top of page
Original.png

గాథాసప్తశతి – ఉత్తరార్థం - పార్ట్ 1

15 hours ago
5 min read

గాథాసప్తశతి ఉత్తరార్థంలోని ప్రాకృత గాథలను రాజసభలో కవులు వినిపిస్తున్న శాతవాహన కాలం దృశ్యం

Gathasaptashati - Uttaradham - Part 1 - Telugu Literary Article | Bhattu Venkata Rao

గాథాసప్తశతి – ఉత్తరార్థం - పార్ట్ 1 - తెలుగు సాహిత్య వ్యాసం| భట్టు వెంకటరావు

Published in manatelugukathalu.com on 27/09/2026


గాథాసప్తశతి శాతవాహన రాజు హాలుడి పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రాకృత గాథా సంప్రదాయానికి ముఖ్యమైన సాహిత్య సంపద.ఈ వ్యాసంలో గాథాసప్తశతి ఉత్తరార్థంలోని ఎనిమిదవ శతకపు తొలి భాగం నుంచి ఎంపిక చేసిన 14 గాథలను పరిచయం చేస్తున్నారు. ప్రతి గాథకు సంస్కృత ఛాయతో పాటు సరళమైన తెలుగు వచన కవితా భావాన్ని, అవసరమైన సందర్భ వివరణను అందించారు.ప్రేమ, విరహం, స్నేహం, జీవనానుభవం, లోకజ్ఞానం వంటి భావాలను ఈ గాథలు ప్రతిబింబిస్తాయి.


శాతవాహన వంశానికి చెందిన రాజులలో హాలశాతవాహనుడు ఒకడు. ‘గాథాసప్తశతి’ పేరుతో ఆయన సేకరించి, సంకలనం చేసిన ప్రాకృత గాథల సంకలన గ్రంథం వలన హాలుడి కీర్తి ప్రపంచమంతటా వ్యాపించి, నిలిచిపోయింది.


‘గాథాసప్తశతి’ లో క్రీ.శ. ఒకటవ శతాబ్దం నాటి సామాన్య ప్రజానీకంలో కవిత్వం చెప్ప నేర్చి, గాథల రూపంలో హాలుడి ఆస్థానంలో ఆయన ముందట నిలిచి చదివి చెప్పి, ఆయన మెప్పు పొందినవారే ఈ గాథాసప్తశతికి కర్తలైన కవులు. కొన్ని వేలుగా సేకరించబడిన అటువంటి గాథలలోంచి ఏడు వందల గాథలను ఏరి, కూర్చినదే ‘గాథాసప్తశతి’ కావ్యం అని నిర్ధారించబడింది.


అయితే, ఇందులో ఒక విశేషమేమంటే, ‘గాథాసప్తశతి’కి ‘ఉత్తరార్థం’ అనే పేరుతో మరొక మూడు వందల గాథలు అదనంగా లభ్యమవుతున్నాయి.


ఆ గాథలు కూడా, ‘గాథాసప్తశతి’లోని గాథలతో పోటీపడదగిన కవిత్వాంశ కలవిగానే ఉన్నాయి.


ఎనిమిది, తొమ్మిది, పదవ శతకాలుగా ఉన్న ఆ మూడువందల అదనపు గాథలలోంచి ప్రస్తుతం ఎనిమిదవ శతకంలోని మొదటి అర్ధశతకం గాథలలోంచి ఉత్తమమైనవిగా నాకు తోచిన పదునాలుగు గాథలకు సంస్కృత ఛాయను, వాటికి వచన కవితల రూపంలో తెలుగులో భావాన్ని, అవసరమైన తగుపాటి వివరణను జోడించి, ఈ వ్యాసంలో మీ ముందుంచుతున్నాను.


(1)


అపసర, రోదితుమేవ నిమింతే మా ఉత్పుంసయ హతే అక్షిణీ మే

దర్శనమాత్రోన్మత్తాభ్యాం యాభ్యాం తవ హృదయమేవంరూపం న జ్ఞాతమ్. (3వ గాథ)


తన ప్రేమకు తగినంత గౌరవాన్నిచ్చి ఆదరించని ప్రియుడిని తిరస్కరిస్తూ ప్రియురాలు (నాయిక) అన్న మాటలు ఈ గాథలోనివి:


నా దగ్గరికి రాకు, తక్షణం నా యెదుట నుంచి వెళ్ళు

ఏడవడానికే సృష్టించబడ్డట్లుగా ఉన్నాయి నా కళ్ళు

అవి కార్చే కన్నీళ్ళను తుడిచే ప్రయత్నం చేయకు

నిన్ను చూడాలని అనుక్షణం తపిస్తూ ఉంటాయి అవి

ఆ మత్తులో నీవెంత మోసగాడివో గ్రహించలేకున్నాయి!


