పరోపకారార్ధం
- Malla Karunya Kumar

- 6 hours ago
- 6 min read

Paropakarartham - Telugu Emotional Story | Malla Karunya Kumar
పరోపకారార్ధం - తెలుగు భావోద్వేగ కథ | మళ్ళ కారుణ్య కుమార్
Published In manatelugukathalu.com On 06/06/2026
“అమ్మ కాస్త బిచ్చం పెట్టమ్మా!..”బిగ్గరగా అరుపు వినిపించడం తో,,
ఒక్కసారిగా న్యూస్ పేపర్ మీద నుండి తన చూపు తిప్పి ఉరుముతూ వాకిలి వైపు చూసాడు పరమేశం...
“మరో వేష గాడు వచ్చాడు...వీళ్లకు ఏమీ పని లేదు...బూటకపు మనుషులు ..”అని మనసులో రగిలిపోతూ మళ్ళీ పేపర్ చదవడం లో నిమగ్నం అయ్యాడు పరమేశం.
ఇంతలో ప్లేట్ లో బియ్యం,, పది రూపాయలు తో వేగంగా బయటకు వచ్చింది లత.
లత ను గమనించిన పరమేశం, “ఆగు లత. ఏమి చేస్తున్నావు నువ్వు?. అలాంటి వాళ్ళకు ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు.” అని కేకవేస్తూ అన్నాడు.
“అది కాదండీ.” అని ఏదో చెప్పబోయింది.
భర్త ఉరుముతూ చూడటం తో వెనక్కి తగ్గింది లత.
“ఇంకా చూస్తావేమిటి. వెళ్ళిపో ఇక్కడ నుండి .” అని అక్కడ ఎదురు చూస్తున్న ఆ వ్యక్తిని వెళ్లగొట్టాడు.
“ఎందుకు మీరు ఇలా తయారయ్యారు?. అసలు మీకు ఏమైంది?. ఇలా ఎవరు బిచ్చం కోసం వచ్చినా వాళ్ళను తరిమేస్తున్నారు. వాళ్లకు కొంత ఇస్తే మనకేమి తరిగిపోదు కదా.” భర్త చేస్తున్నదానికి విసుగు చెంది, అసహనం తో అంది లత.
“లత.. నీకు తెలియదు వీళ్ళ గురించి, వీళ్లంతా వేషాలు వేస్తున్నారు!. అందుకే వాళ్ళకు ఏమి పెట్టొద్దు అని నేను అన్నాను.”అని మళ్ళీ తన పనిలో నిమగ్నం అయ్యాడు..
“ఏంటో ఈయన చాదస్తం...”అని తనలో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది లత.
“ఇలాంటి వాళ్లకు ఈ విధంగానే చేయాలి. లేకపోతే ఇలా డబ్బులు పోగేసి జల్సాలు చేస్తారు. ధర్మం చేసే వాళ్ళను మోసం చేస్తూనే ఉంటారు.” అని తనలో అనుకుంటూ వున్నాడు పరమేశం.
ఇంతలో అక్కడకు చేరుకున్నాడు పరమేశం మిత్రుడు గణేష్. ఇద్దరూ గ్రూప్ ఏ అధికారులుగా పని చేసి పదవి విరమణ తీసుకున్న వాళ్ళు. ఇద్దరూ రోజూ కలవడం పరిపాటి. గణేష్ రాకను గమనించిన పరమేశం, “ఏంట్రా గణేష్! ఈ రోజు ఉదయాన్నే వచ్చావు?. ఏమిటి సంగతి!.” అని గణేష్ తో అంటూ, “లతా! లతా!, గణేష్ వచ్చాడు. ఒక కప్ కాఫీ తీసుకురా.”అని కేక వేసాడు.
“మామూలుగానే వచ్చాను రా.ఈ రోజు ఒక పని వుంది కదా..”
“పనా! ఏమిటా పని?..”ఆశ్చర్యంతో అడిగాడు.
