top of page
Original.png

కృషితో నాస్తి దుర్భిక్షం

13 hours ago
5 min read

కృషి, పట్టుదల మరియు ఓటమిని అధిగమించి విజయాన్ని సాధించే స్ఫూర్తిదాయక దృశ్యం

 

Krusito Nasthi Durbhiksyam - Telugu Inspirational Article | R C Kumar

కృషితో నాస్తి దుర్భిక్షం - తెలుగు స్ఫూర్తిదాయక వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 27/09/2026


జీవితంలో ఎదురయ్యే ప్రతి ఓటమి మనల్ని వెనక్కి లాగడానికి కాదు, మరింత బలంగా ముందుకు నడిపించడానికి వచ్చిన అవకాశం. పట్టుదల, నిరంతర కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమే. హనుమంతుడు, ధ్రువుడు, భగీరథుడు నుంచి ఎడిసన్, అబ్రహం లింకన్ వరకు ఎన్నో జీవితాలు దీనికి స్ఫూర్తిదాయక ఉదాహరణలు.“కృషితో నాస్తి దుర్భిక్షం” అనే నానుడి చెప్పే అసలైన సందేశమే ఈ కథనం.


ఇంట్లో పనికిరాని వస్తువులు పేరుకుపోతే ఎప్పటికప్పుడు తీసి పారేస్తాం. కొత్తవి కొనే ముందు కూడా పాత వాటిని వదిలించుకుంటాం. ఫోనులో చోటు లేకుంటే అవసరం లేని చిత్రాలూ, వీడియోలు, సందేశాలు తొలగిస్తాం.


కానీ మనసు విషయంలో మాత్రం ఇటువంటి జాగ్రత్త చాలామందికి ఉండదు.


ఎవరో అన్న మాట, ఎప్పుడో జరిగిన అవమానం, ఎదురైన అపజయం, తీరని కోరికలన్నింటినీ పదిలంగా దాచుకుంటారు. మంచి జ్ఞాపకాలకు తక్కువ చోటిచ్చి, చెడు అనుభవాలకు ఎక్కువ చోటిస్తూ పోతారు.


జీవితాల్లో ఓడిపోయినప్పుడు నిరుత్సాహపడి, డీలా పడిపోయిన సందర్భాలు దాదాపు మనందరికీ ఎదురవుతాయి. ఒక మనిషిగా ఆ సమయంలో బాధపడటం, ఒంటరిగా అనిపించడం సహజం.


అనుకున్నది దక్కకపోవడం, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమించిన వారు దూరం కావడం, ఆస్తులు పోగొట్టుకోవడం వంటి ఎన్నో కారణాల వల్ల చాలామంది తీవ్రమైన నిరాశలోకి వెళ్తుంటారు.


జీవితంలో ఒకసారి ఓడిపోయినంత మాత్రాన, ఏదో పోగొట్టుకున్నంత మాత్రాన డీలాపడాల్సిన అవసరం లేదు. ఓటమి అనేది ఒక ముగింపు కాదు, అది గెలుపు వైపు సాగే ప్రయాణంలో ఒక చిన్న మలుపు మాత్రమే. ఓటమి అనేది గెలుపుకు తొలి మెట్టు అని తెలుసుకోవాలి.


నిరంతర ప్రయత్నంతో సాధించలేనిది ఏదీ లేదు అనేది అక్షరసత్యం.


పట్టుదల, ప్రయత్నం ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు అనడానికి గొప్ప స్ఫూర్తిదాయక నానుడి "కృషితో నాస్తి దుర్భిక్షం".


కింద పడ్డామని ఏడవటం కాదు, పడిన ప్రతిసారీ ఎలా లేవాలనేదే మనం నేర్చుకోవాలి. స్వామి వివేకానంద ఏమంటారో తెలుసా! "కెరటం నాకు ఆదర్శం... ఎందుకంటే అది లేచి పడుతున్నందుకు కాదు, పడినా మళ్లీ లేస్తున్నందుకు!"


