top of page

మౌనానికి మాటొస్తే

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Mounaniki Matosthe' New Telugu Story Written By Thalloju Padmavathi

రచన: తల్లోజు పద్మావతి


అల్యూమినియం బాణలిలో బొంబాయి రవ్వ వేసి దోరగా వేయిస్తున్న రమణికి కమ్మని నేతి వాసన ముక్కును తాకగానే, తన కూతురు కావ్య గుర్తొచ్చింది. చిన్నతనం నుండి కావ్యకు రవ్వలడ్డులు అంటే ఎంతిష్టమో..! ఇలా నేతి వాసన తగలగానే గభాలున పరిగెత్తుకు వచ్చి, తల్లి భుజంపై వాలేది.


"అమ్మా!! రవ్వ లడ్డు చేస్తున్నావా?" అంటూ ఆమె బుగ్గలు ముద్దాడేది.


తడిచెమ్మ చెంపను తాకడంతో... కావ్య అనుకొని చుట్టూ చూసింది. అది తన కనురెప్పల చెలియలి కట్టను దాటిన కన్నీటి స్పర్శ అని తెలుసుకొని, మనసు మౌనంగా నిట్టూర్పు విడిచింది.


"రమణీ! ఏం చేస్తున్నావ్? రవ్వ లడ్డేనా? నేతి ఘుమఘుమలు నా ముక్కుపట్టి, నన్ను మీ ఇంటిదాకా లాక్కొచ్చాయి" అంటూ వచ్చింది పక్కింటి పార్వతి.


రమణి ముందు కూర్చుని, ఆమెకు లడ్డు కట్టడంలో సాయపడుతూ ఆమె కంట నీరు పెట్టుకోవడం పసి కట్టేసింది.


"కావ్య గుర్తొచ్చిందా రమణి?" అని అడిగింది.


మౌనంగా చీర కొంగుతో కళ్ళనీళ్ళు వత్తుకుంది రమణి.


"నువ్వో వెర్రిమాలోకానివి! ఏళ్ళ నుండి నీకు చెబుతూనే ఉన్నాను. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని. నీ కొడుకు నడిపే కిరాణా షాపు, ఇల్లు రెండూ... నీకు నీ పుట్టింటివారిచ్చినవే! వాటి మీద సర్వహక్కులు నీవే! అయినా నీ కొడుకు, కోడలికి భయపడి... కూతుర్ని దూరం చేసుకున్నావ్. ముందు నువ్వు ధైర్యంగా మాట్లాడటం నేర్చుకో…! అప్పుడే... అన్ని అవే సర్దుకుంటాయి." అని హితబోధ చేసింది పార్వతి.


" ధైర్యం" అనే మాట వినగానే రమణి మనసు గతంలోకి అంటే... ముప్పై ఏళ్ళు వెనక్కి పరుగు తీసింది.


@@@@@@@@@@@@@@@@@@


" అమ్మా!నేను పదవ తరగతి పాస్ అయ్యాను." అంటూ సంతోషంగా న్యూస్ పేపర్ తో ఇంటికి పరిగెత్తుకొచ్చింది పదహారేళ్ల రమణి. తల్లి సంతోషంగా నోరు తీపి చేస్తుండగా..,


" ఇక చదివింది చాల్లే గాని, రేపు మీ బావ మల్లేశం వస్తున్నాడు నిశ్చయ తాంబూలాలకు. తల్లీకూతుళ్లు ఆ ఏర్పాట్లు చూడండి" అన్నాడు రమణి తండ్రి కటువుగా.


ఆ కాలంలో పదోతరగతి చదివితే చాలు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేది. భవిష్యత్తుపై కోటి ఆశలు నింపుకున్న కళ్ళతో తల్లికేసి బేలగా చూసింది రమణి. ఇక తల్లి కల్పించుకుని..,


" ఏ మాత్రం చదువు, ఉద్యోగం లేని వాడికిచ్చి చేస్తే అదేం సుఖపడుతుంది!?. అది ఉద్యోగం చేయాలని ఆశ పడుతుంది. దానికి ఉద్యోగం వచ్చిందంటే.. రాజాలాంటి సంబంధాలు వస్తాయి కదా!" అంది బతిమిలాడే ధోరణిలో.


