top of page
Original.png

మోహన్ గారి కర్ర తత్వం


మోహన్ గారి కర్ర తత్వం, వెంకట్ మంత్రిప్రగడ, హాస్య కథ, వ్యంగ్య కథ, నగర జీవితం, వీధి కుక్కలు, తెలుగు కథలు, సామాజిక వ్యంగ్యం, మధ్యతరగతి జీవితం, మనతెలుగుకథలు

మోహన్ గారు చేతిలో అమ్మమ్మ కర్రతో కాలనీలో వాకింగ్ చేస్తున్న దృశ్యం
మోహన్ గారు చేతిలో అమ్మమ్మ కర్రతో కాలనీలో వాకింగ్ చేస్తున్న దృశ్యం

Mohan Gaari Karra Thathvam - Telugu satirical story | Venkat Manthripragada

మోహన్ గారి కర్ర తత్వం తెలుగు వ్యంగ్య కథ | వెంకట్ మంత్రిప్రగడ

Published in manatelugukathalu.com on 17/07/2026


వీధి కుక్కల భయం నుంచి మొదలైన ఒక సాధారణ కర్ర... చివరకు సమాజం, ప్రభుత్వ వ్యవస్థ, మనుషుల మనస్తత్వం, ఆశ అనే తత్వాన్ని చెప్పే అద్భుత ప్రతీకగా మారుతుంది. నవ్విస్తూ ఆలోచింపజేసే వ్యంగ్య కథ.


“అయ్యో... ఈ సిటీ బతుకు నన్ను కాల్చేస్తోంది!” అంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు మోహన్.


అతని ముఖం చూసి భార్య కాఫీ కప్పు కింద పెట్టేసింది. “ఏమండీ! ఆఫిసులో మళ్ళా ఏమైనా కొత్త సమస్యా?  ట్రాఫిక్‌లో ఎవరో హారన్‌తో ఉపన్యాసం ఇచ్చారా? లేక పెట్రోలు మళ్లీ పెరిగిందా?” అని అడిగింది.


“అవేవీ కాదు,” అన్నాడు మోహన్. “ఈ నగరం నన్ను నెమ్మదిగా మనిషి నుంచి ‘జాగ్రత్త... ప్రమాదం!’ అనే బోర్డుగా మార్చేస్తోంది.”


లోపల నుంచి తల్లి వచ్చింది. “ఈ మధ్య నగరాన్ని తిట్టడం నీకు ఉదయం కాఫీ లాంటిదైపోయింది. కొత్తగా ఏం కనిపించింది?” అని నవ్వింది.


మోహన్ కిటికీలోంచి రోడ్డు వైపు చూపించాడు. “అమ్మా... మనం ప్రైమ్ లోకాలిటీలో ఉంటున్నామని గర్వపడతాం. ఇల్లు ధర వింటే గుండె దడపుడుతుంది. కానీ మనిషి పది నిమిషాలు ప్రశాంతంగా నడవడానికి పార్కు లేదు. పిల్లలు బంతి ఆడుకోవడానికి మైదానం లేదు. చివరికి కాలనీ రోడ్లే వాకింగ్ ట్రాక్.

 కానీ ఆ రోడ్లు మనవి కావు... అవి వీధి కుక్కల రాజ్యం. మనం అక్కడ వీసా మీద తిరిగే విదేశీయులం.”


భార్య నవ్వేసింది. “అంత డ్రామా చేయకండి.” మోహన్ కూడా నవ్వాడు.


“డ్రామా కాదు. ఇప్పుడు ఉదయం వాకింగ్‌కి వెళ్లే టప్పుడు అర్ధం కాని పొలిటికల్ చర్చలు వినడం మనేసాను ... కుక్కల జనాభా లెక్క పెడుతున్నాను. 


ఈ వీధిలో నాలుగు, ఆ వీధిలో ఆరు. వాటిలో రెండు నిద్రపోతున్నట్టు నటిస్తాయి. 

దగ్గరికి వెళ్తే ఒక్కసారిగా వైవా వోసే మొదలుపెడతాయి. నేను జవాబు చెప్పకముందే అవే మార్కులు వేసేస్తాయి.”


“అయితే ఇంకో రోడ్డులో నడవండి” అంది భార్య.


“నగరంలో రోడ్లు మారతాయి. కానీ కుక్కల యూనియన్‌కు బదిలీలు ఉండవు”

 అన్నాడు మోహన్.


తల్లి నవ్వుతూ, “అయితే ఏం చేస్తావు?” అని అడిగింది.


“రేపటి నుంచి కర్ర తీసుకెళ్తా,” అన్నాడు మోహన్.


భార్య కాఫీ మింగబోతూ దగ్గేసింది. “కర్రా?” నవ్వాపుకుంటూ అడిగింది భార్య.


