top of page
Writer's pictureYasoda Pulugurtha

మారిన మనసులు


'Marina Manasul' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

పెళ్లి అయి కొత్తకోడలిగా ఆ ఇంట అడుగుపెట్టిన అపర్ణకు ఆత్తగారింటిలోని వాతావరణం వింతగా అనిపించింది. ఇంకా పాతకాలంనాటి ఛాందస స్వభావాలు

ఆ ఇంట రాజ్యమేలుతున్నాయని గమనించింది !

మామగారి అడుగులకు మడుగులొత్తే అత్తగారు, మామగారి ఆంక్షలు, షరతులు నియమాలు గమనించి " అయ్యబాబోయ్ నేను ఈ ఇంటిలో మసలగలనా!” అని గుండెలమీద చెయ్యి వేసుకుంది.

మామగారు ఉండగా ఆయన ఎదురుగా అత్తగారు కూర్చోకూడదు. ఆవిడ అలా నిలబడే ఉండాలి. ఆయన భోజనం చేయకుండా ఇంట్లో మిగతా ఆడవారు భోజనం చేయకూడదు,

గల గల మని నవ్వుతూ మాటలాడకూడదు. ఎవరైనా బంధువులు, స్నేహితులు వచ్చినా వారిని గేటువరకూ వెళ్లి వీడ్కోలు చెప్పకూడదు, ఇంట్లోనుండే టాటా చెప్పేయాలి ఇలా చాలా నిబంధనలు వున్నాయి ఆ ఇంట !

మామగారి ఆంక్షలను, నియమాలను తూచా తప్పకుండా అనుసరించే అత్తగారిని చూస్తుంటే... ఆయనతో అన్నేళ్లుగా కాపరం చేస్తున్న ఆవిడ సహనానికి చేతులెత్తి నమస్కారం చేయాలని అనుకుంది అపర్ణ !

ఒకరోజు అపర్ణ అడిగింది అత్తగారిని.... “అదేమిటి అత్తయ్యా, మామయ్యగారు భోజనం అయ్యేవరకు ఇంట్లో ఆడవాళ్లు భోజనం చేయకూడదా ? మరి " ఆకలికి

ఆగలేకపోతే " అని అమాయకంగా ప్రశ్నించేది !

“అది అంతేనమ్మా, మీ మామయ్యగారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయనకు కేరియర్ కట్టి ఇచ్చేదాన్ని ! ఆఫీస్ లో ఆయన లంచ్ అయిపోగానే నాకు ఫోన్ చేసేవారు, నా భోజనం అయిందని, ఆ కబురుకు అర్ధం " ఇంక నీ భోజనం కానివ్వచ్చని " ఆవిడ పేలవంగా నవ్వుతూ చెప్పేసరికి అపర్ణ విస్తుపోయింది !

ఇదే విషయాన్ని అపర్ణ తోటికోడలు " అవును, అపర్ణా, నీవు ఇప్పుడే వచ్చావు కాబట్టి నీకు ఇక్కడ పధ్దతులన్ని విచిత్రంగా అన్పిస్తాయి. నాకు అలవాటు అయిపోయింది ! నేను ప్రెగ్నంట్ గా ఉన్నప్పుడైతే ఆకలికి కళ్లు తిరిగేవి. పాపం అత్తయ్యగారు నా పరిస్తితికి జాలిపడ్తూ మామయ్యగారు చూడకుండా వంటిట్లోకి పిలిచి రహస్యంగా భోజనం పెట్టేవారు”. ఈమాటలు విన్న అపర్ణ..... తెల్లబోయింది. ‘ఇదేమి ఛాదస్తంరా దేవుడా’ అనుకుంటూ ! “ఇవేకాదు, పుట్టింటికి వెళ్లాలనుకున్నప్పుడు మామగారికి చెప్పి ఆయన అనుమతి తీసుకోవాలి. ఆయన రమ్మన్న రోజుకల్లా వచ్చేయాలి. అంతేగాని, మీ ఆయనకు చెప్పేస్తే చాలని వెళ్లకూడదమ్మాయి” అంటూ తన తోటికోడలు సుధీర చెప్పేసరికి ఇంకా విస్తుపోయింది . కనీసం సినిమాకు, షికారుకు వెళ్లాలన్నా చెప్పితీరాలన్న నిబంధనకు అపర్ణకు చాలా కోపం వచ్చింది ! ఇన్ని నియమ నిబంధనల మధ్యనేను ఉండగలనా అన్న భయం పట్టుకుంది అపర్ణ కు !