" అంటే.. నేను నా బిడ్డను ఒక పనికిమాలిన వాడికిచ్చి పెళ్లి చేస్తున్నానంటావా? పాత సంబంధం, లక్షణమైన కుర్రాడు. వెనక ముందు ఎవరూ లేరు. ఇల్లరికం తెచ్చుకొని మన షాపు అప్పగించామంటే... మన కూతురు మన కళ్లముందే ఉంటుంది. మనకు కొడుకులేని లోటు కూడా తీరుతుంది. ఎంతగానో ఆలోచించి నేను ఈ నిర్ణయానికొచ్చాను. నా నిర్ణయాన్ని తప్పు పట్టడం మాని, పనులు మొదలు పెట్టండి" అంటూ కసిరి బయటికి వెళ్లిపోయాడు.


పెళ్ళికి ముందు తండ్రిని, పెళ్లి తర్వాత మొగుణ్ణి "నేను ఉద్యోగం చేస్తానని" ధైర్యంగా ఒక్క మాట అడగ లేకపోయింది రమణి .అక్కడ కూడా ఆమె మౌనమే ముందుకు వచ్చి ధైర్యం నోరు నొక్కేసింది.


పెళ్లి తర్వాత రమణి పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. షాపు, వంటిల్లు, పడకిల్లు అంటూ... ఈ మూడింటికే జీవితం పరిమితమైంది. కొలువు చేయాలన్న ఆశ అడుగంటి పోయింది. ఆమెను ఆ బాధలో నుండి బయట పడేస్తూ కార్తీక్, కావ్యలు పుట్టారు. వారిని అల్లారుముద్దుగా పెంచుతూ... అన్ని కష్టాలు మర్చిపోయింది రమణి.


@@@@@@@@@@@@@@@@@


రమణి పిల్లలు ఎదిగారు. తల్లిదండ్రి గతించారు. "అమ్మ! నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను" అని కావ్య సంతోషంతో చెప్పిన రోజు తనకిష్టమైన రవ్వలడ్డు చేసిపెట్టగలిగిందే గాని, పై చదువులకు తన వంతు భరోసా ఇవ్వలేకపోయింది.


మల్లేశం పెళ్లి ప్రస్తావన తెస్తే దీనంగా చూస్తున్న తన కూతురిని చూసి "దానికి అప్పుడే పెళ్లి ఏమిటండి? పై చదువులు చదువుకుంటుందట" అని చెప్పే ధైర్యం కూడా చేయలేకపోయింది.


అంతలోనే మల్లేశం హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం, కావ్య పెళ్లి బాధ్యత అంతగా చదువులేక కిరాణాషాపు చూసుకుంటున్న ఆమె అన్న కార్తీక్ పై పడింది. చెల్లెలికి కట్నం ఇచ్చే నెపంతో శృతి అనే అమ్మాయిని పెళ్లాడి, ఆ కట్నం డబ్బులతో చెల్లి పెళ్లి దాటించి చేతులు దులుపుకున్నాడు కార్తీక్.


కావ్య భర్త రేవంత్ మంచివాడే కాని, తల్లి చేతిలో కీలుబొమ్మ. ఆ సంబంధం వద్దని చెప్పే ధైర్యం కూడా రమణి చేయలేక మూగగా రోదించింది. కావ్య పెళ్లి తర్వాత తనతో మాట్లాడే దిక్కు కూడా లేకుండా పోయింది. కొడుకు, కోడలు షాప్ లో కూర్చుని మళ్లీ వంటింటికే ఆమెను అంకితం చేశారు.


@@@@@@@@@@@@@@@@@


శ్రావణమాసం వచ్చేసింది. మంచి రోజులు... ఒడిబియ్యం పెట్టమని కావ్య అత్తగారు కబురు పంపింది. దానితోపాటు రేవంత్ కి గోల్డ్ చైన్ పెట్టాలని కండిషన్ కూడా పెట్టింది. అన్నిటికీ సరేనని ఒప్పుకున్నాడు కార్తీక్.


