top of page

జీవితాన్ని నిలబెట్టినా - పడగొట్టినా డబ్బే

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





'Jivithanni Nilabettina Padagottina Dabbe' Written By Neeraja Hari Prabhala

రచన….నీరజ హరి ప్రభల.

మనం చేసిన సహాయం కొందరిని బాగు చేస్తుంది.

మరి కొందరిని నాశనం చేస్తుంది.

అది ఆ సహాయాన్ని వాళ్ళు 'ఏ రకంగా ఉపయోగించుకున్నారు' అనేదాన్నిబట్టి ఉంటుంది.

ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు రచించారు.


నా ముందు యదార్థంగా జరిగిన సంఘటనలు వ్రాస్తున్నాను.

నేనేదో గొప్ప పని చేశానని చెప్పటం కోసం కాదు ఇది వ్రాయటం. . డబ్బు మనిషి జీవితాన్ని ఈ రెండు సంఘటనలలో ఎలా ప్రభావితం చేసిందీ చెబుతున్నాను.

3సం...క్రితం నేను కాకతీయ యూనివర్సిటీలో MA (ఇంగ్లీష్) 2nd Year పరీక్షలు వ్రాస్తున్న రోజులు. రోజూ ఉదయాన్నే Hyd (మియాపూర్) నుంచి బయిలుదేరి వరంగల్ లోని యూనివర్సిటీ కి వచ్చి (2 to 5 పరీక్ష) అయిపోగానే సాయంత్రం రైలుకు Hyd వచ్చేదాన్ని. ఆరోజు ఆఖరు పరీక్ష వ్రాసి తిరిగి హైదరాబాద్ కు బయలుదేరాను. యూనివర్సిటీ నుంచి కాజీపేట స్టేషన్ కు వచ్చి నేను రైలులో ముందుగనే రిజర్వ్ చేసుకున్న సీటు లో కూర్చున్నాను. రైలు బయలుదేరబోతోంది.

ఇంతలో హడావుడిగా పరిగెత్తుకుంటూ సుమారు 25 సం...అమ్మాయి ఇద్దరు పిల్లలతో(బాబు, పాప) రైలెక్కింది. తను కనుముక్కు తీరు బాగుండి చక్కగా ఉంది .ఆ అమ్మాయి పరిగెత్తుతూ వచ్చింది కదా, చాలా రొప్పుతోంది. సీటు లేక పాపం నిలబడి భయంతో కిటికీ వైపు బయటికి, భోగీలో వాళ్ళవేపు చూస్తోంది.

పంజాబీ డ్రస్ వేసుకున్న ఆ అమ్మాయి ముఖం మీద , చేతుల మీద గాయాలు ఉన్నాయి.అక్కడ క్కడా డ్రెస్ చిరిగిఉంది . ఎవరూ సీటు ఇవ్వక పోగా పాపం ఆ అమ్మాయిని అసహ్యంగా చూపులు. ఇంక మగవారి చూపులు చెప్పక్కర్లేదు. తనని చూసి నాకు చాలా బాధ ,జాలి కలిగింది. వెంటనే నేను లేచి నా సీటు ఇచ్చి "నీవు పిల్లలను ఒళ్ళో పెట్టుకుని కూర్చోమ్మా. నేను నుంచుంటాను" అని వాళ్శను కూర్చోబెట్టి త్రాగమని మంచినీళ్లు ఇచ్చాను. వాళ్ళు త్రాగాక నా వద్ద ఉన్న యాపిల్ పళ్ళు , బిస్కెట్ పాకెట్లు ఇచ్చాను. మొహమాట పడి వద్దంటే "ముందు నీవు, పిల్లలు తినండని" బలవంతంగా తన చేతిలో పెడితే సంతోషంగా తిన్నారు.

