top of page

ప్రేమ ‘భ్రమ’రం - 10

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Youtube Video link

'Prema Bhramaram - 10' New Telugu Web Series


Written By Vasundhara


రచన: వసుంధరవసుంధర గారి ప్రేమ ‘భ్రమ’రం ధారావాహిక పదవ భాగం


కథ చదివి వినిపిస్తున్న వారు: కే. లక్ష్మి శైలజ


గత ఎపిసోడ్ లో...

శివ శంకర్ బాకీ తీర్చడానికి, కవన్‌, భవన్‌లు ఇద్దరూ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతుంది ముక్త. తాను వేరెవర్నో ప్రేమించినట్లు కూడా ఆమె చెప్పడంతో ఆశ్చర్య పోయాను నేను.

తన ప్రేమ కథను నాకు వివరిస్తుంది ముక్త.


ఇక ప్రేమ ‘భ్రమ’రం పదవ భాగం వినండి ...నాలోని ప్రత్యేకత ఏమిటని ఆమెనడగలేదు- ‘‘ఈ విషయం కనీసం కవన్‌కీ, భవన్‌కీ చెప్పాల్సింది. ఇద్దరూ రంగంలోంచి తప్పుకునేవారు’’ అన్నాను.


‘‘ఆ తప్పు చెయ్యడం నాకిష్టం లేదు’’ అందామె.


అందులోని తప్పేమిటో - ఆమె వివరించింది.

శివశంకర్‌ ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు.

అతడు ఉత్తముడే కావచ్చు. కానీ ఇంచుమించు కూతురి వయసే ఉన్న ముక్తని పెళ్లి చేసుకోవడం వల్ల - అతడికి సామాజికంగా, సాంసారికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదురౌతాయి.


ఐనా అందుకు సిద్ధపడ్డాడంటే - ఈ విషయంలో పట్టుదలగా ఉన్నాడనుకోవాలి.

మూడేళ్లు ఎదురు చూసేక - ఈలోగా ప్రియుడు ముక్తని వెతుక్కుంటూ వస్తే, ముక్త అతణ్ణి పెళ్లి చేసుకుంటే - ఆయన తట్టుకోగలడా?


‘‘కవన్‌, భవన్‌లని ముందునుంచీ ఆయనకి త్రెట్‌గా ఉంచుతున్నాను’’ అందామె.

తనని కాదని, వాళ్లలో ఒకర్ని ఆమె పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉందని ముందునుంచీ తెలిస్తే - చివర్లో ఆయనకి షాకుండదు.


కవన్‌, భవన్‌ల విషయానికొస్తే - వాళ్లిద్దరికీ పరస్పరం త్రెట్‌ ఉంది. ఆపైన శివశంకర్‌ త్రెట్‌ ఉండనే ఉంది.


‘‘ముందునుంచీ ప్రిపేరయుంటే - ఎంతటి ఫెయిల్యూరైనా - చప్పగానే ఉంటుంది తప్ప షాకివ్వదు’’ అంది ముక్త.


అబ్బ - ఎంత లోతుగా ఆలోచించింది! కానీ ఆ ఆలోచనలకి పునాది - తన ప్రేమ ఘాటుతనంపై ఆమెకున్న నమ్మకం.


నమ్మకం గొప్పదే - కానీ పునాదిగా తీసుకుంటే అది అత్యంత బలహీనమైనది.

‘‘ఇతరుల గురించి ఇంత లోతుగా ఆలోచించే మీ ఔన్నత్యానికి నా జోహార్లు. కానీ మీ ఆలోచనల పునాది - చాలా బలహీనం. అది గ్రహించేరా?’’ అన్నాను.


ఆప్పుడామె ఆదోలా నవ్వింది.

ఆ నవ్వులో తనమీద నమ్మకముంది. నా అమాయకత్వంమీద జాలి ఉంది.

‘‘నిజానికిదో అసహాయస్థితి. ఈ పరిస్థితిలో మీకు నవ్వెలా వస్తోంది?’’ అన్నాను.

అప్పుడామె తన పరిస్థితిని కురుక్షేత్ర సంగ్రామారంభంతో పోల్చింది.


అర్జునుడు కృష్ణుడి ముందు మోకరిల్లి, ‘‘బావా! రాజ్యకాంక్షతో ఇంతమంది బంధుమిత్రులతో తలపడ్డం ఒప్పవుతుందా? దైవాధీనాలైన జయాపజయాలకోసం - ఒకరినొకరు చంపడానికి సిద్ధపడే యుద్ధం చెయ్యడానికి నా మనసొప్పుకోవడం లేదు’’ అన్నాడు.


