top of page

ప్రేమ ‘భ్రమ’రం - 9

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link


'Prema Bhramaram - 9' New Telugu Web Series


Written By Vasundhara


రచన: వసుంధర




వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం తొమ్మిదవ భాగం

గత ఎపిసోడ్ లో...

తను ఉంటున్న ఇంటి ఓనర్ శివశంకర్ గురించి చెబుతుంది ముక్త.

అతను తమకు చేసిన సహాయం గురించి, అందుకు అతడు విధించిన షరతు గురించి కూడా చెబుతుంది.

తరువాత తన ప్రేమ గురించి చెప్పడం ప్రారంభిస్తుంది.

ఇక ప్రేమ ‘భ్రమ’రం తొమ్మిదవ భాగం చదవండి ...


‘‘ఎక్కడిదాకా చెప్పానో గుర్తుందా?’’ అడిగింది ముక్త.


‘‘గుర్తుంది. శివశంకర్‌ తెలివిగా మీకో ఆప్షనిచ్చినట్లు చెప్పారు’’ అన్నాను.


ముక్త నావంక చురుగ్గా చూసింది. ‘‘ఆప్షనిచ్చినట్లు చెప్పాను కానీ, ‘తెలివిగా’ అన్న మాట నేను వాడిన గుర్తు లేదే’’ అంది.


ఆమె అన్న పద్ధతినిబట్టి నేనలాగనడం తనకి నచ్చలేదని గ్రహించాను. కానీ -

‘‘ఇందులో మీరనడానికేముంది? అంతడబ్బు బాకీ తీర్చడానికి మూడంటే మూడేళ్లు గడువిచ్చాడాయన. అది తెలివి కాదా?’’ అన్నాను.


‘‘అంటే మూడేళ్లలో ఆ అప్పు తీరదని మీ అభిప్రాయమా?’’ అందామె.


‘‘ఊఁ’’ అన్నాను నమ్మకంగా.


ఆమె నవ్వి, ‘‘తీరకపోవడం ప్రసక్తే లేదు. నాకొచ్చే జీతంలోంచే ఏడాదికి అరవై డెబ్బై వేలు నిలవెయ్యగలను’’ అంది ముక్త.


ఆమె జీతమెంతో తెలియదు. ఆయనకి ఎంత బాకీ పడిందో తెలియదు. అడిగే ఉద్దేశ్యం కూడా నాకు లేదు.


‘‘ఐనా మూడేళ్లలో ఆయన బాకీ తీర్చెయ్యగలరా?’’ అన్నాను.


‘‘మూడేళ్లెందుకు? ఏడాదిలోగానే ఆయన బాకీ తీర్చేయడానికి - నాకు కవన్‌, భవన్‌లు కూడా సాయం చేస్తామంటున్నారు’’ అంది ముక్త.


వాళ్లిద్దరికీ ఒకరికొకరు తెలుసో తెలియదో కానీ - ముక్త కథలో - వాళ్లు కుశలవుల్లా, నకుల సహదేవుల్లా జంటగానే వినిపిస్తున్నారు.


అప్పటికి అర్థమయింది నాకు - కవన్‌, భవన్‌ - ముక్త కథలో ఎలా చోటు సంపాదించారో!

శివశంకర్‌నుంచి తప్పించుకుందుకు ఆమె వాళ్లని ఆకట్టుకుని ఉంచింది.


‘‘ఈ బాకీ వ్యవహారంలో ఇతరుల జోక్యానికి శివశంకర్‌ ఒప్పుకుంటాడా?’’ అన్నాను.


‘‘ఇతరుల జోక్యం గురించి ఆయన ఏ షరతూ పెట్టలేదు. నాకున్న ఎస్కేప్‌ రూట్లలో ఏ ఒక్కటీ ఆయన మూసెయ్యలేదు. అందుకే ‘తెలివి’గా అని మీరంటే నాకు ఏదోలా అనిపించింది’’ అందామె.


నిజమే - నేనే పొరబడ్డాను. శివశంకర్‌ ఆమెకి తప్పించుకునే మార్గం చూపించాడు. ఐతే....

ముక్త అసామాన్య సౌందర్యవతి అనడంలో అనుమానం లేదు.


ఆమెని సినిమాల్లో పరిచయం చెయ్యడానికి కోట్లు వెచ్చించేవారుండొచ్చు. కానీ ఇల్లాలిగా చేసుకుందుకు లక్షలు ఖర్చు చేసేవారుంటారా?


అది అనుమానం అనడానికి లేదు. నాకూ ఉంది ఆమెను దక్కించుకోవాలని.