ఇదే విషయాన్ని అపర్ణ తన భర్త శ్రీరామ్ దగ్గర ప్రస్తావించినప్పుడు శ్రీరామ్, “అవును అపర్ణా! ఈ ఇంట్లో ప్రతీ విషయం నాన్నగారి అభీష్టం ప్రకారం జరుగుతున్నాయి. అమ్మకు, వదినకు అలవాటు అయిపోయాయి. నీకు నచ్చకపోతే చెప్పు, మనం వేరు కాపురం వెళ్లిపోదాం. నీవు అసంతృప్తిగా డల్ గా ఉండడం సహించలేను. అలా అని , నిన్ను ‘సర్దుకో ఇక్కడ పధ్దతులకు’ అనికూడా ఫోర్స్ చేయను. నీ ఇష్టం! ఎప్పుడు వెళ్లిపోదామన్నా నేను రెడీనే” అనగానే అపర్ణ కాసేపు మౌనంగా ఉండిపోయింది !

తన పుట్టింట్లో అలాకాదు, ఏ నియమ నిబంధనలూ లేవు. నాన్నగారు బయటకు వెడ్తూ అమ్మకు చెప్పేవారు, నా కోసం ఎదురుచూడక తొందరగా భోజనం చేసేయండి అని !

నాన్నగారూ, అమ్మా, అన్నయ్యా, వదినా, తనూ.... హాల్ లో ఒకరి కొకరు ఎదురుగా కూర్చుని గల గల మని ఎన్నో కబుర్లు , జోకులు చెప్పుకుంటూ , నవ్వులతో ఆ ఇల్లు మారుమ్రోగి పోయేది..

కాని ఇక్కడ ? మామగారు ఇంట్లో ఉన్నంతసేపూ ఇల్లు గంభీరంగా, మనుషులెవరూ లేరేమో అన్నట్లుగా నిశ్సబ్దం రాజ్యమేలుతూ ఉండేది. ఆయన కాసేపు బజారుకి, స్నేహితులను కలవడానికిబయటకు వెళ్లినపుడు మాత్రం ఇంట్లో కాస్త చలనం వచ్చేది !

మామగారు పెట్టే నసకు ఒక్కోసారి అత్తయ్య అనేవారు, ఈయన సర్వీస్ లో ఉండగానే ప్రాణానికి హాయిగా ఉందని, రిటైర్ అయ్యాక తన ప్రాణానికి సుఖం లేదని !

అలా ఉంటూనే అపర్ణ మామగారి దినచర్యను గమనించసాగింది. పొద్దుటే అయిదు గంటలకే లేచిపోయి, కాసేపు వాకింగ్ చేసేవారు. ఆయన వాకింగ్ నుండిరాగానే అత్తయ్య కాఫీ అందించాలి ఆ తరువాత న్యూస్ పేపరు పఠనం. రాజకీయాలంటే చెవికోసుకుంటారు. అలాగే బిజినస్ న్యూస్, స్టాక్ మార్కెట్ న్యూస్ ఒకటేమిటీ ప్రపంచంలో జరుగుతున్న ప్రతీ విషయాన్ని కూలంకషంగా తెలుసుకుంటూ , ఎవరైనా తెలుసున్నవారు వస్తే అనర్గళంగా మాటలాడేస్తూ ఉండేవారు ! తరువాత స్నానం, పూజ, ఉదయం అల్పాహారం అన్నీ ఠంచనుగా జరిగిపోవలసిందే ! ఆతరువాత లేప్ టాప్ తెరిచి స్టాక్ ట్రేడింగ్ చేసుకోవడం వగైరా..... ఎప్పుడూ ఖాళీగా ఉండక తను బిజీగా ఉంటూ, భార్యను హడావుడి పెట్టేస్తూ..... ఆయన ఇంట్లో ఉంటే అందరికీ కంగారే !

