top of page
Original.png

బ్రతుకు దీపం

1 day ago
5 min read

పేదరికాన్ని జయించి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రాజు కుటుంబంతో కలిసి కనిపిస్తున్న ప్రేరణాత్మక దృశ్యం

Brathuku Deepam - Telugu Inspirational Story | Madhupatra Sailaja Uppaluri

బ్రతుకు దీపం - తెలుగు ప్రేరణాత్మక కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి  

Published in manatelugukathalu.com on 30/09/2026


పేదరికం ఎన్నో పరీక్షలు పెట్టినా, విద్యపై నమ్మకం మరియు పట్టుదల ఉంటే జీవితాన్ని మార్చుకోవచ్చని చాటిచెప్పే కథ ‘బ్రతుకు దీపం’.మధుపత్ర శైలజ ఉప్పలూరి రచించిన ఈ సామాజిక సందేశాత్మక కథలో రాజు తన కుటుంబ కష్టాలను అధిగమిస్తూ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తాడు.కుటుంబ త్యాగం, విద్య విలువ, నిజాయితీ, క్రమశిక్షణ, సహనం వంటి జీవిత విలువలను ఈ కథ హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరిస్తుంది.రాజు విజయంతో అతని కుటుంబానికే కాదు, చుట్టుపక్కల యువతకు కూడా కొత్త ఆశ, స్ఫూర్తి కలుగుతుంది.


నిరుపేద కుటుంబంలో పుట్టిన రాజు తండ్రి ఓ రిక్షా కార్మికుడు. ఇల్లు గడవటానికి తల్లి నాలుగిళ్లలో పనిచేస్తోంది. రాజు అన్నకు చదువబ్బలేదు గానీ, కారు డ్రైవింగ్ నేర్చుకుని టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో కలసి వేరుగా కాపురం పెట్టాడు.


చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకున్న అక్క తన ఇద్దరి కూతుళ్లతోనూ పుట్టింటికే చేరింది. రాజు గతయేడు డిగ్రీని పూర్తిచేసి, దగ్గరలోనే ఉన్న ఓ దేవాలయంలో చిన్నచిన్న పనులను చక్కబెడుతున్నాడు.


“స్వామీ! ఈ రెండు బస్తాల మారేడు దళాలతో రేపు జరగబోయే లక్షపత్రి పూజ నిర్విఘ్నంగా పూర్తవుతుంది అనుకుంటున్నాను” అన్నాడు రాజు సైకిలుకు కట్టిన బస్తాలను విప్పుతూ.


“ఒరేయ్ రాజూ! ఉదయం నుండి నీవు చేస్తున్న పనికి ఆ ఈశ్వరుడు నీకు మంచి చేయాలిరా.


డిగ్రీ చదివిన నీతో ఇలాంటి పనులను చేయించుకుంటున్నందుకు నాకు బాధగా ఉంది. మీ నాన్నకేమో నిన్ను ఇంకా చదివించే స్థోమత లేదు. నీకేమో చక్కని తెలివితేటలు ఉన్నాయి.


మా అగ్రహారం పిల్లలకు నీవు చెప్పే లెక్కలు బాగా వంటబట్టి, మంచి మార్కులను తెచ్చుకుంటున్నారు. నీవేమో ఇలా చిన్నాచితక పనులను చేస్తున్నావు” అంటూ బాధగా అన్నారు దేవాలయం పూజారిగారు.


“మరేమీ పర్వాలేదు స్వామి! ఆ దేవునకు ఏదో ఇలా సేవలు చేస్తూ ఉంటే మీరన్నట్లుగా ఏదో ఒక రోజు నన్ను కరుణించి నాకో మంచి మార్గం చూపించకపోడు ఆ దయామయుడు” అన్నాడు రాజు వినయంగా.


