top of page

ఈవెంట్ మేనేజర్


'Event Manager' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

ఆ ఊరిలో ప్రముఖ లీడింగ్ లాయర్ అయిన సుదర్శనరావుగారి కూతురు సంహిత వివాహం ఇంకొక పదిరోజుల్లో ఉందనగా వారి కుమారుడు "సరోజ్" యూ..ఎస్.. నుండి వచ్చాడు. చెల్లాయ్ పెళ్లికి తనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని !

“పెళ్లి ఏర్పాట్లు.. అవీ ఎంత వరకు వచ్చాయి నాన్నా?” అని అడిగాడు..

“ఏముంది సరోజ్, ఈవెంట్ మేనేజ్మెంట్ కి కాంట్రాక్ట్ ఇచ్చేసాను.. వాళ్లే వెడ్డింగ్ కార్డ్స్ నుండి అన్నీ చూసుకుంటారుట.. స్నేహితులు, బంధువులు, పరిచయస్తుల లిస్ట్ ఇచ్చేసాను.. ఎవరెవరికి శుభలేఖలు పంపాలో, అలాగే ఎవరెవరికి వాట్సాప్ లో పంపచ్చో చెప్పేసాను.. దాని ప్రకారం వారు చూసుకుంటారు. ఇంకా దగ్గర ఆత్మీయులు అన్నవారికి మాత్రం నేను మీ అమ్మా వెళ్లి స్వయంగా పిలుస్తాం. మిగతా కార్యక్రమాలన్నీ ఈవెంట్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది.” మనకేమీ శ్రమ ఉండదని చాలా సునాయసంగా చెప్పేసారు సుదర్శన రావుగారు.

“ఇదిగో ఈవెంట్ మేనేజ్మెంట్ వారి విజిటింగ్ కార్డ్.. వీలైతే నీవు ఫాలో అప్ చే”యంటూ ఆయన కోర్టుకి వెళ్లిపోయారు !

కార్డ్ చూసాడు, " తాన్య " ఎమ్ ..బి..ఏ (ఈవెంట్ మేనేజ్మెంట్ ) డైరక్టర్ అని, ఆ ఆఫీస్ అడ్రస్, ఫోన్ నంబర్ వగైరా అన్నీ ఉన్నాయి !

ఫోన్ చేసాడు.. అవతలవైపు నుండి ఒక తీయని స్వరం, తాన్యా హియర్ అంటూ !

' సరోజ్' తనని తాను ఫలానా అని పరిచయం చేసుకుంటూ, సంహిత పెళ్లి ఎరేంజ్ మెంట్స్ ప్రోగ్రస్ తెలుసుకుంటూ ఫంక్షన్ హాల్ డెకరేషన్స్ గురించి మాట్లాడాడు.. తాన్య అలా ఫోన్ లో చెప్పేకంటే మీరు ఒకసారి ఫంక్షన్ హాల్ కు రండి, మీకు వివరిస్తాను అన్నీ, కావాలంటే మీరు కూడా ఏవైనా సలహాలుంటే సూచించవచ్చని మృదువుగా జవాబిచ్చింది !

ఆ సాయంత్రం అనుకున్న టైమ్ కు సరోజ్ పెళ్లికని బుక్ చేసిన ఫంక్షన్ హాల్ కు వెళ్లాడు.. సరోజ్ వెళ్లేసరికి తాన్య అతనికోసమే ఎదురుచూస్తోంది.. సరోజ్ కారు ఆ ప్రాంగణంలో ఆగగానే అతనికి ఎదురుగా వెళ్లి తనని తాను పరిచయం చేసుకుంది.. తాన్యను చూడగానే సరోజ్, అబ్బ ఎంత బాగుందీ అమ్మాయి అని అనుకోకుండా ఉండలేకపోయాడు.. ఇరవై అయిదు, ఇరవై ఆరు సంవత్సరాల వయస్సుండొచ్చు.. సన్నగా పొడుగ్గా, జీన్స్ పాంట్ , లూజ్ చెక్స్ షర్ట్ లో తన పొడవైన జుట్టుని పైకిమడిచేసి క్లిప్ పెట్టేసి హడావుడిగా వచ్చేసినట్లు కనపడుతోంది.. పైకి ఎంతో అందంగా నవ్వుతో సరోజ్ ను విష్ చేసింది.. చక్కని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అతని తో ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చింది.. హాలు చాలా బాగుంది.. వెయ్యి మంది అతిధులకు పైగా సరిపడ విశాలమైన హాలు ! హాలు బయట విస్తీర్ణంలో చక్కని గార్డన్స్, రంగు రంగు పూల చెట్లూ, లాన్స్ తో చూడమనోహరంగా ఉంది.

