top of page

మమతల మధువు ఎపిసోడ్ 13


'Mamathala Madhuvu Episode 13' New Telugu Web Series

Written By Ch. C. S. Sarma

'మమతల మధువు తెలుగు ధారావాహిక' ఎపిసోడ్ 13

రచన: సిహెచ్. సీఎస్. శర్మ(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ..

కొడుకు ఆదిత్య రాసిన ఉత్తరం చూసి ఉద్వేగానికి లోనవుతుంది గౌరి.

భర్తతో ఫోన్ లో మాట్లాడుతుంది. ఆమెను ఊరడించి కొడుకును కలుద్దామని చెబుతాడు ఆమె భర్త గోపాల్. వైజాగ్లో ఉన్న గోపాల్, ఆపరేషన్ జరిగిన శాంతిని కలుస్తాడు. హాస్పటల్ కి వెళ్లి శాంతి పరిస్థితి గురించి వాకబు చేస్తాడు. బావమరిది మురారితో చెప్పి తను గౌరీ దగ్గరకు బయలుదేరుతాడు.


హాస్పిటల్ కి వెళ్లి శాంతిని కలుస్తాడు గోపాల్ తండ్రి భీమారావు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని మురారితో చెబుతాడు. ఆమె కొడుకు ఆనంద్ ని తన దగ్గరకు తీసుకొని రమ్మని రామకోటికి చెబుతాడు.


ఆనంద్ చేస్తున్న ఉద్యోగ వివరాలు కనుక్కుంటాడు భీమారావు. అతనికి బెంగళూరులో ఉన్న తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని చెబుతాడు. గోపాల్ ఇంటికి చేరుకుంటాడు.

తండ్రికి శాంతి విషయం తెలిసిపోయిందని మురారి ద్వారా తెలుసుకుంటాడు గోపాల్.

భార్య గౌరితో కలిసి మంగళూరు వెళ్లి, కొడుకు ఆదిత్యను కలుస్తాడు.

ఆదిత్య బాల్యం గుర్తు చేసుకుంటాడు.


ఆవేశాన్ని తగ్గించుకోమని ఆదిత్యకు చెబుతుంది అతని మరదలు ప్రేమ.

తనమీద దాడి చేసిన పాండూని ఎదిరిస్తాడు ఆది.

ఆ ఘర్షణలో తలకు బలంగా దెబ్బ తగలడంతో పాండూ మరణిస్తాడు.

ఆది తాత భీమారావు, మధ్యస్థం చేసి, గొడవలు జరక్కుండా చూస్తాడు. ఆదిని బోర్డింగ్ స్కూల్ లో చేరుస్తాడు.


గతకాలపు ఆలోచనలు పూర్తయి, వర్తమానంలోకి వస్తాడు ఆది.

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన శాంతి, కొడుకు ఆనంద్ తో బెంగళూరు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది.

ప్రేమకు తనమీద మునుపటి అభిమానం లేదని గ్రహిస్తాడు ఆది.


ఆది అంటే తనకిష్టం లేదని, ఆనంద్ తన స్నేహితుడని తల్లి భవానీతో చెబుతుంది ప్రేమ.

ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న ఆది పై దాడి చేస్తాడు వీరగోవిందయ్య.

ప్రొఫెసర్ రామాచారి గారి కూతురు ప్రేమ సపర్యలతో కోలుకుంటాడు ఆది.

ఎన్నికల్లో గెలుస్తాడు.


శాంతి విషయం గౌరికి తెలుస్తుంది.

ఆమెను తమ ఇంటికి తీసుకొని రమ్మంటుంది.


ఇక మమతల మధువు ఎపిసోడ్ 13 చదవండి..


సమయం పుదయం ఎనిమిది గంటల ప్రాంతం. ప్రేమ వేగంగా ఆదిత్య యింటిలో ప్రవేశించింది.

"అత్తయ్యా!... అత్తయ్యా!...”

