఎప్పుడైనా ఓడిపోతున్న ఫీలింగ్ వస్తే చాలు, నాన్న ఇచ్చిన ఈ పెన్సిల్ ని చూస్తాను. ఎక్కడలేని శక్తి వస్తుంది. అన్నిటిలో నేను విజయాన్ని సాధించి నాకంటూ ఒక పేరును క్రియేట్ చేసుకున్నాను.
మీరు కూడా ఎప్పుడైన ఓడిపోతున్నాము అనుకుంటే ఈ పెన్సిల్ ని గుర్తుకు పెట్టుకోండి.
నిజమైన ఆనందం ఏంటో తెలుసా పిల్లలూ! మీరు చేస్తున్న పనిని ఇష్ట పడినప్పుడు. కాబట్టి మీరు చేస్తున్న ప్రతి పనిని ఇష్టపడడం మొదలు పెట్టండి.. ఏ పని చేసినా నిజాయితీగా చేయండి. మీ తల్లిదండ్రులకు మీరు గర్వకారణము అవ్వాలి కానీ అవమానభారం కాకూడదు. అది గుర్తు పెట్టుకోండి.
మీ పేరు తలుచుకున్న వెంటనే అందరి పెదాలపై చిరునవ్వు రావాలి..
ఇంకో ముఖ్య విషయం కన్నా!
‘అమ్మాయి’ ... అనే పదంలో మొదటి రెండు అక్షరాలు ఏంటో చెప్పండి” అనగానే
"అమ్మ" అని పిల్లలంతా గట్టిగా చెప్పారు..
“కదా! ప్రతి అమ్మాయీ మనకి తల్లితో సమానం.. అందుకే అమ్మాయిలను గౌరవించండి…”
“తప్పకుండా సర్” అని పిల్లలంతా అన్నారు ..
“సర్! మా కోసం ఏదైనా చిన్న కథ చెప్పరా” అని అడిగింది చతుర అనే అమ్మాయి..
“ఇద్దరు ఫ్రెండ్స్ ట్రిప్ కి వెళ్ళారు....
వాళ్ళ పేర్లు బంటి, బన్నీ ..... అలా సరదాగా సాగిపోతున్న వారి పయనంలో మాటా మాటా పెరిగి, గొడవ వచ్చి బంటి బన్నీని కొట్టాడు.. బన్నీ బాధగా అక్కడే ఉన్న ఒక కట్టెను తీసుకొని ఇసుకలో " ఈ రోజు నా ప్రాణమిత్రుడు నన్ను కొట్టాడు"అని రాశాడు..
అలా రాయడం బంటి చూసాడు..
కొంచం దూరం వరకు ఇద్దరూ మొదట సైలెంట్ గా ఉన్నారు.. ఫ్రెండ్స్ కదా ఎక్కువ సేపు కోపంగా ఉండలేక పోయారు.. మళ్ళీ యధావిధిగా మాట్లాడుతూ వారి పయనం మొదలు పెట్టారు.
అలా కొద్ది దూరం వెళ్ళగానే బన్నీ చూసుకోకుండా కాలు జారి బావిలోకి పడిపోయాడు.. పాపం తనకి ఈత రాదు. అప్పుడు బంటి దిగి కాపాడాడు...
కొద్దీ సేపు అయ్యాక బన్నీకి సృహ వచ్చింది.. తెచ్చుకున్న ఫుడ్ ని తిన్నారు..
కొంచం శక్తి వచ్చాక బన్నీ అక్కడ కనపడ్డ రాయి పై " ఈ రోజు నా ఫ్రెండ్ నన్ను కాపాడాడు అని రాశాడు(చెక్కాడు)..
బంటి ఆశ్చర్యపోతూ “అప్పుడు నేను కొడితే ఇసుక మీద రాశావు. ఇప్పుడేమో రాయి పై రాశావు.. ఎందుకు బన్నీ” అని అడిగాడు .
" మొదట నువ్వు నన్ను బాధ పెట్టావు. దానిని నేను ఇసుక పై రాశాను. ఏ మాత్రం గాలి వచ్చిన సరే కొట్టుకుపోతుంది.
రెండో సారి నువ్వు నన్ను కాపాడావు. ఈ విషయాన్ని నేను రాయిపై చెక్కను. ఎటువంటి ఉపద్రవాలు వచ్చిన సరే రాయి పై ఉన్న విషయాన్ని చెరపలేరు.
నేను ఎప్పుడు కూడా నువ్వు చేసిన మంచిని మాత్రమే నా గుండెల్లో రాయి లాగ చెక్కుకుంటాను.. ఎప్పటికీ మర్చిపోను. నువ్వు నన్ను బాధ పెట్టినవి ఇసుకలో మాదిరిగా త్వరగా మర్చిపోతాను.....
బంటి నవ్వుతూ బన్నీని గట్టిగ హత్తుకున్నాడు .
పిల్లలూ! మీరు కూడా బన్నీ లాగా ఇతరులు చేసిన మంచిని మాత్రం గుర్తు పెట్టుకోండి. బాధ పెట్టింది మర్చిపోండి..
మనం ‘5C’ లు ఫాలో అయితే ఎప్పటికీ ఇంకా స్ట్రాంగ్ గా ఉండగలం....” అన్నాడు రామ్
“అవి ఏంటో చెప్పండి సర్!” అని పిల్లలంతా అడిగారు
క్రిటిసిజం :
మీకు సబ్జెక్ట్ లో ఏదైనా డౌటు వస్తే అడిగి క్లారిటీ తెచ్చుకోండి.. మీ ఫ్రెండ్స్ అంతా నవ్వుతారేమో, మేడమ్/సర్ తిడతారేమో అనుకుంటూ ఇలా ఆలోచిస్తూ ఉండకూడదు...