అదంత అసాధ్యం కాదని - ఇప్పుడు తెలిసింది. మరి నేను ఆమెకోసం లక్షలు వెచ్చించగలనా - అని నన్ను నేను అంచనా వేసుకుంటున్నాను.


‘‘నాకు తెలిసి కవన్‌, భవన్‌లు మామూలు మధ్యతరగతివాళ్లు. పెళ్లికోసం అంత డబ్బు ఖర్చు చెయ్యగలరా?’’ అన్నాను.


‘‘ఆదే నాకూ ఆశ్చర్యంగా ఉంది. కానీ వాళ్లు అనేదేమిటంటే.....’’ అంది ముక్త.


తొలిచూపులోనే వాళ్లకి ఆమెపై ప్రేమ పుట్టింది. ఆమెను పెళ్లాడ్డానికి ఏమైనా చెయ్యాలనుకున్నారు. కానీ అప్పటికే ఆమెకి పెళ్లి కుదిరిందని తెలిసింది.


ఆమెను పెళ్లాడబోయే శివశంకర్‌ వివరాలు తెలియగానే - వాళ్లు తట్టుకోలేకపోయారు. ముక్తకి ఏదో అన్యాయం జరిగిపోతోందన్న అనుమానం వాళ్లకి కలిగింది. ఆ బాకీ నేను తీరుస్తానంటే నేను తీరుస్తానని ఇద్దరూ పోటీ పడుతున్నారు.


ముక్త చెబుతుంటే - ‘ఒక ఆడపిల్ల అపూర్వ సౌందర్యం - మగాణ్ణి ఎంత పిచ్చివాణ్ణి చేస్తుంది?’ అనిపించింది.


‘‘అది పిచ్చి కాదు, స్వార్థం. అంత గొప్ప అందాన్ని తనే స్వంతం చేసుకోవాలన్న అత్యాశ. ఆ ప్రయత్నంలో కవన్‌, భవన్‌ తమ స్థితిగతులు మర్చిపోతున్నారు. పెంచి పెద్ద చేసిన కన్నవారిపట్ల తమకున్న బాధ్యత మర్చిపోతున్నారు’’ అంది నా మనసు.


కవన్‌కీ, భవన్‌కీ కన్నవారిపట్ల ఉన్న బాధ్యతలేమిటో నాకు తెలియదు. కానీ ముక్తకోసం అన్ని లక్షలు నేను వెచ్చించలేనన్న అనుమానం - వాళ్లని ఎలాగో అలా తక్కువ చెయ్యమని మనసుని వేధిస్తోంది.


నా మసను చెప్పిన మాట ముక్తకి చెప్పాను.


‘‘వాళ్లలో నాకు స్వార్థం కనిపించలేదు. వాళ్ల ప్రవర్తనలో ప్రేమకి అర్థం గోచరిస్తోంది’’ అంది ముక్త.


‘‘మీకోసం ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఒకరినొకరు ద్వేషిస్తున్నారు. అది మీకు ప్రేమలా అనిపించిందా?’’ అన్నాను.


‘‘వాళ్లు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారన్న మాట నిజం. ఒకరినొకరు ద్వేషిస్తున్నారని మీరెందుకు అనుకున్నారు?’’ అంది ముక్త.


వాళ్లు నాకు పోటీదార్లు. వాళ్ల గురించి నాకలాగే అనిపిస్తుంది. ముక్త కూడా వాళ్ల గురించి అలాగే అనుకోవాలనిపిస్తుంది.


చూస్తే ఆమెకు వాళ్లపై సదభిప్రాయమున్నట్లుంది. ఎలాగో అది పోగొట్టాలి.


‘‘స్వార్థంతో అలాంటి ఆలోచన చెయ్యడం తప్పు కదూ!’’ అంది మనసు.


‘‘ఇందులో స్వార్థమేముంది? నాది పరోపకార దృష్టి. పద్మ, స్వరలకు ఉపకారం చేయాలని - నేను కవన్‌, భవన్‌లని ముక్తకు దూరం చెయ్యాలనుకుంటున్నాను’’ అని మనసుకి సద్ది చెప్పాను.


‘‘ఓహో, అలాగా?’’ అంది మనసు కొంచెం వ్యంగ్యంగా.


నేను లెక్క చెయ్యలేదు, ‘‘వాళ్లు పరస్పరం ద్వేషించుకోవడం లేదని మీరెలా చెప్పగలరు?’’ అన్నాను.


ఆమె తడుముకోలేదు, ‘‘నేనే చెప్పగలను’’ అంది దృఢంగా.

ఆమె చెప్పింది వింటుంటే ఛెళ్లుమంది నాకు.