ఒకరోజు ఆయన స్టాక్ ట్రేడింగ్ లో ఉండగా అపర్ణ చూసింది. తను పెళ్లికాని క్రితం రెండుసంవత్సరాలు ఆదిత్యా బిర్లా కేపిటల్ లో రెండు సంవత్సరాలు రిలేషన్ షిప్ మేనేజర్ గా పనిచేసింది. MCOm చదివిన అపర్ణ కు అందులో అదే ఫీల్డ్ లో పనిచేసిన ఆమె ఈ షేర్స్ ట్రేడింగ్ లో చాలా అనుభవమే ఉంది.

‘మామయ్యగారు చాలా బిజీగా ఉన్నట్టున్నారే’ అంటూ ఆయన పక్కనే సోఫాలో మెల్లిగా కూర్చుంది !

అపర్ణను చూసిన విశ్వేశ్వరరావుగారు అవునంటూ తలూపారు.

‘ ఏ స్టాక్స్ లో మీకు పొజిషన్స్ ఉన్నాయి మామయ్యా? మీ పోర్టిఫోలియో ఏమిటో చెపుతారా” అన్న ప్రశ్నలకు ఆయన ఆశ్చర్యపోతూ ... అన్నీ చూపించారు. అపర్ణ అంత చనువుగా వచ్చి తన పక్కనే కూర్చోవడంతో ఆయన కాస్త ఇబ్బంది పడినా అపర్ణ కు స్టాక్ మార్కెట్ లో ఉన్న అనుభవానికి ఆశ్చర్యపోయారు !

“మామయ్యా! మీరు స్టాక్స్ కొన్నప్పటి నుండి ఇంతవరకు పెరగకుండా ఉంటూ చాలా తక్కువ శ్రేణిలోకి వెళ్లిపోయిన షేర్స్ ఉన్నాయా” అనగానే ఇంక ఆయన గడ గడా

చెప్పడం మొదలుపెట్టారు.

“ అమ్మాయ్, అపర్ణా! ఈ బేంక్ స్టాకు 250 రూ. లు ఉన్నప్పుడు కొన్నాను, ఈ మధ్య ఎంత దిగజారిపోయిందో తెలుసా. 30 రూ. దిగిపోయింది”

“ఏమై ఉంటుందో కారణం తెలుసుకున్నారా మామయ్యగారూ ?”

“ఆ... చూసానమ్మా! గత సంవత్సరంనుండి బేంక్ నష్టాలలో ఉందట.... అందుకే షేర్ ప్రైస్ 30 రూ.కు దిగిందిట !”

“మామయ్యగారూ, ప్రతీ స్టాక్ కూ అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. మీరు మంచి బేంక్ స్టాక్ కొన్నారు, అనుమానం లేదు. ఆ బేంక్ కు కేపిటల్ ఇన్ ఫ్యూజన్ కు

ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు ముందుగా ఎక్కువ ధరలో తీసుకున్నారు. ఇప్పుడు మరికొంత ఇన్ వెస్ట్ చేసి ప్రస్తుత ధర ఆకర్షణీయంగా ఉంది కాబట్టి మరికొన్ని తీసుకోండి.

ఈ క్వార్టర్ పరఫార్మెన్స్ బాగుంటుందని ఎనలిస్ట్ లు చెపుతున్నారు. తప్పకుండా స్టాక్ పెరుగుతుంది , ఒక పదిశాతం నష్టం లో ఉన్నా అమ్మేసి మరో మంచి స్టాక్ కొందాం !

అలాగే మీరు కొన్న ఈ స్టాక్ ధర మీరు కొన్నప్పటికీ, ప్రస్తుతానికి చాలా రెట్లు పెరిగింది కదా! ఆల్ మోష్ట్ వంద శాతం బెరిగింది. 750 రూ. కొన్న స్టాక్ ప్రైస్ దగ్గరగా 1500 రూ.కు చేరింది మరీ ఇంకా పెరుగుతుందని ఆశపడకూడదు మామయ్యా ! ఇంకా అలా ఉంచకుండా కొంత స్టాక్ అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేయండి” అంటూ చెప్పడమే కాకుండా

ఆపని ఆయనచేత దగ్గరుండి చేయించింది. ఆయన అపర్ణ చురుకుతనానికి, నాలెడ్జ్ కు ఆశ్చర్యపోతూ, ఆయనకున్న సందేహాలను అడిగి మరీ తెలుసుకున్నారు !

