top of page

కాకతి రుద్రమ ఎపిసోడ్ 17

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Kakathi Rudrama Episode 17' New Telugu Web Series


Written By Ayyala Somayajula Subrahmanyam


రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 17 వ భాగం


గత ఎపిసోడ్ లో…

గణపతి దేవుడు రుద్రమ దేవిని పిలిచి, రాజ్యాధికారం రుద్రమ దేవి భర్తకు ఉండదని, అది కాకతీయ వంశజులకే చెందాలని ప్రమాణం చేయించుకుంటాడు.

అన్నమాంబిక తను కూడా కదన రంగానికి వస్తానని కోరుతుంది.

బాప్పదేవుడు యుద్ధంలో నాగయ్య నాయకుని సంహరిస్తాడు.

ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 17 చదవండి..


తొలి విజయం రుద్రమదేవిని ఆనందపరిచింది. ఆమె పేరుప్రఖ్యాతులు మండలాల వరకూ వ్యాపించినాయి. కాకతీ రాజ్యానికి కలలు కంటున్న వాళ్ళ కళ్ళంటుకున్నవి.... అదీగాక గోనగన్నారెడ్డి కాకతీ రాజ్యపాలనను సుగమం చేసి - చక్రవర్తిణికి నీడలాగా వుంటూ చాలా చిత్రంగా ఎదురు తిరుగుచున్న సామంత రాజులని అణచివేయటం- అభాసుపాలు చేయడం చేస్తున్నాడు.

బలమైన లకుమయారెడ్డి, కాచమనాయకుడు లాంటివారే అతని చేతిల శృంగ భంగం చెందితే తామెంత? అని రెక్కలు విప్పిన సామంతులు కొందరు మళ్ళీ రెక్కలు ముడుచుకుని గూళ్ళలో దూరాల్సొచ్చింది.

యిది యిట్లా వుండగా-

రుద్రమదేవి తన అపార బలగంతో, సమధికోత్సాహ సైన్యంతో, సామంత రాజ్యాల మీదుగా, పక్కన అన్నమాంబికను కూర్చుండబెట్టుకుని ప్రయాణాలు చేయసాగింది.

ఆమె ఎటు వెళ్ళినా గౌరవపురస్కారమైన అభినందనలే- విజయధ్వానాలే. కోట పేర్మినాయుడు సిగ్గుతో తల చిదికిన పామువలె నిలబడి "కాకతీచక్రవర్తిణీ! నన్ను క్షమించవలెనని ప్రార్థన" అని వేడుకున్నాడు.

కాటమనాయకుడు మాటరాక- ఆమె పాదాలదగ్గర నిలబడి పోయినాడు- ఆమె ఏమీ అనలేదు. చిరునవ్వు నవ్వింది. క్షమా హృదయము కాకతీయులకు తొలినుంచీ

వున్నది. ఆమె ఎంతటి చక్రవర్తిణి అయినా, స్త్రీ గనుక హృదయలాలిత్యము వుండటం చేత క్షమించగలిగింది.

పొనుగంటి సామంతప్రభువు జన్నిగదేవుడూ, ఆయన కుమారుడు, త్రిపురాంతక ప్రభువు రుద్రమహారాజు ఆమెకు దోవ పొడుగునా అఖండ స్వాగతాలు ఇచ్చారు. స్త్రీలు మంగళహారతులు ఇచ్చారు. నృత్య -గాన వినోద విభావరి ఆది. అంతులేని సంతోషహేల. ప్రజలకు తమ చక్రవర్తిణిని చూసిన సంరంభము.

ఆమె శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించింది.


సింహపురి రంగనాయకస్వామిని కొలిచింది. కంచి కామాక్షిని ప్రార్దించింది. ప్రతిరోజూ ఆమె ఎక్కడుంటే అక్కడ తిరునాళ్ళే. అంతులేని - అదుపు చేయలేని జన

సందోహమే.

ఆమె కర్నూలు లో కాలిడినది. ఆదవోనిలో ఒకపూట ఆగినది. కోటారెడ్డి ప్రభువుతో మాట్లాడినది. అన్నమాంబిక భయము మీకు వలదని అభయ మిచ్చింది. బుద్ధపురం ప్రభువులను పరామర్శించినది.