వాళ్లామెని ప్రేమించిన మాట నిజం. పెళ్లి చేసుకోవాలని అనుకున్నదీ నిజం. కానీ ఒకసారి శివశంకర్‌ గురించి తెలిసేక వాళ్ల ఆలోచనలు మారాయి.


అప్పుడు శివశంకర్‌ బారినుంచి ఆమెని తప్పించడమే వారి ధ్యేయమైంది.

తమ ఇద్దరిలో ఆమె ఎవర్ని ఇష్టపడ్డా వారికి అభ్యంతరం లేదు. ఆమె కవన్‌ని కనుక ఇష్టపడితే - భవన్‌ పోటీనుంచి తప్పుకుంటాడు. అవసరపడితే భవన్‌కి కొంత ధనసాయం కూడా చేస్తాడు. భవన్‌ విషయంలో కవన్‌ కూడా అలాగే అనుకుంటున్నాడు.


శివశంకర్‌ని పెళ్లి చేసుకోవాల్సిన అసహాయతనుంచి ఆమెని కాపాడ్డం వారి ధ్యేయం.

‘‘వాళ్ల కారణంగా నాకు ప్రేమంటే గౌరవం పుట్టడమే కాదు. పెరిగింది కూడా’’ అంది ముక్త.

ఛెళ్లుమనదూ నాకు!


నాకు ప్రేమంటే నమ్మకం లేదు, గౌరవం లేదు. తోడుగా ఓ మనిషిని తెచ్చుకుని బ్రతికినన్నాళ్లు కలిసి జీవిస్తూ కష్టసుఖాలు పంచుకోవడాన్ని ప్రేమ అనుకుంటున్నాను.

ఏమాత్రం పరిచయం లేని అమ్మాయికి సాయపడ్డంలో పోటీ పడుతూ - స్వార్థంకంటే ఆమె ఇష్టానికే ప్రాధాన్యమిచ్చారు కవన్‌, భవన్‌.


అలా పోటీ పడ్డం ప్రేమకే సాధ్యమా!

అది అందాన్ని చూసిన వ్యామోహం కావచ్చు. కానీ అందంమీద వ్యామోహం కాదు.

రెండూ ఒకటే అనిపించొచ్చు. కానీ కాదు.

ఆలోచిస్తున్నాను.

ప్రేమ!


అది ఉందో లేదో తెలియని అనుభూతి కాదు. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఓ అద్భుతశక్తి!

నాకు ముక్త అందంమీద మోహం కలిగింది. కానీ ఆమెను ప్రేమించగలనా? భవన్‌, కవన్‌ల ప్రేమతో నేను పోటీ పడగలనా?


‘‘ఇంతకీ కవన్‌కీ, భవన్‌కీ మీరేం చెప్పారు?’’ అడిగాను.


‘‘మీ ప్రేమని మీరు ఋజువు చేసుకోవాలనుకుంటున్నారు. కానీ నేను నా ప్రేమని ఋజువు చేసుకోవద్దా, అన్నాను వాళ్లతో’’ అంది ముక్త.


‘‘మీ ప్రేమని ఋజువు చేసుకోవడమా - ఎవరికి?’’ అన్నాను.


ముక్త తడుముకోలేదు. ‘‘శివశంకర్‌కి’’ అంది.


ఆమె చెబుతుంటే - ప్రేమకి ఇన్ని కోణాలుంటాయా అనిపించింది.


శివశంకర్‌ ఆమె తల్లికి వైద్యం చేయించాడు. ప్రతిఫలంగా ముక్తని తనకిచ్చి పెళ్లి చేయాలన్నాడు. ఐతే ముక్త మనస్ఫూర్తిగా తనని ప్రేమిస్త్తేనే ఆ పెళ్లి జరుగుతుందన్నాడు. మూడేళ్లు గడువిచ్చి - ఆలోగా తన బాకీ తీర్చేస్తే - ఆమె గురించి మర్చిపోగలనని కూడా అన్నాడు. ఆ బాకీ తీర్చడానికి వేరెవరైనా ఆమెకి సాయపడినా తనకి అభ్యంతరం లేదు.


‘‘మూడేళ్లలో ఆయన బాకీ తీర్చేస్తే - దానర్థమేమిటి? నేనాయన్ని మనస్ఫూర్తిగా ప్రేమించలేదనేగా? నా తల్లి ప్రాణాల్ని నిలబెట్టిన మహానుభావుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోతే - నన్ను మించిన స్వార్థపరులు ఉంటారా?’’ అంది ముక్త.


ఆశ్చర్యంగా అనిపించింది.

కుట్రలు, మోసాలు, దగా....


ఇదీ ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం.

