top of page
Original.png

పరిమళ ప్రసాదం


పరిమళ వినాయకుడికి ప్రసాదం సమర్పిస్తుండగా, మరో మహిళ ఆర్భాటంగా ప్రసాదం తీసుకురావడం, చివరికి ఆకలితో ఉన్న చిన్నారికి ప్రేమతో ప్రసాదం పంచుతున్న దృశ్యాన్ని ఆశీర్వదిస్తున్న వినాయకుడు.

Parimala Prasadam - Telugu Devotional Story | Sritha

పరిమళ ప్రసాదంతెలుగు ఆధ్యాత్మిక కథ | శ్రిత

Published in manatelugukathalu.com on 08/08/2026


వినాయక చవితి సందర్భంగా దేవుడికి ప్రసాదం పెట్టడం ప్రతి ఇంట్లో జరిగే పవిత్ర సంప్రదాయం. కానీ ప్రసాదంలో అసలు విలువ రుచిలోనా... లేక భక్తిలోనా? ఒక అపార్ట్మెంట్‌లో మొదలైన చిన్న ప్రసాదాల పోటీ ఎలా ఆర్భాటంగా మారింది? చివరకు ఒక ఆకలితో ఉన్న చిన్నారి ద్వారా వినాయకుడు అందరికీ నేర్పిన నిజమైన సందేశం ఏమిటి? నవ్వులు, వ్యంగ్యం, భావోద్వేగం, ఆధ్యాత్మికత కలిసిన ఈ హృదయాన్ని తాకే పరిమళ ప్రసాదం కథను తప్పకుండా చదవండి.



ఈ చిన్న కథను రాస్తున్నది ఎవరినీ మనసు నొప్పించడానికి కాదు. ఒక చిన్న, నిజంగా జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను రాస్తున్నాను. ఇందులో ఎవరినీ ప్రత్యేకంగా వేలెత్తి చూపించడం, విమర్శించడం లేదా బాధపెట్టడం నా ఉద్దేశం కాదు.

 చదివే ప్రతి ఒక్కరూ దీనిని కేవలం ఒక కథగా మాత్రమే స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.


ప్రసాదం అంటే దాదాపు ప్రతి ఒక్కరికీ ఇష్టమే. కొందరు దేవుడిపై ఉన్న భక్తితో ఆలయానికి వెళ్తారు. మరికొందరు ప్రసాదం కోసం కూడా ఆలయాన్ని సందర్శిస్తారు. భక్తి ఏ కారణంతో వచ్చినా, చివరికి ప్రసాదం మాత్రం అందరికీ ఆనందాన్నే ఇస్తుంది.

అలాంటి ప్రసాదం చుట్టూ జరిగిన ఒక చిన్న, ఆసక్తికరమైన సంఘటన ఆధారంగా నేను ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్న కథ...

"పరిమళ ప్రసాదం*


"చిన్నప్పటి నుంచే వినాయక చవితి సంబరాలను చూస్తూ, వాటితోనే పెరుగుతుంటాం. వినాయక చవితి అంటే చిన్నా పెద్దా అందరికీ ఎంతో ఇష్టం. ఆ రోజు తెల్లవారుజామునే లేచి, మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం. ఇంటిల్లిపాదీ కలిసి రకరకాల పిండి వంటలు, ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, వడలు అంటూ ఎన్నో నైవేద్యాలు సిద్ధం చేస్తారు.


చిన్నప్పటి నుంచే పెద్దలు ఒక మాట మాత్రం తప్పకుండా చెబుతుంటారు...

"ముందు వినాయకుడికి నైవేద్యం పెట్టాలి... ఆ తర్వాతే ప్రసాదం తినాలి."

ఆ మాట మనసులో అంత బలంగా నాటుకుపోతుంది. ప్రసాదం ముందు దేవుడిదే... తర్వాత మనదే అనే భావన మన జీవితంలో భాగమైపోతుంది.

అలాగే పెరిగింది పరిమళ కూడా. ఆమెకు ప్రసాదం అంటే ప్రాణం. వంట చేయడంలో కూడా ఆమెకు మంచి నేర్పు. పెళ్లి తర్వాత కొత్తగా ఒక అపార్ట్మెంట్‌లో కాపురం మొదలుపెట్టింది.


ఆ అపార్ట్మెంట్ చివరలో ఒక చిన్న వినాయకుడి గుడి ఉండేది.