ఆ పిల్లలలో బాబుకి 5 సం.. . , పాపకు 3 సం..ఉండచ్చు.చాలా ముద్ధుగా‌ మంచి కళగా ఉండి వాళ్ల కళ్ళలో కూడా తెలియని భయం కనపడుతోంది. తల్లిని గట్టిగా కరుచుకుని చెరోవైపు కూర్చున్నారు. అభం శుభం తెలీని పసిపిల్లలు. తనకు నా బాగ్ లోంచి దుప్పటి లాంటి షాల్ తీసి తనకు ఇచ్చి ఒళ్ళు కప్పుకోమన్నాను.

వాళ్ళు రైలెక్కిన పరిస్థితి, వాళ్ళ వాలకం చూడగానే వాళ్లు ఏదో ఆపదలో ఉన్నారని నాకు కొంత అర్థమైంది. కొంత సేపటికి ఇంకో స్టేషన్లో సీటు ఖాళి కాగానే నేను కూడా తన ప్రక్కన కూర్చుని వాళ్ళ పాపను నా ఒడిలో కూర్చోబెట్టుకున్నాను. ఈలోగా T.C .వచ్చాడు. టిక్కెట్ లేని ప్రయాణం కదా పాపం తనకు పెనాల్టీవేస్తే నేను కట్టాను. ఉన్నపళంగా పిల్లలతో రైలెక్కింది. పాపం తన చేతిలో చిల్లిగవ్వకూడా లేదు .

ఆ అమ్మాయి ఎందుకు భయపడుతోందీ ,తన పరిస్థితులు ఏమిటో తెలుసుకుని నాకు చేతనైన సాయం చేయాలనిపించింది .తనది నా పిల్లలంత వయస్సు . సాటి ఆడపిల్ల. అందువలన వివరాలు అడుగ ప్రయత్నించాను. "నాకు నీలాంటి ముగ్గురు ఆడపిల్లలున్నారమ్మా! నీ తల్లి లాగా ఆనుకుని చెప్పు. నన్ను నమ్ము. నా వలన చేతనైన సాయం నీకు చేస్తాను .అంతేకాని అపకారం మాత్రం చేయను" అని అభయమిచ్చాక తను తన గురించి వివరాలు ఇలా చెప్పింది.

తన పేరు మనీష. (అసలు పేరు వేరు) ,వాళ్ళు లంబాడీ వాళ్ళు. తన తల్లిదండ్రులతో, ఇద్దరు చెల్లెళ్ళతో Hyd లో ఉంటారు .తండ్రి వాచ్ మెన్, పచ్చి త్రాగుబోతు .తల్లి పనిమనిషిగా చేస్తోంది. తను ఇంటికి పెద్ద కూతురు. BSc.BEd చేసిందిట. తనకు ఇంకా చదువుకుని ఉద్యోగం చేసి తన కాళ్ళ మీద తను నిలబడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరికట. కానీ బలవంతంగా మేనమామకు ఇచ్చి పెళ్లి చేశారు.వాడు తాపీ మేస్త్రీ. తాగొచ్చి రోజూ గొడ్డును బాదినట్టు కొడతాడుట. వాడికి అన్ని వ్యసనాలు ఉన్నాయిట .ఎన్నోసార్లు చద్దామని అనుకుని బిడ్డలను చూసి, వాళ్ళ కోసం బ్రతుకుతున్నాను.ఇప్పుడు కూడా త్రాగి మాంసం నరికే కత్తితో చంప వెంటబడితే వాడి బారినుంచి ఎలాగో బయటపడి పిల్లలను తీసుకుని పేరెంట్స్ వద్దకు వెళ్దామని రైలెక్కిందిట. ఈ రైలులో కూడా వాడు వెంబడిస్తాడేమోనని భయంగా ఉందమ్మా " అని బావురుమని వెక్కి వెక్కి ఏడ్చింది. నా గుండె తరుక్కుపోయింది

"ఏం భయంలేదమ్మా. వాడు రాడు. ఒకవేళ వచ్చినా ఇంత మంది జనంలో వాడు నిన్నేంచేయడు. ధైర్యంగా ఉండు.నేను Hyd వెళ్తున్నాను. నీకు తోడు గా ఉంటాను " అని దగ్గరకు తీసుకొని సముదాయించాను. కాస్త స్ధిమిత పడింది.