అప్పుడు కృష్ణుడు మందహాసం చేసి ఆర్జునుడికి గీతాబోధ చేశాడు.

అదే పరిస్థితి రివర్సులో జరిగితే....


అంటే - యుద్ధానికి ముందు కృష్ణుడే అర్జునుడి భుజం తట్టి, ‘‘బావా! దైవాధీనాలైన జయాపజయాలకోసం - మనమింత భీకర యుద్ధానికి సన్నద్ధమవడం ఎంతవరకూ సబబు?’’ అని అడిగితే - ఆర్జునుడేం చేస్తాడు?

అడిగినవాడు సాక్షాత్తూ భగవంతుడు.


భూత భవిష్యద్వర్తమానాలు స్పష్టంగా తెలిసినవాడు. కర్తవ్యబోధ చేయవలసినవాడు. ఆయనే అలా అడిగితే, అర్జునుడేం చెయ్యగలడు - ఓ నవ్వు నవ్వి ఊరుకోవడం తప్ప!

‘‘అదీ నా నవ్వుకి కారణం’’ అంది ముక్త.


దిమ్మ తిరిగిపోయింది నాకు.

తను అర్జునుడా? నేను శ్రీకృష్ణుణ్ణా?


ఏమిటీ అర్థం లేని పోలిక?

ఏదో అందామనుకుని మాట రాక ఆగిపోయాను.


అప్పుడామె చెప్పింది, ‘‘నేనీ మాట అనాలోచితంగా అనలేదు. ఎందుకంటే - నేను ప్రేమించిన అపరిచితుడు మీకు సుపరిచితుడు. అతడి వివరాలకోసం నేను మీకు ఫోన్‌ చెయ్యాలనుకున్నాను. ఈలోగా మీరే ఫోన్‌ చేశారు. వెదకబోయిన తీగె కాలికి తగిలిందని మురిసిపోతూ - మీకోసం ఇంత సమయాన్ని కేటాయించాను’’


అప్పుడు నా ఆశ్చర్యానికి అంతు లేదు.

ఆమె ప్రియుడు నాకు సుపరిచితుడా? ఎవరతడు?


కవన్‌ కాదు, భవన్‌ కాదు.

కిషోర్‌ కావచ్చా? లేక ఆఫీసులో నా కొలీగ్‌ శ్రీను!?

కిషోర్‌, శ్రీనులు ఐతే వాళ్లు నాకు ఎంతో కొంత ముక్త గురించి చెప్పి ఉండేవారు...

ఒకవేళ - ఆ ప్రియుణ్ణి నేనే కాదు కదా!


ఎంత ఆలోచించినా - గతంలో నేనీమెను పొరపాటున కూడా కలుసుకున్నట్లు కానీ, కానుకలిచ్చినట్లు కానీ గుర్తు రావడం లేదు.

‘‘ఎక్కడో మీరు పొరబడ్డారు....’’ అన్నాను.


‘‘ఈ ఫొటో మీ మొబైల్‌నుంచి నాకు ఫార్వర్డయింది. మీ మొబైల్‌ నంబరు పొరపాటా? ఈ ఫొటోయే పొరపాటా?’’ అంటూ ఆమె నా ముందుకు తన సెల్‌ఫోన్‌ తోసింది.


అందుకుని చూస్తే -

ఉలిక్కిపడ్డాను.


అది అమోఘ్‌, పురుష వేషంలో ఉన్న రిక్తలకు - మీనాక్షీ థియేటర్‌ దగ్గర నేను తీసిన ఫొటో.


ఫొటో నా మొబైల్లో ఉంది. ముక్త నంబరు నా దగ్గరుంది.

పొరపాటున వేలు తగిలి ఫొటో ముక్తకు ఫార్వర్డయినట్లుంది.


ఇలాంటివి నాకు అడపాతడపా జరుగుతుంటాయి. నాకే కాదు, చాలామందికి ఇది స్వానుభవం.


ఆ ఫొటోలో ముక్త ప్రియుడుండడం కాకతాళీయం.

తన ప్రియుణ్ణి కలిసే అవకాశాలు ఇంచుమించు లేవని ఆమె నిరాశ చెందిన తరుణంలో - నానుంచి ఆమెకి ప్రియుడి ఫొటో ఫార్వర్డయింది.


తన ప్రేమపై ఆమె పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు.

నా మొబైల్‌ నంబరు ఆమెకి చీకట్లో చిరుదివ్వె.


