top of page

ఇది కలా? నిజమా?


'Idi Kala Nijama' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

అప్పుడే వంటింట్లో వంట పని ముగించుకుని ముందు హాల్లోకి వచ్చిన రోహిణి తన మొబైల్ రింగ్ అవడం గమనించి ఎవరా అంటూ చూసింది.

“అమల" .

“హాయ్ అమలా! ఎలా ఉన్నావు? ఏమిటీ విశేషా”లంటూ పలకరించింది.


“మా పెద్దదాని పెళ్లి కుదిరింది రోహిణీ..”


“అవునా, కంగ్రాట్స్ అమలా ! "ఇంతకీ పెళ్లికొడుకు ఏమి చేస్తున్నాడు, ఎక్కడ ఉంటారు వాళ్లు?”


" అతను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చైన్నైలో .. అతనికి ఒక అక్క. పెళ్లి అయిపోయింది . తండ్రి ప్రభుత్వోద్యోగి గుంటూరులో.. తల్లీతండ్రీ గుంటూరులో ఉంటారు..”


“ధృతి హేపీనా అయితే, తనకు బాగా నచ్చాడటనా ?”


“చూడు రోహిణీ, రెండు సంవత్సరాలనుండి సంబంధాల వేటలో ఉన్నాం.. ఎన్నో సంబంధాలు చూసాం, కొన్ని జాతకాలు బాగాలేవని, కొన్ని మాకు ఆస్తీ అంతస్తూ లేవని, ఇలా బోలెడుకారణాలతో వెనక్కి వెళ్లిపోయాయి.. ఒక మోస్తరుగా ఉంటాడు.. చదువూ, ఉద్యోగం ఉంది. 'మీ ఇష్టమే నా ఇష్టం' అంది ధృతి.. 'ఒక్క పైసా కట్నం వద్దు, పెళ్లి విజయవాడలో చేయ'మన్నారు.

వచ్చేనెల ఇరవైనాలుగున రాత్రి ఏడూ నలభై అయిదుకి పెళ్లి ముహూర్తం. నీవూ, మీ శ్రీవారు తప్పక రావాలి. వెడ్డింగ్ కార్డ్ ముందుగా వాట్సాప్ లో షేర్ చేస్తాను. తరువాత మాట్లాడతానే రోహిణీ” అంటూ ఫోన్ పెట్టేసింది .

.

రోహిణీ , అమల ఎనిమిది సంవత్సరాలుగా పక్క పక్క ఎపార్ట్ మెంట్ లో ఉండేవారు.. రోహిణి వాళ్లది సొంత ఎపార్ట్ మెంట్.. అమల కుటుంబం అద్దెకు వచ్చారు.. అమలా వాళ్లాయన దుర్గాప్రసాద్ ఏదో లిమిటెడ్ కంపెనీలో పనిచేసేవారు.. అమలకు ఇద్దరాడపిల్లలు.. పెద్దది ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం, చిన్నది టెన్తె క్లాస్ చదువుతున్నారు.. .. పొదుపుగా ఉన్నదాంట్లోనే సంసారం నడుపుకుంటూ కూతుళ్లను శ్రధ్దగా చదివించుకునే ఆ దంపతులు రోహిణీ వాళ్లకు చాలా తొందరగా ఆత్మీయులైపోయారు ..


ఆడపిల్లలిద్దరినీ ఇంటర్మీడియట్ అయిపోయాక బేంక్ లోన్లు తీసుకుని లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలలో చేర్చారు .

పిల్లలిద్దరి ఇంజనీరింగ్ కోర్సులు ఒక సంవత్సరం వ్యత్యాసంతో పూర్తి అయిపోయాయి. పిల్లల ఉద్యోగ ప్రయత్నాలకు కాస్త అనుకూలంగా ఉంటుందని అపార్ట్ మెంట్ ఖాళీచేసి మియాపూర్ దగ్గరకు వెళ్లిపోయారు..


ఏడెనిమిది సంవత్సరాలు ఒకే కుటుంబంగా ఉన్నమూలాన వారు వెళ్లిపోతుంటే రోహిణికి చాలా బాధ కలిగింది.. అమల కూడా వీడ్కోలు తీసుకుంటూ కళ్ల నీళ్లు పెట్టుకుంది .

అమలా తరచుగా ఫోన్ చేస్తూ మాట్లాడేది..