ఈ ప్రపంచంలో ఇంత మంచితనం, ఇంత నిస్వార్థం, ఇంత ప్రేమ ఉందా?

శివశంకర్‌లో ఉదాత్తత. కవన్‌, భనవ్‌లలో ఉదాత్తత. ముక్తలో ఉదాత్తత.


నేను ముక్త దగ్గరికి రావడానికి కారణమైన పద్మ, కిషోర్‌, స్వరలలో ఉదాత్తత.

ఈ ఔదాత్యమంతా ప్రేమ చుట్టూ తిరుగుతోంది. ఇలాంటి మనుషుల మధ్య నాకెక్కడుంది స్థానం?


నేను ముక్తకి చేతులు జోడించి, ‘‘ఏదో అనుకుని ఇక్కడికొచ్చాను. మీవంటి ఉదాత్తవ్యక్తిని చూసేక, నాలో నాకు అల్పత్వం గోచరిస్తోంది. సెలవు’’ అని లేవబోయాను.

‘‘అదేమిటి - చెప్పాల్సింది చెప్పేసి, నేను చెప్పేది వినకుండానే వెళ్లిపోతానంటున్నారు?’’ అందామె.


నేను కూర్చోలేదు. ‘‘వచ్చిన పని ఐపోయింది. అందుకని....’’ నసిగాను.

‘‘అరే కూర్చోండి - మీతో ఇంకా నేను మాట్లాడాల్సిందుంది’’ అంది ముక్త.

‘నా మాటే శాసనం’ అన్నట్లు గంభీరంగా ఉందా గొంతు.


ఆమె దివ్యసమక్షభాగ్యానికి దూరమౌతున్నానన్న అసంతృప్తికి - ఆ శాసనం గొప్ప వరమైంది. చటుక్కున కూర్చుని ప్రశ్నార్థకంగా ఆమెని చూశాను.

‘‘ఏదో ఔదాత్యం అంటున్నారు. అది నాలో మీకెక్కడ కనిపించింది?’’ అందామె చిరునవ్వుతో.


‘‘ఈ ప్రపంచంలో ప్రేమంటూ ఉంటే దానికి మారు రూపం అమ్మ. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే - ముందుగా వెనక్కి నెట్టేయడమో, మర్చిపోవడం కూడా అమ్మ ప్రేమనే! మరి మీరు కేవలం అమ్మ ప్రేమకు విలువనిచ్చి, మీ భావి జీవితానికి మార్గనిర్దేశం చేస్తున్నారు. అది ప్రేమ కావచ్చు. నాకు మాత్రం మీలో ఔదాత్యపు విశ్వరూపం కనిపించింది’’ అన్నాను.


ఆమె మందహాసం చేసింది.

కురుక్ష్షేత్ర రణరంగంలో అర్జునుణ్ణి సమ్మోహితుణ్ణి చెయ్యడానికి శ్రీకృష్ణుడిలాగే నవ్వి ఉంటాడనిపించింది.


ఆమెను శ్రీకృష్ణుడిలా ఫీలయ్యానో లేదో - ఆమె నోట వేదాంతం వినబడ్డం మొదలైంది.

ఆమె చెబుతోంది....

మన చుట్టూ ఉన్న ఈ సృష్టి ఒక మాయాజాలం. మన చుట్టూఉన్న మనుషులపై మనం పెంచుకునే మమతానురాగ బంధాలొక ప్రేమజాలం.


మంచితనం మంచి కాదు. దుర్మార్గం దుర్మార్గం కాదు. నమ్మకం నమ్మకం కాదు. ద్రోహం ద్రోహం కాదు.

అంతా భ్రమ!


‘‘ఆ భ్రమలోంచి బయటపడితే - నేను అమ్మని అంతలా ప్రేమిస్తున్నాననుకోను. శివశంకర్‌పై చెప్పలేనంత కృతజ్ఞత నింపుకున్నా ననుకోను. నాది అసహాయత. విరక్తి. అంతే!’’ అంది.

మర్యాదకి ఆమె అలా అందనుకున్నాను.


‘‘గొప్పవాళ్లెప్పుడూ తమ గొప్పతనాన్ని ఒప్పుకోరు - అనేది మా బామ్మ. అది నిజమని మరోసారి నిరూపించారు’’ అన్నాను.


‘‘నేను ప్రేమించిన వ్యక్తి నాకు దక్కడని తెలిసినప్పుడు - పెళ్లి ఎవరితోనైతేనేం అని నేననుకుంటే - అది గొప్పతనమౌతుందా? ఔదాత్యం అనిపించుకుంటుందా? నాకైతే అది పూర్తి నిస్సహాయత. అందువల్ల కలిగిన విరక్తి’’ అంది ముక్త.