అప్పటికి నా సందేహాలు చాలావరకూ తీరిపోయాయి.

అమోఘ్‌తో ఉన్నది పురుష వేషంలోని రిక్త కాదు. ఎందుకో అమోఘ్‌ నాకు అబద్ధం చెప్పాడు.


ఆ వ్యక్తిని ముక్త ప్రేమించింది. ఆ ప్రేమని అతడే పుట్టించాడు.

ఆమెకు డ్రస్సు కానుకగా ఇచ్చి, ఆమె హృదయంలో స్థానం సంపాదించి - ఆ తర్వాత ఆమె తనకు తెలియనే తెలియదని - ఆతర్వాతనుంచి ఆమెకు తన పత్తా తెలియనివ్వని - అతగాడు ఎవరు? అతడి ఆంతర్యమేమిటి?


అతడు అమోఘ్‌తో సినిమాకి ఎందుకెళ్లాడు?

అమోఘ్‌ తనని పురుషవేషంలో ఉన్న రిక్తగా పరిచయం చేసినట్లు అతడికి తెలుసా?

ఏదిఏమైనా అతడో విచిత్రవ్యక్తి.

మరో చిత్రమేమిటంటే -


ముక్తవంటి అద్భుత సౌందర్యరాసి - తొలిచూపులోనే ప్రేమలో పడిపోయేటంత అద్భుతరూపం కాదతడిది.

చాలా సాధారణంగా ఉన్నాడు.


ముక్త అతణ్ణి ప్రేమించడం - ప్రేమ గుడ్డిదని మరోసారి నిరూపిస్తోంది.

ఎంత గుడ్డిదంటే - అతడి ఫొటో కనబడగానే - ముక్తకు ప్రాణం లేచివచ్చినట్లయింది.

ఆమె నాకు ఫోన్‌ చేసి మాట్లాడుకుందామనుకుంటున్న సమయంలో - నేనే ఆమెకి ఫోన్‌ చేశాను.


వాళ్లింట్లో ఆమె నాకు ఇచ్చిన ప్రాధాన్యానికీ, ఆతిథ్యానికీ, తన కథనీ ప్రేమకథనీ అంత వివరంగా చెప్పడానికీ అదీ కారణం.

‘‘అతడు మీకు తెలుసు. ఎక్కడుంటాడో తెలుసు. కదూ!’’ అందామె.


ఆ గొంతు నిండా ఆశ.

‘‘అతడు తెలియడు. ఎక్కడుంటాడో కూడా తెలియడు. కానీ కనుక్కోవడానికి ఆధారముంది’’ అన్నాను.


‘‘అది చాలు నాకు. మీరు వీలైనంత తొందరగా ఆ వివరాలు తెలుసుకోవాలి’’ అందామె.

నా మనసులో ఊగిసలాట.

అతడు ముక్తకు తగినవాడేనా?


‘‘తెలుసుకుంటాను కానీ మీరు కొంచెం ఆలోచించండి. మొదట్నించీ అతడి ప్రవర్తన కొంచెం తేడాగా ఉంది. మనిషికి చిత్తచాంచల్యమో, మరో లోపమో ఉండుండాలి. ఆ ఫొటోలోనే చూడండి - వేసుకున్న రంగురంగుల పూల చొక్కా - ఆడపిల్లల డ్రస్సులా లేదూ?’’ అన్నాను.


‘‘ఈ రోజుల్లో డ్రస్సులకి ఆడా మగానా? ఎక్కడున్నారు మీరు?’’ అంది ముక్త.

నాలిక్కరుచుకున్నాను.


డ్రస్సులే ఏమిటి - ప్రసుతం మగపిల్లలు చెవులకీ ముక్కులకీ రింగులు పెట్టుకుంటున్నారు. జుట్టు పెంచి జడలు కూడా వేసుకుంటున్నారు.

నేనిలా డ్రస్సు గురించి మాట్లాడానేమిటి?


ఏమనాలో ఆలోచిస్తుండగా ఆమె చప్పున, ‘‘ఏమన్నారూ? అతగాడు పువ్వుల చొక్కా వేసుకున్నాడా? ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నది?’’ అంది.


కొద్ది క్షణాలు ఇద్దరి మధ్యా ఆ ఫొటో గురించి తర్జనభర్జనలు.

అప్పుడు అసలు విషయం అర్థమై తెల్లబోయాను.


ముక్త ప్రేమించింది రిక్తకి పురుషవేషదారిగా నాకు పరిచయమైన వ్యక్తికాదు. అతణ్ణి అలా పరిచయం చేసిన అమోఘ్‌!

