స్వార్థం
- Addanki Lakshmi

- 19 hours ago
- 4 min read
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

Swartham - Telugu Family Story| Addanki Lakshmi
స్వార్థం - తెలుగు కుటుంబ కథ | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 16/05/2026
మొదటి జీతం… ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన క్షణం. “స్వార్థం” కథలో, మొదటి జీతంతో తల్లిదండ్రులకు కానుకలు తీసుకొచ్చిన కూతురిని చూసి, తన గతాన్ని గుర్తుచేసుకుని పశ్చాత్తాపపడే తండ్రి భావోద్వేగం హృదయాన్ని తాకుతుంది. కుటుంబ ప్రేమ, కృతజ్ఞత, తల్లిదండ్రుల విలువను గుర్తు చేసే అందమైన తెలుగు కథ.
"అమ్మా! నాన్నగారూ!" అంటూ సంతోషంగా వచ్చింది హరిత.
"ఏమిటే? అంత సంతోషం?" అంటూ వంటింట్లోంచి వచ్చింది తల్లి పద్మావతి.
టీవీ చూస్తున్న తండ్రి రామారావు
"ఏంటమ్మా! హడావుడి!" అంటూ అడిగాడు.
"ఇదిగో నాన్నగారూ, ఈరోజు నాకు ఫస్ట్ జీతం వచ్చింది.
మీ ఇద్దరూ ఇక్కడ నుంచోండి, నేను మీకు కొత్త బట్టలు తెచ్చాను, బహుకరిస్తాను" అంటూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది హరిత.
జీవితంలో ఎవరికైనా అంతే,
అలాగే అనిపిస్తుంది.
మొట్టమొదటి జీతం అంటే,
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కంపెనీలో పనిచేస్తుంది.
చేతిలో పెద్ద ప్యాకెట్‌తో వచ్చింది.
అందులో బట్టలు, తల్లిదండ్రులకు ఇద్దరికీ గిఫ్టులు ఎన్నెన్నో తెచ్చేసింది.
"ఏంటే, నెల జీతం అంతా ఖర్చు పెట్టేశావా ఏంటి?" అంది తల్లి నవ్వుతూ.
"ఉండవే, కాస్త అక్షంతలు కలిపి దిష్టి తీస్తాను" అంటూ పద్మావతి వంటింట్లోకెళ్లి, మందిరంలో ఉన్న అక్షతలు, పసుపు, కుంకుమ తీసుకొచ్చింది.
తల్లిదండ్రులిద్దరిని సోఫాలో కూర్చోమని చెప్పి,
వారిద్దరికీ కొత్త బట్టలు
కవర్లోంచి తీసింది హరిత.
తల్లికి చక్కటి కంచి పట్టుచీర,
తండ్రికి ధోతి,
కండువా.
"అమ్మా, నాన్నా! నన్ను ఆశీర్వదించండి" అంది హరిత ఆనందపడుతూ.
"దీర్ఘాయుష్మాన్ భవ! ముందు ముందు ఉద్యోగంలో పెద్ద పదవులను అలంకరించి, నీవు పనిచేసే కంపెనీకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావమ్మా" అని తండ్రి దీవించాడు.
తల్లిదండ్రులు ఇద్దరికీ కళ్ళలో ఆనందభాష్పాలు.
ఒక్కతే కూతురు చక్కగా చదువుకుని పైకొచ్చిందని భార్యాభర్తలిద్దరూ సంతోషపడ్డారు.
"థాంక్స్ అమ్మా, థాంక్స్ డాడీ. ఈసారి వచ్చే నెల జీతం తాతయ్యగారికి, బామ్మగారికి, పెదనాన్న, పెద్దమ్మలకి అందరికీ గిఫ్టులు పట్టుకెళ్తాను, నాన్నగారూ," అంటూ హరిత తన గదిలోకి వెళ్ళిపోయింది హుషారుగా.
పద్మావతి సంతోషంగా,
"ఏవండీ, చూశారా! ఈ చీర ఎంత ఖరీదైనది తెచ్చిందో? మన పిల్ల బంగారం అండీ! మనం అంటే దానికి ఎంత ప్రేమో!" పద్మావతి ఆనందపడిపోతోంది, చీరను చూసుకుని.
