top of page

మలి సంధ్య

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Mali Sandhya' Written By Madduri Bindumadhavi

రచన: మద్దూరి బిందుమాధవి

వయసు పెరగడంతో వచ్చే సమస్యల్లో మతిమరుపు, మనుషుల్ని గుర్తించ లేక పోవడం, భ్రమలకు లోను కావడం సర్వ సాధారణం.

ఇప్పటి కాలంలో ఈ లక్షణాలు ఎక్కువమందిలో చూస్తున్నాం.

ఇలాంటివారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందు మాధవి గారు రచించారు.


ఆఫీసుకి బయలుదేరిన వందన వాకిట్లోకి వచ్చి తలెత్తి చూసింది. కొడుకు రూం తలుపు తెరిచి ఉండటం చూసి .."ప్రకేత్! ఇంకా కాలేజికి వెళ్ళలేదేం? ఒంట్లో బానే ఉందా?" అని ఓ కేక వేసింది.

"ఆ:( బయలుదేరుతున్నానమ్మా" అన్నాడు.

'ఇప్పుడు బామ్మ ఇక్కడుందని తెలిస్తే ఆవిడ కంగారు పడుతుంది. ఆఫీసుకి లేట్ అవుతుంది. అసలే వాళ్ళ బాస్ కొంచెం స్ట్రిక్ట్! చెప్పకపోవటమే నయం' అనుకున్నాడు.

రొప్పుతూ మేడ మీదికి పరుగెత్తుకొచ్చి మోకాళ్ళ మీద చేతులతో రుద్దుకుంటూ కుర్చీలో కూలబడింది సీతమ్మగారు. చేతికి తగిలిన గాయం నించి రక్తం కారుతున్నది.

"ఆ:( బామ్మా ఇప్పుడు చెప్పు. ఎందుకింత కంగారుగా పైకి పరుగెత్తుకొచ్చావ్? చూడు, చెయ్యి గీరుకుపోయి నెత్తురొస్తోంది" అన్నాడు మగ్గులో నీళ్ళు తెచ్చి బామ్మ గాయం కడుగుతూ!

"ఇందాక నేను వరండాలో నుంచుని ఉంటే, ఒక దొంగ పైపు మీదుగా పాకుతూ నీ రూం వైపు రావటం చూశాను. వాణ్ణి పట్టుకుందామని పైకి పరుగెత్తుకొచ్చా" అన్నది.

"ఓహ్ వాడా, నేను వాడిని తిట్టి పంపించాను. కింది నించి కేకేస్తే సరిపోయేదిగా, నువ్వు మెట్లెక్కి రావటమెందుకు? ఎక్కేటప్పుడు కళ్ళు తిరిగి పడితే ప్రమాదం కదా" అన్నాడు, బామ్మకున్న మానసిక స్థితి తెలిసిన ప్రకేత్, సంభాషణ దారి మళ్ళిస్తూ!

ఆవిడకి కలిగిన భావన భ్రమ అని, నిజం కాదని సర్ది చెప్పినా అర్ధం చేసుకోలేని స్థితి ఆవిడది.

"హమ్మయ్యా...వాడిని నువ్వు కూడా చూశావా? సరేలే నేను కిందికి వెళుతున్నా" అంటూ లేచింది.

*********

ముప్ఫయ్యేళ్ళ వయసులో ఇద్దరు మగ పిల్లలని తన మీద వదిలి కాలం చేసిన భర్త కోసం దిగులుపడి కూర్చోకుండా, పల్లెటురిలో ధైర్యంగా నిలబడి పాతికెకరాల వ్యవసాయం ఎవరి సహాయం తీసుకోకుండా ఒంటి చేత్తో నిర్వహించిన ధీశాలి సీతమ్మగారు.

ఒక్క సెంటు పొలం కూడా అమ్మకుండా, పిల్లలని పెద్ద చదువులు చదివించి ఆస్తిని వృద్ధి చేసి వారి చేతిలో పెట్టింది. చక్కని కోడళ్ళని తెచ్చి వారి జీవితాలకి ముడేసి..మనవలని చూసుకుంటూ కృష్ణ రామా అనుకోవలసిన వయసులో ఇప్పుడు మతిమరుపు జబ్బు తో బాధ పడుతున్నది. అందులో భాగమే ఈ "అపోహలు" "భ్రమలు" (hallucinations).

పది రోజుల క్రితం పని చేసి వెళుతున్న పని మనిషిని చూసి, "నా కోడలి పట్టు చీర కట్టుకుని మా ఇంటికే వస్తావుటే? ఎంత గుండెలు తీసిన బంటువే? నేను చూశాను కాబట్టి సరిపోయింది. ముందా చీర విప్పు" అని నానా గొడవ చేసి...ఆ అమ్మాయి ఒంటి మీద చీర విప్పించినంత పని చేసింది.

