గంగానది తీరాన
- Veereswara Rao Moola

- 15 minutes ago
- 4 min read

Ganganadhi Theerana- Telugu Social Tragedy Story | Veereswara Rao Moola
గంగానది తీరాన - తెలుగు సామాజిక విషాద కథ | వీరేశ్వర రావు మూల
Published In manatelugukathalu.com On 27/08/2026
‘గంగానది తీరాన’ వీరేశ్వర రావు మూల రచించిన హృదయవిదారకమైన తెలుగు సామాజిక విషాద కథ. వివాహం, జాతకాలు, మూఢనమ్మకాలు, స్త్రీ జీవితంపై కుటుంబ నియంత్రణ, ఒంటరితనం, సహజమైన మానవ కోరికలు, అపరాధ భావన వంటి అంశాలను ఈ కథ తీవ్రంగా స్పృశిస్తుంది.
ఈ కథ కేవలం ఒక స్త్రీ విషాదగాథ మాత్రమే కాదు; మూఢనమ్మకాల పేరుతో ఒకరి జీవితాన్ని నిర్ణయించే హక్కు మనకు ఉందా? అనే ప్రశ్నను పాఠకుడి ముందుంచుతుంది.
కమలాపురంలో అమలను చూసినప్పుడల్లా తనికెళ్ళ భరణి కవిత 'కన్య-కుమారి' గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అమలకి పెళ్ళవ్వలేదు.
"వోణి చీరవుతుంది.
జడ ముడి ఐంది.
లోలకులు దుద్దులయ్యాయి.
పారాణి రాయాల్సిన కాలికి క్రాక్ క్రీమ్ రాస్తుంది!
తాళి బొట్టు పడాల్సిన చోట
కన్నీరు బొట్టు బొట్టుగా పడుతుంది!"
అమలకి పెళ్ళి అడ్డు పడింది ఎవరో కాదు, తండ్రే! అదేమిటి, కన్నతండ్రి అలా చేస్తాడా? అమల తండ్రి అర్జునరావుకి జాతకాలు చూడడం తెలుసు. తెలిసిన జ్యోతిష్యమే సర్వస్వం అని భావించడం తెలుసు. వచ్చిన సంబంధాలకు వంక పెట్టి తిప్పేయడం తెలుసు. తెలియందల్లా అమల ఈడువాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయని, అమల యవ్వనం సరిహద్దులు దాటుతోందని.
అమలకి తండ్రిని ఎదిరించడం తెలియదు. గ్రహాలు మనకే ఎందుకు అనుకూలంగా ఉండవో, అనుగ్రహం ఎందుకు చూపవో అర్థం కాలేదు యంగ్ అమలకు. ఎందుకు ఈ పెళ్ళి గోల అని, స్కూల్లో చేరింది. అమలను ఇష్టపడ్డ ఒక బ్యాంక్ ఉద్యోగి పెళ్ళి చేసుకుంటానన్నాడు. అమల తండ్రి జాతకం చూసి, పెళ్ళయితే పెళ్ళికొడుకుకు గండం అన్నాడు. అంతే, అది తప్పిపోయిందీ. ఆరోజే కదా అమల పెరట్లో తులసి కోట దగ్గర కూర్చుని ఏడ్చింది. అమల తల్లి పాత్ర ఒంటింటికి, పడకింటికి పరిమితమయ్యింది. అర్జునరావుకి సలహా ఇచ్చే ధైర్యం లేదు. 'నా ఖర్మ' అనుకునేది అమల తల్లి.
బెంగ పెట్టుకుని, బెంగపెట్టుకుని అమల తల్లి చనిపోయింది. అది జరిగిన రెండేళ్ళకి అమల తండ్రి పంచాంగం చూస్తూ తల వాల్చేసాడు. పెళ్ళి కన్నా మృత్యువే సత్యమని అమలకి అర్థమయ్యింది. తరువాత ఐదేళ్ళకి కరోనా వచ్చి అమల తమ్ముడు వెళ్ళిపోయాడు ఈ లోకాన్ని విడిచి.