పూజ ముగించి హారతి యివ్వబోతువున్న గౌరి ప్రేమ కంఠం విని...

"పూజగదిలోకి రా!...” పిలిచింది.


ప్రేమ పూజగదిలోకి ప్రవేశించింది. గౌరి కర్పూర హారతిని యిచ్చి... ప్రేమ ముందుంచి "కళ్ళకద్దుకో... నీ కోర్కె తీరుతుంది.” నవ్వుతూ చెప్పింది గౌరి.


ప్రేమ భక్తితో కర్పూర హారతిని కళ్ళకు అద్దుకొంది. హారతి తట్టను క్రింద వుంచి దేవుడికి నమస్కరించి ప్రేమ భుజంపై చెయ్యి వేసి..." పద, హాల్లో కూర్చొని మాట్లాడుకొందాం.”

యిరువురూ హాల్లోకి వచ్చారు. భీమారావు ఆది ప్రేమ వారికి ఎదురైనారు. వీరమ్మ హాల్లోకి వచ్చి... “అమ్మగారూ!... టిఫిన్ రడీ...” నవ్వుతూ చెప్పింది.


యింతలో... భవానీ... ధనుంజయరావు... సుశీలా లోనికి వచ్చారు.

తన చెల్లిని చూచి భీమారావు ఆమెను సమీపించి... "చెల్లి రా కూర్చో” చేయిపట్టుకొని సోఫాను సమీపించాడు. సుశీల సోఫాలో కూర్చుంది.

అమ్మ భవానీ తండ్రి ధనుంజయా, సోఫాలో కూర్చున్నారు. ప్రేమ వారిరువురినీ చూచి... ముఖం చిట్లించుకొంది.


“అత్తా... ఆ అమ్మాయి ఎవరు?” అడిగింది ప్రేమ

ఆది ప్రక్కన నిలబడి వున్న రామాచారి గారి కూతురు ప్రేమను చూచి.

"నేను నీ కళ్ళకు కనబడలేదా!..." నవ్వుతూ అడిగాడు ఆది.

"నీది పాత ముఖమేగా బావా!...”

"ఎప్పుడొచ్చావని కూడా అడగలేదు?...


"నీ కథంతా వారం వారం అమ్మ నాకు టెలికాస్టు చేస్తూనే వుంటుంది.” నవ్వింది ప్రేమ.

“చాలా పెద్దదానివైనావే ప్రేమా నీవు!...”

"నీవు ఎదిగావుగా ఆరడుగుల అందగాడిలా!...” కొంటెగా చూస్తూ అంది.


"అమ్మా!... అత్తా!... యిది ఎంత ఎదిగినా దీని నోటి వేగంలో ఏ మార్పూలేదు. అది తగ్గాలంటే దీనికి వెంటనే పెండ్లి చేసేయాలి... అత్తయ్యా!... మంచి కుర్రాణ్ణి చూడనా!...” నవ్వుతూ అడిగాడు ఆది.

"నీకు ఆ శ్రమ అవసరంలేదు. నేనే చూచుకొన్నాను. యిదిగో ఫొటో!..." ఆదికి దగ్గరగా వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ నుంచి ఆనంద్ ఫొటోను తీసి ఆది చేతికి అందించింది.


“బావా!... నీకు శతకోటి వందనాలు... నా మనస్సులోని మాటను చెప్పి యీ ఫోటోను వీళ్ళందరికీ ఎలా చూపాలా అని నేను సతమతమౌతుండగా నీ మాటలతో నాకు సందర్భాన్ని కలిగించావు... నేను చేయాలనుకొన్నది చేసేశాను. యిక మీ అందరి నిర్ణయాన్ని మాత్రం వినాలి. ఓ... తిరుమల దేవుడా!... వీళ్ళంతా నా నిర్ణయంతో ఏకీభవించేలా చెయ్యి. నేను, నా వుడ్బే... కాలినడకతో నీ సన్నిధికి చేరి నిన్ను దర్శిస్తాము.” బిగ్గరగా అందరూ వినేలా చెప్పింది ప్రేమ.