‘‘ఇతడి పేరు అమోఘ్‌. ఎక్కడుంటాడో కూడా తెలుసు’’ అన్నాను చప్పున.

ఆమె కళ్లలో మెరుపు.


‘‘అమోఘ్‌ - పేరు అతడికిలాగానే అమోఘంగా ఉంది. అతడి గురించి ఇంకేం తెలుసో చెప్పండి’’ అందామె. గొంతునిండా ఉత్సుకత.


‘‘కానీ, మీరు ప్రేమించిన వ్యక్తి ఇతడని నేను ఏమాత్రం అనుకోలేదు’’ అన్నాను అసంతృప్తిగా.


‘‘ఇది చాలా బాగుంది. ఇంత చక్కనివాడు ఫొటోలో ఉండగా - నేను ప్రేమించింది ఆ రెండో వ్యక్తినని మీరెలా అనుకున్నారు?’’ నిష్ఠూరంగా అందామె.


‘‘ఎందుకంటే - అమోఘ్‌ వివాహితుడు. భార్య పేరు రిక్త. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు’’ అన్నాను.


క్షణంపాటు ఆమె మ్రాన్పడిపోయింది.

తేరుకున్నాక, ‘‘మీరు దారుణంగా పొరబడ్డారు’’ అంది.


‘‘అలా ఎందుకనుకుంటున్నారు? పేరు చెప్పాను. నమ్మారు. పెళ్లయిందంటే ఎందుకు నమ్మరు?’’ అన్నాను.


‘‘ఎందుకంటే - అతడికి పెళ్లంటూ అయితే అది నాతోనే కనుక....’’

ఆమెకి తన ప్రేమంటే ఎంతైనా నమ్మకముండొచ్చు. కానీ నిజాన్ని నమ్మకపోతే ఎలా?


‘‘జరిగిందంతా మీకు చెబుతాను. పొరపాటెక్కడుందో మీరే చెబుదురు కాని....’’ అంటూ ఆమెకి - బోధికొలను దగ్గర అమోఘ్‌ నాకు పరిచయం కావడంనుంచి మొత్తం జరిగినవన్నీ చెప్పాను.


ఆమె చాలా శ్రద్ధగా వింది. విన్నాక ముఖం గంభీరంగా ఐపోయింది.

తర్వాత నెమ్మదిగా, ‘‘ఇప్పుడు నా నమ్మకం మరింత బలపడింది. అమోఘ్‌ నన్ను ప్రేమించిన మాట నిజం. ఇలా అజ్ఞాతంలోకి ఎందుకెళ్లాడో చెప్పలేను కానీ - మీ ద్వారా మేమిద్దరం దగ్గరవాలని అనుకుంటున్నాడు. అందుకే మిమ్మల్ని కలిశాడు’’ అంది.


ప్రేమ గుడ్డిదంటారు. కానీ పిచ్చిది కూడా అనిపిస్తుంది - ఆమె మాటలు వింటుంటే....

‘‘మీ నమ్మకం మీదే కానీ నేను చెప్పేది సరిగ్గా విన్నట్లు లేదు మీరు. రెండు విషయాలు గుర్తుంచుకోవాలి మీరు. ఒకటి - నేను అమోఘ్‌ని అనుకోకుండా కలిశాను తప్ప, తనొచ్చి నన్నేం కలుసుకోలేదు. ఒకవేళ మీరనుకున్నదే నిజమనుకున్నా - తను రిక్తని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని పని కట్టుకుని నాకెందుకు చెబుతాడు?’’ అన్నాను.


‘‘మీ అనుమానం న్యాయమైనదే. కానీ అమోఘ్‌ మామూలు మనిషి కాదు. అంతకుముందూ తనంతట తాను నన్ను కలిసి, నాకు డ్రస్సు కానుకగా ఇచ్చి తర్వాత నేనెవరో తెలియదన్నాడు. రిక్త కథ కూడా అలాంటిదే. ఈ దాగుడుమూతలకి ఏదో కారణముంది. అది తెలుసుకోవాలి’’ అందామె.


‘‘కానీ అతడు రిక్తని పెళ్లి చేసుకున్నాడని ఖచ్చితంగా చెప్పగలను’’ నమ్మకంగా అన్నాను.

‘‘ఖచ్చితమనెయ్యకండి. తన మాటలు అబద్ధమని మీకు క్లూలు కూడా ఇచ్చాడు. అది మరువకండి’’


‘‘క్లూ లా?’’ అన్నాను ఆశ్చర్యంగా.


