top of page
Original.png

బతికించే బతుకమ్మ సంబరాలు

8 hours ago
5 min read

తెలంగాణ బతుకమ్మ పండుగలో రంగురంగుల సహజ పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ సంప్రదాయ దుస్తుల్లో పాటలు పాడుతూ సంబరాలు జరుపుకుంటున్న మహిళలు

 

Bathikinche Bathukamma Sambaralu - Telugu Traditional Article | R C Kumar

బతికించే బతుకమ్మ సంబరాలు - తెలుగు సాంస్కృతిక వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 16/10/2026


తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, జీవనోత్సాహానికి ప్రతిబింబం. ఎంగిలి బతుకమ్మ, అలిగిన బతుకమ్మ ప్రత్యేకతలు, గౌరమ్మ ఆరాధన వెనుక ఉన్న విశేషాలు, ఆంధ్రా గొబ్బెమ్మలతో బతుకమ్మకు ఉన్న తేడాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.


ఆంధ్రాలో జరుపుకునే గొబ్బెమ్మలకు, తెలంగాణలో జరిపే బతుకమ్మలకు తేడా ఏమిటి? బతుకమ్మ పండుగ సంబరాలలో 'గౌరమ్మ' అనే పేరు ఎందుకు వచ్చింది? నవరాత్రుల బతుకమ్మల్లో 'ఎంగిలి బతుకమ్మ' మరియు 'అలిగిన బతుకమ్మ' వేడుకల ప్రత్యేకతలు ఏమిటి? అనే అంశాలను ఈ వ్యాసంలో ప్రస్తావించడం జరిగింది.


నిజానికి ఆంధ్రా ప్రాంతంలో జరుపుకునే గొబ్బెమ్మలు (గొబ్బిళ్ళు), తెలంగాణలో జరుపుకునే బతుకమ్మలు రెండూ మహిళలు, ప్రకృతి మరియు దేవతారాధనతో ముడిపడి ఉన్న పండుగలే. కానీ వాటి రూపాలు, జరుపుకునే సమయం మరియు సంప్రదాయాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి.


బతుకమ్మను నైసర్గిక పూలతో (ప్రకృతి సిద్ధంగా సహజ వాతావరణంలో పూచే పూలు) త్రికోణాకార గోపుర శిఖరంలా పేరుస్తారు. పూలను పేర్చిన తర్వాత, దానిపై పసుపుతో చేసిన ముద్దను పెట్టి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు.


ఈ పసుపు ప్రతిమను సాక్షాత్తు శివుని భార్య అయిన గౌరీదేవి రూపంగా భావించి పూజిస్తారు కాబట్టే 'గౌరమ్మ' అనే పేరు వచ్చింది. బతుకమ్మను గౌరమ్మగా పూజిస్తే, ఆంధ్ర ప్రాంతంలో గొబ్బెమ్మను లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు.


గొబ్బెమ్మలను ఆవు పేడతో ముద్దలుగా గోపురం ఆకారంలో చేసి, వాటిపై పసుపు, కుంకుమలు, రంగుల పూలు మరియు అక్షింతలతో అలంకరిస్తారు.


బతుకమ్మను దసరా నవరాత్రుల్లో జరుపుకుంటే, గొబ్బెమ్మను సంక్రాంతి పండుగ సమయంలో జరుపుతారు. బతుకమ్మను ప్రతిరోజూ సాయంత్రం ఆడిపాడిన తర్వాత చెరువుల్లో లేదా వాగుల్లో నిమజ్జనం చేస్తారు.


గొబ్బెమ్మలను పండుగ ముగిశాక ఎండబెట్టి, పిడకలుగా చేసి వంట చెరుకుగా లేదా భోగి మంటల్లో ఉపయోగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఈ రెండు పండుగలు మహిళల నిష్ఠ, భక్తిశ్రద్ధలతో కూడిన సంబరాలకు నిదర్శనాలు.


తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే పూల పండుగ బతుకమ్మగా ఒకప్పుడు పల్లెటూళ్లకే పరిమితమై ఉంటే, నేడు రాష్ట్ర పండుగ హోదాతో గ్లోబల్ పండుగగా రూపాంతరం చెందింది.


