top of page
Original.png

దిక్సూచి

దిక్సూచి కథ, మయూఖ, తెలుగు కథ, ప్రేరణాత్మక కథ, గురువు, ఉపాధ్యాయుడు, ప్రకాశం మాస్టారు, విద్య, విద్య విలువ, పేద పిల్లలు, పుస్తకాల దానం, సేవాభావం, సామాజిక బాధ్యత, విద్యార్థులు, దాతృత్వం, మానవతా విలువలు, పిల్లల కథలు, మన తెలుగు కథలు

పేద పిల్లలకు పుస్తకాలు అందిస్తూ విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందిస్తున్న ప్రకాశం మాస్టారు దృశ్యం
పేద పిల్లలకు పుస్తకాలు అందిస్తూ విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందిస్తున్న ప్రకాశం మాస్టారు దృశ్యం

Diksuchi - Telugu Inspirational Story | Mayukha

దిక్సూచి - తెలుగు ప్రేరణాత్మక కథ | మయూఖ

Published in manatelugukathalu.com on 25/07/2026


ఒక మంచి ఉపాధ్యాయుడు పాఠాలు మాత్రమే కాదు, జీవితానికి దిశను కూడా చూపిస్తాడు. 'దిక్సూచి' కథలో ప్రకాశం మాస్టారు తన విద్యార్థులకు పుస్తకాల విలువ మాత్రమే కాకుండా, సమాజంలోని వెనుకబడిన పిల్లల పట్ల బాధ్యత, సేవాభావం, దాతృత్వం వంటి గొప్ప విలువలను నేర్పిస్తారు. చిన్న సహాయం కూడా ఒకరి జీవితాన్ని ఎలా మార్చగలదో హృదయాన్ని హత్తుకునే ఈ కథ తెలియజేస్తుంది.


"ఒరేయ్ పిల్లలూ! ఈరోజుతో పరీక్షలు అయిపోయాయి కాబట్టి, మీ పుస్తకాలన్నీ కట్టకట్టి రేపు స్కూలుకు తీసుకురండి రా!"


"ఎందుకు మాస్టారు?"


"పని ఉంది రా! మిమ్మల్ని అందరినీ ఒక చోటికి తీసుకువెళ్తాను" అన్నారు ప్రకాశం మాస్టారు.


ఐదవ క్లాసుకి ఇంగ్లీషు, లెక్కలు చెబుతారు ప్రకాశం గారు. మంచి ఆదర్శ భావాలు గల వ్యక్తి.


మాస్టారు ఎప్పుడైతే పుస్తకాలు తీసుకురమ్మని అన్నారో, పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు!

"మాస్టారు పుస్తకాలన్నీ అమ్ముకుంటాడేమో రా!"


"ఛీ! ఏం కాదు! మాస్టారు అటువంటి మనిషి కాదు"అన్నాడు అదే క్లాసులో చదువుతున్న రాము.


*****

మర్నాడు పుస్తకాలు సర్దుకుని స్కూలుకు బయలుదేరుతున్న రాముని చూసి వాళ్ళ అమ్మ సరోజ, "పరీక్షలు అయిపోయాయి కదరా! మళ్లీ పుస్తకాలు తీసుకుని ఎక్కడికి?" అంది.


"మా మాస్టారు పుస్తకాల్ని స్కూలుకు తీసుకురమ్మన్నారు అందర్నీ, అందుకే తీసుకువెళ్తున్నాను" అన్నాడు రాము.


అప్పటికే పిల్లలందరూ పుస్తకాల బ్యాగులు తీసుకుని వచ్చారు. అందరిలోనూ కుతూహలం, ఎక్కడికి తీసుకువెళ్తారు అని!


ఇంతలో మాస్టారు కూడా పెద్ద బ్యాగు తీసుకుని, "రండి పిల్లలు, అందరం వెళదాం" అంటూ బయలుదేరదీశారు.


