top of page
Original.png

మా అమెరికా అన్నయ్య

మా అమెరికా అన్నయ్య, అన్నాచెల్లెళ్ల అనుబంధం, కుటుంబ విలువలు

1960లలో అమెరికా నుంచి వచ్చిన అన్నయ్యను ఆనందంగా ఆహ్వానిస్తున్న తెలుగు కుటుంబం
1960లలో అమెరికా నుంచి వచ్చిన అన్నయ్యను ఆనందంగా ఆహ్వానిస్తున్న తెలుగు కుటుంబం

Maa America Annayya Telugu Sweet Memories Story | Varanasi Sudhakar

మా అమెరికా అన్నయ్య - తెలుగు మధుర స్మృతుల కథ | వారణాసి సుధాకర్

Published in manatelugukathalu.com on 23/07/2026


1960లలో అమెరికా వెళ్లడం ఒక గొప్ప విశేషం. అలాంటి రోజుల్లో అమెరికాలో స్థిరపడిన అన్నయ్య చుట్టూ తిరిగే కుటుంబ జ్ఞాపకాలు, చెల్లెలి అమాయక అనుభవాలు, ప్రేమ, పెళ్లి, బంధాల విలువలను హృద్యంగా చెప్పే కథే "మా అమెరికా అన్నయ్య". ప్రతి కుటుంబం తనలో దాచుకున్న మధుర స్మృతులను గుర్తుచేసే ఈ కథ పాఠకులను గతకాలపు ఆప్యాయ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.


"గౌతమీ, నిన్ను హెడ్ మిస్ట్రెస్ గారు పిలుస్తున్నారు" అని నా ఫ్రెండ్ వాసంతి చెప్పేసరికి, నాకు గుండెలు దడదడా కొట్టుకోవడం మొదలయ్యాయి!


క్లాసులో అందరూ నాకేసే చూస్తున్నారు. 

"ఇవేళ దీనికి మూడింది" అన్నట్టు చూస్తున్నారు !


మా గర్ల్స్ హైస్కూల్ హెడ్ మిస్ట్రెస్ నాగరత్నం గారంటే స్కూలు మొత్తం అందరికీ హడలే ! ఆవిడ నవ్వడం నేనెప్పుడూ చూడలేదు ! ఎప్పుడూ బెత్తం పట్టుకుని, స్కూలంతా తిరుగుతూ, లేటుగా వచ్చిన పిల్లల్ని ఆ బెత్తంతో కొడుతూ, లేటుగా వచ్చిన టీచర్లని సీరియస్ గా హెచ్చరిస్తూ ఉండేది.


8వ తరగతి చదువుతున్న నేను, హడావిడిగా పరిగెత్తి, గొంతు తడారిపోతుంటే, "ఎం.నాగరత్నం, ఎం.ఏ., బి.ఇడి." అనే బోర్డు వంకే చూస్తూ, ఆవిడ ఛాంబర్ గుమ్మం ముందు నిలబడ్డాను.


"అక్కడే ఆగిపోయావేం, లోపలికి రా" అని ఆజ్ఞాపించింది. 


కాళ్ళు వణికిపోతుంటే, చేతులు కట్టుకుని, ఆవిడ ముందు నుంచున్నాను. ఏదో పెద్ద కవరు చేతిలో పట్టుకుని చూస్తూ, "నీకు ఇప్పట్నుంచే స్కూలుకి ఉత్తరాలు రాసే ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నమాట, ఎవరీ శ్రీనివాసు?" అంది సీరియస్ గా !


అంత పెద్ద కవరు...అందులోనూ నాకు...

ఎవరు రాసి వుంటారా అని భయపడిపోతున్నాను.


"నీకు తెలియకుండానే నీ పేరుతో ఉత్తరాలు రాసేస్తున్నాడా, ఆ శ్రీనివాసు?" అంది మరింత కోపంగా.


నేను తెలివైనదాన్నే కానీ, 1960ల్లో నేను హైస్కూల్లో చదివే రోజుల్లో, టీచర్లని, ముఖ్యంగా హెడ్ మిస్ట్రెస్ ని చూస్తే, నోట మాట వచ్చేది కాదు!