కానీ, ఆ తర్వాత శృతి కల్పించుకుని" వాళ్ల గొంతెమ్మ కోరికలు తీర్చాలంటే మన వల్ల అయ్యే పనేనా?బట్టలు మాత్రం మంచివి పెడదాం.గొలుసు తర్వాత అడ్జస్ట్ చేస్తామని చెబుదాం"అంది. కార్తీక్ ఆమె మాటలకు గంగిరెద్దులా తలాడించాడు.


"అసలే కావ్య అత్త గయ్యాలిది. ఇచ్చిన మాట తప్పితే, కావ్యను రాచిరంపాన పెడుతుంది. అప్పోసప్పో చేసి గొలుసు కొనిపెడదాం..". అని రమణి చెప్పాలనుకుంది. కానీ, కోడలి నోటికి భయపడి ఆమెలో ధైర్యం చచ్చిపోయింది.


కావ్య, రేవంత్ లకు ఒడిబియ్యం పెడుతుండగా, " గొలుసు ఎక్కడ?" అని అడిగింది కావ్య అత్త.


" అత్తయ్యగారు! మాకు కాస్త టైం ఇవ్వండి. త్వరలోనే సర్దుబాటు చేస్తాం" అన్నాడు వినయంగా కార్తీక్.


ఆ మాటతో కోపం నషాలానికి అంటిన ఆవిడ "ఒరే రేవంత్! పీటలపై నుండి లేవరా. పెళ్ళప్పుడే లాంఛనాల దగ్గర తండ్రిలేని పిల్లకదా అని రాజీపడ్డాం. ప్రతిసారి ఇలా అడుక్కోవడానికి మేము బిచ్చగాల్లలా కనిపిస్తున్నామా? ఆంతగతిలేని వారు పిల్ల పెళ్లి ఎందుకు చేశారు? మా వాడి గొంతు కోయడానికి కాకపోతే…. "అంటూ రమణి కాళ్ళావేళ్ళా పడుతున్న వినకుండా పీటలపై నుండి రేవంత్ ను తీసుకుని వెళ్లిపోయింది. కావ్య కూడా ఏడుస్తూ వారిని వెంబడించింది.


ఆ తర్వాత చెల్లెలు పడే ఇబ్బందిని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా... నలుగురిలో తమకు జరిగిన అవమానంతో రగిలిపోతున్న కార్తీక్ లోని ఆవేశంలో ఓదార్పు పేరుతో మరింత ఆజ్యం పోసింది శృతి. ఇద్దరు కలిసి అసలు కావ్య పేరే ఇంట్లో వినబడకుండా చేశారు. రమణికి మాత్రం గత మూడేళ్లుగా కన్నీళ్లతో కదిలి వెళ్లిన కావ్యరూపం కళ్లముందు కదలాడిన ప్రతిసారి… ఆమె ధైర్యం లేని కన్నపేగు విలవిలలాడటం పరిపాటయ్యింది.


@@@@@@@@@@@@@@@@@@


ఆ రోజు శ్రావణ శుక్రవారం! వరలక్ష్మీ వ్రతం! ఆదివారం రాఖీ పౌర్ణమి ఉండింది. ఇంటి పని, వంట పని,.... దాదాపు తన వంతుపని పూర్తి చేసి,తన మనవరాలు కార్తీక్ కూతురు రెండేళ్ల నైనాను ఆడిస్తూ అరుగుపై కూర్చుంది రమణి. కార్తీక్, శృతి వ్రతానికి సిద్ధమవుతున్నారు.


ఇంతలో" ఏమండీ! నా రవ్వల దుద్దులు ఏమైనా చూశారా?" అంటూ కంగారుగా అరిచింది శృతి.


" అక్కడే ఉంటాయి. కాస్త ఓపిగ్గా చూడవే..!" అంటూ విసుక్కున్నాడు కార్తీక్.