హాల్ సెలక్షన్ లో ఆమె అభిరుచిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు !

హాలంతటినీ చూపిస్తూ, సీటింగ్ ఎరేంజ్ మెంట్, ఎన్ట్రన్స్ లో ఏవిధమైన ఏర్పాట్లు డెకరేషన్ చేయించవచ్చో, అలాగే వివాహవేదిక అలంకరణా అన్నీ చక చకా చెప్పేస్తోంది.. చాలా చురుకుగా అటూ ఇటూ, ముందుకూ వెనక్కీ నడచి ఏ ఏంగిల్ లో ఏ డెకరేషన్ అతిధులను ఆకర్షిస్తుందో వివరిస్తూ చూపిస్తోంది.. అబ్బా, ఏమి వాగ్ధాటి ఈమెదీ, చక్కని స్పృజనాత్మకతే కాకుండా, విభిన్నమైన ఆ అమ్మాయి ఆలోచనలను , సమయస్పూర్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు సరోజ్ !

ముందు రోజు రాత్రి రిసెప్షన్ కు హాల్ డెకరేషన్ ఎలా చేయాలనుకుంటున్నారో , ఆ లైటింగ్ అరేంజ్ మెంట్స్ అవీ ఎలా ఉంటే ఆకర్షణీయంగా ఉంటుందో, అలాగే అతిధుల సీటింగ్ అదీ కొత్త తరహాలో ఉంటే బాగుంటుందని డిజైన్ స్కెచ్ వేసి చూపించింది ! పెద్ద పెద్ద ప్రముఖల ఇళ్లల్లో జరిగిన వివాహ వేడుకల క్లిప్పింగ్స్ ను చూపెడుతూ...... ఇది బాగుంది కదూ మిస్టర్ సరోజ్ అంటుూ తలెత్తి సరోజ్ ముఖంలోకి చూసిన తాన్య , సరోజ్ తన వైపే కళ్లు ఆర్పకుండా చూడడం చూసి చప్పున తలదించేసుకుని, ఆ వెంటనే తేరుకుంటూ, ‘నేనే ఎక్కువ మాట్లాడేస్తున్నాను కదూ, మీకు ఛాన్స్ ఇవ్వకుండా’ అనేసరికి సరోజ్ ......

" మొత్తానికి ప్రొఫెషనల్ అనిపించుకున్నారు తాన్యా " అనేసరికి ఒక్క క్షణం సిగ్గుపడింది.. అసలే పచ్చని ఛాయలో మెరిసిపోతున్న ఆ అమ్మాయి , ఆ చిన్న పొగడ్తకే ముఖం ముద్దమందారంలా అయింది !

“అనిపించుకోవాలి కదా, మిస్టర్ సరోజ్, లేకపోతే ఆర్డర్స్ ఎలావస్తాయి మాకు ?”

“మీది సొంతమా ఈ కంపెనీ?” అని అడగగానే, “అవునండీ........ నాదగ్గర పదిహేనుమంది అసిస్టెంట్స్ ఉన్నారు.. ముందు ఇద్దరితో ప్రారంభించాను, కష్టపడ్డాను, మంచి ఎప్రియేషన్స్ వచ్చాయి.. ఆదాయం పెరిగింది. అలాగే ఆర్డర్స్ కూడా బాగా వస్తున్నాయి.. మా ఆఫీస్ జూబ్లీహిల్స్ లో ఉంది..”

“మీరు ఇలా సొంతంగా చేసేబదులు, మంచి కార్పొరేట్ జాబ్ చూసుకోవచ్చుకదా, అయినా మీరు ఎమ్ బి ఏ ఎక్కడ చదివారు ?”

" ‘నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్ మెంట్’ ముంబాయిలో చదివాను , మంచి గ్రోయింగ్ డిమాండ్ ఉన్న సబ్జక్ట్ కదా అని !

