top of page

ప్రగతి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.




Video link

'Pragathi' New Telugu Story Written By Sita Mandalika

రచన: సీత మండలీక


"ఒరేయ్ రాములూ ఎంత సేపు తొంగుంటావురా. చాయి తాగి, సెత్తేరడానికి పోరా. ఇయ్యేల నేను పోలేను. చిన్నోడికి రేత్రినించి చాలా జోరంగున్నాది" అన్న తల్లితో “బాగా నిద్దరగా ఉందే! తొంగో నియ్యవే" అని జవాబిచ్చేడు రాములు.


" ఒరేయ్.. అలా అనకురా! ఇయ్యాల మరో రెండీదుల నించి కూడా సెత్తేరుకుని రారా.

ఇంట్లో తిండానికేమీ లేవు. నువ్వు డబ్బులు తెస్తే పప్పూ సారూ సేస్తాను".


"అమ్మా! నువ్వు రోజూ అలాగే అంటావు కానీ గంజన్నమే ఎడతావు” అని మెల్లిగా

లేచేడు రాములు.


రోజూ మార్నింగ్ వాక్కి వెళ్తున్న శ్రీనివాస్ కి ఈ మాటలు పక్కనే ఉన్న గుడిసె లోంచి

వినిపించేయి. ఆ వేళ బాగా చలిగా ఉండడంతో శ్రీనివాసు స్వెట్టరు, టోపీ వేసుకుని వెళ్తున్నాడు.

గుడిసె లోంచి ఇంకా మాటలు వినిపిస్తున్నాయి. "నీ బాబు ఏమీ పెద్ద ఆపీచరేం కాదు. తను తాగగా మిగిలిన రెండు వేలిత్తాడు నెలకి. దాంతో నలుగురు మడుసులు ఎలా బతుకుతాం రా? సిన్నోడిని కూడా ఈ పని లో పెట్టాలి. లేకపోతే గడవదు. మనలాంటోళ్ళకి రెక్కాడితేగాని డొక్కాడదురా. నేను పోనంటావురా?. ఈయేల ఎలా పోవో సూత్తాను". అని తల్లి కోపంతో చీపురుతో కొట్టబోతే..


"అమ్మా! ఎల్తాను" అంటూ బయటకు వచ్చిన చిన్న ఆకారాన్ని చూసి శ్రీనివాసు ఆశ్చర్య పోయేడు.

ఆ కుర్రాడికి పన్నెండేళ్ళుంటాయేమో . బక్క పలచగా చిరిగిన నిక్కరు, పాత టీ షర్టుతో, గోనె భుజాన్నేసుకుని చెత్తేరడానికి బయల్దేరేడు. శ్రీనివాసు అతన్ని అనుసరిస్తూ అతని పేరడిగి తెలుసుకున్నాడు.


"చదువుకుంటున్నావా రాములూ?"


" లేదు సార్. ఐదో కలాసు దాకా బడి కెళ్ళేను. తరవాత వాళ్ళు బోజనం ఇవ్వడం మానేసేక స్కూల్ లోంచి తీసేసింది అమ్మ. రెండు గంటల దాకా సెత్తేరుకుంటూనే ఉంటాను. సెత్తంతా ఏజెంట్ కిచ్చి ఆయనిచ్చిన డబ్బు మా యమ్మ సేతులో ఎడతాను. అమ్మపెట్టిన కూడు తిని ఆడుకోడానికి పోతాను". అంటూ పక్క వీధిలోకి పరిగెత్తేడు రాములు.


ఇంచుమించు ఆ వయసులోనే ఉన్న తన పిల్లలు గుర్తుకొచ్చేరు శ్రీనివాసుకి. ఈ టైం లో హాయి గా కప్పుకుని పడుకునుంటారు. పాపం ఈ వయసు లో వీడికి ఈ పూచీ. ఒక్క సారి మనసంతా బాధతో నిండిపోయింది. ఎదో చెయ్యాలి ఇలాంటి పిల్లలకి అనుకున్నాడు.