‘‘ఔను. రిక్తని పురుషవేషంలో సినిమాకి తీసుకెడుతున్నానని మీకు చెప్పాడు. కానీ అతడితో సినిమాకు వెళ్లింది నిజంగా పురుషుడేనని - మీకు అనిపించింది. అంటే తన మాటలు నమ్మదగ్గవి కావని అతడు మీకు హింట్‌ ఇచ్చాడు’’ అంది ముక్త.


కొట్టిపారెయ్యడానికి లేదు కానీ అసందర్భంగా అనిపించింది.

‘‘ఊఁ ఇంకా ఏమైనా క్లూలున్నాయా?’’ అన్నాను - ఆ క్లూ అర్థం లేనిదని ధ్వనించేలా.


‘‘మీకతడు రిక్తని చూపించలేదు. కారణమేం చెప్పినా, రిక్త అతడితో లేదన్న హింట్‌ ఉంది అందులో’’


‘‘కావచ్చు. కానీ అందువల్ల అతడికేం ప్రయోజనం?’’ అన్నాను.

‘‘అదే మనం తెలుసుకోవాలి?’’


‘‘కంటికి కనబడుతున్న నిజాన్ని అబద్ధంగా భావించమంటున్నారు. అది అబద్ధమన్న నమ్మకంతో - నిజంగా దాన్ని ఋజువు చెయ్యమంటున్నారు. చాలా బాగుంది’’ అన్నాను.


చిరాకెయ్యలేదు కానీ - ఆమె ఆలోచనలపట్ల నాలో ఏదో ఆసంతృప్తి...

‘‘అతడు రిక్తని పెళ్లి చేసుకున్నాడన్నది మీకు నిజం. రిక్తని మీరు చూడలేదన్నది నాకు నిజం. కొంచెం ఆలోచించాల్సిన విషయమని మీకు అనిపించడం లేదూ?’’ అందామె.


‘‘నేను రిక్తని చూడలేదు కానీ, అందుకు అతడు కారణం చెప్పాడని మీకు తెలుసు...’’


‘‘ఆ కారణం అతడు చెప్పాడు. మీరు నమ్మారు. ఇప్పుడు నేనంటున్నాను - అతడు రిక్తని పెళ్లి చేసుకోలేదని! నా మాట నమ్మి చూడండి. మీకు కొత్త నిజాలు తెలియొచ్చు’’ అంది ముక్త.


‘‘అబద్ధమెందుకూ - నాది పొరపాటేనని ఋజువైతే, నేనే ఎక్కువ సంతోషిస్తాను’’ అన్నాను వెంటనే.


అది మనస్పూర్తిగా అన్న మాట! ఎందుకంటే నాకామె పట్ల జాలి, బాధ రెండూ ఉన్నాయి.

‘‘మీరు తప్పక సంతోషిస్తారు - నేను చెప్పింది చేస్తే’’ అంది ముక్త వెంటనే.

చెప్పమన్నట్లు చూశాను.


‘‘మీరు అమోఘ్‌ ఇంటికి వెళ్లండి. అతణ్ణీ రిక్తనీ కలిపి ఓ ఫొటో తీసుకోండి. అది నాకు చూపించండి’’


అర్థమైంది. ఆమె రిక్త ఉనికిని నమ్మడం లేదు.

నేను అమోఘ్‌ ఇంటికెడితే - ఈసారి అతడు నాకు రిక్తని తప్పక చూపిస్తాడు.


ఆమెకి అతడికీ ఫొటో తీసుకుంటానంటే - కనీసం నాకు అభ్యంతరం చెప్పడు.

నేనలా వాళ్లకి ఫొటో తీసి - అది ముక్తకి పంపిస్తే - ఏమౌతుంది?


పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకమైనా - అమోఘ్‌ తనకి దగ్గరౌతాడని నమ్మిన ముక్తకి గుండె బద్దలవదూ?


తల అడ్డంగా ఊపి, ‘‘అమోఘ్‌ని మీరు ప్రేమించారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అతడికి పెళ్లయిందంటే నమ్మడం లేదు. ఆ నమ్మకంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. మీకు అమోఘ్‌-రిక్తల ఫొటో పంపిస్తే, మీ ఆశలన్నీ భగ్నం కావూ! అందుకు కారణం నేనైతే, అందువల్ల నాకు సంతోషమా? ఏమంటున్నారు? గతంలో అమోఘ్‌ మీపట్ల ప్రవర్తించిన తీరుకంటే విచిత్రంగా ఉన్నాయి మీ మాటలు’’ అన్నాను.


