మేఘమల్హార్ రాగం
- Karlapalem Hanumantha Rao

- 13 hours ago
- 6 min read

Meghamalhar Ragam - Telugu inspirational Story | Karlapalem Hanumantha Rao
మేఘమల్హార్ రాగం - తెలుగు ప్రేరణాత్మక కథ | కర్లపాలెం హనుమంతరావు
Published In manatelugukathalu.com On 18/05/2026
హిందుస్తానీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన తాన్ సేన్ పేరు చుట్టూ ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో మేఘమల్హార్ రాగం కథ అత్యంత భావోద్వేగభరితమైనది. సంగీతం, గౌరవం, త్యాగం, ప్రేమ కలిసిన ఈ కల్పిత గాథ ప్రతి పాఠకుడి హృదయాన్ని తాకుతుంది.
దీపక రాగం ఆలపిస్తే దీపాలు వెలుగుతాయట! మేఘమల్హార్ రాగం ఆలపిస్తే మేఘాలు వర్షిస్తాయట! మొదటి రాగం వేడిని రగిలిస్తే, రెండో రాగం చల్లదనం కలిగిస్తుందన్న అర్థంలో ఈ హిందుస్తానీ రాగాల గురించి జనం అతిశయోక్తి అలంకారంలో చెప్పుకుంటూ ఉండవచ్చు. సామాన్య జనంలో ఆసక్తి రేకెత్తించేందుకు సాధారణమైన విషయాలను అసాధారణ రీతిలో చెప్పడం 'కథనం' యొక్క ప్రత్యేక లక్షణం. ప్రధానమైన అంశాన్ని ఒక కథగా మలచి వినిపిస్తే విన్నంత సేపూ విసుగు పుట్టదు; తరువాత మననం చేసుకునేందుకు కూడా కథా విధానం ఒక మంచి పద్ధతి. ఈ దీపక రాగం, మేఘమల్హార్ రాగాల చుట్టూ కూడా ఇలాగే ఎవరో ఒక కాల్పనిక జీవి సృజనాత్మకమైన చక్కని కథను అల్లారు.
అక్బర్ పాదుషాను గొప్ప కళాభిమానిగా, కళాపోషకుడిగా చెప్పుకుంటారు కదా! ఆయన కొలువులో అన్ని రకాల కళలకు చెందిన నిపుణులకు తగిన గౌరవం దక్కేదని అంటారు. తాన్ సేన్ ఆ కోవకు చెందిన గొప్ప హిందుస్తానీ సంగీత కళాకారుడు.
అక్బర్ దగ్గర ఎంతో చనువుగా ఉండే బీర్బల్ ఒకరోజు దీపక రాగం గురించి పాదుషాకు కథలు కథలుగా చెప్పి ఆయనలో ఆసక్తి రేకెత్తించాడు. దాంతో అక్బర్ నిండు సభలో తనకు ఆ దీపక రాగాన్ని ఆలపించి వినిపించమని తాన్ సేన్‌ను ఆదేశించాడు.
అప్పటిదాకా సుఖంగా సాగిపోతున్న తాన్ సేన్ సంగీత జీవితానికి ఒక పెద్ద ముప్పు ఏర్పడింది. తాన్ సేన్‌కు దీపక రాగం రాక కాదు; అది ఆలపించి చక్కగా దీపాలు వెలిగించి చూపరులకు ఆనందం కలిగించవచ్చు. కానీ, ఆ రాగాన్ని గానం చేసిన గాయకుడు కొద్ది రోజుల్లోనే తీవ్రమైన అనారోగ్యం పాలై, చికిత్స లేని రుగ్మత వల్ల దుర్మరణం పాలవుతాడన్న భయం ప్రచారంలో ఉంది.
కానీ పాదుషా ఆజ్ఞాపించిన మీదట కాదనేందుకు వీలు లేదు. అందుకే తాన్ సేన్ దీపక రాగాన్ని ఆలపించి నిండు సభలో పాదుషా ప్రశంసలు పొందినా, అనుకున్నట్లుగానే తొందరలోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆయనకు చికిత్స చేసిన రాజవైద్యులు పెదవి విరిచి, "దీపక రాగం వల్ల వచ్చిన ఈ తాపానికి మేఘమల్హార్ రాగం ఒక్కటే మందు. అది పాడినా, విన్నా క్రమంగా ఈ వేడి తగ్గుముఖం పట్టాల్సిందే తప్ప మరో దారి లేదు" అని తేల్చి చెప్పారు. కానీ తాన్ సేన్‌కు అప్పటికి ఆ రాగం రాదు. అది వచ్చినవారు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. దాంతో వెతుకులాట మొదలైంది. "పాడేవారు దొరికేదాకా, గుండెల్లో ఆరని ఆ మంటకు ఉపశమనం కలిగేలా తాన్ సేన్‌ను ఏదైనా చల్లని నదీ తీరానికి పంపించండి" అని వైద్యులు సలహా ఇచ్చారు.
