top of page
Original.png

రేవతి రిటర్న్ గిఫ్ట్

రేవతి రిటర్న్ గిఫ్ట్, తెలుగు కథ, కుటుంబ కథ, గృహప్రవేశం కథ, రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్, గృహప్రవేశం కానుకలు, తెలుగు కుటుంబ విలువలు, మానవత్వం కథ, భావోద్వేగ తెలుగు కథ, inspirational Telugu story, Telugu family story, housewarming story, return gift ideas Telugu, positive Telugu stories, మన తెలుగు కథలు

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'రేవతి రిటర్న్ గిఫ్ట్' కథలో గృహప్రవేశం సందర్భంగా అతిథులను ప్రేమగా ఆహ్వానిస్తూ, వస్తువుల బదులు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని రిటర్న్ గిఫ్ట్‌గా అందిస్తున్న రేవతి కుటుంబం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'రేవతి రిటర్న్ గిఫ్ట్' కథలో గృహప్రవేశం సందర్భంగా అతిథులను ప్రేమగా ఆహ్వానిస్తూ, వస్తువుల బదులు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని రిటర్న్ గిఫ్ట్‌గా అందిస్తున్న రేవతి కుటుంబం.

Revathi Return Gift - Telugu Inspirational Story | Sritha

రేవతి రిటర్న్ గిఫ్ట్తెలుగు ప్రేరణాత్మక కథ | శ్రిత

Published in manatelugukathalu.com on 01/07/2026


🏠1

ఆ రోజు రేవతి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా కూడబెట్టుకున్న కల నిజమైంది. తన భర్తతో కలిసి ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన కొత్త ఇంటికి గృహప్రవేశం చేయబోతోంది. ఇంటి ముందంతా రంగవల్లులు, మామిడి తోరణాలు, పూల అలంకరణలు... లోపల బంధువుల సందడి, వంటల ఘుమఘుమలు, పిల్లల కేరింతలు— ఇల్లంతా ఆనందంతో కళకళలాడుతోంది.


రేవతి, ఆమె భర్త అన్యోన్య దంపతులు. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమార్తె ఇటీవలే హైస్కూల్లో చేరింది. కుమారుడు ఎంబీబీఎస్ చదువుతూ డాక్టర్ కావాలనే లక్ష్యంతో కష్టపడుతున్నాడు. పిల్లలు కూడా తల్లిదండ్రుల సంతోషంలో భాగస్వాములై ప్రతి పనిలో చేయూతనిస్తున్నారు.


మంచి ముహూర్తం కావడంతో ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పురోహితుల మంత్రోచ్చారణల మధ్య దంపతులు పాలుపొంగించి, దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథులు ఒక్కొక్కరుగా వచ్చి కొత్త ఇంటిని చూసి మెచ్చుకుంటూ, రేవతి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.


అందరికీ చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముగిసే సమయానికి వచ్చిన అతిథులకు జ్ఞాపకంగా అందమైన రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలని రేవతి ముందుగానే ప్రత్యేకంగా సిద్ధం చేసింది.


🏠2

గృహప్రవేశం ముహూర్తం ఖరారైనప్పటి నుంచి రేవతికి ఒకటే ఆలోచన—రిటర్న్ గిఫ్ట్.

"అందరూ పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, పేరంటాలు... ఏ శుభకార్యానికి వెళ్లినా ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. మనం కూడా మన గృహప్రవేశానికి వచ్చిన వాళ్లకు గుర్తుండిపోయేలా మంచి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి," అని ఒకరోజు కుటుంబ సభ్యులతో అంది.


"అమ్మా, దాంట్లో ఏముంది? మంచి దానైతే ఏదైనా చూసి కొనేద్దాం," అని పిల్లలు చెప్పారు.


కానీ రేవతికి అంత సులభంగా నిర్ణయం తీసుకోవడం కుదరలేదు. ముందుగా పెద్దల అభిప్రాయం తెలుసుకోవాలని అనుకుంది.


అత్తమామల దగ్గరకు వెళ్లి, "అత్తయ్యా, మామయ్యా... గృహప్రవేశానికి వచ్చిన వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ గా ఏమిస్తే బాగుంటుంది?" అని అడిగింది.