ఫైనల్ ఇయర్ లో ఉండగానే కేంపస్ రిక్రూట్ మెంట్ లో ‘లాక్మే’ , ‘ఫిలింఫేర్ మీడియా హౌస్’ లో ఈవెంట్ ఎగ్జిక్యూటివ్ గా సెలక్షన్ వచ్చింది.. .. కాని ఆ ఫీల్డ్ చాలా ఛాలంజింగ్ ! కష్టపడాలి, మనలని మనం ఎప్పుడూ అప్ డేట్ చేసుకుంటూ పోవాలి.. రిస్క్ మేనేజ్ మెంట్ స్కిల్స్ ఒక్కటే కాకుండా, మీడియా మేనేజ్ మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి !

అయినా ఇండిపెండెంట్ గా చేయాలని ఆసక్తి, ఎందుకు చేయలేనన్న పట్టుదల, ఆత్మవిశ్వాసం నన్ను ఈ విధంగా చేయడానికి పురిగొల్పింది.. నెలంతా కష్టపడి పనిచేస్తే వచ్చే జీతం కంటే వీటి మీద రెవెన్యూ బాగా వస్తోంది ! మరో పదిహేను మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నానన్న ఆనందం కూడా ఉందం”టూ చిరునవ్వు నవ్వింది !

“గుడ్ గుడ్...... మనం ఏ పనిని ఛూజ్ చేసుకున్నా అందులో సంతృప్తి ఉండాలి తాన్యా, లేకపోతే ఆ పని బోరింగ్ గా ఉంటుంది.. ఛాలంజెస్ ను ఫేస్ చేయాలనేదే నా అభిప్రాయం కూడా ! అదీగాక మనలని మనం అప్ డేట్ చేసుకుంటూ పోవాలి, లేకపోతే డిక్లైన్ స్టేజ్ కు వెళ్లిపోతాం !”

“మీరు...... యూ..ఎస్ లో ఏమి చేస్తున్నారు సరోజ్ ? మీకు అభ్యృతరం లేకపోతేనే చెప్పండి!”

“బాగుందండీ, మీ గురించి అన్ని వివరాలూ అడిగిన నేను చెప్పకుండా ఎలా ఉంటాను !

హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎమ్ బి ఏ ఫైనాన్స్ చేసాను.. నా డ్రీమ్ అది చిన్నప్పటినుండీ !

ప్రస్తుతం అక్కడే జె..పి..మోర్గాన్ బేంక్ లో ఫైనాన్షియల్ అడ్వైజర్ గా చేస్తున్నాను, రెండు సంవత్సరాలనుండి !”

“గ్లాడ్ మిస్టర్ సరోజ్ ........ అందరికీ ఆశయాలూ, అభిరుచులూ ఉంటాయి, కాని అవి కొంతమందికే నెరవేరుతాయి, అందులో మీరు ఒకరు” అంటూ ప్రశంసించింది !

“ఏం, మీరు లేరా అందులో?” అంటూ చిలిపిగా అడిగిన ప్రశ్నకు, నవ్వుతూ......”య్యా .... “ అంటూ జవాబిచ్చింది !

“సరే ఇంక వెడదామా తాన్యా ? బడ్జట్ గురించి ఆలోచించకండి, క్వాల్టీ ప్రాడక్ట్స్ పెట్టండి.. ఆ......ఇంకొకటి, డెకరేషన్ మరీ అతిగా వేలంవెర్రిగా అనిపించకూడదు.. క్లాసిక్ గా చూడగానే మరోసారి చూడాలన్న ఆసక్తి కలిగించేలా ఉండాలి.. డీసెన్నీ ముఖ్యం.. లైటింగ్‌, సౌండ్స్‌ అండ్‌ డిజే, ఫొటో, వీడియో గ్రఫీ, వీడియో క్రేన్‌, ఎల్‌ఇడి టీవీ, బ్యాండ్‌, సన్నాయి మేళా ఇవన్నీ కన్నులవిందుగా, ఆహ్లాదకరంగా ఉండాలి.. బై..ది....బై ఈ ఈవెంట్ మన హిందూ సంస్కృతిలో ఒక భాగం గా చూడడానికి కనువిందుచేయాలని మరచిపోకండి తాన్యా !

ఇంకా చెప్పాలంటే మీ కంపెనీ ప్రచారానికి కూడా ఉపయోగపడాలిగా మా చెల్లాయ్ పెళ్లి ఈవెంట్ .....” అనగానే తాన్యా ఫక్కున నవ్వింది..