రైలులో వాళ్ళంతా వెనక్కి తిరిగి మా వంక చూస్తున్నారు. అసలే ఒంటరి ఆడపిల్ల. బాధలలో ఉన్నది .రాత్రి 8 అయింది ఇంక Hyd వెళ్ళేటప్పుటికి రాత్రి 10.30. ఇప్పుడు తన పరిస్థితి తెలిస్తే పైజమాలాల్చి వాడి నుంచి పల్లీలు అమ్ముకునే వాడిదాకా తనని మోసం చేయడానికి ఆస్కారం ఉంది. అసలే రోజులు బాగా లేవు.

నేను "తనను నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి, అనుకోకుండా ఇక్కడ కలిశాము" అని తోటి ప్రయాణీకులకు చెప్పాను.కొన్ని విపత్కర పరిస్థితులలో ఒక మంచి పని కోసం అసత్యం చెప్పక తప్పదు. దేవుడు క్షమిస్తాడనుకుని ఆ విధంగా చెప్పాను. అప్పటిదాకా తోడేళ్ళు, డేగ ల చూపులతో గుచ్చి గుచ్చి చూసిన అందరి కళ్ళూ చూపులు మరల్చి వాళ్ళ వాళ్ళ కబుర్లలో పడి మమ్మల్ని పట్టించుకోవటం మానేశారు. "హమ్మయ్య . ఇప్పుడు ఆ అమ్మాయికి కొంత రక్షణ" అని ఊపిరి పీల్చుకున్నాను.

"మరి ! నీవు ఇన్ని కష్టాలు పడుతూ ప్రాణభయంతో ఇంకా వాడివద్దే ఉండటం ఎందుకు? చదువు కున్న దానివి , ఏదన్నా ఉద్యోగం చూసుకుని విడిగా ఉంటూ పిల్లలను మంచిగా పెంచుకోవచ్చు కదమ్మా" అన్నాను.

"మా తండాలో కుల పెద్దలు అలా ఒప్పుకోరమ్మా! పైగా పెళ్ళి కావలసిన ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. నేనేదన్నా చేస్తే వాళ్ళ పెళ్ళిళ్ళు, భవిష్యత్ ఏంటి? అందుకని ఓర్పు గా ఉన్నాను " అన్న తన మాటలకు చిన్న పిల్లయినా తనకు చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. ఆకలితో ఉన్న ఆపిల్లలకు రైలులో తినుబండారాలు కొనిపెడితే వాళ్లు తిని నిద్రపోయారు.

"నీవు నీ కధంతా అందరికీ చెప్పద్దమ్మా! నీ పరిస్థితి ని వాళ్ళ కనుకూలంగా మార్చుకుని సాయం చేస్తామని నమ్మించి నిన్ను అన్నివిధాలా మోసం చేసే ప్రమాదం ఉంది" అని తనకు చెప్పి రైలు Hyd వెళ్ళేటప్పుటికి 10.30 .ఇంక బయటకు వచ్చేటప్పటికి 11గం.. ఆ సమయంలో బస్సులు ఉండవు. చంటి పిల్లలతో మీ ప్రాంతానికి నీవు ఎలా వెళతావు? నా కాబ్ లో నాతో పాటు మా ఇంటికి రామ్మా. హాయిగా అన్నంతిని ప్రశాంతంగా మా ఇంట్లో పడుకుని ప్రొద్దున్నే టిఫిన్ చేశాక మీ బస్సు ఎక్కిస్తాను" అ ని చెప్పి Hyd రాగానే వాళ్ళను మా ఇంటికి తీసికెళ్ళి వాళ్ళకు వేరే బట్టలిచ్చి , వేడి వేడిగా వంట చేసి వాళ్ళకి పెడితే తిని ప్రశాంతంగా పడుకున్నారు.