పాదుషా అనుమతితో గుజరాత్‌లోని సబర్మతీ నదీ తీరాన ఒక కుటీరం వేసుకుని తాన్ సేన్ విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ రోజుల్లో గుజరాత్ ప్రాంతంపై మొగలాయీల కన్ను పడిందన్న అనుమానంతో, అక్కడి సమాజంలోని ఆడవారు తమ నడవడికను మార్చుకున్నారు. పగటిపూట బయట ముఖాలు చూపించడం దాదాపుగా తగ్గించేశారు. ఇంటి అవసరాలకు కావలసిన నీళ్లను తెల్లవారుజామున చీకట్లోనే నదీ తీరానికి గుంపులుగా వెళ్లి తెచ్చుకునేవారు.
ఆ విధంగా ఒకరోజు నీరు తెచ్చుకునేందుకు నదీ తీరానికి వచ్చిన ఇద్దరు అక్కచెల్లెళ్లు, నది ఒడ్డున ఉన్న కుటీరం బయట గుండెల్లోని ఆవేదన భరించలేక బాధపడుతున్న తాన్ సేన్‌ను చూశారు. "అక్కడెవరో దీపక రాగం ఆలపించి పాపం అనారోగ్యం పాలైనట్లున్నాడే!" అంది ఒక ఆడగొంతు.
రెండో గొంతు "ష్.. ష్.. మనకెందుకు? పద పోదాం!" అంటూ గబగబా బిందెల్లో నీరు నింపుకుని గట్టు ఎక్కి పైకి రాసాగారు.
గట్టు మీద నిలబడి తాన్ సేన్ వారిని చూశాడు. ఆ ఆడవాళ్లిద్దరూ పడుచు వయసులో, ఎంతో అందంగా, పొందికగా ఉన్నారు. "నేను దీపక రాగం ఆలపించినట్లు మీకు ఎలా తెలిసింది తల్లీ?" అని అడగాలని తాన్ సేన్ అనుకున్నాడు. కానీ ఆయన పెదవి విప్పి అడిగేలోపే ఆ ఆడవాళ్లిద్దరూ ఎవరో తరుముతున్నట్లు అక్కడి నుండి వెళ్ళిపోయారు.
మరుసటి రోజు అదే చోట వాళ్ల కోసం కాపు కాసి, కష్టపడి ఎలాగైతేనేం ఆ ఆడపిల్లలిద్దరినీ నిలబెట్టాడు.
తన పేరు తాన్ సేన్ అని, అక్బర్ పాదుషా కొలువులో సంగీత విద్వాంసుడిగా పనిచేస్తున్నానని చెప్పగానే... ఇద్దరిలో చిన్నపిల్ల "అమ్మో! అక్బర్ పాదుషానా!" అంటూ కంగారుపడుతూ అక్క చెయ్యి పట్టుకుని దాదాపు పరిగెత్తిపోయింది.
ఆ తర్వాత విచారించగా, ఆ ఊరిలో మొగలాయీల పట్ల ఉన్న భయం తాన్ సేన్‌కు అర్థమైంది.
మరుసటి రోజు తెల్లవారుజాము చీకట్లలో మళ్లీ ఆ అక్కచెల్లెళ్లను కలుసుకుని, "చెల్లెమ్మలారా! నన్ను చూసి భయపడకండి. మీరు చూస్తే గొప్ప సంగీతజ్ఞుల్లా కనిపిస్తున్నారు. మేఘమల్హార్ రాగం మీకు గానీ తెలిస్తే పాడి నన్ను రక్షించండి అమ్మల్లారా! లేదా ఆ రాగం తెలిసినవాళ్ల వివరాలు చెప్పినా మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను తల్లులారా!" అని పరిపరివిధాలుగా ప్రాధేయపడ్డాడు.
ఆయన దీనస్థితిని చూసి ఆ అక్కచెల్లెళ్లకు జాలి వేసింది. చిన్నపిల్ల ఇలా అంది: "మాకు కొద్దిగా సంగీతం వచ్చు. మేఘమల్హార్ పాడి వినిపిస్తాము. రేపు పౌర్ణమి కదా! తెల్లవారుజామున చీకటి విడకముందే ఈ నదీ తీరానికి వచ్చేయండి. కానీ మేము వస్తున్నట్లు ఎవరికీ చెప్పకండి" అని చెప్పి వెళ్లిపోయారు.