“మామయ్యగారూ, మంచి మంచి బ్లూచిప్ కంపెనీలలో స్టాక్స్ కొనండి. నేను మీకు ఏ స్టాక్ కొంటే బాగుంటుందో చెపుతా”నంటూ, ఒక లిస్ట్ ఇచ్చింది !

ఇలా ప్రతీరోజూ అపర్ణ ఆయన దగ్గర కూర్చుని ట్రేడింగ్ మెలుకువలు నేర్పేది !

ఒకరోజు హాలులో ఉన్న ఆయన " అమ్మాయ్ అపర్ణా” అంటూ పిలిచి తన పక్కనే కూర్చోమని లేప్ టాప్ లోకి చూస్తూ చెపుతున్నారు.

" చూసావా, నీవు ఆరోజు ప్రాఫిట్ బుక్ చేయమనడం మంచిదయింది. ఈ రోజు ఆ స్టాక్ ప్రైస్ దారుణంగా పడిపోయింది” అంటూ సంబరంగా చెపుతూ.... "ఏమేవ్! నాకు, అమ్మాయికి రెండుకప్పులు మంచి కాఫీ పట్రా” అంటూ భార్యను కేకేసి చెప్పారు.

“ " ఉండండి మామయ్యా!నేను తెస్తా”నన్నా అపర్ణను వెళ్లనీయకుండా, ఏవో సలహాలు అడుగుతూ ఉండడం , భార్యచేత అపర్ణకు కాఫీ ఇప్పించారు.

అన్నపూర్ణమ్మగారికి ఇది అబ్బురంగా తోచింది. ఇంతవరకూ తనతోనే ఇంత చనువుగా ఆయన ఎదురుగా కూర్చోమనలేదు ఎప్పుడూ ! కోడలిని పక్కన కూర్చోపెట్టుకుని అనర్గళంగా అన్ని విషయాలను అపర్ణతో మాటలాడడం ఆవిడకు చాలా సంతోషంగా అనిపించింది !

అపర్ణ ఆ ఇంటికి వచ్చాకా ఏవో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆవిడ పసిగట్టింది !

అప్పుడప్పుడు అపర్ణను పిలవడం, రాజకీయాలనుండి మరెన్నో విషయాలు అపర్ణతో మాటలాడడం, వీరిద్దరూ మాటలాడుకుంటుంటే అపర్ణ తోటికోడలు కూడా వచ్చి అపర్ణ పక్కనే సరదాగా వచ్చి కూర్చోవడం, వీళ్లేదో చర్చించుకుంటున్నారు, ఏమిటో చూద్దామనుకుంటూ అన్నపూర్ణమ్మగారు కూడా వచ్చి వీరందరితో పాటు కూర్చోవడంతో ఆ ఇంట్లో నెమ్మది నెమ్మదిగా విరామ సమయంలో మామగారు అక్కడే ఉన్నా అందరూ హాలులో చేరడం, సరదాగా టివి చూడడం, కబుర్లు చెప్పుకోవడం, మధ్య మధ్య లో మామగారిని కలుపుకుంటూ, ‘ఏమంటారు మామయ్యగారూ’ ఆని అపర్ణ ఆయనని ప్రశ్నించడం, ఆయన ముసి ముసి నవ్వులను కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నిస్తూనే గంభీరంగా సమాధానాలివ్వడంతో ఆ ఇంట్లో ఏదో తెలియని సందడి మొదలైంది. అపర్ణ ఏ విషయానైనా సరే అనర్గళంగా మాటలాడుతుంది. చాలా తెలివైనది, చురుకైనది. తన మాటలతో మామగారిని బుట్టలో పడేసి ఆ ఇంట్లో ఒక ఆత్మీయ వాతావరణానికి నారు పోసింది ! మామగారు ఎదురుగా ఉన్నా ఒకరితోనొకరు చనువుగా మాట్లాడుకుంటూ కంఫర్ట్బులిటీగా ఉంటున్నారు !

ఒకరోజు ఉన్నట్టుండి అపర్ణ సినిమా ప్రపోజల్ తీసుకువచ్చింది !