“పనంటే పెద్ద పని కాదులేరా. మన అపార్ట్‌మెంట్ ఓనర్ వీర గారి బామ్మర్ది వెంకట్ ఒక సేవ సంస్థ ప్రారంభం చేస్తున్నారు. దాని కోసం వెళ్ళాలి. ఏమి తెలియనట్లు అడుగుతున్నావు. నీకు చెప్పలేదా?.”అని అడిగాడు గణేష్.
“ఆ, ఆ!. గుర్తుకు వచ్చింది. నిన్ననే ఫోన్ చేసి చెప్పారు. తనకు తెలిసిన మరీ ముఖ్యమైన వారికే చెప్పానని కూడా చెప్పారు. ఎంత మాట అయ్యింది. ఈ విషయాన్ని మరిచిపోయాను. సమయానికి వచ్చావు. లేకుంటే మాట వచ్చేది.”అని స్నేహితుడు తో అన్నాడు పరమేశం..
ఇంతలో కాఫీ తో వచ్చింది లత...
“అదేంటి అమ్మ, ఒక కప్పు కాఫీ తో వచ్చావు! మరి వీడికి?”
“మీరు తీసుకోండి అన్నయ్య గారు. అతను ముందుగానే తాగడం పూర్తి చేశారు.” అని కప్పు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది లత..
“ఏమైంది రా,చెల్లమ్మ ఈరోజు కోపంగా వుంది..?” అని కప్పు అందుకుంటూ అడిగాడు గణేష్.
“ఆ, ఏమి లేదురా...అప్పుడప్పుడు నాకు ఇది కామనే.. అయితే నేను కూడా వస్తాను ఇద్దరం కలిసి వెళ్దాం. హడావుడి లో నన్ను వదిలేసి పోమాకు.”అని పరమేశం అన్నాడు...
“నువ్వింకా ఆ రోజు మరిచి పోలేదా. ఏదో ఒకసారి జరిగింది అని ప్రతి సారి జరుగుతుందా.”కాఫీ తాగడం పూర్తి చేసి, కప్పు టేబుల్ మీద పెడుతూ అన్నాడు.
“అమ్మో ఎలా మరిచిపోతాను?. ఆ రోజు అక్కడ నుండి చాలా దూరం నడిచి, నడిచి అలసిపోయాను.”ఆ రోజును గుర్తు చేసుకుంటూ అన్నాడు పరమేశం.
“పరమేశం...భయపడకు...ఈ సారి అలా కానివ్వను లే. సరే ఇలా మాట్లాడుతూ ఉంటే ఆలస్యం అవుతుంది. నేను వెళ్లి రెడీ అవుతాను. నువ్వు కూడా సిద్ధంగా ఉండు.”
“మరి జాగింగ్ కు వెళ్ళవా?.”
“ఇప్పుడు పూర్తి చేసుకునే కదా వచ్చాను...”
“అరే ఈరోజు వేగంగా పూర్తి చేశావా!. నేనే బద్దకించి వెళ్లలేకపోయాను అన్నమాట. సరే వెళ్ళు, నేను కూడా రెడీ అవుతాను.”అని కుర్చీ నుండి లేచాడు
*********
ఇద్దరూ కారులో ఆ సంస్థ ఓపెనింగ్ కు బయలుదేరారు. సరదాగా మాటలు ఆడుకుంటూ ,పాటలు పాడుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇద్దరూ..
ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ పడటం తో కారు ఆగింది. ఇంతలో కొందరు కారు దగ్గరకు వచ్చి చేతులు చాచు తూ నిలబడ్డారు. గణేష్ వాళ్ళను చూసి తన జోబులో చెయ్యి పెట్టాడు. అది చూసిన పరమేశం, “ఆగరా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? వాళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకు.”అని గణేష్ ను ఆపాడు.
గణేష్ ఎంత చెప్తున్న వినకుండా గణేష్ ను నిలువరించాడు. ఇంతలో సిగ్నల్ పడటం తో కారు పోనిచ్చాడు గణేష్.
“అసలు ఏమైంది రా నీకు?. ఎందుకు వాళ్లకు సహాయం చేయకుండా ఆపుతున్నావు. ఇన్నాళ్లు దగ్గరుండి అలాంటి వాళ్లకు సహాయం చేయమని చెప్పే వాడివి కదా.”