ఆమె నవ్వింది, ‘‘అంతకంటే విచిత్రం - రిక్త అనే కల్పిత పాత్రని వాస్తవమని మీరు నమ్మడం’’ అంది.


రిక్తని పదే పదే కల్పిపాత్ర అని ఆమె అనడం - నాకు అసంతృప్తిగా ఉంది.

‘‘అమోఘ్‌ ఇంటి అడ్రసు చెబుతాను. మీరే వెళ్లి అతణ్ణి కలుసుకుని మాట్లాడండి. ఒక్క రిక్త విషయంలోనే కాదు, అతడి గురించి మీకున్న అనుమానాలన్నీ మొత్తం తీరిపోతాయి’’ అన్నాను.


‘‘నేను వెళ్లి అమోఘ్‌ని కలుసుకునే మాటయితే - మిమ్మల్ని మా ఇంటికి ఎందుకు రప్పిస్తాను? ఫోన్లోనే చిరునామా అడిగి తీసుకునేదాన్ని. మీకిక నో ఆప్షన్‌. నా కథలో ఇరుక్కున్నారు. క్లైమాక్సు దాకా ఇందులోంచి బయటపడలేరు. బయటపడనివ్వను’’ అంది ముక్త.


ఆమె నన్ను శాసిస్తోంది. బెదిరిస్తోంది.

అదేమిటో, కోపం రావడం లేదు నాకు.


అందమైన ఆడపిల్ల ప్రత్యేకత అదే!

ఆమెపై ఆశ అక్కర్లేదు. కాంక్ష అక్కర్లేదు. ప్రేమ అక్కర్లేదు. ఆమెను సంతోషంగా ఉంచడానికి ఏమైనా చెయ్యాలనిపిస్తుంది. అదంతే!


‘‘సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. క్లైమాక్స్‌ మీకు అనుకూలంగా ఉండదని తెలుసు కానీ, ఉండాలని కోరుకుంటాను’’ అంటూ లేచాను.

- - - - -

ముక్త-అమోఘ్‌ల ప్రేమకథ చిత్రాతిచిత్రంగా అనిపించింది నాకు.

ఆ కథలోని మలుపులు - ఆలోచనలకు లొంగేవి కాదు.


ఇక చేతల సమయం వచ్చేసింది.

ముందు నేను రిక్తని చూడాలి. ఆమెని చూడాలంటే ఆమోఘ్‌ని కలవాలి.


‘‘మీ దంపతుల్ని చూడాలనుంది. సాయంత్రం మీ ఇంటికి రావచ్చా?’’ అని ఫోన్‌ చేశాను అమోఘ్‌కి.


గొంతును బట్టి అమోఘ్‌ మరి అంత సుముఖంగా ఉన్నట్లు అనిపించలేదు.

‘‘సాయంత్రం ఓ నాటకానికెళ్లే ప్రోగ్రాం పెట్టుకున్నాం. కానీ మీకోసం డ్రాప్‌ చేసుకుంటాను’’ అన్నాడతడు చివరికి.


మామూలుగా ఐతే - ‘ఆయ్యో, నాకోసం మీ ప్రోగ్రామెందుకూ డ్రాప్‌ చేసుకోవడం’ అనడం మర్యాద.

అలా నాచేత అనిపించాలనే అతడలా అనుండొచ్చు.


నేను మర్యాద పాటించదల్చుకోలేదు. థాంక్స్‌ చెప్పాను.

‘‘రాత్రికి మీ భోజనం ఇక్కడే. అలాగైతేనే రండి’’ అన్నాడు.


ఎలాగో నన్ను వదిలించుకుంటాడనుకున్నాను తప్ప - భోజనానికి కూడా పిలుస్తాడనుకోలేదు.


‘‘ష్యూర్‌!’’ అన్నాను.

సాయంత్రం ఆరింటికి వాళ్లింటికి వెడితే - ఈసారి అమోఘ్‌ తనే తలుపు తీశాడు.

ఇదివరకు అతణ్ణి చూసినప్పుడు - ఓ కొత్త మిత్రుణ్ణి చూసినట్లు చూశాను. ఇప్పుడు ఆతణ్ణి చూస్తుంటే ముక్తకి ప్రియుడని స్ఫురిస్తోంది.


తెల్లని పైజామా. తెల్లని లాల్చీ. నిలువెత్తు విగ్రహం.

