కావడి ధర్మన్న
- Madhupatra sailaja Uppaluri

- 2 hours ago
- 5 min read
కావడి ధర్మన్న, ధర్మన్న కథ, తెలుగు ప్రేరణాత్మక కథ, గ్రామ జీవితం, మానవత్వం, సేవా గుణం, గ్రామ సేవ, నీటి సేవ, తెలుగు సామాజిక కథ, Inspirational Telugu Story, Humanity Story, Village Story, Service to Society

Kavadi Dharmanna - Telugu Inspirational Story | Madhupatra Sailaja Uppaluri
కావడి ధర్మన్న - తెలుగు ప్రేరణాత్మక కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి
Published in manatelugukathalu.com on 17/07/2026
గొప్పవారిగా నిలవడానికి సంపద అవసరం లేదు... పదవి అవసరం లేదు... ఒక మంచి మనసు చాలు. "కావడి ధర్మన్న" కథలో ఒక నిరుపేద వ్యక్తి తన జీవితమంతా గ్రామ ప్రజలకు నీళ్లు మోసి సేవ చేస్తాడు. అతని మరణం తర్వాత కూడా అతని సేవాస్ఫూర్తి గ్రామ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సేవే శాశ్వత కీర్తిని తెస్తుందని చాటిచెప్పే హృదయస్పర్శి కథ ఇది.
ప్రతి సంవత్సరం ఎండాకాలం సెలవలు రాగానే ఊటికో, సిమ్లాకో వెళ్ళటం చాలా మందికి అలవాటు. అయితే నేను మాత్రం నా కుటుంబాన్ని ఇతర ప్రదేశాలతోపాటు నా పెద్దలు నివసిస్తున్న ఊరికి తప్పక తీసుకువెళ్తాను.
"వయ్యారివంపులతో సాగే సెలయేరు, ఊరి మధ్యలో ఉన్న శివాలయం”తోపాటు ఆ ఊరి ప్రత్యేకతలను, ఆ గ్రామంలోనే నివసించి ‘కీర్తిశేషులు’గా మారిన గొప్ప వ్యక్తుల జీవిత విశేషాలను పిల్లలకు వివరించి, నేను చదువుకున్న స్కూలు, మా మాష్టారుగారి ఇల్లు చూపించి, శివాలయంలో మా నాన్నగారితో కలిసి చూసిన నాటకాల గురించి చెప్పి, వారిలో విశాల దృక్పథం, సామాజిక స్పృహ ఏర్పడే బాటలను వేయటానికి ప్రయత్నిస్తున్నాను.
“తాతగారు చెప్పే నీతికథలను వింటూ, బామ్మ వండిన కమ్మని వంటకాలను తింటూ, చెరువు గట్లమ్మట తిరుగుతూ, మామిడి తోటలలో ఊయలలూగుతూ, కాలాన్ని నిముషంలా గడిపి, ఆ ఆనంద సమయాన్ని మది నిండా నింపుకుంటూ, “మళ్ళీ వేసవి సెలవలు ఎప్పుడు వస్తాయా?” అని ఎదురుచూసే నా పిల్లలు కూడా చాలా ఇష్టంగానే గ్రామానికి వచ్చేవారు.
‘సీతాపురం’ అనే గ్రామంలో పుట్టి పెరిగిన నేను ఉద్యోగంలో చేరేదాకా అమ్మానాన్నల దగ్గరే ఉండేవాణ్ణి. అమ్మా నాన్నలతో పాటు మా తాతగారు, నానమ్మ కూడా అక్కడే ఉండేవారు. ఊరిలో ఉన్న పొలాలను కౌలుకిచ్చి సొంత ఇంట్లో హాయిగా ఉంటున్నారు.
ఇంటికి కూడా ఎప్పటికప్పుడు కావలసిన మరమ్మత్తులను చేయిస్తూ, ఏసీలను కూడా అమర్చి, మేము వెళ్ళినప్పుడు పిల్లలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేశారు.