“మోసం, అంతా మోసం రా. నేను కూడా ముందు అందరికీ సహాయం చేయాలని తెగ ఆరాట పడేవాడిని. ఒకరోజు ఒక ముసలామె నా దగ్గరకు వచ్చి అయ్యా నా డబ్బులు పడిపోయాయి. మా వూరు వెళ్ళడానికి డబ్బులు సహాయం చేయండి అని చెప్పింది. పాపం అనుకొని జాలితో సహాయం చేశాను. తర్వాత కూడా మళ్ళీ కొన్ని రోజులకు ఆమె కనిపించింది మళ్ళీ అదే క ఆమె ఏ స్థితిలో వుండి అడగడానికి ఇబ్బంది పడి ఇలా అడుగుతుంది అని అనుకొని ఆమెకు మళ్ళీ సహాయం చేశాను.
కానీ అక్కడికి కొన్ని రోజులకు నేను వేరే వూరు వెళ్తుండగా ఆమె కనిపించింది. ఈ సారి ఆమెకు కొందరు తో వుంది ..పక్క వాళ్ళను ఆమె గురించి అడిగాను. ఆమె కు అయిన వాళ్ళు అందరూ వున్నారు అని తెలిసి ఆశ్చర్యమేసింది. పైగా ఆమె పాల వ్యాపారం చేస్తుందని. పూర్వం నుండి తమ ఖాతాదారులకు , పట్నంలో ఉన్నవాళ్లకు రోజూ వెళ్లి పాలు పోస్తుంటుంది అని తెలిసింది.
విషయం తెలిసి నాకు తల గిర్రున తిరిగింది. ఇంత చదువుకొని, ఇంత ఉద్యోగం చేసిన నన్ను ఆమె చాలా తెలివిగా బురిడీ కొట్టించింది. అప్పటి నుండి నాలో ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్. నాలానే ఎందరితో ఇలా చెప్పిందో?. ఈమె కాదు కొంత మంది ఇలాంటి వాళ్ళు నాకు ఎదురుపడ్డారు. అప్పటి నుండి నేను ఎవరికీ సహాయం చేయకూడదు అని అనుకున్నాను.”అని జరిగిన కథ మొత్తం వివరించాడు పరమేశం.
పరమేశం చెప్పింది విని నోరు వెళ్ళబెట్టాడు గణేష్.
“పరమేశం, నువ్వు చెప్పింది వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవును అలాంటి వాళ్లకు దానం చేయకూడదు. నాకు కొన్ని సార్లు ఎదురు పడ్డారు కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు.” అని అన్నాడు గణేష్.
కొంత దూరం వెళ్లే సరికి పరమేశం కారు ఆపమని చెప్పడం తో కారు ఆపాడు గణేష్.
“ఏమైంది రా, ఎందుకు కారు ఆపమన్నావు?.” అని అడిగాడు గణేష్.
“కాస్త దాహంగా వుంది, పదా అక్కడ కొబ్బరి బోండాలు వున్నాయి.. తాగేసి వెళ్దాం.”అని పరమేశం అన్నాడు.
గణేష్ కు కూడా దాహంగా వుండడం తో, సరే అంటూ కారు దిగాడు.
ఇద్దరూ కలిసి ఆ షాపు దగ్గరకు వెళ్లి చెరో రెండేసి బోండాలు తాగి కాస్త రిలాక్స్ అయ్యారు. ఇంతలో అక్కడికి ఒకతను వచ్చి గణేష్ ను పిలిచాడు...
అతని వైపు చూసాడు గణేష్. చూడటానికి సాధువు లా వున్నాడు ఆ వ్యక్తి.
“ఏమి కావాలండి?.” అని అడిగాడు గణేష్ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ.
“బాబు తినడానికి ఏదైనా కావాలి.”అని అతను అడిగాడు.
“చూసావా రా, మళ్ళీ మొదలు పెట్టారు.
అసలు ఇలాంటి వాళ్లను.” అని పరమేశం ఏదో అనబోతుండగా.. “బాబు, నేను అడుగుతున్నది నాకోసం కాదు. అదుగో ఆమె కోసం, ఆ అభాగ్యురాలి కోసం.”అని పక్కనే వున్న ఒక వృద్ధురాలను చూపిస్తూ అన్నాడు.