వర్ధమానపురంలోని రాజకీయ జీవితమును ప్రత్యక్షముగా వీక్షించినది. ఆమె స్నేహ సౌశీల్యత, మృధుస్వభావము, మధుర భాషణా అందరినీ చకితులుగా చేసింది. అన్నమాంబిక మాత్రం ఆదవోని ప్రభువుల, ప్రజల కంట పడలేదు.

తరువాత పదిదినములకు కాకతీనగరము చేరినది.

అన్నమాంబిక- రుద్రమదేవి అక్క వెంట అన్ని వూళ్ళూ చూసినది. ఆమె పొందిన గౌరవమర్యాదలలో ఈమెయూ భాగము పంచుకుంది. ఎంత సంతోషమది. ఎవరు చక్రవర్తిణితో సమానంగా యింత గౌరవమర్యాదలు పొందగలరు.

అయితే ఆమె కళ్ళు ప్రతీచోటా - ప్రతీ పట్టణమందు త నభావినాయకుడు గన్నారెడ్డి ప్రభువులకోసం వెతుకుతూనే వుండేది. కానీ అతడు కానరాడే- తనను బంధించెదరని భయమా? భయమేలేని వాడికి భయమన్న మాటేమిటీ? అతనిని బంధించ వలెనన్న ఓరుగల్లు మహాసామ్రాజ్యమున ఏ బందిఖానా అతనిని బంధించగలదు?

తండ్రి ఎదుట తనను రుద్రమాంబిక అక్క పడనివ్వలేదు. తను ఎన్నాళ్ళనాడో చచ్చిన దానికిందనే లెక్క. కానీ తన మాతృమూర్తి కంటికి కనబడగా తన బిడ్డను చూడవలెనని ఏడ్చినదట.

క్షాత్రత అనగా యిదేనా? అది రక్తసంబంధం కన్నా విలువైనదో తెలియదు. తనకి క్షాత్రత లేదా? కత్తి పట్టుకుని పురుషవేషధారిణియై, తాను ఎన్ని తలలు నరక లేదు! ఎంత క్షాత్రత ప్రదర్శించలేదు.

తను పురుషవేషమున అంగరక్షకునిగా వుండి, అక్కను మృత్యుముఖం నుండి రెండు-మూడు సార్లు రక్షించలేదా! దానికి అక్క తనను గాఢముగా కౌగలించుకొని " చెల్లీ! నీవు నా ప్రాణదాతవమ్మా.... ఎట్లు నీ ఋణము తీరును!"అని మెచ్చుకొనలేదా!

దానికి జవాబుగా తను నవ్వింది. ఆ నవ్వే రుద్రమ్మక్క కు చాలా ఇష్టం. రుద్రమదేవి ఓరుగల్లు చేరిన అనంతరం ఆ పట్టణ ప్రజలు మరొక్క సారి వేడుకలను చేయవలెనని ప్రభువుని వేడుకున్నారు.

ఆమె శివదేవయ్యామాత్యులతో- " బాబయ్యగారూ, ప్రజాభీష్టమిట్లున్నది" అని చెప్పింది.

ఆయన ఆమె వంక చూసి- "ప్రజా బలమే ప్రభువుల బలము- ప్రజలే ప్రభువు. వారి. కోరిక మన్నించ వలసినది" అని చెప్పినారు.

ఆ నాడే, “యింకా రెన్నాళ్ళకి కాకతీదేవీ- ఏకవీరాదేవి ఊరేగింపు ఉత్సవం జరుగుతుంద”ని రాజ్యమంతటా దండోరా వేయబడింది.

ఇన్నాళ్ళూ చాళుక్య వీరభద్ర ప్రభువులు ఆమె కంట కనబడలేదు. ఆమె మనస్సులో విభేదము- ఎవ్వరితోనూ చెప్పలేదు. పుట్టినది సార్వభౌముల యింట..... మసలినది మగవాని వలె.... మరి.. ' మగనాలి' వలె బ్రతుకుటకు రాజధర్మములు అడ్డువచ్చుచున్నవి. నలువైపులా చీకటి..... అనంత గాఢాందకారము.

ఈ తిమిరము చీలుటెట్లు..... ఉషస్సు పూయుటెప్పుడు? ఇది ఒక మహారాణి అంతరంగ ఘోష. మహాసామ్రాజ్య చక్రవర్తిణి అంతరంగ ఘోష..... పరిస్థితులకు లోనైన ఒక కన్నె క్షత్రియపడుచు ఆంతర్యమున నలుగుచున్న సరివేదన.......................