ప్రేమ ఈ చర్యకు అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరిముఖాలొకరు చూచుకొన్నారు. ఆది మెల్లగా భీమారావును సమీపించి...

"తాతయ్యా... మన ప్రేమ సెలక్షన్!...” ఆనంద్ ఫొటోను అందించాడు భీమారావుకు.

"వెరిగుడ్ సెలక్షన్ తాతయ్యా!..." ఆనందంగా చెప్పాడు ఆది.

గౌరి భీమారావును సమీపించింది. "ఏది మామయ్యా!.... నన్ను చూడనివ్వండి." చేయి చాచింది గౌరి.


మౌనంగా గౌరి ముఖంలోకి చూచి నవ్వుతూ... ఫోటోను అందించాడు. భీమారావు. ఆ ఫోటోను చూచి గౌరి ఆశ్చర్యపోయింది. భవాని, గౌరిని సమీపించింది.

"యీ మూర్ఖురాలు వీడిని తప్ప ఎవ్వరినీ చేసికోనని మమ్మల్ని వేధిస్తూ వుంది గౌరీ!..." విచారంగా చెప్పింది భవానీ.


"మామయ్యా!... యీ అబ్బాయి!...” గౌరి ముగించక ముందే... భీమారావు...

"మన బెంగుళూరు బ్రాంచి మ్యానేజర్... పేరు అనంద్"" ఆనందంగా చెప్పాడు.

"అంటే!...”

"అతని తల్లి పేరే శాంతి!...” నవ్వుతూ మెల్లగా చెప్పాడు భీమారావు.


గౌరి ఆశ్చర్యపోయింది. కొద్దిక్షణాల్లో తేరుకొని నవ్వుతూ. “వదినా!.... నాతోరా!...” భవానీ చేయి పట్టుకొని ముందుకు నడవబోయింది..


"అత్తయ్యా!... అమ్మ... తాతయ్యా... నాన్నా... నానమ్మా... బావా... నేను చెప్పేది జాగ్రర్తగా వినండి. నేను ప్రేమించిన ఆ ఆనంద్ ఎవడో కాదు. మామయ్య గోపాల్రావుగారి మొదటి భార్య శాంతి కొడుకు. మొదట్లో నాకు ఆనంద్కు మధ్య వుండినది... కేవలం స్నేహం మాత్రమే!...


ఒకరోజు సంవత్సరంరోజుల క్రిందట నేను... ఆనందు కలవాలని వారి యింటికి వెళ్ళాను. అప్పుడు అక్కడికి మామయ్య వచ్చి వున్నారు. వారిరువురూ.... ఒకరి వల్ల ఒకరి జీవితం... ఎన్నో బాధలకు వ్యధలకు గురైందని... వారు ఎంతగానో బాధపడ్డారు. మామయ్య... నా మూలంగా నీకు కష్టాలు కన్నీరు తప్ప ఏ సుఖములేదని విలపించారు. నా కారణంగా మీ జీవితం నాశనం అయిందని... నేను చస్తే... మీరు ఆనందంగా మీ యిల్లాలితో... మీ బిడ్డతో బ్రతకగలరని శాంతి అత్తయ్య భోరున ఏడ్చింది. అత్తయ్యా!... నీలాగే శాంతి అత్తయ్య కూడా చాలా మంచిది. నన్ను ఎంతో ప్రేమగా చూచుకొనేది. నేననంటే తనకు చాలా యిష్టం.


