కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
Kakathi Rudrama Episode 18' New Telugu Web Series
Written By Ayyala Somayajula Subrahmanyam
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 18 వ భాగం
గత ఎపిసోడ్ లో…
రుద్రమదేవి, అన్నమాంబికతో కలిసి తన జైత్రయాత్రను ముగించి, కాకతి నగరానికి తిరిగి వస్తుంది.
చోళజాతి ప్రభువు తిరుగుబాటు ప్రకటించి, సామంతులు తనకే కప్పం కట్టాలని ప్రకటిస్తాడు.
ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 18 చదవండి..
రుద్రమదేవి అన్యమనస్కంగా వుంటున్నది. ఆమె మనస్సు చిక్కుబడిన దారమువలె గజిబిజిగా నున్నది. శివదేవయ్యామాత్యులు గ్రహించలేని అజ్ఞానులు కాదు.
కాలుతున్న పెనం వలెనున్న కాకతీనగర పరిస్థితి కళ్యాణములకు అనువైన సమయమా? కాదా? అన్నది మాత్రమే చర్చించవలెను. కానీ యిక రుద్రమదేవి వివాహమునకు ఆలస్యము చేయరాదు. ఆమె మనస్సును యింకనూ క్షోభ పెట్టరాదు. ఆమెయూ తనబిడ్డ వంటిది కాదా!
శివదేవయ్యామాత్యులు వున్నపడంగా తమ రాజ్యమునకు రావడము, చాళుక్య వీరభద్ర ప్రభువులు ఆశ్చర్యముతో తేరుకుని-
" స్వాగతము, మహామాత్యులకు- ఆశ్చర్యముగా నున్నది".
శివదేవయ్య నవ్వి- "తాము పిలవక పోయిననూ మేమే వచ్చితిమి" అని ఆయన ఉచితాసనం మీద కూర్చున్నారు.
కూర్చుని- "మీతో చాలా ముఖ్యమైన విషయము మాట్లాడాలని వచ్చాము".
" చిత్తము".
"వీరభద్రప్రభూ! రాజ్యము కత్తుల వంతెనవలె వున్నది. ఎవరు ముఖ్యులో, ఎవరు శత్రువులో అంతు చిక్కదు. సామంతులు కుక్కగొడుగులవలె తలఎత్తుతున్నారు.
అటు కాకతీచక్రవర్తులు అంతిమ ఘడియల అంచున వున్నారు. ఆయన శివ సాయుజ్యము ఏ క్షణములోనైనా చెందవచ్చును. తమ కుమార్తె వివాహము చూడవలెనన్న కోరిక మిక్కుటముగా నుండెను.
రుద్రమదేవి నా బిడ్డవంటిది. వంటిదే కాదు. ఆమె నా కుమార్తెయే. -ఆమె సుఖమును నేను సర్వదా ఆకాంక్షించు చున్నాను.
అదీగాక గణపాంబదేవి భర్త బేతరాజు ప్రభువులు సహృదయులు. వారు చిన్న సామంతరాజులే కావచ్చుగాక. గుణమునగానీ, ఠీవిలోగానీ బంగారు తునక.
మీరు రుద్రమదేవిని చక్రవర్తిణిగా చూడనక్కరలేదు. ఆమెను కర్కశత్వము నుంచి లలిత మృదు స్వభావినిగా, పురుషునినుంచి స్త్రీగా మార్చినది మీరు. మిమ్ములను మా రుద్రమదేవి చక్రవర్తిణిని మీ జీవిత భాగస్వామినిగా చేయవలెనని నా అభీష్టము. అది ఆమె మనస్సులోని కోరిక.
అదీగాక, ఈ వివాహ బాంధవ్యముతో ఈ రెండు రాజ్యములూ ఒకటి కావలెనని - ఇది చాళుక్య లక్ష్మికి నుదుట దిద్దిన కళ్యాణరేఖ కావలెనని మా అభీష్టము."
" ఔను."
"మీ యిష్టమే , మా యిష్టము, మీరు శాసించవలెను. మేము పాటించవలెను."
" మీ సహృదయతకు నా కృతజ్ఞతలు."
వీరభద్రప్రభువు నవ్వినాడు.
"ప్రభూ....యావద్భారత దేశమున ఆంధ్రదేశమున వంటి దేశము లేదు. ఇంత సస్యశ్యామల జనయిత్రి యింకెక్కడా కానరాదు. నేడు రుద్రమదేవి అందరకూ చక్రవర్తిణి కావచ్చును. మీకు హృదయము నివ్వగల అర్ధాంగి కాగలదు. అదీగాక మీకు ముందుగా
తెలియవలసిన మూడు విషయములున్నవి. ఇవి మీకు అంగీకారములు కావచ్చును.