" శతమానంభవతి" సినిమా వచ్చిందని, అందరం వెడదామని.! వెంటనే విశ్వేశ్వరరావుగారు “నేను రాను, సినిమాలో ఆ గంతులు, డేన్స్ లు, ఆ వికారాలు నాకు పడవు. ఇదిగో అన్నపూర్ణా, నీకు వెళ్లాలని ఉంటే పిల్లలతో వెళ్లు, నన్ను బలవంతం పెట్టకండి” అనగానే అపర్ణ "మామయ్యగారూ! ఆ సినిమా అటువంటిది కాదు, నేను కూడా మంచి కధకే విలువనిస్తాను. మొన్న మా నాన్నగారు ఫోన్ చేసినపుడు ఆ సినిమా చూడండి, మీ మామయ్యగారికి కూడా నచ్చుతుందని మరీ మరీ చెప్పారు. రండి మామయ్యా, పాపం అత్తయ్యగారు సంబరపడుతున్నా”రనగానే

ఏ కళ నున్నారో "చెపితే వినరుకదా, పదండి అయితే” అనేసరికి అత్తగారిలో ఎక్కడలేని ఉత్సాహం పొంగుకు వచ్చేసింది.

. " అమ్మాయ్ అపర్ణా, ఏ చీర కట్టుకోమంటావ్” అంటూ హడావుడి పడసాగారు !

ఇలా నెమ్మదిగా అందరూ కలసి అప్పుడప్పుడు సినిమాలకు వెళ్లడం, ఆయన ‘రాలేను మీరు వెళ్లండి’ అన్నప్పుడు కొడుకులు కోడళ్లూ వెళ్లడం జరుగుతూ ఉండేది !

ఒకరోజు అపర్ణకు జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చి తగ్గుముఖం పట్టడానికి ఒక వారం పట్టింది. చాలా నీరసంగా ఉందని, వేళకి తినాలని డాక్టర్ చెప్పాడని శ్రీరామ్ తల్లితో చెపుతుండగా విన్నాడాయన !

వెంటనే భార్యతో " ఏమేవ్ నీ ఛాదస్తంతో ఆ అమ్మాయిని మాడ్చకు, వింటున్నావా ! నా భోజనం అయ్యాకే ఆ అమ్మాయి తినాలని ఆంక్షలు పెట్టకుండా వేళకు పెట్టేయి సుమా ! వయస్సు వచ్చినా ఏమిటో నీ ఛాదస్తం నీవూనూ ! ఆ అమ్మాయి ఒక్కర్తీ తినలేనంటే తోడుగా పెద్దకోడలో, నీవో కలసి కూర్చుని తినేయండి !”

ఆవిడ ఆయన మాటలకు విస్తుపోయింది ! ఇదేమిటీ , ఈ ఛాదస్తం నాదా ! ఆయన తండ్రి గారినుండి వారసత్వంగా పుణికి పుచ్చుకుని నాచేత తూచా తప్పకుండా పాటింప చేసి, నన్ను అలా మాడ్చి, రంపంకోత కోసేసి, ఇప్పుడు నన్ను నా ఛాదస్తంతో ఆ అమ్మాయిని మాడ్చకు అంటారా !

పోనీలే నన్ను ఆయన ఛాదస్తంతో కాల్చుకు తిన్నా, కోడళ్ల విషయంలో ఆయన ఛాదస్తాలు వెన్నలా కరుగుతూ ఉండడం ఆవిడకు సంతోషాన్నిచ్చింది !

ఒకరోజు అపర్ణ తమ బెడ్ రూమ్ లో మంచం మీద కూర్చుని బట్టలు మడత పెడ్తుండగా అత్తగారు వచ్చి ‘మీ మామగారు నిన్నెందుకో పిలుస్తున్నార’నగానే తన చేస్తున్న పనిని అలా వదిలేసి హాలులో ఉన్న మామయ్యగారి దగ్గరకు వచ్చింది. ఆయన స్నేహితులెవరో వచ్చినట్లున్నారు. అపర్ణను చూడగానే మామగారు " ఇదిగో అపర్ణా, ఈయన ఎవరో తెలుసా .... నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటినుండి డిగ్రీవరకు క్లాస్ మేట్స్ మి కూడా. ‘సూర్యం’ అని పిలిచేవాళ్లం, సూర్యనారాయణ పూర్తిపేరు. సెక్రటేరియట్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసి రిటైరైనాడు !

మా చిన్నకోడలు అపర్ణ రా ! ఎమ్ .కామ్ లో గోల్డ్ మెడలిస్ట్, చాలా తెలివైన అమ్మాయి” అని పరిచయం చేయగానే అపర్ణ ఆయనకు వినమ్రంగా నమస్కారం చేసింది !