"వైఫల్యం అంటే అంతం కాదు, మరింత తెలివిగా మళ్లీ ప్రారంభించడానికి దొరికిన ఒక చక్కని అవకాశం" అంటారు హెన్రీ ఫోర్డ్. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా, ప్రతి విఫలం నుండి పాఠాలు నేర్చుకుంటూ సఫలం వైపు ముందుకు సాగడమే నిజమైన ప్రయత్నం. ఒకే రోజులో పెద్ద విజయం దక్కకపోవచ్చు.


కానీ ప్రతిరోజూ చేసే చిన్న ప్రయత్నమే కాలక్రమేణా ఒక పెద్ద విజయంగా మారుతుంది. 'నేను సాధించగలను' అనే నమ్మకం, ఆత్మవిశ్వాసం మనల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది. ఒక పద్ధతి పని చేయనప్పుడు, లక్ష్యాన్ని చేరుకోవడానికి 'ప్లాన్ బి' సిద్ధంగా ఉంచుకోవాలి లేదా సరికొత్త మార్గాలను అన్వేషించేలా ప్రయత్నాలు ప్రారంభించాలి.


నదీ ప్రవాహం బండరాతిని సైతం ముక్కలు చేస్తుంది... అది దాని శక్తి వల్ల కాదు, దాని నిరంతర ప్రవాహం వల్ల. దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే పురాణాలలోనూ, ఆధునిక యుగంలోనూ జరిగిన కొన్ని సంఘటనలను చెప్పుకోవాలి.


సీతమ్మ జాడ తెలుసుకునే ప్రయత్నంలో హనుమంతుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.


సీతాన్వేషణ కోసం లంకంతా తిరిగినా ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఒక సమయంలో కాస్త నిరుత్సాహపడి ఆత్మహత్యా ప్రయత్నం కూడా సంకల్పించాడు. కానీ వెంటనే గుండె దిటవు చేసుకుని తన దుర్బల మనస్తత్వానికి తానే చింతించి, రామకార్యాన్ని సాధించే సంకల్పాన్ని దృఢపరుచుకుంటాడు.


ఆ సందర్భంగా తాను గుర్తుతెచ్చుకున్న ఒక అద్భుత సందేశం - "జీవన్ భద్రాణి పశ్యతి" (బతికి ఉంటేనే ఏదైనా సాధించవచ్చు, శుభములు పొందవచ్చు. చచ్చి ఏమీ సాధించలేము).


ఆ విధంగా అనుకున్న వెంటనే హనుమంతుడికి అశోకవనంలో వెతకడం మరిచిపోయాను అన్న విషయం గుర్తుకొచ్చి వెంటనే బయలుదేరి, అశోకవనంలో సీతమ్మ జాడ కనిపెట్టడం జరిగింది.


ధ్రువతారగా నక్షత్ర మండలంలో శాశ్వత స్థానాన్ని పొందిన ధ్రువుడు చిన్నతనంలో సవతి తల్లి నిరాదరణ, తండ్రి నిర్లక్ష్యాలకు గురై తల్లి సలహాను అనుసరించి తపస్సుకు బయలుదేరాడు. అరణ్య మార్గం గుండా పోతుండగా నారదుడు కనిపించి వివరాలడిగాడు.


విషయం తెలుసుకుని చిన్నవాడి పట్టుదలకు సంతోషించి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రబలంతో సుదీర్ఘమైన తపస్సు మొదలుపెట్టాడు ఆ పిల్లవాడు. ఆ మంత్రమే "ఓం నమో భగవతే వాసుదేవాయ" (ద్వాదశాక్షరి మంత్రం).


ఎన్ని అవాంతరాలు, ఆటంకాలు చుట్టుముట్టినా చెక్కుచెదరకుండా తపస్సు చేసి భగవంతుడి అనుగ్రహంతో జ్ఞానాన్ని పొంది వేల సంవత్సరాలు పరిపాలించాడు, ధ్రువతారగా వెలిగిపోయాడు.