మిమ్ములను బాధించవచ్చును. కానీ స్వచ్ఛముగా చెప్పవలసిన బాధ్యత నాకున్నది.
మీరు రుద్రమదేవిని గాఢముగా ప్రేమించుచున్నారని నాకు తెలుసు. మీరు కాలము, ఆమె ప్రకృతి.
అవిచ్ఛిన్నమైన సృష్టి క్రమణికకు యివి ఆధార భూతములు. కాకతీ చక్రవర్తులు రుద్రమదేవిచే మూడు ప్రమాణములు చేయించుకున్నారు.
మొదటిది- ఆమెయే కాకతీ సింహాసనమును అదిష్టించగల తొమ్మిదవ చక్రవర్తి.
రెండు- ఆమె భర్తకు సింహాసనాధికారము లేదు.
మూడు- ఆమె సంతానమునకూ సింహాసనాధికారము లేదు.
ఆ అధికారము రావలెనన్న, ఆ సంతానము కాకతీ వంశము పేర దత్తత తీసుకొని ఈ సింహాసనమును అప్పజెప్పవచ్చును."
"మరి రుద్రమదేవి ప్రభువుల అభిప్రాయము."
“ఆమె తండ్రిగారి మనస్సు నొప్పించలేక- ప్రమాణము చేసినది"
" అది ఆమె విజ్ఞత."
"ప్రభూ! మీరు బాధ పడుటలేదా?"
" ఎందులకు---? మీ మూడు ప్రశ్నలకు నేను మూడు సమాధానములు చెప్పవలెను.
మొదటిది- ఆమె మాత్రమే కాకతీయ సింహాసనమునకు వారసురాలు. ఆమెకు మాత్రమే ఆ హక్కు వున్నది. అది ధర్మము.
రెండు- ఆమె భర్తతో జీవించి, సహధర్మమును- సృష్టి సహజమైన కోర్కెలనూ తీర్చు కొనగలధర్మ మున్నది. ఆమెకూ- ఆమె భర్తకూ జన్మంచిన కొడుకుకు, తండ్రికి సంబంధించిన రాజ్యమునకు మాత్రమే ధర్మ సమ్మతమయిన హక్కు వున్నది. తల్లి రాజ్యము
పై అతనికి ఎటువంటి హక్కులు, అధికారములూ లేవు.
మూడు- ఆంధ్ర సామ్రజ్యమునకు చోళులు పాలించు విషయములో తోటి సామంతులకూ సరిరాజులకు బాధ కలగవచ్చును.ప్రజలలో వుప్పెన వలె తిరుగుబాటు రావచ్చును."
" వీరభద్రప్రభూ! మీ ఆలోచనా శక్తి , సునిశిత జ్ఞానము నాకు ఆశ్చర్యము కలిగించుచున్నది- మీరు ఒకరికొకరు జన్మించిన కారణ జన్ములు. మీ వివాహము విధిలిఖితము."
"మహామాత్యా, మీ నిర్ణయమునకు మేము బద్దులము." అని భక్తితో శివదేవయ్యామాత్యుల పాదముల నంటినాడు.
"మీ కళ్యాణము శ్రీ సీతారాములవలె ఆదర్శప్రాయము గావలెను. లోకోత్తర చరిత కావలెను."
ఆయన కన్నులలో కన్నీరు జాలువారి-
" కాకతీదేవత- చండీ, చాముండీ, విజయేశ్వరీ- నీ దివ్యమంగళ మహత్తర రూపము వేయి భాస్కరుల కాంతి పుంజములవలె నా కనుల ముందు గోచరించుచున్నది.
దివ్యస్వరూపిణీ- లోకరక్షామయీ ఈ సామ్రాజ్యమును వేయికన్నులతో కాపాడవలసినది నీవే తల్లీ. ఈ లోకమును శాసించగల ధర్మమూర్తి , తేజోమయివి నీవు.మేము సదా నీ ఆజ్ఞాను వర్తులము."
వీరభద్రప్రభువుల అతిథ్యము ఆ రాత్రి స్వీకరించి మరునాడు సూర్యోదయ పూర్వమే రధము నెక్కి , కాకతీనగరము వైపుకు ప్రయాణించినాడు.
---------------------------------------------------
రాజ్యవైద్యులు చెన్నాప్రగడ రుద్దకంఠంతో-
"శ్రీశ్రీ గణపతిరుద్రదేవ చక్రవర్తులు యింక మనకు లేరు" అని చెప్పినారు.