(2)


రణరణకశూన్యహృదయశ్చింతయన్ విరహదుర్బలాం జాయామ్

అజ్ఞాతనిజవసతిః స వ్యతిక్రాన్తో గ్రామమధ్యేన. (4వ గాథ)


ప్రియుడైన భర్త ప్రవాసం వెళ్ళిపోతున్నాడు. దుఃఖంలో మునిగి ఉన్నది అతడి ప్రియురాలు (నాయిక). ఈ వేదనాభరితమైన సన్నివేశాన్ని తిలకించిన ఆనాటి ఒక గ్రామీణ గాథాకర్త చెప్పిన గాథ ఇది:


ప్రియుడైన భర్త ప్రవాసానికి బయలుదేరి వెళుతున్నాడు

ఉత్కంఠభరితమైన ఆమె హృదయం శూన్యంతో నిండింది

విరహం అప్పటికప్పుడే దేహానికి దుర్బలత్వాన్ని ప్రసాదించింది.


అతడి ధ్యానమంతా తన భార్యపైనే లగ్నమై ఉంది

గ్రామం మధ్య నుంచి ఎక్కడికో నిశ్చయంగా చెప్పలేని ప్రదేశానికి

ఆ బాధలో అతడు మరి వెనుదిరిగి చూడకుండా

భారంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు!


(3)


సుజనో న దృశ్యత ఇవ ఖలబహులే జీవలోకే

యయా కాకసంకులా తథా న హంసపరివారితా పృథ్వీ. (5వ గాథ)


తన మనసుకు కష్టాన్ని కలిగిస్తున్న ఒక దుష్టవర్తనుడి ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని, మృదు స్వభావం కలిగిన ఒక స్త్రీ (నాయిక) చెప్పిన మాటలు ఈ గాథలోనివి:


దుష్ట స్వభావం కలిగిన వ్యక్తులతో

పూర్తిగా నిండిపోయి ఉన్న ఈ లోకంలో

మంచి మనసున్న వ్యక్తులు కనపడడమే కరువైపోయింది.


ఈ పృథ్వి ఎంతగానైతే కాకులతో నిండిపోయి ఉన్నదో,

అంతగా హంసలతో పరివ్యాప్తమై లేదు సుమా!


(4)


యన్మూర్ఛితా న చ శ్రుతః కదంబగంధేన తద్గుణే పతితమ్

ఇతరథా గర్జితశబ్దో జీవేన వినా న వ్యతిక్రామేత్. (6వ గాథ)


(వర్షాకాలంలో) ఒక స్త్రీ (నాయిక) అనుభవిస్తున్న విరహ వేదనను నివేదిస్తూ ఆమె సఖి చెప్పిన మాటలు ఈ గాథలోనివి (వర్షాకాలంలో ప్రియుడికి దూరంగా ఉండడం అంటే ప్రాణం పోవడంతో సమానమే! - అనే భావంలో):


కదంబ వృక్షాల నుండి వెలువడుతున్న సుగంధం

మత్తెక్కించి మూర్ఛితురాలిని చేసింది గనుక సరిపోయింది గానీ,

లేకుంటే దట్టమైన నల్లని ఆ వార్షుక మేఘముల గర్జనం

ఆమె ప్రాణాలను హరించకుండా వదిలేది కాదు కదా!


(5)


నిర్మల గగనతడాగే తారాగణకుసుమభితే తిమిరే

భికరవోబాలం చరతి మృగాంకో మరాల ఇవ. (14వ గాథ)


అభిసారిక లక్షణాలున్న నాయికను ఉత్సాహపరిచే ఉద్దేశంతో దూతిక చెప్పిన మాటలు ఈ గాథలోనివి. రాత్రి వేళల్లో తన మనసును దోచిన వ్యక్తిని రహస్యంగా కలుసుకునే ప్రయత్నం చేయడం 'అభిసారిక' లక్షణాలలో ఒకటి. పరిస్థితులు అందుకు అనువుగా ఉన్నాయని చెప్పడం ఈ గాథలోని దూతిక మాటలలో గ్రహించవచ్చునని పూర్వ వ్యాఖ్యాతల వివరణ:


రాత్రి అంధకారంలో

తారాగణములనే పుష్పాలతో నిండి

శోభిల్లుతున్న నిర్మలమైన ఆకాశమనే సరోవరంలో

చంద్రుడు హంస వలె వెలుగులీనుతూ తిరుగుతున్నాడు!


