top of page

అత్తలోని "అమ్మ మనసు "


'Atthaloni Amma Manasu ' Written By Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

విజయ్ చాలా అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఆఫీస్ లో ఎంత అలసిపోయి ఇంటికివచ్చినా ఆ అలసట అంతా ఇంటి వాకిలిలోనే మాయమైపోయింది. ఎందుకంటే ఇంటికి చేరగానే ఎదురువచ్చిన తన భార్య మధుర చిరునవ్వును చూసి.

"ఏమండీ!" అంటూ ఎదురు వచ్చి చేతిలో ఉన్న లాప్టాప్ బ్యాగ్ తీసుకుని కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు చేతికి అందించింది. ఆమెనే చూస్తూ కాళ్ళు కడుక్కున్నాడు విజయ్. తుడుచుకోండి అని టవల్ ఇచ్చింది. తను మళ్ళీ తల్లిని కాబోతున్నాను అన్న విషయం భర్తతో ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురుచూస్తోంది మధు..!

కానీ లోపల ఉన్న మనిషిని చూస్తే విజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని కంగారుగానే ఉంది తనకి. ‘ఎలాగైనా ఇవాళ అన్ని విషయాలు చెప్పేయాలి! అపార్ధాలు అన్నీ తొలగిపోవాలి’ అనుకుంటోంది మధు మనసులో.

"మధు.. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా?" అంటూ ఏదో మాట్లాడబోతున్న విజయ్ పెదవులపై చేయి ఉంచింది మధుర!

" మీరు ఏమి అడగబోతున్నారో నాకు తెలుసు! అన్నీ వివరంగా చెబుతాను, లోపలికి రండి.!" అని లోపలికి తీసుకువెళ్ళింది విజయ్ ని.

లోపలికి వెళ్తున్న విజయ్.. ఒక్క అడుగు వెనక్కి వేసి,

"ఏంటి మధు!? తను ఇక్కడ ఏమి చేస్తోంది?” అని కోపంగా అడుగుతున్నాడు..! ఆ వచ్చిన మనిషి, ‘నువ్వు వెళ్ళు, నేను మాట్లాడుతాను.!’ అన్నట్టు కళ్ళతో సైగ చేసింది. మధు విజయ్ కి సమాధానం చెప్పకుండా కిచెన్ లోకి వెళ్ళిపోయింది.

విజయ్ కి చాలా కోపం వచ్చింది. "ఏయ్ నువ్వు ఇక్కడ ఏమిచేస్తున్నావ్? మళ్ళీ ఏమి చేయడానికి ఇక్కడికి వచ్చావ్? మర్యాదగా బయటకి నడు.!" అంటూ ఆ మనిషి మీద అరుస్తున్నాడు.

" అది కాదు బాబు.!" అంటూ ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. కానీ ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ఆమె నిలువెల్లా చిగురుటాకులా వణికిపోతోంది. రెండు చేతులు జోడించి " నన్ను మన్నించు బాబు.!" అని దీనంగా మొహం పెట్టి అడుగుతోంది.

" ఎలా క్షమించమంటావ్? నువ్వు చేసిన పనికి మేము కోల్పోయిన ప్రాణాన్ని నువ్వు తిరిగి తీసుకురాగలవా? నా మధు పడిన బాధ కి ఉపశమనం కలిగించగలవా?" అంటూ ఒక్కొక్క మాటా తూటాల్లా పేలుస్తూనే ఉన్నాడు.! ఆమె నుండి ఎటువంటి సమాధానం లేదు...

" నీ వయసుకు మర్యాదనిచ్చి నిన్ను వదిలేసాను.! ఐనా మళ్ళీ నా ఇంటికి వచ్చే ధైర్యం ఎలా చేసావు నువ్వు..!? " అంటూ విరుచుకు పడుతున్నాడు ఆమె పై.. అతను ఇంకో మాట అనే లోపు.. మధుర కాఫీ తీసుకుని వచ్చింది.

" కొంచం శాంతిచండి! మీరు అనే మాటలు అన్నీ అనేసారు! ఇంక చాలు. ఇంకా పాపం చేయకండి.! ఈ కాఫీ తీసుకోండి.!" అంటూ చేతికి అందివ్వబోయింది మధు.