వారి ఆ సంభాషణ విన్న తర్వాత... మీరంతా ఆమెను అసహ్యించుకొన్నా... అవమానించినా నేను... ఆమె జీవితాంతం, ఆమెకు తోడుగా... అండగా వుండాలని... ఆమె ఎప్పుడూ సంతోషంగా వుండేలా చూడాలని... అది జరగాలంటే నేను ఆమె కోడలినై ఆ యింట్లో వుండాలని నిర్ణయించుకొన్నాను. ఆనంద్ను ప్రేమించాను.


మీరంతా మన కుటుంబ పెద్దలు. శాంతి అత్తయ్య కూడా యీ కుటుంబ సభ్యురాలే కదా!... మనందరి క్షేమం కోసం ఆమె... చావును కోరుకోవడం న్యాయమా!.... అలా జరిగితే అది మనందరికీ మంచిదా!... ఎంతో అనుభవం... మంచీ చెడ్డా తెలిసిన మీరు నా మాటల్లోని యధార్థాన్ని... నా మనస్సులోని భావాలను అర్థంచేసికోగలరని నాకు నమ్మకం.


తాతయ్యా!... మీరు యిప్పుడు చెప్పండి. నేను ఆనందు ప్రేమించడం తప్పా!... పెండ్లి చేసికోవాలనుకోవడం తప్పా!.. శాంతి అత్తయ్యకు అండగా నిలబడాలనుకోవడం తప్పా!... నాకు మీ అందరి పట్లా వున్న 'నా ప్రేమకోసం, పొందురు. నేను యీ నిర్ణయం తీసికోవడం తప్పా!... చెప్పండి!..." బొంగురు పోయిన కంఠంతో కన్నీటితో... భీమారావు చేతులు పట్టుకొంది ప్రేమ.

ప్రేమ మాటలకు... ఆమెకు తన కుటుంబసభ్యుల మీద వున్న ఆదరాభిమానాలకు అందరూ నివ్వెరపోయారు.


అశ్రుపూరిత నయనాలతో భీమారావు ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు.

"నా చిట్టి తల్లీ!... నీ యీ చిన్న గుండెలో ఎన్ని ఆలోచనలు. నీయీ కుటుంబం పట్ల నీకు ఎంత ప్రేమ. నీవు నిజంగా నా బంగారు తల్లివిరా!... బంగారు తల్లివి.” పారవశ్యంతో ఆనందంగా చెప్పాడు భీమారావు.


గౌరీ... భవానీలు, ప్రేమను కౌగిలించుకొన్నారు. ఆమె బుగ్గల మీద ముద్దులు పెట్టారు.

నానమ్మ సుశీల... తండ్రి ధనుంజయరావు ఆనందంగా దగ్గరకు తీసికొని నిండు నూరేళ్ళు చల్లగా వుండాలని దీవించారు.


ఆది ప్రేమను సమీపించాడు. ఆమె కళ్ళల్లోకి ప్రీతిగా... చూచాడు.

“బావా !... నా మీద నీకు కోపమా!...” దీనంగా అడిగింది ప్రేమ.

ఆదత్య ఆమెను తన హృదయానికి హత్తుకొన్నాడు.


“నీలోని మానవతావాదానికి... సంస్కారానికి... యీ కుటుంబం పట్ల నీకున్న ప్రేమాభిమానాలకు... నీకివే నా జోహార్లు." హృదయపూర్వకంగా చెప్పాడు ఆదిత్య.


భవాని... గౌరి... సుశీల ప్రేమను తీసుకొని... గోరి గదికి వెళ్లారు.

అల్లుడు ధనుంజయరావుని పిలుచుకొని భీమారావు తనగదికి వెళ్ళాడు.

అంతవరకూ అక్కడ జరుగుతున్న చిత్రమైన సన్నివేశాన్ని చూస్తూ నిలబడి వున్న రామాచారి కూతురు ప్రేమ ఆదిత్యను సమీపించింది.


"యం.ఎల్.ఎ గారూ!... ఏ లోకంలో వున్నారు?...” నవ్వుతూ అడిగింది.