మొదటి వినాయక చవితికి పరిమళ ఎంతో భక్తితో చక్కెర పొంగలి చేసి గుడికి తీసుకెళ్లింది. వినాయకుడికి నైవేద్యంగా పెట్టింది.


పూజారి గారు నవ్వుతూ,

"ఏమ్మా పరిమళా! మళ్లీ తీపేనా? ఇలా రోజూ తీపి పెడితే మన వినాయకుడికి డయాబెటిస్ వచ్చేస్తుందేమో!" అన్నారు.


పరిమళ మనసులో...

"అయ్యో! నేను చిన్న గిన్నెనే తెచ్చాను. దీనికే డయాబెటిస్ వచ్చేస్తుందా?" అని అమాయకంగా అనుకుంది.


అదంతా విన్న వినాయకుడు మనసులో నవ్వుకున్నాడు.


"అమ్మా... మీ చక్కెర వల్ల నాకు డయాబెటిస్ రాదు." వినాయకుడు నవ్వుతూ అన్నాడు, "మీ తియ్యమైన భక్తిని చూస్తుంటే నాకు డయాబెటిస్ వస్తుందేమో అనిపిస్తోంది! మీరు పెట్టే చక్కెర పొంగలి, మోదకాలు, కజ్జికాయలు, పాలతాలికలు... ఇవన్నీ చూస్తే ఎవరికైనా షుగర్ పెరిగిపోతుంది కదా! అయినా ఒకవేళ నిజంగానే డయాబెటిస్ వచ్చినా నాకు టెన్షన్ లేదు. నా భక్తుల్లో డాక్టర్లు చాలామంది ఉన్నారు. ప్రసాదం అద్భుతంగా ఉంటే నేను బాగా ఆస్వాదిస్తాను. కానీ మీలాగా 'టేస్టీ... యమ్మీ... వెరీ టేస్టీ!' అని స్టేటస్ పెట్టలేను. కానీ బోల్డన్ని వరాలు (Boons) ఇస్తాను!" అని చిరునవ్వుతో ముగించాడు.


"కానీ మీ భక్తి మాత్రం నన్ను పూర్తిగా తీపిగా చేస్తుంది. నేను చక్కెర కోసం కాదు... భక్తి కోసం ఎదురుచూస్తుంటాను."


మళ్లీ చక్కెర పొంగలి వైపు చూసి...

"నెయ్యి ఎంతుందో తెలియదు... కానీ భక్తి మాత్రం బోలెడంత ఉంది." అని చిరునవ్వు నవ్వుకున్నాడు.


ఇంతలో ఓ బామ్మగారు ప్రసాదం తీసుకుంటూ,

"అమ్మా... నాకు డయాబెటిస్ ఉంది. చిన్న ముద్ద చాలు... కానీ రుచి మాత్రం పెద్దగా ఉండాలి." అన్నారు.


పక్కనే ఉన్న పిల్లలు...

"నాకు... నాకు... ఇంకో ముద్ద!" అంటూ గిన్నె చుట్టూ చేరిపోయారు.


అందరూ...

"అయ్యో! ఎంత బాగుంది!"

"చాలా రుచిగా ఉంది!"

అంటూ పరిమళను మెచ్చుకున్నారు.


అదంతా గమనిస్తూ అక్కడే నిలబడి ఉన్న కామాక్షి మనసులో...

"ఈరోజు స్టార్ పరిమళ అయిపోయింది. రేపు నేను ప్రసాదం తీసుకొస్తాను. అప్పుడు అందరూ నా గిన్నె చుట్టూ తిరగాలి!" అని నిర్ణయించుకుంది.


అది విన్న వినాయకుడు నవ్వుకుంటూ...

"రేపు ప్రసాదం కంటే పోటీ ఎక్కువగా ఉండేలా ఉంది. ఎవరు ఏం తెచ్చినా నాకు కావాల్సింది ఒక్కటే... భక్తి. అది Blinkitలో దొరకదు. ఉంటే భక్తిని కూడా ఆర్డర్ పెట్టేవారు. అయితే రుచి కూడా బాగుంటే... నేను కూడా 'వావ్' అంటాను!" అని ముసిముసిగా నవ్వుకున్నాడు. 2🙏


మరుసటి రోజు కామాక్షి తన ప్లాన్ అమలు చేసింది.

ఒకటి కాదు... రెండు పెద్ద గిన్నెల నిండా పులిహోర తీసుకొచ్చింది.