శివదేవయ్యలు మాటలు దక్కి నిలబడియున్నారు.
రుద్రమదేవి అంతఃపురం నుంచి వున్నట్టే వచ్చింది.
గణపతిదేవుల యిళ్ళాళ్ళు నారాంబ, పేరాంబలు శోకదేవతల వలె భర్త పాదముల మీద పడినారు.
ప్రసాదిత్యప్రభువు కబురు అందీ అందగానే, ఆఘ మేఘాలపై , గుర్రమునండి ఒక్క దుముకు దుమికి లోనికి వచ్చి , చిత్తరువులోని బొమ్మవలె బిత్తర పోయినాడు.
కాకతీచక్రవర్తుల అస్తమయము సామ్రాజ్య మంతయూ తెలియక ముందే, నగర రక్షణకు కావలసిన కట్టుదిట్టము లన్నియూ జరిగినది. రాచ నగరుకు వచ్చే రాజమార్గ
ములన్నీయూ దిగ్భందము చేయబడినవి.
నమ్మకమైన సామంతరాజులందరికీ పరాయిరాజులు దండయాత్రలు చేస్తే అణచివేయడానికి అనువైన ఆజ్ఞలన్నీ జారీచేయబడినవి. ఇందులో బాధ్యతలన్నీ స్వీకరించడానికి నగర సైన్యరక్షణకు ప్రసాదిత్య నాయక ప్రభువునకూ, బాప్పదేవనాయక ప్రభువునకూ అధికారము లివ్వబడినవి. రాజ్యమంతా వేగులు అప్రమత్తులై వున్నారు.
అన్నమాంబిక దుఃఖంతో వాలిపోతున్న రుద్రమాంబ ముఖమును తన వక్షానికి లాక్కొని " అక్కా" అంది.
ఈ దుఃఖము తీరునది కాదు.
అఖండసామ్రాజ్యమును కంటి చూపుతో శాసించగలిగిన అష్టమచక్రవర్తి శ్రీశ్రీగణపతి రుద్రదేవ చక్రవర్తి శివారాధన చేసుకుంటూ - వెనక్కు వాలిపోయి, శివ
సాయజ్యం పొందారు. ఆయన ముఖంలో తేజస్సు పోలేదు.
శివదేవయ్యలు ,రుద్రమదేవి చక్రవర్తిణి దగ్గర నిలబడి ,,
"రుద్రమదేవి తల్లీ. మీరు దుఃఖము నుంచి కోలు కొనవలెను. ఇంకనూ మీరు చేయవలసిన బాధ్యతలు చాలా వున్నాయి. శత్రువులు మీ దుఃఖమును అలుసుగా
తీసుకొనరాదు. తండ్రిగారు మీ భుజములపై విడిన కార్యములు మీరు పాటించి తీరవలెను."
అన్నమాంబిక రుద్రమదేవి భుజములు పట్టుకుని,
"అక్కా!" అమ పైకి లేవదీసినది.
సామ్రాజ్యమంతా గణపతిరుద్రదేవులు పరమ పదించారనే వార్త- వెలుగూ- గాలీ మోసుకుని పోయినాయి. ఎటు చూసినా విషాదమే. నిశ్శబ్ధమే.
రుద్రమదేవి తన శయనాగారము చేరి - అన్నమాంబిక వొడిలో తల పెట్టుకుని చిన్నపిల్లవలె వెక్కి వెక్కి ఏడ్చినది.
ఇద్దరూ ఎంతసేపటి వరకో దుఃఖము నుంచి కోలుకోలేదు.
----------------------------------------------------------------
రాత్రి సందెపొద్దు దాటిన దగ్గరనుంచీ, అర్ధరాత్రి వరకూ ఆ ఏకాంత మందిరంలో కాకతీమహాసామ్రాజ్య మహామాత్యులు శివదేవయ్యలు, కాకతీ సింహాసన మదిష్టించిన చక్రవర్తిణీ రుద్రమదేవీ చాలా విషయాలు మాట్లాడుకున్నారు.
అవి ప్రస్తుత రాజకీయ స్థితిగతులు, కన్నేసి వుంచవలసిన శత్రురాజులనూ,ప్రభుభక్తి పరాయణులైన మిత్రరాజులనూ వేరు వేరు గా చూసినారు.
నిన్నటి దుఃఖస్థితి నేడు లేదు. ఆమె మనస్సు ఆటుపోటులున్న సముద్రము వలె లేదు. నిండుగా, గంభీరంగా ప్రవహించే నదీమతల్లి వలె వున్నది.