వాళ్లు ఒకరినొకరు చూసుకుని నవ్వేశారు.

"అమ్మా... మా కాలంలో ఇవన్నీ ఎక్కడ ఉండేవి? వచ్చిన దంపతులకు పసుపు, కుంకుమ, తాంబూలం, పండ్లు, అవసరమైతే చీర లేదా బట్టలు ఇచ్చేవాళ్లం. అదే పెద్ద కానుక," అన్నారు.


ఆ సమాధానం రేవతికి అంతగా నచ్చలేదు.

"ఇప్పుడు కాలం మారిపోయింది కదా! అందరూ కొత్త కొత్తగా ఇస్తున్నారు," అని మనసులో అనుకుంది.



గత కొన్నేళ్లుగా తాను వెళ్లిన ప్రతి శుభకార్యాన్ని గుర్తుచేసుకుంది. ఎక్కడో కంచు పాత్రలు ఇచ్చారు. ఇంకెక్కడో ఇత్తడి డబ్బాలు. కొందరు స్టీల్ డబ్బాలు, మరికొందరు జ్యూస్ గ్లాస్ సెట్లు. ఇంకొందరైతే వెండి బిళ్లలు కూడా ఇచ్చారు. ఇప్పుడు అయితే పేర్లు ముద్రించిన క్యారీ బ్యాగులు, ట్రావెల్ బ్యాగులు కూడా ఇస్తున్నారు. 


వాటిపై పెద్ద అక్షరాలతో...

"శ్రీ & శ్రీమతి ఫలానా వారి గృహప్రవేశ సందర్భంగా ప్రేమతో..."

అని రాసి ఉంటుంది.


'వాటిని నిజంగా ఎంతమంది ఉపయోగిస్తారో తెలియదు. కానీ ఇంటికి తీసుకొచ్చి అల్మారాలో పెట్టేస్తాం. కొన్నిసార్లు రంగు నచ్చకపోయినా, డిజైన్ నచ్చకపోయినా తీసుకోవాల్సిందే,' అని రేవతి నవ్వుకుంది.


"పెద్దలను అడిగితే పసుపు, కుంకుమ, తాంబూలం, పూలు, గాజులు, బ్లౌజ్ పీస్ లేదా మిఠాయి ఇవ్వమంటున్నారు. కానీ నాకు మాత్రం కొంచెం కొత్తగా, అందరికీ ఉపయోగపడేదేదైనా ఇవ్వాలని ఉంది," అని అనుకుంది.


"సరే... పెద్దల సలహా విన్నాం. ఇప్పుడు ఈ తరం వాళ్లను అడిగితే ఏదైనా కొత్త ఐడియా చెబుతారేమో," అనుకుని తన పిల్లలవైపు తిరిగింది.


🏡3. 

రేవతి తన కొడుకును పిలిచింది.

"రా బాబూ… మన గృహప్రవేశానికి వచ్చిన వాళ్లకు ఏ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందంటావు?"


కొడుకు నవ్వి, "అమ్మా… నేను అడిగేది నువ్వు జీవితంలో ఇవ్వవు," అన్నాడు.


"అయ్యో! అంత పెద్ద కోరికేంట్రా?"


"ఏం పెద్దది కాదు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ పులుసు, కీమా… ఇవన్నీ పెడితే చాలు."


రేవతి కళ్లు పెద్దవయ్యాయి.

"ఒరేయ్! గృహప్రవేశం చేస్తున్నామా? హోటల్ ఓపెనింగ్ చేస్తున్నామా?"


"అదే మా బాధమ్మా! 'సత్యనారాయణ వ్రతం' అంటావు… 'పూజ' అంటావు… చివరికి మేము చూస్తుంటే పప్పు, పులిహోర, చక్కెర పొంగలి. మా కలలన్నీ గిన్నెలోనే కలిసిపోతాయి."

"సరే, డబుల్ కా మీఠా పెడదామా?"


"అదీ కాదు… 'మన సంప్రదాయంలో లేదు' అంటావు. కనీసం ఆలూ ఫ్రై, పనీర్ కూర, నాన్ పెడదామన్నా వాటికీ నో చెప్పేస్తావు."