ఆ పులిహోరలో బాదం, జీడిపప్పు, నెయ్యి, పల్లీలు... ఏమాత్రం తగ్గలేదు. గుడి మొత్తం పరిమళం (సువాసన)తో నిండిపోయింది.


వినాయకుడు ముసిముసి నవ్వుతూ...

"అయ్యో! ఈ వాసనకే మూషికరాజు రెండో రౌండ్‌కి రెడీ అయిపోయాడే!" అనుకున్నాడు.


మళ్లీ ఒక ముద్ద వైపు చూస్తూ...

"ప్రసాదం అయితే సూపర్... రుచి కూడా అద్భుతం... కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతోంది!" అనుకున్నాడు.


కొద్దిసేపటి తర్వాత తనలో తానే...

"ఉప్పు లేని పులిహోర ఎలా ఉంటుందో... భక్తి లేని ప్రసాదం కూడా అలానే ఉంటుంది." అన్నాడు.


వచ్చిన భక్తులందరూ...

"అమ్మో... ఎంత రుచిగా ఉంది!"

"జీడిపప్పు కొరికితేనే పండగ వచ్చినట్టుంది!"

"నెయ్యి వాసన చూస్తే ఇంకో ముద్ద తినాలనిపిస్తోంది!"

అంటూ కామాక్షిని పొగడ్తలతో ముంచెత్తారు.


అదే రోజు పరిమళ కూడా ఒక చిన్న గిన్నె పులిహోర తీసుకొచ్చింది.

దాన్ని చూసి కొందరు...

"ఇందులో నెయ్యి కనిపించడం లేదు!"

"జీడిపప్పు సెలవుకెళ్లిందేమో!"

"కరివేపాకు కూడా లెక్కపెట్టి వేసినట్టుంది!"

అంటూ నవ్వుకున్నారు.


అది విన్న పరిమళ మాత్రం మనసులో ప్రశాంతంగా...

"నేను ఇంట్లో ఏది తింటానో... అదే నా వినాయకుడికి పెడతాను. దేవుడికి ఆర్భాటం కాదు... నా మనసే ముఖ్యం." అని అనుకుంది.


ఇక కామాక్షి...

కొంగు సరిచేసుకుంటూ...

కాలర్ లేనప్పటికీ కాలర్ ఎగరేసినట్టుగా నడుచుకుంటూ...

"చూశారా! నా ప్రసాదం ఎలా హిట్ అయిందో! ఇక నుంచి గుడిలో 'పులిహోర క్వీన్' అంటే నేనే!" అనుకుంటూ గర్వంగా వెళ్లిపోయింది.


అదంతా చూసిన వినాయకుడు చిరునవ్వుతో...

"ప్రసాదం చాలా బాగా తెచ్చావు తల్లీ... రుచి కూడా అద్భుతం. కానీ నేను వెతికింది జీడిపప్పు కాదు... భక్తి. అది ఏ గిన్నెలో ఉందో నాకు బాగా తెలుసు." అని మనసులో అనుకున్నాడు.


ఆ తర్వాత మొదలైంది అసలు కథ.

అపార్ట్మెంట్‌లో వార్త పాకిపోయింది.

"గుడిలో ప్రసాదం పెడితే అందరూ మెచ్చుకుంటారట!"


అంతే...

మహిళా మండలిలో కొత్త పోటీ మొదలైంది.

కామాక్షిని చూసిన లత...

"నువ్వేంటి ఒక్కదానివే స్టార్ అవుతావా? రేపు నా కట్ట పొంగలి చూస్తావు!" అంది.


మరుసటి రోజు లత గిన్నెతో ఎంట్రీ ఇచ్చింది.

ఆమె వెనకే...

సుమ వచ్చింది.

కుసుమ వచ్చింది.

ఇంకో అమ్మాయి వచ్చింది.

చూస్తుండగానే ఒక్కో రోజు ఒక్కో గిన్నె... ఒక్కో వంటకం.


ప్రసాదంతో సెల్ఫీలు మరియు స్టేటస్‌లు.


వినాయకుడు: "అయ్యో! నేను సెల్ఫీలో లేను. ప్రసాదం గిన్నెతో సెల్ఫీ, స్టేటస్‌లో దేవుడిని నన్నే మరిచిపోయారు. ఓరి మహిళామణులారా!! నేను ఎక్కడ సెల్ఫీలో? ఇక్కడే సెల్ఫీ దిగండి, నేను సెల్ఫీలో ఉంటాను."