"షాప్ లో వచ్చిన రాబడిని పైసా పైసా రెండేళ్లుగా కూడబెట్టి కొన్నవి... తులం బంగారం! ముప్పై వేల పైచిలుకే..! ఈ రోజు పూజ లో పెట్టి, పెట్టుకుందాం అనుకున్నాను." అంటూ శోకాలు మొదలు పెట్టింది శృతి.


" ముందు నువ్వు ఆ ఏడుపు ఆపు. ఇంట్లో దొంగలుపడితే నీ రవ్వల దుద్దులు మాత్రమే ఎత్తుకుపోరుగా! నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు. పూజ పూర్తయ్యాక వెతుకుదాం. ఎందుకైనా మంచిది... అమ్మను కూడా ఒకసారి అడిగి చూడు అన్నాడు" కార్తీక్ అనునయంగా.


"ఆవిడగారికేం తెలుసండీ! ఆవిడగారు తన ఫ్రెండ్... ఆ పార్వతిని వెంటేసుకొని గుళ్ళ చుట్టూ తిరగడం ఎక్కువైందీ మధ్య. ఇంటి బాధ్యత ఆవిడకేం పట్టింది" అంటూ మరింతగా దీర్ఘాలు తీసింది శృతి.


కిటికీలోంచి ఈ మాటలు వింటున్న రమణి మాత్రం" ఇక్కడ కూడా నా పైనే ఏడుపా.అంత తప్పు పని నేనేం చేశాను? అసలు గుళ్లకు వెళితే తప్పేంటి. కనీసం ఈ రాఖీ పౌర్ణమికైనా నా కూతురు కావ్య వచ్చి రాఖీ కడితే బాగుండునని నా మనస్సు ఆరాటపడుతుంది.వాళ్ళ గొడవలు వాళ్ళవే గానీ, నా బాధ మాత్రం ఎవరికీ పట్టదు. అమ్మ... లక్ష్మీ దేవి,,? నా బాధ గుర్తించి నువ్వైనా నన్ను కరుణించు తల్లి!" అని కళ్ళు మూసుకొని ఆ తల్లిని వేడుకుంది.


"అమ్మా !"అన్న పిలుపు వినబడి కళ్ళుతెరిచి చూస్తే ఎదురుగా కావ్య! అసలు తన ఇంటికి రాదనుకున్న కూతురు వచ్చేసరికి ఆనందం పట్టలేక పరుగునవెళ్లి బిడ్డను కావలించుకుని ఏడ్చేసింది.


ఒక చేతిలో బ్యాగ్ ,మరో చేతిలో ఏడాది బాబుతో రేవంత్ ముందుకొచ్చి" బాగున్నారా అత్తయ్య!?" అంటూ పలకరించాడు.


" బాగున్నాను"అంటూ అతని చేతిలోంచి బాబును తీసుకొని ముద్దులతో ముంచేసింది. "పదండి!" అంటూ వాళ్లని తీసుకొని ఇంట్లోకి అడుగు పెట్టింది.


చెప్పాపెట్టకుండా వచ్చినా వాళ్లను చూసి కార్తీక్, శృతి ఖంగుతిన్నారు. లేనినవ్వు ముఖాన పులుముకుంటూ వారికి మర్యాదలు చేయడం మొదలుపెట్టారు.


" వదినా! నా కోడలు నైనా కనిపించడం లేదు.ఎక్కడ?"అంటూ అడిగింది కావ్య,శృతిని.


తన కూతురు గురించి కావ్యకు ఎలా తెలుసు? అని మొదట శృతి ఆశ్చర్యపోయినా…అంతలోనే

తేరుకొని, " ఇక్కడే ఉండాలి కావ్య!" అంటూ" నైనా" అని పిలుస్తూ ఇల్లంతా కలియతిరిగింది.