“అవునౌను, నో అదర్ ఎడ్వర్ టైజ్మెంట్ ఈజ్ ఎజ్ గుడ్ ఏజ్ ఎ సేటిస్ ఫైడ్ కస్టమర్ . నేను ఈ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటాను సర్...... బై...... మీట్ యూ అగైన్ .... “ అంటూ వీడ్కోల్ తీసుకుని వెళ్లిపోతున్న తాన్యా వైపు అలా చూస్తూ ఉండిపోయాడు !

ఈ అమ్మాయికి పనిపట్ల ఎంత కమిట్ మెంట్ ! తాన్యా వెళ్లిపోయినా కూడా ఆ అమ్మాయి తాలూకా ఒక విధమైన పరిమళం, ఒక చైతన్యం అలా కొద్దిసేపటిపాటు తను అనుభవించినట్లు ఫీల్ కలిగింది !

అనుకున్నట్లుగా లాయర్ గారమ్మాయి సంహిత పెళ్లి చాలా అట్టహాసంగా జరిగిపోయింది.. పెళ్లికి వచ్చిన అతిధులందరూ, పెళ్లి ఏర్పాట్లూ, ఆ ఫంక్షన్ హాల్ డెకరేషన్స్ కూ, ఎక్కడకక్కడ అందుబాటులో ఉన్న చక్కని సదుపాయాలకూ, చక్కని భోజనాలకూ అప్రభితులైన మాట వాస్తవం.. చాలా డీసెంట్ ఏర్పాట్లు జరిగాయని ప్రశంసించారు ! ఈవెంట్ మేనేజ్ మెంట్ ఎవరిదని ప్రత్యేకంగా ఆరాతీసారు.. పెళ్లి చూడడానికి వచ్చిన తాన్య చక్కని కంచి పట్టుచీరలో సాంప్రదాయంగా తయారయి వచ్చింది.. ఎప్పుడూ చిరునవ్వుతూ ఉండే ఆ అమ్మాయి పట్టుచీరలో, నగలతో చూడముచ్చటగా ఉంది.. సరోజ్ అయితే కళ్లు తిప్పుకోలేకపోయాడు.. మాటి మాటికి ఆమె వైపే అతని దృష్టి అంతా.. ఆకుపచ్చని పట్టుచీరకు పింక్ కాంబినేషన్ తో అందమైన నెమళ్ల బోర్డర్ తో ఉన్న చీర, పూర్తి మేచింగ్ లో ఉన్న తాన్యను చాలామంది అలా చూస్తూనే ఉన్నారు.. అదిగో ఆ ఆకుపచ్చ పట్టు చీరలో ఉన్న అమ్మాయే ఈ ఈవెంట్ మేనేజ్ మెంట్ కు యజమాని అనగానే అందరూ ఒకటికి రెండుసార్లు ఆమె వైపు ఉత్సుకతో మరీ చూస్తున్నారు.. !

తాన్య వీడ్కోలు తీసుకుందామని సరోజ్ ను కలవాలని చూస్తోంది.. ఈలోగా అతను రావడం, తాన్య ప్రాజక్ట్ ను ప్రశంసించడం, ఏర్పాట్లూ, డెకరేషన్సూ అన్నీ ఎక్సలెంట్ గా ఉన్నాయని, అందరూ హేపీ అయ్యారని చెపుతూ......”యూ డిడ్ ఎ స్పెలిండిడ్ జాబ్ తాన్యా, కానీ ఈ ఈవెంట్ ఇంకా పూర్తి కాలేదు, కొనసాగుతుంది.. రేపు మీ ఆఫీస్ కు వచ్చి పేమెంట్ వగైరా సెటిల్ చేస్తా”నని చెప్పి ఆమెకు వీడ్కోలు పలికాడు..

తాన్య అక్కడనుండి బయలదేరుతూ అనుకుంది, ఏమిటీ ఈవెంట్ పూర్తికాలేందటున్నాడు సరోజ్, అతని పెళ్లి కూడా ఉందా బహుశా, దానికి మరో కాంట్రాక్ట్ తనకు ఇవ్వాలని అనుకుంటున్నాడా అని తలబోసింది ! ఈ ఈవెంట్ మూలాన తనకు ముందు ముందు చాలా ప్రాజక్ట్స్ రావచ్చు, ఎందుకంటే పెళ్లికి వచ్చిన చాలా గొప్ప గొప్ప వాళ్లు తన కంపెనీ వివరాలు అడిగి మరీ తీసుకున్నారు !