మూషికరాజు: "సెల్ఫీ వద్దు, ప్రసాదం ముద్దు!"


  • భక్తి మాత్రం రద్దు.

గ్రోసరీ షాపు వాడికీ సంగతి అర్థమైపోయింది.

"మేడమ్... ఈ జీడిపప్పు స్పెషల్! ఇది వేస్తే మీ ప్రసాదం ఫస్ట్ ప్రైజ్!"

"ఈ నెయ్యి వేస్తే వినాయకుడు కూడా రెసిపీ అడుగుతాడు!"

అంటూ అమ్మకాలు మొదలుపెట్టేశాడు.


పూజారి గారు కూడా నవ్వుకుంటూ...

"అమ్మలూ... ప్రసాదంతో పాటు కొంచెం పూలు కూడా తీసుకురండి. లేదంటే దేవుడికి ఇది నైవేద్యమో... ఫుడ్ ఫెస్టివలో అర్థం కావడం లేదు!" అన్నారు.


అంతే...

గుడి కాస్తా 'ప్రసాదం ప్రీమియర్ లీగ్'గా మారిపోయింది.

ఒక్కో గిన్నె ఒక టీమ్.

ఒక్కో ఆంటీ ఒక కెప్టెన్.

వచ్చిన భక్తులు కూడా...

"ఆ పులిహోర ఒక చెంచా..."

"ఈ పొంగలి కొంచెం..."

"ఆ కుడుము టేస్ట్ మాత్రమే చూస్తా..."

అంటూ టేస్టింగ్ జడ్జిలుగా మారిపోయారు.


దేవుడిని దర్శించుకునే లైన్ కంటే...

ప్రసాదం కోసం నిలబడిన లైన్ పెద్దదైంది!

వినాయకుడు తన తొండం సర్దుకుంటూ...

"అరే... నా కోసం ప్రసాదం తెచ్చారా? లేక ప్రసాదం కోసం నన్ను పెట్టారా?" అని నవ్వుకున్నాడు.


"ఇక్కడ ఏమైనా వంటల పోటీ జరుగుతోందా? నేను జడ్జ్నా? పూజారి జడ్జా? లేక ఆ బామ్మగారే ఫైనల్ జడ్జా?"


అంతలో మూషికరాజు పరుగెత్తుకుంటూ వచ్చి...

"స్వామీ! ఈరోజు మెనూ చూసారా? పులిహోర... పొంగలి... చక్కెర పొంగలి... కుడుములు... నాకు అయితే బఫే కనిపిస్తోంది!" అన్నాడు.


వినాయకుడు నవ్వుతూ...

"ప్రసాదాలు చాలా ఉన్నాయి రా... కానీ నాకు కావాల్సిన రుచి మాత్రం ఒక్కటే... భక్తి!"

"వీళ్లు నాకు డయాబెటిస్ వస్తుందేమో అని భయపడుతున్నారు... కానీ భక్తి తగ్గిపోతుందేమో అని మాత్రం ఎవ్వరూ భయపడటం లేదు!" అని చమత్కరించాడు.

3🙏

ఇలా ప్రసాదాల పోటీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

ఈరోజు పులిహోర... రేపు పొంగలి... ఎల్లుండి కుడుములు... మరో రోజు పాయసం...

గుడి కంటే గిన్నెల సంఖ్య ఎక్కువగా కనిపించడం మొదలైంది.

అలాంటి రోజే ఆ అపార్ట్మెంట్‌లోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది.

ఆమె పేరు ఆవని.


గుడిలోకి వచ్చి చుట్టూ ఒకసారి చూసింది.

గిన్నెలు... గిన్నెలు... గిన్నెలు...

ప్రతి మూలలో ఒక ప్రసాదం.

ఆమె నవ్వుతూ అడిగింది...

"అయ్యో! ఇదంతా ప్రసాదమా... లేక ఫుడ్ ఫెస్టివలా?"


అందరూ ఒక్కసారిగా ఆమె వైపు చూశారు.

ఆవని మెల్లగా చెప్పింది...

"నేను ప్రసాదానికి వ్యతిరేకం కాదు. దేవుడికి నైవేద్యం పెట్టడం గొప్ప విషయమే. కానీ ఇంత ఆర్భాటం ఎందుకు? ఇంత అన్నం, ఇన్ని వంటలు... వీటిలో కొంతైనా అన్నదానం చేస్తే ఎంతమందికి ఆకలి తీరుతుంది కదా!"