మామూలుగా విని ఏదో అనబోయి ఆగాను. ఆమె మాటల భావం ఆకళింపుకి రాగానే, ‘‘ఏమన్నారూ?’’ అన్నాను.

అన్నాను కానీ - నాకు అర్థమైపోయింది.


ముక్త వేరెవర్నో ప్రేమించింది. అది మామూలు ప్రేమ కాదు. చాలా ఘాటైన ప్రేమ.

దురదృష్టం - ఆ ప్రేమ సఫలమైనట్లు లేదు.

ఆమెని చూస్తే దీర్ఘాలోచనలో ఉన్నట్లు అనిపించింది.


నా మాట విందో లేదోనని, మరోసారి ‘‘ఏమన్నారూ?’’ అన్నాను.

‘‘నేను ఒకతన్ని ప్రేమించాను’’ అని నిట్టూర్చిందామె.


నా ఊహ నిజమే. శివశంకర్‌తో పెళ్లి ప్రపోజల్‌కి ముందే ఆమె ఇంకెవర్నో ప్రేమించింది.

ఆ ప్రేమ సఫలం కాలేదని తెలిసినా, ‘‘ఎవరా అదృష్టవంతుడు?’’ అన్నాను లౌక్యంగా.

‘‘అతడు అదృష్టవంతుడో కాదో నాకు తెలియదు. నన్ను మాత్రం దురదృష్టవంతురాల్ని చేశాడు’’ అందామె.

‘‘అర్థం కాలేదు’’ అన్నాను.


‘‘తొలిచూపులోనే ప్రేమించాను. మనసారా ఇష్టపడ్డాను. మలిచూపులో నా హృదయాన్ని అతడిముందు పరిచాను. తిరస్కరించి వెళ్లిపోయాడు. మళ్లీ కనిపించలేదు’’ నిట్టూర్చిందామె.


ముక్తది అద్భుత సౌందర్యమే కాదు. అపురూపమైన వ్యక్తిత్వం.

అలాంటి ఆమెని తిరస్కరించి వెళ్లిపోయాడంటే - అతడు అదృష్టవంతుడు కాదు. దౌర్భాగ్యుడు.


‘‘ఎవరతడు?’’ అన్నాను.

‘‘అతనెవరో, ఏంచేస్తుంటాడో తెలియదు. ఎక్కడుంటాడో కూడా తెలియదు’’ అందామె.


ఎవరో తెలియకుండా, ఎక్కడుంటాడో, ఏంచేస్తుంటాడో తెలియకుండా - అతడినామె ఎలా ప్రేమించింది?

ప్రేమంటే అంతేనా?


‘‘అలా ఎలా సాధ్యం?’’ అన్నాను.

‘‘ప్రేమకి అలాలూ, ఎలాలూ, అసాధ్యాలూ ఉండవు’’ అందామె.


ఆమె నన్ను ఎన్నాళ్లనుంచో ఎరిగున్నట్లు మాట్లాడుతోంది. నాకు కూడా కొత్తగా, ఇబ్బందిగా అనిపించడం లేదు.

బహుశా కిషోర్‌తో కూడా ఇంత సన్నిహితంగా మాట్లాడలేనేమో!

ఇంతవరకూ నన్ను కలిసినవారందరూ ప్రేమ ఔన్నత్యాన్ని ప్రశంసించారు. ఇప్పుడు ముక్త కూడా అదే పని చేస్తోంది.

ఈ ప్రపంచంలో ప్రేమని నిరసించే యువకుణ్ణి నేనేనా?


‘ప్రేమకి అసాధ్యాలెందుకుండవు?’’ అని అడుగుదామనుకుని ఆగిపోయాను.

నేనడగాల్సిన పనిలేదు. ఆమె తనకి తానుగా చెప్పే మూడ్‌లో ఉంది.

ఆమె తన ప్రేమకథ చెబుతోంది. నేను వింటున్నాను.

అతడెవరో ఆమెకి తెలియదు.


అనుకోకుండా ఓ సూపర్‌ మార్కెట్లో కలిశాడు. అనుకోకుండా తనే స్వయంగా ఆమెని పలకరించాడు.

అతణ్ణి చూసీ చూడగానే ఆమె మనసులో ఏదో చలనం, సంచలనం.

అతడామెకి లేత పసుపు రంగు కుర్తీ-చుడీదార్‌ కానుకగా ఇచ్చాడు. ఆ మాత్రానికే అతడు ఆమె మనసంతా నిండిపోయాడు.


అతడితో కాసేపు మాట్లాడాలనుకుంది. అవకాశమివ్వలేదు.

