ప్రతిఫలం
- Chilakamarri Rajeswari

- 18 hours ago
- 3 min read

Pratipalam - Telugu Family Story | Chilakamarri Rajeswari
ప్రతిఫలం - తెలుగు కుటుంబ కథ | చిలకమర్రి రాజేశ్వరి
Published in manatelugukathalu.com on 28/08/2026
తల్లిదండ్రులు మన కోసం తమ జీవితంలోని ఎన్నో కోరికలను త్యాగం చేసి, మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. అయితే మనం పెద్దవాళ్లమైన తర్వాత ఉద్యోగం, బాధ్యతలు, సమయం లేకపోవడం వంటి కారణాలతో వారితో గడపాల్సిన సమయాన్ని వాయిదా వేస్తుంటాం. “ప్రతిఫలం” కథలో ఒక కుమార్తె తన తల్లి అడిగిన “ఇంకో రోజు ఉండవచ్చు కదా!” అనే చిన్న కోరికను పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. తల్లిదండ్రులు మనతో ఉన్నప్పుడే వారికి మన సమయాన్ని, ప్రేమను ఇవ్వాలనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.
"ఏంటి, అప్పుడే వెళ్ళిపోవాలా, ఇంకో రోజు ఉండవచ్చు కదా!" అమ్మ ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళినా, మా ఊరికి బయలుదేరే ముందు అనే మాటలు.
"లేదమ్మా, నాకు రేపు ఆఫీసు ఉంది. తప్పనిసరిగా వెళ్ళిపోవాలి." ఇది నా నుండి సర్వసాధారణంగా వచ్చే జవాబు.
నాన్నగారు ప్రక్కన ఉండి, "నువ్వు అలా అంటే ఎలా, దానికి ఆఫీసు ఉంది కదా, వెళ్ళిపోవాలి, మళ్ళా వస్తుందిలే" అని అమ్మకు సర్ది చెప్పి, నాతో "నువ్వు బయలుదేరు, అమ్మ అలాగే అంటుంది, నువ్వు బాధపడకు" అని నన్ను సముదాయించి పంపేవారు.
మేము ఉండే ఊరు దగ్గరే కాబట్టి అమ్మకి ఒంట్లో బాగాలేనప్పటినుంచి తరచుగా చూసి రావడానికి వెళ్ళేదాన్ని. ఆదివారం సెలవు కాబట్టి, శనివారం రాత్రికి మా ఊరు చేరడం, ఆదివారం సాయంత్రం నుంచి బయలుదేరి నేను పనిచేస్తున్న ఊరికి రావడం, ఇది నేను చేసే పని.
అమ్మ "ఇంకో రోజు ఉండవచ్చు కదా" అన్నప్పుడల్లా మనసులో ఉండలేకపోతున్నానే అని బాధపడినా, "మళ్ళా రెండు వారాల్లో వస్తాను" అనే భావన ఓదార్పునిచ్చేది. ఇలా అమ్మ ఉన్నన్నాళ్లూ సాగింది. అమ్మ అడిగినా, నాన్నగారు సర్ది చెప్పడంతో నాకు ధైర్యం వచ్చి బయలుదేరిపోయేదాన్ని. అలా రోజులు గడుస్తుండగానే, అమ్మ వెళ్ళిపోయింది. బతికుండగా అమ్మ అడిగిన మాటను ఒక్కసారి కూడా తీర్చలేకపోయాను.
ఎందుకంటే ఇంకో రోజు ఉన్నా, బయలుదేరేటప్పుడు అమ్మ అదే మాట అంటుంది కదా అని తేలికగా తీసుకున్నాను. అమ్మ పోయిన తరువాత నాన్నగారు బాగా డీలా పడిపోయారు. అధైర్యం పెంచుకున్నారు. నాన్నగారి ఆరోగ్యం కూడా దెబ్బతింది. అందువల్ల నాన్నగారి కోసం మళ్ళా శనివారం రాత్రికి చేరడం, ఆదివారం బయలుదేరడం కొనసాగింది.
ఎప్పుడూ అడగని నాన్నగారు ఆరోజు బయలుదేరుతుంటే, "ఇంకొక్క రోజు ఉండవచ్చు కదా" అని అడిగారు. అప్పుడూ నా సమాధానం అదే అయింది. "నాకు రేపు తప్పనిసరిగా హాజరు కావాల్సిన సమావేశం ఉంది, మళ్ళా ఈ శనివారం తప్పకుండా వచ్చేేస్తానుగా, నాన్నగారూ!" అని చెప్పి వచ్చేసాను. అప్పుడు నాన్నగారిలో, ప్రతిసారీ నేను బయలుదేరే ముందు ఇంకొక్క రోజు ఉండకూడదా అని అడిగే అమ్మ కనిపించింది. బాధ అనిపించింది. అయినా, బయలుదేరిపోయాను.