"వచ్చే వారం ఉగాది పండగ వస్తుంది కదా. పండక్కి ఈ పట్టు చీర కట్టుకుంటాను" అంటూ ఆ కొత్త బట్టలు తీసుకుని లోపలికి వెళ్ళింది పద్మావతి.
రామారావు మనసు ఒక్కసారి గతంలోకి వెళ్లిపోయింది.
మనసెందుకో విచారంలో మునిగిపోయింది.
ఇదే ఆనందాన్ని తాను తల్లిదండ్రులకు ఇవ్వలేకపోయానే అని బాధగా జ్ఞాపకం తెచ్చుకున్నాడు—తాను కొత్తగా ఉద్యోగంలో చేరిన పరిస్థితి.
రామారావు ఉద్యోగం వేటలో ఉన్నాడు, ఇంకా జాబ్ దొరకలేదు. తల్లిదండ్రులు కంగారు పెట్టి, ముందరే పెళ్లి చేసేశారు.
పద్మావతితో పెళ్లి అయిపోయింది.
పట్టణంలో కాపురం.
రెండు నెలలు అన్నగారు డబ్బు పంపించాడు.
బ్యాంకులో జాబ్ దొరికింది. అంతే, పద్మావతికి, తనకు ఆనందం పట్టలేనంత అయ్యింది.
ఫస్ట్ జీతం వస్తే పద్మావతికి మంచి చీర, తనకు మంచి లాగు-చొక్కా కొనుక్కుని, హోటల్లో పార్టీలు చేసుకుని, మజా కొట్టారు.
చిన్నపిల్ల అయిన తన కూతురుకున్న జ్ఞానం కూడా తనకు లేకపోయింది.
ఒక్క పైసా కూడా దాచుకోకుండా, అంతా తల్లిదండ్రులకు ఖర్చు పెట్టేసింది.
తల్లిదండ్రులు కష్టపడి చదివించారు కదా తనను? వారికి మొదటి జీతంలో పది రూపాయలు పంపిద్దామనే జ్ఞానం కూడా లేదు తనకి.
వదినగారు ఎంతో మంచిది. తనకు డబ్బు పంపమని ఆమె తన అన్నగారికి చెప్తూ ఉండేది.
తనకు ఎంత ఇంగిత జ్ఞానం లేదంటే, అన్నకు, వదినకు కనీసం వంద రూపాయలైనా పంపలేకపోయాడు.
కనీసం భార్య పద్మావతి కూడా స్వార్థపరురాలే. "అయ్యో, అత్తమామలకి బట్టలు పెడదామండీ" అని చక్కటి సలహా కూడా ఇవ్వలేదు.
"బావగారు మనల్ని ఆదుకున్నారు కదా, వారికి ఏదైనా గిఫ్ట్ ఇద్దామండీ" అని కూడా అనలేదు. ఆడదానికి ఆమెకు లేకపోయినా, తన తెలివి ఏమైంది?
మొదటి జీతం తల్లిదండ్రులకు కనీసం పది రూపాయలైనా పెట్టలేని దౌర్భాగ్య మనస్తత్వం తనది.
తన తల్లిదండ్రులు ఎంత మంచి వారంటే, తాము పట్టణంలో ఇబ్బంది పడుతున్నామనుకుని,
'ఏమిరా, నీకు జీతం సరిపోతుందా? డబ్బు పంపించమంటావా?' అని అడిగేవారు.
వాళ్లు ఎంతో ప్రేమాభిమానాలు కురిపిస్తే, తను చాలా స్వార్థపరుడుగా ఉండేవాడు.
కనీసం ఆడవాళ్లకైనా ఆ అభిమానం ఉండాలి కదా? పద్మావతిలో కూడా చిన్నతనంలో సంకుచిత స్వభావం ఉండేది.
ఈరోజు తన కూతురు తన జీతమంతా తనకు, బట్టలకీ, గిఫ్టులకీ ఖర్చు పెట్టేసింది.
వెర్రి పిల్ల! తనకు తానుగా ఒక్క గిఫ్ట్ కూడా కొనుక్కోలేదు.
తన కూతురిది ఎంత మంచి స్వభావం!
కనీసం తమలాగా తన కూతురు స్వార్థపరురాలు కాదు, మంచి మనసున్న పిల్ల.
అనుకొని రామారావు నిట్టూర్చాడు.
***
అద్దంకి లక్ష్మి గారి కొన్ని ఇతర రచనలు:
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,










Comments