“అవును. కుక్కలను కొట్టడానికి కాదు. నా చేతిలో కర్ర కనిపిస్తే ‘ఈ కస్టమర్‌తో వ్యర్థ చర్చ వద్దు’ అనుకుంటాయి,” అన్నాడు మోహన్.


తల్లి ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంది. “అమ్మమ్మ కర్ర అటక మీద ఉంది కదా!” 


మోహన్ కళ్లలో వెలుగు మెరిసింది.


“అదే కావాలి. అమ్మమ్మ ఆశీర్వాదం, నా భద్రత... రెండూ ఒకేసారి.”


అటక ఎక్కిన మోహన్‌కు మొదట కర్ర కాదు, భారతీయ మధ్యతరగతి కుటుంబ చరిత్ర కనిపించింది.


మొదటి పెట్టెలో పాత రేడియో. అది ఎప్పుడో పాడైపోయింది. కానీ “ఒకసారి రిపేర్ చేస్తే కొత్తదానిలా పాడుతుంది” అనే ఆశ మాత్రం ఇంకా ఫుల్ బ్యాటరీతో ఉంది. 


ఇంకో పెట్టెలో పెళ్లి శుభలేఖలు.


 వాటిలో పెళ్లి చేసుకున్న వాళ్లలో కొందరు ఇప్పుడు తాతయ్యలు, కొందరు అమెరికాలో, కొందరు విడిపోయారు. కానీ శుభలేఖలు మాత్రం కొత్త పెళ్లి కోసం ఎదురుచూస్తున్నట్టే మెరిసిపోతున్నాయి.


మూడో పెట్టెలో ఒక్క చెప్పు. “అమ్మా! ఇంకో చెప్పు?” అని అడిగాడు.


 “ఎప్పుడో పోయింది” అంది తల్లి. 


“మరి ఒక్క చెప్పు ఎందుకు దాచావు?”


 “ఎప్పుడైనా రెండోది దొరుకుతుందేమో!” 


అంది ఎంతో సహజంగా. మోహన్ తల పట్టుకున్నాడు. 


“మన దేశంలో ఆశకి ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. చెప్పు పోయినా ఆశ పోదు.”


ఇంకో డబ్బాలో ఐదు పనిచేయని గడియారాలు. “ఇవి ఎందుకు?” అన్నాడు.


“పారేయాలనిపించలేదు.”


 “మరి బాగు చేయించాలనిపించిందా?” 

“అదీ లేదు.” 


మోహన్ నవ్వేశాడు. “ఇవి వస్తువులు కావమ్మా... నిర్ణయం తీసుకోలేని కుటుంబ సభ్యులు.”


మరొక సంచిలో క్యాసెట్లు. “సూపర్ హిట్ సాంగ్స్ – 1989”, “భక్తి గీతాలు”, “ఇంగ్లీష్ స్పోకెన్ కోర్స్”. “ప్లేయర్ ఎక్కడ?” అన్నాడు. 


“అది పాడైపోయింది.”


 “మరి క్యాసెట్లు?” 


“పారేయాలనిపించలేదు.” 


మోహన్ మనసులో అనుకున్నాడు – మనుషుల్ని వదిలేయడం సులభం... వస్తువుల్ని వదిలేయడం కష్టం.


చివరికి ఒక మూలలో తెల్లని చీరలో చుట్టి ఉన్న అమ్మమ్మ కర్ర కనిపించింది.


 దాన్ని విప్పగానే తేకు చెక్క మెరుపు, సింహం తల చెక్కిన పిడికిలి, వెండి తొడుగు... అది కర్రలా కాకుండా కుటుంబ పెద్ద మళ్లీ ఇంట్లోకి వచ్చినట్టుంది.


తల్లి మెల్లగా అంది. “ఈ కర్ర అమ్మమ్మ వయసుకి గుర్తు కాదు రా... ఆమె గౌరవానికి గుర్తు. 


ఆమె నడిస్తే కర్ర నేలను తాకేది కాదు. నేలే గౌరవంగా తల వంచేది.”


మరుసటి రోజు ఉదయం మోహన్ కర్ర పట్టుకుని బయటకు వచ్చాడు.


 మొదట చూసింది సెక్యూరిటీ గార్డ్. “సార్... ఎవరికైనా బుద్ధి చెప్పడానికి వెళ్తున్నారా?”


“లేదు. వాకింగ్,” అన్నాడు మోహన్.


గార్డ్ అనుమానంగా కర్రను చూసి, “అయితే... అవసరమైతే వస్తే బుద్ధి  చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట” అన్నాడు.