ఒకరోజు రాజువాళ్ల అమ్మ ఒక ఇంటిలో పని పూర్తిచేసుకుని, ఆ ఇంటామె ఇచ్చిన కాఫీ తాగుతూ ఆమెతో మాటల్లోకి దిగింది. తన కుటుంబం గురించిన వివరాలను చెపుతూ రాజు తల్లి, “డిగ్రీ పాసయి ఉద్యోగం దొరకక ఖాళీగా ఉన్న రాజు” గురించి చెప్పి బాధపడింది.


“అవకాశాలు రావాలంటే ఈ రోజుల్లో డిగ్రీ ఒక్కటే సరిపోదు, పైచదువులు చదవాలి. మీకున్న సమస్యల వల్ల కుర్రాడి భవిష్యత్తు దెబ్బతినకూడదు. అయ్యగారితో చెప్పి మీ అబ్బాయి చదువుకు అవసరమైన సహాయం మేము చేస్తాం. అతణ్ణి చదివించండి” అని చెప్పింది ఆ ఇంటామె.


ఆ సాయంత్రమే రాజు వచ్చి ఆ ఇంటాయనను కలిశాడు. “సార్! నాకు పై చదువులను చదవాలనే కోరిక ఉన్నా, మా కుటుంబ ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని, అమ్మానాన్నలను కష్టపెట్టటం ఇష్టంలేక, నా కోరికను మనసులోనే ఉంచేసుకుని నాన్నకు సాయం చేయాలనే తలంపుతో చిన్నచిన్న పనులకు వెళ్తున్నాను” అని చెప్పాడు.


దానికి ఆయన “మీ అమ్మ నీ గురించి చెప్పింది. నీ పైచదువులకయ్యే డబ్బు సాయం నేను చేస్తాను. నీ భావి జీవితానికి అది ఉపయోగపడుతుంది” అంటూ కొంత డబ్బు ఇచ్చి “పి.జి. ఎంట్రెన్స్ బుక్స్ కొనుక్కో” అన్నారు.


చెమ్మగిల్లిన కళ్లతో “సార్! మీరు చేసిన సహాయం నేను మరచిపోలేనిది. అపాత్రదానం చేయలేదని మీరు అనుకునేలా నా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాను” అని చెప్పాడు రాజు.


తాను ఓ రిక్షా కార్మికుని కొడుకునని చెప్పుకోవటానికి ఏనాడు సిగ్గుపడలేదు రాజు.


వేసుకోవటానికి మంచి దుస్తులు కూడా లేని తన పేదరికాన్ని అతను ఏనాడు ద్వేషించలేదు. తన క్రమశిక్షణతో, పట్టుదలతో మంచిగా సాధనచేసి చదువుపై పట్టును సాధించి, కుటుంబాన్ని సంఘంలో ఇప్పుడున్న స్థితి నుండి పైకి తీసుకెళ్లటానికి కృషి చేస్తున్నాడు.


తమ్ముడు ఇంతగా కష్టపడటం చూసిన అతని అక్క, హైదరాబాద్‌లో తెలిసిన వారింటిలో ఓ చంటిపాపకు కేర్‌టేకర్‌గా పనిచేయటానికి అంగీకరించి వెళ్లేపోయింది.


ఆడపిల్లలు, తల్లి తమను అమ్మమ్మ దగ్గర వదిలి అంత దూరం వెళ్లటంతో, అమ్మపై బెంగ ఉన్నా చిన్నతనం నుండే అన్ని కష్టాలను చవిచూశారు కాబట్టి పరిస్థితులను అర్థంచేసుకున్నారు.


మామయ్య ప్రతిరోజూ తనకు తీరిక దొరికిన వేళల్లో చదువు విలువను తెలియజెప్పటం, చదువుకున్న ఆడపిల్లలకు మంచి జాబ్స్ వస్తాయని నూరిపోయటంతో, వారు కూడా తమ చదువు పట్ల శ్రద్ధ పెంచుకుని, మామయ్యలాగా వృద్ధిలోకి రావాలని తాపత్రయ పడుతున్నారు.