మరుసటిరోజు ఉదయం పదకొండుగంటలకు సరోజ్ తాన్య ఆఫీస్ కు వెళ్లాడు.. సరోజ్ వెళ్లేసరికి ఆమె ఎవరో కస్టమర్స్ తో బిజీ గా ఉంది.. సరోజ్ ను చూడగానే తన పీఏ ను పంపించి రిసెప్షన్ లో సోఫాలో అతన్ని కూర్చోపెట్టమని, కాఫీ అరేంజ్ చేయమని చెప్పింది.. ఒక పావుగంట తరువాత సరోజ్ కు పిలుపు వచ్చింది, మేడమ్ రమ్మంటున్నారని !

తాన్స కేబిన్ లోకి అడుగుపెట్టి విష్ చేసాడు సరోజ్ ! తాన్య కేబిన్ చాలా అందంగా హుందాగా తీర్చి దిద్దుకుంది.. ఎంతైనా స్పృజనాత్మకత తెలిసిన అమ్మాయనుకున్నాడు..

ఫైనల్ పేమెంట్ కు చెక్ వ్రాసి ఇస్తుంటే ఆ చెక్ తీసుకుని పీ..ఏ కిచ్చింది ! ధాంక్స్ చెబుతూ......” ఊ.... చెప్పండి సరోజ్ ...... నిన్న నేను మీనుండి వచ్చేస్తుంటే, ఈ ఈవెంట్ ఇంకా పూర్తి అయిపోలేదని కొనసాగుతుందన్నారు !

మరొక ఫంక్షన్ ఏమైనా ఉందా మీ ఇంట్లో, ఎందుకంటే నేను ప్రోగ్రామ్ ప్లేన్ చేసుకోవడం ఒక్కటేకాదు, మా స్టాఫ్ స్కెడ్యూల్స్ కూడా మానిటర్ చేసుకోవాలని అడిగాను, ఏమీ అనుకోరుగా” అంటూ ప్రశ్నించింది !

పక్కా వ్యాపార ధోరణిలో మాట్లాడుతున్న ఆమె వైపే చూస్తూ......” ముందుగానే చెబుతాను మేడమ్, మీరు నాకోసం రెండుమూడు గంటల సమయాన్ని కేటాయించగలరా” అని సూటిగా అడిగాడు సరోజ్ !

“ఓ....యా.... ష్యూర్.... చెప్పండి !

ఇక్కడకాదు, బయటకు లంచ్ కు వెడదాం.. అక్కడ మాట్లాడుకుందాం, అభ్యంతరంలేకపోతేనే” అంటూ తాన్య వైపు చూస్తూ అన్నాడు !

“ఓకే “ అంటూ తాన్య సరోజ్ తో బాటు బైటకు వచ్చింది.. కారులో ఇద్దరూ బంజారాహిల్స్ తాజ్ క్రిష్ణాకు వచ్చారు !

లంచ్ కు ఆర్డర్ ఇచ్చిన తరువాత సరోజ్ తాన్య వైపే చూస్తూ మెల్లిగా సంభాషణ కొనసాగించాడు !

“మీ సమయాన్ని వృధాపరుస్తున్నానేమో కదూ మేడమ్ ? “

“నో...... సరోజ్ గారూ...... నా ప్రొఫెషన్ లో ఒక భాగంగా అనుకుంటున్నాను, కేరీ ఆన్ ......”

“ప్రొఫెషనే కాదు, జీవితంలో ముఖ్య భాగం అని నేననుకుంటున్నాను తాన్యా !”

“నాకు అర్ధం కావడం లేదు సరోజ్ !”

“నేనసలు యూ ఎస్ నుండి ఇండియా వచ్చేసి సొంతంగా కన్ సల్టెన్సీ పెట్టాలన్న ఆలోచనలలో ఉన్నాను.. కానీ అనుకోకుండా మా కంపెనీ ఇక్కడ నుండే నా వర్క్ ను కొనసాగించమని ఒక నాలుగురోజుల క్రితం వీడియో ఛాట్ చేసింది.. ఇక్కడనుండే మా ఆఫీస్ బిజినెస్ వ్యవహారలను డెవలప్ చేయమని ఆదేశించింది !”

“ఓ.... కంగ్రాట్స్ సరోజ్ గారూ...... ఈ సంతోషకరమైన సంధర్భంలో ఏదైనా ఈవెంట్ జరిపించాలని ప్లేన్ చేస్తున్నారా”, ఔత్సికతతో ప్రశ్నించింది !