(6)


బహువిధవిలాసభరితే సురతే లభ్యన్తే యాని సౌఖ్యాని

విరహే తాని ప్రియసఖి! స్వాదితోద్గీర్ణాని క్రియన్తే. (17వ గాథ)


ఒక విరహిణి ద్వారా తన స్నేహితురాలికి ఏకాంతంలో నివేదించబడుతున్న జీవితానుభవ సారం ఈ గాథ:


ప్రియ సఖీ, బహువిధములైన

విలాసములతో కూడినదైన దాంపత్య సుఖంలో

లభించే ఆనందమంతా ప్రియుడు ప్రవాసంలో గడిపే రోజులలో

అనుభవించే విరహంలో ఒక్కసారిగా పోగొట్టుకోబడుతుంది సుమా!


(7)


మా గచ్ఛత విస్రమ్భం పుత్రక! చాటుకారకోఽయం లోకః

సూచివేధః కర్ణస్య పశ్యత కిం నియతే ప్రమాణమ్? (20వ గాథ)


లోకజ్ఞుడైన ఒక వృద్ధుడు ఒక యువకుడితో చెప్పిన మాటలు ఈ గాథలోనివి.


పసిపిల్లలకు చెవులు కుట్టించే సందర్భంలో, నొప్పి కలుగుతుంది కాబట్టి ఆ బాధ నుంచి ధ్యానాన్ని మళ్ళించడంకోసం, ముందు ఆ బాలుడు/బాలిక చేతికి చిన్న బెల్లం ముక్క ఇవ్వడం పూర్వం ఆచారంగా, ఆనవాయితీగా ఉండేదట! చేతిలో పడిన ఆ బెల్లం ముక్కను చూసుకుంటూ ఆనందంలో ఉన్న ఆ బాలుడు/బాలిక, బెల్లం ముక్క తీపిదనాన్ని ఆస్వాదించే సమయంలో చెవులు కుట్టడం జరిగేదట!


ఆ పూర్వాచారాన్ని దృష్టాంతంగా గణించి లోక రీతికి దానిని ప్రమాణంగా తీసుకోవడం సరైనది కాదని ఈ గాథలో చెప్పబడింది. లోకుల తీయని మాటల వెనక ప్రతి సందర్భంలోనూ, పైన ఉదాహరించిన సన్నివేశంలో వలె, సదుద్దేశమూ, మంచి దాగి ఉంటుందని అనుకోవడం మోసపోవడానికి దారితీస్తుందని ఇందులో గూఢంగా చెప్పబడిన భావమని పూర్వ వ్యాఖ్యాతల వివరణల వలన తెలుస్తుంది:


లోకంలో పైపై మెరుగులను నిజమనుకుని నమ్మి

మోసపోకు నాయనా!

లోకం తీయని మాటలతో కూడినదై ఉంటుంది.


చిన్నతనంలో చెవులు కుట్టించుకునేటప్పుడు జరిగే తంతుని,

లోకరీతికి ప్రమాణంగా తీసుకుంటారా ఎవరైనా?


(8)


అమృతమేవ హృదయం! హస్తౌ తృష్ణాహరౌ సతృష్ణానామ్

చన్ద్రముఖ! కుత్ర నివసతి అమిత్రదహనస్తవ ప్రతాపః (21వ గాథ)


తాను ప్రేమించిన వ్యక్తిని మన్మథుడితో పోల్చి, అతడి సౌందర్యప్రతాపములను ప్రశంసించడం ఈ గాథలోని విషయం:


నిండు చంద్రుడిని పోలిన ముఖం కలిగినవాడా!

నీ హృదయం అమృతమయమైనదిగా ఉంది

నీ చేతులు తృష్ణాతురులైన వ్యక్తుల దాహాన్ని తీర్చేవిగా ఉన్నాయి

ఇంత సౌందర్యంతోనూ, కరుణతోనూ నిండివున్న నీ శరీరంలో

నీతో వైరాన్ని ప్రదర్శించే వ్యక్తులను దహించగలిగే శక్తి

ఎక్కడ చేరి ఉన్నదో తెలుసుకోవాలని ఉంది సుమా!


(9)


యత్ కైతవేన ప్రేమ యచ్చ బలాత్, యచ్చార్థలోభేన

యదుపరోధనిమిత్తం, నమో నమస్తస్మై ప్రేమ్ణే. (38వ గాథ)


తాను ఇష్టపడే వ్యక్తి ప్రేమను ఏ మార్గాలను అవలంబించి సాధించకూడదో, ఆ వివరాలను స్పష్టం చేసి చెప్పింది ఈ గాథ:


మోసం చేయడం వలన, బలప్రయోగం చేయడం వలన,

డబ్బును ఆశగా చూపడం వలన లేక మరేదో

ప్రతిబంధకాన్ని ప్రయోగించడం వలన లభ్యమయ్యే ప్రేమకు

ఒకటి కాదు, రెండు నమస్కారములు!