తరువాత కొన్నినెలలకు ‘పిల్లలిద్దరికీ ఉద్యోగాలు వచ్చాయే రోహిణీ’ అంటూ చెప్పింది..

అప్పుడే పెద్దదాని పెళ్ళంటూ దాని వెనకపడద్దని, రెండు మూడు సంవత్సరాలు చక్కగా సంపాదించుకున్నాకా, అది బాగా స్థిరపడ్డాకే పెళ్లిచేయమని సలహా ఇచ్చింది రోహిణి..


ఇదిగో... ఇప్పుడు పెళ్లికుదిరిందంటూ ఫోన్ . ‘రెండు సంవత్సరాలనుండి చూస్తుంటే ఇప్పుడు కుదిరిందన్నమాట .. పోనీలే పాపం’ అని సంతోషపడింది రోహిణి..


రోహిణికి ఒంట్లో కాస్త నలతగా ఉన్నా ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు.. భార్యాభర్తలిద్దరూ విజయవాడ బయలుదేరారు . విజయవాడ చేరుకున్న వెంటనే హొటల్ లో దిగాక "పెళ్లికి వచ్చేసేమండోయ్ అమలగారూ" అంటు మేలమాడింది రోహిణి..


‘సరే హొటల్ లో దిగితే దిగారులేగానీ ఇక్కడ ఫంక్షన్ హాల్ కి వచ్చేయండి, ఈ ఫంక్షన్ హాల్ రెండురోజులకు బుక్ చేసా’మని చెప్పింది .


వీరికోసమే ఎదురుచూస్తున్న అమల వీరిరువురినీ చూడగానే రోహిణిని కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి చేసేసింది సంతోషంతో ..


‘ఫంక్షన్ హాల్ బాగుందే అమలా’ అనగానే, ‘అవును రోహిణీ, కట్నకానుకలు ఇవ్వకపోయినా పెళ్లి అయినా ఘనంగా చేయాలిగా, అందుకే మాకు భారం అనిపించినా ఏదోలా కిందామీదా పడి ఖర్చు చేస్తున్నాం .’ అంది

రిసెప్షన్ వేదికపై పెళ్లికొడుకుని, పెళ్లికూతురుని కూర్చోపెట్టారు .


ధృతి పక్కన పెళ్లికొడుకు లావుగా కాస్తంత మోటుగా కనపడుతున్నాడు.. భర్తతో ఆమాటే అంటే, " నీవన్నీ విచిత్రమైన ఆలోచనలు , ఏమైంది కాస్త లావుగా ఉంటే"? పెళ్లైతే అతనే మారతాడు.. అయినా ఒక వ్యక్తిని పై పైకి చూసేస్తూ ఒక అభిప్రాయానికి తొందరగా వచ్చేయడం మీ ఆడవారి నైజం” అంటూ దెప్పి పొడిచాడు .


ధృతి ఎంతో చలాకీగా అందరినీ నవ్వుతూ పలకరిస్తోంది.. అతను నవ్వితే ముత్యాలు రాలుతాయేమోనన్నట్లుగా మూతి ముడుచుకుని ఉన్నాడు..

ఈ అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడా, సాఫ్ట్ వేర్ ఇంజనీరా అని ఆశ్చర్య పోయేటట్లుగా ...


అమల మా అల్లుడెలా ఉన్నాడే అంటే " వాళ్లమ్మకు చాలా ముద్దేమో వెన్నముద్దలు అన్నంలో కలపి తినిపిస్తోందేమోనని అనుమానంగా ఉంద"నగానే ఫక్కున నవ్వింది అమల, ‘భలే మాట్లాడతావే’ అంటూ..


ఏమైతేనేమీ రిసెప్షన్, పెళ్లి చాలా అట్టహాసంగానే జరిపించారు! కట్నాలు వద్దంటూనే లాంఛనాలు అంటూ భారీగానే తీసుకున్నారు..


ధృతికి ఇవ్వాల్సిన గిఫ్ట్ చదివించి కొత్త జంటను ఆశీర్వదించి రోహిణీ రామ్మూర్తీ వీడ్కోలు తీసుకుంటుంటే అమల రోహిణిను కౌగలించుకుంటూ ఎందుకో కళ్లనీళ్లు పెట్టుకుంది.