ఆమె కన్నులు తేజస్సుతో ప్రతిఫలించినవి. ముఖం రాగవర్ణ శోభితమైంది.పెదవులపై సుందర మందహాసం వెలిగింది. శివదేవయ్య కనులకు ఆమె ప్రాణం పోసుకుని అంతఃపురంన అవతరించిన కాకతీ సామ్రాజ్యలక్ష్మివలె కనిపించింది.
ఆమె మృదువైన కంఠంతో--
"బాబయ్యగారూ, నా వొక్కసుఖం కోసం , ఈ అనంత సామ్రాజ్యమును విడిచిపెట్టలేను. ప్రజలను దుఃఖంనకు వదలలేను. నా జీవితం లోక కళ్యాణం. పాపసంహారం.
మీరు నన్ను విస్వసించగలరని నా నమ్మకం. మీ కుమార్తె ఎన్నడూ కాంక్షలకు లోబడి ,కర్తవ్య నిర్వహణలో తప్పుచెయ్యదు."
శివదేవయ్యామాత్యులు వడలు జలదరించినది. అదివరకెన్నడూ యిటువంటి స్థితి రాలేదు.
"ఇది నా తపస్సు తల్లీ! నా చిరకాల వాంఛితము. నీ తాతల ముత్తాతల, తల్లిదండ్రుల ఆత్మలు నిన్ను ఆశీర్వదించుగాక. కాకతీదేవి నిన్ను కరుణించు గాక. నీ కత్తికి ఎదురు లేదు. నీ దీక్షకు తిరుగులేదు. రుద్రమదేవి అపర పార్వతి అంశ. అమ్మా...నేను వెళ్ళి వస్తాను."
ఆయన తల వంచుకుని గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. రుద్రమాంబిక లో చాలా మార్పలు సంబవించినవి. ఆమె రాజ వ్యవహారములలో చురుకుగా పాల్గొనుచున్నది. వేగులను రాబట్టి విషయములను గ్రహించుచున్నది.
సేనాపతులను రావించి యుద్దకార్యములను ముచ్చటించుచున్నది. కానీ, రాత్రి ఏకాంత మందిరములో వున్నప్పుడు ఆమె మృదుల భాషిణి. చిరునవ్వుల తుట్టె.
ఉత్త పిచ్చిపిల్ల. నవ్వును. ఆడును. పాడును. మరల వూరు తెలవారదు. చీకటి విరగదు. పక్షులు గూళ్ళనుంచి లేవవు. ఆ చిరుచీకటిలో లేచి, బారాటి వెంట్రుకలను ముడివైచి " చెల్లీ" అని అన్నమాంబికను లేపును.... ఒక్క పిలుపుకు ఆమె నిద్రలేచును.
ఆమె తన తలవెంట్రుకలను పైకి ఎగకట్టును. ఆ ఇద్దరూ పురుషులవలె కఠినులవుదురు. కత్తులు ఖణేల్ మనును. ఆ మోతకు అంతఃపురము దద్దరిల్లును. కత్తి యుద్దములోని అన్ని మెలుకువలూ తెలుసు కోవాలనుకున్నారు. మెరుపువేగంతో శత్రువు వక్షంను చీల్చే విధానం వారికి అలవడింది.
జాతిగుర్రములపై వేగముగా ఎక్కుట, దూకుట, అమితమైన వేగముతో ప్రయాణించుట రధాగ్ర భాగమునుండి గుర్రాలపై దూకి స్వారీ చేయుట , విల్లంబులు ప్రయోగించుట , బాణంతో సూటిగా నిర్ణయించబడిన నిర్దిష్టలక్ష్యంను గురి తప్పక ఛేదించుట.
ప్రతి ఉదయం ఇదే తంతు. ఆ తరువాత రాజ్య కార్యనిర్వహణ. మంత్రాంగావగాహన…
ఆమెకు నేడు అన్నియూ తెలుసు. పాడి, పంట , వర్తకం, నదీజలాలలోని జీవరాశుల వ్యాపారము, సముద్రపు వాణిజ్యము, అడవులపైన ఆదాయం , రాబట్టవలసిన సుంకం , ప్రజల అవసరమునకుమార్గాలు, విశ్రాంతి మందిరములు, గుళ్ళూ, గోపురములు, కరువు కాటకాలలో ప్రజలకు వుచితంగా యివ్వవలసిన ధనధాన్యాలు..
శత్రువుల ఎత్తులు దానికి పై ఎత్తులు.ఇట్లా వింటే ,అట్లా అల్లుకుపోయేడిది.