“ఆ... చూడు అమ్మాయ్! నీకు ఉద్యోగం చేయాలని ఉందని మీ అత్తయ్యతో అన్నావట కదా.. ఆవిడ చెప్పింది. మా సూర్యం అన్నయ్య మన ఇంటికి దగ్గరలో ఉన్న గాయత్రీ జూనియర్ కాలేజ్ లో ప్రిన్సిపాల్ గా ఉన్నారు. నాకు సూర్యం అన్నయ్య కూడా బాగా తెలుసు. ఇప్పుడే సూర్యం నాతో అన్నాడు. మీ కోడలు ఎమ్.కామ్ చేసిందని చెప్పావుగా, అన్నయ్య కాలేజ్ లో లెక్చరర్ పోస్ట్ ఒకటి ఉందట. కామర్స్ సబ్జక్ట్ కి. నీకు ఇంటరెస్ట్ ఉంటే నీ రెజ్యూమ్ కాపీ ఒకటి సూర్యానికి ఇవ్వు. ఒకటి రెండురోజుల్లో ఇంటర్వ్యూ ఉంటుందట” అని చెప్పగానే అపర్ణ మనసు సంతోషంతో గాలిలో తేలిపోయింది ! పట్టశక్యంకాని ఉద్విగ్నత అపర్ణలో చోటు చేసుకుంది. అక్కడకక్కేడే ఎగిరి గంతులేసాద్దమన్న కోరికను ఆపుకుంటూ వినయంగా తలూపుతూ లోపలకి వచ్చింది. తన లేప్ టాప్ లో అప్ డేట్ చేసుకున్న రెజ్యూమ్ రెడీ గా ఉంది. తనకు రెండు సంవత్సరాల వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా ఉంది. ఎన్నో సాంస్కృతిక పోటీలలో బహుమతులు గెలుచుకున్నట్లు సర్టిఫికెట్లు, బేస్కట్ బాల్ లో ఛాంపియన్ సర్టి ఫికెట్లు పొందింది. ప్రింటర్ కూడా రెడీగా ఉందికాబట్టి హార్డ్ కాపీ ఒకటి తీసి వెంటనే మామగారికి ఇచ్చేసింది ! ఆయన ఒకసారి పరికించి చూసి తన మిత్రుడు సూర్యానికి అందచేసారు ! సూర్యంగారు అన్నారు, ఇంటర్వ్యూ కి రెడీగా ఉండమని !

రెండు రోజుల తరువాత అపర్ణ ను వెంటబెట్టుకుని విశ్వేశ్వరరావుగారు సూర్యం అన్నగారి కాలేజ్ కి వెళ్లడం, ఇంటర్వ్యూ జరగడం, అపర్ణ సెలక్ట్ అవడం, అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకుని ఇంటికి వచ్చేయడం అన్నీ గబ గబా జరిగిపోయాయి !

అపర్ణకు ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది ! కాని వాస్తవం ! ఆరోజు రాత్రి అపర్ణ తన భర్త శ్రీరామ్ తో ఈ ప్రస్తావన తెచ్చినపుడు, శ్రీరామ్ అపర్ణను సరదాగా ఆట పట్టిస్తూ " ఏం మాయ చేసావో అపర్ణా " అంటూ రాగం తీసాడు !

“ఛ... పొండి శ్రీరామ్, మాయలూ, మంత్రాలూ మాకు రావు బాబూ” అంటూ మూతి ముడుచుకుంది !

" ఆ ఊరికే అన్నాను లేవోయ్ సరదాగా” అంటూ ప్రసన్నం చేసుకున్నాడు !

మొదటి నెల జీతం అందుకోగానే... తన భర్త శ్రీరామ్ ను తీసుకుని వెళ్లి మామగారికి, అత్తగారికి బట్టలు కొని, వారి చేతిలో పెట్టి వారి కాళ్లకు నమస్కరించింది. ఇద్దరూ ఆశీర్వదించారు ! మామగారు అపర్ణ తో వెంటనే " నీ తల్లి తండ్రులకు కూడా బట్టలు కొని వాళ్ల ఆశీర్వాదం తీసుకో అమ్మాయ్” అనగానే, అపర్ణ కళ్లల్లో సన్నని కన్నీటి తెర !