రోహిణికి అర్ధమైంది ఆ బాధ! కూతురు అత్తవారింటికి వెళ్లిపోతోందన్న బెంగ అని !


ఆ తరువాత కొన్ని నెలలకు రోహిణీ రామ్మూర్తీ దంపతులు పిల్లల దగ్గరకని అమెరికా ప్రయాణమౌతూ వెళ్లేముందు అమలకు ఫోన్ చేసి , వీలునిబట్టి అప్పుడప్పుడు కాంటాక్ట్ చేస్తూ ఉంటానని బై చెపుతూ ఫోన్ పెట్టేసింది !


అమెరికాలో రోహిణీ రామ్మూర్తీ ఒక సంవత్సరంపాటు ఉండిపోయారు . ఇంట్లో పిల్లలతో బిజీ అయిపోయిన రోహిణి అమలకు ఫోన్ చేయడం కుదరలేదు ..

రోహిణీ, రామ్మూర్తీ ఇండియా వచ్చేసారు .. అక్కడ ఉన్నంతకాలం చాలా ఆనందంగా హడావుడిగా గడచిపోయింది . కానీ ఇక్కడ ఇద్దరే, ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటూ .

ఒకరోజు ఉన్నట్టుండి అమల గుర్తొచ్చి ఫోన్ చేసింది ..


అవతలవైపు నుండి ఈ నంబర్ పై ఏ ఫోనూ పనిచేయడంలేదని జవాబు వచ్చింది . అరే, ఏమైంది, అమల ఫోన్ మార్చేసిందా అనుకుంది ఒక్క క్షణం .

ఆ తరువాత కొన్నిరోజులకు రామ్మూర్తి కజిన్ ఇంట్లో వ్రతం చేసుకుంటున్నామంటూ వీళ్లిద్దరనీ ఆహ్వానిస్తే, భార్యా భర్తలిరువురూ బయలు దేరారు.. అమలా వాళ్లూ ఉండేది అక్కడకి దగ్గరే కదా, తిరిగి వచ్చేటప్పుడు దానింటికి వెళొద్దామని అనుకున్నారు..


వ్రతం అంతా పూర్తి అయ్యాక, రోహిణి, రామ్మూర్తీ వీడ్కోలు తీసుకుని అమల ఇంటివైపు వచ్చారు..

ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి.. అమల చిన్నకూతురు శృతి లేప్ టాప్ లో ఏదో పనిచేసుకుంటూ వీరిని చూస్తూనే హడావుడిగా మమ్మీ అని పిలుస్తూ, రండి అంకుల్ ఆంటీ అంటూ నవ్వుతూ లోనికి ఆహ్వానించింది .


ఎవరో వచ్చారనుకుంటూ లోపలనుండి వచ్చిన అమల వీరిద్దరినీ చూసి నిశ్చేష్టిత అయింది ..


అమల గుర్తుపట్టలేనంతగా బక్కగా అయిపోయింది. ఏదో జబ్బు చేసినదానిలా .

ముఖంలో సంతోషాన్నంతా ఎవరో లాగేసుకున్నారా అన్నంత నైరాశ్యం కదలాడుతోంది .


వీరిద్దరినీ చూస్తూ పేలవంగా నవ్వుతూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చోపెట్టింది .


అదేమిటే అమలా, అలా అయిపోయావేమిటీ ? " అయినా ఫోన్ మారిస్తే నాకు చెప్పాలని తెలియదా"? ఎన్నిసార్లు నీ పాత ఫోన్ కి ఫోన్ చేసానో తెలుసా ?

అందరూ బాగున్నారా , అమ్మమ్మవి అయిపోయి బిజీ అయిపోలేదుకదా?


ఈ మాటలు వింటూనే అమల కట్టలు తెంచుకున్న దుఖంతో రోహిణిని పట్టుకుని ఏడుస్తూ, ధృతికి డైవర్స్ అయిపోయాయని చెప్పింది..


"డైవర్సా? ఏమైందే అసలు ?"


"మోసపోయామే , ఆ అబ్బాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చెన్నై లో అని చెప్పారు.. అతనికి ట్రాన్స్ ఫర్ అవడంలేదని చెప్తే మా పెద్దదే చెన్నై బ్రాంచ్ కు ట్రాన్ల్ ఫర్ చేసుకుని వెళ్లింది .