కాలేజి గ్రౌండ్స్‌లో పచ్చిక మీద విశ్రాంతిగా కూర్చుని ‘రాజు’ రాక కోసం ఎదురుచూస్తూ కులాసాగా కబుర్లాడుకుంటున్నారు మిత్రబృందం.


వారిలో ఉపేంద్ర, రవి కలవారి బిడ్డలు; చలం మధ్యతరగతి వాడు. అయితే కులమతాలు గానీ, ఆర్థిక తారతమ్యాలు గానీ వారి స్నేహబంధానికి అడ్డుకాలేదు.


చదువులు పూర్తిచేసిన తరువాత చిన్న ఉద్యోగాలో, చిరు వ్యాపారాలో చేస్తున్నారు అందరూ. ఉపేంద్రకు ఉద్యోగం ఏదీ రాకపోయినా, పెద్దదైన కుటుంబంలో నాన్న, అన్నలకు వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటున్నాడు.


రవి తన తండ్రి చేసే రైల్వే కాంట్రాక్ట్ పనిలో భాగస్వామి అయ్యాడు. చలం ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం సాధించుకున్నాడు.


ఇక రాజు ఓ చిన్న ప్రయివేట్ స్కూలులో టీచర్‌గా పనిచేస్తూ, తనకున్న గవర్నమెంట్ జాబ్ చేయాలనే తీవ్రమైన ఆకాంక్షను సాధించుకోవటానికి కోచింగ్ తీసుకుంటూ పోటీ పరీక్షలకు వెళ్తున్నాడు. అన్నిచోట్లా పేరుకుపోయిన అవినీతి పర్వతాన్ని ఢీకొని, తన తెలివి, నిజాయితీ, ధైర్యం, చాకచక్యాలతో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించటానికి అనితర సాధ్యమైన ప్రయత్నమే చేస్తున్నాడు.


ఆ రోజే వచ్చిన గ్రూప్ IV పరీక్షా ఫలితాలలో రాజు రెండు ఉద్యోగాలకు అర్హతను సంపాదించాడు. ఒక ఉద్యోగం రావటమే గగనమౌతున్న ఈ రోజుల్లో రాజు సాధించిన ఫలితం చిన్న విషయం కాదు మరి!


పూర్వకాలంలో ఋషులు దైవసాక్షాత్కారానికి ఒంటికాలుపై తపస్సు చేసిన చందంగా, ఈ ఫలాలను అందుకోవటానికి పోటీపరీక్షల గురించి నిద్రాహారాలు మాని, చదువుల సారాన్నే పానీయంగా సేవిస్తూ రాజు అహర్నిశలు కష్టపడ్డాడు.


గత సంవత్సర కాలంగా ఒక సినిమా అని గానీ, స్నేహితులని గానీ, చివరకు ఫోన్ మాట్లాడటం గానీ చేయలేదు.


అందుకే ఉద్యోగం వచ్చిన ఈ ఆనంద క్షణాలను తన ఆప్తమిత్రులతో పంచుకోవాలనే అభిలాషతో అంతా ఓసారి కలుద్దామని అనుకుని ఒక చోటకు చేర్చాడు.


కలిసిన మిత్రులు కూడా తమ సొంత విషయాలను వదిలేసి అంతా రాజు సాధించిన విజయాల గురించే మాట్లాడుకుంటున్నారు.


“మన రాజుగాడికి దశ తిరిగిందిరా! వాడితోపాటు వాడి అమ్మానాన్నలు, అక్క, అక్క కూతుళ్లు ఇద్దరు పడుతున్న కష్టాలకు ఈరోజుతో తెరపడినట్లయ్యింది” అన్నాడు ఉపేంద్ర.