(10)


కస్య న శ్రద్ధా గురుకత్వే పత్యుః ప్రసాదయతః

యది మానభజ్ఞన్యో న భవన్తి హేమన్తరాత్రయః (39వ గాథ)


హేమంత రాత్రుల ప్రభావాన్ని గురించి స్నేహితురాండ్రైన ఇరువురు స్త్రీల మధ్య సంభాషణ జరుగుతుండగా, అందులో ఒక స్త్రీ మాటలు ఈ గాథలోనివి:


భర్త వలదని చెబుతున్న మాటలను గౌరవించకూడదని

ఏ వినయవంతురాలైన భార్యకు ఉంటుంది?

ఎంతటి గౌరవ భావనను సైతం భంగపరిచే

హేమంత రాత్రుల ప్రభావం వలననే అలా జరుగుతుంది తప్ప!


(11)


అహో తత్ర తత్రైవ గగనం భ్రాన్త్వా విశ్రమతా

ప్రవహణవాయసేనేవ హాసితా దగ్ధప్రేమ్ణా. (40వ గాథ)


తన ప్రేమ వైఫల్యాలు మిగిల్చిన బాధను గురించి ఒక యువకుడు తలపోయడం, పై గాథ భావం:


ఆకాశంలో ఒక ప్రదేశం అంటూ లేకుండా

ఎక్కడెక్కడికో ఎగిరి వెళుతూ

అలిసిపోయినప్పుడు ఏదో ఒక చెట్టు కొమ్మ మీద వాలి

విశ్రాంతి తీసుకునే కాకిని పోలినదై

అపహాస్యం పాలైంది కదా నా బ్రతుకు!


(12)


శ్రద్ధా మే తవ ప్రియత్వస్య, అహం తు తన్న జానామి

హే పశ్య, త్వమేవ శిక్షయ యథా తే ప్రియా భవామి. (44వ గాథ)


అమాయకురాలైన ఒక యువతి, తాను ప్రేమించే యువకుడితో అన్న మాటలు ఈ గాథ:


నీకు ప్రియమైనదానను కావాలనే కోరికతో ఉన్నాను

అయితే, అది సాధించే మార్గం తెలియక సతమతమౌతున్నాను

నా మీద దయతో ఆ మార్గం ఏదో నీవే నాకు నేర్పించు

నీకు ప్రియురాలినై సుఖిస్తాను!


(13)


ద్వౌమార్గో భువనతలే మానిని! మానోన్నతానాం పురుషాణామ్

అథవా ప్రాప్నువన్తి శ్రియమథవా భ్రమన్తః సమాప్యన్తే. (46వ గాథ)


ఒక వృద్ధుడు తాను తెలుసుకున్న జీవితసత్యాలను ఒక యువతితో పంచుకోవడం ఈ గాథ:


అమ్మాయీ, మర్యాదస్తులైన మనుషులకు

ఈ లోకంలో గౌరవంగా జీవితాన్ని గడపడానికి రెండే మార్గాలున్నాయి

పుష్కలంగా సంపదను సొంతం చేసుకోవడం మొదటిది

లేదంటే సంచార జీవనం గడుపుతూ

ఎక్కడో తెలియని ఒక చోట జీవితానికి సమాప్తిని పలకడం రెండవది.


(14)


కుతః కమలానాం రతిః కుతః కుముదానాం శీతలశ్చన్ద్రః


తథా సజ్జనానాం స్నేహో న చలతి దూరస్థితానామపి. (48వ గాథ)


దూరంగా ఉన్నప్పటికీ సజ్జనులతో స్నేహం కొనసాగుతూనే ఉంటుంది అని రమణీయమైన ఉదాహరణలతో చెప్పింది ఈ గాథ:


ఎక్కడ కమలములకు మిత్రుడైన సూర్యుడు?

ఎక్కడ కలువలకు మిత్రుడైన చల్లని వెన్నెలను కురిసే చంద్రుడు?

దూరంగా ఉన్నప్పటికీ

సజ్జనుల స్నేహం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఆగిపోదు.


(మిగతావి తరువాయి భాగంలో)



పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



భట్టు వెంకటరావు గారి కొన్ని ఇతర రచనలు:



భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: భట్టు వెంకటరావు


భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 


నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.


ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!

నమస్కారములతో,


భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page