అతడి వివరాలు తెలుసుకోవాలనుకుంది. చెప్పలేదు.

కానుకనివ్వడంతో తన డ్యూటీ ఐపోయినట్లు - మరి మాట్లాడకుండా వెళ్లిపోయాడు.

మళ్లీ తనంత తానే కలవడా అనుకుంది. కలవలేదు.


అతణ్ణి మళ్లీ మళ్లీ చూడాలని తహతహలాడిపోయింది.

అతణ్ణి వెతుక్కుంటూ - పార్కులు, సినిమా హాళ్లకి తిరిగింది.

అతడు చూడాలని, అతడు కానుకగా ఇచ్చిన డ్రస్సు వేసుకుని, బయటకి వెళ్లేది.

అతడు కనబడేదాకా ఆ డ్రస్సుని మార్చకూడదని నిర్ణయించుకుంది.


ఆమె ప్రయత్నాలు ఫలించి ఒకరోజు అతడామెకు కనిపించాడు.

అతడామెని చూసి కూడా చూడనట్లే ఉన్నాడు. తనే వెళ్లి పలకరిస్తే తానెవరో తెలియదన్నాడు. గుర్తు చెయ్యబోతే ఈసడించి వెళ్లిపోయాడు.

మళ్లీ కనిపించలేదు.


కనిపిస్తాడన్న ఆశ కూడా లేదు.

ఆమె గుండె బద్దలయింది.

‘అతడు లేని జీవితం వృథా. చచ్చిపో’ అంది మనసు.


ఆమెకి చచ్చిపోవాలనుంది. కానీ ఈలోగా అతడు మళ్లీ కనిపిస్తాడనే ఆశ! ఐనా చావడానికి మార్గాలు వెదుకుతోందామె. అలాంటి సందర్భంలో-

అనుకోకుండా ఓ రోజు ఉదయం - టివిలో - రామాయణంలో సుందరకాండ విశిష్టత గురించిన ప్రవచనం ఆమె చెవుల బడింది.


‘‘నేటి యువత నిరాశానిస్పృహలనుంచి బయటపడ్టానికి మార్గం తెలియక - ప్రాణాలు తీసుకోవాలనుకునే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటివారు రామాయణంలో సుందరకాండని చదివి తీరాలి’’ అన్నాడు ప్రవచనకారుడు.


‘ఇదేదో నాకే సందేశంలా ఉందే’ అనుకుంటూ ఆమె కాస్త శ్రద్ధగానే ఆ వ్యాఖ్యానం వింది.

సుందరకాండలో ప్రధానపాత్ర హనుమంతుడిది.

ఆయన సముద్రాన్ని దాటడానికి నూరు యోజనాలు లంఘించాడు. ఆ దారిలో మైనాకుణ్ణి అధిగమించాడు. సురసని మెప్పించాడు. సింహికను సంహరించాడు. లంకిణిని ఒప్పించాడు.


ఇన్ని చేసి లంకానగరం చేరుకున్నాక - అక్కడ ఎంత వెదికినా సీత కానరాలేదు.

అప్పుడంతటి మహానుభావుడూ నిరాశా నిస్పృహలకు లోనయ్యాడు.

ఎంతలా అంటే, ‘వానప్రస్థుడిగా ఉండిపోతాననీ, ఉపవాస దీక్షను స్వీకరించి ప్రాయోపవేశం చేస్తాననీ’ పరిపరి విధాల వాపోయేటంత!


ఆత్మహత్య మహాపాతకం అని మనసు మందలిస్తే, ‘ఆత్మహత్య అని ఎందుకనుకోవాలి? దానికి నిర్యాణమని పేరు పెడితే - మహర్షులు కూడా గౌరవిస్తారు’ అని సద్ది చెప్పాడు.

ఐతే హనుమంతుడు వివేకవంతుడు. వివేకమున్నవాడు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోడు.


వివేకం పని చెయ్యగానే ఆయనకు స్ఫురించింది -

‘వినాశే బహవో దోషా జీవన్‌ భద్రాణి పశ్యతి!

తస్మాత్‌ ప్రాణాన్‌ ధరిష్యామి ధృవో జీవిత సంగమః!’


అంటే ‘నశించడం వల్ల నష్టాలు ఎక్కువ. బతికుంటేనే ఎప్పటికైనా శుభాలు చూసే అవకాశముంటుంది. ప్రాణాలనేవి పోవాలి తప్ప వాటిని బలవంతాన విడిచిపెట్టకూడదు. మేలు జరుగుతుందని నమ్మి ఎదురు చూస్తే - తప్పక అదే జరుగుతుంది’


ఆ తర్వాత హనుమంతుడు సీతని చూశాడు. లంకని దహించాడు. రామరావణ యుద్ధానికి కారణభూతుడయ్యాడు. సీతారాములు మళ్లీ కలిశారు.