అప్పుడు గుర్తొచ్చింది రమణికి. కూతుర్ని చూసిన సంతోషంలో కావ్య కొడుకుని ఎత్తుకొని, నైనాని అక్కడే వదిలేసి వచ్చాను... అని. కంగారుగా బయటికెళ్ళి చూస్తే నైనా అరుగుపైన లేదు. అందరి గుండెలు గుభేలుమన్నాయి!


ఆ చుట్టు పక్కల అరగంట వెతికితే, పార్వతి ఇంట్లో ఆడుతూ నైనా కనిపించింది రమణికి. భద్రంగా తెచ్చి శృతికి ఇవ్వగానే "ఎక్కడో తప్పి పోయావని ఎంత భయపడ్డాను రా తల్లి!" అంటూ శృతి, నైనానీ కావలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.


కావ్య, శృతినీ ఓదారుస్తూ" రెండేళ్ల పిల్ల ఎంత దూరం వెళ్తుంది వదిన! అలా బెంబేలు పడకు. నీలాంటి మంచి మనసున్న మనిషికి ఆ దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు. మా పంతాలకు బంధాలు బలి కాకూడదని నువ్వు ఇష్టంగా చేయించుకున్న రవ్వల దుద్దులు కూడా అమ్మతో పంపించి, నన్ను రప్పించిన నీకు అంతా మంచే జరుగుతుంది." అంది.


అంతే! ఒక్కసారిగా శృతి ఏడుపు ఆగిపోయింది. తెల్లబోయి కార్తీక్ కేసి చూసింది. ఆ తర్వాత ఇద్దరూ కోపంగా రమణి వైపు చూశారు. రమణి మౌనంగా తలదించుకుంది.


కావ్య, శృతికి ఆ రవ్వల దుద్దులు తిరిగి ఇస్తూ" నువ్వు ఎంతో ఇష్టంగా చేయించుకున్నవి.వీటిని నువ్వే పెట్టుకో వదిన! మేము మీరు పిలిచారని వచ్చామే గాని, బంగారం ఇచ్చారని కాదు" అంది.


" అవునండి! ఇచ్చిన మాట తప్పారు అన్న ఆవేశంలో అమ్మ ఆ రోజు అలా ప్రవర్తించింది...గానీ బేసిగ్గా ఆవిడ చాలా మంచిది. కావ్య బాధ చూల్లేక ఎన్నోసార్లు మనసు చంపుకొని మేమే వద్దామనుకున్నాము. కానీ, మీరు మూడేళ్లుగా మమ్మల్ని పూర్తిగా దూరం పెట్టేశారు. అసలు కాంటాక్ట్ కూడా లేకుండా చేశారు." అన్నాడు బాధగా రేవంత్!


అతని మాటలకు ప్రశ్చాత్తాపంతో... కార్తీక్ వెళ్లి రేవంత్ ని ప్రేమగా ఆలింగనం చేసుకుని," సారీ బావగారు! నాన్న పోయాకా...షాపు నడపడంలో పెద్దగా అనుభవంలేని నాకు... అదో యుద్దంలా పరిణమించింది.నేనే కాస్త.. నన్ను నేను ఆ సమయంలో సంభాలించుకొని ఉంటే,మనం దూరమయ్యే వాళ్ళమే కాదు"అన్నాడు గద్గద స్వరంతో!


రవ్వల దుద్దులు దొరికాయన్న ఆనందంలో శృతి,భారం తగ్గి తేలికైన గుండెలతో మిగతా అందరూ పూజ మొదలు పెట్టారు. కానీ, అత్త చేసిన పనికి శృతి గుండె మాత్రం లోలోపల రగిలిపోతూనే ఉంది.


@@@@@@@@@@@@@@@@@@@


తల్లి చేసిన కమ్మని రవ్వలడ్డుతో భోజనం ముగించి, తన చిన్ననాటి ఫ్రెండ్స్ ను కలిసి వస్తానని, తన కొడుకును, రేవంత్ ను వెంటబెట్టుకుని కావ్య ఊరిలోకి వెళ్ళింది. వాళ్లు వెళ్లగానే ఇంటి వాతావరణం ఎలా మారుతుందో రమణి ఊహించగలదు. కాబట్టి, మనసును గట్టిచేసుకొని నిలబడింది.