బస్సు ఎక్కానే కానీ, అవే ఆలోచనలు మనసులో ముసురుకున్నాయి. నాన్నగారు ఎందుకలా అన్నారు? ఎంత అత్యవసరమైన పని ఉన్నా, ఆఫీసుకి ముందు తెలపకుండా సెలవు పెట్టమని చెప్పడం, నాన్నగారి స్వభావానికే విరుద్ధం. మన వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు, మన పనులు ఆలస్యమైనా సరే, అది ఆయన సిద్ధాంతం.
అమ్మ ఎప్పుడూ అంటుండేది, "మీకు మన ఇంట్లో పనులకన్నా, బయటి వాళ్ళ పనులే ముఖ్యం" అని.
అలాంటి ఆయన "నాతో ఈ రోజుకి ఉండిపోవచ్చు కదా" అని అన్నారంటే, దాని వెనకాల ఏదో చెప్పుకోలేని బాధ, నైరాశ్యం ఉందని నేను అర్థం చేసుకోలేకపోయాను.
బస్సు ఊరి పొలిమేరల్లో బస్టాప్ దగ్గర ముందుగా సీటు ఖరారు చేసుకున్నవారిని ఎక్కించుకోవడం కోసం ఆగింది. అప్పటికే నా ఆలోచనలు ఒక రూపానికి వచ్చాయి. సీటులోంచి లేచి దిగబోయాను.
"అదేంటండీ, ఇక్కడ దిగిపోతున్నారు, మీరు విశాఖపట్నం దాకా టికెట్ తీసుకున్నారుగా" అంటూ బస్ డ్రైవర్ అన్నాడు.
"అవును కానీ, అత్యవసరమైన పని ఉందని వార్త వచ్చింది. అందుకే దిగిపోతున్నాను" అంటూ ఇంకో మాట అతనికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా సంచీ తీసుకుని బస్సు దిగిపోయాను.
వెంటనే ఆటో చేసుకుని ఇంటికి ఒక్క పావుగంటలో చేరిపోయాను. బయలుదేరిన అరగంటలోపే మళ్ళా ఇంటికి చేరిన నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు, "ఏమైంది" అని కంగారుపడ్డారు. వాళ్ళకి కంగారుపడాల్సిన అవసరం లేదని నెమ్మదిగా చెప్పి, నేను వెంటనే నాన్నగారి దగ్గరికి వెళ్ళాను.
"నాన్నగారూ, నేను వెళ్ళలేదు. రేపు కూడా మీ దగ్గరే ఉంటాను" అని నాన్నగారి చేయి చేతిలోకి తీసుకుని చెప్పారు. అప్పుడు నాన్నగారి కళ్లలో కనిపించిన మెరుపులు నేను జీవితాంతం మరువలేను.
మనుషులు ఉన్నంతకాలం మనకి వాళ్ళ విలువ తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయాక, "ఎందుకు అలా చేయలేకపోయాం" అని బాధపడటం తప్ప, గడిచిన కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేంగా.
పెద్దవారు అయిన తరువాత మన అమ్మ, నాన్నలు కోరుకునేది వాళ్లతో కొంత సమయం గడపమని. వీలైనప్పుడల్లా, కాదు వీలుచేసుకుని వాళ్ళతో కొంత సమయం గడుపుదాం. అప్పుడు వాళ్ళకి ఆనందం కలిగించిన వాళ్ళం అవుతాం. వాళ్ళు మనల్ని వదిలి వెళ్లిన తరువాత మనం బాధపడాల్సిన అవసరం రాదు. ఆ మధుర జ్ఞాపకాలే మనకు మిగిలే ఆస్తులు. తమ సర్వస్వం ధారపోసి, తమ ఆకాంక్షలను ప్రక్కనపెట్టి, మన భావి జీవితాల్ని తీర్చిదిద్దిన అమ్మ, నాన్నలకు మనం ఇచ్చే ప్రతిఫలం వారితో వీలైనప్పుడల్లా కొంత సమయం గడపడమే.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
చిలకమర్రి రాజేశ్వరి గారి కొన్ని ఇతర రచనలు:
చిలకమర్రి రాజేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి
నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.
మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.
నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.
పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని, నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.









Comments