మరుసటి రోజు అనుకున్న సమయానికే అక్కచెల్లెళ్లిద్దరూ నదీ తీరంలో ఎదురుచూస్తున్న తాన్ సేన్‌ను కలుసుకున్నారు. చిన్న అమ్మాయి కుటీరంలోకి వెళ్లి తాన్ సేన్ సితారను తీసుకువచ్చింది. ఆ పండు వెన్నెల్లో, ప్రశాంత వాతావరణంలో, నదీ తీరాన ఆ అక్కచెల్లెళ్లిద్దరూ అత్యంత మధుర స్వరాలతో మేఘమల్హార్ రాగాన్ని ఆలపిస్తుంటే... స్వయంగా అంతటి సంగీత విద్వాంసుడైన తాన్ సేన్ వింటూ తన్మయుడైపోయాడు.
ఆ రాగాలాపన వింటుంటే తాన్ సేన్ కళ్ల వెంట ఆనంద బాష్పాలు ఆగలేదు. రాగం పూర్తి కాగానే, "మీరు మానవులు కారు, దివి నుంచి దిగివచ్చిన గంధర్వ స్త్రీలు. మీ స్వరాలకు చిక్కి సంగీత లక్ష్మి స్వయంగా పునీతమైంది తల్లులారా!" అన్నాడు కన్నీళ్లు తుడుచుకోకుండానే.
మరింతగా విచారించగా, వారు తమ పేర్లు 'తానా, నానా' అని మాత్రం చెప్పుకొచ్చారు. వారు మూడు రాత్రులు, మొదటి ఘడియల్లో ఆ విధంగా మేఘమల్హార్ రాగాన్ని ఆలపించగానే తాన్ సేన్ గుండెల్లోని జ్వాల చల్లారింది. ఆయన పూర్తిగా కోలుకుని, తిరిగి దిల్లీ వెళ్లిపోయే సమయంలో ఆ అక్కచెల్లెళ్లకు బహుమతులు ఇవ్వబోయాడు. కానీ వారు వాటిని నిరాకరిస్తూ, "మా గురించి మూడో కంటికి తెలియనీయకండి! అదే మీరు మాకు ఇచ్చే అతి పెద్ద బహుమతి అన్నయ్యగారూ!" అని మాట తీసుకున్నారు.
పూర్తిగా కోలుకుని తిరిగి వచ్చిన తాన్ సేన్‌ను చూసి అక్బర్ పాదుషా అమితంగా ఆనందించాడు. కానీ సాటి సంగీత కళాకారుల్లో ఈర్ష్య రగిలింది. "మేఘమల్హార్ పాడి వినిపించమన్నప్పుడు రాదని తాన్ సేన్ చెప్పిన మాట అబద్ధం అని ఇప్పుడు తేలింది కదా! మరి రాజుకు అబద్ధం చెప్పినందుకు దండన ఉండాలా వద్దా?" అని వారు పాదుషాను నిలదీశారు.
అక్బర్ ఇదే ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పలేక తాన్ సేన్ బిక్కమొహం వేశాడు. అక్కచెల్లెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం వారి గురించి ఎవరికీ చెప్పకూడదు కదా! ఎంత అడిగినా మేఘమల్హార్ రాగం పాడి వినిపించడానికి నిరాకరిస్తున్న తాన్ సేన్ మీద అక్బర్ పాదుషాకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. "నీకు వారం రోజులు గడువు ఇస్తున్నాను. ఈలోగా ఆ రాగాన్ని పాడి తీరాలి, లేదా ఆ పాటను ఎవరి దగ్గర విన్నావో ఆ వివరాలైనా చెప్పాలి. కాదంటే ఉరిశిక్ష ఖాయం. రాజుతో అబద్ధమాడిన నేరానికి ఇంతకంటే మరో పెద్ద శిక్ష లేదు" అని హుకుం జారీ చేశాడు అక్బర్.
తన ప్రాణాల మీద ఆశతో తాన్ సేన్ చివరికి తానా, నానాల కథను బయటపెట్టేశాడు. దాంతో ఆ అక్కచెల్లెళ్ల నోట మేఘమల్హార్ రాగాన్ని వినాలని అక్బర్ ఉవ్విళ్లూరాడు. వెంటనే మొఘల్ సైన్యం గుజరాత్‌లోని సబర్మతీ నదీ తీరానికి తరలివెళ్లింది.
అంతకంటే ముందే తాన్ సేన్ ఆ అక్కచెల్లెళ్లను కలిసి, తన వల్ల జరిగిన తప్పును క్షమించమని, ఒక్కసారి వచ్చి పాదుషా సమ్ముఖంలో మేఘమల్హార్ రాగాన్ని ఆలపించకపోతే తన ప్రాణాలు పోవడం ఖాయమని ఏడుస్తూ చెప్పాడు. ఆ అక్కచెల్లెళ్లిద్దరూ ఓపిగ్గా విన్నారు. తాన్ సేన్ స్థానం హిందుస్తానీ సంగీతంలో ఎంత ఉన్నతమైనదో వారికి తెలుసు. కాబట్టి, ఆయన ప్రాణాలను కాపాడడం కోసం పాదుషా సమ్ముఖంలో రాగం ఆలపించడానికి సమ్మతించారు.