పెళ్లికి ముందు ఏదో చిన్న ఉద్యోగంట, చాలా రోజులు ఏపనీ ఇవ్వకుండా అతన్ని బెంచ్ మీద ఉంచేసారుట.. నిజం చెప్పాలంటే ఉద్యోగం లేదని చెప్పొచ్చు.. నా కూతురు వెళ్లిన నెలలోపే పూర్తిగా అతన్ని ఉద్యోగం నుండి తీసేసారు .


పాపం ఇది ధైర్యం చెపుతూ, ప్రోత్సహిస్తూ నెట్ లో చూస్తూ ఎన్నో కంపెనీ పేర్లు చెప్పి రెజ్యూమ్ పంపమనేదిట . ఏమీ సమాధానం ఉండేదికాదుట.. 'నీ రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేయి కిరణ్' అన్నా కూడా లక్ష్య పెట్టేవాడు కాదుట . ఇంజనీరింగ్ చదివినా సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో అసలు నాలెడ్జ్ లేదని మాఅమ్మాయి చెప్పింది..


ఇది ఆఫీస్ కు వెళ్లిపోతే టీవీ పెట్టుకుని సినిమాలూ, వీడియోలూ చూస్తూ కాలక్షేపం చేసేవాడుట.


ఒకరోజు ఇది ఆఫీస్ నుండి ఇంటికొచ్చేసరికి, సోఫాలో పడుకుని ఏదో బ్లూ ఫిల్మ్ చూస్తున్నాడుట .


అది చూసిన ధృతి అతన్ని మందలిస్తూ, అన్ని రెజ్యూమ్స్ పంపించావు కదా, ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా కిరణ్ అని అడగ్గానే అంతెత్తున లేస్తూ,

" నీవెవరే నాకు చెప్పడానికి, నన్ను కంట్రోల్ చేస్తావా అంటూ" , మాటి మాటికీ నా ఉద్యోగ ప్రస్తావన తెస్తే ఊరుకోనంటూ చెంపమీద కొట్టాడుట..


ఒక రోజు అతని సర్టిఫికెట్లు చూసిందిట.. నాలుగేళ్లల్లో పూర్తి చేయాల్సిన ఇంజనీరింగ్ ఆరేళ్లకు పూర్తి చేసాడుట, అదీ అత్తెసరు మార్కులతో . ఇది ఆశ్చర్యపోయింది, కానీ అతన్ని ఏమీ అడగలేదు , అతనేమిటో అతని స్కిల్స్ ఏమిటో అర్ఘమైపోయాయి..

.

ఏవైనా కోర్సులు చేయమని ప్రోత్సహిస్తే వినేవాడు కాదుట.. దీని కొలీగ్ ఎవరో ఏదో స్టార్ట్ అప్ కంపెనీలో ఖాళీలున్నాయని కొంచెం వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉంటే చాలని చెపితే వివరాలు తెలుసుకుని కిరణ్ కు మెసేజ్ చేస్తే 'తమరి బోడి సలహాలు నాకు అవసరంలేద'ని, 'నా ఉద్యోగం నేనే వెతుక్కోగల'నని, 'మరోసారి తన జాబ్ ప్రసక్తి తెస్తే ఊరుకోన'న్నాడుట..


దీని ఏటిఎమ్ కార్డ్ అతనే తీసుకుని డబ్బు ఖర్చు పెట్టేవాడుట..


ఆ సెక్స్ సినిమాల ప్రభావంతో రాత్రిళ్లు దీనిని శారీరకంగా వేధించేవాడుట..


అతి జుగుప్సా కరమైన అతని ప్రవర్తనకు విసిగిపోయి అక్కడనుండి వచ్చేసింది..


నేనూ, మా ఆయన దాని అత్తవారింటికి వెళ్లి 'ఏమిటండీ ఇదంతా' అని అడిగితే,

'మా వాడి ఉద్యోగం పెళ్లైన వెంటనే పోయిందంటే అది వాడి తప్పా? కొంతమందికి భార్యవస్తే అన్నీ కలసివస్తాయంటారు, మరి మా వాడికి ఉన్న ఉద్యోగమే ఊడిపోయింది.. వాడి భార్య పాదం అటువంటిది మరి.. మీ అమ్మాయే సర్దుకుపోతూ కాపురం చేసుకోవాలికానీ, ఇలా సంసారాన్ని నడిరోడ్డుమీదకు ఈడ్వకూడదు.. మేమేమీ కట్నాలూ కానుకలు కావాలని అడగలేదే . మీకే అన్నీ నచ్చి చేసుకుని పెళ్లి అయిపోయిన తరువాత ఇలా మాటలాడడం బాగాలే'దంటూ మా మీదే నిందారోపణలు .