“అదే అనుకుంటున్నాను, తాన్యా ! మీరు అంగీకరిస్తే ?”

“అయ్యో అదేమిటి మిస్టర్ సరోజ్, మీలాంటి కస్టమర్ నా డిస్పాయింట్ మెంట్ చేయడం?

తప్పకుండా టేకప్ చేస్తాను, వివరాలు చెపుతారా మిస్టర్ సరోజ్ ?”

“ష్యూర్” అంటూ...... “నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను తాన్యా, మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తిగా అనిపించారు.. నేను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి మీలాగే ఉండాలని కలలు కన్నాను.. ధైర్యంగా, చలాకీగా, ఆత్మవిశ్వాసంతో స్వతంత్ర భావాలు కలిగి ఉండాలని.. మీరు నాకు నచ్చేసారు.. మీరే అన్నారు ఒకసారి, అందరికీ ఆశయాలూ, అభిరుచులూ ఉంటాయి, కాని కొంతమందికే నెరవేరుతాయని..

ఈ విషయంలో నా అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకుంటున్నాను తాన్యా, మీ అభిప్రాయం ఏమిటి ?”

సరోజ్ మాటలకు ఎంతో ధైర్యంగా ఉత్సాహానికి ప్రతీకగా ఎప్పుడూ గల గల మంటూ మాట్లాడే తాన్య మౌనంగా తలదించుకుంది !

“మీరు మీ ప్రొఫెషన్ ను మాననవసరంలేదు ఇప్పటిలాగే కొనసాగించవచ్చు, మీకు ఇష్టమున్నంతకాలం !

మీరు ఏ సమాధానం చెప్పినా నేను పాజిటివ్ గానే తీసుకుంటాను.. మీ లెక్క ప్రకారం నాకు మీపట్ల గల ఇష్టాన్ని మరింత అందంగా చెప్పి ఉండాలేమో కదూ, ఎందుకంటే చక్కని స్పృజనాత్మకతో, పరిసరాలను అందంగా తీర్చి దిద్ది మనుషులను ఆనందపరచడం మీ ప్రొఫెషన్ కదా......

మరి......నేను ? మీ సహవాసంలోనైనా అందంగా మాట్లాడడం నేర్చుకుంటానేమోనన్న ఆశ తాన్య గారూ !”

ఆ మాటకు ఫక్కున నవ్వింది తాన్య ! మల్లెలు విరిసినట్లుగా !

“అందంగా మాట్లాడడం రాదంటూనే ఎంత అందంగా చెప్పారు సరోజ్, మీ మనసులోని భావాన్ని !”

అలా అంటూండగా ఆమె ముఖం మ్లానమైంది.. “సారీ సరోజ్, నేను అందుకు అర్హురాలిని కా”దంటూ తల దించుకుని చేతి గోళ్లవైపు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయింది..

“అంటే, అర్ధమయ్యేలా చెప్పండి తాన్యా, మీ మౌనాన్ని భరించలేకపోతున్నాను..”

“నేను......నేను డివోర్సీ ని సరోజ్ !

నాకు రెండు సంవత్సరాల క్రితమే పెళ్లి అయింది.. అమెరికా సంబంధం అంటూ చేసారు నా పేరంట్స్.. అమెరికాలో అతనితో ఉన్న ఒక ఆరునెలలలోనే అతని వ్యక్తిత్వం, అలనాట్లు అన్నీ తెలిసిపోయాయి.. నన్ను పెళ్లిచేసుకున్నా అతనికి వేరొకామెతో చాలా కాలంనుండి సంబంధం కొనసాగుతోంది.. విషయం తెలిసిన నేను ఇదేమిటీ అని అడిగినందుకు నన్ను దారుణంగా శారీరకంగా హింసించి దిక్కున్నచోట చెప్పుకో అంటూ అసహ్యంగా మాట్లాడేవాడు.. నా ఫ్రండ్స్ సహాయంతో అక్కడనుండి బయటపడి ఇండియాకు వచ్చేసాను.. డివోర్స్ తీసుకోవడం, ఆ తరువాత నేను ఈ ప్రొఫెషన్ ను కొనసాగిస్తూ నన్ను నేను మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు తిరిగి వివాహం పట్ల ఇఛ్చ కలగడంలే”దంటూ సంభాషణ ముగించింది..

ఒక్క క్షణం నిశ్శబ్దం అలుముకుంది అక్కడ..