గణేష్ ఆమె వైపు చూసాడు, వెంటనే అక్కడ వున్న అరటి పళ్ళు కొని అతనికి ఇచ్చాడు. దాన్ని నవ్వుతూ తీసుకుంటూ,
“చూడు బాబు. అందరూ ఒకేలా ఉండరు కదా, కొందరి పరిస్థితి నిజంగానే చాలా దుర్భరంగా ఉంటుంది, అలాంటి వాళ్ళకు సహాయం చేయాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ల మీద ఉంటుంది కదా.”అని చివరి మాటగా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
అంతా వింటున్న పరమేశం ఏమి మాట్లాడకుండా చూస్తూ వున్నాడు. ఆ వ్యక్తి ఆ వృద్ధురాలు దగ్గరకు వెళ్ళి ఆ పళ్ళను ఆమె కి ఇచ్చాడు. ఆమె వాటిని తీసుకుంటూ కృతజ్ఞత గా ఆ వ్యక్తి వైపు చూస్తుంది. పరమేశం కళ్ళలో నీరు తిరిగాయి, మెల్లగా తన చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి.
“పరమేశం, నువ్వు కంగారు పడకు రా, ఇదుగో డబ్బులు నీ ఫీజ్ కట్టేయి.”అని తండ్రి డబ్బులు తెచ్చి ఇవ్వడం తో అప్పటి వరకు బాధలో వున్న పరమేశం లో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. అది తను డిగ్రీ లో వున్న రోజుల్లో జరిగిన సంఘటన..
“నాన్న!,ఈ డబ్బులు దొరకడానికి చాలా కష్టం అయ్యింది రా, కారణం నేనే రా, అప్పుడు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అవసరం కు అని డబ్బులు తీసుకొని తాగడానికి వాడేసే వాడిని, ఏమి చేయమంటావు రా నా బుద్ధి అలా మారింది. నేను ఈ విధంగా డబ్బులు తగలేడుతున్నాను అని తెలిసి వాళ్లు నాకు రూపాయి కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. లేకుంటే నీకు ఈ కష్టం వచ్చేది కాదు.
కానీ పరమేశం, మీ మామయ్య ద్వారా పరిచయం అయిన సారు మాత్రం, నా గురించి తెలిసినా నన్ను నమ్మి మళ్ళీ డబ్బులు ఇచ్చారు రా, ఏ జన్మలో చేసిన కాస్త పుణ్యం కారణంగా ఇప్పుడు నాకు సహాయం అందింది.” అని వాపోతూ చెప్పాడు తండ్రి.
తన తండ్రి ముందు బాగానే వున్నా తర్వాత తాగుడుకు బానిస అయ్యి డబ్బులు తగలేసే వాడు. అలాగని అతను కుటుంబ బాధ్యతలు మరవలేదు. తండ్రి అంటే పరమేశం కు ప్రాణం. ఈ సంఘటన గుర్తుకు వచ్చి ఒక్కసారిగా పరమేశం కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
“అయ్యో, ఎంత పని చేశాను. ఎవరో చేసిన తప్పుకు, ఎవరికో శిక్ష వేసినట్టుగా. పాపం సహాయం కోసం ఇన్నాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళని తరిమేసాను. అసలు నిజం గ్రహించకుండా ఎలా ఇలా చేశాను . నన్ను నేను పునః సమీక్ష చేసుకోవాల్సిన అవసరం వుంది.”అని అనుకుంటూ తనలో బాధపడుతూ వున్నాడు పరమేశం.
“ఏమైంది రా, ఎందుకు ఏదో ఆలోచిస్తున్నావు?.”అని పరమేశం ను చూసి అడిగాడు గణేష్.
“ఆ,ఏమి లేదు రా, నిజం గ్రహించాను. అందుకే ఏదో ఆలోచిస్తూ వున్నాను.”
“నిజం గ్రహించడం ఏమిటిరా?. నువ్వు బాగానే ఉన్నావు కదా.”