రామాయణం సుఖాంతమైంది.


హనుమంతుడు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటే - రామాయణంలో ఇన్ని మహా ఘట్టాలు లేకుండా పోయేవి. ఒకవేళ అవి జరిగినా - హనుమంతుడికి వాటిని చూసే ఆదృష్టం లేకుండా పోయేది.


ప్రవచనకారుడు ఈ విషయం చెప్పి, ‘డిప్రెషన్‌ నుంచి తప్పించుకోవడానికి, అలనాడు వాల్మీకి హనుమంతుడి పాత్ర ద్వారా మనకు చెప్పిన గొప్ప పాఠమిది. నేడు గజిబిజికి గురౌతున్న యువతరానికి సంబంధించిన ఎన్నో సమస్యలకి రామాయణంలో సుందరకాండలో పరిష్కారాలూ, మార్గదర్శకాలూ ఉన్నాయి’ అన్నాడు.


ఇది చెప్పేక ముక్త ఓ క్షణమాగి నాతో ఇలా అంది:

‘‘ఆ మాటలు నామీద గొప్ప ప్రభావం చూపాయి. ఏమో, సీతారాములకి లాగే - నేనూ, ఆ అపరిచితుడూ మళ్లీ కలుసుకుంటామేమో! మా కథ సుఖాంతమౌతుందేమో! ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటే - ఆ శుభదినాలకి అవకాశముండదుగా - అనుకున్నాను’’


అబ్బురంగా ఆమెని చూశాను.

వయసులో నాకంటే చిన్నది. అబల.

ఆమెలో ఎంత పరిణతి!


‘‘అలాంటప్పుడు శివశంకర్‌తో పెళ్లికి ఎందుకొప్పుకున్నారు? ఆయనతో మీ పెళ్లి జరిగితే - మీరనుకున్న శుభదినాలిక రానట్లేగా?’’ అన్నాను.

ముక్త నవ్వి, ‘‘అలా ఎందుకనుకోవాలి?’’ అంది.

ఆమె చెబుతున్నది ఆశ్చర్యంగా వింటున్నాను.

ఆ రోజునుంచీ ఆమె రామాయణంలో సుందరకాండని ప్రత్యేక శ్రద్ధతో చదవడం మొదలెట్టింది.


హనుమంతుడు ఒక అసాధారణ వ్యక్తి.

ఆయన అందరికంటే గొప్పవాడు. ఆ మాట తాననడు. ఇతరులంటారు.


అడగనిదే చేతనైన కార్యానికి కూడా పూనుకోడు. అడిగేక సాధించేదాకా వదలడు.

పదవులాశించకుండా సేవాధర్మాన్ని పాటిస్తాడు. వైభవాలకు దూరంగా సామాన్య జీవితం గడుపుతాడు.


ఆయన నమ్ముకున్నవి నాలుగే నాలుగు లక్షణాలు: ధైర్యం, ముందు చూపు, వివేకం, ప్రతిభ.


‘‘నేను కూడా ఆ నాలుగు లక్షణాలనీ అలవర్చుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఓ అపరిచితుడిపై నాకు చెప్పలేనంత ప్రేమ పుట్టింది. అందుకు ఏదో గొప్ప కారణముండి ఉండాలి. ఉంటే ఎన్ని అడ్డంకులొచ్చినా ఆ ప్రేమ ఫలిస్తుంది. లేకుంటే - జీవన సహచర్యానికి నాకు శివశంకర్‌ ఐతేనేం, కవన్‌ ఐతేనేం, భవన్‌ ఐతేనేం, ఇంకెవరైతేనేం?’’ అందామె.


ఇంకెవరైతేనేం - అని కూడా అంది కాబట్టి - నాకూ అవకాశం లేకపోలేదు.

స్వరకిలా కోన్‌కిస్కాగాడని అనలేదు కాబట్టి - ఆ అవకాశానికి నేను చిన్నబుచ్చుకోనక్కర్లేదు కూడా.


రాసిపెట్టి ఉంటే ఆమెకూ నాకూ కూడా పెళ్లి జరగొచ్చు.

‘‘ఐతే మీరు ఆ ముగ్గురిలో ఎవర్ని ఎంచుకున్నారు?’’ అన్నాను కుతూహలంగా.


‘‘నేను ఎవర్నయినా ఎంచుకుంటే - అది నాప్రేమకి అవమానం. అతడు, నేను కలుసుకుంటామన్న నమ్మకం నాలో బలంగా ఉంది’’ అందామె.