కావ్య బయటికి వెళ్ళిందే ఆలస్యం, శృతి కంటిసైగతోనే " అసలు నీకు బుద్ధుందా అమ్మ! సొంత ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తారా?" అంటూ అప్పటిదాకా అణచుకొన్న కోపాన్ని కార్తీక్ వెళ్లగక్కేసాడు.


"అసలు కోడలి ఇష్టాలతో ఆవిడకు పనేముంది చెప్పండి. కూతురు సంతోషంగా ఉంటే సరి. సిగ్గులేకుండా నలుగురిలో వాళ్లు మనకు చేసిన అవమానం మర్చిపోయి, వాళ్ళ ఇంటికి వెళ్లివచ్చింది. అసలు ఇది మొదటిసారో...లేక ఇంతకుముందు కూడా కూతురుకి ఎన్ని మోసుకెళ్ళి ఇచ్చిందో ఈవిడ. మనం షాప్ లో బిజీ, ఆవిడ దోచుకోవడంలో బిజీ!"అంది వెక్కిరింపుగా శృతి.


"నోర్మూయండి! లేదంటే ఇద్దరి చెంపలు వాయ కొడతాను" అంటూ కంచుకంఠంతో గట్టిగా అరిచింది రమణి.


అంతే! ఒక్కసారిగా అదిరిపడి రెండడుగులు వెనక్కి వేశారు శృతి, కార్తీక్. పుట్టి బుద్దేరిగాక కార్తీక్ ఆమె అసలైన గొంతు అప్పుడే విన్నది. పిల్లిలా ఉండే అత్తగారు పులిలా గాండ్రించేసరికి శృతి కాళ్లలో వణుకు మొదలైంది.


" సహనానికి కూడా ఓ హద్దంటూ ఉంటుంది. ఎలాగో భరిస్తున్నానుకదా అని భూదేవిని అనుకుంటున్నారేమో... అవసరమైతే కాళికాదేవిని కూడా! ఏమన్నావ్ రా? నాకు బుద్ధి లేదా? నాకే బుద్దుంటే నీలాంటి చవటను ఎందుకు కంటానురా? సొంత ఇంట్లో దొంగతనం అంటున్నావే... అసలు మీరు నన్ను సొంత మనిషిలా ఎప్పుడైనా చూశారా?


నువ్వేమన్నావ్ కోడలా! నిన్నూ, కావ్యను వేరు వేరుగా చూస్తున్నాననా! మూడేళ్లుగా నా కూతురును నాకు దూరం చేసినా..అది మనసులో పెట్టుకోకుండా నీలో నా కూతుర్ని చూసుకున్నానుగానీ., ఇదేంటని నోరు తెరిచి మిమ్మల్ని అడగలేదు. నీ కూతురు ఓ ముప్పై నిమిషాలు కనిపించకపోతేనే ముల్లోకాలను ఏకం చేసావే,!? మరి నేను నా కూతురికి దూరమై మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్నాను. ఒక ఆడదానివి అయ్యూండి.. ఈ అమ్మ మనసు అర్థం చేసుకున్నావా?


నా షాప్ లో పనిచేసి, డబ్బులు కూడపెట్టి బంగారం కొనగలిగావేగానీ, అదే డబ్బులతో గొలుసుకొని,నీ ఆడబిడ్డకు ఒడిబియ్యం పెడదామన్న ఆలోచన నీకు రాలేదే! అందుకే అవి దొంగిలించాను. పార్వతితో కలిసి పక్కూరు బోనాలకు వెళ్తున్నాము అనిచెప్పి,కావ్య దగ్గరికి వెళ్ళాను. మీకు చెడ్డ పేరు రాకూడదని, ఆ రవ్వల దుద్దులు మీరే పంపారని చెప్పాను.