ఏకలవ్యుడికి విద్య నేర్పడానికి ద్రోణుడు కొన్ని కారణాల వల్ల నిరాకరించాడు. అయినా నిరాశ చెందకుండా అతడి మూర్తిని తయారు చేసి దాన్నే గురువుగా భావించిన ఏకలవ్యుడు భక్తిశ్రద్ధలతో విద్య నేర్చి ప్రతిభావంతుడయ్యాడు.


ఆ విధంగా విజయం సాధించడంలో అతని సంకల్పబలం, ఆత్మధైర్యం ప్రధాన పాత్ర వహించాయి. ఆ రెండు ఉన్నవారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. ద్రోణుడు అతనికి విద్య నేర్పకపోవడానికి కులమే కారణం కాదు.


ద్రోణుడు భీష్ముడితో చేసుకున్న ఒప్పందం ప్రకారం కేవలం కురువంశపు రాకుమారులకు మాత్రమే విద్యను నేర్పాలి. రహస్యంగా అడవిలో విద్యను అభ్యసించి, ద్రోణుడి పేరును వాడుకోవడం ఆనాటి నియమాల ప్రకారం రాజద్రోహంగా లేదా గురుద్రోహంగా పరిగణించబడింది.


మరి ద్రోణాచార్యుడు ఏకలవ్యుని బొటనవేలుని గురుదక్షిణగా ఎందుకు కోరాడు? పాండవులు మరియు కౌరవులు ఒకరోజు అడవికి వేటకు వెళ్లినప్పుడు, వారి వెంట ఉన్న ఒక కుక్క అడవిలో ధ్యానంలో ఉన్న ఏకలవ్యుడిని చూసి మొరగడం ప్రారంభించింది.


ఏకలవ్యుడి ఏకాగ్రతకు భంగం కలగడంతో, అతడు కేవలం శబ్దాన్ని బట్టి (శబ్దభేది విద్యతో) ఆ కుక్క నోటిలోకి ఏడు బాణాలు సంధించాడు.


అర్జునుడిని ప్రపంచంలోనే గొప్ప విలుకాడుగా చేస్తానని మాట ఇచ్చిన ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడి ప్రతిభను చూసి ఆశ్చర్యపోయాడు.


మరోవైపు అల్పజీవి అయిన కుక్కను ఏడు బాణాలతో హింసించడం వల్ల అతని ప్రవృత్తి తెలిసింది. చివరకు గురుదక్షిణగా ఏకలవ్యుడి కుడిచేతి బొటనవేలిని అడిగి తీసుకున్నాడు.


"భగీరథ ప్రయత్నం" అనేది అసాధారణమైన పట్టుదలకు, అలుపెరుగని కృషికి నిదర్శనంగా నిలిచే ఒక మహోజ్వల ఘట్టం.


స్వర్గంలో ఉన్న గంగానదిని భూమికి తీసుకురావడం అనే అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేసిన ఇక్ష్వాకు వంశపు రాజైన భగీరథుడి కథే ఇది. రామాయణం బాలకాండలో గంగానది ఒడ్డున విడిది చేసినప్పుడు, రాముడు ఆ నది గొప్పదనాన్ని గురించి అడగ్గా, విశ్వామిత్రుడు రాముడికి భగీరథుడి కథను (గంగావతరణం) వివరంగా చెప్తాడు.


ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక రంగంలో పట్టుదలకు నిదర్శనంగా థామస్ అల్వా ఎడిసన్ జీవితాన్ని చెప్పుకోవచ్చు.