రాత్రి భోజనాల దగ్గిర శ్రీనివాసు భార్య స్వప్న తో అన్నాడు. "మన ఇంటి దగ్గిర బస్తీ లో ఉన్న పిల్లలకి చదువు నేర్పుదామా? ఎన్నాళ్లిలా చెత్త ఏరుకుంటూ జీవితం గడువుతారు? వాళ్ళు కూడా ఒక మంచి జీవితానికి అర్హులు కదా"


"శ్రీనూ! ఆ బస్తీలో ఉన్న వాళ్ళు మనలాంటి వాళ్ళ మాటలు వినరు. చెత్త అమ్ముకుని అలాంటి జీవితాన్నే ఇష్టపడతారు. వాళ్ళని చదువుకో అంటే ఇష్ట పడరు, అలాంటి ప్రయత్నాలు సుద్ద వేస్ట్" అంది స్వప్న.

"అలా అని అందరూ వాళ్ళని వదిలేస్తే ఎలా చెప్పు? వీళ్ళ జీవితాలు ఇంక బాగు పడే మార్గమే లేదా? రెండు రోజుల్లో రాములికి సాయంకాలం చదువు చెప్తాను"

‘సరే.. ఈయన ఎలాగు చెప్తే వినే రకం కాదు’ అని స్వప్న జవాబు చెప్పకుండా ఊరుకుంది.

మర్నాడు శ్రీనివాసు వాకింగ్ కి బయల్దేరేసరికి రాములు మళ్ళీ గోనె సంచీ భుజాన్నేసుకుని కనిపించేడు.


" ఏమిటి రాములూఅప్పుడే బయల్దేరేవు?"


"ఔను సార్! ఇయ్యాల వెంకటి పేకాట నేర్పుతాడు. సెత్తేరిన తరవాత ఆడికాడకి పోతా. ఆడు పేకాటాడి సాల డబ్బులు సేసుకుంటున్నాడండి. పేకాటలో సాలా డబ్బు లొత్తాయని వెంకట్ సెప్పేడు".


"పేకాట లో లో డబ్బులు వస్తాయి.. పోతాయి. అదీ కాక పోలీస్ లు చూస్తే అందరినీ జైలు లో పెడతారు. పేకాటలో సంపాదించిన డబ్బు తో నీకు తాగాలనిపిస్తుంది. ఇంక మీ అమ్మకేమిస్తావు?"


"లేదు సార్ నేను తాగను. తాగి మా ఆయ్య అమ్మని కొడతాడు "


“కాదు రాములూ! నువ్వు బాగా చదువుకుని డబ్బు సంపాదిస్తే మీ అమ్మానాన్నలని పోషించగలవు"


ఈ మాటలన్నీ వాడి చిన్న మనసుకి అర్ధంకాలేదు. సార్ చెప్పింది, సెత్త ఏర కూడదు. పేకాడకూడదు, సదూకోవాలి. మరి డబ్బులెలా వత్తాయి?"

"రాములూ! నేను పక్క వీధి లో హనుమంతుడి గుడి దగ్గర ఉంటాను. రాత్రి మా ఇంటికి రా. మా పిల్లల బట్టలు ఇస్తాను".


ఇది విన్న వాడి మనసు ఆనందంతో నిండిపోయింది. ఈ చిరిగిన బట్టలు వేసుకుని విసిగెత్తి పోయేడేమో మంచి బట్టలు వేసుకోవాలన్న కోరిక ఎక్కువైపోయింది. అమ్మకి చెప్పి ఇయ్యాల సార్ ఇంటికెళ్ళాలి.


ఆవేళ రాములు తల్లి గంగికి కొత్తగా ఊరినించి వచ్చిన అమ్మగారు ప్యాకింగ్ మెటీరియల్ పారేయడంతో బాగా డబ్బు దొరికింది. ఇంటి దగ్గర ఉన్న రాములుని చూసి “ఏమిరా.. ఈయేల ఎల్ల లేదా?” అని అడిగి ఊరుకుంది. పిల్లలకి పప్పు చారు వండాలనే ఆమె ధ్యాస.


“అమ్మా! ఈయేల పక్కవీధిలో సార్ బాబు వాళ్ళ బట్టలిత్తానన్నారు. రేత్రి రమ్మన్నారు. సదూ కూడా సెప్తారట"


“ఒరేయ్ రాములూ! ఈ సదూలన్నీ పెద్దోళ్ళకి, మనకొద్దురా”

సరే బట్టలు దొరుకుతాయి కదా అని గంగి రాములుతో రాత్రి శ్రీనివాసు ఇంటికి వెళ్ళింది.

”నా పేరు గంగి అండి. రాములు నా కొడుకండి” అని చెప్పింది.

రాములుని చూస్తూనే శ్రీనివాసు ఎంతో ఆప్యాయంగా పలకరించేడు.