ఈ జన్మ దుర్భరముగా నున్నది. కానీ తాను మామూలు స్త్రీగా- ఒకనికి ఇల్లాలిగా, ఒక సంయుక్త సంసారమున అత్త మామలకు కోడలుగా, బావలకు

ప్రీతిపాత్రమైన మరదలుగా, మరుదులకు దయామయి అయిన వదినమ్మగా బ్రతకలేదు. తను సామ్రాజ్యమును కత్తులబోను ముందు చిక్కుకున్న ఒక చిత్రమైన ప్రాణి....

అన్ని అధికారములకూ ఆమె ఆట పట్టు. కాని తను స్వేచ్ఛగా బ్రతుకు అధికారములేదు. "ఇదేమి అధికారము-దీనికి జవాబులేదు".

శివదేవయ్యామాత్యులు పైకి అనరు. ఆయనే ఈ తప్పులకు కారణం. గణపతి రుద్రదేవప్రభువులు, ఇరువురు ఆడపిల్లలను ఆడపిల్లల వలె పెంచి మరెవరినైనా దత్తత తీసుకుని వున్నట్లయితే, ఆమెకు ఈ దుఃఖము వుండదు. ఈ రాజకీయ చెరసాల వుండదు. ఆమె తనదైన జీవితము గడపగల గలిగెడిది.

తను ఒక పాచిక వేసినాడు, అది పారలేదు. కానీ కాకతీ సామ్రజ్యలక్ష్మి పరుల చేతిలో పడి దుఃఖిమతి కాలేదు. అది సంతోషము.

చాళుక్య వీరభద్ర ప్రభువుల చేతిలో ఆమె సుఖించగలదు. ఆమెను ఆమె హృదయ పూర్వకముగా అర్పించుకోగలదు. ఐతే చాళుక్య వీరభద్రప్రభువు మనస్సు గాయపడవచ్చు. అతడు కేవలము ఆమెకు భర్త. చక్రవర్తి కాడు.

అతని సంతానము మరల దత్తతతో కానీ కాకతీరాజ్య వారసుడు కాడు. అంతా గజిబిజి. ఇది ప్రస్తుత చక్రవర్తుల వారు భావి చక్రవర్తిణి నుండి తీసుకున్న ప్రమాణము.

ఇందులోని తిరకాసు రుద్రమదేవికే అర్దముకాదు. ఇక్కడ ఆమెది స్త్రీ హృదయము.చక్రవర్తిణి వలె ఆలోచించగల మేధస్సు కాదు.

"చాళుక్యులు - తెలుగు గద్దెను, కాకతీ సింహాసనమును పాలించుటకు పనికిరారని దుర్మార్గులైన సామంతులు వెనుకనించి ప్రజలను రెచ్చగొట్ట వచ్చును. ప్రభువులను దించినా - ఎక్కించినా అది ప్రజలకే చెల్లు.

రుద్రమదేవి లాంటి మహా తేజస్విని సామాన్యమైన యిల్లాలివలె,ప్రభువులకు దేవేరి వలె,మిగతా సవతులకన్న పెద్దదానివలె బ్రతకరాదు. అది తమ ఆలోచన, ప్రభువుల ఆలోచన..... అందుకే ఈ వంశము లోని ఎనిమిది ప్రభువుల తర్వాత తొమ్మిదవ ప్రభువుగా ఆమె తన బాధ్యతలను స్వీకరంచుట.

అదే రుద్రమాంబకూ గణపాంబాదేవికి మధ్యన వున్న వ్యత్యాసము. ఐతే వీరభద్రప్రభువు మహామేధావి. పరిస్థితులను సాంగోపాంగంగా పరిశీలించి, మంచి చెడులను జాగ్రత్తగా వీక్షించగల ఉత్తముడు. అతనికి చక్రవర్తి కావలెనన్న దుర్భుద్ది గానీ, ప్రలోభము గానీ లేనేలేవు. వున్నట్లయితే అతను ఏనాడో మిగతా సామంతులవలె యుద్దప్రయత్నములు తప్పక చేసెడివాడు.

అన్నింటి కన్నా గన్నారెడ్డి రాజభక్తి.