ఎదుటివారు మీ గురించి ఏమి అనుకుంటారు అనేది మీకు అనవసరం , మీరు ఎంచుకున్న దారిలో నిజాయతీగా పని చేసుకుంటూ పోండి. అప్పుడు విజయం అనేది మీకు తప్పకుండా దక్కుతుంది..
ఎదుటివారి గురించి ఆలోచిస్తూ మీరుంటే, మీకున్న వ్యక్తిత్వం కోల్పోతారు...
కంపారిజన్ :
ఇది చాలా ముఖ్యమైన విషయము... ఎప్పుడు కూడా ఎదుటివారితో పోల్చుకుంటూ మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ చేసుకోకండి..
ఫర్ ఎగ్జామ్ ఫుల్..
పరీక్షలో మీ ఫ్రెండ్స్ కి ఎక్కువ మార్క్స్ వచ్చాయి.. నాకు రాలేదు.. అని బాధ పడకూడదు..
మీకు మీరే పోటీ అవ్వాలి..
మీ మార్క్స్ తో మీరే పోటీ పడాలి... ప్రతి రోజూ మెరుగుపరుచుకూంటు ముందుకు వెళ్ళాలి.. మార్గదర్శకంగా తీసుకోండి. అంతే! లేని పోని వాటిని ఆలోచిస్తూ కాలయాపన చేయకండి.. ఎవరో ఏదో అన్నారని, విమర్శించారని బాధ పడుతూ ఉండకండి.
కంపాషన్ :
ఎదుటివారి పై దయ, జాలి కరుణ ఉండాలి... మీకు
ఉన్నంతలో ఎంతో కొంత ఎదుటివారికి సాయం చేస్తే అది మీకు మరింత పేరును తెస్తుంది.. మీకు మంచిని చేస్తుంది...
డబ్బు ఒక్కటే సాయం కాదు... మాట సాయం చేయచ్చు.. మీ ఫ్రెండ్స్ బాధపడుతుంటే జోక్స్ వేసి బాధను మాయం చేయచ్చు.. వాళ్ళు పెన్స్ ఆర్ లంచ్ బాక్స్ మరిచిపోయి వస్తే మీవి షేర్ చెయ్యొచ్చు... అది కూడా సాయమే.. మీ పుట్టిన రోజు అప్పుడు బనానా తీసుకొని ఆకలితో ఉన్న వారికి ఇవ్వచ్చు.. అది కూడా సాయమే
క్రియేటివిటీ :
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ కొత్తవి నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి..
కాన్ఫిడెన్స్ :
ఇది అన్నిటికన్నా ముఖ్యం...
మిమ్మల్ని మీరు నమ్మితే ఏదైనా సాధించగలరు...
అనుకున్న దారిలో ఎన్నో అడ్డంకులు, విమర్శలు వస్తాయి వాటిని గుట్టగా పెర్చుకొని విజయం అనే మీ
గమ్యానికి చేరుకోవాలి అంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి...
హద్దుల్లో ఉంటూ స్నేహాన్ని పంచండి ద్వేషాన్ని కాదు..
నవ్వుతూ ఉండండి. అది ఎంతటి కష్టాన్ని అయినా సరే చిటికెలో మాయం చేస్తుంది...
జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది .. అన్నిటినీ తట్టుకుంటూ ముందుకు వెళ్ళితేనే కొత్త జీవితంలో ఎదురయ్యే అద్భుతమైన విజయలు అందుకోగలరు” చెప్పడం ముగించాడు రామ్.
“పిల్లలంతా “సర్! మీరు రీల్ హీరో కాదు.. రియల్ హీరో” అన్నారు.
అప్పుడు రామ్ నవ్వుతూ...
“కన్నా.... నేను హీరో ను కాదు. నటుడిని . డైరెక్టర్ చెప్పినట్టు చేసే నటుడిని ...
నిజమైన హీరోలు ఎవరో తెలుసా ...
జవాన్లు :
మనమంతా ఇక్కడ క్షేమంగా ఉన్నాము అంటే జవాన్లు మనకోసం ఎన్నో కష్టాలను, అడ్డంకులను తట్టుకొని మనకు కాపలాగా ఉండడమే వల్లే..
వాళ్ళు రియల్ హీరోలు...
రైతులు :
మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకపోయినా ఉండగలం కానీ ఆహారం లేకుండా ఉండలేము.. పంటలు పండించడానికి రైతులు ఎన్నో కష్టాలు పడతారు.. పురుగు నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి ఇలా ఎన్నో సమస్యలు ఎదురుకొని పంటను తన చెమటను చిందించి పండిస్తారు.. వాళ్ళు రియల్ హీరోలు
డాక్టర్లు :
రోగి ప్రాణాలను పాడడానికి తన ప్రాణం అడ్డం వేసి , కంటికి తెలియని ఎన్నో రోగాలని తెలుసుకొని నయం చేస్తూ, మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ ప్రాణం పోసే దేవుళ్ళు డాక్టర్లు... వాళ్ళు రియల్ హీరోలు..
అని చెప్పగానే అక్కడ ఉన్న వారంతా కరతాళధ్వనులు చేశారు...
పిల్లలు అందరూ కూడా “ఇకపై మేము కూడా మీ లాగే ఉండడానికి ట్రై చేస్తాము” అన్నారు.
రామ్ వాళ్ళ అందరితో కలిసి గ్రూప్ ఫోటో తీసుకొని అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయారు...
***శుభం***
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.
Comments