నిండు సభలో ఆ బంగారు బొమ్మలు మేలిముసుగుల వెనుక నుంచి ఆలపించిన మేఘమల్హార్ రాగం సభాసదులను ఆశ్చర్యచకితులను చేసింది. సభ అంతటా కరతాళధ్వనులు మిన్నంటాయి. అక్బర్ పాదుషా ఆనందానికి హద్దుల్లేవు. ఆయన పరవశించి తన మెడలోని ముత్యాల హరాన్ని తెంపి ఆ తానా, నానాల మీదికి విసిరాడు.
అయినా, ఆ మానవతులు వాటి వంక కంటిచూపుతోనైనా చూడలేదు.
తమ కోసం ఏర్పాటు చేసిన ఎత్తైన అరుగుపై నుండి కిందికి దిగి, ఒకరినొకరు సాభిప్రాయంగా చూసుకుంటూ కౌగిలించుకున్నారు. మరుక్షణంలోనే ఇద్దరూ మట్టిముద్దల్లా కింద కూలిపోయారు! వారి పొట్టల్లో తాము తెచ్చుకున్న బాకులు రక్తసిక్తమై ఉన్నాయి!
అదే క్షణంలో సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు యువకులు ఘోల్లుమన్నారు. వాళ్లిద్దరూ తానా, నానాల భర్తలు. సభకు బయలుదేరే ముందు భర్తలను క్షమించమని వేడుకుంటూ ఆ భార్యలు రాసిన ఉత్తరాలు అప్పుడు అందరి కంటపడ్డాయి. ఆ ఉత్తరంలో ఇలా ఉంది:
"మహా సంగీత విద్వాంసుడు తాన్ సేన్ విలువైన ప్రాణాలను కాపాడవలసిన అవసరాన్ని మేము గుర్తించాము. అందుకనే నిండు సభలో అక్బర్ పాదుషా ముందు మేఘమల్హార్ రాగాన్ని ఆలపించక తప్పలేదు. ముందుగా మీ అనుమతి తీసుకోలేదు, మా వల్ల తప్పు జరిగిందని మాకు తెలుసు.
మన జాతి నీతి ప్రకారం, భర్తల సమ్మతి లేకుండా భార్యలు పరపురుషుల కంటపడకూడదు. ఆ రివాజును తప్పినందుకు మేము శిక్షకు అర్హులము. మాపై మీకు ఉన్న ప్రేమ మాకు తెలుసు, మీరు మమ్మల్ని శిక్షించలేరు. కాబట్టి మాకు మేమే ఈ విధంగా శిక్షించుకుంటున్నాము. మిమ్మల్ని మనసారా ప్రేమించే భార్యలుగా మమ్మల్ని క్షమించమని మా ఆఖరి విన్నపం."
ఆ ఉత్తరాన్ని బిగ్గరగా చదివి, ఆ భర్తలిద్దరూ "మా తానా, నానాలను తిరిగి ఎవరైనా తెచ్చివ్వగలరా?" అని హృదయవిదారకంగా రోదిస్తుంటే... అక్బర్ చక్రవర్తి తన తొందరపాటుకు తలదించుకున్నాడు.
తాన్ సేన్ ఆ యువకులిద్దరినీ పైకి లేపి, "ఆ చెల్లెళ్లిద్దరినీ నేను తిరిగి తెచ్చి ఇస్తానని హామీ ఇస్తున్నాను. భౌతికంగా నాకు సాధ్యం కాని ఆ పనిని ఒక కళాకారుడిగా సాధించి చూపిస్తాను. ఇక నుంచి నేను ఆలపించే సంగీత స్వరాలలో, ఇప్పటివరకు ధ్వనించిన 'ఓం' అనే స్థానంలో 'తోమ్ తానా నానా' అని ఆలపిస్తాను" అని వాగ్దానం చేశాడు.
తానా, నానాల స్మారకార్థం, సబర్మతీ నదీ తీరాన ఒక స్వరాలయాన్ని నిర్మించాడు తాన్ సేన్. కాలగర్భంలో ఆ సంగీతాలయం కలిసిపోయింది. మహా పాదుషా అక్బర్ చక్రవర్తి ఉనికి కూడా మాసిపోయింది. కానీ, చివరికి శాశ్వతంగా మిగిలింది, ఎప్పటికీ మిగిలి ఉండేది... హిందుస్తానీ విద్వాంసుడు తాన్ సేన్ గొంతులో, సంగీత స్వరాలలో తారట్లాడే ఆ 'తోమ్ తానా నానా'లు మాత్రమే!
సమాప్తం.
***
కర్లపాలెం హనుమంతరావు గారి కొన్ని ఇతర రచనలు:
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.









Comments