ప్రస్తుతం కత్తి కడుతున్న సామంతరాజులు -కిమ్మనాస్తిగా వూరుకన్నా, అదనుకోసం చూస్తున్నా -గన్నారెడ్డి వాళ్ళ కల్లో కనిపిస్తున్నాడు. నిద్రలో సైతము అతని పేరు వింటేగజ గజ వణుకుతారు. నిద్రరావివ్వడు.

ఐనా యుద్ధప్రయత్నాలు తీవ్రతరమై ప్రమాదాన్ని కలిగించాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు యాదవప్రభువులు............ వీటన్నింటి కారణ భూతులై సామంతరాజ్యాల ప్రభువులను పురిగొల్పి అంతఃకలహాల చిచ్చు రేపి ప్రజల జీవన స్థితిగతులను విచ్ఛిన్నం చేస్తున్న దుర్మార్గులెవరు? ఆ వ్యక్తి మాత్రం రేఖామాత్రంగా తలలో మెసలుతాడు.

నమ్మబుద్ది కాలేదు. కానీ తమ వేగులు నిర్దిష్టమైన నిజాలు తెస్తున్నారు. అతడు మామూలు మనిషి కాడు. మహావ్యక్తే.... నిజా నిజాలు త్వరలో తేలవలసి యున్నది.

ఇప్పుడు రాజ్యాలని కబళించాలని చూస్తున్న యాదవులతోపాటు, కాంచీపుర ప్రభువులు, పాండ్యరాజ్య ప్రభువులూ వున్నారన్నది స్పష్టముగా తెలుస్తూనే వున్నది.

శత్రురాజులు - రుద్రమదేవి యుద్దయాత్రకు బయలుదేరినా, ఈ అదనులో ఆమె కాకతీపురంలో లేదని తెలిసీ, దండయాత్ర లు చేసి ముట్టడి చేయలేదంటే, వారికి యింకనూ ఈ సామ్రాజ్యము మీద దండయాత్ర చేసే ధైర్యం లేకపోవటమే.

చోళజాతిప్రభువు,కళ్యాణపురపు చోడోదయుడు యిటీవలే తాను స్వతంత్ర ప్రతిపత్తిగల చక్రవర్తిననీ - ఇకపైన సామంత రాజులు కాకతీచక్రర్తులకు కప్పము కట్టనక్కరలేదు- పశ్చిమ ఆంధ్రదేశాన్ని పాలిస్తున్న సామంతరాజులు యికనుంచి పన్ను సరాసరి తనకే కట్టాలని సామంతరాజ్యాలన్నింటిలోనూ టముకు వేయించినాడు.

గణపతిరుద్రదేవుడు పాలన వచ్చినప్పటినుంచీ- భక్తి విశ్వాసాలతో కొలుస్తున్న చోళులు ఏం చేయాలో తెలీని తికమక స్థితిలో వున్నారు. ఇవి శివదేవయ్యమాత్యులకూ- రుద్రమ చక్రవర్తిణికీ యిటీవల అందిన వార్తలు.

-----------------------------------------------------

ఇంకా వుంది...

------------------------------------------------------

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


106 views1 comment

1 Kommentar


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
26. Okt. 2022

Kameswari Sista • 5 days ago

తొలి విజయం రుద్రమదేవి నెగ్గినందుకు మాహా ఆనందంగా వుంది.రుద్రమదేవిని పొగడని వారు లేరు.స్త్రీ కాబట్టి క్షమించాడా అనేది ఆమెలో వుంది.జన సమ్మోహాన్ని తట్టుకోలేక పోతున్నారు ఆపలేక ఆవిడ ఖ్యాతి వూరు వాడ పొంగి పొరలి పోతోంది.రుద్రమ దేవి ఎంత మందిని పురుషవేషములో రక్షించింది.రుద్రమదేవి ఓరుగల్లు రాగానే ఊరంతా పండగ సంబరాలు చేసుకున్నారు.శివదేవయ్య చేసినది తప్పు. కాకతీయ సామ్రాజ్య లక్ష్మి దేవి కి తిరకాసు అర్థం కాదు. మాహా తేజస్విని రుద్రమాంబకు యుద్దమే ఆమెకు శరణ్యం.అంకితం అయింది.చాల చక్కగా వివరించావు.

Gefällt mir
bottom of page