కొద్దిసేపు ఆగి మళ్లీ అన్నాడు.

"సరే, ఫుడ్ వద్దు. వచ్చిన పిల్లలందరికీ ఒక్కో క్రికెట్ బ్యాట్ ఇచ్చేద్దాం."


"అంతమందికా?"


"అవును. లేకపోతే వాళ్లంతా నీకిచ్చిన ప్రెషర్ కుక్కర్లతోనే క్రికెట్ ఆడుకుంటారు!"


రేవతి నవ్వకుండా ఉండలేకపోయింది.

"మరి నిజంగా మీకు ఏం కావాలి?"


"మంచి భోజనం. కడుపు నిండా తినాలి. ఫ్రెండ్స్ తో ఫొటోలు దిగాలి. ఇంటికి వెళ్లేటప్పుడు 'రా… మళ్లీ ఎప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్?' అనిపించాలి. అదే చాలు."


రేవతి తల ఊపింది.

"సరే, ఇప్పుడు నీ చెల్లిని అడుగుతాను."


చిన్ని వచ్చి కూర్చుంది.

"చిన్నీ… నీ సలహా ఏంటి?"


"అమ్మా… మా ఫ్రెండ్స్ కి కూడా బర్గర్, పిజ్జా, నూడుల్స్ అంటే చాలా ఇష్టం. కానీ గృహప్రవేశం రోజు వాటిని పెట్టం అని నాకు కూడా తెలుసు. దేవుడికీ కన్ఫ్యూజన్ వస్తుంది!"


రేవతి నవ్వేసింది.

"మరి రిటర్న్ గిఫ్ట్?"


"అదేంటి అమ్మా! ఇంట్లో ఇప్పటికే నువ్వు తెచ్చుకున్న గిఫ్ట్ల మ్యూజియం ఉంది కదా! ఒక షెల్ఫ్ మొత్తం పాల కుక్కర్లు… ఇంకో షెల్ఫ్ ఇడ్లీ కుక్కర్లు… ఇంకా రెండు డబ్బాలు తెరిచి కూడా చూడలేదు."


"అది నిజమే అనుకో…"


"అందుకే వస్తువులు వద్దు అమ్మా. మా అందరికీ మెహందీ అంటే ఇష్టం. ఒక మంచి మెహందీ ఆర్టిస్ట్ ని పిలిపించి అందరికీ మెహందీ పెట్టించు. ఫొటోలు కూడా సూపర్ గా వస్తాయి. రెండు రోజుల పాటు చూసుకున్నా… 'ఇది రేవతి ఆంటీ గృహప్రవేశంలో పెట్టించుకున్న మెహందీ' అని గుర్తుంటుంది."


కొద్దిసేపు ఆలోచించి మళ్లీ అంది.

"మరి స్వీట్స్ విషయానికి వస్తే… ప్లీజ్ అమ్మా! గులాబ్ జామూన్, కాలా జామూన్ కి ఒక చిన్న సెలవు ఇవ్వు. అవి కూడా 'మమ్మల్ని కాస్త రెస్ట్ ఇవ్వండి' అంటున్నాయి."


అన్నయ్య వెంటనే కలిపాడు.

"అవును అమ్మా! బొబ్బట్లు పెట్టు… అరిసెలు పెట్టు… పూతరేకులు పెట్టు. వాటిని చూసి మా ఫ్రెండ్స్ గూగుల్ లో 'ఇది ఏమిటి?' అని వెతికినా పర్లేదు… కానీ తిన్నాక మాత్రం 'వావ్!' అనాలి."


రేవతి ఇద్దరినీ చూస్తూ నవ్వుకుంది.

"సరే… మీ ఇద్దరి తీర్పు ప్రకారం రిటర్న్ గిఫ్ట్ వస్తువు కాదు… గుర్తుండిపోయే అనుభవం."


"అదే అమ్మా!" ఇద్దరూ ఒకేసారి చెప్పారు.


🏡4

"అదే... ఈ పిల్లలతో కుదరదు కదా!" అని చెప్పి, పిల్లలిద్దరినీ తీసుకుని తన భర్త రామ్ గారి దగ్గరకు వెళ్లింది.