" క..క..కవరు ఒకసారి చూడొచ్చాండీ ?" అన్నాను, తడబడుతూనే...


ఇచ్చింది.


కవరు మీద చేతివ్రాత చూశాక వెలిగింది, అది మా అమెరికా అన్నయ్య అక్కడి నుంచి రాసిన ఉత్తరం అని !


అసలు స్కూలుకి ఉత్తరాలు రావడం అంటే తెలియని ఆ రోజుల్లో, మా అన్నయ్య నన్ను సర్ప్రైజ్ చేద్దామని రాశాడని, తర్వాత తెలిసింది.


"మా అన్నయ్య అమెరికా నుంచి రాశాడండి" అన్నాను కొంచెం ధైర్యంగా.


ఆవిడకి కొంచెం అనుమానం వచ్చినట్టుంది,

"స్కూల్లో ఆడపిల్లలకి వచ్చే ఉత్తరాల్ని మేము తెరిచి చూడొచ్చని తెలుసుగా ?" అంది. 


"తెలుసండి" అన్నాను, బెరుకుగానే...


చిన్న కత్తెరతో ఆ కవరుని కత్తిరించి, లోపలున్న పెద్ద ఉత్తరాన్ని బయటకు తీసి, కొద్దిగా చదివింది...


"ప్రియమైన చెల్లెలు గౌతమికి, అన్నయ్య ఆశీర్వదించి రాయునది" అని చూసింది కాబోలు, కొంచెం బిత్తరపోయి, దాంట్లో వున్న ఫోటోలు బయటికి తీసింది.


ఆరోజుల్లో నలుపు తెలుపు ఫొటోలు తీయించుకోవడమే అరుదు. నాలుగైదు రంగుల ఫోటోలు చూసేసరికి ఆవిడ మొహంలో రంగులు మారిపోవడం చూశాను.


1960ల్లో, అమెరికా ఎక్కడుందో, అక్కడ జీవితం 

ఎలా ఉంటుందో, చాలామందికి తెలీదు. నాలాంటి హైస్కూలు విద్యార్థులకయితే, "మ్యాప్ పాయింటింగ్"లో ఒక ప్రశ్న వుండేది. అందులో, ఖండాలు, సముద్రాలు గుర్తించడం మాత్రమే వుండేది.


ఒకసారి పరీక్షలో, "సముద్రముల పేర్లు వ్రాయుము" అంటే, "పాల సముద్రం" పేరు కూడా రాసేశాను !

😀


మా శ్రీనివాసన్నయ్య ఆ రోజుల్లోనే బి.ఎస్.సి. పాసవగానే అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ నయాగరా జలపాతం దగ్గర, పెద్దపెద్ద 100 అంతస్తుల భవనాల దగ్గర తీసుకున్న రంగుల ఫోటోలు, నాకు పంపించాడు.

(ఆ రంగుల ఫొటోలు మా క్లాసులో అందరికీ చూపిస్తూ, షైనయిపోవడం భలేగా వుండేది!)


అప్పటిదాకా బుసలు కొట్టిన మా నాగరత్నమ్మ గారు, చిరునవ్వుతో, "మీ అన్నయ్య అమెరికానా, ఎప్పుడూ చెప్పలేదేం?" అంటూ, ఆ కవరు, ఫొటోలు నాకిచ్చింది.


నేను వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే...

"మీ అన్నయ్యకి పెళ్ళయిందా ?" అంది ! 


"మా అన్నయ్య పెళ్ళిగొడవ ఈవిడకి ఎందుకు ?" అనుకుని,  "లేదండి, మా నాన్నగారు సంబంధాలు చూస్తున్నారు, టీచర్ !" అన్నాను వినయంగా...


💐💐


సాయంత్రం మా ఇంటి దగ్గర మా గ్యాంగుతో తొక్కుడుబిళ్ళ ఆడుకుంటుండగా, 

"గౌతమీ, మీ హెడ్ మిస్ట్రెస్" అన్నారు, ఎవరో...


గేటు తీసి చూస్తే, "గౌతమీ, మీ నాన్నగారున్నారా ?" అని నవ్వుతూ రిక్షాలోంచి పళ్ళబుట్టతో దిగింది...