ఆ మరుసటి రోజు ఉదయం స్నానపానాలు అయ్యాక టిఫిన్ పెట్టి ,4 చీరెలు 2,000 రూ., మనీష చేతిలో పెట్టి నాఫో న్ నెంబర్ ఇచ్చి ఏం సాయంకావాలన్నా అడుగమ్మా! మొహమాటపడద్దు ధైర్యంగా ఉండి పిల్లలను బాగా చూసుకో " అని ధైర్యం చెప్పి బస్సెక్కించానే కానీ "పాపం చిన్నపిల్ల. ఎన్నికష్టాలు పడుతోందో " అని నా మనస్సంతాఏదో బాధగా అనిపించింది.

ఆతర్వాత 2 రోజులకు తను ఫోన్ చేసింది.కుశల ప్రశ్నలనంతరం "నేను నీకు ఎక్కడన్నా స్కూల్ లో ఉద్యొగం చూపిస్తాను ,చేస్తావా? నీకాళ్ళమీద నీవు ధైర్యంగా బతికి నీపిల్లలను చదివించుకోవచ్చు " ఆని చెబితే ఒప్పుకుంది .నాకు తెలిసిన స్కూల్ లో తన పరిస్థితి చెప్పి టీచర్ గా ఉద్యోగం ఇప్పించి ,ఆ పిల్లలు అందులోనే ఉచితంగా చదువుకునేట్టు ఏర్పాటు చేశాను. తనకు కావలసిన పిల్లల పోషణ ఖర్చులకు ఆర్ధికంగా సాయం చేశాను. ఫైనాన్స్ సపోర్ట్ వచ్చేటప్పటికి తనకు మరికొంత ధైర్యం వచ్చింది.

నెమ్మదిగా తన చేత టీచర్ పోస్ట్ లకు ఆప్లై చేయిస్తే అద్రృష్టవశాత్తు గవర్నమెంట్ స్కూల్ లో పోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు తను ఉద్యోగం చేసుకుంటూ పిల్లలతో హాయిగా ఉంటోంది. ఇప్పటికీ నన్ను " అమ్మా" అనే పిలుస్తుంది. నా పిల్లలెంతో తనూ అంతే.. తన భర్త త్రాగుడికి బానిసై ఏదో యాక్సిడెంట్లో పోయాడుట.

"చేసిన సాయం చెప్పకూడదు" అనుకున్నాను. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెపుతున్నాను అంటే 3 రోజుల క్రితం ఏదో పనిమీద నేను బయటకెళ్ళి వస్తుంటే ఫుట్ పాత్ మీద చెప్పులు కుట్టేవాడు "అమ్మా! నిన్నటి నుంచి అన్నం లేదమ్మా ! కాస్త ఏదన్నా డబ్బులిస్తే కడుపు నిండా భోజనం చేస్తా " అంటే పర్సులోంచి 100 రూ...తీసి భోజనం చేయమని వాడికిచ్చాను. వాడు నా ముందే లేచి ఎక్కడికో వెళ్ళాడు భోజనానికి కాబోలు అనుకుని నేను ఇంటికి వచ్చేశాను.

నేను వాకింగ్ కు వెళ్తున్నప్పుడల్లా ఆరోజు నుంచి వాడు కనిపించట్లేదు. ఏంటా? ఏమయ్యాడా ? ఆని అనుమానం వచ్చి పక్కన ఉన్న బ్యాంకు ఏ టి ఎం సెక్యూరిటీని అడిగితే, అతను చెప్పిన జవాబు విని నిర్ఘాంతపోయాను.

వాడు త్రాగుబోతుట. త్రాగుడికి బానిసయ్యి మందు దొరక్క రోజూ శానిటైజర్స్ త్రాగుతున్నాడుట. నేను ఇచ్చిన 100 రూ.లతో వాడు శానిటైజర్ త్రాగి అదేరోజున చనిపోయాడుట.

"అయ్యో! నేను వంద రూ.. ఇవ్వకపోతే వాడు బ్రతికేవాడేమో " అని ఇప్పుడు బాధ పడుతున్నాను. దైవనిర్ణయం అదని తెలిసినా విలువైన జీవితం పోయి జీవి పోయాడు కదా !.


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

మనసులోని మాట



రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏




68 views0 comments
bottom of page