అప్పుడే ఇంట్లో వాళ్ళకి ఆవిడ ఆరోగ్య సమస్య గురించి తెలిసింది.

మరునాడు వందన కాఫీ తాగుతూ బాల్కనీలో కూర్చుని ఉంటే, దగ్గరకెళ్ళి "శైలజా... మా ఇంట్లో కాఫీ తాగుతున్నావేం? మీ అత్తగారు నీకు కాఫీ కూడా ఇవ్వదా? ఓరి నీ అసాధ్యం కూలా" అని పక్కింటి ఆవిడ అనుకుని పరామర్శించింది.

ఆ తరువాత ఒక రోజు ఇంటర్మీడియెట్ చదువుతున్న మనవడు ప్రకేత్ తో "నీ చదువైపోయింది నాన్నా! ఇక పెళ్ళి చేసెయ్యాలి. మీ నాన్నే ఉంటే ఇన్నాళ్ళు ఆలస్యం చేసే వారు కాదు" అని అతన్ని తన కొడుకు రాఘవ అన్నట్టుగా మాట్లాడింది.

ఒక రోజు పక్కింటికెళ్ళి "కాసేపు సోఫాలో కూర్చుని, ఆ ఇల్లాలిని పిలిచి ఇందాకటి నించి ఇక్కడే ఉన్నావ్! ఏమన్నా పని మీద వచ్చావా? మా కోడలొచ్చాక చెబుతాలే. ఇంక ఇంటికెళ్ళు మీ వాళ్ళు వెతుక్కుంటారేమో" అన్నది.

అప్పటి నించి ఇంట్లోనించి బయటికి వెళ్ళకుండా ఆవిడని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండేందుకు అంజలి అనే మనిషిని పెట్టారు..

*******

"ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలయింది. ఝాము పొద్దెక్కింది! నాకు ఇంకా అన్నం పెట్టలేదేం?" అని కేర్ టేకర్ అంజలిని గట్టిగా అడుగుతున్న అత్తగారిని చూసింది ఆఫీసు నించి ఆరు గంటలకి వచ్చిన వందన.

"అత్తయ్యా నేను పెడతా రండి. పాపం అంజలికి కడుపు నెప్పిగా ఉందిట" అన్నది.

"అయ్యో కడుపు నెప్పా? మరి చెప్పవేం? పాపం ఇందాకటి నించి ఎంత బాధ పడ్డావో? చెప్పకపోతే ఎలా తెలుస్తుందే? పద...కాస్త మిరియాల కషాయం కాచి ఇస్తా" అని వంటింటి వైపు దారి తీసింది.

"మా అమ్మని చూస్తే గుండె కోతగా ఉంది డాక్టర్ గారు. పెద్దగా చదువుకోకపోయినా... ఒక్కతే ఆడమనిషి అయి ఉండి, ఎన్నో ఆటుపోట్లకి ఓర్చి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడిలా అర్ధం పర్ధం లేని ఆవిడ ప్రవర్తన చూస్తుంటే మాకు నోట మాట రావట్లేదు" అన్నాడు రాఘవ.

"ఈ సమస్య కి వైద్యం లేదండి. బ్రెయిన్ డామేజి అయితే, దానికి రిపేర్ ఉండదు. మీరు చెయ్యవలసిందల్లా ఆవిడని జాగ్రత్తగా కనిపెట్టి ఉండటమే! సమస్య ఇంకా ఎక్కువ పెరగకుండా మందులు క్రమం తప్పకుండా వేస్తూ ఉండండి. రాత్రి పూట తలుపులు తాళాలు వేసి పెట్టండి. వారు తెలియకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. మీ చుట్టు పక్కల వారిని కొంచెం గమనిస్తూ ఉండమనండి" అని డాక్టర్ చెప్పిన మాటలు విని రాఘవ తమని సమర్ధతగా పెంచిన తల్లి ఈ స్థితిలోకి రావటం చూసి చలించిపోయాడు.

(పిల్లల నీడలో ప్రశాంతంగా బ్రతకవలసిన మలి సంధ్యలో .... అల్జీమర్స్, డిమెన్షియా రోగులు ఈ రోజుల్లో ఇంచుమించు ఇంటికొకరు ఉంటున్నారు. అది వరకు కంటే ఎందుకో ఈ కేసులు ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది ఒక సవాలుగా భావించి వారి పట్ల సానుభూతితో మసలుకోవాలి.)

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు274 views1 comment

1 Comment


Ennela Gannavarapu • 1 day ago

Vinnaanu. Baagundi. అయితే కథ అనేకంటే ఒక విషయం, నీతి చెప్పారు . చదివిన వారి స్వరం చాలా బాగుంది

Like
bottom of page