ఎప్పుడూ నవ్వని మా నాగరత్నం టీచర్ !


"మా నాన్నగారితో ఈవిడకి ఏం పని ?" అనుకుంటూనే, "ఉన్నారు టీచర్, రండి !" అని నమస్కారం పెట్టాను.


బెత్తంతో తప్ప మమ్మల్ని ఎప్పుడూ తాకని మా టీచరు, నా భుజం మీద చెయ్యి వేసి, నవ్వుతూ లోపలికి నడిచింది. మా నాన్న ఎదురొచ్చి, నాగరత్నం టీచర్ గారిని ఆహ్వానించి, లోపలికి తీసుకెళ్ళారు. 


చివరికి తెలిసింది ఏమిటంటే, మా నాగరత్నం టీచర్ గారి కూతురు, మా స్కూల్లోనే ఎస్.ఎస్.ఎల్.సి. చదువుతున్న, బుర్ర తక్కువగాను, ఒళ్ళు ఎక్కువగానూ వున్న, మేము "గండుపిల్లి" అని నిక్ నేమ్ పెట్టుకున్న, పొగరుబోతు లక్ష్మీకాంతాన్ని మా అమెరికా అన్నయ్యకి ఇచ్చి పెళ్ళి సంబంధం కలుపుకుందుకు వచ్చిందని!


"వాళ్ళ అమ్మే మా స్కూలుకి హెడ్ మిస్ట్రెస్ అని, 

దానికి ఎంత పొగరో..." అనుకునేవాళ్ళం.


రాత్రి భోజనాల దగ్గర మా అమ్మ, నాన్న ఆ విషయం మాట్లాడుకుంటుంటే నేను వీటో చేసి పడేశాను...


గండుపిల్లి నాకు వదినవడం ఏంటి, అసహ్యంగా...అని !


💐💐


మా అమ్మా నాన్నలకి మేం ఇద్దరు కొడుకులు, 

ఇద్దరు కూతుళ్ళం. మా నాన్న ఒక చిరుద్యోగి. అంతమంది పిల్లల్ని పోషించడానికి చాలా ఇబ్బంది పడేవారు. సాయంత్రాల్లో, కొంతమందికి ట్యూషన్లు చెబుతూ, సంసారాన్ని కష్టంమీద లాక్కొస్తుంటే, చదువులో మంచి మార్కులు సాధించి, ఆ రోజుల్లోనే బి.ఎస్.సి. పాసయి, ఎంతో ముందు చూపుతో అమెరికా వెళ్ళిపోయాడు, మా శ్రీనివాసన్నయ్య. 

(ఆ రోజుల్లో ఉద్యోగాలు చేయడానికి జిల్లాలు, 

రాష్ట్రాలు దాటడానికే భయపడేవారు) 


అమెరికాలో బాగా సంపాదిస్తూ, మా నాన్నకి డబ్బులు పంపిస్తుంటే, మా అక్కని, చిన్నన్నయ్యని, నన్ను చదివించి, మా అక్కకి మంచి సంబంధం చూసి పెళ్ళికూడా చేయగలిగారు.


మా పాత పెంకుటిల్లుని మార్చేసి, అన్ని సౌకర్యాలతో, పెద్ద డాబా ఇల్లు కట్టించాడు.


మెళ్ళో నల్లపూసలు, సన్నటి మంగళసూత్రాల గొలుసు తప్ప ఎరుగని మా అమ్మకి, మెడనిండా బంగారు నగలు, చేతులకి ఆరు జతల బంగారు గాజులు చేయించాడు. అవన్నీ వేసుకుని మా అమ్మ పేరంటాలకి వెళ్ళినప్పుడు, అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే, మా అమ్మ మొహంలో వచ్చిన ఆనందం, తృప్తి నేనిప్పటికీ మర్చిపోలేను!


సహజంగానే, మా అమ్మా నాన్నలకి "పుత్రోత్సాహం" అనుభవంలోకి వచ్చి, మా అన్నయ్య గురించి అందరితో చాలా గొప్పగా చెప్పేవారు.