"ప్రేమా!... యిప్పుడు నా మనస్సుకు చాలా ఆనందంగా వుంది. నాకంటే చిన్నపిల్ల... మా ప్రేమ తన నిర్ణయాన్ని తెలియజేయడంతో మా అందరి మనస్సుల్లో వున్న ఆవేదనను తొలగించింది. షి యీజ్ రియలీ గ్రేట్." ఆనందంగా చెప్పాడు. ఆదిత్య.


"యీ సంతోషకరమైన సమయంలో నాదో విన్నపం. తీర్చగలరా!...”

“అడుగు అది ఏదైనా సరే తీరుస్తాను”

“నిజంగా!...”

"ఆది అబద్ధం చెప్పడు ప్రేమా!...”


“నాకు నీవు కావాలి.”

“అంటే!...”


“నన్ను నీవు పెండ్లి చేసికోవాలి. మాట యిచ్చావ్.” తల ఆడిస్తూ కళ్ళు తిప్పుతూ నవ్వుతూ అంది ప్రేమ.


ఆది ఆశ్చర్యంతో ప్రేమ కళ్ళల్లోకి చూచాడు. ప్రేమ కన్ను కొట్టింది. “ఆది మాట తప్పడు.” అంది.


భీమారావు అతని వెనకాల ధనుంజయరావు నవ్వుతూ గదినుండి బయటికి వచ్చారు.

“ఆదీ!... నాన్నకు ఫోన్చేసి.. ఆనంద్ను వాళ్ళ అమ్మను తీసుకొని తిరుపతికి రమ్మని చెప్పు. మనమందరం తిరుపతికి వెళుతున్నాము.! చెప్పాడు భీమారావు. గౌరి గది నుండి వారి చర్చను ముగించి బయటికి వచ్చిన గౌరి... భవాని... సుశీలమ్మ... ప్రేమలు భీమారావుగారి మాటలను విన్నారు. అందరి వదనాల్లో క్రొత్త కాంతి.


భీమారావుగారి నిర్ణయం ప్రకారం... అందరూ తిరుపతికి చేరారు. భీమారావు రామాచారికి ఫోన్చేసి వెంటనే తిరుపతికి రావలసిందని చెప్పాడు.


గోపాల్... శాంతి... ఆనంద్ తో తిరుపతికి చేరాడు. అందరూ నవ్వుతూ పలికిన స్వాగతం... గోపాల్ కి చాలా ఆనందాన్ని కలిగించింది. శాంతి... ఆనంద్ పెద్దల ముందు చేతులు జోడించారు. గౌరి నవ్వుతూ... శాంతి చేతులు పట్టుకొని 'అక్కయ్యా!, అని ఆప్యాయంగా పలకరించింది.


"నాన్నా!... యీనాడు మనమందరం యిక్కడ యింత ఆనందంగా కలిసే దానికి కారణం మన ప్రేమ.” ప్రేమ వైపు కొంటెగా చూస్తూ చెప్పాడు ఆది.


గోపాల్... ప్రేమను తన హృదయానికి హత్తుకొన్నాడు. "నా చిట్టి తల్లీ... నీ యిష్టప్రకారమే నీ వివాహం, ఆనంద్ గొప్పగా జరిపిస్తాను." ఆమె చవి దగ్గర మెల్లగా చెప్పాడు.


అందరూ సంతోషంతో ఏక కంఠంతో 'గోవిందా... గోవిందా... గోవిందా” అన్నారు. మూడు కార్లలో ఆ జగత్ రక్షకుని దర్శించేదానికి తిరుమల వైపు పయనించారు.

=================================================================================

(సమాప్తం)

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ సిహెచ్. సీఎస్. శర్మ గారి తరఫున మా అభివాదాలు తెలియజేసుకుంటున్నాం.

=================================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


35 views1 comment

1 Comment


vidya sagar vesapogu • 2 days ago

Nice nice good story thanks alot sir

Like
bottom of page