అందానికి సినిమా హీరోలా చక్కగా ఉన్నాడు.


చందానికి పెద్దమనిషిలా హుందాగా ఉన్నాడు.

ముక్త-అమోఘ్‌ - వారి జంట అద్భుతంగా ఉంటుంది.


వాళ్లిద్దర్నీ పక్కపక్కన ఊహించుకుంటే - నేను ముక్తకి తగనని నా మనసే చెప్పింది.

‘‘ఆమెకి శివశంకర్‌తో పెళ్లి చెడిపోతే - నువ్వు ఓకే. కవన్‌, భవన్‌లతో పోటీ పడినా ఫరవాలేదు. అమోఘ్‌తో మాత్రం పోటీ పెట్టుకోకు’’ అంది మనసు.


అమోఘ్‌తో పోటీ పడే ఉద్దేశ్యం నాకు లేదు. కానీ అతడు ఇప్పటికే వివాహితుడు.

అతడి భార్య రిక్త...


రిక్త అనే పాత్ర ఊహాజనితమనీ, ఉందనుకోవడం నా పొరబాటనీ అంటుంది ముక్త.

ముక్త ఊహ నిజమా? రిక్త పాత్ర నిజంగానే కల్పితమా?


‘‘రిక్త స్నానం చేస్తోంది. కూర్చోండి, మాట్లాడుకుందాం’’ అన్నాడు అమోఘ్‌.

అప్పటికి ఇద్దరం తలుపు దగ్గర్నుంచి సోఫాల దగ్గరికి చేరుకున్నాం.


ఇద్దరం సోఫాల్లో పక్కపక్కన కూర్చున్నాక, ‘‘మొన్న తను మిమ్మల్ని పలకరించడం అవలేదని చాలా బాధ పడింది రిక్త’’ అన్నాడు అమోఘ్‌.

రిక్త. నా భ్రమ.


నాకు కనబడనందుకు నొచ్చుకుంటోంది.

‘‘అయ్యో - తనేం కావాలని చేసింది కాదుగా....’’ అన్నాను.


‘‘ఔననుకోండి. కానీ ఒరిజినల్‌గా తను జాలీ మనిషి. తనవాళ్లకి దూరం కావడమే కాక - వాళ్లు తనని చంపెయ్యాలన్నంతగా ద్వేషించడం ఆమెను బాగా అప్సెట్‌ చేసింది. ఇలా అజ్ఞాతంగా బ్రతకాల్సి వచ్చినందుకు - తనకి చాలా అసంతృప్తిగా ఉంటోంది. అందుకని మూడీ మనిషి అయింది. కానీ మూడీగా ఉండడం తనకి నచ్చదు, నప్పదు’’ అన్నాడు అమోఘ్‌.


ప్రేమ - అదేగా ఆమె ప్రస్తుత మనఃస్థితికి మూలకారణం.

పెంచి పెద్దచేసినవాళ్లనీ, చిన్నప్పట్నించీ కలిసిమెలిసి తిరిగినవాళ్లనీ, అయినవాళ్లు అందర్నీ - వదులుకుని అమోఘ్‌తో వచ్చేసింది రిక్త.


వచ్చి - ఏం సాధించింది? బ్రతికుండీ చచ్చినదానిలా ఉంటోంది.


‘‘ప్రేమ కోసమేగా ఇదంతా జరిగింది? ఒకసారి ప్రేమే ముఖ్యమనుకున్నాక - అలా మూడీగా ఉండకూడదు. అటు తనవాళ్లకీ దూరమై, ఇటు ప్రేమవల్లా మనశ్శాంతి దొరక్కపోతే, ప్రేమంటేనే ద్వేషం పుడుతుంది’’ అన్నాను.


నాకీ ప్రేమంటే కసి. దారుణమైన దురభిప్రాయం.

ప్రేమ గురించి మాట్లాడినప్పుడు దాచుకుందామన్నా అక్కసు దాగదు.


‘‘వేసవిలో కొత్తావకాయ అన్నం. సెంటర్లో కొరివికారం కూరిన మిరపకాయబజ్జీ. నోరు మండిస్తాయి. కళ్లమ్మట నీళ్లు తెప్పిస్తాయి. కానీ వద్దనిపించవు. అదీ ప్రేమంటే....’’ అని నవ్వాడు అమోఘ్‌.


ప్రేమికులవద్ద ప్రతి ప్రశ్నకీ ఏదో జవాబుంటుంది. కానీ అదెప్పుడూ సంజాయిషీలాగే ఉంటుంది.