ఉన్నట్టుండి సరోజ్ " మీకు తిరిగి అందమైన జీవితం ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను తాన్యా, నన్ను నమ్మండి, నేనేదో ఆవేశంలోనో , మీమీద జాలితోనో అనడంలేదు.. మీరు మీ గురించి చెప్పాక మీపట్ల నా ఇష్టం మరింత పెరిగింది..

ఆ....మీకో సంగతి చెప్పనా తాన్యా ?

మా అమ్మా నాన్నగారూ ఇద్దరూ లాయర్లే.. అయితే అమ్మ ఒక గృహిణిగా ఉండాలనుకుని, పిల్లల బాధ్యత ఇంటి బాధ్యతనూ నిర్వహించుకునే ఉద్దేశంతో పెళ్లి అవగానే ప్రాక్టీస్ మానేసింది.. అమ్మకి నాన్నగారితో వివాహానికి పూర్వమే పెళ్లి అయింది.. కానీ హార్ట్ ఎటాక్ తో ఆయన పోయారు.. అప్పట్లో అమ్మ నాన్నగారు వృత్తిరీత్యా కొలీగ్స్.. నాన్నగారు అమ్మను వివాహం చేసుకుంటానని ప్రపోజ్ చేసి వప్పించారుట.. నాన్నగారి సాన్నిహిత్యంలో అమ్మ జీవితం తిరిగి చిగురించింది..

మిమ్మలని వివాహంచేసుకునే విషయంలో మా పేరెంట్స్ నుండి నాకు ప్రోత్సాహమే ఉంటుందికానీ, వద్దని అభ్యంతరం చెప్పరు..

అసలు చెప్పండి నేనంటే మీకు ఇష్టం ఉంటే దేని గురించీ ఆలోచించకండి ప్లీజ్ ! డూయూ లవ్ మీ తాన్యా?”

“మీరంటే ఇష్టం లేదని కాదు సరోజ్ ! మీలోని హుందాతనానికి చక్కని మీ అభిప్రాయాలకు నేను ఎప్పుడో బందీని అయిపోయాను ! నా అభిప్రాయాలను ఆశయాలనూ ప్రోత్సహించే మీరంటే నాకు గౌరవం కూడా ! కానీ ఒకసారి పెళ్లయినదాన్ని.. మీరు తలచుకుంటే నాకంటే అన్నివిధాల ఉన్నతమైన అమ్మాయి మీ జీవిత భాగస్వామి అయ్యే అవకాశం ఉండగా, ఈ అల్పురాలే కావాలని కోరుకోవడం సమంజసమా , చెప్పండి సరోజ్ ?”

“మరి ఇది సమంజసమా తాన్యా, మీకు మీరే అల్పురాలునని ఫీల్ అవడం ?

అసలు మీరు నిజంగా నన్ను ఇష్టపడితే ఇలా మాట్లాడరు ?”

తలొంచుకున్న తాన్యా తలెత్తి సరోజ్ కళ్లలోకే చూస్తూ " నేను ప్రొఫెషన్ లో ఎంత ధైర్యస్తురాలినైనా, నేనూ ఒక ఆడపిల్లనే, సహజసిధ్దమైన స్త్రీ తత్వ భావాలు నాలోనూ ఉన్నాయి, అందుకనే మీరు ప్రొపోజ్ చేయగానే మాటలురాని మూగదాన్నైనాను ఒక్క క్షణం ! నాకు ఇంత అదృష్టమా అనుకున్నాను.. మోడువారిపోయిన నా జీవితాన్ని తిరిగి చిగురింపచేస్తానని ఆప్యాయంగా తన గుండెల్లో పెట్టుకోవాలని చూస్తున్న నా తోటమాలికి ఎప్పుడో బందీని అయిపోయాను సరోజ్” అంటూ సిగ్గుతో కళ్లుదించుకున్న తాన్యనే చూస్తూ........

“నీ భావాన్ని ఇంత అందంగా చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది.. నేను కోరుకున్న అమ్మాయి నా జీవిత భాగస్వామి అవుతున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని,

చెల్లాయి పెళ్లి అయిపోయింది, అత్తారింటికి వెళ్లిపోతుంది, ఇల్లు అంతా చిన్నబోతుంది, నన్ను కూడా త్వరలో పెళ్లిచేసుకొమ్మని, ఎవరినైనా ఇష్టపడి ఉంటే చెప్పమని నిన్న అమ్మా నాన్నగారు అడిగారు.. నీ అభిప్రాయం తెలుసుకోకుండా ఏమి చెపుతాను?