రెండు నిమిషాల్లో కాలనీలో వార్త పాకింది. కాలనీల్లో వార్తలకు కాళ్లు ఉండవు... 

రెక్కలు ఉంటాయి. ఎదురింటి లక్ష్మి, “మోహన్ గారు కర్ర పట్టుకున్నారట” అంది. 


“అయ్యో! మోకాళ్లు పట్టేసాఏమో” అన్నాడు భర్త.


 “నిన్న జిమ్‌కి వెళ్లారు కదా!” “అయితే జిమ్ వల్లే అయి ఉంటుంది.”


ఇంకో ఇంట్లో తీర్పు సిద్ధమైంది. “విటమిన్-D తక్కువయ్యిందేమో.”


 “ఎవరు చెప్పారు?”


 “సావిత్రిగారు.”


 “ఆమె డాక్టరా?”


 “కాదు... యూట్యూబ్ చూస్తారు.”


 ఈ దేశంలో డాక్టర్ చదవడానికి ఐదేళ్లు పడుతుంది. యూట్యూబ్ డాక్టర్ అవ్వడానికి ఐదు నిమిషాలు చాలు అనుకున్నాడు మోహన్.


ఎదురుగా రమేష్ వచ్చాడు. “ఏమయ్యింది? మోకాళ్లా?”


 “లేదు.”


 “నడుమా?”


 “లేదు.”


 “షుగరా?”


 “లేదు.”


 “బీపీ?”


 “లేదు.”


 “అయితే?” “


వీధి కుక్కలు,” అన్నాడు మోహన్.


రమేష్ మొహం చిన్నబోయింది. “నేను పెద్ద కథ ఊహించుకున్నా.”


మోహన్ నవ్వాడు. “అదే మనిషి స్వభావం. నిజం సాదాసీదాగా ఉంటే నిరాశపడతాడు.”


ఇంకాస్త ముందుకు వెళ్తే వాకింగ్ గ్రూప్ కనిపించింది. 


“మోహన్ గారూ! సీనియర్ సిటిజన్స్ క్లబ్‌లో ముందస్తు అడ్మిషన్ తీసుకున్నారా?” అని నవ్వారు.


“లేదు. నేను ఇంకా యంగ్‌నే.”


 “మరి ఈ కర్ర?”


 “ఇది నా వయసుకి కాదు... నగర వయసుకి.” 


వాళ్లు ఒక్కసారి ఆగారు.


 “అంటే?” 


“ఒకప్పుడు పెద్దవాళ్లకు మాత్రమే కర్ర అవసరం ఉండేది. ఇప్పుడు మంచివాళ్లకు కూడా అవసరం.” 


వాళ్లు నవ్వారు. అర్థం కాలేదు. నవ్వేశారు. మన సమాజంలో కొన్ని నవ్వులు అర్థమై రావు... అర్థం కాకనే వస్తాయి.


అప్పుడే నాలుగు వీధి కుక్కలు ఎదురుగా వచ్చాయి. మోహన్ కర్రను నేల మీద మెల్లగా “టక్... టక్...” అని కొట్టాడు.


కుక్కలు ఒక్కసారి కర్రని, ఒక్కసారి మోహన్‌ని చూసి, “ఈయనతో వాదనలో గెలవలేం” అన్నట్టు పక్కకు జరిగిపోయాయి. 


వెనక వాళ్లు ఆశ్చర్యంగా, “సార్! ఏమైనా మంత్రం వేశారా?” అని అడిగారు.


“లేదు. కర్రకి కూడా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. మనుషులే చదవలేరు,” అన్నాడు మోహన్.


రోజులు గడిచాయి. ఇప్పుడు కాలనీలో మోహన్ కంటే కర్రకే ఎక్కువ పేరు.


 “కర్ర గారు వస్తున్నారు.”


 “స్టిక్ అంకుల్ వస్తున్నారు.” 

పిల్లలు కొత్త పేరు పెట్టేశారు.


ఒక చిన్నోడు అడిగాడు. “అంకుల్... మీరు కరాటే మాస్టరా?”


 “కాదు.”


“అయితే కర్ర ఎందుకు?”


“నువ్వు ప్రశాంతంగా సైకిల్ తొక్కాలని.”


 పిల్లాడికి అర్థం కాలేదు. కానీ పెద్దవాళ్లకు కూడా పూర్తిగా అర్థం కాలేదు.


కాలనీ ఆంటీలు మాత్రం కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు. 


“పాపం...” అని చెప్పడం. మోహన్‌కు ఆ ఒక్క పదమే భయం.


 మనిషి చనిపోతే అంత జాలి చూపించరు.


 కర్ర పట్టుకుంటే మాత్రం ఊరంతా బంధువులైపోతుంది.


మోహన్ మాత్రం ఆగలేదు. 