‘‘సిగరెట్‌, సారా - ఇవి పుచ్చుకునేవాళ్లూ ఇలాగే అంటారు. ఏ కాన్సరో వచ్చేక - తెలుస్తుంది అసలు ప్రమాదం’’ అన్నాను.


‘‘మీకు తెలియదేమో! కారం కాన్సర్‌ సెల్సుని మింగేస్తుందని - ఈ మధ్యనే సైంటిస్టులు, అదీ విదేశీ సైంటిస్టులు - మరోసారి కనిపెట్టారు’’


‘‘ఇంకో సంజాయిషీ’’ అని నవ్వుకున్నాను మనసులో.

అంతలో - ఒకమ్మాయి వచ్చి మా ముందు టీపాయ్‌ మీద పింగాణీ ప్లేట్లు పెట్టింది. వాటిలో మిర్చిబజ్జీలు వడ్డించింది.


బజ్జీలున్న ఓ గిన్నెని కూడా టీపాయ్‌మీద ఉంచింది.

ముందామె రిక్త అనుకున్నాను. కానీ వెంటనే గుర్తు పట్టాను.

ఆమె రూప.


అప్పుడొచ్చినప్పుడు తనే నాకు ఆతిథ్యమిచ్చింది.

‘‘నీ భార్యను కూడా రానీ’’ అన్నాను.


‘‘తనూ వస్తుంది. చూశావుగా, రూప బల్లమీద మూడు ప్లేట్లు పెట్టింది’’ అన్నాడు ఆమోఘ్‌.

అప్పుడు చూస్తే బల్లమీద మూడు ప్లేట్లున్నాయి.


అంటే రిక్త వస్తుంది. నాలో చెప్పలేని ఉత్సుకత!

రూప వడ్డన ఇంకా అవలేదు.


బల్లమీద మంచినీళ్ల జగ్గు, మూడు గ్లాసులు పెట్టింది. మూడు ఫలరసాల ప్యాకెట్లు కూడా ఉంచింది.

బజ్జీ మరీ కారంగా ఉంటే - నోటిమంట చల్లార్చుకుందుకుట.


‘అడుసు తొక్కనేల, కాలు కడుగనేల’ - తిండికైనా, ప్రేమకైనా ఇదే సిద్ధాంతమా?

రూప మాకు కాస్త దూరంగా ఓ కుర్చీలో కూర్చుంది.


ఎటో చూస్తున్నట్లు నటిస్తోంది కానీ, ఓరకంట మమ్మల్ని కనిపెడుతోంది.

అమోఘ్‌ భార్యని ఎక్కువ శ్రమ పెట్టడు.


అతిథులొస్తే - ఆతిథ్యం బాధ్యత - రూప వంటి వారికి అప్పగిస్తాడు. అతిథులు రానప్పుడు కూడా - బహుశా భార్యకి పని ఉండదేమో!


ఏ పనీ లేకపోతే కూడా - మెదడు అశాంతికి గురౌతుంది. రిక్త విషయంలో - అమోఘ్‌ ఆ జాగ్రత్త తీసుకున్నట్లు లేదు.


అతగాడు ఎక్కువగా ఇల్లు కదలడు. ఆన్‌లైన్లో ట్రేడింగ్‌ చేస్తాడు. అందులో ఎంత నిష్ణాతుడంటే - భార్య ఏం కోరినా సమకూర్చగల సంపాదన....


ఆలోచిస్తున్నాను. అంతలోనే -

‘‘అదిగో రిక్త’’ అన్నాడు ఆమోఘ్‌.

అటు చూస్తే -

గుమ్మంలో నిలబడి ఉందామె.


పువ్వుల చీరమీద మ్యాచింగ్‌ బ్లవుజుతో - తనే ఓ పువ్వులా ఉంది.

తలంటుకుని డ్రై చేసినట్లుంది - జుత్తు అలలు అలలుగా ఎగసి పడుతోంది.


అందగత్తె అనలేం. మెరిసిపోతోందనలేం. చూడగానే మరోసారి చుడాలనిపించే ఆకర్షణ ఆమెది.

నెమ్మదిగా నడిచి వచ్చి సోఫాలో కూర్చుని - నాకు నమస్తే చెప్పింది.

గొంతు తియ్యగా ఉంది.


ఇంకా ఉంది...

ప్రేమ ‘భ్రమ’రం - ధారావాహిక పదకొండవ భాగం త్వరలో..

ఇంకా ఉంది...

వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

వసుంధర పరిచయం: మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.
32 views0 comments
bottom of page