“మాతోపాటు వచ్చేయండి, అందరం కలిసి ఉండొచ్చు. పిల్లలతో మీకు కాలక్షేపమవుతుంది” అంటే, “అక్కడకు వస్తే మీ పనులలో మీరు, చదువులతో పిల్లలు బిజీగా ఉంటారు. మాకేమి తోస్తుంది? ఇక్కడైతే ఈ ఊరి జనమే మా పిల్లలు. వాళ్ళు మాకు, మేము వారికి సాయం చేసుకుంటాం. మీరొచ్చి ఉంటున్న ఆ పది రోజుల మధుర స్మృతులను తలచుకుంటూ, మాకు తెలిసిన మనుష్యుల మధ్యన ఉండటమే మాకు ఇష్టం” అనేవారు.
ఇవన్నీ ‘కావడి ధర్మన్న’ నోటి నుండి వచ్చిన మాటలే అనిపిస్తాయి నాకు. ఒక్కో సంవత్సరం మా ఊరిలోని విశిష్ట వ్యక్తుల గురించి, వారు చేసిన గొప్ప పనుల గురించి పిల్లలకు చెప్పే నాకు, ఈ ఏడాది అకస్మాత్తుగా ‘కావడి ధర్మన్న’ గుర్తుకు రావటంతో అతని జ్ఞాపకాలు పిల్లగోదావరిలా తడిమాయి నన్ను.
ఈ ఏడాది ‘నాథులా పాస్’, గ్యాంగ్‌టాక్ అందాలను ఆస్వాదించి, తిరుగు ప్రయాణంలో మా ఊరికి కారులో బయలుదేరాం. ఊరికి వెళ్తుండగానే, “మనకు పచ్చని చేలు స్వాగతం పలుకుతాయా?” అని అడిగారు పిల్లలు.
“ఎండాకాలం మొదలయ్యింది కదరా! పంటలు చేతికొచ్చే కాలం. బీటలు వారిన పుడమితల్లి జలధారలకై ఆత్రంగా ఎదురుచూసే సమయమిది. అయితే వంపులు తిరిగిన సెలయేరు పక్కన ఆకాశమంత ఎత్తులో పచ్చగా కనిపించే కొబ్బరి తోటలు, తాటి తోపులు, నిండు గర్భిణిలా కాయలతో వంగిన గున్న మామిడి చెట్లు మీ కళ్ళకు ఆనందాన్ని ఇస్తే, చల్లని కొబ్బరినీళ్ళూ, మబ్బు రంగులో ఉన్న లేత తాటి ముంజలు, మరల మరల తినాలనిపించే తీయని మామిడి పళ్ళు మీ కడుపు నింపుతాయి” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాను.
ప్రకృతి గీసిన అద్భుతమైన అందాలను వీడియో తీస్తున్న పిల్లలు “మీ స్కూలు వచ్చింది నాన్నా!” అన్నారు.
“కిందటేడాది మా స్కూలు విషయాలు కొన్ని చెప్పాను కదా. ఇప్పుడు మనం మరొక ప్రత్యేకమైన ప్రదేశానికి వెడదాం” అంటూ ఊరి మధ్యనున్న వాటర్‌ట్యాంక్ దగ్గర కారును ఆపాను. అంతా దిగిన తరువాత “పదండి, దగ్గరకెళ్ళి ఈ వాటర్‌ట్యాంక్ విశేషాలను తెలుసుకుందాం” అన్నాను.
ట్యాంక్‌పై “ధర్మన్న వాటర్‌ట్యాంక్” అన్న పేరును చూసి “ఏమిటిది? ఇది గవర్నమెంట్ స్కీములోనిది కాదా? లేక ఆ ధర్మన్న అనే ఆయన కట్టించాడా?” అని అడిగింది నా శ్రీమతి.
“మరి ఇది అంత గొప్ప వ్యక్తి గుర్తుగా కట్టింది. ఆ గట్టు మీద కూర్చుని అతని విషయాలను మీకు వివరంగా చెబుతాను, పదండి” అని ఆ వైపు కదిలాను.