షాపు, ఇల్లు నా పేరుమీదే ఉన్నా... నేను ఏనాడు పనిదానిలా తప్ప, యజమానిలా ఉండలేదు.ఇంత జరిగాక మీరు నన్ను ఇక కనీసం పనిదానిలా కూడా చూడరు. ఇప్పుడు నా బిడ్డను చూడాలన్నా కోరిక తీరింది. మీ బంగారం మీకు చేరింది. ఇక మీకు నాతో పని లేదు. ఎల్లుండి కావ్య నీకు రాఖీ కట్టివెళ్లగానే ఏదైనా అనాధ శరణాలయం చూసుకొని వెళ్ళిపోతాను.నా స్థానంలో ఇంకెవరున్నా... మిమ్మల్నే బయటికి తరిమేసే వాళ్ళు.కానీ,ఇన్నేళ్ళు అందరి నిర్లక్ష్యం నీడలోనే నా జీవితం గడిచింది. నేనాపని చేసానంటే నాకూ,మీకూ తేడా ఉండదు."అంటూ కటువుగా పలికి అక్కడి నుండి వెళ్ళిపోయింది.


రమణి వెళ్లిపోయిన అరగంటకుగానీ …శృతి,కార్తిక్ లు షాక్ నుండి తేరుకోలేకపోయారు. అసలు రమణికి ఏమైందో... అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో.. అర్థంకాక బిత్తరపోయారు. అంతలోనే కావ్య వాళ్ళు రావడంతో వాతావరణం తిరిగి తేలికయింది.


@@@@@@@@@@@@@@


ఆ మరుసటిరోజు కూడా రమణి ధైర్యంగా తిరుగుతుంటే శృతి, కార్తీక్ మాత్రం ఆమెను తప్పించుకు తిరిగారు. రాఖీ పౌర్ణమిరోజు మూడేళ్ల తర్వాత అన్నకు ఆనందంగా రాఖీకట్టి సంబరపడింది కావ్య.


కావ్య వద్దంటున్నా వినకుండా శృతి రవ్వల దుద్దులు కానుకగా ఇచ్చింది. శృతి సైగతో కార్తీక్ ముందుకొచ్చి ఓ పది వేలు రేవంత్ చేతిలో పెడుతూ… " మీ ముగ్గురికి బట్టలు తీసుకోండి బావగారు! ఈ శ్రావణ మాసం ఒడిబియ్యం పెడదామని అమ్మ, శృతి అనుకుంటున్నారు" అన్నాడు ప్రేమగా తల్లి వైపు చూస్తూ!


ఇదంతా చూస్తున్న రమణి మాత్రం తన కొడుకు, కోడళ్లలో మార్పు తెచ్చిన దేవునికి, తనలో ధైర్యాన్ని నూరిపోసి తన మౌనానికి మాట నేర్పిన పార్వతికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ…" అయినా నా మౌనానికి మాటేదో ముప్పై ఏళ్ల కిందతే వచ్చుంటే ఎంత బాగుండేది" అని మరోసారి మనసులోనే మౌనంగా నిట్టూర్చింది.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నా పేరు తల్లోజు పద్మావతి. చింతపట్ల పద్మా రమేష్ అనే పేరుతో రచనలు చేస్తుంటాను.ఇప్పటి వరకు పది కవితలు , ఐదు కథలు అచ్చయ్యాయి.వందకు పైగా కవితలు,ఇరవైకి పైగా కథలు వ్రాయడం జరిగింది. పుట్టింది కల్వకుర్తి(మహబూబ్నగర్ జిల్లా,తెలంగాణ). తల్లిదండ్రులు సుమిత్రమ్మ, రామేశ్వరయ్య గార్లు. భర్త పేరు రమేష్ బాబు, గవర్నమెంట్ టీచర్. నాకిద్దరు అబ్బాయిలు పెద్దవాడు సూర్య(ఇంజనీరింగ్ ఫైనల్),చిన్నోడు పృథ్వి (డిగ్రీ ఫస్ట్ యియర్). రచనలతో పాటు, చిత్రలేఖనం , పాటలు పాడటం, కొత్త వంటలు చేయడం, కుట్లు, అల్లికలు నా హాబీలు.


53 views2 comments
bottom of page