అంతే! ఒక్కసారి మధు వంక ఎర్రబడ్డ కళ్ళతో చూసి తన చేతిలో ఉన్న కాఫీ కప్ విసిరికొట్టాడు.

" ఓర్పుకి కూడా ఒక హద్దు ఉంటుంది మధుర! ఆవిడని నువ్వు ఎలా క్షమించగలిగావ్.!? ఆమె ఇంకొక్క క్షణం ఇక్కడ ఉన్నా తను నా కన్నతల్లి అన్న విషయం కూడా నేను మర్చిపోతాను.!" అని కటువుగా అనేసి తన గదిలోకి వెళ్లి భళ్ళుమని డోర్ వేసేశాడు. ఆ శబ్దానికి కాంతమ్మ గుండె పగిలినంత పని అయింది.

కొడుకు అన్న మాటలు ఆమె గుండెని చీల్చే బాణాల్లా గుచ్చుకున్నా ‘తల్లి మనసు వాడికి ఏదో రోజు అర్థమై నన్ను క్షమించి, మళ్ళీ నా దగ్గరకు వచ్చే రోజు కచ్చితంగా వస్తుంది’ అనుకుని మౌనంగా అక్కడనుండి వెళ్ళిపోడానికి బ్యాగ్ తీసుకుని రెండు అడుగులు ముందుకు వేసిందో లేదో కాలికి ఏదో తగిలినట్టు అనిపించి కిందకి చూసింది.

" నన్ను క్షమించండి అత్తయ్యా! " అంటూ నీరు నిండిన కళ్ళతో దీనంగా చూస్తోంది మధు.

" అయ్యో..! లేమ్మా...! పైకి లే...! వద్దమ్మా మధు.. నువ్వు నా కాళ్ళు పట్టుకోవద్దు..! నువ్వు, వాడు సుఖంగా ఉండాలనే నా తాపత్రయం. నేను వెళ్తానమ్మా.. వాడు జాగ్రత్త...! చూడమ్మా! వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం తెలియనివ్వకు. తెలిస్తే వాడి గుండె పగిలిపోతుంది. వాడు నన్ను కాదు అనుకున్నా, ఏదో రోజు మళ్ళీ నా దగ్గరకి తప్పకుండా వస్తాడు. కానీ జరిగిన ఘోరానికి నువ్వే కారణం అని తెలిస్తే మాత్రం నిన్ను క్షమించడు. జాగ్రత్త తల్లి.!" అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది కాంతమ్మ. వెళ్లిపోతున్న అత్తగారిని చూస్తూ

" అయ్యో! ఎంత పాపం చేస్తున్నాను నేను. నా స్వార్థం కోసం తల్లి కొడుకులను విడదీస్తున్నాను.!" అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అలాగని భర్తకి నిజం చెప్పే ధైర్యం చేయలేకపోతోంది. ఎందుకంటే తనకి తన భర్త, అత్తగారు తప్ప నా అని చెప్పుకోడానికి ఇంకెవరు లేరు. అందుకే కోడలి పొరపాటు కాస్తోంది ఆ అత్తగారు.! కాదు. కాదు. ఆ దేవత!జరిగిన ఘోరంలో మధుర తప్పు ఉంది అని తెలిస్తే విజయ్ తనని ఈ జన్మలో క్షమించడేమో అన్న భయంతో మధు ఆత్మహత్యకు పాల్పడుతున్న క్షణంలో తల్లి లాంటి తన అత్తగారు కాంతమ్మ అడ్డుపడి నింద తనపై వేసుకుని కోడలికి పునర్జన్మ నిచ్చింది. కొడుకు దృష్టిలో దోషిగా నిలిచింది.. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తోంది..

***

మధుర ఏడుస్తూనే ఉంది.. ఇంతలో డోర్ తీసిన శబ్దం వినిపించింది.!

" మధు..! ఆవిడ వెళ్లిందా..!? " అని మధు భుజంపై చేయి వేసి అడుగుతున్నాడు విజయ్.!

మధు కన్నీళ్లు తుడుచుకుని, వెనక్కి తిరిగి భర్త కళ్ళల్లోకి చూస్తూ, " మీకు ఇవాళ ఒక నిజం చెప్పబోతున్నాను.! అది విన్నాక మీరు నన్ను చంపేసినా పర్వాలేదు.! కానీ, ఇంక ఈ పాపభీతి భరించడం నా వల్ల కాదు.!" అంటున్న మధు తో..