“ఈ ధర్మన్న ఎవరు నాన్నా?” అని అడిగారు పిల్లలు.
అవి నేను ఈ ఊరి ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న రోజులు. ఇక్కడ ‘ధర్మన్న’ అనే పేద వ్యక్తి నివసించేవాడు. అందరి ఇళ్ళకు కావడితో నీళ్ళు తెచ్చి పెడుతూ ఉండటంతో అతనిని ‘కావడి ధర్మన్న’ అని పిలిచేవారంతా. ‘నా’ అన్నవారెవరూ లేని ధర్మన్న ఊరిలోని వారు ఏ పని చెప్పినా కాదనకుండా చేసి పెట్టేవాడు. వారు పెట్టే అన్నం తింటూ, డబ్బిస్తే తీసుకుంటూ పెరిగాడు.
ఈ ఊళ్ళో అప్పటికి వాటర్‌ట్యాంక్ నిర్మించలేదు. కాలువ పక్కనున్న బావులలోని నీటిని, చెరువులోని నీటిని మా అవసరాలకు వాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎండాకాలం వస్తే చెరువు ఎండిపోయి, బావి నీళ్ళే ఆధారమయ్యేవి మాకు.
అందుకనే ఎండాకాలంలో ధర్మన్నకి విపరీతమైన పనుండేది. అంత శ్రమలోనూ పశువులను ఇళ్ళకు తోలుకొచ్చే వేళకు ఈ ప్రదేశంలో రెండు పెద్ద తొట్ల నిండుగా నీరు పట్టి ఉంచి, సొంత బిడ్డలకు నీరందించినట్లుగా వాటి దాహార్తిని తీర్చేవాడు ధర్మన్న. అదే సమయంలో ఇప్పుడు మనం వస్తున్నట్లుగానే ప్రతి ఇంటికి బంధువులు రావటం, పెళ్ళిళ్ళు, పేరంటాలు వచ్చి, ధర్మన్నకు క్షణం తీరిక దొరికేది కాదు.
మార్చి నెలలో మా అందరికీ ఒంటిపూట స్కూళ్ళుండేవి. బడికి వెళ్ళే పిల్లలందరికీ బావి దగ్గర చల్లటి నీళ్ళను తాగించేవాడు. నీళ్ళు తాగి ముఖాలు కడుక్కొని సేదతీరి ఇంటికి చేరే వాళ్ళం మేము. సాయంత్రం వరకు పొలాలలో పనులు చేసి అలసిపోయి ఇంటికి వెళ్ళే కూలీలకు ఆ బావి దగ్గర కూర్చుని, పిలిచి మరీ నీళ్ళిచ్చేవాడు. అందుకే ధర్మన్నకు కూటికి, గుడ్డకు లోటు ఉండేది కాదు. ఊరిలోని ప్రతి కుటుంబం అతనిని ఆదరించేది.
ఎవరయినా “ఏరా! ధర్మన్నా! నీకు దగ్గర దగ్గరగా 50 ఏళ్ళు వస్తున్నాయి కదా! శక్తికి మించిన పని ఎందుకురా చేస్తావు?” అంటే, “నాకు వచ్చిన పని ఇది ఒక్కటే కదండి. అంతేకాక ఈ కావిడి, ఆ కుండలు రెండూ మట్టిలో నుండి వచ్చాయి. అలాగే ఈ నీళ్ళు కూడా ఆ మట్టి నుండే వచ్చాయి. నేను మట్టిలో కలిసే దాకా ఈ బంధం కొనసాగాల్సిందే” అనేవాడు ధర్మన్న.