"చూడు స్వప్నా! ఇందాకా రాములు కోసం పెట్టిన హరీష్ బట్టలూ, స్వేటర్లూ, జోళ్ళూ అన్నీఇయ్యి. అవన్నీ రాములుకు సరిపోతాయి "

వెంటనే స్వప్న ఒక పెద్ద ప్యాకెట్ తెచ్చి రాములు ముందు పెట్టింది. రాములు ఆశగా ఆ ప్యాకెట్ వేపు చూస్తూ ఉండిపోయేడు.

శ్రీనివాసు అభ్యుదయ భావాలు కల మనిషి. అతనికి డబ్బుకి లోటు లేదు. ఆఫీస్ లోపెద్ద పదవి. అలా అని బీద వాళ్లకి డబ్బులు పంచడం అతనికి ఇష్టం లేదు. రాములు లాంటి వాళ్లలో నూతన ఉత్సాహం పుట్టించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు హాయిగా జీవితం గడిపేటట్లు చెయ్యాలి. అదే తన ఆశయం.

శ్రీనివాసు గంగికి ఇలా చెప్పడం మొదలు పెట్టేడు. "చూడు గంగీ, నువ్వు రాములిని బాగా చదివించు. పాపం చిన్న వాడు. ఎండనక వాననక ఇలా చెత్త ఏరుకుంటూ ఎదుగూ బొదుగూ లేని జీవితాన్ని గడుపుతున్నాడంటే చాలా బాధనిపిస్తోంది”.


" కానీ మా బతుకులింతే సార్. వాడి నాయన పొద్దుగాలనించీ తాగి తొంగుంటాడు. ఎప్పుడేనా పనికి ఎల్తాడు. సిన్నప్పట్నుంచీ మాకిది అలవాటే సార్" అని జవాబిచ్చింది గంగి.

" గంగీ! నువ్వు ఇలా అనుకుని ఉన్న జీవితంతో పోరాడుతూ ఉండకూడదు. రాములుని ప్రభుత్వ పాఠశాల్లో చదివించు. దానికి ఫీజులుండవు. బస్తీలో పిల్లలు చదువుకోడానికి వస్తే నేను, నా స్నేహితులు ఏదో సాయం చేస్తాము. అసలు వాడు చదువుకుంటే నీ భర్త కూడా ఇంటి బాధ్యతలు చూసుకుంటాడు. ఎనిమిదవ తరగతి దాకా చదువుకుంటే ప్రభుత్వం ఖర్చు లేకుండా వృత్తిపరమైన శిక్షణ ఇస్తారు.

ఈ శిక్షణ తరవాత వారి వారి వృత్తుల్లో ఉద్యాగాలు చూపించే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఆలా వాళ్ళ కొచ్చే సంపాదన ప్రస్తుత సంపాదనకంటే ఎన్నోరెట్లు ఎక్కువ ఉంటుంది . మీ కష్టాలన్నీ తీరిపోతాయి "


" ఆడి నాయనతో మాట్టాడుతాను సార్" అని తప్పించుకుంది గంగి

“ఏరా రామూ! పేకాటకెందుకు రాలేదు? అడిగేడు వెంకట్.​

“చూడు, నేను కొత్త వాచీ కొన్నాను. మొన్న పేకాటలో మూడొందలొచ్చేయి. ఈ వాచీ కొన్నాను...”

వాచీ తళ తళామెరిసిపోతోంది .


"నిన్ను శ్రీనివాసు బాబు సదూకోమన్నాడుట గదా. ఆరిమాటలు ఇనకు. ఆళ్ళలాగే సెప్తారు. మనం పేకాడాలి. డబ్బులు సంపాదించాలి "


రాములనుకున్నాడు వెంకట్ లా పేకాడాలి, డబ్బుసంపాదించాలి..

మర్నాడు రాములు పేకాట కి పోదామని తయారయ్యాడు. ఆ రోజు రంగడు, ముత్యాలు, కనకరాజు కూడా పేకాటకి పోయేరు . గంగి కి కొంచెం జ్వరం గా ఉండడం వల్ల ఆలస్యం గా వెళ్లాల్సి వచ్చింది ఇంతలోనే వీధి లో ఏదో గోలగా ఉంది బయటికి పోయి చూస్తే వెంకట్ తో సహా అందరినీ పోలీసులు సంకెళ్ళేసి తీసుకు పోతున్నారు , ఎన్నాళ్ళు జైలు లో ఉంటారో అని అందరూ అంచనాలు వేస్తున్నారు.