"బయట ఎంతోమంది ఒక పూట భోజనం కోసం ఎదురుచూస్తున్నారు. దేవుడికి ఒక చిన్న గిన్నె ప్రేమతో పెడితే చాలదా?"


ఆ మాటలు విన్న వినాయకుడు చిరునవ్వు నవ్వుకున్నాడు.

"అమ్మా... నా మనసులో ఉన్న మాటనే నువ్వు చెప్పేశావు. నాకు ప్రసాదం అంటే ఇష్టమే... కానీ ఆర్భాటం మాత్రం అవసరం లేదు." అనుకున్నాడు.


కానీ అక్కడ ఉన్న కొందరికి మాత్రం ఆ మాటలు నచ్చలేదు.

కామాక్షి నోరు ముడుచుకుని...

"అర్థమైంది... ఈమెకు ప్రసాదం చేయడం బద్ధకం. అందుకే ఇలాంటి క్లాసులు!" అంది.


మరొకరు వెంటనే...

"అవునవును... చేయలేనివాళ్లే ఇలాంటి సలహాలు ఇస్తారు!" అన్నారు.

ఆవని మాత్రం ప్రశాంతంగా నవ్వింది.


"మీరు మీ ప్రసాదాన్ని చూసుకోండి... నేను నా భక్తిని చూసుకుంటాను."

"నాకు వినాయకుడు ఇచ్చే చిన్న ప్రసాదం చాలు." అంది.

అని వెళ్లిపోతుండగా...

పరిమళ ఆమెను పిలిచింది.


"అయ్యో... ప్రసాదం తీసుకోకుండా వెళ్తున్నారా? నేను ఈ అపార్ట్మెంట్‌కి వచ్చిన రోజు నుంచి వినాయకుడికి ప్రసాదం పెడుతున్నాను. ఇదిగో... కొంచెం తీసుకోండి."


ఆవని నవ్వుతూ...

"సరే అండి... ప్రేమగా ఇస్తుంటే ఎలా వద్దంటాను?" అంది.


ఇద్దరూ కలిసి ప్రసాదం తిన్నారు.

మాటల్లో మాటగా...

"ఎక్కడికైనా వెళ్తున్నారా?" అని పరిమళ అడిగింది.


"అవును... ఒక చిన్న పని ఉంది." అంది ఆవని.


"అయితే నేనూ వస్తాను. దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం." అంది పరిమళ.


ఇద్దరూ కలిసి బయటకు నడిచారు.

కొంత దూరం వెళ్లగానే...

రోడ్డుపక్కన ఒక తల్లి, చిన్న బాబు కూర్చుని ఉన్నారు.

ఆ బాబు ఆకలితో ఏడుస్తున్నాడు.

ఇద్దరూ ఒక్కసారి ఒకరినొకరు చూసుకున్నారు.


పరిమళ చేతిలో ఉన్న ప్రసాదం గిన్నె వైపు ఆవని చూసి మెల్లగా అంది...

"దేవుడికి పెట్టిన ప్రసాదం కదా... ఇప్పుడు దేవుడే మన ముందుకు ఆకలితో వచ్చి కూర్చున్నట్టుంది."


పరిమళ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.

"నిజమే... వినాయకుడు గుడిలో మాత్రమే ఉండడు కదా!" అంటూ మొత్తం ప్రసాదం ఆ చిన్న బాబుకి ఇచ్చేసింది.


ఆ బాబు నవ్వుతూ తినడం మొదలుపెట్టాడు.

ఆ తల్లి కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి.

దూరం నుంచి చూస్తున్న వినాయకుడు మూషికరాజుతో...

"చూశావా రా... ఇప్పుడే నాకు అసలు నైవేద్యం వచ్చింది!" అన్నాడు.


మూషికరాజు నవ్వుతూ...

"స్వామీ... గుడిలో పెట్టిన ప్రసాదం కడుపు నింపింది... బయట ఇచ్చిన ప్రసాదం మనసు నింపింది!" అన్నాడు.


వినాయకుడు తల ఊపుతూ...

"ఇదే అసలు ప్రసాదం... ముందు ప్రేమ... తర్వాత పంచుకోవడం. ఇందులో జీడిపప్పు లేదు... నెయ్యి లేదు... కానీ మనసు మాత్రం నిండుగా ఉంది." అన్నాడు.