"ఏమండీ రామ్ గారు, మన గృహప్రవేశానికి ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది?" అని అడిగింది.


ల్యాప్ టాప్ లో ముఖం పెట్టుకుని మీటింగులు చేసుకుంటున్న రామ్ గారికి భార్య ఏమి అడిగిందో సరిగా వినిపించలేదు. భార్య ముఖం చూసి సందిగ్ధంలో పడ్డాడు.


"ఏమో అడిగింది... ఇప్పుడు ఏదైనా తప్పు చెబితే గోల గోల అవుతుంది!" అని మనసులో అనుకున్నాడు.


పిల్లలిద్దరూ పక్కనే నవ్వుతూ, "నాన్నగారు ఏం చెబుతారా?" అని ఎదురు చూస్తున్నారు.


చింటు వెంటనే, "చిన్నా, సరే... నాన్నగారికి హెల్ప్ చేద్దాం. నాన్న, రిటర్న్ గిఫ్ట్ గురించి అమ్మ అడుగుతోంది," అన్నాడు.


రామ్ గారు ఒక్కసారి ఆలోచించి, "ఓ పని చేద్దాం... అందరికీ ఒక మొబైల్ ఇచ్చేద్దాం! ఈ రోజుల్లో ప్రతి నిమిషం అందరూ మొబైల్ లోనే ఉంటున్నారు కదా. పిల్ల, పాప, తల్లి, చిన్నా, పెద్దా, అమ్మ, నాన్న, అవ్వ, తాత... ప్రతి ఒక్కరికీ మొబైల్ అలవాటైపోయింది. మనం కూడా మొబైల్ ఇస్తే అయిపోతుంది!" అన్నారు.


రేవతి అవాక్కై, "మొబైలా? ఏ మొబైల్ ఇద్దామండి? అంత మందిని పిలుస్తున్నాం కదా!" అని అడిగింది.


"ఏ మొబైల్ అయితే ఏముంది? ఎంత మంది వస్తారో కౌంట్ చేసి, ఒక్కో ఫ్యామిలీకి ఒక్క మొబైల్ ఇస్తే సరిపోతుంది కదా!" అన్నారు రామ్ గారు.


పిల్లలిద్దరూ వెంటనే ఉత్సాహంగా, "వావ్ నాన్న! సూపర్ ఐడియా! మా ఫ్రెండ్స్ ఒక్కరు కాదు, పది మంది వస్తారు. మొబైల్ రిటర్న్ గిఫ్ట్ వస్తే... 'ఏం చక్కా! ఏ మొబైల్ గిఫ్ట్ ఇచ్చింది ఆంటీ! వావ్! ఎంత మంచి గృహప్రవేశం చేసింది!' అని అందరూ మాట్లాడుకుంటారు. 


'సూపర్ హౌస్ వార్మింగ్ సెరిమనీ', 'సుపర్బ్ గిఫ్ట్', 'మార్వెలస్ మొబైల్ రిటర్న్ గిఫ్ట్' అని పొగుడుతారు!" అంటూ ఇద్దరూ ఒకటే నవ్వుకున్నారు.


"నాన్నా... మీ ఐడియా సూపర్!" అంటూ చప్పట్లు కొట్టారు.


రామ్ గారు నిజంగానే చెప్పారని రేవతికి అప్పటికి అర్థమైంది.


"సరే, ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో మొబైల్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఎంత ఖర్చవుతుందో లెక్కేయండి. ఒక్క మొబైల్ ఎంత తక్కువైనా పది వేల రూపాయల కంటే తక్కువ రాదు. పది వేలు చొప్పున వంద ఫ్యామిలీలకు ఇస్తే ఎంత అవుతుంది? నాకైతే మ్యాథ్స్ రాదు... మీరే చెప్పండి పిల్లలూ!" అని రేవతి అడిగింది.


🏡5

రేవతి అడిగిన వెంటనే ఇద్దరు పిల్లలు వేళ్ల మీద లెక్కలు వేయడం మొదలుపెట్టారు.

"అమ్మా... ఒక్క మొబైల్ ₹10,000 అయితే... వంద ఫ్యామిలీలకు..." అంటూ చింటు లెక్కలో మునిగిపోయాడు.