రాములుకు చాలా భయం వేసింది. సార్ చెప్పింది నిజమే , ఈ పేకాటలో చాల ప్రమాదాలు ఉన్నాయి.


ఆ వేళసాయంకాలం రాములు శ్రీనివాసింటికెళ్లి "సార్! నేను సదూకుంటాను”అన్నాడు.

శ్రీనివాసుకి చాలా సంతోషం అనిపించింది. "సరే రాములూ! రేపు నువ్వు పొద్దునే

మంచి బట్టలు వేసుకుని మా ఇంటికి రా. నేను రేపు ఆఫీస్ కి సెలవు పెట్టి నిన్ను స్కూల్ లో చేరిపిస్తాను” అన్నాడు శ్రీనివాస్.

ఉదయం సంఘటనతో గంగకి కూడా చాల భయం వేసింది.

"పిల్లలు సదూకుంటే బాగు పడతారంట. నువ్విలా తాగి తొంగుని, పిల్లలు పేకాడి దొంగతనాలు చేసి, జైలు కి పోతే నేను ఉరేసుకుని సత్తాను. నీ ఇట్టం" అని మొగుడు వీరయ్యని నిలదీసింది గంగి. పొద్దున్న పిల్లల్ని పోలీసులు తీసికెళ్ళడం చూసేక వీరయ్యకి కూడా భయం పట్టుకుంది.


" గంగీ! నేను రోజూ పనికి పోతాను. తాగుడు మానడానికి ప్రయత్నం సేత్తాను. మన పిల్లలు బాగు పడాల " అని వీరయ్య చెప్పేడు. ఆరోజు గంగి కుటుంబంలో ఒక గొప్పరోజు.

మర్నాడు రాములుతో పాటు మరొక నలుగురు బస్తీ పిల్లలని స్కూల్ లోచేర్పించేడు శ్రీనివాసు. తరవాత పిల్లల ప్రగతిని శ్రీనివాసు చూస్తూ తగిన సహాయం చేస్తూ వచ్చేడు

ఇదంతా జరిగి కొన్ని సంవత్సరాలయ్యింది. రాములు ఎనిమిదవ తరగతి లో పాస్ అయి రెండు సంవత్సరాలు టైల్రింగ్ కోర్స్ చేసి ఒక జెంటిల్ మేన్ గా పైకి వచ్చేడు. వీరయ్య తాగుడు తగ్గించి పని లో పడ్డాడు. గంగి చెత్త ఏరడం మాని రెండు మూడిళ్లలో పనులు చేస్తోంది . శ్రీనివాసు రాములు ని ఒక పెద్ద రెడీ మేడ్ బట్టలు తయారు చేసే కంపెనీ లో టెక్నీషియన్ గా ఉద్యోగం ఇప్పించేడు నెలకి 20, 000 జీతం, రాములుని చూసి మరి కొంత మంది పిల్లలు స్కూల్ లో చేరారు.


"ఆ రోజు రాములు ఉద్యోగం లో మొదటి రోజు.

"ఒరేయ్ రాములు! ఈ డ్రెస్ లో నువ్వు ఎంత అందంగా ఉన్నవురా. ఈ నౌకరీ నీకు వచ్చిందంటే ఆ బాబు సలవేరా. నీకే కాదురా.. బస్తీ లో పిల్లలందరికీ సార్ దేవుడే! పనికి వెళ్లే ముందర అయ్యగారికి, అమ్మగారికి కాల్మొక్కి రా రా"అని చెప్పింది గంగి .

"రాములూ! సార్ దగ్గిరకి ఉట్టి సేతులతో ఎల్లకు. మార్కెట్ కెళ్ళి మంచి పళ్ళు కొని అట్టికెళ్ళు. ఆ సారు మనకి నిజం గా దేవుడే" అని మాట కలిపేడు వీరయ్య.

అభ్యుదయ భావాలు కల శ్రీనివాసు చేసిన ఒక్క మంచి పని సమాజంలో ఎంత మార్పు తెచ్చిందో అన్నదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ.


ఇలా చదువు కున్న వాళ్ళందరూ చేస్తే మన సమాజం లో ఊహించరాని అభి వృద్ధి సాధించగలం కదా.


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : సీత మండలీక

నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది

కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది


135 views0 comments
bottom of page