అమలకి పాత ఇల్లు, అర ఎకరం భూమి, ఐదు వేలు ఇచ్చే చిన్న ఉద్యోగం ఉన్నాయి. లేనిదల్లా తోడు. అసలు ఆడ, మగ కలయికలో సుఖం ఉందా? అని ఆలోచించడం మొదలుపెట్టింది. పగలూ, రాత్రి ఆ ఆలోచనే ఎక్కువ సేపు మెదడును ఆక్రమిస్తోంది. ఆ సమయంలోనే వచ్చాడు శేషగిరి. అమలకు దూరపు బంధువు. రావిశాస్త్రి గారి కథలో పాత్రలా ఉంటాడు. మాటలు కలిపి పబ్బం గడుపుకోవడం తెలుసు. శేషగిరికి పెళ్ళి కాలేదు. ఎందుకో మనకీ తెలియదు. వాడి ఒంటికి పెళ్ళి, గిళ్ళి పడవట. పెళ్ళి లేదు కాని వ్యవహారాలు చాలా ఉన్నాయని లోకం ఉవాచ.
వాడిని చూస్తే గిరీశం గుర్తుకు వచ్చినా చేసేదేమీ లేదు. అమల ఇంటికి వచ్చాడు. అమల కష్టానికి 'అయ్యో' అన్నాడు. కన్నీళ్ళు తుడిచాడు. రాత్రి భోజనానికి వచ్చాడు. అమల అతనితో మంచి చెడ్డా చెప్పుకుంది. అతను చెడు గురించే ఆలోచించాడు. ఆ రాత్రి అమల ఇన్నాళ్ళు దాచుకున్న నల్లంచు తెల్ల చీర కట్టుకుంది. గ్లాస్కో జాకెట్టు తొడుక్కుంది. తలలో సంపెంగ పెట్టుకుంది. బయట వెన్నెల అప్పు తీర్చిన వాడి మొఖంలా వెలిగిపోతోంది. అమల భుజం మీద చెయ్యి వేసాడు. పడక గదిలోకి వెళ్ళాడు. పడక గదిలో అమల తల్లి, తండ్రుల ఫోటో ఉంది.
శేషగిరి ఆబగా ఆమెను ఆక్రమించుకున్నాడు. ఆమెలో హార్మోన్స్ మేల్కున్నాయి. పవిత్రంగా దాచుకున్న తన యవ్వనాన్ని, ఆ గిరీశానికి... సారీ, శేషగిరికి అపాత్రదానం చేసింది. మర్నాడు తెల్లవారుజామునే, చీకట్లోనే వెళ్ళిపోయాడు.
శేషగిరి వెళ్ళిన పది రోజులకి అమలకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి, మంట బయలుదేరింది. గైనకాలజిస్ట్ కి చూపించుకుంది. శేషగిరి సుఖ రోగం అంటించిపోయాడని అర్థమైంది.
"మీరు మెనోపాజ్ కి దగ్గరగా ఉన్నారు. పరాయి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోకండి. క్రమం తప్పకుండా మందులు వాడండి." సలహా ఇచ్చింది డాక్టర్.
ఇన్నాళ్ళు పవిత్రంగా ఉండి ఇప్పుడు కక్కుర్తి పడ్డానా? మా బామ్మ చెప్పేది 'ఐదు నిమిషాల భోగం, ఐదు నెలల రోగం' అని. ఇదేనా? ఇన్నాళ్ళు చక్కగా ఉండి ఇప్పుడే మాయరోగం? మనస్సు కవ్వించింది. అదేదో తెలుసుకోమంది. దాని కోసమే చరిత్రలో యుద్ధాలు జరిగాయి అంది.
లేదు, నేను తప్పు చేసాను. పెళ్ళి కాక ముందే మలినమయ్యాను. నీ పెళ్ళికి గ్యారంటీ ఏది వెర్రి ముఖమా అని అమల అంతరాత్మ నిలదీసింది.
"లేదు లేదు, నేను పాపిని."
"కాదు, నువ్వు తప్పు చేస్తే దిద్దుకో. అంతే." మనస్సు బుజ్జగించింది.