ఇక గుడిలో మాత్రం...

ప్రసాదాల ఫుడ్ ఫెస్టివల్ యథావిధిగా కొనసాగుతోంది.

"ఈసారి ఏం చేద్దాం?"

"జీడిపప్పు ఇంకాస్త పెడదామా?"

"నెయ్యి డబుల్ చేస్తే ఎలా ఉంటుంది?"

అంటూ ప్లాన్లు సాగుతూనే ఉన్నాయి.


వినాయకుడు మాత్రం నవ్వుకుంటూ...

"నేను భోజనప్రియుడినే... కానీ భక్తి లేకుండా చేసే ఆర్భాటానికి కాదు. ఒక చిన్న ముద్ద ప్రేమతో పెడితే అదే నాకు మహాభోజనం." అని అనుకున్నాడు.


🙏🙏4 ముగింపు


ఇంతసేపూ ప్రసాదం గురించి కథ చెప్పాను కదండీ...


ఇప్పుడు ఒక చిన్న నిజం చెబుతాను.


నాకూ తిరుపతిలో🙏 గోవిందరాజస్వామి గుడిలో చేసే పులిహోర ప్రసాదం అంటే చాలా... చాలా ఇష్టం.


నిజం చెప్పాలంటే, గోవిందరాజస్వామికి దండం పెట్టుకుంటూనే నా మనసులో ఇంకో ఆలోచన కూడా నడుస్తూ ఉంటుంది...


"అయ్యో... ఆ పులిహోర ప్రసాదం అయిపోకూడదు. నాకు ఒక పొట్లం దొరకాలి!" 😄


కొన్నిసార్లు నేనే నన్ను చూసుకుని నవ్వుకుంటాను.


"నాకు దేవుడి మీద భక్తి ఎక్కువా... లేక దేవుడి ప్రసాదం మీద భక్తి ఎక్కువా?" అని!


వినాయకుడైనా...

అన్నపూర్ణాదేవి అయినా...

దేవుడి ప్రసాదంలో ఉండే ఆ ప్రేమ, ఆ రుచి మాత్రం నేను ఇప్పటికీ మర్చిపోలేదు.


తప్పు నాదో...

ప్రసాదానిదో...

లేక దేవుడే అంత రుచిగా పెట్టించాడో...

నాకైతే తెలియదు.


అందుకే వినాయకుడిని ఒక్కటే కోరుకుంటాను...


"స్వామీ... నా చిన్న చిన్న అల్లరులను క్షమించు. ప్రసాదం మీద ఉన్న ప్రేమతో పాటు, నీ మీద ఉన్న భక్తిని కూడా ఎప్పుడూ అలాగే ఉంచు. అందరినీ సుఖసంతోషాలతో ఆశీర్వదించు."


ఈ కథ ఎవ్వరినీ తప్పుపట్టడానికి కాదు.


ప్రసాదం చేయడం గొప్పదే.


దేవుడికి నైవేద్యం పెట్టడం ఇంకా గొప్పది.


కానీ...


ఒక విషయం మాత్రం ఈ కథ రాస్తూ నేను తెలుసుకున్నాను.


ప్రసాదం ఎంత పెట్టామన్నది కాదు... ఎంత మనసుతో పెట్టామన్నది ముఖ్యం.


దేవుడికి ఎంత నైవేద్యం చేరిందో మనకు తెలియకపోవచ్చు. కానీ ఒక ఆకలితో ఉన్న మనిషి కడుపు నిండితే... ఆ ప్రసాదం మాత్రం నిస్సందేహంగా దేవుడికే చేరుతుంది.


పులిహోరలో జీడిపప్పు ఉండొచ్చు...

పొంగలిలో నెయ్యి ఉండొచ్చు...

చక్కెర పొంగలిలో తీపి ఉండొచ్చు...


కానీ ప్రసాదంలో భక్తి, ప్రేమ, పంచుకునే మనసు లేకపోతే...


అది కేవలం ఒక వంటకం మాత్రమే.


అదే...


ఒక చిన్న ముద్దైనా ప్రేమతో ఇచ్చి, ఒక ఆకలితో ఉన్నవాడి కడుపు నింపితే...


అదే మహాప్రసాదం.


జై శ్రీ వినాయకాయ నమః.

 

– Shrita


శుభం.


***

శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:



శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 రచయిత్రి పరిచయం: శ్రిత

శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.

ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page