"బతుకమ్మ" అనగా "అమ్మా బ్రతుకు, బతికించు" లేదా "జీవించు, మమ్మల్ని దీవించు" అనే భావన ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే శరదృతువులో ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతూ, రకరకాల ఔషధ గుణాలున్న పూలు సహజ వాతావరణంలో విరివిగా పూస్తాయి.


మనుషులకు, సమస్త జీవకోటికి ఈ ప్రకృతి జీవనాధారంగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతగా బతుకమ్మను 'జీవన పండుగ'గా జరుపుకుంటారు.


ఈ పండుగలో ఉపయోగించే తంగేడు, గునుగు, బంతి, చామంతి, తామర వంటి రకరకాల ఔషధ గుణాలున్న పూలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల చెరువుల్లోని నీరు శుద్ధి అవుతుందనే విషయం ఇప్పుడు విస్తృతంగా ప్రచారం అవుతోంది.


మొదటి రోజున 'ఎంగిలి బతుకమ్మ' మరియు ఆరవ రోజున 'అలిగిన బతుకమ్మ' వేడుకల ప్రత్యేకతలు:

తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగలో రోజుకో విశేషం, నైవేద్య సమర్పణ ఉంటుంది. బతుకమ్మ పండుగ మొదటి రోజును ‘ఎంగిలి పూల బతుకమ్మ’ అని అంటారు.


ఆరవ రోజును 'అలిగిన బతుకమ్మ' లేదా 'అలసిన బతుకమ్మ' (అర్రెం) అంటారు. ఎంగిలి బతుకమ్మ, అలిగిన బతుకమ్మ అనే పేర్లు కాస్త విచిత్రంగా, వింతగా అనిపించడం సహజం.


అవి ఆ రోజు చేసే ఆచారం, జీవన విధానాల ఆధారంగా వచ్చిన గ్రామీణ నామకరణాలు మాత్రమే కానీ వాటికి ఎటువంటి ప్రతికూలతలు లేవు. బతుకమ్మ పండుగ విషయంలో ఈ పేర్ల వెనుక చాలా సహజమైన, ఆప్యాయతతో కూడిన కారణాలు ఉన్నాయన్న విషయంలో అవగాహన కలగాలి.


మన సంస్కృతిలో 'ఎంగిలి' అంటే తిని వదిలేసింది లేదా అపవిత్రమైనది అనే భావన ఉంటుంది. కానీ ఈ పండుగ విషయంలో ఆ పదజాలంలో ఉన్న సానుకూల భావాన్ని గ్రహించాలి.


పూర్వకాలంలో, ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఆ రోజున ఉదయాన్నే కాకుండా, ఒక రోజు ముందే అంటే అమావాస్యకు ముందు రోజే తోటలు, చేల వెంబడి తిరిగి రకరకాల అడవి పూలను కోసుకుని ఇంటికి తెచ్చేవారు.


అలా ముందు రోజు తెచ్చిన పూలను నీళ్లలో వేసి ఉంచి, మరుసటి రోజు అమావాస్య నాడు బతుకమ్మను పేరుస్తారు. రాత్రి గడిచి, మరుసటి రోజు వాడుతున్నారు కాబట్టి ఆ పూలను 'నిద్ర చేసిన పూలు' లేదా "ఎంగిలి పూలు" అని పిలిచే వాడుక వచ్చింది.


రెండోది - సాధారణంగా దేవుడికి పూజ చేశాకే ప్రసాదం తింటారు. కానీ ఈ మొదటి రోజున పురుషులు ఉదయాన్నే పూల కోసం వెళ్తారు.


వారు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని, ఇంట్లో వాళ్లు ఏదైనా తిని, అంటే ఎంగిలిపడి, ఆ తర్వాతే బతుకమ్మను తయారు చేయడం, ప్రసాదం (నువ్వులు, బియ్యప్పిండి, బెల్లంతో చేసిన సద్ది) చేయడం మొదలుపెడతారు.


అందువల్ల కూడా ఈ పేరు వచ్చిందని అంటారు. కాబట్టి ఎంగిలి బతుకమ్మ పేరులో ఉన్న అర్థం అపవిత్రమైనది కాదు.


ఇక ఆరో రోజు బతుకమ్మ పూల పండుగ కూడా కాస్త ప్రత్యేకంగా, విభిన్నంగా ఉంటుంది.