" ఏమి మాట్లాడుతున్నావ్ మధు!? ఏమి నిజం చెప్పాలి నాకూ...!? " అంటూ మధు వంక ప్రశ్నర్ధకంగా చూస్తున్నాడు విజయ్.!

విజయ్ చేయ తన కడుపుపై పెట్టి.. " మళ్ళీ మీరు తండ్రి కాబోతున్నారు..!" అని నీరు నిండిన కళ్ళతో చెప్పింది మధు.

" ఒహ్హ్.. మధు! థాంక్ యూ సొ మచ్ ! ఇంత మంచి విషయం ముందే చెప్పొచ్చు కదా!" అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే ఆపింది మధు...

"నన్ను పూర్తిగా చెప్పనివ్వండి! ఇవాళ మీకు అత్తయ్యగారి మంచితనం గురించి తెలియాలి. మీకు అత్తయ్యగారికి మధ్య ఉన్న ఈ అపార్ధాలన్నిటికి నేనే కారణం.! అసలు నాకు అబార్షన్ జరగడానికి అత్తయ్యగారు కారణం కాదు ! అసలు ఆరోజు ఏమిజరిగిందంటే..

నేను నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మీరు క్యాంపుకి వెళ్లడం కోసం నన్ను మీ అమ్మగారి ఇంట్లో దిగబెట్టి వెళ్లారు కదా..! నిజానికి అత్తయ్యగారు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు! ఆవిడ నాపై చూపించే ప్రేమను, నేను అర్ధం చేసుకోలేకపోయాను. జాగ్రత్తలు చెప్తూ ఉంటే, నేను ఆమెని ఛాధస్తురాలు అనుకునేదాన్ని. అస్తమాను, సిగ్నల్ కోసం డాబా ఎక్కి, దిగి చేసేదాన్ని. అలా చేయకూడదు అమ్మా..! అని అత్తయ్యగారు మంచి చెప్పబోతే, అపార్ధం చేసుకునే దాన్ని. నా ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసమే కదా చెప్తున్నారు అనుకునేదాన్ని కాదు.! ఆమెపై ఉన్న అయిష్టం తోనే మీకు ఆమె గురించి తప్పుగా చెప్పేదాన్ని. నా చేత పనులు చేయిస్తున్నారు అని, బరువులు ఎత్తిస్తున్నారు అని అబద్ధాలు చెప్పేదాన్ని.!"

మధు చెప్తున్న ఒక్కో నిజం, విజయ్ మనసుని ఛిద్రం చేస్తుంటే, అతని ప్రమేయం లేకుండా అతని కళ్ళలో నుండి కన్నీరు వచ్చేస్తోంది.!

మధు చెప్తూనే ఉంది. " మన జీవితంలో చీకటి నింపేసిన దుర్ఘటన జరిగిన ఆరోజు చాలా వర్షం పడింది.! మీరు అప్పుడే ఫోన్ చేసారు. సిగ్నల్ సరిగ్గా రావడం లేదని నేను ఫోన్ మాట్లాడుతూ డాబా పైకి వచ్చాను. అప్పుడు సిగ్నల్ దొరికింది. మీతో మాట్లాడేసి నేను కిందకి దిగుతుండగా మెట్లపై నుండి జారీ కిందపడిపోవడం వల్ల గర్భానికి దెబ్బ తగిలింది. కడుపులో బిడ్డ చనిపోయింది.! ఆరోజు నేను కొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు.! వెంటనే నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లారు.! అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పారు.! మీకు ఈవిషయం తెలిస్తే మీరు నా మీద అసహ్యం పెంచుకుంటారేమో అన్న భయంతో నేను హాస్పిటల్ బిల్డింగ్ పై నుండి దూకి చనిపోదాం అనుకున్నాను.!

కానీ.. అత్తయ్యగారు నన్ను ఆపారు..!