బహుశా, ఆ రోజుల్లో ఊరు మొత్తానికి మాదొక్కటే "అమెరికా కుటుంబం!"


💐💐


1970 లో, మా అమెరికా అన్నయ్య, తన పెళ్ళిచూపులకోసం ఇండియా వచ్చాడు. 

మా అమ్మా నాన్నలు అప్పటికే కొన్ని మంచి సంబంధాలు చూసి వుంచారు.


మా అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడంటే, వారం రోజులు ముందునుంచీ నాకు నిద్ర సరిగ్గా పట్టేదికాదు. నాకోసం ఏమేమి వింత వస్తువులు, గిఫ్టులు తెస్తాడోనని ఆత్రుత ఎక్కువ ! 

ఆ వయసులో, ఆ రోజుల్లో, అప్పటి ఆప్యాయతలు, అమాయకత్వాలు తల్చుకుంటే...

మనవల్ని ఎత్తిన ఇప్పుడు, నవ్వొస్తుంది కానీ, 

ఆ రోజులే ఎంతో బావున్నాయనిపిస్తుంది !


చిన్న చిన్న బహుమతులకే ఎంతో ఆనందించిన రోజులవి !


తెల్లారుకట్ల రైలుకి మా అన్నయ్య రానే వచ్చాడు. 

నేను నిద్రలేచి, హాల్లోకి వెళ్ళి చూస్తే, మా అమ్మ ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్న మా అన్నయ్యని చూసి, ఆశ్చర్యపోయాను!


ఎందుకంటే, చంటిపిల్లనైన నాకు తప్ప, ఇంకెవరికీ 

ఆ అవకాశం లేదని అప్పట్లో నా అభిప్రాయం! (కుర్రతనం!)

😀


"మా అన్నయ్యేనా" అనిపించేట్టుగా, బాగా తెల్లబడి, ఒళ్ళు చేశాడు ! సినిమా హీరోలా అనిపించాడు, నాకు !


రెండు పెద్ద పెట్టిల్లో మా అందరి కోసం ఎన్నో తెచ్చాడు. మా అక్క, బావ, వాళ్ళ పిల్లలు, మా చిన్నన్నయ్యతో సహా, అందరికోసం, అందరికీ నప్పే, నచ్చే వస్తువులు ప్రత్యేకంగా తెచ్చాడు. నాకోసం ప్రత్యేకంగా తెచ్చిన ఫారిన్ సబ్బు, పౌడరు, సెంటు ఇప్పటికీ మర్చిపోలేను. అప్పుడు నాకోసం తెచ్చిన స్కూలు బ్యాగు ఇప్పటికీ వుంది ! 


(అప్పట్లో ఆ బ్యాగ్ తో స్కూల్లో నేను ఇచ్చిన కటింగులు ఇప్పుడు తల్చుకుంటే, సిగ్గేస్తుంది !)


మా అన్నయ్య తెచ్చిన సెంటు రాసుకుంటే, 

ఆ సువాసన రోజంతా వుండేది ! మా క్లాసులో అందరూ "నీ దగ్గర భలే మంచి వాసన వస్తుందే" అంటుంటే గర్వంగా వుండేది. 


మా అమ్మా నాన్నలకోసం మెత్తటి పెద్ద పెద్ద రగ్గులు, శీతాకాలంలో వేసుకుందుకు మెత్తటి స్వెట్టర్లు తెచ్చాడు. వాటిని ఇరుగుపొరుగు వాళ్ళందరూ వింతగా చూసేవారు.


💐💐


ఒక టాక్సీ చేసుకుని, మా అమ్మ, నాన్న, మా అమెరికా అన్నయ్య, నేను, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం లాంటి కొన్ని వూళ్ళు తిరుగుతూ, హోటళ్ళలో మకాం చేస్తూ, రాబోయే వదిన వేటలో పడ్డాం.


ఎన్ని సంబంధాలు చూసినా, మా అన్నయ్యకి నచ్చే,  చదువుకున్న అమ్మాయి దొరకట్లేదు. ఏ సంబంధం కుదరకుండానే తిరిగి అమెరికా వెళ్ళిపోవాలేమో అనుకున్నాం కూడా...