‘‘అలాగని మిమ్మల్ని మీరు నమ్మించుకుంటున్నారు’’ అన్నాను.


‘‘పోనీ, అలాగే అనుకోండి. నేను మాత్రం ఓ నిర్ణయం తీసుకున్నాను. మూడేళ్లవరకూ నేను శివశంకర్‌ బాకీ తీర్చను’’ అందామె.

‘‘ఏమన్నారూ?’’ అనబోయి ఆగిపోయాను.


బాప్‌రే - వాటే డెసిషన్‌!

తీర్చగలిగీ శివశంకర్‌ బాకీ తీర్చకూడదనుకుంటే - ఆమె ఆయన్ని పెళ్లి చేసుకుందుకు సిద్ధపడినట్లే!


అంటే - కవన్‌, భవన్‌లకి ఆమెని పెళ్లాడే అవకాశమే లేదు.

చటుక్కున లేచి నిలబడి, ‘‘మీ వ్యక్తిత్వానికి జోహారు. ఇక సెలవు తీసుకుంటాను’’ అన్నాను.


‘‘అదేమిటి, అలాగనేశారు. నేను చెప్పాల్సిందింకా ఐపోలేదే...’’ అందామె.

‘‘నేనిక్కడికొచ్చింది కవన్‌, భవన్‌ల గురించి. ఆ మేరకు నేనొచ్చిన పని ఐపోయింది’’ అన్నాను.


‘‘మీరొచ్చిన పనికి సహకరించడానికే, నేను మీకు ఇంత సమయం కేటాయించాననుకున్నారా?’’ అందామె.


ఆమె ప్రశ్న నాలో ఎన్నో సందేహాలకి తెర తీసింది.

ఏమనాలో తెలియక, ‘‘ఊఁ’’ అన్నాను.


‘‘మీరు పొరపడ్డారు. కూర్చోండి. అసలు విషయం చెబుతాను’’ అంది ముక్త.

అన్ని విషయాలూ చెప్పేక ఇంకా అసలు విషయమేముంటుంది?

అదే మాటన్నాను - ఇంకా నిలబడే...


‘‘చెబుతాను. ముందు మీరు కూర్చోండి’’ అంది ముక్త.

కూర్చున్నాను. ‘చెప్పండి’ ఆన్నట్లు చూశాను.


‘‘నేను నా ప్రేమని నమ్మాను. అది చాలా ఘాటైనది. నేను ప్రేమించిన వ్యక్తి ఎంత దూరంలో ఉన్నా - నన్ను తెలుసుకుని నా దగ్గరకు వస్తాడనడంలో నాకు సందేహం లేదు. అతడొస్తే - శివశంకర్‌, కవన్‌, భవన్‌ ఎవరైనా పక్కకు తప్పుకోవలసిందే! అతడొస్తాడన్న ధైర్యంతోనే - శివశంకర్‌ నాకిచ్చిన మూడేళ్ల గడువునీ ఉపయోగించుకుంటున్నాను’’ అంది.


ఆమె నమ్మకం నాకు కలిగించిన ఆశ్చర్యమింతా అంతా కాదు.

ఎప్పుడో ఒకసారి ఓ సూపర్‌ మార్కెట్లో కనబడి, ఓ కానుకిచ్చి - ఆ తర్వాత మరొక్కసారి కనబడి - నువ్వెవరో నాకు తెలియదని వెళ్లిపోయాడతడు.

ఊరు తెలియదు. పేరు తెలియదు.


ఆమె ప్రేమ ఎంత ఘాటైనదైనా - అతడికి సోకి ఆమెవద్దకు రప్పించగలదా?

‘‘అసాధ్యం’’ అనుకున్నాను.


‘‘ఈ విషయం - కవన్‌కీ, భవన్‌కీ కూడా చెప్పారా?’’ అన్నాను.

‘‘నా ప్రేమకథ - వాళ్లు ముగ్గురికీ తెలియదు. మా ఇంట్లోవాళ్లకి కూడా తెలియదు. నాకు తెలుసు. మీకు తెలుసు. బహుశా అతడికి తెలిసుండొచ్చు’’


చిత్రంగా ఉంది. తనకి తప్ప ఇతరులెవరికీ తెలియని తన ప్రేమకథని - అయినవాళ్ల దగ్గర కూడా దాచిపెట్టిన ఆ ప్రేమకథని - అపరిచితుడినైన నాకెందుకు వినిపించినట్లు?

నాలోని ఆ ప్రత్యేకత ఏమిటి?

ఇంకా ఉంది...

వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

వసుంధర పరిచయం: మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.




42 views0 comments

Comments


bottom of page