“ముఖ్యంగా రాజు అక్క గురించి చెప్పుకోవాలిరా. చిన్న వయస్సులోనే భర్తను పోగొట్టుకుని, ఇద్దరు ఆడపిల్లలతో పుట్టింటికి చేరి, తమ్ముడి కోసం ఎంత డబ్బు ఖర్చు చేసిందిరా! ఆ త్యాగానికి మన రాజు జాబ్ సాధించటంతో సార్థకత వచ్చింది” అని గొంతు కలిపాడు రవి.


“రెండు చిన్నచిన్న గదులలో ఆరుగురు మనుషులు సర్దుకున్నారు. నలుగురు పిల్లలకు ట్యూషన్లు చెపుతూ రాజు ఇంతకాలం కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నాడు. ఇంటిలో చదువుకునేందుకు ఏవిధమైన సౌకర్యాలు లేకున్నా, పగలు పడ్డ కష్టానంతా మరచిపోయి రాత్రిపూట తన చదువును కొనసాగించాడు.


తాగివచ్చిన తండ్రి గొడవలు చేసినా సర్దుబాటు చేసుకుంటూ తన గమ్యం వైపుకు సాగిపోయి, చివరకు ఆశల శిఖరాన్ని అధిరోహించాడు. మన తల్లిదండ్రులు మనకు అన్ని వసతులను కల్పించినా రాజులాగా మనం సాధించలేకపోయాం” అన్నాడు చలం.


ఇంతలో “ఏరా! ఎంతసేపయ్యిందిరా మీరు వచ్చి? నా చదువుకు, ఉన్నతికి సరైన సమయంలో డబ్బు సాయం చేసి, నాకు తగిన సూచనలు ఇచ్చిన ఆయనకు నా జాబ్ గురించి ముందుగా చెప్పి, వేడివేడిగా అమ్మ చేసిన పకోడీలు పట్టుకొచ్చానురా మీకోసం.


అందుకే లేటయ్యింది” అని సంజాయిషీ ఇస్తూ, చేతిలోని స్వీట్స్, పకోడీలను స్నేహితుల ముందుంచుతూ రాజు వచ్చి వారితో చేరాడు.


“రాజూ! కంగ్రాట్స్‌రా! నీలాంటి స్నేహితుడు ఉన్నందుకు మాకు ఎంత గర్వంగా ఉందో!” అన్నాడు చలం.


“నీ పట్టుదల అమోఘంరా! ఇతరులకు ఆదర్శం కూడా” అన్నాడు ఉపేంద్ర.


“నీవు చేరబోయే డిపార్ట్‌మెంట్‌లో పదోన్నతులు బాగా ఉంటాయిట కదా! మేము తొందరలోనే నిన్ను ఓ పెద్ద ఆఫీసరుగా చూడాలిరా” అన్నాడు రవి.


“నీ నోటి మాట చలవతో అలాగే అవుతానురా, అందుకు అవసరమైనదంతా చేస్తాను” అన్నాడు రాజు.


రాజు గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాక, అతనికే కాక అతని తల్లితండ్రులకు కూడా సంఘంలో గౌరవం పెరిగింది.


అంతవరకు చిన్నచూపు చూసినవారే ఇప్పుడు మర్యాదగా “అండి” అని సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. రాజు ఇంటిలో కూడా ఇదివరకు ఉన్న భాష మారింది.


ఆడపిల్లలలో క్రమశిక్షణ, నమ్రత, వినయం అన్నీ రాజు అనే “బ్రతుకుదీపం” చూపిన వెలుగు ద్వారానే అన్న నమ్మకం వారి బంధువర్గంలో ఏర్పడింది. చుట్టుపక్కల యువతకు స్ఫూర్తినిచ్చింది.


సహనం, నిజాయితీ, స్వచ్ఛత, నిలకడ అనే సుగుణాలే రాజుని, అతని మేనకోడళ్లను విజయపథంలో నడిపిస్తున్నాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు.


***

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి కొన్ని ఇతర రచనలు: 


మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి


మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు.  గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు  నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page