మా ఇలవేల్పు వేంకటేశ్వరస్వామిని చూడకుండా వెళ్ళకూడదు అనుకున్నాడో, ఏమో...

అప్పటికప్పుడు తిరుపతి యాత్ర తలపెట్టాడు 

మా అన్నయ్య. 


ఆ రోజుల్లో రైల్లో, 1,2,3 తరగతులు వేరుగా వుండేవి. రెండో తరగతి ప్రయాణం కొంచెం ఖరీదే ! 

మా కుటుంబం అందరికీ రెండవ తరగతి టిక్కెట్లు కొన్నాడు. మా కుటుంబం కోసమే బుక్ చేసినట్టు,

పెట్టంతా ఖాళీగా వుంది. ఆ తిరుపతి యాత్ర 

మా అందరి జీవితాల్లో మర్చిపోలేనిది. 


ఆ రోజుల్లో తిరుపతి కొండమీద వాతావరణం ఎంతో ప్రశాంతంగా, ఒక వింత లోకంలోకి వెళ్ళినట్టుండేది. ఇప్పటిలాగా ఇంత హడావిడి, జనసమూహం లేదు...


మా అన్నయ్య ఖరీదైన కాటేజీ బుక్ చేస్తే, అక్కడ

మూడు రోజులు వుండిపోయాం. మూడుసార్లు 

స్వామి దర్శనం సులువుగా అయిపోయింది. 


అదంతా ఒక మధుర స్వప్నంలా అనిపిస్తుంది.

తరవాత ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా, అప్పటి అనుభూతులే వేరు !


మా అమ్మ, నాన్న, "మా అబ్బాయికి మంచి అనుకూలవతి అయిన భార్యని ప్రసాదించు, స్వామీ" అని మొక్కుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు.


💐💐


తిరుగు ప్రయాణంలో, మా రైల్లోనే, మా రెండో తరగతి పెట్టెలోనే ఒక కుటుంబం ఎక్కింది.


తల్లి, తండ్రి, ముగ్గురు పిల్లలు. అమ్మాయి పెద్దదిలా వుంది, ఇద్దరు తమ్ముళ్ళు ! చూడగానే ఆ అమ్మాయి నాకు ఎందుకో చాలా హుందాగా, ప్రత్యేకంగా కనపడింది. 


తనని అదే పనిగా పరికించి చూస్తూ, నోరు తెరుచుకుని వుండిపోయాను కాబోలు, నన్ను పిలిచి, తన పక్కన కూర్చోబెట్టుకుంది. నా పేరు, చదువు, నా మార్కులు, అన్నీ అడిగింది. నేను అడక్కుండానే, తన పేరు పద్మావతి అని చెప్పింది,


ఎందుకో తెలీదు కానీ, ఆ అమ్మాయి మాట తీరు, అందం, ముఖ్యంగా పెద్ద జడ, నాకు భలే నచ్చేశాయి. మధ్యలో ఎప్పుడో ఒకసారి చూశాను, మా శ్రీనివాసు అన్నయ్య ఆ అమ్మాయిని తదేకంగా చూడ్డం. ఎనిమిదో క్లాస్ చదువుతున్న నేను, 

"ఓహో ఇదేదో తేడాగా వుందే" అనుకుంటూనే, 

ఆ అమ్మాయిని మరింత నిశితంగా పరిశీలించడం మొదలెట్టాను. 


తను కూడా మా అన్నయ్యని చూస్తున్నట్టు తెలియకుండా చూస్తోందని నా పసి స్త్రీ హృదయం కనిపెట్టలేదా ?


"V. గౌతమి, 8th A" అక్కడ !


అంతా బానే వుంది కానీ, ఆ అమ్మాయి పెద్ద తమ్ముడే నాకేసి "అదోలా" చూస్తున్నట్టు గ్రహించలేనంత చిన్న పిల్లని కాదుగా? 


"చూపుల్తో గుచ్చీ గుచ్చీ చంపేస్తుంటే",

ఏం చెయ్యాలో తెలీక, కనుబొమ్మలు ముడెట్టేసి, 

నాలిక బయటపెట్టి, వాణ్ణి ఎక్కిరించాను. 