“దాని గురించి తర్వాత చెప్తాను. నేను బాగానే ఉన్నాను. సరే, ఇక బయలుదేరుదామా?.”
“సరే పదా.” అని గణేష్ కారు దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరూ కలిసి కొంత సమయం తర్వాత వాళ్ల గమ్యానికి చేరుకున్నారు. అక్కడ అంతా సందడిగా వుంది. వీళ్ళ రాకను చూసిన వెంకట్ వేగంగా వచ్చి వీళ్ళను పలకరిస్తూ లోపలికి తీసుకు వెళ్ళాడు. అప్పటికి అందరూ ఆ హాల్ లో కూర్చొని ఉన్నారు. ఇంతలో ముఖ్య అతిథి వచ్చేశారు అని ఎవరో చెప్పడం తో వెంకట్ పరుగున వెళ్ళి అతన్ని తీసుకొని వచ్చి ప్రత్యేకంగా అలంకరించిన సింహాసనం మీద కూర్చో బెట్టాడు. అతన్ని చూసిన పరమేశం , గణేష్ ఆశ్చర్యపోయారు.
“ఇందాక మనల్ని కలిసిన వారే కదా ఇతను!” అని గణేష్ అనడం తో,
“అవును, ఇతనికి నువ్వు పళ్ళు కూడా ఇచ్చావు కదా. సాధారణ వ్యక్తిలా కనిపించే ఇతను ఇక్కడ ముఖ్య అతిథా!.” అని ఆశ్చర్యపోతూ పక్కన వున్న వాళ్లను అతని గురించి అడిగాడు పరమేశం.
“అతను గొప్ప యోగి, అందరికీ సలహాలు ఇచ్చి సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద వ్యక్తులు అతని దగ్గరకు వస్తుంటారు. కానీ అతని వద్ద ఒక్క రూపాయి కూడా ఉండదు. అతనికి ఆకలి వేస్తే కేవలం భిక్షాటన చేసుకొని మాత్రమే తింటారు. ఎక్కువుగా అరణ్యాలలో ఉంటారు. అప్పుడప్పుడు ఇలా తనకు ఇష్టమైన వ్యక్తుల కోరిక మేరకు వస్తుంటారు.” అని చెప్పాడు అతను.
“మనం కొన్ని సార్లు నిజాన్ని కూడా అబద్ధం అనుకుంటాం, దాని కారణం కూడా లేకపోలేదు. కొందరు వ్యక్తులు అలాంటి పరిస్థితులు కల్పించి, సహాయం అందాల్సిన వారికి కూడా అందకుండా చేస్తున్నారు. ఈ విషయం లో మనం చాలా శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే దైవం మనుష్య రూపేణా అన్నారు.”అని ఇంకా ప్రసంగం కొనసాగిస్తూ వున్నారు ఆ సాధువు...
తనలో నిండి పోయిన కోపాన్ని, ఎవరైనా సహాయం కోసం వస్తె వాళ్ల అందరూ వేషగాళ్ళే అన్న భావన ఈ సాధు పుంగవుని రూపంలో ఆ దేవుడే తొలగించాడు అని పరమేశం అనుకున్నాడు. వెంటనే తన ఫోన్ తీసి తన వాట్సాప్ గ్రూపులో అభాగ్యులను వెతికి మరి తెలుసుకొని ,నిజమైన కష్టాల్లో ఉన్నవారికి తమకు కలిగిన సహాయం చేద్దాం అని, అందరం కలిసి ఒక గ్రూప్ గా తయారవుదాం మెసేజ్ పెట్టాడు.
గణేష్ కూడా ఆ గ్రూప్ లో ఒక సభ్యుడుగా వుండడం తో పరమేశం మెసేజ్ చూసి ఆశ్చర్యపోయాడు, తర్వాత అతని ఆలోచనకు మెచ్చుకొని తాను కూడా అంగీకారం తెలిపాడు. పరమేశం మిత్రులు కూడా ఈ ఐడియా బాగుంది, దీన్ని అమలు చేద్దామని అంగీకారం తెలిపారు.
***సమాప్తం****
మళ్ళ కారుణ్య కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.












Comments