పక్కనే చిన్నా వెంటనే, "అయ్యో! పది లక్షలు అవుతాయేమో!" అని ధైర్యంగా చెప్పేశాడు.


రామ్ గారు నవ్వు ఆపుకుంటూ, "సరే, మీరు లెక్కలు వేస్తూ ఉండండి, మీ మీటింగ్స్ అయిపోయాక చెబుతాను!" అన్నారు.


రేవతి నుదుటిపై చేయి వేసుకుని, "అయ్యో దేవుడా! గృహప్రవేశం చేయాలనుకున్నానా... లేక మొబైల్ షోరూమ్ ఓపెన్ చేయాలనుకున్నానా? వంద ఫ్యామిలీలకు మొబైల్స్ ఇస్తే మనం కొత్త ఇంట్లో ఉండాల్సిన పనిలేదు... ఆ ఇంటినే అమ్మేసి గిఫ్టులు ఇవ్వాలి!" అంది.


చింటు మాత్రం ఇంకా ఊహల్లోనే... "అమ్మా, ఐఫోన్ ఇస్తే ఇంకా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ నన్ను హీరో అంటారు!"


చిన్నా కూడా వెంటనే, "అవును అమ్మా! గృహప్రవేశం అయిపోయాక మన ఇంటి పేరు 'మొబైల్ మార్ట్' అని పెట్టేద్దాం!" అన్నాడు.


ఇద్దరి మాటలకు రామ్ గారు గట్టిగా నవ్వేశారు.

రేవతి కోపంగా, "చాలు చాలు... మీ ముగ్గురితో మాట్లాడితే నాకు రిటర్న్ గిఫ్ట్ దొరకడం కాదు, రిటర్న్ షాక్ మాత్రమే దొరుకుతోంది!" అంది.


ఇద్దరు పిల్లలు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ, "అమ్మా... మేము జస్ట్ జోక్ చేశాం!" అన్నారు.


"జోక్ మీకు... బడ్జెట్ నాకు!"

🏡6


"ఆహ్వాన పత్రిక కంటే భోజనమే ముఖ్యం!"


రేవతి, రామ్ గారు ఆహ్వాన పత్రికలు ఇవ్వడానికి బంధువుల ఇళ్లకు వెళ్లారు.


మొదటి ఇంట్లోకి వెళ్లగానే పెద్దమ్మ అడిగింది.

"ఏమ్మా... గృహప్రవేశం ఎప్పుడు?"


"వచ్చే ఆదివారం పెద్దమ్మ."


"సరే... భోజనం ఎన్ని గంటలకు?"


రేవతి నవ్వుతూ, "పెద్దమ్మా! ముందు పూజ ఉంటుంది."


"అది మీకే. నాకు భోజనం టైమ్ చెప్పు."


అందరూ నవ్వేశారు.


మరో ఇంట్లో మామయ్య కార్డు తీసుకుని మొదటి నుంచి చివరి వరకు చదివి,

"అన్నీ బాగానే ఉన్నాయి... కానీ మెనూ ఎక్కడ రాశారు?"

అని అడిగాడు.


"మేనూనా?" ఆశ్చర్యంగా అడిగింది రేవతి.


"అవునమ్మా! ఈ రోజుల్లో గృహప్రవేశానికి రావాలంటే ముందుగా మెనూ తెలుసుకోవాలి కదా!"


రామ్ గారు నవ్వుతూ,

"మామయ్యా, మెనూ చెబితే సర్ప్రైజ్ పోతుంది."


మామయ్య వెంటనే,

"సర్ప్రైజ్ మెనూలో కాదు బాబూ... చివర్లో ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ లో ఉండాలి!"

అన్నారు.


ఇంట్లో ఉన్నవాళ్లంతా నవ్వేశారు.


అప్పుడే చింటు అమాయకంగా,

"మామయ్యా... రిటర్న్ గిఫ్ట్ గా మొబైల్ ఇస్తున్నాం."

అన్నాడు.


రేవతి వెంటనే చింటు నోరు మూసేసింది.

"అయ్యో! ఇంకా అదే కలలో ఉన్నావా?"


మామయ్య మాత్రం సీరియస్ గా,

"ఏ కంపెనీ మొబైల్?"