ఆ రోజును అలిగిన బతుకమ్మ లేదా అలసిన బతుకమ్మ (అర్రెం) అంటారు. మిగిలిన రోజుల మాదిరిగా కాకుండా ఆరవ రోజు విరామంగా ఉండటం బతుకమ్మ పండుగలోని ప్రత్యేక ఆచారాల్లో ఒకటి. మహిళల ఆరాధన కూడా కాస్త విలక్షణంగా ఉంటుంది.


ఆ రోజు బతుకమ్మకు నైవేద్యం పెట్టకుండా, పూలతో కూడా అలంకరించకపోవడం తెలంగాణలో ప్రధాన సంప్రదాయం. అమ్మవారు అలిగి (కోపంతో లేదా అలసటతో) ఉంటారని, అందుకే ఆమె ఏమీ తినరనే నమ్మకంతో ఈ రోజున నైవేద్యాలు పెట్టకుండా మహిళలు కేవలం ప్రార్థనలు మాత్రమే చేస్తారు.


బతుకమ్మను పేర్చే సమయంలో మహిళలు ఉపవాసంతో చాలా నిష్ఠగా ఉంటారు. పూర్వకాలంలో బతుకమ్మను అమర్చుతున్న సమయంలో అనుకోకుండా ఒక మాంసపు ముద్ద తగలడంతో అపవిత్రమై అమ్మవారు అలిగి వెళ్లిపోయారని, అందుకే నైవేద్యం పెట్టరనే నమ్మకం ఏర్పడింది.


ఈ అపచారంతో బతుకమ్మ అలిగిందని, ఆ రోజు ఏమీ తినదని ఒక పౌరాణిక జానపద గాథ ప్రచారంలో ఉంది.


అమ్మవారు ఆకలితో, అలకతో ఉంటారని భావించి, ఆడపడుచులంతా కలిసి పసుపు రంగు బట్టలు వేసుకొని ఆమె అలక తీరాలని ప్రార్థిస్తూ, పాటలు పాడుతూ వేడుకుంటారు కానీ ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పించరు.


ఇక మళ్లీ ఏడో రోజు నుంచి పూలతో పేర్చుతూ యథావిధిగా బతుకమ్మ సంబురాలను కొనసాగిస్తారు.


దేవీభాగవతం ప్రకారం నవరాత్రులలో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో రాక్షసులను (భండాసురుడు, చండముండాసురులను) సంహరించిన తర్వాత కాస్త అలసటకు గురై ఆరవ రోజు విశ్రాంతి తీసుకున్నారట.


అమ్మవారు రాక్షస సంహారం చేసి అలసిపోవడం వల్ల, ఆమెకు విశ్రాంతి కలగడం కోసం పూలతో పేర్చే విధానాన్ని పాటించరు. అందువల్ల దీనిని పూర్వం 'అలసిన బతుకమ్మ' లేదా 'అర్రెం' అని పిలిచేవారని, కాలక్రమేణా అది 'అలిగిన బతుకమ్మ'గా స్థిరపడిందని చెబుతారు.


సమాజం, కుటుంబ, ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి ఆచరణ విధానాలలో మార్పులు చోటు చేసుకోవడం సహజం.


ఇంట్లో కుటుంబ సభ్యులు అలిగినప్పుడు వారిని బుజ్జగించడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఆయా బంధాలను బట్టి, వారిని ప్రసన్నం చేసుకునే పద్ధతులు కూడా మారుతుంటాయి.


వారి అలకను దూరం చేసి, ప్రసన్నం చేయడానికి ఎలాగైతే చిట్కాలను ఉపయోగిస్తామో, బతుకమ్మ విషయంలో కూడా అదే జరుగుతుంది కాబట్టే ఆరవ రోజు అలిగిన బతుకమ్మ పేరు సార్థక నామధేయం అయింది.


బాహ్యమైన పేర్లు, రూపాల కంటే మనసులో ఉండే నిజమైన భక్తి, శరణాగతి భావమే దైవాన్ని చేరుకోవడానికి అసలైన మార్గం అనే విషయాన్ని మన సంస్కృతి, సంప్రదాయాలు పండుగల ద్వారా తెలియజేస్తాయి.


లోకాః సమస్తాః సుఖినో భవంతు. 🙏


***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y




ఆర్ సి కుమార్  గారి కొన్ని ఇతర రచనలు:


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

R C Kumar
ఆర్.సి. కుమార్

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page