వాడు నవ్వుకుంటున్నాడు ! 


"వాడికి సిగ్గులేదు" అనుకున్నాను...


మా అమ్మా నాన్నల్ని చూస్తే, వాళ్ళు పద్మావతి వాళ్ళ అమ్మానాన్నలతో ఏవో కబుర్లు సీరియస్ గా ముచ్చటించేస్తున్నారు.


తరవాత మేమందరం నా రైలు ఫ్రెండ్, పద్మావతి 

ఇంటికి వెళ్ళడం, జాతకాలతో సహా అన్నీ నప్పెయ్యడం, వధూవరులు ఒకళ్ళకొకళ్ళు నచ్చుకోవడం, పెళ్ళిపత్రికలు ఇచ్చి పుచ్చుకోవడం, "ఆనందమానందమాయెనే" అనుకున్నాక, 

ఆ అమ్మాయి చేతులు పాలల్లో ముంచి, మా అందరికీ అప్పగించడం ఎప్పుడో, చరిత్రలో కలిసిపోయాయి!


మా చిన్నన్నయ్య చదువు పూర్తవగానే, వాణ్ణి కూడా అమెరికా అన్నయ్యని చేసేశాడు, 

మా అమెరికా పెద్దన్నయ్య !


💐💐


ఇదంతా జరిగిపోయి, "శ్రీ పద్మావతీ...శ్రీనివాసుల

కల్యాణ వైభవమీనాడే" అనుకుని... స్వర్ణోత్సవం, 

అంటే 50 ఏళ్ళు కూడా పూర్తయిపోయింది.


రేపు రాత్రి, నేను, మావారు, నాలుగోసారి 

మా అమెరికా అన్నయ్యల ఇళ్ళకి వెళ్తున్నాం. 


మా పిల్లలిద్దరూ బాగా సెటిల్ అయిపోయాక, 

మా ఇద్దరికీ వేరే పనులు ఏముంటాయ్, 

ఊళ్ళమ్మట తిరగడమే పనిగా పెట్టుకున్నాం!


అన్నట్టు చెప్పడం మర్చిపోయాను... 

ఆ రోజు రైల్లో, ఆ ఎనిమిదో క్లాసు అమ్మాయిని "అదోలా" చూసి, నా చేత వెక్కిరించబడ్డ, ఆ సిగ్గులేని అబ్బాయి, ప్రస్తుతం తల వంచుకుని, బాసింపట్టు వేసుక్కూర్చుని, పెట్టెల్లో నా బట్టలు, తన బట్టలు, ఒబ్బిడిగా సద్దుతున్నాడు! 

48 ఏళ్ళుగా నన్ను పోషిస్తున్నాడు!

😂😂


                      వారణాసి సుధాకర్.

                    💐💐💐💐💐💐💐



             ***

వారణాసి సుధాకర్  గారి కొన్ని ఇతర రచనలు:


వారణాసి సుధాకర్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

అందరికీ నమస్కారం.

నా పేరు వారణాసి సుధాకర్.

పుట్టినది, పెరిగినది, తణుకు పట్టణంలో...


హైస్కూలు దశలో చదువుతో పాటు, వివిధ కళలలో, ఆటలలో, చురుకుగా పాల్గొని, వందల బహుమతులు పొందాను.


కాలేజీ విద్యార్థి దశనుంచి, విజయచిత్ర లాంటి సినిమా పత్రికలలో రచనలు చేసి, బహుమతులు పొందాను.


LIC లో సీనియర్ మేనేజర్ గా పనిచేసి, విశ్రాంత జీవితం గడుపుతూ, సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తూ, ప్రజలకు ఎంతో కొంత ఉపయోగించే విషయాలను తెలియజేసే కథలు రాస్తూ, వివిధ ఫేస్ బుక్ గ్రూపుల్లో సుమారు వందకు పైగా కథలు రాశాను, ఇంకా రాస్తున్నాను.


ప్రస్తుతం పిల్లలు, మనవలతో అమెరికాలో వుంటున్నాను.


ఇదీ క్లుప్తంగా నా పరిచయం.

🙏


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page