ఓసారి ఎండాకాలంలో ఓ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి వచ్చింది. కావిళ్ళతో నీరు తెచ్చి పోస్తున్నారు ధర్మన్నతోపాటు మరో నలుగురు మనుష్యులు. మగపెళ్ళి వారి విడిదిలో కూడా ఓ నాలుగు డ్రమ్ముల నీళ్ళు పెట్టమని పురమాయించాడు ఆ యజమాని. మిగిలిన వారంతా ఓ మూడు ట్రిప్పులు నీళ్ళు పోసి అలసిపోయి పడుకున్నారు. ధర్మన్న మాత్రం మిగిలిన డ్రమ్ములనన్నింటినీ నీళ్ళతో నింపేశాడు.
పెళ్ళి పూర్తయ్యి అందరూ భోజనాలకు కూర్చునేటప్పటికి రాత్రి తొమ్మిది గంటలయ్యింది. చివరిగా పనివాళ్ళు, పాలేళ్ళు, గూడెంలోని వారంతా భోజనానికి వచ్చారు. ఆ యజమాని అందరినీ పలకరిస్తూ “ధర్మన్న ఏడిరా? భోజనానికి రాలేదు. ఎక్కడున్నాడో చూసి రండి” అని ఓ ఇద్దరిని పంపించాడు.
ఆ ఇద్దరూ వెళ్ళి చూడగా “స్ట్రీట్‌లైట్ వెలుగులో చేతిలో చేదతో, బావి పక్కన అచేతనంగా పడి వున్న ధర్మన్న, పక్కనే విరిగిన కావడి” కనిపించాయి. కబురు తెలిసిన ఊరంతా అక్కడికి చేరుకున్నారు. సొంత బంధువు దూరమైనట్లుగా ఊరు వూరంతా బాధపడింది.
తాతగారు, నాన్నలతో కలిసి నేను కూడా అక్కడికి వెళ్ళాను. ధర్మన్న చేతితో ఇచ్చిన నీళ్ళు తాగిన నాకు ధర్మన్న ఏదో సందేశం ఇచ్చినట్లయింది.
వెంటనే “తాతగారూ, ప్రభుత్వం వారు మన గ్రామానికి నీళ్ళ కొరకు ఏదో చేసేదాకా ఎందుకు మనం ఎదురుచూడాలి? ఈ నీళ్ళ బాధలు తీరే దారి చూడాలి కదా? మన గ్రామ ప్రజలందరం కలిసి ఓ వాటర్ ట్యాంక్ నిర్మించుకుందాం. అందుకు అవసరమయ్యే డబ్బును మన గ్రామ ప్రజలందరి నుండి విరాళాల రూపంగా సేకరిద్దాం. తక్కువైన దానిని మనమే సర్దుదాం.
ప్రతి ఇంటికి నీటిని అందిద్దాం. వేసవికాలంలో భూగర్భ జలాలతోను, మిగిలిన కాలం చెరువు నీటితోను ట్యాంక్‌ను నింపితే మన గ్రామానికి నీటి సమస్య ఉండదు కదా! ఇదే మనం ధర్మన్నకు ఇచ్చే నివాళి అవుతుంది” అన్నాను.
నా సలహా వారికి నచ్చడంతోనూ, ఊరి అందరికీ ఉపయోగపడేది కావటంతోనూ అందరి విరాళాలతో ఆరు నెలలలో ట్యాంక్ నిర్మాణం పూర్తి చేసి ‘ధర్మన్న’ పేరుతో ప్రజలందరికీ నీరు అందేలా చేశారు తాతగారు.
అలా ‘కావడి ధర్మన్న’ పేరు గ్రామస్థుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. “చూశారా పిల్లలు! ఓ చదువు సంధ్యలు లేని సామాన్య నిరుపేద వ్యక్తి తన సేవలతో తరతరాలకు ఎలా గుర్తుండిపోయాడో!” అన్నాను.
“నాన్నగారూ! అద్భుతమండి! అతని ఫోటో కూడా ఉంటే చాలా బాగుండేది కదా” అన్నారు ఈ తరంలోని నా పిల్లలు ధర్మన్నకు నివాళులర్పిస్తూ.
*****
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి కొన్ని ఇతర రచనలు:
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు. గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.









Comments