అని అడిగాడు.


రామ్ గారు గట్టిగా నవ్వుతూ,

"కలల కంపెనీ!"

అన్నారు.


అంతే... ఆ ఇంట్లో నవ్వులే నవ్వులు.


🏡7


మీ సలహాలు – రేవతికి అమూల్యమైన కానుక!


రేవతి తన గృహప్రవేశం రిటర్న్ గిఫ్ట్ గురించి ముందుగానే ఒక నిర్ణయం తీసుకుంది. అయితే, మీ అందరి ఆలోచనలు, సలహాలు కూడా వినాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


మీకు ఏ రిటర్న్ గిఫ్ట్ బాగుంటుందని అనిపిస్తుంది? మీరు అయితే అతిథులకు ఏమి ఇస్తారు? మీ విలువైన సూచనలను కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి.


ఎవరికీ తెలుసు... మీ అద్భుతమైన ఐడియా కూడా రేవతి గిఫ్ట్ లో భాగం కావచ్చు!


రేపు ఈ కథ ప్రచురించబడుతుంది. అంతలోపు మీ సలహాలు అందితే రేవతి మాత్రమే కాదు, నేనూ చాలా సంతోషిస్తాను.


మీ కామెంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం!


🏡🏡🏡🏡🏡🏡

అసలైన రిటర్న్ గిఫ్ట్


"మా అసలు రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు మొదలవుతుంది..."

రేవతి మాట పూర్తి కాగానే అందరూ ఆసక్తిగా ఆమె వైపు చూశారు.


"ముందుగా... పిల్లలందరూ ఈ వైపు రండి!" అంది.


చింటు, చిన్నా తమ ఫ్రెండ్స్ తో పాటు కజిన్స్ ను కూడా పిలుచుకుంటూ వచ్చారు.


"ఆంటీ... మాకోసం ప్రత్యేక గిఫ్టా?" అని ఒక చిన్నారి అడిగింది.


రేవతి నవ్వుతూ తల ఊపింది.

ప్రతి పిల్లాడి చేతిలో ఒక అందమైన ఎన్వలప్ పెట్టింది.


"ఇది ఈరోజే ఉపయోగించాలి. ఇంటికి వెళ్లి అల్మారాలో పెట్టేయడానికి కాదు!" అంది.


పిల్లలు ఆసక్తిగా కవర్లు తెరిచారు.

ఒక్క క్షణంలోనే వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి.


"వావ్... క్రికెట్ అరేనా పాస్!"


"అరే... బ్యాడ్మింటన్ కోర్ట్ బుకింగ్!"


"షటిల్ ఆడొచ్చా?"


"రెండు గంటలా?"

అని పిల్లలు ఒకటే కేరింతలు కొట్టారు.


రేవతి నవ్వుతూ చెప్పింది.

"ఈ సాయంత్రం మీ అందరి కోసం దగ్గరలోని స్పోర్ట్స్ అరేనాలో రెండు గంటలు బుక్ చేశాం. అబ్బాయిలు క్రికెట్ ఆడండి... అమ్మాయిలు మీకు నచ్చిన ఆట ఆడండి... లేదా అందరూ కలిసి ఆడండి. కానీ ఒక షరతు..."


పిల్లలందరూ ఒకేసారి అడిగారు.

"ఏంటది ఆంటీ?"


"ఈ రెండు గంటలు... ఎవరి చేతిలోనూ మొబైల్ ఉండకూడదు."


ఒక్క క్షణం పిల్లలు ఒకరినొకరు చూసుకున్నారు.

ఆ తర్వాత చింటు నవ్వుతూ,

"డీల్!"

అన్నాడు.


అందరూ చప్పట్లు కొట్టారు.

పెద్దలు కూడా చిరునవ్వు నవ్వారు.


"ఇదే నిజమైన గిఫ్ట్. పిల్లలను బయటికి తీసుకొచ్చింది!" అని ఒక తాతగారు మెచ్చుకున్నారు.


అంతలో హాల్ లోని టీవీ ఆన్ అయింది.


స్క్రీన్ పై వేదపండితులు కనిపించారు.