"జరిగినదానిలో నీ తప్పేమీలేదు. కొంచెం అడుగులు జాగ్రత్తగా వేసి ఉంటే సరిపోయేది.! కానీ, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇకమీదట జాగ్రత్తగా ఉండు.!" అని నచ్చచెప్పబోయారు. కానీ , పుట్టబోయే బిడ్డ విషయంలో మీరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో, ఆమెకి వివరం గా చెప్పాను.! బిడ్డని పోగొట్టుకున్న బాధతో పాటు మీరు నన్ను దూరం పెడతారేమో అన్న బాధ కూడా తోడయ్యి నేను కృంగిపోయేదాన్ని.! అప్పటికి మీకు బిడ్డను పోగొట్టుకున్న విషయం చెప్పలేదు. మీరు క్యాంపు నుండి వచ్చాకనే చెప్పాలి అనుకున్నాం.! మీరు క్యాంపు నుండి వచ్చేసరికి నాకు బాధతో పాటు, భయం కూడా వేసింది . నేను ఊహించినట్టుగానే, మీరు రాగానే నా దగ్గరికి వచ్చి, " నీ ఆరోగ్యం బాగానే ఉందా.. డాక్టర్ ఏమి చెప్పరు? లోపల బేబీ బాగానే ఉందా..!" అంటూ అడుగుతున్నారు . మీకు ఎలా చెప్పాలో తేలిక నేను ఏడుస్తూ ఉండిపోయాను..

కానీ ఆరోజు అత్తయ్యగారు మీతో జరిగిన ఘోరాన్ని చెబుతూ తన అజాగ్రత్తవల్లే ఈ ఘోరం జరిగిందని అబద్ధం చెప్పేసారు. తనపై తానే నింద వేసుకుని, మన మధ్య దూరం పెరగకుండా కాపాడారు. ఆ క్షణం అత్తయ్యగారిలో " అమ్మ మనసు " మొదటి సారి చూడగలిగాను. నా అహకారం వల్ల ఇన్నాళ్లు అత్తలోని అమ్మను ఎంత అపార్ధం చేసుకున్నాను అని కుమిలిపోయాను. వెంటనే నిజం చెప్పేదాం అనుకున్నాను. అత్తయ్యగారు ‘వద్దు’ అని సైగ చేసారు.

తరువాత, పక్కకు తీసుకువెళ్లి, నిజం చెప్పనివ్వకుండా ఆమె ఒట్టు పెట్టుకున్నారు.! ఆరోజు నుండి మీకు ఎలా నిజం చెప్పాలో తెలియక, మీ ఇద్దరినీ దూరం చేశాను అన్న బాధతో కుమిలిపోతున్నాను.. మీకు జరిగింది తెలీక దేవత లాంటి తల్లిని నిందించారు. అనరాని మాటలు అన్నారు..

అన్నిటిని భరించింది ఆవిడ. ఇవాళ నేనే ఆమెను రమ్మని ఫోన్ చేసి పిలిచాను. మన జీవితంలోకి తిరిగి రాబోతోన్న సంతోషాన్ని ఆమెతో కలిసి పంచుకోవాలని! కానీ మీరు చెప్పనివ్వలేదు. ఇప్పుడు కూడా ఆమె మీ శ్రేయస్సే కోరుకున్నారు. ‘నా కొడుకుకి నిజం చెప్పకు. నిన్ను దూరం చేసుకుంటాడేమో!’ అన్నారు.. మీ అమ్మగారు దేవత.! ఆమెని దూరం చేసుకోకండి.!" అని భర్త పాదాలపై పడి ఏడుస్తోంది మధు.!

విజయ్ మధు ని పైకి లేపి "ఇది నాకు ముందే చెప్పి ఉంటే ఇంత మానసిక క్షోభ అనుభవించే వారు కాదు కదా మధు.. నువ్వు, మా అమ్మా..! నేను వెళ్తున్నాను మధు.! అమ్మని తీసుకు వస్తాను.!" అని బయటకి పరుగెత్తాడు విజయ్..

***

బస్టాండ్ లో ఊరు వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తూ ఉంది కాంతమ్మ. తల్లిని చూడగానే చిన్నపిల్లాడిలా వెళ్లి కాళ్ళ మీద పడిపోయాడు విజయ్! చుట్టూ ఎంత మంది ఉన్నారు అనేది కూడా ఆలోచించలేదు అతను

" లే నాన్నా!పైకి లే!" అని విజయ్ ని పైకి లేపి గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుంది కాంతమ్మ.!