మున్సిపల్ కార్పొరేషన్‌కి లేఖ రాశాడు.


 మరో లేఖ. ఇంకో ఫిర్యాదు. ఫోటోలు. వీడియోలు. ఒకరోజు ఫోన్‌లో మెసేజ్ వచ్చింది 


– “మీ ఫిర్యాదు పరిష్కరించబడింది” అని.


మోహన్ బయటికి వచ్చి చూశాడు. అదే కుక్కలు. అదే రోడ్డు. అదే భయం. “సమస్య కాదు... కంప్యూటర్లో టికెట్ మాత్రమే పరిష్కారమైంది” అని నవ్వుకున్నాడు.


మోహన్ తనకు తెలిసిన ఒక ఎమ్మెల్యేతో చెప్పించాడు. ఇక తప్పదని కొద్ది రోజుల తర్వాత అధికారులు వచ్చారు.


 రోడ్డు చూశారు. కుక్కలు చూశారు. ఫోటోలు తీశారు. కుక్కలు కూడా ప్రభుత్వ కార్యక్రమమని భావించి కెమెరా వైపు గౌరవంగా నిలబడ్డాయి.


అధికారులు వెళ్లిపోయారు. కుక్కలు కూడా అలాగే ఉండిపోయాయి.


మోహన్ అనుకున్నాడు – “ఈ దేశంలో సమస్యలు వెళ్లడం కంటే అధికారులు వెళ్లడం చాలా వేగంగా జరుగుతుంది.”


అయినా అతను లేఖలు రాయడం ఆపలేదు. ఎందుకంటే సమాధానం రాకపోవడం బాధ. ప్రశ్న అడగడం మానేయడం ఓటమి.


ఆ రాత్రి అమ్మమ్మ కర్రను గోడకు ఆనించి చాలాసేపు చూస్తూ ఉన్నాడు. 


“అమ్మమ్మా... నువ్వు వయసు వల్ల కర్ర పట్టుకున్నావు. నేను పరిస్థితుల వల్ల పట్టుకున్నాను. నీ కాలంలో కర్ర అనుభవానికి గుర్తు. మా కాలంలో అది భద్రతకు గుర్తు అయిపోయింది.”


బయట కుక్కలు మొరుగుతున్నాయి. లోపల గడియారం టిక్... టిక్... అంటోంది. మోహన్ చిరునవ్వు నవ్వుకున్నాడు.


“ఏదో ఒక రోజు వస్తుంది. ఉదయం వాకింగ్‌కి వెళ్లేటప్పుడు మనిషి చేతిలో కర్ర కాదు... చేతిలో పూలు పట్టుకుని కూడా ప్రశాంతంగా నడిచే రోజు. 


ఆ రోజు ఈ కర్ర మళ్లీ అటక మీదికి వెళ్తుంది.


 అప్పటివరకు... ఇది నా చేతిలో ఉంటుంది.


 ఆశ మాత్రం నా మనసులో ఉంటుంది.”


ఎందుకంటే ఆశ అనే కర్రకు వయసు ఉండదు.   

     *****     

వెంకట్ మంత్రిప్రగడ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: వెంకట్ మంత్రిప్రగడ


వెంకట్ మంత్రిప్రగడ
వెంకట్ మంత్రిప్రగడ

పుట్టి పెరిగింది విశాఖపట్నంలో, స్థిరపడింది హైదరాబాద్ లో, చాలా కాలంగా బెంగళూరు లో ఉంటున్నాను...సాహిత్యాభిలాష చదవడం వరకే పరిమితమైంది...లాక్ డౌన్ సందర్భంగా కొంచం రాయడం కూడా ప్రారభించేసిన ఔత్సాహిక రచయితను...తెలుగు సాహిత్య ప్రపంచంలో గురజాడ, కుటుంబరావు, రావి శాస్త్రి, ముళ్ళపూడి, జ్యేష్ఠ, భరాగో, గొల్లపూడి, జలంధర, కేశవరెడ్డి గార్లు అభిమాన రచయితలు, శ్రీ శ్రీ గారు, సిరివెన్నెల వారూ అభిమాన కవులు...

ఇతర భాషా సాహిత్యాలలో మున్షీ ప్రేమ్ చంద్, మాక్సిం గోర్కీ, దోస్తోయ్వస్కీ, మొరావియా, ఆల్బర్ట్ కామూ, పౌలో కొయిలో, కన్నడం లో భైరప్ప లు కూడా చాలా ఇష్టమైన రచయితలు...

ఆధునిక రచయితల్లో యువల్ నోవా హరారీ, రాజా ఇవటూరి, సత్యం మందపాటి, అనిల్ అనంతస్వామి అభిమాన రచయితలు ...

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page