"ఈ గృహప్రవేశానికి విచ్చేసిన ప్రతి కుటుంబానికీ శ్రీమహావిష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి. ఈ ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం నిండాలి."

అని ఆశీర్వచనాలు వినిపించాయి.


ఆ తర్వాత వీడియో మారింది.

ఒక అనాథాశ్రమంలోని చిన్నారులు స్క్రీన్ పై కనిపించారు.


వాళ్ల ముఖాల్లో అమాయకమైన చిరునవ్వులు.

"అక్కా... అన్నా... మా కోసం స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, దుప్పట్లు, ఆట వస్తువులు పంపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు."


"మీ అందరూ సంతోషంగా ఉండాలి."


"మీ కొత్త ఇంటికి దేవుడు ఎప్పుడూ మంచే చేయాలి."

అంటూ చేతులు జోడించి నమస్కరించారు.


హాల్ లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.

కొద్దిసేపటి క్రితం రిటర్న్ గిఫ్ట్ గురించి గుసగుసలాడిన వాళ్లే ఇప్పుడు మౌనంగా టీవీ వైపు చూస్తున్నారు.

రేవతి మెల్లగా మైక్ తీసుకుంది.


"మీ అందరూ మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. మీ ప్రేమకు ప్రతిగా మేము మీకు ఒక వస్తువు ఇవ్వాలని అనుకోలేదు."


"ఎందుకంటే... చాలా రిటర్న్ గిఫ్ట్స్ మన ఇళ్లలో అల్మారాల్లోనే ఉండిపోతాయి."

ఆమె ఒక్కసారి ఆగి అందరినీ చూసింది.


"కానీ ఒక మంచి పని... ఒక మంచి అనుభవం... ఎప్పటికీ మనసులో ఉంటుంది."

"అందుకే మీ అందరి పేరుతో అనాథాశ్రమానికి అవసరమైన వస్తువులు అందించాం."


"పిల్లలకు ఒక రోజు గుర్తుండిపోయే ఆటను బహుమతిగా ఇచ్చాం."


"మీకోసం ఈ సాయంత్రం ఒక చిన్న కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం."


అందరూ ఆసక్తిగా చూశారు.


"మనమందరం కలిసి హైదరాబాద్ లోని ఒక పురాతన ఆలయానికి వెళ్దాం. అక్కడ దర్శనం చేసుకుని, కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. ఈ రోజు ముగిసే సరికి మీ చేతిలో ఒక వస్తువు ఉండకపోవచ్చు... కానీ మీ మనసులో ఒక జ్ఞాపకం మాత్రం తప్పకుండా ఉంటుంది."


ఒక్క క్షణం...

అక్కడ చప్పట్లు మాత్రమే వినిపించాయి.


పద్మజ నెమ్మదిగా లేచి రేవతి దగ్గరకు వచ్చింది.

"రేవతి... మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. నువ్వు ఇచ్చింది రిటర్న్ గిఫ్ట్ కాదు... ఒక ఆలోచన."

స్వాతి కూడా నవ్వుతూ, "ఇప్పటి నుంచి నేనూ ఏ ఫంక్షన్ చేసినా ఇలాగే చేస్తాను."

అంది.


అంతలో వెనక నుంచి ఒక ఆంటీ గట్టిగా అంది...

"అన్నీ బాగానే ఉన్నాయి... అయినా ఒక స్టీల్ డబ్బా ఇచ్చుంటే ఇంకా బాగుండేది!"


అంతే...

హాల్ మొత్తం నవ్వులతో మారుమోగిపోయింది. రేవతి కూడా నవ్వేసింది.


రామ్ గారు మెల్లగా, "చూశావా... కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఎప్పటికీ మారవు!" అన్నారు.


ఆ నవ్వుల మధ్య కొత్త ఇంటి గోడలు మొదటిసారి నిజమైన ఆనందంతో నిండిపోయాయి.


ఇల్లు ఇటుకలతో కడతారు... కానీ ఒక ఇంటిని జ్ఞాపకాలతో, నవ్వులతో, ప్రేమతో నింపేది మనుషులే.


శుభం.


***

శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:


శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 రచయిత్రి పరిచయం: శ్రిత

శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.

ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.


bottom of page