తను అత్తవారింటికి రాగానే ఇక్కడ పధ్దతులు, నియమాలు గమనిస్తూ భయపడింది. ఒక్కోసారి వేరుకాపురం వెళ్లిపోదాం అనే ఆలోచన వచ్చేది. తన భర్త శ్రీరామ్ కూడా, ‘నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పు వెళ్లిపోదాం’ అని నిర్ణయాన్ని తన మీదే వదిలేసాడు. కాని తనే ఎందుకో సర్దుకు పోలేనా అనుకుంటూ ....

మామగారిని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తూ, ఆయన మంచితనాన్ని, అభిమానాన్ని చూరగొంది నెమ్మదిగా ! సమస్యలు అనేవి ప్రతి రిలేషన్‌షిప్‌లోనూ ఉంటాయి. ఎందుకంటే, ఎవరికివారు పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యం, వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ భిన్నంగా ఉంటాయి. పెళ్లై అత్తవారింటికి రాగానే అన్నీ సమస్యలుగానే కనిపిస్తాయి. ఇవన్నీ అంతర్గతంగా వచ్చే సమస్యలు. బయటికి కనిపించేవి కూడా ఉంటాయి. అవి, ఆడపడుచులతో, అత్తలతో, మరుదులతో, ఉమ్మడి కుటుంబంలో.. ఇలా చెప్పుకుంటూ పోతే కలిసి ఉండాలనుకునే ప్రతి బంధంలోనూ ఎన్నో సమస్యలు.

'మ్యారేజ్‌ ఈజ్‌ నథింగ్‌ బట్‌ ఎడ్జస్ట్‌మెంట్‌' అన్నారు అనుభవజ్ఞులు !

తను తొందరపడి వేరు కాపురం పెట్టి ఉంటే అది తనకు మానసిక తృప్తి నిచ్చేదా ? ఏదో తెలియని గిల్టీనెస్ తో జీవితమంతా బాధపడేది !

కాని ఇప్పుడు ? మామగారిలో మార్పు వచ్చినందుకు అత్తగారి ముఖంలో కళ కళలు, బావగారిలో, తన భర్త శ్రీరామ్ ముఖాలలో ఒకరకమైన నిశ్చింత, తన తోటికోడలు సుధీరక్క లో ఒక ధైర్యం నేను తనకి ఉన్నానని, ఏ విషయానైనా నాతో పంచుకోవచ్చన్న నిశ్చింత .... తను తన భర్త, తమ సుఖాన్ని మాత్రమే ఆశించి వెళ్లిపోయి ఉంటే అది స్వార్ధం అనిపించుకోదా ? ఇందరి ఆనందాలను దూరంచేసిన మనిషిగా తను చెలామణి అయిపోతుంది ! కాని ఇప్పుడు ? ఇంట్లో వచ్చిన చిన్న చిన్న మార్పులకు తన మనసు పరవశించి పోతోంది ! అందరి మధ్య ఒక ఆత్మీయతాభావం చోటు చేసుకుంటోంది ! ఒకరిమీద ఒకరికి కన్సర్న్ ఏర్పడుతోంది ! మామగారు అత్తగార్ని అడగడం తను చాలా సార్లు వింది ! అపర్ణ కు లంచ్ బాక్స్ ఇస్తున్నావా, లేకపోతే మాడిపోతుంది, అసలే అర్భకురాలు అమ్మాయి అంటూ ! అలాగే రెండు రోజులక్రితం సుధీరక్క నాన్నగారికి బాగాలేదంటే వెంటనే మామగారు బావగారితో చెప్పడం తను వింది, వెంటనే కోడలిని, మనవరాలిని తీసుకుని వెళ్లమని, కోడలిని , పాపని కొన్నిరోజులు అక్కడే ఉంచమని !

కాలాన్నిబట్టి, పరిస్తుతులను బట్టి మనుషులలో మార్పు అవసరం. నా స్వభావం, నా పధ్దతులు ఇలాగే ఉంటాయి, నేను మారను అని భీష్మించుకుంటేనే అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయి ! కుటుంబ సభ్యులలో తొందరపాటు పనికిరాదు ! ఓర్పు, సహనం, మంచితనంతో మార్పుకోసం ప్రయత్నించాలి !!

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఈవెంట్ మేనేజర్ రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.



63 views0 comments

Comments


bottom of page