"లేదు, నా కక్కుర్తికి శాస్తి." అమల వణికిపోతోంది. దేని మీద దృష్టి పెట్టలేకపోతోంది.
"సహజమైన నీ కోరిక హార్మోన్స్ అరల్లో ఇరుక్కుపోయింది. నీ తప్పేముంది?" మనస్సు చెప్పినా అమల వినలేదు.
అమల అంతరంగం రెండుగా చీలిపోయి ఘర్షించుకుంటున్నాయి. తన దేహం తనకు భారంగా అనిపించింది. రోజురోజుకీ అమలకి అపరాధ భావన పెరిగిపోయింది. ఇల్లు అమ్మి, ఊరు విడిచి వెళ్ళిపోయింది.
అప్సరా లాడ్జిలో పరకాంత కౌగిలిలో ఉన్న శేషగిరి ఉలిక్కిపడ్డాడు. అమల ఎందుకు గుర్తుకు వచ్చింది? మాటిమాటికి అమల ఎందుకు గుర్తుకు వస్తోంది? ఆ అనుభవమా? ఆ అనుభవం శేషగిరికి కొత్త కాదు. మరెందుకు గుర్తుకు వస్తోంది?
శేష జీవితం తనతో గడపమని అడుగుతున్నట్టు అనిపిస్తోంది. కాదు, ఏదో ఉంది. మాటిమాటికి మనస్సు అటే లాగుతోంది. అంటే ప్రేమిస్తున్నాడు. యస్, అదే నిజం! అమలకు అసలు విషయం చెప్పి ఒప్పించాలి. తను చెడు తిరుగుళ్ళు తిరగనని, జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పాలి. నిశ్చయం తీసుకున్నాక తేలికపడిన మనస్సుతో కమలాపురం వెళ్ళాడు. అక్కడ అమల లేదని, కాశి వెళ్ళిందని తెలిసింది.
కాశి హరిశ్చంద్ర ఘాట్
శేషగిరి ఒకసారి గంగలో మునిగి పాపాలను కడుగుకోవాలనుకున్నాడు. మునిగి పైకి వచ్చాక, అమలను పలకరించుకుందాం అనుకున్నాడు. అమలతో కొత్త జీవితం ప్రారంభించుదాం అని ఉద్వేగంగా ఉన్నాడు. అతను మెట్లు ఎక్కుతుండగా, మెట్లు దిగుతూ అమల కనబడింది.
ఆ రోజు అమల నిర్ణయం తీసుకుంది.
"పాపులను పావనం చేసే గంగా.. నన్ను నీలో కలుపుకో.." గంగ ఒడి పెరిగే చోటుకి వెళ్ళింది. ఘాట్ దగ్గర శవాలు కాలుతున్నాయి. ఒడ్డున అమల కోసం వేచి ఉన్నాడు శేషగిరి. కాలుతున్న శవాలు, ఏదీ శాశ్వతం కాదనే సత్యాన్ని చెబుతున్నాయి. అమల గంగలో మునిగింది. ఒడ్డుకు రాలేదు. గంటలు గడుస్తున్నాయి. అతను ఎదురు చూస్తున్నాడు. అమల రాలేదు.
అక్కడ చాలా మంది మూగారు. ఒక స్త్రీ నేల మీద ఉంది.
'లగతా హై ఓ ఔరత్ ఆంధ్రా సే ఆయీ' (ఆంధ్రా నుండి వచ్చిన స్త్రీ లా ఉంది) అంటున్నాడు పడవ నడిపే వాడు.
శేషగిరి అటు వైపు అడుగు వేసాడు. ఒక్కసారి గుండె ఆగినంత పనయ్యింది. విగతజీవిగా అమల!
"అమలా......." అరిచాననుకున్నాడు శేషగిరి. గొంతు నుండి మాట రాలేదు. శేషగిరి కంటి నుండి రాలింది సింధువంత దుఃఖాన్ని మోస్తున్న కన్నీటి బిందువు!
END
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
వీరేశ్వర రావు మూల గారి కొన్ని ఇతర రచనలు:
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.
#TeluguComedyStory, #తెలుగుహాస్యకథ







Comments