స్కూలు దగ్గర ఆగి ఉన్న ఆటో వాళ్ళతో మాట్లాడి, అందరినీ ఆటోల్లో కూర్చోబెట్టారు.


"మాస్టారు, ఎక్కడికి వెళ్తున్నాం?" అన్నాడు రాము.


"తినబోతూ రుచి ఎందుకు అడుగుతావ్? చూస్తావుగా"! అన్నారు నవ్వుతూ.


ఆటోలు ఒక మురికివాడ దగ్గర ఆగాయి. పిల్లలందరూ దిగారు. అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఇంతలో బిలబిల్లాడుతూ అక్కడి పిల్లలందరూ మాస్టారిని చుట్టుముట్టారు, పరిచయం ఉన్నవాళ్లల్లా.


స్కూలు పిల్లలు అందరూ వాళ్ళని చిత్రంగా చూశారు. మాసిపోయి, చిరిగిపోయిన బట్టలు, తైల సంస్కారం లేని జుట్టు. మాస్టర్ వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతూ,

"మీ అందరికీ పుస్తకాలు తెచ్చానురా! రేపటి నుంచి క్లాసులు మొదలు పెడదాం"! అంటూ తన పెద్ద బ్యాగులో ఉన్న నోట్ బుక్స్, పెన్సిళ్లు, రబ్బర్లు తీసి అందరికీ ఇచ్చారు.


స్కూలు పిల్లల బ్యాగులోంచి టెక్స్ట్ బుక్కులు తీసి ఇచ్చారు.


పిల్లలందరి కళ్ళల్లో ఒక జిజ్ఞాస, ఏదో నేర్చుకోవాలి అనే తపన కనిపించాయి.


రాము, అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు, ఇటువంటి ప్రపంచం ఒకటి ఉంటుందని తెలియక.

రాము అన్నాడు, "మాస్టారు! మాకు అర్థమైంది, మీరు పుస్తకాలు ఎందుకు అడిగారో, కానీ వాళ్ళ బట్టలు చిరిగిపోయి ఉన్నాయి మాస్టారు! మీరు ఏమీ అనుకోనంటే, మా అందరివి పొట్టి అయిన బట్టలు తీసుకువస్తాం. వాళ్లు కూడా మాలాంటి పిల్లలే కదా! మేం కూడా మా పాకెట్ మనీ దాచుకుని ప్రతి నెల వాళ్ళకి సహాయం చేస్తాం! ఏమంటార్రా!" అన్నట్టు అందరికేసి చూశాడు.


"ఓ, అలాగే!" అన్నారు పిల్లలందరూ ముక్తకంఠంతో.

"శెభాష్ పిల్లలు! మంచి విత్తనం నాటితే మంచి చెట్టు వస్తుందని, మీలో ఇటువంటి మంచి ఆదర్శ భావాలు రావడం కోసమే ఇక్కడికి తీసుకువచ్చాను. మీరు చిన్నపిల్లలు, శ్రమదానాలు చేయక్కర్లేదు కానీ, మీకు తోచిన సహాయం చేయండి" అన్నారు మాస్టారు.


"మాస్టారూ! వీళ్ళని ఎవరూ పట్టించుకోకపోయినా ఎందుకు సహాయం చేస్తున్నారు?" అడిగాడు రాము ఆశ్చర్యంగా.


"నేను కూడా అటువంటి మురికివాడల నుంచే వచ్చిన వాడిని. నాకు అప్పుడు ఒక దాత సహాయం చేయడంతో ఇంత వాణ్ణి అయ్యాను. మనం కూడా వీళ్ళకి సహాయం చేస్తే, వీళ్ళలో కూడా ఎంతో మంది టీచర్లు, విద్యావేత్తలు తయారవుతారు" అన్నారు ఉత్తమ జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రకాశం మాస్టారు.


******శుభం *******


మయూఖ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




మయూఖ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

  పరిచయ వాక్యాలు:

నా పేరు శారద

విద్యార్హతలు: ఎమ్.ఎ

నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.

నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.

తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.

నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.

ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి

మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page