ఆర్థికశాస్త్రవేత్తలు- యుద్దరచనా నిపుణులు , ఉత్తమ సలహాదార్లు.. వీటితో ఆమెకు సమయం చాలదు. ఊపిరందదు. రోజుకు పద్దెనిమిది గంటలు, ఐనా ఆమె అలవదు,విసుగుకొనదు. పువ్వువలె నిర్మలముగా వెన్నెలవలె స్వచ్ఛముగా వుండును.
మరల కాకతీ సామ్రజ్యమున కొత్తపొద్దు పొడిచినది. పునరీజ్జీవనము కలిగింది. కళలు, నృత్యములు, సంగీతములు, సాహిత్యము, శిల్పము, చిత్రలేఖనము ఎన్నో విధములైన ప్రజారంజక కార్యక్రమములు.
గ్రామపెద్రలు, కరణములు , పటేలులు, పట్వారీలు, పంచాయితీ నిర్వాహకులు , అందరికీ ఖచ్చితమైన మార్గదర్శక సూత్రాలు నిర్ణయించబడినవి.
గుర్రములపై సైనికులు రాజ్యమంతా తిరుగుచున్నారు.
వేగులు మారువేషాలలో దేశమంతటా తిరుగుచున్నారు. వార్తలు గుర్రములపై అంచెలంచెలుగా రాజధానికి చేరును.
కఠినదండనములు మొదలయినవి. సామంత రాజులు ఆశ్చర్యపోయినారు.ఇంత తక్కువ వ్యవధిలో ఈమె సుఖశాంతులను అనితరసాధ్యంగా సాధించింది.
గుంటూరునాగయ్య నాయకుని జయించుటయే , ఈ చక్రవర్తిణి ప్రతిభకు ప్రత్యేకసాక్ష్యము.
అంతఃపురజనానికి రుద్రమదేవిని గురించి చాలా ఆశ్చర్యం వేసింది. చాలా ఆశ్చర్యం పొందేవారు కూడా. ఈమె తమతో వున్నప్పుడు వుత్త బాలిక. అభము, శుభము తెలియని అతి మామూలు రాచకన్య. కానీ కర్తవ్యమున కఠిన మనస్కురాలు.
ఒక చండిక- రాత్రి కన్నులతో నవ్వగలదు, నవ్వించగలదు. -ఉదయము అదే కన్నులతో నిప్పులు కురిపించగలదు. మండించగలదు.
ఎంత ఆలోచించినా ఆమె తనకు అర్థం కాదు. అందువల్లనే కదా గణపతి రుద్రదేవ చక్రవర్తులు ఆమెకు తప్ప మరొక్కడికి రాజ్యాదికారము లేదని శాసించెను. అదే కదా శివదేవయ్య బాబయ్యల అభీష్టము....
ముందుతరంలో స్త్రీమూర్తిని చరిత్రపుటలలో ఎక్కించరా! వీరనారిని స్త్రీజాతి ఆదర్శముగా
తీసుకొనదా?
ఇప్పుడు ఓరుగల్లు స్థితే మారినది.సైనిక శిక్షణావిధానము మారింది. పరిపాలనలో మార్పులు వచ్చాయి. గుర్రాలు సుశిక్షసైనికులవలె పరుగులెత్తుతాయి. అగడ్తలు
దూకుతాయి. ఎత్తయిన అడ్డకట్టడాలు కూడా యిట్టే దూకుతాయి. ఏనుగులు శబ్దాన్ని పట్టి అటూ యిటూ పరుగులెత్తుతాయి. సైనికులు శత్రుధుర్భేద్య శత్రు శ్రేణులని ఎలా నిర్జించాలో, యుద్ద బంధానాల్ని కొత్త వ్యూహాలతో ఛేదించాలనే నేర్చుకున్నారు.
కోటచుట్టూ, కందకాలు అమిరాయి. కోట గోడలు చాలా పటిష్టంగా తీర్చిదిద్దబడ్డాయి. బురుజుల వెనక నిలబడి సైనికుల బాణాలు - శత్రువులకు చిక్కకుండా, శత్రు సైన్యాల తలలు ఛేదించే విధానము రూపొందించబడింది.
బావులు, చెరువులు, ధనాగారాలూ, ధాన్యాగారాలూ, యుద్దసామానులు దాచే రహస్య మందిరాలు .. యిట్ల ఎన్నో కొత్త విధానాలు వచ్చాయి.
భవిష్యత్తులో ఏ శత్రురాజయినా వస్తే - ఎంత తేలికగా నిర్జించవచ్చునో అన్ని పద్దతులూ అమలు చేయబడ్డాయి.
-----------------------------------------------------
ఇంకా వుంది...
------------------------------------------------------
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
Comments