ధృతి అతనికి డైవర్స్ పేపర్స్ పంపింది . అతనిలోటుపాట్లన్నీ బాగా అర్ధమైపోయాయని సంతకం పెట్టకపోతే ఇది కోర్టుకీడుస్తుందని భయపడి పేపర్స్ మీద సంతకాలు పెట్టేసాడు. సులువుగా డైవర్స్ దొరికిపోయాయి.


"పెళ్లి అయిన కొద్దినెలలకే దాని వైవాహిక జీవితం విఛ్చిన్నమవడం, తరువాత డైవర్స్ తట్టుకోలేకపోతున్నానే రోహిణీ" అంటూ ఏడ్వసాగింది !

"ఎందుకేడుస్తావే! ధృతి చాలా మంచిపని చేసిందని సంతోషించవే !"

"సంతోషమా? పెద్దదానికి డైవర్స్ అయిందని తెలిస్తే చిన్నదాన్ని చేసుకోడానికి ఎవరొస్తారే ? "


"నిక్షేపంలా వస్తారు.. లోకం అన్నీ గుడ్డిగా నమ్మేస్తుందని అనుకోకు.. దాన్ని ఇష్టపడి పెళ్లిచేసుకోడానికి ఎవరైనా అబ్బాయి ముందుకురావచ్చు .

ఒక్క విషయం మాట్లాడుతాను, ఏమీ అనుకోవుగా ?"


"అనుకోను !"


"అతను ఇంజనీరింగ్ చదివాడు, ఏదో కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరంటే నమ్మేయడమేనా ? పైగా కట్నం వద్దన్ననారని చాలా ఉన్నతమైనవారని, ఆహా, ఓహో అనుకుంటూ సంబరపడ్డారు .ఇకనైనా రెండోదాని పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండండే . అంతా మీ మంచికే జరిగిందని సంతోషపడు అమలా!"

***


కాలగర్భంలో మరో రెండు సంవత్సరాల మంచులా కరగిపోయాయి..


అనుకోకుండా శృతి ఆఫీస్ కొలిగ్ అశోక్ శృతిని ఇష్టపడ్డాడని ఇరువైపు పెద్దల అంగీకారంతో చాలా ఘనంగా వివాహం జరిగింది.. ధృతి డైవర్స్ విషయం అశోక్ కుటుంబానికి ముందరే చెప్పేసరికి ధృతి గురించి బాధ పడద్దని, ఆ అమ్మాయికి తిరిగి మంచి సంబంధం చూసి పెళ్లిచేద్దామని, ఆ విషయంలో తాముకూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ..

"చూసావా అమలా, నేను నీకు ఆ రోజే చెప్పాను లోకం గుడ్డిది కాదని. శృతి అత్తమామలలాంటి మంచివాళ్లూఉంటార"ని రోహిణి అనగానే అమల 'ఔనం'టూ ఒప్పుకుంది..


ఒకరోజు అమలనుండి ఫోన్.. " ధృతిని రెండుసంవత్సరాల పాటు ప్రాజక్ట్ పనిమీద అమెరికా పంపిస్తున్నారు". ఇది వెడ్తానని సిధ్దమౌతోంది..

'అమ్మా! నేను పెళ్లిచేసుకోనని అనడంలేదుగా.. ఈలోగా సంబంధం కుదిరితే నాకు చెపితే వచ్చి చేసుకుంటా'నంటోంది.. నాన్న రిటైర్ అవబోతున్నారు, పెన్షన్ రాదు, సొంత ఇల్లు లేదంటూ మాకోసం టూ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ కొనేసింది.. 'రెండేళ్లు ఎంతలో గడుస్తాయమ్మా, మీరు హాయిగా ఆనందంగా ఉండండి' అంటూ చెప్తోందే రోహిణీ" అని చెప్పేసరికి,


"నీ లేని పోని అనుమానాలూ, సెంటి మెంట్స్ తో దాని ఆత్మవిశ్వాసాన్ని సడలనీయకే అమలా. దాన్ని ప్రోత్సహిస్తూ పంపించవే" అంటూ ధైర్యం చెప్పింది .