ఆయన విద్యుత్ దీపాన్ని (Electric Bulb) కనుగొనే క్రమంలో ఒకసారి, 10 సార్లు కాదు, వేలాది సార్లు విఫలమయ్యారు. బల్బులో వెలిగే ఫిలమెంట్ తయారీ కోసం ఆయన దాదాపు పదివేల రకాల పదార్థాలతో పదివేల సార్లు ప్రయోగాలు చేస్తే అన్నీ విఫలమయ్యాయి.


ఎలాగైతేనేమి చిట్టచివరికి ఆయన అనుకున్నది సాధించి ప్రపంచానికి వెలుగులు పంచారు. ఒక విలేఖరి ఆయనను "ఇన్ని వేల సార్లు విఫలమయ్యారు కదా, మీకు బాధగా లేదా?" అని అడిగినప్పుడు, ఎడిసన్ ఏమన్నారో తెలుసా:


"నేనెక్కడ విఫలమయ్యాను? బల్బు తయారు చేయడానికి పనికిరాని 10,000 మార్గాలను విజయవంతంగా కనిపెట్టాను, అంతే" అన్నారు ఆయన. అదీ సానుకూల దృక్పథం అంటే!


అమెరికా చరిత్రలో అత్యంత గొప్ప అధ్యక్షుడిగా పేరుగాంచిన వ్యక్తి అబ్రహం లింకన్. ఆయన జీవితం పూర్తిగా ఓటములు, ప్రయత్నాలతోనే సాగింది. వరుస ఓటములలో భాగంగా ఆయన తన జీవితంలో, వ్యాపారంలో నష్టపోయారు.


భార్యనూ కోల్పోయి మానసిక కుంగుబాటుకు లోనయ్యారు. రాజకీయాల్లో దాదాపు 10 సార్లకి పైగా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు (వార్డ్ మెంబర్ స్థాయి నుండి సెనేటర్ వరకు).


అయితే ఏ ఓటమి కూడా ఆయనను ఆపలేకపోయింది. అలుపెరుగని పోరాటంతో ప్రతిసారీ ఆయన తన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగారు.


చివరికి 52 ఏళ్ల వయసులో ఆయన అమెరికాకు 16వ అధ్యక్షుడిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.

యుద్ధంలో పరాజయం పొంది సర్వస్వం కోల్పోయి, తీవ్ర నిరాశలో ఉన్న ఒక రాజు కొంత దూరంలో ఉన్న గుహలోకి వెళ్లి తల దాచుకుంటాడు.


గుహ పైభాగంలో ఒక సాలీడు గూడు కట్టడానికి ప్రయత్నించడం అతనికి కనిపిస్తుంది. ఆ సాలీడు పైకి పాకడం, కింద పడిపోవడం... మళ్లీ పాకడం, మళ్లీ పడటం... అలా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా దాదాపు 16 సార్లు విఫలమైనా కూడా అది తన ప్రయత్నాన్ని ఆపలేదు.


చివరికి 17వ సారి ఆ సాలీడు విజయవంతంగా పైకి చేరి గూడు కడుతుంది. దీనిని చూసి స్ఫూర్తి పొందిన రాజు, "ఒక చిన్న జీవే అంత పట్టుదలతో ఉంటే, నేను ఎందుకు ఓటమిని ఒప్పుకోవాలి?" అని భావించి, మళ్లీ సైన్యాన్ని సమీకరించి, తదుపరి యుద్ధంలో విజయం సాధిస్తాడు.


ఈ వృత్తాంతాల ద్వారా తెలుసుకోవలసింది ఏమిటంటే మనం ఎదుర్కొనే ప్రతి ఓటమి, గెలుపు వైపు సాగే ప్రయాణంలో ఒక మలుపు. ఆ ఓటమి గెలుపుకు తొలి మెట్టు కాగలదు. "కృషితో నాస్తి దుర్భిక్షం".


లోకా సమస్తా సుఖినో భవంతు. 🙏


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.




ఆర్ సి కుమార్  గారి కొన్ని ఇతర రచనలు:


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

R C Kumar
ఆర్.సి. కుమార్

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page