మా అమ్మా నాన్నగారిని తీసుకుని ఎల్లుండి సాయంత్రం మీ ఇంటికి వస్తాం తాన్యా.

ఆ అన్నట్లు మన పెళ్లికి ఈవెంట్ మేనేజ్ మెంట్ ఎవరికిద్దామబ్బా......” తాన్యాను ఉడికించాడు !

“ఇంకెవరికి నాకే...... మరొకరికి ఇస్తానంటే నేను ఊరుకుంటానా, మన పెళ్లికి ఈ తాన్యానే ఈవెంట్ మేనేజర్ !”

ఓ...... నాకు ఇప్పుడు ట్యూబ్ లై ట్ వెలిగింది సరోజ్ ! ఆరోజు అందుకనేనా, మీ చెల్లెలి పెళ్లి అయిపోయాక మీకు నేను బై చెపుతున్నప్పుడు, ఈ ఈవెంట్ ఇంకా పూర్తికాలేదు, ఇంకా ఉందన్నారు ?”

“అవును, ఈ అమ్మాయి ఏమైనా నా మాటల్లోని గూఢార్ధం గ్రహిస్తుందేమోనని అనుకున్నాను....

ప్చ్........ అరటిపండు ఒలిచి నోటికి అందించి తినమ్మా అని చెప్పినా అర్ధం చేసుకోలేని అమాయకురాలు, ఎలాగో ఈ పిల్లతో జీవితమంతా......” అంటూ నాటక ఫక్కీలో మాట్లాడుతున్న సరోజ్ ను చూస్తూ......సిగ్గుల పూబంతే అయింది తాన్య .

అనుకున్నట్లుగా సరోజ్ తన తల్లిదండ్రులతో తాన్య వాళ్లింటికి వెళ్లాడు.. తాన్య తల్లిదండ్రులు వీరిని సాదరంగా ఆహ్వానించారు.. తాన్య బంగారపు బొమ్మలా మెరిసిపోతోంది.. ఆమె తల్లిదండ్రుల ముఖాలలో సంతోషం తాండవిస్తోంది.. తాన్యని సరోజ్ అమ్మగారు వాణీబాల ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ నుదిటిమీద ముద్దుపెట్టుకుంటూ, " చూడమ్మా తాన్యా, నీవు నాకెపుడో నచ్చేసావు, మీ అంకుల్ తో కూడా ఎన్నోసార్లు అన్నాను నీగురించి. ఉన్నట్టుండి మా సరోజ్ కూడా నీగురించి చెప్పేసరికి ఆనందం పట్టలేకపోయాం నేనూ మీ అంకుల్ కూడా.. జీవితంలో ఏవో చేదు సంఘటనలన్నవి ఉంటూనే ఉంటాయి.. వాటిగురించే ఆలోచిస్తూ ఇక జీవితమే లేదనుకుంటే ఎలా ? వాటిని ఎప్పటికప్పుడు మరచిపోతూ మనకు దొరికిన అపూర్వ అవకాశాలను చేజారనీయకుండా వాటిని అంది పుచ్చుకుంటూ ముందుకు సాగా”లంటూ ఎంతో ఆప్యాయంగా మాటలాడారు..

రెండు నెలల తరువాత ఒక మంచి ముహూర్తాన సరోజ్, తాన్యాల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది.. సరోజ్ తో కలసి ఏడడుగులు వేయబోయే తమ పరిణయాన్ని ఎంతో అందంగా కళాత్మకంగా తీర్చిదిద్దింది.. ఈ పెళ్లివేడుక తమ ఆదర్శదాంపత్యానికి ఒక చక్కని చిరునామా కావాలని ఒక ఈవెంట్ మేనేజర్ గా చాలా కష్టపడి సరోజ్ ను తన జీవితభాగ స్వామిని చేసుకుంది..

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి. మానస వీణ సొంత ఇంటి కల మమతలూ - అనుబంధాలు అపర్ణ రివార్డ్ కురువింద డెలిగేషన్ ఆఫ్ అధార్టీస్ పరిణితి తరాలూ - ఆంతర్యాలూ నీతోనే నా జీవితం హేపీ ఉమెన్స్ డే !

చేసుకున్నవారికి చేసుకున్నంత రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


42 views0 comments
bottom of page