కాలం మరో సంవత్సరం ముందుకు అడుగు వేసింది..


ఒకరోజు రోహిణి రెండోకోడలు నేత్ర నుండి ఫోన్.. " అత్తయ్యా, మీకో గుడ్ న్యూస్ , మీరు ధృతి ప్పొఫైల్ పంపి ఏమైనా సంబంధాలు ఉంటే చెప్పమన్నారుకదా.. మీ అబ్బాయి ఫ్రెండ్ ప్రశాంత్ కజిన్ ఇక్కడే నాలుగు సంవత్సరాలనుండి జాబ్ చేస్తున్నాడు.. ఆర్ధికపరమైన కుటుంబ బాధ్యతలతో అతను వివాహం చేసుకోలేదు. మొన్న వీకెండ్ లో ధృతిని పిలిపించి అతన్ని పరిచయం చేసాం.. ఇద్దరూ కలసి మాట్లాడుకుని ఇష్టపడ్డారు.. ధృతి ఏమందో తెలుసా, " ఈ గుడ్ న్యూస్ ని నేను మా అమ్మతో చెప్పేకంటే రోహిణీ ఆంటీ చెపితేనే అమ్మ ఎక్కువ ఆనంద పడుతుందని".. ఆ అబ్బాయి పేరెంట్స్ అడ్రస్ వాట్సాప్ చేస్తున్నాను.. వాళ్లబ్బాయి ఎవరిని ఇష్టపడి చేసుకున్నా అభ్యంతరం ఉండదని, ఆ అబ్బాయి పెళ్లిచేసుకుంటే చాలని అంటున్నారుట.. వాళ్లను కలసి మాట్లాడుకుని ముహూర్తాల ఏర్పాటు చేసుకోమని చెప్పం"డంటూ మాట్లాడింది..


అబ్బా, ఎంతటి శుభవార్త! దానికి ఫోన్ లో చెప్పడంకాదు.. స్వయంగా వెళ్లి దాన్ని సర్పైజ్ చేసి, దాని కళ్లల్లో చిందులేసే ఆనందాన్ని తనివితీరా చూడాలనుకుంటూ బయలదేరింది..


చెప్పాపెట్టాకుండా వచ్చేసిన రోహిణిని చూస్తూ ఆశ్చర్యపోయింది అమల.. కాసేపు స్తిమిత పడ్డాకా, కేజువల్ గా అడిగనట్లుగా " ఏమంటోంది మీ ధృతి" అనగానే, ఏమిటోనే వర్క్ తో బిజీగా ఉంటున్నానంది. దాని పెళ్లికూడా అయిపోతేనే నాకు నిశ్చింత" అంటూ మాట్లాడుతున్న అమలవైపే చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వసాగింది..


'ఏమిటే నేను సీరియస్ గా చెప్తుంటే నవ్వుతున్నా'వంటూ మూతి ముడుచుకుంది.. తనుకూడా ఆ శుభవార్తను ఇంక దాచలేకపోతోంది.. " పెళ్లి షాపింగ్ ఎప్పుడు చేద్దామనగానే " అమలొక క్షణం విస్తుబోతూ రోహిణివైపే చూస్తూ " పెళ్లా, ఎవరికే "? అనగానే మన ధృతికే అంటూ నేత్ర చెప్పిన వివరాలన్నీ చెప్పేసరికి అమల ఆనంద పారవశ్యంతో రోహిణి ని గట్టిగా కౌగలించుకుంటూ " ఇది కలా, నిజమా రోహిణీ, నిజమే కదూ" అంటూండగా ఆమె కళ్లనుండి ఆనందాశ్రువులు రాలిపడ్డాయి.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి. మానస వీణ సొంత ఇంటి కల మమతలూ - అనుబంధాలు అపర్ణ రివార్డ్ కురువింద డెలిగేషన్ ఆఫ్ అధార్టీస్ పరిణితి తరాలూ - ఆంతర్యాలూ నీతోనే నా జీవితం హేపీ ఉమెన్స్ డే !

ఈవెంట్ మేనేజర్ రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


197 views0 comments

Comments


bottom of page