"అమ్మా నన్ను క్షమించు.! మధు నాకు అంతా చెప్పింది.! నేను నిన్ను నానా మాటలు అన్నాను.! నన్ను క్షమించు.! ఇంటికి వెళ్దాం పద.!" అని తల్లిని తీసుకుని బస్టాండ్ నుండి ఇంటికి బయలుదేరాడు విజయ్.

భర్త కోసం, అత్తగారి కోసం, వాకిట్లో నిలబడి ఎదురుచూస్తోంది మధుర.! అంతలోనే తల్లిని తీసుకుని వస్తున్న భర్తను చూసి చాలా సంతోషించింది.!

"అత్తయ్యగారు! నన్ను క్షమించండి...!నేను ఆయనకు అంతా చెప్పాను.! ఇంక నేను ఈ పాపభీతి ని భరించలేక, ఆయనికి నిజం చెప్పేసాను.!" అంటూ అత్తగారిని హత్తుకుంది మధుర.!

" ఊరుకోమ్మా...! అంతా మంచే జరుగుతుంది నీకు.!" అంటున్న కాంతమ్మను ఇంట్లోకి తీసుకెళ్లారు విజయ్, మధురలు.

" కూర్చోండి అత్తయ్యా!నేను కాఫీ తీసుకువస్తా..!" అంటూ లోపలికి వెళ్ళింది మధు.!

విజయ్ తల్లి కాళ్ళ దగ్గరే కూర్చున్నాడు. "సారీ అమ్మా! నిన్ను తప్పుగా అనుకున్నాను.! ఈ నాలుగు నెలలూ నేను నీతో మాట్లాడలేదు కదా! నువ్వు ఎలా ఉండగలిగావ్ అమ్మా? అసలు ఎందుకు నువ్వు ఆరోజు అలా చెప్పావ్ అమ్మా?" అంటూ తల్లి ఒడిలో తల పెట్టుకొని చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న విజయ్ తలను ప్రేమగా నిమిరింది ఆ తల్లి.

" నీ మనసు నాకు తెలుసు కన్నా! నీకు కోపం ఎక్కువ.! ఆ కోపంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు బంధాల్ని బీటలు పడేలా చేస్తాయి.! ఆవేశంలో నువ్వు మధుని దూరం చేస్కుంటావేమో అన్న భయంతో, అలా చెప్పాను రా..!" అని కొడుకుని ప్రేమగా తల నిమురుతోంది.

" అయినా మధు కూడా కావాలని చేయలేదు! మన దురదృష్టం అంతే! కానీ, ఇవన్నీ నువ్వు ఎలా అర్ధం చేసుకుంటావో, అన్న భయంతో మధుకి అత్తగారిలా కాక ఒక తల్లిగా నిర్ణయం తీసుకున్నానురా! నేను కూడా ఒక అమ్మనే కదా నాన్నా! అత్తమ్మలోనే అమ్మ ఉంది కదా!" అంటూ నవ్వింది కాంతమ్మ.!

" దేవుడి దయ వల్ల మన జీవితాల్లోకి మళ్ళీ సంతోషం రాబోతోంది! ఇక అన్ని బాధలు మర్చిపోయి, సుఖంగా ఉండండిరా!" అని మనసారా దీవించింది కాంతమ్మ...

" కాఫీ తీస్కోండి.!" అంటూ అత్తగారికి, భర్తకు కాఫీ అందించి

తను కూడా కూర్చుంది మధు.! మధు వంక మురిపెంగా చూస్తోంది కాంతమ్మ....

" అమ్మా మధు! నువ్వు ఇకమీదట చాలా జాగ్రత్తగా ఉండాలి!"

అంటూ అన్ని జాగ్రత్తలు చెప్పింది కాంతమ్మ! ఈసారి మధుకి అత్తగారు చెప్పిన జాగ్రత్తలు విసుగనిపించలేదు. కొడుకుని, కోడలిని చూసుకుని మురిసిపోయింది ఆ తల్లి గుండె! కాంతమ్మ కోడలిలో, కూతుర్ని చూసుకుంది.! ఆమె ఓర్పుతో కొడుకు కాపురాన్ని అందంగా దిద్దింది.! ఇవాళ తన కుటుంబం ఎంతో సంతోషంతో ఉంది.!

కోడలిని కూతుర్లా భావించే ప్రతి అత్తకి ఈ కధ అంకితం 🙏

🙏శుభం 🙏

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :

రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని.

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు.


84 views0 comments
bottom of page